మంగళవారం, అక్టోబర్ 27, 2015

గుడి ఎనక నాసామి -2

(మొదటి భాగం తర్వాత...)

ఏటి సెయ్యటాకీ ఆలోసిన తెగట్లేదు నాకు. గాబరకి గొంతెండిపోతన్నట్టుగా ఉన్నాది. కున్నీల్లు తాగుదారనిపించేతలికి ఇయ్యాల సుక్కురోరవని గేపకవొచ్చింది. అమ్మోరమ్మకి కటికుపాసాల మొక్కు. తప్పితే ఇంకేటన్నా ఉన్నాదా?

మాయాయినికి పోన్జేత్తే పక్కన్టీవీ వోల్లున్నారని కూడా సూడకండా బూతుల్లంకించు కుంటాడు. పోనీ బిత్తిరి గాడికి సేద్దారంటే ఆన్నోట్లో నువ్వు గింజి నాన్దు. అంత కనాకట్టపు మనిసాడు. ఏదైతే, మావోడు బెల్లం కొట్టిన రాయిలాగా ఉన్నాడుగదా. పక్కనే టీవీ వోడున్నాడు. నా ఎదర టీవీ ఉన్నాది. అక్కడేటయ్యిందో ఆడు సూపింతవే తరవాయి, నాకు తెలిసి పోద్ది.

ఎడ్వడింగులయిపోయేయి గానీ టీవోడు ఇంకేయో వోర్తలు సూపింతన్నాడు. బిత్తిరిగోడు సరైనోడైతే నాకీ బాద లేకపోను. ఆన్ణాకు దూరపు సుట్టం. కొడుకొరస. ఈ సంగత్తెలిసే నేనాణ్ణి ఇంట్లోకి రానింతం మొదలెట్టేను. నన్ను సిన్నమ్మగోరూ అనీసి, బంగార్తల్లిని సెల్లెమ్మా అనీ పిలుత్తాడాడు. పెల్లికెదిగిన ఆడపిల్లని ఇంట్లో ఎట్టుకుని ఎవుణ్ణిబడితే ఆణ్ణి సనూగా తిరగనిత్తావేటి?

ఆడు డిపాటుమెంట్లో సేరిన కొత్తల్లో మాయాయిన ఆడితో ఎల్లాగుండేవోడో తెల్దుగానీ, ఏ మూర్తాన బిత్తిరిగోడు నాకు సుట్టవన్న సంగత్తెల్సిందో ఆ నాట్నించీ ఆడు మా మారాజుకి నీల్ల కన్నా పల్సనై పోయేడు. ఈయినగోర్ని అనుకోటం ఎందుకూ? ఆడూ తగ్గావోడే.

ఆర్నెల్ల కితం కామాల, ఓనాడు బిత్తిరోడు సొమ్మట్టుకొచ్చేడు. వొచ్చిన వొసూల్లో మాయాయినగోరి వోటా. ఈయనగోరిప్పుడు ఎస్సైగదా.. వోటాల పని కానిస్టీబుల్లు సూత్తారు. మాయాయిన మంచి కుసీ గా ఉంటం సూసి బిత్తిరోడికి దైర్నం సిక్కినట్టున్నాది.

"మనవిల్లాగ డబ్బుచ్చుకోటం తప్పుగాదా గురువు గారూ?" అని అడిగేసేడు. వొంటింట్లో ఉన్నాన్నేను.

"అయిపోయిందియ్యాల.. బిత్తిరోడి గూప్పగిలిపోతాదిప్పుడు" అనుకుంటన్నానో లేదో, నా పెనివిటి మొదలెట్టేడమ్మా ఉపన్యేసం. ఇనాలంతే..

"బాబొరే బిత్తిరీ.. నీ వొయిసెంతరా? నా సర్వీసంత ఉంటాదా? మీ సిన్నమ్మగోర్ని సేసుకునే నాటికి నేను కానిస్టీబు డూటీలో ఉండేవోన్ని. గవర్మెంటు అప్పుడే కొత్తగా సారా మీద ప్రొబేసనెట్టింది. అంటే ఏటన్న మాట? ఎక్కడా సారా అన్నది అమ్మరాదు. మనం ఎవరం? ప్రోబిసనోల్లం. పక్కన ఎక్సైజు కూడా ఉంటాదనుకో. మన డూటీ జెనాలకి సారా అన్నది దొరక్కండా సెయ్యటం. సెక్కింగులు, రెయిడింగులు.. అబ్బో.. పోలీసోడి కన్నా ప్రొబీసనోడే పవర్ఫుల్గుండేవోడు. ఎవడో మాటెందుకు, నాకే కొత్త పెల్లంతో కాపరం కన్నా డూటీ సెయిటంలోనే ఎక్కూ కిక్కుండేది. పేపరోల్లు గూడా సారా ఒక్కటే గాదు, అసలు మందన్నదే దొరక్కండా సేసెయ్యాలని ప్రెతి రోజూ పేజీలకి పేజీలు  రాసేవోల్లు.."  ఆలోసింతాక్కాబోలు ఆగేడు మావోడు.

బిత్తిరోడు ఇంకే ఎదవ ప్రెశ్నలూ అడక్కండా కాయమని అమ్మోరమ్మకి దండాలెట్టుకునే లోగానే, నా ప్రెత్యెక్స దైవం మల్లీ అందుకున్నాడు.

"కొన్నాల్లకా ముచ్చటా తీరింది. కంప్లీటు ప్రోబిసన్ అన్నారు. మన డిపాట్మెంటు పులైపోయింది. అబ్బబ్బ.. ఆరోజులు మల్లీ రావనుకో. కానేవయ్యింది? గవర్మెంటు మారింది. ప్రోబిసన్ మీద మాట మారిసింది. మొత్తం ప్రొబిసనన్నదే ఎత్తెయిటవే గాదు, మందమ్మటాకి టారిగెట్లేసింది. ఆ డూటీ మన డిపాట్మెంటుకపజెప్పింది. మంచీ సెడ్డా సెప్పాల్సిన పేపరోల్లేంజేసేరు? మాట మారిసేసి, గవర్మెంటు సేసిందే రైటని జై కొట్టేరు. అంటే ఏటన్న మాట? ఎవర్లాబం ఆల్లు సూసుకున్నారు. గవర్మెంటు ఏం సెబితే అది సెయ్యాల్సినోల్లం మనవనగా ఎంతరా? నీకంతగా డబ్బు సేదనుకో, నీ వోటా వొదిలేసుకో. అంతేగానొరే, ఇల్లాటి మాట్లు ఎవరి కాడా అనకు. ఉజ్జోగానికి అన్ఫిట్ అనెయ్ గల్రు. ఇప్పుణ్ణీ డూటీ ఏటన్నమాటా? మీ సిన్నమ్మగోర్నడిగి మనకో డబల్ స్ట్రాంగ్ టీ అట్టుకురా" అని పురమాయించేడు.

ఆ ముచ్చటల్లాగ తీరింది బిత్తిరిగోడికి. నాల్రోజుల్నాడు ఎస్సై గోరు ఇంట్లో లేకండా సూసి "సిన్నమ్మగారో" అంటా వొచ్చేడాడు.

"మా బతుకు మరీ కనాకట్టవై పోయిందమ్మా. ఎవురికి సెప్పుకోవాలో గూడా తెల్టంలేదు. ఇన్నాల్లూ మందు కొట్లోల్ల మీద, బార్లోల్ల మీద పెత్తనం సేసేంగదా. ఇంకా సేత్తానే ఉండాలిగూడా గదా.. గవర్మెంటిప్పుడు ఏం జేసిందో సూసేరా? మాసేతే దుకానవెట్టించి మందమ్మిత్తాదంట. ఏవంటే టారిగెట్లంట. కొట్లోల్ల కాడ మాకిలవుంటాదా? మమ్మల్నాల్లు సులకనగా సూత్తే మాకెంత కట్టంగుంటాది.." అంటా ఏడిసినంత పని సేసేడు.

మా మారాస్సెప్పినట్టుగా, ఉజ్జోగస్తుడంటే గవర్మెంటోడు ఏ డూటీ సెయ్యమంటే ఆ డూటీ సెయ్యాల్సిందే. ఏరే గచ్చంతరం లేదు.

