బుధవారం, నవంబర్ 17, 2010

గాళిదేవరు

యాజమాన్యాలు పనివాళ్ళని కష్టపెట్టడం అన్నది సహజ పరిణామంగా తీసుకుంటాం మనం. కానీ, పనివాళ్ళు తమ కొద్దిపాటి తెలివితేటలని, సమయస్పూర్తిని, యజమాని బలహీనతలనీ ఉపయోగించుకుని అతన్ని దేశం విడిచిపెట్టి పోయేలా చేయడం అన్నది వినడానికి కథలా అనిపిస్తుంది. సి. రామచంద్రరావు రాసిన 'గాళిదేవరు' కథ ఇతివృత్తం ఇదే.

కూర్గు కాఫీ తోటల పరిమళాలని, అక్కడి వాతావరణాన్ని, కాఫీ తోటల్లో పనివాళ్ళ జీవితాలనీ, యజమాని-పనివాళ్ళ మధ్య సంబంధాలనీ కళ్ళకు కట్టినట్టు వర్ణించే ఈ కథని చదవడం పూర్తిచేయగానే పఠితలు ఓ చిత్రమైన అనుభూతికి లోనవుతారు. మంగుళూరు రోడ్డులోని పోలిబేటా కాఫీ ఎస్టేటు మేనేజరు సోమయ్య. మేంగిల్స్ బ్రదర్స్ సంస్థ ఆ ఎస్టేటుకి ఒకప్పటి యజమాని. కాఫీ పంటలో లాభాలు బాగా రావడంతో పనివాళ్ళ ఇళ్ళని నివాస యోగ్యంగా మార్చాలనీ, బాత్రూములు ఏర్పాటు చేయించాలనీ తలపెడతాడు సోమయ్య.

పోలిబేటా యాజమాన్యం ఇందుకు అంగీకరించడంతో కిల్లిక్ సన్ అండ్ కంపెనీకి ఆ కాంట్రాక్టు ఇవ్వాలనుకుంటాడు. బాత్రూం ఫిట్టింగ్స్ తయారీలో పేరుపొందిన ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఏంథోనీ చిన్నప్ప యువకుడు, ఉత్సాహవంతుడు. పోలిబేటా పేరు వినగానే "గాళిదేవరు వెలిసింది మీ ఎస్టేట్ లోనే కదూ?" అని అడుగుతాడు సోమయ్యని. అంతేకాదు, 'గాళిదేవరు' ని చూడడానికి తన ఉద్యోగులని వెంట పెట్టుకుని ఎస్టేట్ కి బయలుదేరతాడు కూడా.

ఎస్టేట్ లో ముసలి కార్మికుడు మాంకూ, గాళిదేవరు గుడి బాధ్యతలు చూస్తూ ఉంటాడు. ఏటా జరిగే జాతరలో మాంకూదే హడావిడి అంతా. అప్పుడే కురిసిన వర్షానికి బురదగా ఉన్న బాట వెంట చాలాదూరం నడిచి గుడికి చేరుకుంటారు సోమయ్య, చిన్నప్ప, అతని బృందం. అతి చిన్నగా ఉన్న ఆ గుడినీ, ఆకృతి లేకుండా ఉన్న విగ్రహాన్నీ చూసి చిన్నప్ప మినహా అతని బృందమంతా నిరాశ పడతారు. గుడిని చూడడం అయ్యాక, మేంగిల్స్ దొర కట్టిన బంగాళా చూడాలంటాడు చిన్నప్ప. అతని ఉత్సాహం చూసి మేంగిల్స్ కథని వివరంగా చెబుతాడు మాంకూ.



మేంగిల్స్ బ్రదర్స్ సంస్థ ఎస్టేట్ కొన్న కొత్తలో వర్షాభావం వల్ల కాఫీ పంట దిగుబడి ఉండదు. మేంగిల్స్ దొర తన కుటుంబాన్ని తన దేశంలోనే వదిలి, తానొక్కడే ఎస్టేట్లో ఉంటూ పనులు చేయిస్తాడు. ఆ సంవత్సరం లాభాలు బాగా రావడంతో, ఎస్టేట్లోనే సకల సౌకర్యాలతో బంగళా కట్టించి తన కుటుంబాన్ని అక్కడికి తీసుకురావాలని అనుకుంటాడు మేంగిల్స్. బంగళా నిర్మాణం దాదాపు పూర్తవుతుంది. వంట ఇంటి నుంచి వచ్చే నీరు గాళిదేవరు విగ్రహం పక్కగా ప్రవహిస్తుంది కాబట్టి వంటిల్లు మరో చోటికి మార్చమని అడుగుతారు పనివాళ్ళు. గాళిదేవరు పట్ల ఎలాంటి నమ్మకం లేని మేంగిల్స్ ఇందుకు ససేమిరా అంటాడు.

అక్కడినుంచీ మేంగిల్స్ కష్టాలు మొదలవుతాయి. తాగేతాగే విస్కీ గ్లాసు మాయమవడం, భోజనం పళ్ళెంలో ఉన్నట్టుండి రాళ్ళు ప్రత్యక్షం కావడం.. ఇలా జరిగే విచిత్రాలన్నింటికీ కారణం గాళిదేవరుకి కోపం రావడమే అంటారు పనివాళ్ళు. ప్రమాదంలో తన చేయి విరగడం, తాళం వేసిన గ్యారేజీ నుంచి అర్ధ రాత్రివేళ కారు స్టార్టు చేసిన చప్పుడూ హారనూ వినిపించడం వంటి మరికొన్ని సంఘటనలు జరిగాక గాళిదేవరు మీద భయం మొదలవుతుంది మేంగిల్స్ కి.

