గురువారం, మార్చి 26, 2026

పాలగుమ్మి పద్మరాజు మోనోగ్రాఫ్

ఫ్రాయిడ్ మనోవైజ్ఞానిక సిద్ధాంతాన్ని పూర్వపక్షం చేస్తూ లోతైన కథలు రాసిన విఖ్యాత కథకుడు పాలగుమ్మి పద్మరాజు. 'గాలివాన' కథకి అంతర్జాతీయ బహుమతి రావడంతో, ఆ కథ ఆయనకి ఇంటిపేరుగా మారిపోయిందే తప్ప, మిగిలిన యాభైతొమ్మిది కథలూ తీసికట్టని కాదు. ప్రతి కథా దేనికదే ప్రత్యేకం. రాసినవి కాసిన్ని నవలలు అయినా, ఇతివృత్తంలోనూ, నడక లోనూ ఒకదానికొకటి పోలికే లేని రచనలవి. కాస్తంత కవిత్వం, కాసిన్ని అనువాదాలు, కొద్దిపాటి సాహిత్య విమర్శ చేసినప్పటికీ పద్మరాజుకి కథా రచయిత గానే పెద్దపేరు.ఒక రచయిత తాలూకు రచనల్ని పూర్తిగా అర్ధం చేసుకోవాలనుకునే పాఠకులకి, ఆ రచయితని గురించి వీలైనన్ని వివరాలు తెలుసుకోవడం అవసరం. పద్మరాజు విషయంలో ఆయన్ని గురించి వచ్చిన వ్యాసాలూ, ఇంటర్యూలూ తక్కువే కానీ, ఆయన డైరీలు కొంతమేరకు కొరత తీర్చాయి. 

'భారతీయ సాహిత్య నిర్మాతలు' సిరీస్ లో భాగంగా కేంద్ర సాహిత్య అకాడెమీ ప్రచురించిన పాలగుమ్మి పద్మరాజు మోనోగ్రాఫ్ ఆయన్ని గురించీ, ఆయన రచనలని గురించీ మరిన్ని వివరాలు అందిస్తోంది. నిన్నటి తరం రచయిత, సాహిత్య విమర్శకుడు అయిన అక్కిరాజు రమాపతి రావు రాసిన ఈ మోనోగ్రాఫ్ మొదటి ముద్రణ 2017 లో జరిగింది. అకాడెమీ నిర్దేశించిన టెంప్లేట్ లోనే సాగిన ఈ పుస్తకంలో పద్మరాజు జీవన రేఖలు, సాహిత్య-సామాజిక నేపథ్యం, కథా, నవలా, నాటక రచయితతో పాటు కవిగా, నాటక, సినిమా రచయితగా ఆయన జరిపిన కృషిని క్లుప్తంగా మన ముందుంచింది. పద్మరాజు రచనలని గురించి రమాపతిరావు చేసిన ప్రతిపాదనలు ఆసక్తికరంగా వున్నాయి. 'పరిధికి లోబడి' చేసిన ఈ విమర్శని చదువుతున్నప్పుడు, ఆ పరిధిని మరికొంత విస్తరించి ఉంటే బాగుండేదనిపించింది చాలాసార్లు. 

'కథా రచయితగా పద్మరాజు' అధ్యాయంలో సింహభాగం, అంతర్జాతీయ బహుమతి గెలుచుకున్న 'గాలివాన' కథని గురించే ప్రస్తావించారు. ఆ పోటీ నిర్వహించిన విధానం, పద్మరాజు కేవలం ఆ పోటీ కోసమే మొదటగా ఇంగ్లీష్ లో కథని రాసి పంపిన సంగతి (తర్వాతే తెలుగు చేశారు) మొదలుకొని, కథలో ప్రతి సన్నివేశాన్నీ విశ్లేషిస్తూ వెళ్లి, ముగింపుని విమర్శించారు. "ఆమె చేతిలో ఈ పర్సు చూసి ఆమె ఆ రాత్రి దొంగతనం చేసిందని ఎవరూ అనుకోరా? మృతురాలైన ఆమెను ఆమె గుడిసెకు చేర్చాల్లన్న ఆలోచన అయినా రావుగారికి కలగలేదా?" అని ప్రశ్నించారు రమాకాంత రావు. "కాని తన పర్సు ఆమె చేతిలోంచి విడదీయటానికి ఆయన మనస్సు వొప్పలేదు" అని పద్మరాజు స్పష్టంగానే రాశారు. పైగా, కథ తిరిగేదే వర్గస్పృహ చుట్టూ. తుఫానుకి ముందు ఆ బిచ్చగత్తెని రైల్లోనుంచి దింపేసే ప్రయత్నం చేసిన రావుగారు, తుఫాను చక్కబడ్డాక తన పూర్వస్థితికి వచ్చేసి, దుస్తులతోపాటు హోదానీ ధరించారని చెప్పకనే చెప్పారు కదా పద్మరాజు?!!

