ఆదివారం, సెప్టెంబర్ 21, 2025

కన్యాకుమారి

ఉత్తరాంధ్ర కథకులు, నవలా రచయిత అట్టాడ అప్పల నాయుడు. ఈయన కథల్లో 'సూతకం కబురు' కథంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం. నాయుడుగారబ్బాయి సృజన్ అట్టాడ దర్శకత్వంలో వచ్చిన సినిమా 'కన్యాకుమారి'. ఈ సినిమాకి కథ, మాటలు, పాటలు, స్క్రీన్ప్లే అందించడంతో పాటు, నిర్మాణాన్నీ భుజాన వేసుకున్నారు సృజన్. గత నెలలో థియేటర్లలో విడుదలైన 'కన్యాకుమారి' ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ద్వారా స్ట్రీమింగ్ అవుతోంది. శ్రీకాకుళం జిల్లా పెంటపాడు కుర్రాడు తిరుపతి (శ్రీచరణ్ రాచకొండ), అదే ఊరి అమ్మాయి కన్యాకుమారి (గీతా సైనీ) ల ప్రేమకథ ఇది. చూడచక్కని విజువల్స్, ఇంపైన నేపధ్య సంగీతం, ఆసక్తిగా సాగే కథనం కారణంగా 135 నిముషాలు అప్పుడే అయిపోయేయా అనిపించింది, ఎండ్ టైటిల్స్ పడుతుంటే. 

హైస్కూల్ లోనే కన్యాకుమారికి ప్రపోజ్ చేసి భంగ పడతాడు తిరుపతి. కన్యాకుమారి లక్ష్యం సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని. తిరుపతికేమో రైతు కావాలని కోరిక. ఊళ్ళో పొలం ఉండడంతో పాటు, కొడుకు కోరికకి అడ్డుచెప్పని తండ్రి కావడంతో, తిరుపతి హైస్కూల్ లోనే చదువు మానేసి వ్యవసాయంలో స్థిరపడి పోతాడు. కన్యాకుమారి చదువులో ముందున్నా, ఎంసెట్ లో మంచి రేంక్ తెచ్చుకున్నా, ప్రభుత్వ కళాశాలలో బీకామ్ లో చేరాల్సి వస్తుంది, ఇంట్లో మద్దతు లేకపోవడం వల్ల. శ్రీకాకుళంలో బట్టల షాపులో సేల్స్ గర్ల్ గా చేరినా తన సాఫ్ట్వేర్ ఆశల్ని చంపేసుకోదు. రైతు అయిన కారణానికి తిరుపతికి పెళ్లి సంబంధాలు కుదరవు. అప్పుడే అనుకోకుండా కన్యాకుమారి అతని జీవితంలోకి మళ్ళీ వస్తుంది. 

నాయికా నాయకులు కనుక సహజంగానే కన్యాకుమారీ, తిరుపతీ ప్రేమలో పడతారు. సాఫ్ట్ వేర్ రెక్కలు కట్టుకుని ఎగిరిపోవాలి అనుకునే కన్యాకుమారికీ, మట్టిని విడిచి, ఊరిని వదిలి బయటకి వెళ్లలేని తిరుపతికీ మధ్య ప్రేమ, పెళ్లి వరకూ వెళ్లాలంటే ఎవరో ఒకరు తమ కలల్ని 'త్యాగం' చేయాలి. అటు చూస్తే ఆడపిల్ల చదువు, కలలు, ఇటు చూస్తే వ్యవసాయం, గ్రామీణ జీవితం. చక్కని చిక్కుముడి. వాళ్ళ ప్రేమ త్యాగాన్ని కోరదు కానీ, ఓ ఆసక్తికరమైన తీరాన్ని చేరుతుంది. అదేమిటో అమెజాన్ ప్రైమ్ లోనే చూడండి. సినిమా మొదటి నుంచి చివరి వరకూ ఆకట్టుకున్నది నేటివిటీ. ఎక్కడా శ్రీకాకుళం, పరిసర గ్రామాలు దాటి వెళ్ళలేదు కెమెరా. ప్రతి సన్నివేశం కంటికి ఇంపుగా వుంది. 

సంభాషణలు పూర్తి మాండలికంలో లేవు. నిజానికి గ్రామాల్లో కూడా మాండలికం నెమ్మదిగా కనుమరుగవుతోంది, టీవీ చానళ్ల ప్రభావంతో. మెజారిటీ తారాగణం ఆ ప్రాంతం వాళ్ళే. మేకప్పులు, కాస్ట్యూమ్స్ లాంటి పటాటోపాలు ఏవీ లేవు. స్థానికతని చూపించడంలో లోటుగా అనిపించిన విషయం మాత్రం ఆ ప్రాంతానికే ప్రత్యేకమైన పండుగలు, పబ్బాలు, జాతరలు లాంటివి ఏవీ కథలో భాగం కాకపోవడం. వరి కోతలప్పుడు చేసే పూజని మాత్రమే చూపించారు. నిజానికి ఆ ప్రాంతపు ప్రత్యేక సంప్రదాయాలని కథలో భాగం చేసే అవకాశం వుంది, సన్నివేశాల నేపధ్యం మార్చుకోవచ్చు. ఎందుకో దృష్టి పెట్టలేదు. గుర్తుండిపోయే ఒక పాటో, హాంటింగ్ గా ఉండే నేపధ్య సంగీతపు బిట్టో వుండి వుంటే ప్రేమ సన్నివేశాలకి మరింత బలం చేకూరి ఉండేది. 