అయినకాడికి ఎస్టేట్ అమ్ముకుని తనదేశం వెళ్ళిపోడానికి సిద్ధపడతాడు. అభిరుచితో కట్టించుకున్న ఇంటిని అలాగే వదిలి వెళ్ళడానికి మనసొప్పక శానిటరీ ఫిట్టింగ్స్ అన్నీ తనతో తీసుకుని వెళ్ళాలనుకుంటాడు. గాళిదేవరు తన మహిమలు చూపడంతో, ఆ ప్రయత్నం విరమించుకుని, ఆ ఫిట్టింగ్స్ అన్నీ నీళ్ళలో పారేయాల్సిందిగా తన బట్లర్ని ఆదేశిస్తాడు. గాళిదేవరుకి గుడి కట్టడానికి మాంకూకి డబ్బిచ్చి తన దేశానికి బయలుదేరతాడు దొర.

గాళిదేవరు మహిమల వెనుక మాంకూ పాత్ర ఎంత? బెంగుళూరులో వ్యాపారం చేసుకుంటున్నఏంథోనీ చిన్నప్పకి గాళిదేవరు గురించి ఎలా తెలిసింది? అప్పటివరకూ గాళిదేవరు తమ ఎస్టేట్ లో వెలిసినందుకు గర్వపడుతున్న సోమయ్య అసలు కథ తెలిశాక ఎలా స్పందించాడు? తదితర విషయాలన్నీ కథ చదివి తెలుసుకుంటేనే బాగుంటుంది.

నాటి, నేటి రచయితలూ, రచయిత్రుల డెబ్భై ఎనిమిది కథలతో తిరుపతికి చెందిన అధ్యాపకుడు సాకం నాగరాజు ప్రచురించిన 'తెలుగు కథకి జేజే!' సంకలనంలో ఉందీ కథ. ఇదొక్కటే కాదు సంకలనం లో ఉన్న చాలా కథలు మళ్ళీ మళ్ళీ చదివించేవే. ఆరువందల రెండు పేజీల ఈ అందమైన సంకలనం వెల మూడు వందల రూపాయలు. ఈ సంకలనాన్ని నాకు కానుకగా ఇచ్చిన ఫ్రెండ్ ని, ఆ సందర్భాన్నీ మరోమారు ఆప్యాయంగా గుర్తు చేసుకుంటూ...

4 కామెంట్‌లు:

  1. మురళిగారు ఈ తెలుగుకథకి జెజె కొనడం నేను మొన్న ఇక్కడి పుస్తకోత్సవంలో కొద్దిలో మిస్ అయ్యానండీ. నేను సెలెక్ట్ చేసి పక్కన పెట్టుకున్న పుస్తకాన్ని ఎవరో బిల్ చేయించేసరికి కాదనలేక వదిలేశాను, అదే ఆఖరుదిట వారి దగ్గర. కథ చదవాలనిపించేలా ఉంది మీ రివ్యూ... ఈ సారి గుంటూరు వెళ్ళినపుడు తీసుకుంటానీపుస్తకం.

    రిప్లయితొలగించండి
  2. @వేణూ శ్రీకాంత్: మంచి సంకలనం అండీ.. మెజారిటీ కథలు బాగున్నాయి.. కొన్ని కథలు విసిగించినప్పటికీ.. మీ దగ్గర ఉండాల్సిన పుస్తకం.. ఈసారి మిస్ కాకండి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. మంచి కథ గురించి చెప్పి ఆ కథని రాసిన వారిని గురించి చెప్పకపోతే ఎలా?

    ఈ కథ రాసింది. సి.రామచంద్రరావు. మొత్తమ్మీద ఎనిమిదో తొమ్మిదో కథలు రాశారాయన. మొదటి ఆరేడు కథలు 1955-65 మధ్యలో వచ్చాయి. వాటిలో కనీసం మూడు (వేలుపిళ్ళై, టెన్నిస్ టూర్నమెంట్, నల్లతోలు) ప్రపంచస్థాయి కథలు. ఆ కాలంలో ఆంధ్రపత్రిక వీక్లీ వస్తే, ఆయన కథ ఉందేమో అని వెతుక్కునేవారం అని ఆయన అభిమాని ఒకాయన నాకు చెప్పారు. టీ ఎస్టేట్స్‌లో మానేజర్‌గా పని చేసిన ఆయన కథల బాక్‌గ్రౌండ్ తెలుగు పాఠకులకు కొత్తగా, విలక్షణంగా ఉంటుంది. చాలా ఏళ్ళ (రెండు దశాబ్దాలు?) తర్వాత ఈమధ్యే ఆయన రాసిన కథ ఒకటి స్వాతి వారపత్రికలో ప్రచురించబడింది.
    ఒక పదేళ్ళ క్రితం కాబోలు సి.రామచంద్రరావు కథలు, బహుశా వేలుపిళ్ళై, అన్న పేరుతో కాబోలు విశాలాంధ్ర వారు ప్రచురించారు.

    అన్నట్లు మన టెన్నిస్ స్టార్ మహేష్ భూపతి ఈయన తమ్ముని కుమారుడు.

    -- జంపాల చౌదరి

    రిప్లయితొలగించండి
  4. @చౌదరి: నిజానికి నాకు రచయిత పేరు మినహా ఇతర వివరాలేమీ తెలియలేదండీ.. ప్రయత్నించినా దొరకలేదు.. వివరంగా చెప్పినందుకు కృతజ్ఞతలు.. చక్కని శైలి వీరి సొంతం, మిగిలిన కథలు చదవాలన్న కుతూహలం ఉంది. ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి