అప్పు.. కేవలం మూడొందల రూపాయల అప్పు.. దాసరి సన్యాసి కొడుకు దాసరి
బోడియ్య జీవితాన్ని అతలాకుతలం చేసింది. ఆ అప్పు కారణంగానే బోడియ్య సొమ్మలు
పోనాయి, బూదేవత పోనాది, సంసారమంతా సల్లారిపోనాది. బోడియ్య చదువుకున్న వాడు
కాదు. సొమ్ములున్నవాడు కాదు. బలం, బలగం ఉన్నవాడు అంతకన్నా కాదు. పైపెచ్చు,
ఏనాడూ తగువులంటూ పోలీసు స్టేషన్లంట, కోర్టుల వెంట తిగిరినవాడూ కాదు.
తనపనేదో తను చేసుకుపోయే బోడియ్య అప్పు పుచ్చుకున్నది మామూలు వాడి దగ్గర
కాదు, వాళ్ళూరి ప్రెసిడెంటు దగ్గర. అందుకే, అప్పు కారణంగా అతగాడి సొమ్మలు
పోనాయి.. వాటితో పాటే అన్నీ పోనాయి.
బలమున్నవాడిదే
రాజ్యం. ఆదిమ యుగాల్లో లిఖితంగా (అనగా సర్వజనామోదంగా) ఉన్న ఈ నీతి, ఆధునిక
ప్రజాస్వామిక యుగం నాటికి కూడా చెలామణిలోనే ఉంది -- కాకపోతే అలిఖితంగా.
దీనితో పాటే, పిల్లిని గదిలో బంధించి కొడితే పులిగా మారుతుందన్న జంతుధర్మం
ఉండనే ఉంది. ఈ రెంటినీ ఆధారంగా చేసుకుని ఉత్తరాంధ్ర ప్లీడరు గారైన రాచకొండ విశ్వనాథ శాస్త్రి సుమారు మూడున్నర దశాబ్దాల క్రితం రాసిన నవలికే 'సొమ్మలు
పోనాయండి.' చాలామంది సాహిత్యాభిమానులు సైతం నేటికీ 'సొమ్ములు' అని పొరబడుతూ
ఉంటారు. కానీ కాదు, సొమ్మలే. అంటే పశువులు. బోడియ్య భాషలో 'జెత పోతులండి.'
"సొమ్మలు పోనాయండి. అదండి! అది ఆరాంబవండి. జెత
పోతులండి. జెనం నిలబడి సూసీవోరండి. అలాంటి సొమ్మలండి. పోనాయండి.." అంటూ
మొదలుపెట్టి బోడియ్య తన కథ మొత్తం ఏకబిగిన చెబుతాడు, ఎక్కడా అలుపు
తీర్చుకోడానికి కూడా క్షణం ఆగకుండా. పాఠకులు సర్వం మరిచి, చివరికి ఊ కొట్టడం కూడా మరిచి వింటూ ఉండిపోతారు. ఈ వింటున్న క్రమంలో బోడియ్య అమాయకత్వానికి నవ్వొస్తుంది. అతనికి కష్టం కలిగినప్పుడు అయ్యో
అనిపిస్తుంది. కళ్ళెదురుగానే అతనికి అన్యాయం జరుగుతున్నప్పుడు ఆవేశం
వస్తుంది. బలమైన శత్రువు ఆ బలహీనుడి మీద ముప్పేట దాడి చేసినప్పుడు రౌద్రం
కలుగుతుంది. అన్నింటినీ మించి బోడియ్య పట్టుదలకి శెభాష్ అనాలనిపిస్తుంది.
ఊరి ప్రెసిడెంట్ దగ్గర మూడొందల రూపాయలు అప్పు చేసి, అందుకు గాను ఆరొందల రూపాయలకి కరణం రాసిన
నోటు మీద వేలిముద్దరేసి, ఆ సొమ్ముతో తుంపాల సంతలో జెత పోతుల్ని కొంటాడు
బోడియ్య. సంక్రమణం వెళ్ళిన ఐదోనాడు కొన్న ఆ పోతులు శివరాత్రి వెళ్ళిన
నాలుగో నాడు కనిపించకుండా పోయాయి. ఎక్కడ వెతికినా ఉపయోగం ఉండదు. సొమ్మలు
పోయిన పదో రోజున ప్రెసిడెంట్ నుంచి కబురొస్తుంది బోడియ్యకి. ప్రోనోటు
ప్రకారం ఆరొందల రూపాయలు బాకీ చెల్లించమని. "తాటిపండు దెబ్బకే నాను
లెగలేపోతుంటే మరింక పిడుగు దెబ్బకి నానింకేటి తట్టుకోగల్నండి?!" అని అడుగుతాడు బోడియ్య, పాఠకులని.
వారం
రోజుల్లో ఆరొందలు వ్యాపగించడం తనవల్ల కాలేదు బోడియ్యకి. బోడియ్య భార్య
సంద్రం ఊరుకోలేదు. వీధిలో ప్రెసిడెంట్ ఇంటి ఎదురుగా నిలబడి తిట్లు
అందుకుంది. ప్రెసిడెంట్ బయటికి రాలేదు కానీ అతని అన్న కొడుకు మిరపకాయల
చిన్నారావు సంద్రం మీద చెయ్యి చేసుకున్నాడు. ఆమె చీరలాగి అల్లరిపెట్టాడు.
దారే వెడుతున్న సూరప్పడి చేతిలో ఉన్న చేపాటి కర్ర అందుకుని చిన్నారావుకి
రెండు తగల్నిచ్చాడు బోడియ్య. ప్రెసిడెంట్ మనుషులు బోడియ్య తల పగలగొట్టారు.
తగువు పంచాయితీకి వెళ్ళింది. తగు మాత్రం పెద్దమనుషులు ఎవరున్నారక్కడ?
ఉన్నవాళ్ళంతా ప్రెసిడెంట్ కి వత్తాసు పలికిన వాళ్ళే. బోడియ్య కొట్టిన
దెబ్బలకీ, బోడియ్యకి తగిలిన దెబ్బలకీ చెల్లుకి చెల్లు అన్నారు.
పది రోజుల పాటు అంతా ప్రశాంతంగానే ఉంది. ఆ గొడవ అక్కడితో అయిపోయిందనే అనుకున్నాడు బోడియ్య. కానీ, పదకొండో రోజున పోలీస్ జవాను వచ్చాడు. బోడియ్య, సంద్రంతో పాటు ఈ గొడవకి ఏమాత్రం సంబంధం లేని వాళ్ళ పదహారేళ్ళ కూతురు చిలకని కూడా చలచల్లని మాటలు చెబుతూ పోలీసు స్టేషన్కి తీసుకెళ్ళి పోయాడు. పదిరోజుల్నాడు జరిగిన జరిగిన గొడవలో చిన్నారావు చిటికెన వేలు చితికిపోయింది. వీళ్ళు ముగ్గురూ ముద్దాయిలు. బావమరిది, జగిలీడు (తోడల్లుడు) తోడొచ్చారు బోడియ్యకి. వాళ్ళూ అంతంత మాత్రం వాళ్ళే.
అయితే, ప్రెసిడెంట్ వాళ్ళనీ వదలలేదు. బోడియ్య కుటుంబంతో పాటు వాళ్ళిద్దరి వల్లా తనకీ తన అన్న పిల్లలకీ ప్రాణ హాని ఉందని బైండోవర్ కేసు బనాయించాడు. పులిమీద పుట్రలా భూవి జప్తు కేసు. ఆరొందల రూపాయల బాకీ చెల్లించలేదు కాబట్టి, బోడియ్యకున్న నలభై సెంట్ల భూవీ ఏల జప్తు చేయరాదంటూ సర్కారు వారి నోటీసు. ఇవన్నీ జరుగుతూ ఉండగానే సొమ్మల్ని ప్రెసిడెంటే కాజేసేడని తెలుస్తుంది బోడియ్యకి. పోలీసుల చుట్టూ, కోర్టుల వెంటా తిరగడంలో కూతురు చిలకని కోల్పోతాడు బోడియ్య. జగిలీడు భయపడి ప్రెసిడెంట్ వైపు తిరిగిపోతాడు.
అయితే, ప్రెసిడెంట్ వాళ్ళనీ వదలలేదు. బోడియ్య కుటుంబంతో పాటు వాళ్ళిద్దరి వల్లా తనకీ తన అన్న పిల్లలకీ ప్రాణ హాని ఉందని బైండోవర్ కేసు బనాయించాడు. పులిమీద పుట్రలా భూవి జప్తు కేసు. ఆరొందల రూపాయల బాకీ చెల్లించలేదు కాబట్టి, బోడియ్యకున్న నలభై సెంట్ల భూవీ ఏల జప్తు చేయరాదంటూ సర్కారు వారి నోటీసు. ఇవన్నీ జరుగుతూ ఉండగానే సొమ్మల్ని ప్రెసిడెంటే కాజేసేడని తెలుస్తుంది బోడియ్యకి. పోలీసుల చుట్టూ, కోర్టుల వెంటా తిరగడంలో కూతురు చిలకని కోల్పోతాడు బోడియ్య. జగిలీడు భయపడి ప్రెసిడెంట్ వైపు తిరిగిపోతాడు.
ఎన్ని
సమస్యలు వచ్చినా ప్రెసిడెంట్ కాళ్ళ కిందకి వెళ్లరాదన్నది బోడియ్య పంతం.
అతనికి తగ్గ ఇల్లాలు సంద్రం. చివరివరకూ నిలబడినవాడు బావమరిది. ఇంతకీ,
ప్రెసిడెంట్ బోడియ్య మీద ఎందుకింత కక్ష కట్టాడు? ఈ కేసుల్లోనుంచి బోడియ్య
బయట పడ్డాడా లేదా? తనని ముప్పు తిప్పలు పెట్టిన ప్రెసిడెంట్ మీద ప్రతీకారం
తీర్చుకున్నాడా?? ఈ ప్రశ్నలన్నింటికీ జవాబిస్తూ ముగుస్తుంది 'సొమ్మలు
పోనాయండి.' ఆద్యంతమూ రావిశాస్త్రి మార్కు ఉపమానాలతో సాగే కథనం ఊపిరి
బిగపట్టి చదివిస్తుంది. పుస్తకం చదువుతున్నప్పుడే కాదు, పూర్తి చేసి పక్కన
పెట్టాక కూడా ఎన్నో ప్రశ్నలు వెంటాడతాయి. 'మనసు' ఫౌండేషన్ ప్రచురించిన
'రావిశాస్త్రి రచనా సాగరం' లో చదవచ్చీ నవలికని.