బిత్తిరిగోడు సెప్పిందింటా వుంటే మూడోరాల్నాడు అమ్మోరమ్మతల్లి సెప్పిన మాట్లు గేపకానికొచ్చేయి. పక్కీదిలో ఒకల్లింటికొచ్చిన సుట్టాలావిడికి అమ్మోరమ్మ వొంటిమీదకొత్తాదని తెల్సి దర్సినానికెల్లేను. నా పున్యేనికి అమ్మ పలికింది.

"నువ్వు నా బక్తురాలివే.. నా బక్తుల్ని నేను కాసుకుంటానే.. అంతా మంచే జరుగుతాది నీకు.. సిన్న సిన్న సిక్కులు నీదారికడ్డం పడబోతన్నాయి.. జేగర్త.. నిన్ను కాయటాకి నేనున్నాను.. నీ జేగర్తలో నువ్వూ ఉండాల" అంజెప్పి, వొరసగా మూడు సుక్కురోరాలు ఉపాసాలు సెయ్యమని ఆజ్నేపించింది తల్లి. ఇయ్యాల మూడో వోరం. ఆయేల్నుంచీ మొదలయ్యింది బెదురు. ఏరోజేటవుతాదోనని ఒకిటే బెంగ.

అమ్మ.. ఇంచేపు కదలకండా టీవీ సూసినందుకు పలితం కనబడ్డాది. అడిగో మాయాయిన. పక్కన బిత్తిరిగోడు. గొట్టం మైకట్టుకుని టీవీ కుర్రోడు..

"ఇళ్ళ మధ్యలో మద్యం దుకాణం ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు స్మితా. పవిత్రమైన దేవాలయం వెనుక మద్యం దుకాణం నిర్వహించడాన్ని వాళ్ళంతా ప్రశ్నిస్తున్నారు. స్వయంగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ వారే ఈ షాపుని నిర్వహిస్తున్నారు స్మితా. అయితే, ఇక్కడ ఉన్న ఎక్సైజ్ ఎస్సై మాత్రం మనతో మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు. పై అధికారుల ఆదేశం మేరకే షాపుని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది.."

ఇదా ఇసయం.. తీరామోసి ఈల్ల సేత మందమ్మిత్తన్నాది అమ్మోరమ్మ గుడెనకాల. ఎప్పుడూ సూపర్నెంటు దొరగోరో, పెద్దొరగోరో కురిసీలో కూసుంటే, పేపరు పోటోలకి ఎనకొరసలో నిలబడే మాయాయిన, ఇయాల దరిజాగా కురిసీలో కూసుని కనబడ్డాడు టీవీలో. ఆడంగులంతా టీవీల్లో కనిపించేవొరుకూ అరిసేసి, బోజినాలకెల్లిపోతారు కామాల. 

మాయాయిన్ని కుంచేపు టీవీలో సూసుకుందారనుకున్నానో లేదో మల్లీ ఎడ్వడింగులు మొదలైపోయేయి. ఈ వోర్త మల్లీ సూపింతారో లేదో.

ఓయమ్మ ఏటిదీ? ఎడ్వడింగులయ్యేతలికి పుట్ల పుట్ల కింద జేరిపోయేరాడంగులు. బిత్తిరిగోడు కంగారుగా పోన్లు కలుపుతున్నాడు. మా మొగాయన టీవీవోల్లకేసి సూడకుండా పన్లో ఉన్నట్టుగా యాక్టింగు జేత్తన్నాడు.

ఆడోల్లని సూత్తాంటే నాగ్గాబర పెరిగిపోతన్నాది. అమ్మోరమ్మా.. ఉపాసంలో ఉన్నానమ్మా.. ఈ బక్తురాలిని పరిచ్చింతన్నావా తల్లే.. కూసున్న ఆడంగులు ఒక్కసారే పైకి లేసేరు.  నాకేదో కీడు తోత్తన్నాదమ్మోరమ్మా.. మాయాయిన్ని దాటుకుని కొట్లోకెల్లిపోయేరు. ఒక్కో సీసాకాయీ తీత్తన్నారు.. నేలకేసికొడతన్నారు.

యేటిది? లోపల్నించేటింత సంతోసం కలుగుతున్నాది. ఒక్కోసీసా పగుల్తా ఉంటే ఎన్నెన్నిగుర్తొత్తన్నాయి. నాన మంచోడే.. అమ్మ మంచిదే.. మందు సెడ్డది.. ఆంటీగారు మంచోలే..అంకులు గారు మంచోరే.. మందు సెడ్డది.. రావుడన్నయ్య మంచోడే.. వొరమ్మొదిని మంచిదే.. మందు సెడ్డది.. నేను మంచిదాన్నే.. మాయాయిన మంచోడే.. మందు సెడ్డది. సుట్టాలోల్లు.. తెలిసినోల్లు.. ఇంకా ఎంతమంది? ఏల కుటుంబాలా, లచ్చల కుటుంబాలా? ఎంతమంది పడ్డారు? పడతన్నారు? గవర్మెంటు ఇంకా ఇంకా తాగించమనే సెబుతాదిగానీ, వొద్దని సెప్పదు.. టారిగెట్లేత్తాది.. కొట్లేయించి అమ్మింతాది.. ఎవురూ మాటాడ్రు..

అమ్మోరమ్మ తల్లీ... ఈయాడోల్ల రూపంలో వొచ్చేవా అమ్మా.. ఇంతమంది కోసం గుడెనకాలికి  వొచ్చేవా తల్లీ.. ఆడంగుల్లారా.. కొట్టండి.. ఒక్కో సీసా కాయనీ నేలకేసి కొట్టండి.. అడ్డవొత్తే మాయాయిన్నైనా సరే కొట్టండి..

అదుగో.. బిత్తిరిగాడి పోనందుకుని పోలీసోల్లొచ్చేసేరు.. ఆడోల్లని లోపలేసేత్తారు. అయితే ఏటి.. మందునేంజెయ్యాలో అమ్మోరమ్మ సెప్పింది.. ఆడోల్లందరిసేతా సేయిత్తాది..సేయించు తల్లే.. సేయించమ్మా.. మూడు సుక్రోరాలు గాదు.. ఈ బక్తురాలు జీవితాంతం ప్రెతి సుక్రోరం కటికుపోసం సేత్తాది.. అమ్మోరమ్మ తల్లే.. దయుంచమ్మా.... కాపరాల్నిలబెట్టే సెక్తి నీకే ఉన్నాత్తల్లే.. నాకేటిది... సెలవలు కమ్ముతున్నాయి... కల్లు తిరూతున్నాయి... అ..మ్మా.. అ...మ్మో...ర...మ్మా.... 

 (అయిపోయింది)

సోమవారం, అక్టోబర్ 26, 2015

గుడి ఎనక నాసామి -1

పొద్దున్న పది కొట్టేతలికి ఒక్కసారిగా కాలీ అయిపోతాను. పిల్లలిద్దరూ సదువులికీ, ఈయనగోరు ఉజ్జోగానికీ బయలెల్లేక సందలడే వొరుకూ పెద్దగా పనేటీ వుండదు. కుంచేపు పేపరు సూసేసి, టీవీ ఎట్టుకోటవే. పేపర్లో మా డిపాటుమెంటు వోర్తోటి సిన్నదేసేరు. పొటో ఎయ్యిలేదు.

కూడబొలుక్కుని సదివి, సినిమా బొమ్మలు సూసేసి, పేపరు దాని సోట్లో ఎట్టేసి, అప్పుట్టీవీ ఎట్టేను. ఇల్లన్నాక గాలీ, ఎల్తురూ ఉండాలనేసి, ఎక్కడొస్తువులక్కడ ఎట్టుకోవాలనేసి సిన్నప్పన్నించీ మా సెడ్డ కోరిక నాకు.

సిన్నప్పుడంతా పోలీసు కోటర్సులోనే ఉండేవోల్లం. నానది కానిస్టీబులుజ్జోగం. కోటర్సు పక్కల్ని మురుగ్గుంట్లున్నాయో, మురుగ్గుంట్ల మజ్జిలో కోటర్సున్నాయో మాకే తెలిసీది కాదు. అక్కడికీ, మిగిలిన కోటర్సోల్లు లోపల బాగానే సదురుకునీవోల్లు. మాయమ్మ మాత్తరం ఇంట్లోపల కూడా మురుగ్గుంట్లాగే ఉండిచ్చేది.