నవలల గురించి చెబుతూ "పద్మరాజు రచనల్లో 'రామరాజ్యానికి రహదారి' ని 'మాగ్నమ్ ఓపస్' గ్రంధం అనాల్సి ఉంటుంది" అన్నారు. ఇందుకు అభ్యంతరం లేదు. అయితే, 'రెండవ అశోకుడి మూన్నాళ్ళ పాలన' లో వ్యంగ్యాన్ని గుర్తిస్తూనే, "ఈ నవల గూర్చి విశేషంగా చెప్పవలసింది ఏమీ లేదు పాలగుమ్మి వారి పరిశీలనా, హాస్య రచనా నైపుణ్యమూ ఈ నవలలో ప్రతిపదం వెల్లివిరిశాయి" అని ముక్తాయించారు. నిజానికి తెలుగు సాహిత్య చరిత్రలో ఈ నవలకి ఒక ప్రత్యేకత వున్నది. ఏ ఒక్క రాజకీయ పక్షాన్నీ విడిచిపెట్టకుండా, అన్ని పార్టీల విధానాలనీ సూటిగా విమర్శించిన తొలి రచన ఇదే అని చెప్పాలి. పద్మరాజు 'రాయిస్టు' (ఎమ్మెన్ రాయ్ అనుయాయి) కావడం వల్లనే ఇలా రాయగలిగారు. ఈ నవలకి సమవుజ్జీ అనదగ్గ మరో నవల, తర్వాత కాలంలో కేఎన్వై పతంజలి రాసిన 'అప్పన్న సర్దార్' అనే చెప్పాలి. తెలుగు సాహిత్యంలో రాజకీయ వ్యంగ్యమే పరిమితం. ఆ పరిమిత జాబితాలో ఉండే మొదటి నవలని గురించి "విశేషంగా చెప్పవలసింది ఏమీ లేదు" అనడం చివుక్కు మనిపించింది. 

నాటక రచయితగా పద్మరాజుని పరిచయం చేస్తూ చెప్పిన ప్రధాన విషయం 'రక్తకన్నీరు' నాటకాన్ని గురించి. నటుడు నాగభూషణం ఇంటిపేరుగా మారిపోయిన ఈ నాటకానికి తమిళ మూలం తిరుచానూర్ కె. తంగరుసు రాసిన 'రక్తకన్నీర్' నాటకం. ఎమ్మార్ రాధా (నటి రాధిక తండ్రి)ని నటుడిగా నిలబెట్టింది. మూలాన్నీ, తెలుగుసేతనీ పోలుస్తూ విమర్శ రాశారేమో అని ఎదురు చూస్తే నిరాశే మిగిలింది. అయితే, బుచ్చిబాబు 'చివరకు మిగిలేది' నవలనీ, స్వీయ రచన 'గాలివాన' కథనీ రేడియో నాటకాలుగా మలచడంలో పద్మరాజు ప్రతిభ, శ్రవ్య మాధ్యమంపై ఆయనకి ఉన్న పట్టుని గురించి వివరంగా రాశారు. మొత్తం నాటకాల జాబితా ఇచ్చినా బాగుండేది. విమర్శకుడిగానూ, కవి గానూ పద్మరాజు చేసిన కృషి పరిమితమే అయినా ఆ తాలూకు ప్రత్యేకతలని బలంగా చెప్పారీ పుస్తకంలో. 

పద్మరాజుని గురించి అక్కిరాజు రమాపతి రావుకి ఉన్న ప్రధానమైన ఫిర్యాదు ఆయన సినిమా రంగానికి వెళ్లడం. అలా వెళ్లకపోయి వుంటే మరిన్ని మంచి రచనలు వచ్చి ఉండేవన్న ఆవేదనని నాలుగైదు చోట్ల ప్రకటించారు. తీరాచేసి అక్కడ కూడా పేరు రాలేదు కదా అన్నది ఆయన నిట్టూర్పు. సినిమా రంగానికి వెళ్లాలన్నది పద్మరాజు వ్యక్తిగత నిర్ణయం. "ఆయొక్క బగవంతుడు బొయినం చేసి బతకమని శపించాడు కాబట్టి..." అంటుంది పతంజలి గారి వీరబొబ్బిలి. కాబట్టి, ఉదరపోషణార్ధం కట్టిన వేషమైనా కావొచ్చు. ఏ రంగంలో అయినా పేరు రావడం, రాకపోవడం అన్నది ఏ ఒక్కరి చేతిలోనూ ఉండదు. పేరో, డబ్బో, లేదా రెండూనో వస్తాయనే కదా అక్కడికి వెళ్లి అదృష్టం పరీక్షించుకుంటూ ఉంటారు. ఒకవేళ సినిమాలకి వెళ్లకపోతే, ఆమాత్రం ఉపాధీ లేక, రాయడాన్ని పూర్తిగా మానేసి ఉండేవారేమో కదా? ఇది వేరే పెద్ద చర్చ. ఎనభై పేజీల ఈ మోనోగ్రాఫ్ వెల యాభై రూపాయలు. సాహిత్య అకాడమీ స్టాల్స్ లో (పుస్తక ప్రదర్శనల్లో) దొరుకుతుంది. 

మంగళవారం, మార్చి 17, 2026

కడపటి యుద్ధం

హండే రాజుల పాలనా కాలాన్ని కళ్లముందుంచిన 'శప్తభూమి' తరువాత, బండి నారాయణ స్వామి నుంచి వచ్చిన మరో చారిత్రక కల్పన 'కడపటి యుద్ధం' నవల. హంపీ విజయనగరం రాజధానిగా పాలన సాగించిన విజయనగర రాజుల్లో చిట్టచివరి బలమైన రాజు, శ్రీకృష్ణ దేవరాయలుకి స్వయానా అల్లుడు అయిన అళియ రామరాజు కాలానికి పాఠకుల్ని అదాటున తీసుకుపోయే బృహన్నవల ఇది. అంతేకాదు, విజయనగర చరిత్రకి దాదాపుగా చరమగీతం రాసిన 'రక్కసి తంగడి' యుద్ధం ఈ నవలలో ముగింపు సన్నివేశం. తుళువ వంశీయుడు, శ్రీకృష్ణ దేవరాయలుకి బంధువు అయిన సదాశివ రాయలని పేరుకి మాత్రం  సింహాసనం మీద కూర్చోబెట్టి, పాలనా వ్యవహారాన్నీ తనే చక్కబెడుతూ, రాయల విధానాలనే అనుసరిస్తూ తనని తాను 'అళియరామ రాయలు' అని పిలిపించుకోవాలని ఉబలాటపడే రాజు కాని రాజు కథ ఇది. 

