గురువారం, మార్చి 08, 2018

నా జ్ఞాపకాలు

"పద్నాలుగో ఆర్ధిక సంఘం నిబంధనల కారణంగా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నాం.." గత కొన్నాళ్లుగా భారతీయ జనతా పార్టీ నాయకులు పదేపదే చెబుతున్న విషయం ఇది. ఆ ఆర్ధిక సంఘానికి సారధ్యం వహించింది ఆంధ్రప్రదేశ్ కి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి యాగా వేణుగోపాల రెడ్డి. పూర్తి పేరు కాకుండా, వై.వి. రెడ్డి అనే పొట్టి పేరు ప్రస్తావిస్తే రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నరు గా పనిచేసిన తొలితెలుగు అధికారి ఈయనే అనే విషయం గుర్తొచ్చి తీరుతుంది. తన బాల్యం మొదలు, ఆర్ధిక సంఘం బాధ్యతల నిర్వహణ వరకూ దాదాపు డెబ్బై ఐదేళ్ల జీవిత విశేషాలని 'నా జ్ఞాపకాలు' పేరిట అక్షరబద్ధం చేశారు రెడ్డి.

కడప జిల్లా రాజంపేట తాలూకా పాటూరు అనే పల్లెటూళ్ళో విద్యావంతుల కుటుంబంలో జన్మించిన వేణుగోపాల రెడ్డి చిన్ననాడే తండ్రి ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాలు చూశారు. మద్రాసులో ఉన్నత విద్యాభ్యాసం తర్వాత హైదరాబాదు ఉస్మానియా యూనివర్సిటీలో అధ్యాపకుడిగా కెరీర్ ఆరంభించారు. రెవిన్యూ ఉద్యోగంలో చేరి,  ఉన్నతహోదాలో పదవీ విరమణ చేసిన యాగా పిచ్చిరెడ్డికి తన పెద్దకొడుకుని ఐఏఎస్ గా చూడాలన్నది కల. తన మొగ్గు అధ్యాపక వృత్తి, పరిశోధన వైపే ఉన్నా, కేవలం తండ్రి కోసం సివిల్ సర్వీస్ పరీక్ష రాసి తొలిప్రయత్నంలోనే మంచి ర్యాంకుతో ఐఏఎస్ సాధించిన ప్రతిభాశాలి వేణుగోపాల రెడ్డి. ఫలితాలు రాకమునుపే తండ్రి కన్నుమూయడం, ఆ ఆనందం వెనుక ఉన్న అతిపెద్ద విషాదం.

నమ్మిన విలువలకీ, విధి నిర్వహణలో ఎదురయ్యే ఒత్తిళ్ళకీ నిత్యం ఘర్షణే. ముగ్గురు ముఖ్యమంత్రుల - కోట్ల విజయభాస్కర రెడ్డి, జలగం వెంగళ రావు, ఎంటీ రామారావు - తో సన్నిహితంగా పనిచేసిన అనుభవాలు, వారి పనితీరు మొదలు, ఐఏఎస్ లకి జిల్లాల్లోనూ ఢిల్లీలోనూ సౌకర్యాల పరంగా కనిపించే తేడాల వరకూ సునిశితమైన హాస్యాన్ని మేళవించి చెప్పుకొచ్చారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి, కేంద్రం నుంచి రాష్ట్రానికి కొంత తిరుగుడు తర్వాత కేంద్ర ఆర్ధిక శాఖలో జాయింట్ సెక్రటరీగా చేరిన కొద్ది కాలానికే 1990 నాటి తీవ్ర ఆర్ధిక సంక్షోభం, తదనంతర పరిణామాలకి ప్రత్యక్ష సాక్షిగానే కాక, సంక్షోభ నివారణ చర్యల బృందంలో కీలక సభ్యుడిగా పనిచేసిన నేపధ్యం ఆయనది.


1989-91 మధ్యకాలంలో అధికారంలోకి వచ్చిన నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో అస్థిరత, ఆర్ధిక అంశాలపై దృష్టి పెట్టకపోవడం, అదే సమయంలో జరిగిన గల్ఫ్ యుద్ధం కారణంగా చమురు ధరల పెరుగుదల.. వీటన్నింటి కారణంగా ఏర్పడిన ఆర్ధిక సంక్షోభం, 1991 నాటి నూతన ఆర్ధిక సంస్కరణలకు దారితీయడం తెలిసిందే. సంస్కరణలకు ముందు, చెల్లింపుల నిమిత్తం భారతదేశపు బంగారం నిల్వల్ని బ్రిటన్ బ్యాంకులో తనఖా పెట్టడం - అది కూడా కాగితం మీద కాక బంగారం నిల్వల్ని విమానంలో తరలించి - జరిగింది. ఈ బంగారం తరలింపులో ఎస్కార్టు అధికారిగా పనిచేశారు వేణుగోపాల రెడ్డి!! అంతే కాదు, ఆ సంక్షోభ సమయాల్లో ఆర్ధిక శాఖ, ఆర్బీఐ అధికారులు ఎదుర్కొన్న ఒత్తిళ్లని ఆయన మాటల్లో చదవాల్సిందే. 