నేనెప్పుడన్నా సదరడం మొదలెడితే "నీకుప్పుడు పెల్లోరొత్తన్నారంటే?" అంటా ఈపు సితక్కొట్టేది. అమ్మోరమ్మ దయిలేక ఎన్ని దెబ్బలు కాసేనో లెక్కేలేదు.

మాయమ్మకే అద్దుమాలిన కోప్మనుకుంటే, నానకి అంతకొందరెట్లు కోపం. యే రోజూ తాగి రాటవే. ఆ మడిసి రాటంతోనే మాయమ్మ గుమ్మంలోనే తగువేసుకునీది. సితక్కొట్టీసీవోడు మానాన. అయినా గానీ మాయమ్మ ఏమాత్తరం తగ్గేది కాదు. ఉన్నదున్నట్టు సెప్పుకోవాల, ఏనాడూ మా నాన నామీస్సెయ్యెత్తింది లేదు.

అయితే మాత్తరం, ఆ తగూల్సూసి నా గుండి జారిపోతా ఉండేది. అదుగో, అప్పుడు సెప్పేరు పక్కోటర్సు ఆంటీగారోల్లు.. "అమ్మోరమ్మని కొలుసుకోయే బాగ్గెవా.. ఆయమ్మ నిన్ను సల్లగా సూత్తాదీ" అని.

ఏమూర్తానా తల్లిని కొల్డం మొదలెట్టేనో, ఆరోజు మొదలుకుని సల్లగానే సూత్తన్నాది తల్లి. ఒక్కోపాలేటవుద్దో గానీ పరిచ్చింతా ఉంటాది. ఇదుగో ఉప్పుడు నా పాపిస్టి జెనమం సేతా తల్లికేం లోటు సేసేనో, పరిచ్చింతన్నాది నన్ను.

టీవీ ఎట్టేను కానీ పట్టుమని పది నిమిసాలు ఏ సేనలూ సూళ్ళేకపోతన్నాను. అసల్దీన్ని టీవీ అనగూడదంట. దీనిపేరు ఓమ్ దియేటరో ఏదోనంట. బాబిగాడు పద్దాకలా సెబుతానే ఉంటాడు. ఆడికి నేనంటే పేనం. పొద్దుగూకులా అమ్మా అమ్మా అంటా నా ఎనకే ఉంటాడు. బంగార్తల్లియయితే అచ్చుగుద్దేసినట్టు దాని బాబ్బుద్దులే. నోరు తెరిత్తే నోట్లో దాసిన బంగారం బయటడిపోతాదని బయివేమో దానికి. నేనల్లాగుండ్లేనుమరి.

మొన్నామజ్జిన దాని ప్రెండొచ్చింది. అల్లిద్దరూ పిల్లల గెదిలో కబుర్లు సెప్పుకుంటన్నారు. పిల్లల ప్రెండ్సులొచ్చినప్పుడల్లా నేన్దూరంగా ఉండి ఆల్లక్కావొల్సినయి సూత్తాను గానీ, పోలీస్జవాన్లాగా అక్కడే పాతుకుపోను. మాయమ్మతల్లితో నేను పడ్డ బాదలు ఈ జెన్మకి మర్సిపోతానా. నాకోసవనేసి ఇంటికి రావాలంటే బయపడి సచ్చేవోల్లు నా సావాసగత్తిలు.

సరే, ఆయేల బంగార్తల్లి, దాని ప్రెండు కబుర్లు సెప్పుకుంటంటే ఏడేడిగా పకోడీలేసి అట్టుకెల్లిచ్చేనిద్దరికీని. ఆయమ్మి ఓ పకోడీ నోట్లో ఏసుకుని ఏదో అన్నాది.. స్పీటన్న మాట మాత్తరం ఇనబడ్డాది. పకోడీ కారవెడతన్నాది కామాల, స్పీటడుగుతున్నాదీ పిల్ల అనుకున్నాను. అమ్మోరమ్మ దయివల్ల ప్రిజ్జిలో గులాజ్జావున్నాదన్న సంగతి టయానికి గురుతొచ్చి అట్టుకెల్లిచ్చేను. ఆలిద్దరూ ఒకల్లమొకాలొకల్లు సూసుకుని ఒకిటే నవ్వుకోటం.

ఆ పిల్లెల్లిపోయేక బంగార్తల్లినడిగేసేను. ఆయమ్మి  స్పీటడగలేదంట. నన్నే స్పీటన్నాదంట. ఈ ముక్క ముందే సెప్పొచ్చు గదా. ఉంకో రెండేల్లు పోతే సదువైపోయి ఇంజినీరుజ్జోగంలో జేరతాది బంగార్తల్లి. అక్కడా ఇలాగే సేత్తాదో ఏటోమరి.

బాబిగాడి సదువవ్వటాకింకా నాలుగైదేల్లడతాది. ఆడేమో పోలీసవుతానంటన్నాడు. ఎక్కడికి పోతాది రగతం. ఆడు పోలీసయినా నాకేటీ పేసీ లేదు గానీ, జెవానుజ్జోగం గాదు, దొరుజ్జోగం జెయ్యాల. జెవానుజ్జోగాల కతలు సిన్నప్పన్నించీ సూత్తానే ఉన్నానుగదా.

మొదన్నించీ నాకు సదువు అంతంతమాత్తరవే. ఏనాడూ నాన నా సదువు సంగజ్జూల్లేదు. పైట పేరంటకం అవుతానే సదివింది సాలన్నాది మాయమ్మ. ఆ యింట్లో గాలాడక, బయిటికెల్లేక ఎన్నెన్ని బాదలడ్డానో నాకు తెలుసు, నేను కొలిసిన అమ్మోరమ్మకి తెలుసు.

ఆ టయంలోనే ఆంటీగారోల్ల ద్వారాగా ఈయినగోరి సంమందం వొచ్చింది. ఆంటీగారు మాయమ్మకేం సెప్పేరో తెల్దు కానీ, నా పెల్లి సెయ్యాల్సిందేనని మా నానకాడ పట్టట్టి సాదించింది. కుర్రోడిది కానిస్టీబులుజ్జోగం అన్తెలగానే పేణం ఉసూరుమన్నాది.

"నిన్ను కొలిసినందుకు మల్లీ కోటర్సు కూపానికే అంపుతున్నావా అమ్మోరమ్మా" అనుకున్నాను. అంతకన్నా నేనేం సెయ్యిగల్దును? మూర్తవెట్టేసుకున్నాక ఆంటీగారోల్లు నన్నాలింటికి పిలిసి సేనా సేప్మాటాడేరు. ఈయనగోరు కానిస్టీబులే గానీ పోర్సు గాదంట. కోటర్సు ఉండవంట.

"జెవాను బతుకంటే దొరగార్ల దయా దాచ్చిన్యవే బాగ్గెవా.. దొరక్కోపవొచ్చినా బూతులు జెవానుకే. దొర్ల మద్దిన మాట తేడా వొత్తే ఆ పెతాపవూ జెవానోడి మీదే.. దొరగోరి బంగలాలో ఆడర్లీ డూటీ గానీ పడ్డాదంటే ఆల్ల పెల్లాం పిల్లలకి సాకిరీ సెయ్యాలి.. ఆల్ల తిట్లూ కాయాలి" అంటా శానా ఇవరంగా చెప్పుకొచ్చేరు.

"ఇయ్యన్నీ పడ్డ జెవానోడు మరాడి కోపం ఎవడి మీస్సూపించాలి? ఎవున్నంటే ఎవుడూరుకుంటాడు? అన్నిటికీ లోకూగా దొరికీదింట్లో పెల్లవే గదే. అయినా గీనీ, అందరు మొగోల్లొక్కలాగుండ్రనుకో.. రోడ్నడకండా కాపరం సేసుకోయే.." అంటా సెప్పి పంపేరు. నిజంజెప్పాల, మాయమ్మిందులో ఒక్క మాటా సెప్పలేదునాకు. ఆవిడిగోరికి తెలిత్తే నాకు సెప్పకుండా ఉంటాదా?

సేనల్సు మారుత్తా మొగుడూ పెల్లాల పంచాయితీ కాడాగేను. ఒకల్లమీదొకల్లు సినిమా ఏక్టరికి నేరాల్జెప్పుకుంటన్నారు. కొత్తసీర కట్టుకుని, ఏసుకున్న కొత్త మోడలు గొలుసు సేత్తో తిప్పుకుంటా ఇద్దరి మాట్లూ ఇంటన్నాదాయమ్మి.