చారిత్రక నగరం హంపీ ఎలా శిధిలమయ్యింది? చరిత్ర చెబుతున్న కారణం, రక్కసి తంగడి యుద్ధంలో అళియ రామరాజు మరణానంతరం పంచ పాదుషాలు, వారి తాలూకు సైన్యాలు జరిపిన దమనకాండ వల్ల అని. అయితే, హంపీ పతనానికి కారణం కేవలం వైష్ణవులు-శైవులూ తమలో తాము కలహించుకుని, ఆలయాలని, ఇతర నిర్మాణాలని ధ్వంసం చేసుకోవడమే తప్ప, పాదుషాలు ఏ పాపమూ ఎరుగరు అని చెప్పే కథలున్నాయి. వాటిని బలంగా నమ్మే వారూ (ముఖ్యంగా హంపిని కళ్ళతో చూడని వారు)  ఉన్నారు. బండి నారాయణ స్వామి కథల్ని కాక, చరిత్రని ప్రామాణికంగా తీసుకున్నారు. అయితే, అళియ రామరాజుకి పంచ పాదుషాల వల్ల కన్నా, రహస్యంగా వాళ్లకి సహకరించి, యుద్ధభూమిలో సొంత సైన్యానికి వెన్నుపోటు పొడిచిన హంపీకి చెందిన ముస్లిం సైనికుల వల్లనే ఎక్కువగా నష్టం జరిగిందని ప్రతిపాదించారు. 

ఇంతకీ పంచ పాదుషాలు ఏకమై అళియ రామరాజుపై యుద్ధం ఎందుకు ప్రకటించారు? నిజానికి వీరిలో ఇద్దరు పాదుషాలు అళియరామకి పుత్ర సమానులు. మిగిలిన వారికీ అవసరమైనప్పుడు సహాయం చేశాడే తప్ప, కత్తిదూయలేదు. పైగా, పాదుషాల మధ్య వచ్చే తగువులని పరిష్కరించే మధ్యవర్తిత్వం కూడా అనేకమార్లు నెరపాడు. శతృత్వం మొదలవ్వడానికి నవలా రచయిత ప్రతిపాదించిన కారణాలు రెండు: అళియరామ పెద్దరికాన్ని ఎందుకు భరించాలన్న ప్రశ్న పాదుషాలలో మొలకెత్తడం మొదటిదైతే, హిందూ రాజ్యం విజయనగరాన్ని స్వాధీనం చేసుకుంటే ఇస్లాం మత విస్తరణకి అడ్డు ఉండదన్న ఆలోచన రెండవది. మత విస్తరణకి రాజ్యమా, లేక రాజ్య విస్తరణకి మతమా? మహాభారతంలో  ద్రౌపది సంధించిన ప్రసిద్ధమైన ప్రశ్న 'తానోడి నన్నోడెనా, నన్నోడి తానోడెనా?' ని గుర్తు తెచ్చే సందర్భం. 

'కడపటి యుద్ధం' నవలలో కథానాయకుడు రెండుకత్తుల హంసణ్ణ. 'శప్తభూమి' కథానాయకుడు బిల్లే ఎల్లప్పకీ, ఈ హంసణ్ణకీ చాలా పోలికలున్నాయి. హంసణ్ణ తండ్రి ఉత్తణ్ణ హంపీ నగరంలో చర్మకారుడు. జంతుచర్మాల వ్యాపారం చేస్తూ ఉంటాడు. అయితే శ్రీవైష్ణవాన్ని త్రికరణశుద్ధిగా పాటించే దాసరి (మహాభారతంలో ధర్మవ్యాధుణ్ణి గుర్తు చేసే పాత్ర). చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్న హంసణ్ణ మేనత్త దగ్గర పెరుగుతాడు. తండ్రికి కొడుకు మీద ప్రేమ వున్నా, శ్రద్ధ లేనట్టే. యుక్త వయస్కుడైన హంసణ్ణ, అంతఃపురం నుంచి పారిపోయిన -- అళియ రామరాజుకి ప్రియమైన --  తెల్లమచ్చల నల్ల ఏనుగుని అడవిలో కనుగొనడం ద్వారా అళియకి దగ్గరై, యుద్ధ విద్యలు నేర్చుకుని, దుర్గాధిపతిగా ఎదుగుతాడు. ఇంట్లో అతడి విజయాన్ని అభినందించే వాళ్ళు లేరు. తాను ప్రేమించిన కన్యని పెళ్లాడడానికి ఈ హోదా ఏమాత్రమూ అక్కరకు రాలేదు, కులమే అడ్డంకి. 

గోల్కొండ కోటలో అంతః కలహాల కారణంగా ఆశ్రయం ఇవ్వమని   అళియ రామరాజుని అర్ధిస్తాడు బాలుడైన ఇబ్రహీం. హంపీలోనే ఎదిగి, యువకుడయ్యాక దేవదాసి శ్రీవల్లి కూతురు భాగీరధితో ప్రేమలో పడతాడు. గోల్కొండ రాజకీయ పరిస్థితులు మారడంతో, తన కోటకి చేరి పాదుషాగా  పట్టాభిషిక్తుడవుతాడు.  భాగీరధిని మర్చిపోకుండా, ఆమె కోసం పల్లకీని పంపి పట్టపు రాణిని చేసుకుంటాడు. హంపిని మర్చిపోడు, అక్కడి సైన్యంలో రహమాన్ లాంటి మెరికలని గుర్తించి, తగిన పదవులతో గోల్కొండకి సగౌరవంగా ఆహ్వానిస్తాడు. అళియ రామరాజునూ  మర్చిపోలేదు, మిగిలిన నలుగురు పాదుషాలనీ ఏకం చేసి, పంచ పాదుషాలకి నాయకత్వం వహించి, అదను చూసి విజయనగరంపైకి దండెత్తుతాడు. చక్రపొంగలితో మొదలయ్యే ఇబ్రహీం-భాగీరధిల పరిచయం, ప్రేమగా మారి, ఆమె పేరిట 'భాగీరధీ నగరం' నిర్మించడం వరకు ఎదిగిన తీరుని, ఈ క్రమంలో-- మరీ ముఖ్యంగా గోల్కొండ సైన్యాలు హంపిపై దండయాత్రకి బయలుదేరినప్పుడు -- భాగీరధి అంతః సంఘర్షణని ప్రత్యేకంగా చిత్రించారు రచయిత. 

ఇది కేవలం రాజుల కథ కాదు. రాజుల కథ రాయడం మాత్రమే తన ఉద్దేశం కాదని 'శప్తభూమి' తోనే నిరూపించారు నారాయణ స్వామి. ఇది కూడా రాజ్యం కథే. విజయనగర సామ్రాజ్యంలో వివిధ వర్గాల ప్రజల కథ. అధికారాన్నీ, యవ్వనాన్నీ తనివితీరా అనుభవించే తెలుగుల మాధవుడి కథ. ఉదయాన్నే తన గుడిసె ఎదుట వ్యాయాయం చేసుకుని, అంతఃపురంలో బెత్తంధారిణి ఉద్యోగానికి గుర్రంపై  బయలుదేరే చినపోతి కథ. వేశ్య రత్నమాలని మనసారా ప్రేమించిన వ్యాపారి టిట్టిభ శెట్టి కథ (కాళ్ళకూరి 'చింతామణి' ని జ్ఞాపకం చేసింది). కులవృత్తిని కొనసాగించే దేవదాసీ పండితురాలు శ్రీవల్లి, ఇష్టపూర్వకంగా వేశ్యావృత్తిని చేపట్టిన రంజని, మహిళా కరణం విద్యావతి, క్షురకుడిగానే కాక, శస్త్రచికిత్స నిపుణుడిగానూ పేరు తెచ్చుకున్న కొండోజు... ఒకటా, రెండా, రచయిత ఇచ్చిన జాబితాలోనే అరవై ఆరు పాత్రలున్నాయి. ప్రతి పాత్రనీ గుర్తుపెట్టుకునే విధంగా తీర్చి దిద్దే నైపుణ్యం ఈ రచయిత సొంతం. ఒక్క ఇలావతి పాత్ర ముగింపు మాత్రం నిరాశ పరిచింది. 

'అన్నపు రాశులు ఒకచోట.. ఆకలి మంటలు ఒకచోట' అన్న ప్రజాకవి కాళోజీ నారాయణరావు మాట, ఈ కాలానికే కాదు ఆ కాలానికీ సరిపోతుంది. సిరులు పొంగిన విజయనగరంలోనే, బాకీ చెల్లు వేయలేక బానిసగా మారి, అటుపై ఆత్మహత్య చేసుకున్న కౌలురైతు కొండమీద రాయుడు కథ, ఆ కాలం నాటి పేద రైతుల జీవితాలకి ఒక ఉదాహరణ. అతడి కుటుంబం విచ్చిన్నమైన తీరుని నవలలో చదువుతుంటే, ఏ కాలమూ కూడా ఎల్లరకూ స్వర్ణయుగం కాదన్న సత్యం  మరోసారి  తలపుకొస్తుంది. ఇదే నవల, దేవదాసీల స్నానపు గదుల నుంచి సుగంధ భరితమైన మురుగు నీరు వారి పెరళ్ళలోని పూల మొక్కల్లోకి ప్రవహించడం, ఆ మొక్కల మధ్య ఏపుగా ఎదిగిన తాడి చెట్టు తాలూకు ఆకులతో కూర్చిన తాళ పత్రాలు 'కళాపూర్ణోదయం' కావ్యకర్త పింగళి సూరన ఇంటికి చేరడాన్ని విశదంగా చిత్రిస్తుంది!! దేవదాసీలు, భోగపత్నులు, వేశ్యల స్థాయీ భేదాల వర్ణన సరేసరి. 

కొన్ని కులాలకి చెందిన పాత్రలని గురించి రాసేప్పుడు నారాయణస్వామి కలం కాస్తంత అదుపు తప్పడాన్ని 'శప్తభూమి' లో గమనించ వచ్చు. కొన్ని పాత్రల్ని చిత్రించడంలో రచయిత 'కసి' నవలని నిశితంగా చదివిన పాఠకుల దృష్టిని దాటిపోదు. 'కడపటి యుద్ధం' దగ్గరకు వచ్చేసరికి, రచయిత ఆ కసిని దాచుకునే ప్రయత్నం ఏమాత్రమూ చెయ్యలేదు. రెండు మూడు కులాల నుంచి వచ్చే ప్రతి పాత్రా దుర్మార్గంగానే ప్రవర్తించడం, వాటి ప్రవర్తన అన్ని విధాలుగా తీసికట్టుగా ఉండడం, ఈ నవలని మామూలుగా చదువుకుంటూ వెళ్ళినప్పుడు కూడా పాఠకులు గమనిస్తారు. ఒకే ధర్మాన్ని ఆచరించే పాత్రల్లో కూడా, రచయిత ఇష్టపడని కులాలకి చెందిన పాత్రలు దుర్మార్గంగా వ్యవహరించగా, మిగిలినవి ధర్మబద్ధంగా నడుచుకుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, నవల కొన్ని పేజీలు తిరిగేసరికి ఒక పాత్ర కులాన్ని బట్టి ఆ పాత్ర ఎలా ప్రవర్తించబోతోందన్న అంచనా వచ్చేస్తుంది. 

గతానుభవాల దృష్ట్యా, బీభత్సరస ప్రధానమైన నవల చదవడానికి సిద్ధపడిపోయాను. నారాయణస్వామి ఇటీవలి నవలల్లో హింస పాళ్ళు ఎక్కువే. పైగా, ఈ నవల పేరులోనే యుద్ధం వుంది. హింస, నెత్తురు లేవని కాదు, కానీ ప్రతీ హింసాత్మక సన్నివేశానికీ కరుణ రస ప్రధానమైన ముగింపు ఇవ్వడంతో బీభత్సం పాళ్ళు తక్కువే అనిపించింది. చివరి పేజీల్లో యుద్ధ సన్నివేశాలు నెత్తురోడుతూ ఉంటాయని మానసికంగా సిద్ధ పడడం వల్ల కాబోలు, అక్కడ కూడా హింస మరీ అతిగా అనిపించలేదు. నారాయణస్వామి తన ధోరణికి భిన్నంగా హింసని తగ్గించారా? లేక, ఆ మోతాదుకి నేను అలవాటు పడిపోయానా??తెల్లమచ్చల నల్ల ఏనుగుని మొదటి నుంచీ ఇష్టపడడం వల్ల, నవల పూర్తి చేశాక కూడా ఆ ఏనుగు బాగా వెంటాడింది నన్ను. క్లుప్తంగానే రాసినా, గోవా ఇంక్విజిషన్, అక్కడినుంచి 'సిఫిలిస్' వ్యాధి హంపీకి వ్యాపించిన విధమూ కూడా అలా ముద్ర పడిపోయాయి. 

విజయనగర సామ్రాజ్యానికి చెందిన ఒక వేగు, గోల్కొండ నుంచి ఒక రహస్య వర్తమానాన్ని తీసుకురావడంతో నవల ప్రారంభమవుతుంది. గుర్రంపై ప్రయాణిస్తూన్న ఆ వేగు, హంపీ సరిహద్దు నుంచి, రాజధానిలో ప్రవేశించడం, అంతఃపురాన్ని చేరుకోవడం, అళియ రామరాజుని దర్శించడం వరకూ అతడితోనే కలిసి ప్రయాణిస్తారు పాఠకులు. అక్కడి నుంచి వేగు అదృశ్యమైపోతాడు. పాఠకులు కథతో ముందుకు సాగిపోతారు. నవల ముగింపులో జరిగే యుద్ధంలో అళియ రామరాజు ఓటమికి కారణాలని తరచి చూస్తే, వేగుల వైఫల్యమూ ఒకటి.  పంచ పాదుషాల ఎత్తుగడలని గురించి వేగుల నుంచి వర్తమానం ఉంటుంది. కానీ, సొంత సైన్యం నుంచి జరగబోయే వెన్నుపోటుని గురించి ఏమాత్రమూ ఉప్పందదు. వెన్నుపోటుని వేగులు కూడా పసిగట్ట లేరన్న సూచన ఏదో ఉన్నట్టుంది. 

దాదాపు ఆరొందల పేజీల నిడివి ఉన్న ఈ నవల, నాటి  విజయనగరం, గోల్కొండ రాజ్యాల పాలననీ, ప్రజల జీవనాన్నీ, కళాసంస్కృతులనీ, ఆచరించిన మతధర్మాలనీ నిశితంగా చిత్రించింది. 'హిస్టారికల్ ఫిక్షన్' లోనే చరిత్ర, కల్పన రెండూ ఉన్నాయి. ఏది చరిత్ర, ఏది కల్పన అన్నది పాఠకుల అవగాహనకి, అనుభవానికి, చరిత్ర పరిజ్ఞానానికి సంబంధించిన విషయం. 'ఇలా కూడా జరిగి ఉండవచ్చు' అనే అంచనాని ప్రతి చారిత్రక నవలా ఇచ్చినట్టే, ఈ 'కడపటి యుద్ధం' కూడా ఇస్తుంది. రచయిత చేసిన రాక్షస పరిశోధన, నవల రాయడానికి చేసిన కృషి, అనేకానేక పాత్రల్ని సృష్టించి, ఒక్కో పాత్రనీ వాటివైన ముగింపుకి తీసుకెళ్లిన తీరు, మరీ ముఖ్యంగా రచయితతో అంగీకరించినప్పుడు, విభేదించినప్పుడూ కూడా  ఆపకుండా చదివించే శైలీ ఈ నవల ప్రత్యేకతలు. ఈ నవల చదవడం ఒక అనుభవం. రచయిత స్వయంగా రాసుకున్న వెనుకమాటతో పాటు, ఆచార్య కొలకలూరి ఇనాక్, గోరటి వెంకన్నల అభిప్రాయాలనీ చివర్లో పొందుపరిచారు. 

('కడపటి యుద్ధం' నవల, రచన బండి నారాయణ స్వామి, అజు పబ్లికేషన్స్ ప్రచురణ, పేజీలు 628, వెల రూ. 699, అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ, అమెజాన్ లోనూ లభిస్తోంది) 

సోమవారం, మార్చి 09, 2026

బహుళ

గగనమంతా నిండి, పొగలాగు క్రమ్మి 
బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను! 


అట్టాడ అప్పల్నాయుడు తాజా నవల 'బహుళ' ని చేతిలోకి తీసుకోగానే శ్రీశ్రీ 'మహా ప్రస్థానం' లో 'ఒక రాత్రి' గుర్తుకు రావడం యాదృచ్చికం కాదేమో. వామపక్ష ఉద్యమాలతో పెనవేసుకున్న జీవితం నాయుడు గారిది. శ్రీకాకుళోద్యమం పట్ల  ఆరాధన వారి కథల్లో కనిపిస్తుంది. విస్తారమైన కేన్వాసుతో రాసిన 'బహుళ' నవల గంగువాడ గ్రామం లోని ఐదారు తరాల రైతు జీవితాలని కళ్ళముందు వుంచుతుంది. అన్ని విధాలా వెనుకబడిన ఆ రైతులలో కనిపించే పట్టువిడవని తనం, పోరాట స్ఫూర్తి మొదటగా ఆకర్షిస్తుంది. వందేళ్ల పైచిలుకు కాలాన్ని నాలుగొందలముప్పైపేజీల్లో బంధించిన అప్పలనాయుడు రచనా శైలి ఆశ్చర్య పరుస్తుంది. 

నవల చదవడం మొదలు పెట్టిన కాసేపటికే ఇది 'ఆత్మకథాత్మకం' ఏమోనని సందేహం కలుగుతుంది. కావచ్చు, కాకపోవచ్చు. కానీ, కథనం మాత్రం ఆపకుండా చదివించింది. ఇంత నవలని రెండే అధ్యాయాలుగా విభజించారు రచయిత. ఫ్లాష్ బ్యాక్ టెక్నిక్ ని విరివిగా ఉపయోగించినా, అనేకానేక పాత్రలు, స్థలకాలాదులున్న నవలని చదవడంలో, కథలో లీనమవడంలో ఎలాంటి ఇబ్బందీ కలగలేదు. కథని ఒక క్రమంలో చెప్పుకోవాలంటే పెద నారాయుడు గంగువాడ లో స్థిరపడడంతో మొదలై, అతడి మునిమనవడు రాధేయ, తన మనవడిని తీసుకుని గంగువాడలో జరిగే 'పెదనారాయుడి సంబరాల' కి రావడంతో ముగుస్తుంది. 

పెదనారాయడు, అతడి మనవడు (కూతురి కొడుకు) చిననారాయుడు, అతడి కొడుకు రాధేయ ఈ నవలలో అత్యంత ప్రధాన పాత్రలు. నాయుళ్ళ వంశీకుడు పెదనారాయుడు స్వయం శక్తితో ఎదుగుతాడు. పెద్ద రైతుగా గంగువాడలో స్థిరపడతాడు. కరువు కాలంలో పన్నుల కోసం పీడిస్తున్న రాచరికంతో తలపడి, హత్యకి గురవుతాడు. తిరుగుబాటుని ఏ పాలన మాత్రం అంగీకరిస్తుంది? గంగువాడ ప్రజలు పెదనారాయుడిని తమ గుండెల్లో పెట్టుకున్నారు. అతడి సమాధిని పూజాస్థలం చేసి, ఏడాదికోసారి సంబరాలు చేయడానికి శ్రీకారం చుట్టారు. అలా జరిగే సంబరాలకి యువకుడైన చిననారాయుడు గంగువాడ రావడం నవలాప్రారంభం. 

ఆ సంబరాల్లో గొల్లల సింహాద్రప్పయ్య బృందం ప్రదర్శించిన తప్పెటగుళ్ళ ప్రదర్శన చిననారాయుడిని ఎంతగా ఆకర్షిస్తుందంటే, ఇక గంగువాడలోనే వుండిపోయి, అప్పయ్య  శిష్యుడిగా చేరిపోతాడు. విద్య నేర్చుకోవడం ముగిసేనాటికి అప్పయ్య కూతురు బంగారమ్మతో పీకల్లోతు ప్రేమలో పడతాడు చిననారాయుడు. పెద్దలు ఒప్పుకోరు కనుక, ఆ జంట భిలాయికి పారిపోయి పెళ్ళిచేసుకుని, రాధేయకి జన్మనిస్తుంది. బతుకుతెరువు వెతుకులాట వాళ్ళ ముగ్గురినీ గంగువాడకే చేరుస్తుంది. ఇటు, పెదనారాయుడి కొడుకు మునసబు నాయుడు, పేరే చెబుతున్నట్టుగా ఆ ఊరి మునసబు. అతడి కొడుకు కనకం నాయుడు, చిననారాయుడి ఈడువాడు, దగ్గరివాడు కూడా. అతడు ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించి గంగువాడ సర్పంచిగా గెలుస్తాడు. 

పేరుకి ప్రజాస్వామ్యమే అయినా, అధికారం మొత్తం దివాణం జమీందారు దగ్గర కేంద్రీకృతం కావడం, న్యాయమైన సమస్యలకి కూడా తన పదవి ద్వారా పరిష్కారం దొరకకపోవడంతో కనకం నాయుడు క్రమంగా వామపక్ష రాజకీయాల వైపు ఆకర్షితుడవుతాడు. కార్మిక జీవితం వదిలి రైతుగా స్థిరపడిన చిననారాయుడిని  వ్యవసాయ సంక్షోభం కుంగదీస్తుంది. అంతర్ముఖుడైన రాధేయ విద్యార్థి దశలోనే వామపక్ష రాజకీయాలవైపు ఆకర్షితుడవుతాడు. అతడి సహచరి సంధ్యది నక్సల్బరీ నేపధ్యం కావడంతో రెండో భాగం మొత్తం వామపక్ష పోరాటాలు, నక్సల్ ఉద్యమం, అణచివేతలు  ప్రధానంగా సాగుతుంది. తన మనవడితో కలిసి పెదనారాయుడి సంబరాలకి గంగువాడ వెళ్లిన రాధేయ, పోలీసుల చేత 'అర్బన్ నక్సల్' అని ముద్ర వేయించుకోవడం నవల ముగింపు. 

వాస్తవ జీవితాన్ని కల్పిత పాత్రల సాయంతో చిత్రించిన కథలా అనిపించే ఈ నవలలో, వెంపటావు సత్యం, ఆదిభట్ల కైలాసం వంటి వారి ప్రస్తావన సందర్భానుసారంగా కనిపిస్తుంది. ఆ ఇద్దరి ఎన్ కౌంటర్ యువకుడైన రాధేయ మీద చెరగని ముద్ర వేస్తుంది. నవల చదివే పాఠకులని కూడా ఆ సన్నివేశం ఓ పట్టాన విడిచిపెట్టదు. అదే భూమితో ఒకప్పుడు వైభవంగా బతికిన రైతులు కాలక్రమంలో ఎందుకు చితికిపోయారు అనే ప్రశ్నని గంగువాడ జీవితాలు మిగిలిస్తే, దినదిన గండం లాంటి రహస్య జీవితం, ఆయుధం పట్టి అడవుల నుంచి చేసిన పోరాటం ఏయే మలుపులు తిరిగింది, చివరికి ఎవరికి ప్రయోజనం చేకూర్చింది అన్నది సంధ్య కథ చెబుతుంది. 

అటు చిననారాయుడు, ఇటు రాధేయ కూడా 'పాసివ్' పాత్రలు అవ్వడం వల్ల,  సంఘటనలు, ఇతర పాత్రలు తీసుకునే నిర్ణయాలు మాత్రమే కథని ముందుకి నడిపించాయి. బంగారమ్మ పాత్ర చిత్రణలోనూ, ఆ పాత్రకి ఇచ్చిన ముగింపు లోనూ కనిపించే నాటకీయతని మినహాయించుకంటే, మిగిలిన కథ, పాత్రలు, సన్నివేశాలు సహజంగానే అనిపించాయి. సన్నివేశాల నిడివి విషయంలో రచయిత తీసుకున్న శ్రద్ధ ప్రత్యేకంగా కనిపిస్తుంది. అలాగే సంభాషణలు కేవలం సంభాషణల్లాగే (ఉపన్యాసాల్లా కాకుండా) వుండడం చాలా పెద్ద రిలీఫ్. హాస్యం కన్నా వ్యంగ్యమే ఎక్కువగా వినిపించింది. కారా మేష్టారికీ, కేఎన్వై పతంజలికీ నివాళిగా అనిపించే సన్నివేశాలు అక్కడక్కడా మెరిశాయి. బరువైన పుస్తకం, బరువైన కథ అయినప్పటికీ, రీడబిలిటీ విషయంలో కష్టపెట్టలేదు. 

శివారెడ్డి, ఏకే ప్రభాకర్, గంటేడ గౌరునాయుడుల సవివరమైన ముందుమాటలతో శ్రీకాకుళ సాహితి ప్రచురించిన ఈ 467 పేజీల 'బహుళ' నవల వెల రూ. 300. నవోదయ బుక్ హౌస్, కాచిగూడ, విశాలాంధ్ర అన్ని శాఖలతో పాటు ఆన్లైన్లోనూ కొనుక్కోవచ్చు. రచయిత, తన గురువు కారామేష్టారికి అంకితం ఇచ్చారీ నవలని. 

శుక్రవారం, ఫిబ్రవరి 06, 2026

అమెరికా అమ్మాయి

"ఒక వేణువు వినిపించెను అనురాగ గీతికా..." పాట కూనిరాగం తీస్తూ శ్రీనిధి యెల్లల రాసిన 'అమెరికా అమ్మాయి' పుస్తకం చదవడం మొదలు పెట్టాను. ఎప్పుడైనా బాగా బరువైన పుస్తకం చదివినప్పుడు, తేలిక పడడం కోసం ఒక లైట్ రీడ్ పుస్తకాన్ని ఎంచుకోవడం అలవాటు. వజ్రాన్ని వజ్రంతోనే కోయడం లాగా. ఆమధ్య 'వలస' నవల చదివిన తర్వాత, అర్జెంటుగా ఒక సరదా రచన కావాలని అనిపించింది. "శ్రీనిధి రాసిన అమెరికా అమ్మాయి చదివారా? అచ్చంగా మన పక్కింటమ్మాయి అమెరికా వెళ్లొచ్చి ఆ కబుర్లు చెబుతున్నట్టు ఉంటుంది చదువుతుంటే.." కొన్నాళ్ల క్రితం మిత్రులొకరు చెప్పిన మాట గుర్తొచ్చింది. తీరా వెతికితే, ఈ పుస్తకం  నేను కొనేసి చదవడం కోసమని పెట్టుకున్న బొత్తిలో కనిపించింది. సరదా కబుర్లని పేరైతే వచ్చేసింది కానీ, ఇందులో విషయాలు సీరియస్సే, కాకపోతే సుగర్ కోటెడ్, చిన్నప్పుడు ఇష్టంగా మింగిన హోమియోపతి మాత్రల్లాగా. 

'కౌముది' ఆన్లైన్ మాసపత్రికలో రెండేళ్ల పాటు, అంటే ఇరవై నాలుగు నెలల పాటు 'కాలమ్' గా వచ్చిన రచనల కలబోత ఈ పుస్తకం. కాలమ్ లో పాఠకులు ముఖ్యంగా వెతికేది కాలక్షేపం. సంపాదకులు చూసేది చదివించే గుణం. ఒక సబ్జెక్టుకి కట్టుబడకుండా హాయిగా ఏ విషయాన్ని గురించైనా రాసేయగలగడం ఆయా కాలమిస్టులకి వరమూ, శాపమూ కూడా. కాలమ్ గా వచ్చిన రచన, ఆ తర్వాత పుస్తకంగా కూడా వచ్చిందంటే అందులో కేవలం కాలక్షేపం మాత్రమే కాక, కాల పరీక్షకి నిలబడేది ఏదో ఉందనే కదా అర్ధం. వైటూకే తర్వాతి తరం వారి అమెరికా వలస జీవితపు అనుభవాలని రికార్డు చేసిన రచనలివి. 