ఆర్ధిక సంస్కరణలు మొదలైన తర్వాత, భారత ఆర్ధిక వ్యవస్థ మీద పెత్తనం చేసిందన్న విమర్శని ఎదుర్కొన్న ప్రపంచ బ్యాంకులో పనిచేసే అవకాశం వచ్చింది వైవీ రెడ్డికి. ప్రపంచ బ్యాంకు వ్యవహార శైలి, ఒక్కో దేశంలోనూ ఆ బ్యాంకు ప్రాధాన్యతా క్రమాలు, నిబంధనల విషయంలో పట్టువిడుపులు ఇవన్నీ ఆర్ధిక శాస్త్రం గురించి పెద్దగా తెలియని వాళ్లకి కూడా సులువుగా అర్ధమయ్యేలా రాశారు. సాంకేతిక విషయాలని సైతం ఆసక్తికరమైన కథనాలుగా మార్చడంలో ఈ పుస్తకానికి రచనా సహకారం అందించిన కథా రచయిత్రి అరుణ పప్పు కృషి చాలానే ఉండి ఉంటుంది బహుశా. స్వతహాగా హాస్యప్రియులైన రెడ్డి గారి సంభాషణల్లో మెరిసే చెణుకులు సరేసరి.

ప్రపంచ బ్యాంకు నుంచి ఆర్బీఐ డెప్యూటీ గవర్నరుగా రావడం, అటు తర్వాత గవర్నరు బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈ మొత్తం క్రమంలో రిజర్వు బ్యాంకు పనితీరు, కేంద్ర ఆర్ధిక మంత్రి - రిజర్వు బ్యాంకు గవర్నర్ల మధ్య ఉండాల్సిన అవగాహన, కీలక సమయాల్లో ప్రభుత్వమూ, బ్యాంకూ పరస్పర పూరకాలుగా పనిచేయడం ఇవన్నీ పరిపాలనాంశాలని గురించి తెలుసుకోగోరే వారిని ఆసక్తిగా చదివిస్తాయి. గవర్నరుగా ఆర్ధిక విషయాలపై ఆచితూచి నిర్ణయాలు తీసుకున్నానని చెబుతూనే, ఫలితంగా మొదట విమర్శలు ఎదుర్కొన్నా గ్లోబల్ ఫైనాన్సియల్ క్రైసిస్ లో భారతదేశం చిక్కుకోకుండా ఉండడానికి ఆనిర్ణయాలే సాయపడ్డాయన్న అంతర్జాతీయ స్థాయి గుర్తింపునీ జ్ఞాపకం చేసుకున్నారు.

ఇక పద్నాలుగో ఆర్ధిక సంఘం చైర్మన్ హోదాలో దేశం మొత్తం తిరగడం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమవ్వడం.. సంఘం తరపున చేయాలనుకున్నవీ, చేయగలిగినవీ వీటన్నింటినీ విశదంగానే చెప్పారు. విధి నిర్వహణ ఊపిరి సలపని విధంగా ఉన్నా అధ్యయనం కోసం సమయం కేటాయించడం, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం, ప్రతివిషయాన్నీ భిన్న కోణాలనుంచి పరిశీలించడమే కాక, సూక్ష్మ స్థాయి సమాచారాన్ని కూడా సేకరించుకోవడం, టీం వర్కుకి ప్రాధాన్యత ఇవ్వడం, ప్రతి స్థాయిలో వారితోనూ చక్కని సంబంధాలు నెరపడం... ఇవన్నీ వేణుగోపాల రెడ్డి విజయరహస్యాలు అని చెబుతుందీ పుస్తకం. పాలన, ఆర్ధిక విషయాల మీద ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ చదవాల్సిన రచన ఇది.

('నా జ్ఞాపకాలు,' రచన: యాగా వేణుగోపాల రెడ్డి, ఎమెస్కో ప్రచురణ, పేజీలు: 360, వెల రూ. 175, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).