అసుల్నన్నడీతే మొగుడూ పెల్లాలకి ఈదినడేంత గొడవలే రాకోడదు. ఒకేలొచ్చినా పెద్దల్లో ఎట్టుకుని పరిస్కారం సేసుకోవాల్తప్ప పోలీసోల్ల కాడికీ, టీవీలోల్ల కాడికీ ఎల్లకూడదు. పోలీసోల్లు డబ్బుల్తినేత్తారు, టీవీలోల్లు పరువుల్దీసేత్తారు. నా పెనివిటితో  ఏటీ పడకండానే ఇన్నాలు కాపరం జేసేనా? 

నేను కాపరానికొచ్చేతలికి రొండు గెదులిల్లు. మాయమ్మేదో కాంత సామానం ఇచ్చంపింది. ఈ మడిసి తెల్లార్లేత్తానే డూటీకెల్లిపోయేవోడు. మల్లీ ఏ అద్దరేతిరో తలుపు కొట్టేవోడు. నిజంగానే అంచేపు డూటీ సేత్తన్నాడో ఎక్కడన్నా తిరిగొత్తన్నాడో తెలిసీదికాదు. సెప్పుకోటాక్కూడా ఎవురూ ఉండేవోల్లుగాదు. మాయమ్మకి సెపితే గొడవల్దప్ప ప్రెయోజనం లేదుగదా. అమ్మోరమ్మ మీద బారవేసేను. అంతకన్నా సెయ్యగెలిగింది మాత్తరం ఏవున్నాది?

ఆ టయ్యంలో రావుడన్నయ్య, వొరమ్మొదినా ఎంత కాసేరో సెప్పలేను. ఆల్లేవీ నాకన్నదమ్ములోల్లుగాదు. ఆ మాటకొత్తే మా కులపోల్లే గాదు. అన్నయ్య మాయాయింతోబాటు పంజేత్తాడు. "ఎదవ డూటీల్సెల్లెమ్మా.. సంపేత్తన్నారనుకో.. ఆనాకొడుకులు ఏసీ గెదుల్లోనుంచి కదల్రు.. శాకిరంతా మాకూను, వోటాలేమో ఆల్లకీను.." అంటా చెప్పుకొచ్చేడు.

"మా బావకి సంపాదింతం బొత్తిగా తెల్దు సెల్లెమ్మా.. డబ్బులిచ్చేవోడు సెప్పే ఎదవ కతలన్నీ నమ్మేసి సంగోరుకి బేరం తెగ్గొట్టేత్తా వుంటాడు" అంటా మాయాయినగోరిమీద పాపం జాలడ్డాడు. మొగోల్ల కబుర్లకేట్లేగీనీ, డబ్బుల గురించి మంచీ సెడ్డా సెప్పింతల్లి మా వొరమ్మొదిని. అసలీల్లకి జీతాలెంతొత్తాయి, సంపాదనెలాగుంటాది, ఎల్లాగ దాయాలి.. ఇయ్యన్నీ ఆయమ్మే సెప్పింది. ఇయ్యాల కాంత పచ్చగా ఉన్నావంటే వొరమ్మిచ్చిన సలాలే.

తాగుడలాటు మాయాయినకీ ఉన్నాది. నానలాగా రోజూ కాదుగానీ, వోరానికోరోజో రెండ్రొలో తాగేసొత్తా ఉంటాడు. పిచ్చి కాపోతే, మిటాయి కొట్లో వుండే వోడు రుస్సూడకండా ఉంటాడా? తాగుడు గురించనే కాదు, అసలే ఇసయంలోనూ మాయాయింతో నేను గొంతెత్తి తగువాల్లేదు. తగువాట్టాకి, సాదించుకోనాకి ఏరే పద్దతులుంటాయని నెమ్మది మీద తెలకుండా ఉంటాదా?

తాగొచ్చిన్నాడు మాయాయిన గొంతిప్పనాకి లేదు. ఆడిట్టవయినంత తాగనీ.. తాగుడు సంగతి మా ఇద్దరికీ తప్ప మూడో మడిసికి తెలకూడదు. ఇదీ ఒప్పందం. ఇయ్యాల్టికీ ఇదే జరూతున్నాది. ఏమాటకామాట, ఆడు తాగొచ్చిన్రోజున నాకెంత బాదగా ఉంటాదో అమ్మోరమ్మక్కూడా తెల్దు. పుట్టింట్లో పడ్డయ్యన్నీ వొద్దన్నా గుర్తొస్తానే ఉంటాయి. ఈ మడిసి గొంతెక్కడ లెగుత్తాదో, నేనడ్డ బాదలన్నీ నా పిల్లలెక్కడ అనుబించాలో అని బయివేసేత్తా ఉంటాది. ఆడకూతుర్ని, ఏటి సెయ్యగల్ను? కానైతే, ఈ ఒక్కిసయం తప్పించి, మిగిల్నియ్యి నేను సెయ్యిగల్ను, దైర్నంగా.

అసలేనాడైతే నాకాడ డబ్బు జేగర్తున్నాదాని మాయాయినకి నమ్మకం సిక్కిందో, ఆనాడే డబ్బు పెత్తనం నాసేతికిచ్చేసేడు. వొచ్చిందాంట్లో తన కరుసులకుంచుకుని, మిగిలింది నా సేతుల్లో ఎట్టేత్తావుంటాడు. ఇల్లు సుబ్బరంగా ఉండాల.. సొమ్ములు కరుసైనా పిల్లలికి మంచి సదూల్జెప్పించాల.. ఆడపిల్లకనీసి అప్పుడో కాంతా ఇప్పుడో కాంతా బంగారం జేగర్త సెయ్యాల. మొగ నలుసుకీ ఎంతోకొంత ముట్టజెప్పాల. ఇదీ నా పద్దతి.

అమ్మోరమ్మ దయవొల్ల ఈనాటి వొరకూ అంతా బాగానే వున్నాది. అంతా సరింగా ఉంటే ఆయమ్మిని తల్టం మానెత్తాననుకున్నాదో ఏమో, మెలికెట్టేసింది మాతల్లి.

ఇదేటిదీ, టీవీలో మా పక్కీది కనిపింతన్నాది? గుడెనకాలీది. టీవీ కుర్రోడు సేతుల్తిప్పుకుంటా, గొట్టం మైకు సేతులు మార్సుకుంటా ఏటో సెప్పేత్తన్నాడు. ఆడంగులు గుంపుగా జేరి కేకలెడతన్నారు. ఓయమ్మో మాయాయిన. పక్కనే బిత్తిరిగోడు కూడా వున్నాడు. ఆడు పులుకూ పులుకూ సూత్తన్నాడుగానీ, మావోడు మాత్తరం సెక్కుసెదర్లేదు.

ఏమాటకామాట, మిన్నిరిగి మీదడ్డా సెలించడు మా మొగ పురుసుడు. సౌండెడితే తప్ప ఇసియవేటో తెల్దు. అమ్మోరమ్మ తల్లే.. ఏ ఉపద్దరవం తెత్తన్నావమ్మా.. సీ.. ఈ టీవీలోల్లకి ఏలా పాలా లేదు.. సౌండెట్టీలోగా వోర్తలాపేసి ఎడ్వడింగులు మొదలెట్టేసేరు.. కాంచేపాగాలా ఉప్పుడు?

(చిన్న బ్రేక్...)

శనివారం, అక్టోబర్ 24, 2015

కంచె

"ప్రియమైన సీత గారికి, ధూపాటి హరిబాబు వ్రాయునది..." ఏమిటిది? ఓ కుర్రాడు తన స్నేహితురాలికి రాస్తున్న ఉత్తరమా లేక ప్రియుడు ప్రేయసికి రాస్తున్న ప్రేమలేఖా? ఇంతకుమించి ఆలోచన ముందుకు వెళ్ళదు. వెళ్తే ఎలా ఉంటుంది అన్న ప్రశ్నకి సమాధానం 'కంచె' సినిమా. నూట ఇరవై ఐదు నిమిషాల స్క్రీన్ టైం లో ఏ ఒక్క నిమిషాన్నీ వృధా చేయకుండా, ఒక్క క్షణం కూడా ప్రేక్షకులకి తల పక్కకి తిప్పే అవకాశం ఇవ్వని విధంగా, అత్యంత పగడ్బందీగా క్రిష్ తీసిన సినిమా ఇది.

'గమ్యం,' 'వేదం' చూసిన తర్వాత క్రిష్ మీద పెరిగిన అంచనాలు ఒక పక్కా, షూటింగ్ దశ నుంచీ పోస్ట్-ప్రొడక్షన్ వరకూ సినిమా తాలూకు వివరాలన్నీ తెలుస్తూ ఉండడం మరో పక్కా 'కంచె' మీద ఆసక్తిని పెంచాయి. మొదటి రోజే వినిపించిన 'సినిమా బాగుంది' అన్న టాక్ సంతోషం కలిగించినా, చూడ్డానికి మాత్రం రెండు రోజులు ఆగాల్సి వచ్చింది. కంటికి ఇంపైన కెమెరా పనితనం, సన్నివేశాలకి సరిగ్గా సరిపోయే సంగీతం, అక్కడక్కడా 'కాస్త నాటకీయత' వినిపించినా గుర్తుండిపోయే సంభాషణలు,  అన్నింటినీ మించి పాత్రల పరిధుల మేరకు మాత్రమే నటించిన నటీనటులు... 'కంచె' కథతో పాటుగా గుర్తొచ్చేవివన్నీ.

రెండో ప్రపంచ యుద్ధ కాలంనాటి ఒక ఊరి కథనీ, యుద్ధంలో పాల్గొన్న ఒక బెటాలియన్ కథనీ కలిపి అల్లిన కథ 'కంచె.' రెండు కథలనీ సమాంతరంగా నడపడమే కాదు, ఒక్కో భాగాన్నీ సరిగ్గా ఎక్కడ ఆపాలో అక్కడే ఆపి, రెండో కథలో భాగాన్ని సరిగ్గా అతికే విధంగా జతచేసి చివరివరకూ ప్రేక్షకుల ఆసక్తి సడలని విధంగా కథనాన్ని నడపడం - స్క్రీన్ ప్లే - ఇది మొదటి విజయం. 'గమ్యం' తర్వాత క్రిష్ మెరిపించిన స్క్రీన్ ప్లే 'కంచె' దనే చెప్పాలి. పాత్రలకి తగ్గట్టుగా నటీనటుల్ని ఎంచుకోవడం (వీళ్ళు తప్ప మరొకరు సరిపోరు అనిపించే విధంగా) వాళ్ళ నుంచి కథకి కావలసినంత మాత్రమే నటనని రాబట్టుకోడం (గొల్లపూడి చేత కూడా అండర్ ప్లే చేయించడం!!) క్రిష్ రెండో విజయం.


యుద్ధ కథని పండితపామర జనరంజకంగా చెప్పాలంటే సరైన సంభాషణలు అత్యవసరం. ప్రేమకథ తో తనని తాను నిరూపించుకున్న సాయి మాధవ్ బుర్రా తక్కువ మాటల్లో ఎక్కువ కథని చెప్పారు. (రెండు మూడు సన్నివేశాల్లో 'డైలాగులు మరి కొంచం సటిల్ గా ఉంటే బాగుండు' అనిపించిన మాట నిజం) హీరో మిత్రుడి చేత కోట్ చేయించిన 'శ్రీనివాసరావు' కవితా పంక్తుల్ని శ్రీనివాసరావు ఎవరో తెలియని వాళ్ళు బాగా ఆస్వాదిస్తే, తెలిసినవాళ్ళు 'ఈ కథా కాలం నాటికి ఈ కవిత వెలుగు చూసిందా?' లాంటి సందిగ్దావస్థ లోకి వెళ్ళారు (స్వానుభవం!).

పీరియడ్ మూవీ కి ప్రాణం సంగీతం. చిరంతన్ భట్ తనకప్పగించిన పనికి పూర్తి న్యాయం చేశాడు. సన్నివేశాలకి తగ్గట్టుగా నేపధ్య సంగీతాన్ని, నిశ్శబ్దాన్నీ అందించాడు. జ్ఞానశేఖర్ కెమెరా, సూరజ్ ఎడిటింగ్ లని గురించి ప్రస్తావించకపోతే ఎలా? ఒక్కమాటలో చెప్పాలంటే, కెమెరా కంటికి ఇంపుగానూ, ఎడిటింగ్ సమతూకంగానూ ఉన్నాయి. వర్గ వైరుధ్యాలు కథా వస్తువయినప్పుడు ఏదో ఒక వర్గాన్ని ఎంతోకొంత నొప్పించక తప్పదు. కానైతే క్రిష్ 'నొప్పించక తానొవ్వక' పద్ధతిలో కథ నడుపుకుని వచ్చేశాడు. "నేను కమర్షియల్ దర్శకుణ్ణి మొర్రో" అని ఊరికే అంటున్నాడా మరి!

మెగా ఫామిలీ కుర్రాడు వరుణ్ తేజ్ హరిబాబు పాత్రలో మెప్పించగా, స్నేహితుడి పాత్రలో అవసరాల శ్రీనివాస్ కొన్ని సన్నివేశాల్లో పోటీ పడ్డాడు. వరుణ్ ముఖం లో ప్లస్ పాయింట్ (కళ్ళు) ని కెమెరా బాగా కేప్చర్ చేసింది. కథానాయిక సీతగా వేసిన ప్రగ్యా జైస్వాల్ కి నటించేందుకు అవకాశం ఉన్న పాత్ర. పోస్ట్-ప్రొడక్షన్ టైంలో మిత్రులొకరు 'హీరోయిన్ కి చేయడానికి పెద్దగా ఏమీ లేదు.. హీరో సెంట్రిక్ మూవీ' అని చెప్పడంతో పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్లాను. ప్రాధాన్యత ఉన్న పాత్రకి ఆ అమ్మాయి న్యాయం చేసింది. డిజైనర్ చీరలకి బదులుగా, ఏంటిక్ లుక్ ఉండే చీరలు కడితే మరింత బాగుండేది.

చిత్రీకరణ విషయంలో తీసుకున్న జాగ్రత్తలు అడుగడుగునా తెరమీద కనిపించాయి. ముఖ్యంగా డెబ్భై ఎనభై ఏళ్ళ నాటి గ్రామీణ వాతావరణ చిత్రణ, కరెంట్ తీగలు కూడా కనిపించని ఊరు, పాత్రల ఆహార్యం, పీరియడ్ ని గుర్తుచేసేవిధంగా సంభాషణలు ఇవన్నీ చిత్ర బృందం తీసుకున్న జాగ్రత్తని చెప్పకనే చెబుతాయి. సింగీతం శ్రీనివాస రావు, షావుకారు జానకి చిన్న పాత్రల్లో మెరిశారు. హీరో తల్లి పాత్ర ఎవరన్నా సీనియర్ నటి చేత చేయించి ఉంటే బాగుండేది అనిపించింది. మొత్తంగా చూసినప్పుడు మెచ్చవలసిన ప్రయత్నం. వైవిధ్య భరితమైన సినిమాలు ఇష్టపడే వాళ్ళు మిస్ కాకూడని సినిమా ఇది.

సోమవారం, అక్టోబర్ 19, 2015

మంజుల నుంచి నీహారిక వరకూ ...

పాతికేళ్ళ క్రితం ఓ ప్రముఖ తెలుగు సినీ కథా నాయకుడి కుమార్తె వెండితెర నాయికగా పరిచయం కాబోతోందన్న వార్త పత్రికల్లో వచ్చింది. ఆ మర్నాటి నుంచీ ఆ హీరో అభిమానులు ఆ అమ్మాయిని సినిమాల్లోకి రావద్దంటూ బహిరంగ ప్రకటనలు చేయడంతో పాటు, అభిమాన హీరోని కలిసి ఒత్తిడి తెచ్చారు కూడా. ఈ అభిమానులే ఆ కథానాయకుడి కొడుకులిద్దరినీ హీరోలుగా ఆదరించారు. వాళ్ళలో చిన్నవాడు ఇప్పుడు తెలుగు టాప్ హీరోల్లో ఒకడైన మహేష్ బాబు. ఆ అమ్మాయి పేరు మంజుల.

నటి కావాలన్న మంజుల కోరిక కేవలం తన తండ్రి అభిమానుల కారణంగా తీరకుండా పోయింది. ఒకటి రెండు పరభాషా చిత్రాల్లో ప్రత్యేక అతిధి పాత్రల్లో నటించిన మంజుల, 2002 లో తను నటించి, నిర్మించిన తెలుగు సినిమా 'షో' తాలూకు వివరాలని సినిమా విడుదల ముందు వరకూ అత్యంత రహస్యంగా ఉంచాల్సి వచ్చింది. ఆ సినిమా రొటీన్ కి భిన్నమైనది కావడం, ఆమెపాత్ర హీరోతో ఆడిపాడే రొటీన్ కథానాయిక పాత్ర కాకపోవడం వల్ల ఆమె తండ్రి 'నటశేఖర' కృష్ణ అభిమానులు 'షో' ని ఆదరించారు. వెండితెర మీద కథానాయికగా వెలుగొందాలనుకున్న మంజుల, తన తండ్రి అభిమానుల కారణంగా ఆ ప్రయత్నం మానుకుని నిర్మాతగా స్థిరపడింది.


పాతికేళ్ళు గడిచాయి. ఈ మధ్యలో అక్కినేని నాగేశ్వరరావు కుటుంబం నుంచి ఆయన మనవరాలు సుప్రియ ఒకే ఒక్క సినిమాలో కథానాయికగా నటించింది తప్పిస్తే, ప్రఖ్యాత సినీ కుటుంబాల్లో స్త్రీలెవరూ వెండితెర మీదకి రాలేదు. ఇన్నేళ్ళ తర్వాత, ఒకప్పుడు మంజులకి ఎదురైన సమస్యే ఇప్పుడు నీహారిక ఎదుర్కొంటోంది. 'మెగాస్టార్' చిరంజీవి సోదరుడు 'లాఫింగ్ స్టార్' నాగబాబు కుమార్తె నీహారిక. ఇప్పటికే టీవీ షోలకి వ్యాఖ్యాతగా జనానికి పరిచయం అయ్యింది. మరో అడుగు ముందుకు వేసి సినిమాల్లో కథా నాయికగా నటించాలని నిర్ణయించుకుంది నీహారిక. తండ్రి ప్రోత్సహించాడు. దర్శక నిర్మాతలు ముందుకి వచ్చారు. కానీ, అభిమానులు అభ్యంతరం చెబుతున్నారు.

"నీహారికని మేము సోదరిగానో, కూతురిగానో చూస్తాం.. ఆమెని కథానాయికగా పరిచయం చేయడం మాకు అభ్యంతరం," అంటున్నారట చిరంజీవి అభిమానులు. నీహారిక చేయబోయే సినిమా దర్శక నిర్మాతలకి కొందరు అభిమానులనుంచి బెదిరింపులు వచ్చాయనీ, అయినప్పటికీ వెనక్కి తగ్గనవరసం లేదని వాళ్లకి నాగబాబు హామీ ఇస్తున్నారనీ ఆంగ్ల దినపత్రిక 'ది హిందూ' రాసింది. తండ్రి, సోదరుడు వరుణ్ తేజ్ మినహా మిగిలిన కుటుంబ సభ్యులనుంచి నీహారికకి ప్రోత్సాహం లేదన్నది ఆ పత్రిక కథనం. అభిమానుల ఒత్తిళ్ళని నాగబాబు కుటుంబం ఏమాత్రం పట్టించుకోడవం లేదనీ, నీహారిక కథానాయికగా పరిచయం కావడం ఖాయమనీ తెలుస్తోంది.

రెండు ఉదంతాలనీ 'ఆడపిల్ల మీద వివక్ష' కోణం నుంచి కన్నా, 'తెలుగు చిత్ర పరిశ్రమలో కథానాయిక స్థానం' అన్న కోణం నుంచి చూడడమే సముచితం. పాతికేళ్ళ క్రితంతో పోల్చుకుంటే ఇప్పుడు కథానాయిక స్థాయి పెరగక పోగా మరింత దిగజారిందన్నది వాస్తవం. హీరోలిప్పుడు తెరమీద నాయికని 'ఏమే.. ఒసే..' అని పిలుస్తున్నారు. ఇలాంటి సంభాషణలు రాస్తున్న రచయితలేమో కాపురాలు బాగుచేసే టీవీ పంచాయితీల్లో పెద్దమనుషుల పాత్ర పోషిస్తున్నారు. మెజారిటీ సినిమాల్లో కథలో నాయిక పాత్ర ప్రాధాన్యం మొదలు, చిత్రీకరణలో ఔచిత్యం వరకూ తిరోగమన దిశలోనే ఉన్నాయిప్పుడు.


తిలాపాపం తలా పిడికెడు అన్నట్టు, నాయికల ప్రాధాన్యత పాటలకే పరిమితం అవ్వడానికి కారకుల్లో కథానాయకులూ ఉన్నారన్నది బహిరంగ రహస్యమే. హీరో పాత్రని ఎలివేట్ చేసే క్రమంలో మిగిలిన పాత్రల ప్రాధాన్యత తగ్గుతూ వచ్చి, చివరికి హీరో పాత్రలు కూడా నేలవిడిచి సాము చేసే స్థితి వచ్చేసింది. ఈ క్రమంలో, ఇప్పటి హీరోయిన్లు ఒకనాటి వ్యాంపుల స్థానాన్ని భర్తీ చేస్తున్నారు తప్ప, అంతకు మించి వాళ్లకి చేసేందుకు ఏమీ ఉండడంలేదు. అందుకే కావొచ్చు, అభిమానులు తమ హీరోల కుమారులు తెరమీద చేసే అద్భుతాలకి జేజేలు పలుకుతున్నారు. కూతుళ్ళు నాయికలుగా వస్తామంటే, వాళ్ళని వ్యాంపులుగా చూడలేమని తిరస్కరిస్తున్నారు.

నూటికి తొంభైకి పైగా సినిమాల్లో నాయికని వ్యాంపుగా చిత్రించి, ఏడాదికో రెండేళ్ళకో ఓ సారి బాక్సాఫీసుని కొల్లగొట్టే ఒకటీ అరా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలని ఉదాహరణగా చూపించి తెలుగు తెరపై నాయికలు పూజలందుకుంటున్నారు అనడం ఆత్మవంచన తప్ప మరొకటి కాదు. నాయిక విలువని హీరోయిన్లకి చెల్లించే పారితోషికాలతో కాక, సినిమా కథలో వాళ్ళకున్న ప్రాధాన్యతతో కొలవడం అత్యవసరం. కథానాయికలంటే కేవలం షో పీస్ లు కాదన్న భావన ప్రేక్షకుల్లో వచ్చిన రోజున, మంజుల, నీహరికలకి ఎదురైన వ్యతిరేకతలాంటివి మున్ముందు కాలంలో మరో నాయికకి ఎదురుకాకుండా ఆగే అవకాశం ఉంది. కానీ, ఆలోచించగలిగే ఓపికా, తీరికా ఎందరికి ఉన్నాయి?

శుక్రవారం, అక్టోబర్ 16, 2015

రుద్రమదేవి

కాలేజీ పిల్లల్ని గుంపులుగా చూసినప్పుడల్లా 'వీళ్ళలో చాలామందికి చరిత్ర తెలీదు కదా.. తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా లేదు కదా' అనిపిస్తూ ఉంటుంది. చరిత్ర తెలుసుకోక పోవడం వల్ల వాళ్లకి కలిగే నష్టం ఏమీ ఉండదు.. కేంపస్ ప్లేస్మెంట్లలో చరిత్ర గురించి ప్రశ్నలు ఉండవు కాబట్టి. "సోషల్ సైన్సెస్ వేస్టు, కంప్యూటర్ కోర్సులే ముద్దు" అని ఏలినవారే స్వయంగా చెప్పాక, పిల్లల్ని అనుకోవడం ఎందుకు? గడిచిన వారం రోజులుగా "రానా భలేగా చేశాడు.. అల్లు అర్జున్ అదుర్స్" తో పాటు "రుద్రమదేవిని నిజంగానే మగ పిల్లాడిలా పెంచారా?" అన్న ప్రశ్న అక్కడక్కడా కుర్రాళ్ళ నుంచి వినబడుతోంది. ఈ ఆసక్తికి కారణం గతవారం విడుదలైన 'రుద్రమదేవి' సినిమా.

