వెండి తెరమీద 'మిథునం...' అక్షరాల్లో 'మిథునం' శ్రీరమణది అయితే, దృశ్యరూపంలో వచ్చిన ఈ 'మిథునం' దర్శకుడు తనికెళ్ళ భరణిదనే చెప్పాలి. కథని సినిమాగా మార్చడంలో ఉన్న కష్టసుఖాలు తెలిసిన వాడిగానూ, గడిచిన రెండు దశాబ్దాల్లోనూ మన చుట్టూ అనివార్యంగా వచ్చి పడిన మార్పులని ఆకళింపు చేసుకున్న వాడిగానూ 'సినిమాటిక్ లిబర్టీ' తీసుకుని భరణి తీసిన సినిమా ఇది. అందుకే, అక్షరాల్లో అప్పదాసు-బుచ్చిలక్ష్మిలకీ, తెరమీద కనిపించే "ఆది దంపతులు అభిమానించే" జంటకీ భేదాలు కనిపిస్తూనే ఉంటాయి.
శ్రీరమణ కథలో అప్పదాసుకి ఎనభై ఏనాడో దాటేస్తే, సినిమా అప్పదాసు (నేపధ్య గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం) అరవై దాటిన వాడు. మూడు ఎమ్మేలు పాసై, స్కూలు మేష్టారు ఉద్యోగం చేసి పింఛను పుచ్చుకుంటున్న వాడు. కథలో అప్పదాసులాగా నూనెలో ముంచి తీసిన ఏకులా కాకుండా, కొంచం కండపుష్టి గానే ఉంటాడు. అక్షరాల్లో బుచ్చిలక్ష్మికి ప్రపంచాన్ని తెలుసుకునే మరో మార్గం లేదు, భర్త చెప్పే కబుర్లు వినడం ద్వారా తప్ప. కానైతే సినిమా బుచ్చిలక్ష్మి (లక్ష్మి) అలాకాదు. కట్టుకున్న వాడికి తెలియకుండా, అమెరికాలో ఉండే కొడుకులూ, మనవలతో రహస్యంగా సెల్ ఫోన్ మాట్లాడి చుట్టూ ఏం జరుగుతోందో తెలుసుకుంటూ ఉంటుంది.
గ్యాసు పొయ్యి మీద వంటచేసుకునే ఈ బుచ్చిలక్ష్మి, కొత్తని ఆహ్వానించాలనీ, మిక్సీ గ్రైండర్లు మంచివనీ భర్తతో వాదిస్తూ ఉంటుంది కూడా. అలాగని ఈ సినిమా చూడాలంటే శ్రీరమణ రాసిన కథని మర్చిపోవాల్సిన అవసరం లేదు. నిజానికి కథలో ముఖ్య సంభాషణలు, సన్నివేశాలు సినిమాలోనూ ఉన్నాయి. వాటితోపాటు కొన్ని సన్నివేశాలకి మార్పులూ, మరికొన్ని అదనపు సన్నివేశాలూ వచ్చి చేరాయి. పాటలు సరేసరి. కథగా చెప్పుకోవాలంటే, పిల్లలు విదేశాల్లో స్థిరపడిపోతే, వాళ్ళ మీద ఆధార పడడం ఇష్టం లేని ఓ వృద్ధ జంట తమ పల్లెటూరి ఇంట్లో ఒకరికి ఒకరుగా కలిసి బతకడం. ఒకే ప్రాణంగా బతికిన ఆ ఇద్దరిలో, ఒకరు తనువు చాలించినప్పుడు రెండోవారి స్పందన ఏమిటన్నది ముగింపు.
ఇది ముగ్గురి సినిమా. భరణి, బాలు, లక్ష్మి. నాటక రంగం నుంచి సినిమాకి వచ్చి రచయితగా, నటుడిగా స్థిరపడ్డాక,దర్శకుడిగా కొన్ని లఘు చిత్రాల తర్వాత భరణి తీసిన తొలి కమర్షియల్ సినిమా (నిజానికి ఈ మాట వాడకూడదేమో.. కానీ, బడ్జెట్, ప్రచారం, థియేటర్ రిలీజ్ పరంగా చూసినప్పుడు వాడాల్సిందే) ఇది. అత్యంత సహజంగానే తన మార్కుని చూపేందుకు ప్రయత్నం చేశాడు. తను చేస్తున్నది సాహసం అన్న విషయాన్నీ ఎక్కడా మర్చిపోలేదు. ప్రారంభంలో తెరపై సూర్యోదయాన్ని చూపి, ఆ సూర్యబింబాన్ని సినిమా టైటిల్ మధ్య అక్షరానికి పొట్టలో చుక్కగా రూపాంతరం చెందించగానే దర్శకుడి పనితీరు మీద మొదలైన కుతూహలం, సినిమా ఆసాంతమూ కొనసాగింది.
ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్ మొదలు, 'కార్మికుల కార్యక్రమం' నుంచి 'మన్ చాహే గీత్' వరకూ అనేక కార్యక్రమాలని కథకి అనుగుణంగా వాడుకున్నాడు దర్శకుడు. ఇంతేనా, "శ్రీ సూర్య నారాయణా" "పూవులేరి తేవే చెలి పోవలె కోవెలకు" లాంటి 'వెనుకటి తరం' పాటలకీ సముచిత స్థానం దొరికింది, సందర్భానుసారంగా. చిన్న కథని - అందునా పెద్దగా మెలికలూ మలుపులూ లేకుండా సాఫీగా సాగిపోయే కథని - సినిమాగా మలచడంలో కలిగే ఇబ్బంది భరణి కీ తప్పలేదు. ఫలితం, మొదటి సగం నింపాదిగా కదులుతున్నట్టు అనిపించడం, కథ చదవని వాళ్లకి సినిమా ఎటు పోతోందో అర్ధం కాక పోవడం.
కథలో కొన్ని సన్నివేశాలు సినిమాలో లేవు. మరికొన్ని సగం సగం మాత్రమే ఉన్నాయి. అలాగే, కథలో లేని సన్నివేశాలు కొన్ని సినిమాలో ఉన్నాయి. వీటిలో రెండు మూడు సన్నివేశాలు చూసినప్పుడు, "అరె... వీటిని కూడా కథలో చేర్చి ఉండాల్సిందే" అని శ్రీరమణ అనుకుని ఉంటారా అనిపించింది. చూడగానే నచ్చేసేది కెమెరా పనితనం. కొన్ని దృశ్యాలు గ్రీటింగ్ కార్డులని తలపించాయి. నేపధ్య సంగీతం మరికొంచం బాగా చేసి ఉండొచ్చు అనిపించింది. పాటలు బావున్నాయి. ఆడియో విని కించిత్ భయపడ్డ కాఫీ దండకాన్ని, భలే తెలివిగా దృశ్యీకరించారు. ముచ్చటగా అనిపించింది. అయితే పాటల ప్లేస్మెంట్ - మరీ ముఖ్యంగా రెండో సగంలో - విషయంలో కొంచం జాగ్రత్త తీసుకోవాల్సింది. రెండు పాటలూ వరుసగా వచ్చేశాయి.
కథలో అప్పదాసు ఆవుని తన పెరట్లో ఉంచడు, పచ్చని పెరడుకీ పాడి ఆవుకీ పొసగదని. ఆ ఆవు పాలు అందించే
మిష తోనే కథకుడు అప్పదాసు ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. సినిమాలో, ఆవు అప్పదాసు పెరట్లోనే ఉంటుంది, ఓ అందమైన పేరుతో. ఆ ఆవు చుట్టూ అల్లిన సన్నివేశమూ బావుంది. కథలో అప్పదాసుకి చెట్లంటే ప్రాణం. కర్వేపాకు మొదలు కంద వరకూ ఎవరి మీదా ఆధార పడనవసరం లేని విధంగా ఉంటుంది ఆయన పెరడు. అంతే కాదు, "రుణానుబంధ రూపేణా..." లో చెట్టునీ చేర్చాలి అనేంత మమకారం ఆయనది. సినిమాలోనూ పచ్చని పెరడు ఉంది. కానైతే, ఆ పెరడు మధ్యలో ఇల్లు ఉంది అనే విషయం అర్ధమయ్యేలా చిత్రీకరణ ఉంటే బావుండేది. అంతే కాదు, కేవలం కూరగాయల కోసం తోట పెంచుతున్న భావన వచ్చిందే తప్ప, అప్పదాసు అసలు తత్వాన్ని తెరమీద అందరికీ చేరేలా చూపలేదు.
శ్రీరమణ కథని పక్కన పెట్టి, భరణి కథ ప్రకారం చూసినప్పుడు బాలూ, లక్ష్మీ అప్పదాసు-బుచ్చిలక్ష్మీ పాత్రల్లో ఒప్పించారు. కొన్ని కొన్ని సన్నివేశాల్లో వారి నటన నాటకీయత వరకూ వెళ్లి, అంతలోనే వెనక్కి రావడం ప్రేక్షకుల దృష్టిని దాటిపోదు. ఇప్పటి వరకూ వాళ్ళు చేసిన సినిమాలతో పోల్చినప్పుడు చాలావరకూ 'అండర్ ప్లే' చేశారనే చెప్పాలి. భరణి కి నాటక రంగం మీద ఉన్న ప్రేమ వల్ల కావొచ్చు, నాటకీయత అయితే చాలాచోట్లే కనిపించింది - కథ నడకలోనూ, నటనలోనూ కూడా. స్క్రీన్ ప్లే విషయంలో మరికొంత జాగ్రత్త తీసుకుని ఉండాల్సింది. లోపాలని పక్కన పెడితే, వెంటాడే సినిమా ఇది. పతాక సన్నివేశం తెర మీద కనిపిస్తున్నప్పుడు, థియేటర్లో వెనుక వరుస నుంచి వెక్కిళ్ళు వినిపించాయి. కొందరి కళ్ళు, దాదాపు అందరి హృదయాలూ చెమర్చేలా సినిమా తీసిన భరణికి, నిర్మాత ఆనంద్ మొయిదా రావుకీ అభినందనలు. ఈ తరహా సినిమాలు భవిష్యత్తులో రావడం, రాకపోవడం అన్నది ఈ సినిమా విజయం మీద ఆధారపడి ఉంటుంది, కచ్చితంగా.