ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తయ్యింది. ఈ ఏడాది కాలంలో కనీసం నాలుగైదు సందర్భాల్లో జగన్ నిర్ణయాలని గురించి రాద్దామనుకునే, ఏడాది పూర్తయ్యే వరకూ ఏమీ మాట్లాడకూడదని నేను పెట్టుకున్న నియమం గుర్తొచ్చి ఆగిపోయాను. ఏడాది ఆగడం ఎందుకంటే, జగన్ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు కాదు. ముఖ్యమంత్రిగా కాదు కదా, మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం లేదు. ఇప్పుడు మాట్లాడడం ఎందుకంటే, ఆయన వెనుక ఏడాది కాలపు పాలనానుభవం ఉంది. మరే ఇతర నాయకుడికైనా ఐదేళ్ల కాలంలో ఎదురయ్యే అనుభవాలన్నీ జగన్ కి తొలి సంవత్సరంలోనే అనుభవానికి వచ్చేశాయి.
శెభాష్ అనిపించే నిర్ణయాలతో పాటు, అయ్యో అనిపించే నిర్ణయాలనీ తీసుకుని అమలు పరిచారు గత పన్నెండు నెలల్లోనూ. అనేక ఇబ్బందులనీ ఎదుర్కొన్నారు. చెయ్యదల్చుకున్న పనులన్నీ వరుసగా చేసేయాలనే తొందర కొన్ని వివాదాస్పద నిర్ణయాలకి తావివ్వగా, మరికొన్ని నిర్ణయాలు కేవలం రాజకీయ కారణాల వల్లే వివాదాస్పదం అయ్యాయి. వ్యక్తిగతంగా నన్ను కలవర పెట్టిన నిర్ణయాలు రెండు. మొదటిది పరిశ్రమల్లో డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలనేది. వినడానికి ఇది చాలా బాగుంది. కానీ ఆచరణలో కష్టనష్టాలు అనేకం. చిన్న ఉదాహరణ చెప్పుకోవాలంటే, మిగిలిన రాష్ట్రాలు కూడా ఇదే నిర్ణయం తీసుకుంటే, వెనక్కి వచ్చేసే అందరికీ రాష్ట్రం ఉపాధి చూపించగలదా?
రెండో నిర్ణయం, ఏదో ఒక పేరుతో చేస్తున్న ఉచిత పంపిణీలు. నిజానికి ఈ ఉచితాలు మొదలై చాలా ఏళ్ళే గడిచినా, ప్రతి రాజకీయ పార్టీ ఏదో ఒక సందర్భంలో అమలు చేసిందే అయినా, ప్రస్తుత ప్రభుత్వం వీటిని పరాకాష్టకి తీసుకెళ్లినట్టు అనిపిస్తోంది. విద్య, వైద్యం ఈ రెండు సేవలనీ అర్హులకి ఉచితంగా అందించడం అవసరం. వ్యవసాయం చేసుకునే రైతులు సమయానికి రుణాలని, పంటలకు గిట్టుబాటు ధరల్నీ ఆశిస్తున్నారు తప్ప అంతకు మించి కోరుకోవడం లేదు. ప్రతివర్గానికీ ఏదో ఒక పేరిట నిరంతరంగా డబ్బు పంపిణీ అన్నది సుదీర్ఘ కాలంలో ఒక్క ఆర్ధిక వ్యవస్థకి మాత్రమే కాక అన్ని వ్యవస్థలకీ చేటు చేస్తుంది. ఇంకో మాటలో చెప్పాలంటే ఇదో పులి స్వారీలా తయారయ్యే ప్రమాదం ఉంది. ఉచితాల మీద కన్నా ఉపాధికల్పన మీద దృష్టి పెట్టడం శ్రేయస్కరం.
Google Image |
వినగానే నచ్చిన నిర్ణయం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం. ఈ నిర్ణయం వల్ల పేదల జీవితాల్లో రాత్రికి రాత్రే వెలుగొచ్ఛేస్తుందన్న భ్రమలేవీ లేవు కానీ, దీర్ఘ కాలంలో ప్రయోజనాన్ని ఇచ్చే నిర్ణయం అవుతుంది అనిపించింది. అయితే ఈ నిర్ణయం అమలులో చాలా సాధకబాదకాలున్నాయి. తెలుగుని ఒక తప్పనిసరి సబ్జెక్టుగా ప్రవేశపెట్టే మాటుంటే, దానిని కేవలం ప్రభుత్వ విద్యాసంస్థలకి మాత్రమే పరిమితం చేయకుండా ప్రయివేటు సంస్థల్లోనూ కచ్చితంగా అమలయ్యేలా చూడాలి. బాగా పనిచేస్తున్న మరో వ్యవస్థ గ్రామ వాలంటీర్లు. మా ఊరు, చుట్టుపక్కల ఊళ్ళ నుంచి నాకున్న సమాచారం ప్రకారం ఈ వ్యవస్థ బాగా పనిచేస్తోంది. ముఖ్యంగా కరోనా కాలంలో వాలంటీర్లు చాలా బాధ్యతగా పనిచేశారు. నిరుద్యోగ సమస్యని కొంతవరకూ పరిష్కరించడం ఈ వ్యవస్థలో మరో పార్శ్వం.
"మొండివాడు రాజుకన్నా బలవంతుడు అంటారు, ఇప్పుడు మొండివాడే రాజయ్యాడు," ఏడాది క్రితం ఒక మిత్రుడన్న మాట ఇది. జగన్ మొండితనాన్ని తెలియజెప్పే దృష్టాంతాలు గత కొన్నేళ్లుగా అనేకం జరిగాయి. కాంగ్రెస్ ని వ్యతిరేకించడం మొదలు, తెలుగు దేశం పార్టీని ఢీ కొనడం వరకూ అనేక సందర్భాల్లో, "మరొకరైతే ఈపని చేయలేకపోయేవారు" అనిపించింది. ఒక ఓటమితో ప్రయాణాన్ని ఆపేసిన/మార్గాన్ని మార్చుకున్న నాయకులతో పోల్చినప్పుడు జగన్ ని ముందుకు నడిపించింది ఆ మొండితనమే అని చెప్పక తప్పదు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం ముఖ్యమంత్రి పదవి వారసత్వంగా జగన్ కి అంది ఉంటే కథ వేరేగా ఉండేది. ప్రస్తుతానుభవాలని బట్టి చూస్తే, అప్పట్లో ఆ పదవిని నిలబెట్టుకోవడం ఆయనకి బహుశా కష్టమై ఉండేది.
ప్రజలు అఖండమైన మెజార్టీ ఇచ్చి ఉండొచ్చు కానీ, బలమైన ప్రతిపక్షం అనేక రూపాల్లో చుట్టుముట్టి ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రతి నిర్ణయాన్నీ ఆచితూచి తీసుకోవడం అవసరం. ప్రతి ప్రకటన వెనుకా ఒక సమగ్ర సమీక్ష ఉండాల్సిందే. సమస్యలు ఏయే రూపాల్లో ఉండొచ్చు అన్న విషయంలో ఇప్పటికే ఒక అవగాహన వచ్చింది కాబట్టి ఆ వైపుగానూ ఆలోచనలు సాగాలి. మూడు రాజధానులు, మండలి రద్దు వంటి నిర్ణయాల అమలులో కనిపించిన తొందరపాటు విమర్శలకి తావిచ్చింది. (వీటిలో మండలి రద్దు నాకు బాగా నచ్చిన నిర్ణయం). అభివృద్ధి, సంక్షేమం ఈ రెండింటిలోనూ అభివృద్ధి మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన సమయం ఇది. అలాగే, సంక్షేమం అంటే కేవలం ఉచిత పంపిణీలు మాత్రమే అనే ధోరణి నుంచి బయటికి వచ్చి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏడాది కాలపు అనుభవాల నుంచి జగన్ ఏం నేర్చుకున్నారన్నది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.