పిల్లలకి చరిత్రని గురించి ఆసక్తిని పెంచే ఒక్కో మార్గమూ మూసుకుపోతున్న తరుణంలో శక్తివంతమైన సినిమా మాధ్యమం ఉపయోగించుకుని తనదైన శైలిలో ఓ ప్రయత్నం చేసిన దర్శక నిర్మాత గుణశేఖర్ కి ముందుగా అభినందనలు. కాకతీయుల చరిత్రని, మరీ ముఖ్యంగా రుద్రమదేవి చరిత్రని సినిమాటిక్ లిబర్టీ సహితంగా జనం ముందు పెట్టాడు గుణశేఖర్. నాయిక ప్రధానమైన భారీ బడ్జెట్ సినిమాని నిర్మించడానికి ఏ నిర్మాతా ముందుకు రాకపోతే, నిర్మాణ బాధ్యతల్ని సైతం తనే తలకెత్తుకున్నాడు. అడివి బాపిరాజు రాసిన 'గోన గన్నారెడ్డి' తో సహా, కాకతీయుల చరిత్రకి సంబంధించి ఎన్నో పుస్తకాలు చదివి స్క్రిప్టు రాసుకున్నాడు.

పుత్ర సంతానం లేని గణపతి దేవ చక్రవర్తి తన ప్రధమ పుత్రిక రుద్రమదేవి ని 'రుద్రదేవుడు' అనే పేరుతో రాజ్య ప్రజలకి పరిచయం చేసి, మగపిల్లాడిగానే పెంచి పట్టాభిషేకం చేయడం, శత్రురాజుల్నీ, ఎదురు తిరిగిన సామంతులనీ దనుమాడి కాకతీయ సామ్రాజ్యాన్ని రుద్రమ సుస్థిరం చేయడం అన్నది స్థూలంగా చరిత్ర. ఈ కృషిలో రుద్రమకి అండదండలు అందించిన వారు మంత్రి శివదేవయ్య దేశికులు, గజదొంగ గోనగన్నారెడ్డి. ఈ కథని నేరుగా చెప్పకుండా, ఇటలీ నుంచి ఆరంభించడం, విదేశీయుల చేత రుద్రమకి జేజేలు పలికించడం తెలివైన ఎత్తుగడ. రుద్రమ జననంతో ఆరంభమయ్యే ఫ్లాష్ బ్యాక్, శత్రురాజు, సామంతులపై ఆమె విజయంతో ముగుస్తుంది. అటుపై శుభం కార్డుకి బదులుగా 'ప్రతాప రుద్రుడు' కార్డు తెరపై ప్రత్యక్షమై, ప్రేక్షకులని హాలు ఖాళీ చేయమంటుంది.

కాకతీయ వీరనారి రుద్రమలో ఉన్న 'హీరోయిజం' ని తెరమీదకి అనువదించడంమీద దర్శకుడు పూర్తి స్థాయిలో శ్రద్ధ పెట్టలేదనిపించింది. సినిమా పూర్తయ్యాక 'ఇంతకీ రుద్రమ ఏమేం చేసింది?' అన్న ప్రశ్నకి మరికొంచం గట్టి జవాబు వచ్చే వీలుంది. కానైతే, వచ్చే జవాబు ఏమంత సంతృప్తిగా అనిపించదు. కొన్ని సన్నివేశాల నిడివి తగ్గించి, మరికొన్నింటిని వాయిస్ ఓవర్ తో సరిపెట్టి, రుద్రమ మీద సన్నివేశాలని ఫోకస్ చేసి ఉంటే ఈ అసంతృప్తి ఉండేది కాదు. 'నదీ ప్రవాహాన్ని ఆపడం' అనే ముఖ్యమైన విషయాన్ని క్లుప్తంగా తేల్చేయడం, ప్రాకారాల నిర్మాణాన్ని మాటలతోనే పూర్తి చేసేయడం (ఈ సినిమా వరకూ ఈ ప్రాకారాలు రుద్రమ ప్రధాన విజయాల్లో ఒకటి) నిరాశ కలిగించే అంశాలు.


కాకతీయ సామ్రాజ్యం కథలో పాలకులకే తప్ప ప్రజలకి భాగం ఉన్నట్టు కనిపించలేదు. మహా సభలో అనుకూల, ప్రతికూల నినాదాలు చేసే ప్రజలు మాత్రమే కనిపిస్తారు. 'కాకతీయుల కాలంలో ప్రజా జీవితం' అన్న విషయాన్ని ఈసినిమా స్క్రిప్టు పూర్తిగా విస్మరించింది. ఆహార వ్యవహారాలు, కళా సంస్కృతులు ఇవేవీ కనిపించవు. అంతఃపురాన్ని దాటి కెమెరా బయటికి వచ్చిందే తక్కువ. చరిత్రలో కాకతీయ శిల్పానికి ప్రత్యేక స్థానం ఉంది. ఒక్క ఆలయ నిర్మాణమూ తెరకెక్కలేదు. వీరశైవ మతావలంబకులైన కాకతీయుల కాలంలోనే 'పేరిణి' తాండవ నృత్యం బహుళ ప్రచారంలోకి వచ్చిందంటారు. ఒక్క ఫ్రేములో కూడా ఆ నాట్యం కనిపించలేదు.

రాకుమార్తె అన్నాంబిక (సినిమాలో అనామిక)ని వ్యాంపు లా చిత్రించడం, ముమ్ముడమ్మ (సినిమాలో ముక్తాంబ) ని పాత్రౌచిత్యానికి తగని విధంగా 'బబ్లీ' గా చూపించడాన్ని పరిహరించి ఉంటే బాగుండుననిపించింది.  నటీనటుల విషయానికి వస్తే, గణపతి దేవుడిగా కృష్ణంరాజు కేవలం విగ్రహ పుష్టిగా మిగిలిపోయాడు. నటించడానికి అవకాశం ఉన్న సన్నివేశాల్లోకూడా నిర్లిప్తంగా ఎందుకుండి పోయాడో అర్ధం కాదు. శివదేవయ్యగా ప్రకాష్ రాజ్ తెలుగు వినడానికి చాలా చాలా కష్టపడాల్సి వచ్చింది. 'శ' ని 'ష' అని పలికే ప్రకాష్ రాజ్ డైలాగుల నిండా అనేకానేక 'శ' లు ఉండడంతో అవి వినడానికి ఎంత సహనమూ సరిపోలేదు. ఒకానొక దశలో 'ఈ పాత్రకి వేరే ఎవరిచేతన్నా డబ్బింగ్ చెప్పిస్తే బాగుండేది' అనిపించింది.

రుద్రదేవుడు, రుద్రమదేవి పాత్రలని న్యాయం చేసే నటి ప్రస్తుత జనరేషన్లో అనుష్క ఒక్కర్తే. రెండు పాత్రలకీ న్యాయం చేసిన అనుష్క, రాచకన్య దుస్తుల్లో బాగా ఒళ్ళు చేసినట్టుగా కనిపించింది. కెమెరా లోపమో ఏమో తెలీదు. చాళుక్య వీరభద్రుడి పాత్రని రానా, గోన గన్నారెడ్డి పాత్రని అల్లు అర్జున్ అలవోకగా చేసేశారు. అల్లువారబ్బాయి ఇమేజిని దృష్టిలో పెట్టుకుని, గోన గన్నారెడ్డి పాత్రకి హీరోయిజాన్ని రెండింతలు చేశారు. ఈ రాయలసీమ రాకుమారుణ్ణి తెలంగాణా ఖాతాలోకి పంపడం వెనుక ఏదో అంతరార్ధం ఉండే ఉంటుంది. సాంకేతికంగా ఏమాత్రం బాగోనిది సంగీతం. ఇళయరాజా సంగీతం అంటే అస్సలు నమ్మబుద్ధి కావడంలేదు.

రుద్రమకి తను ఆడపిల్లని అని తెలిసే సన్నివేశం, అదే విషయం ముక్తాంబకి తెలుసునని రుద్రమకి తెలియడం.. చప్పట్లు కొట్టించే సన్నివేశాలు ఈ రెండూ. వీటితో పాటు మరో రెండు మూడు సన్నివేశాలు 'భలే' అనిపిస్తాయి. యుద్ధ సన్నివేశాలు చూస్తున్నంత సేపూ మంచి నేపధ్య సంగీతం జతకూడితే ఇంకెంత బాగుండేదో కదా అని మరీ మరీ అనిపించింది. భారీ బడ్జెట్ నీ, కంప్యూటర్ గ్రాఫిక్స్ నీ ఏ చందమామ కథ చెప్పడానికో కాక చరిత్రని చెప్పడానికి ఉపయోగించుకున్న గుణశేఖర్, చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుని ఉంటే మరింత గొప్ప చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకి ఇచ్చినవాడై ఉండేవాడు. అలాగని, గుణశేఖర్ కృషిని తక్కువ చేయడానికి లేదు. ఎవరు చేయగలిగారు ఇన్నాళ్ళుగా? హౌస్ ఫుల్ అయిన థియేటర్ లో అన్ని వయసుల వాళ్ళూ ఉండడం, యువత ఎక్కువగా ఉండడం సంతోషంగా అనిపించింది.