మరీ ముఖ్యంగా, భారతదేశంలో శ్రమదమాదులకోర్చి పెద్ద చదువులు చదివి, కొన్నాళ్ళు ఉద్యోగాలు కూడా చేసి, అమెరికా వెళ్ళాక, కేవలం అక్కడి వీసా నిబంధనల కారణంగా గృహిణులుగా మాత్రమే మిగిలిపోయిన హెచ్ వన్ ల భార్యల కథలూ, కబుర్లూ, ఆలోచనలూ, అంతర్మధనాలూ విరివిగా కనిపిస్తాయి ఈ కాలమ్స్ లో. నిర్బంధపు గృహిణిత్వం మీద సెటైర్లు మాత్రమే కాదు. "ఇంత చదువూ చదివి..." అన్న ఆవేదనా కనిపిస్తుంది. పైకి కనిపించని పీర్ ప్రెజర్  సరేసరి. నలుగురు మనుషులు ఒకచోట కలిశారంటే వాళ్ళు రెండో మూడో గ్రూపులుగా మారిపోవడం పరిపాటి. అపార్ట్మెంట్ కాంప్లెక్సుల మొదలు అనేక చోట్ల కనిపించే ఈ తరహా 'గ్రూపిజం' గురించిన చురకలు కొన్నిచోట్ల పాఠకులని భుజాలు తడుముకునేలా చేస్తాయి. 

బీనాదేవి 'ప్రి ఫేస్' కథలో ఒక అభిమాని ఆవిడని ('బీనాదేవి' లో రెండో సగం బాలా త్రిపురసుందరీ దేవిని) చూడవస్తాడు. "ఇంతలో మా కుక్క వచ్చి శ్రీరామచంద్రుడి దగ్గర హనుమంతుడిలా నా కాళ్ళ దగ్గర కూర్చుంది. అతనా కుక్కవైపు పరిశీలనగా చూస్తూ 'ఆమధ్య మీరు రాసిన కథలో కుక్క ఇదేనా' అన్నాడు, కథలో కుక్కకీ దీనికీ పోలిక వెతుకుతూ. నేను తుళ్ళి పడ్డాను. 'నయం! కథలో రాసిన మొగుడు ఇతనేనా అనలేదు మావార్ని చూపించి'. నేను కథలో రాసిన ప్రతి వస్తువూ, మనిషీ మా ఇంట్లో ఉండాలని నేననుకోలేదు." అంటూ సాగుతుంది.  ఈ కాలమ్స్ లో ఒక భార్య, భర్త, ఒక పాప క్రమం తప్పకుండా కనిపించే పాత్రలు. కబుర్లన్నీ ఆ భార్య గొంతు నుంచి వినిపిస్తాయి. భర్త గురించీ, పాప గురించీ కొన్ని ముచ్చట్లు, మరికొన్ని కంప్లయింట్లు దొర్లుతూ ఉంటాయి. వీళ్ళు  కాక చుట్టుపక్కల వాళ్ళు, ఇండియాలో బంధువులు సమయానుకూలంగా కనిపిస్తూ వుంటారు. 

ఎక్కువ రెగ్యులర్ పాత్రలు, ఒక కాలమ్ నుంచి మరోదానికి కంటిన్యుటీ, లేకపోవడం వల్ల పుస్తకాన్ని ఏ ఆర్డర్ లో అయినా చదువుకోవచ్చు. పుస్తకాల బొత్తిలో ఓ పక్కన పెట్టుకుని అప్పుడోటీ, ఇప్పుడోటీగా చదువుకున్నా అభ్యంతరం లేదు. కానైతే, రచనల్లో చదివించే గుణం పుష్కలంగా ఉండడం వల్ల ఒకసారి చదవడం మొదలు పెట్టాక మధ్యలో ఆపడం ఉండదు. మా మిత్రులు 'సరదా కబుర్లు' అన్నారు కానీ, బహుశా మా పక్కింట్లో ఇలాంటి అమ్మాయి లేకపోవడం వల్ల కాబోలు, నాకు పురాణం సీత 'ఇల్లాలి ముచ్చట్లు' గుర్తొచ్చాయి. అక్కడ ఉన్నట్టే ఇక్కడా రాజకీయాల మొదలు పర్యావరణం వరకూ అనేక విషయాల ప్రస్తావన వుంటుంది. కానైతే ఇక్కడ వినిపించేది అచ్చమైన స్త్రీగొంతు. 'వృధా' ని గురించి రాసిన కాలమ్, పెళ్లిళ్లు పేరంటాల లాంటి సందర్భాలలో దూరాభారం కారణంగా మిస్సవడాన్ని గురించి రాసిన కాలమ్ బాగా గుర్తుండి పోతాయి. 

రచనలో నిజాయితీ, హాస్యం కోసం ప్రయాస పడకుండా వ్యంగ్యపు చెణుకులతో నవ్వించడం, ఈ కాలమ్స్ ప్రత్యేకత. రాసిన వరసలో చదవడం వల్ల, ఈ రచన స్వీయ అస్థిత్వాన్ని గురించిన ప్రశ్నలతో మొదలై జవాబు వెతుక్కోవడంతో ముగిసినట్టు అనిపించింది. ఒక్కమాటలో చెప్పాలంటే దూరపు కొండల నునుపుని దగ్గరగా చూపించిన రచన.  కథలైనా, కాలమ్స్ అయినా పుస్తకంగా వేసేప్పుడు మొదటి ప్రచురణ తాలూకు వివరం చివర్లో ఇస్తే (కనీసం తేదీ) రికార్డుగా ఉండడంతో పాటు, తర్వాత కాలంలో చదివే వాళ్లకి కాస్త అనువుగా వుంటుంది. రచనా కాలం ఫలానా అని తెలియడం వల్ల పాఠకుల అవగాహన పెరుగుతుందే తప్ప తగ్గదు కదా. వి. ఆర్. రాసాని, శంకగిరి నారాయణస్వామి (కొత్తపాళీ) తమ ముందుమాటల్లో ఈ రచనని వాళ్ళదైన దృష్టికోణంలో చూశారు. (అస్త్ర బుక్స్ ప్రచురణ, పేజీలు 167, వెల రూ. 175). 

శనివారం, జనవరి 24, 2026

పదిహేడు ...

 

(Google Image)