చివరగా ఓ చిన్న పిడకల వేట: అతిథి పాత్రలతో కలిపి చిరంజీవి ఇప్పటివరకూ 149 సినిమాలు చేశాడనీ, రాబోయేది నూట యాభయ్యో సినిమా అవుతుందనీ, అది బ్రహ్మాండం బద్దలు కొడుతుందనీ బాగా ప్రచారం జరుగుతోంది. నిజానికి, 'రుద్రమదేవి' లో చిరంజీవి తెరమీద కనిపించలేదన్న మాటే కానీ, సినిమా ఆసాంతమూ 'వాయిస్ ఓవర్' రూపంలో స్వరం వినిపిస్తూనే ఉంది. ఈ వాయిస్ ఓవర్ అతిథి పాత్ర పాటి చేయదా? 'రుద్రమదేవి' నే చిరంజీవి నూట యాభయ్యో సినిమాగా లెక్కేయడానికి అభ్యంతరం ఏవిటో అర్ధం కావడం లేదు నాకు.

ఆదివారం, అక్టోబర్ 04, 2015

'పూర్ణోదయా' నాగేశ్వర రావు

కాకినాడ సాల్ట్ ఇనస్పెక్టర్ గారబ్బాయి.. పీఆర్ కాలేజీగా పిలవబడే పిఠాపురం రాజా కాలేజీలో చదువుకునే రోజుల్లో నాటకాల సరదా మొదలయ్యింది. కాకినాడ అంటేనే కళలకి కాణాచి. ఇక నాటకరంగం సంగతి చెప్పక్కర్లేదు. ఈ కుర్రాడికి ఇద్దరు ప్రాణ స్నేహితులు. ఒకతని పేరు వీరమాచనేని రాజేంద్రప్రసాద్.. మరొకతను హరనాథ రాజు. ముగ్గురూ కలిసి కాలేజీలో నాటకాలు ఆడారు. అబ్బే, కాలేజీలో ఏడాదికి ఒకటో, రెండో నాటకాలు అంతే. పైగా, ఓల్డ్ స్టూడెంట్స్ కి నాటకాలు వేసే అవకాశం లేదు. 'నాటకాలని వదిలేయాల్సిందేనా?' అన్న ప్రశ్న. జవాబు 'అవును' అయితే, తర్వాతి కథ వేరేగా ఉండేదేమో బహుశా. 

పీఆర్ కాలేజీలో చదువు పూర్తవుతూనే బళ్ళారి రాఘవని స్మరించుకుంటూ 'రాఘవ కళా సమితి' ఆరంభించారు. సాంఘిక నాటకాలకి దశ తిరిగిన కాలం. ఆచార్య ఆత్రేయ చేయితిరిగిన నాటక రచయితగా వెలుగొందుతున్న రోజులు. సినిమా పరిశ్రమకి అంజలీదేవి, ఆదినారాయణ రావు, రేలంగి, రావు గోపాలరావు లాంటి మహా మహులని అందించిన ది యంగ్మెన్స్ హేపీ క్లబ్ ఉన్నది కాకినాడలోనే. అయినప్పటికీ, రాఘవ కళా సమితి అతి తక్కువకాలంలోనే తనకంటూ పేరు తెచ్చుకుంది. ఇంతలో రాజేంద్ర ప్రసాద్ నిర్మాతగా నిలదొక్కుకునే ప్రయత్నాలు, హరనాథ రాజు హీరో చాన్సుల కోసం మద్రాసు బయల్దేరారు. మిత్రుణ్ణి మర్చిపోలేదు.

తను తీసిన మొదటి సినిమా 'ఆరాధన' లో కాలేజీ మిత్రుడి చేత వేషం వేయించారు రాజేంద్ర ప్రసాద్. అటు పైని కూడా నటుడిగా అవకాశాలు అడపా దడపా వస్తూనే ఉన్నాయి. అయితే అవేవీ పెద్దగా గుర్తింపు రాడానికి అవకాశం ఉన్న పాత్రలు కాదు. వేషాలు వేస్తున్న కాలంలోనే అంతకు మించి ఏదన్నా చేయాలన్న ఆలోచన వచ్చింది. 'పూర్ణోదయా మూవీ క్రియేషన్స్' పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభించి, పక్కూరి అమ్మాయి జయప్రద కథానాయికగా, అప్పటికే స్నేహితుడైన కె. విశ్వనాధ్ దర్శకత్వంలో 'సిరి సిరి మువ్వ' సినిమా తీసి 1978 లో సినిమా నిర్మాత అయ్యారు ఏడిద నాగేశ్వర రావు.


అటు తర్వాతి పద్నాలుగేళ్ళ కాలంలో కేవలం పది సినిమాలు (మాత్రమే) నిర్మించి, అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకోడమే కాకుండా, తనకూ, తన సంస్థకూ తెలుగు సినిమా చరిత్రలో ఓ పేజీని కేటాయింపజేసుకున్నారు నాగేశ్వర రావు. తెలుగు సినిమా నలుపు తెలుపుల నుంచి రంగుల్లోకి మారిన తర్వాత వచ్చిన మొదటి పది కళాత్మక సినిమాల జాబితా వేస్తే, అందులో 'పూర్ణోదయా' వారి సినిమా లేకపోతే ఆ జాబితా అసంపూర్ణం. ఖండాంతరాల్లో ఖ్యాతి తెచ్చిన 'శంకరాభరణం' వ్యాపార పరంగా నిర్మాతకి లాభాలు తేకపోవడం సినిమా పరిశ్రమలో మాత్రమే సాధ్యమయ్యే ఒకానొక వైచిత్రి.

కుమారుడు ఏడిద శ్రీరాంని కథానాయకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన 'స్వరకల్పన' బాగా ఆడదు అని తెలిసీ విడుదల చేశానని మరో నిర్మాత అయితే చెప్పేవారు కాదేమో. డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న పక్కూరు పసలపూడి కుర్రాడు పాతికేళ్ళ వంశీ కి దర్శకుడిగా అవకాశం ఇస్తూ తారల్ని కాక కథని నమ్మి 'సితార' నిర్మించడం నాగేశ్వరరావు అభిరుచికీ, ధైర్యానికీ కూడా నిదర్శనం. ఏడిద నాగేశ్వర రావు నిర్మించిన పది సినిమాల్లోనూ ఆరు సినిమాలకి - సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, స్వయంకృషి, ఆపద్భాందవుడు - దర్శకుడు కె. విశ్వనాధ్. ఈయన పేరుకి ముందు 'కళా తపస్వి' వచ్చి చేరడంలో 'పూర్ణోదయా' ది కీలకపాత్ర.

కొందరు నిర్మాతలు మారుతున్న కాలానికి అనుగుణంగా తమని తాము మార్చుకోడానికి కాంప్రమైజ్ అవ్వగలరు. అలా అవ్వడానికి సిద్ధ పడకుండా, సినిమా నిర్మాణానికే దూరం జరిగిన కొద్దిమంది నిర్మాతల్లో నాగేశ్వర రావు ఒకరు. 'ఆపద్భాందవుడు' తరువాత మరి సినిమాలు నిర్మించలేదు. అలాగని సినిమా పరిశ్రమకి దూరంగా జరగనూలేదు. అవార్డుల కమిటీ చైర్మన్ లాంటి ఎన్నో పదవులు నిర్వహించారు. వచ్చిపడిన మార్పుని ఆడిపోసుకోకుండా తనలాంటి వాళ్లకవి సరిపడవని ఒప్పుకుని చిత్ర నిర్మాణం నుంచి తప్పుకున్నారు. అయితేనేం, తెలుగు సినిమా చరిత్రలో 'పూర్ణోదయా' నాగేశ్వరరావు స్థానం పదిలం, ప్రత్యేకం. తెలుగు సినిమాకి ఇలాంటి నిర్మాతల అవసరం ఉంది, రాడానికి అవసరమైన పరిస్థితులు ఏర్పడితే అదే ఏడిద నాగేశ్వర రావుగారికి అసలైన నివాళి అవుతుంది.