మరింత బాగా ఉండవచ్చునని బాగా అనిపించిన విభాగం ఎడిటింగ్. సినిమా నిడివి మరీ పెద్దది కాకపోయినా కొన్ని సన్నివేశాల నిడివి ఎక్కువగా ఉండడం (ముఖ్యంగా ప్రథమార్ధంలో), కీలక సన్నివేశాలని మరీ క్లుప్తంగా చూపడం లేదా వాయిస్ ఓవర్ తో సరిపెట్టేయడం (ద్వితీయార్ధంలో) కాస్త అసంతృప్తిగా అనిపించింది. అయితే, జామకాయని కథలో భాగం చేయడం లాంటి సూక్ష్మ విషయాలు నచ్చేశాయి. నాయికా నాయకులు మాత్రమే కాదు, నటీనటులందరూ వంక పెట్టలేని విధంగా నటించారు. ముఖ్యంగా రెండు నిశ్చితార్ధం సన్నివేశాలు, వాటిలో కాంట్రాస్టు బాగా గుర్తుండిపోతాయి. అలాగే వెంకాయమ్మ పాత్రధారిణి, ఆవిడ కనిపించే రెండు మూడు సన్నివేశాలు కూడా. డ్రీమ్ సాంగ్స్, ఐటెం సాంగ్స్, ఫైట్స్ లాంటివి ఏవీ ఇరికించకుండా హాయిగా అనిపించేలా తీశారు సినిమాని. 

సినిమా టైటిల్స్ మొదట్లో 'విప్లవ్ పిక్చర్స్' అని చూసి, ఆర్. నారాయణమూర్తి తరహా ఎర్ర సినిమా చూడడానికి సిద్ధ పడిపోయాను. కానైతే, ప్రేమకథతో ఆశ్చర్య పరిచింది చిత్రబృందం. ఓటీటీలో మలయాళం సినిమాలని ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకి నచ్చే సినిమా ఇది. ఇక, అప్పలనాయుడు గారి 'సూతకం కబురు' కథానాయిక పరిస్థితులకి లొంగిపోతుంది. జీవితం తనని దెబ్బ మీద దెబ్బ కొట్టినప్పుడు, వాటిని తట్టుకునే శక్తిని కోల్పోతుంది. కానీ, సృజన్ సృష్టించిన 'కన్యాకుమారి' మాత్రం పరిస్థితులకి ఎదురీదుతుంది. తన కలల్ని చంపుకోదు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోదు. అలాగని, తన కలల సాధన కోసం ప్రేమని పణం గానూ పెట్టదు. అవును, ఆమె ఈతరం అమ్మాయి. 

బుధవారం, సెప్టెంబర్ 03, 2025

దొండ విత్తనాలు

నేను క్రమం తప్పకుండా చదివే ఓ కాలమ్ లో "దొండపాదు బాగా కాస్తోందిటనా? విత్తనాలు తీసుకెళ్లారుగా?" అని చదివి ఉలిక్కి పడ్డాను. సరిగ్గానే చదివేనా? అని సందేహ పడి, కళ్ళు నులుముకుని మళ్ళీ చూసినా అక్షరాలు మారలేదు. ఆనప, గుమ్మడి లాంటి పాదులు విత్తనాల నుంచి మొలుస్తాయి. కానైతే, దొండపాదు కోసం నాటాల్సింది దొండ వేరు. చిన్న వేరు ముక్క పాతి, కాస్త పందిరేసి, తీగ ఎగబాకే వరకూ జాగ్రత్తగా చూసుకుంటే చాలు, ఆపైన వద్దన్నా కాయలు కాస్తూనే ఉంటాయి. మిగిలిన పాదులతో పోలిస్తే, దొండ కాస్త మొండి జాతి. పోషణ పెద్దగా లేకపోయినా హాయిగా బతికేస్తుంది, కాపులో ఏమాత్రం తేడా పెట్టదు. ఇంకా చెప్పాలంటే, 'చాలమ్మా తల్లీ' అని బతిమాలినా కూడా ఆపకుండా కాసేస్తుంది దొండపాదు. 

అమ్మకూడా అంతే, 'వద్దమ్మా తల్లీ' అన్నా వినకుండా వారంలో కనీసం రెండు మూడు రోజులు దొండకాయ వండేసేది. ఎక్కువగా దొండకాయ, కొబ్బరి కోరు కూర, తప్పితే బెల్లం పెట్టిన కూర. "దొండకాయ ఎక్కువగా పెడితే పిల్లలు మందబుద్ధులవుతారు" అనేది మా బామ్మ, విస్తట్లో దొండకాయ కూరని, పక్కన కూచున్న నన్నూ మార్చి మర్చి చూస్తూ. అమ్మ విననట్టుగా ఊరుకునేది. "ఎప్పుడూ కూరేనా? చక్కగా వేపుడు చేయచ్చు కదా?" అనేది నా ఘోష. 'చక్రాల వేపుడు' అని పాడుతూ ఉండేవాడిని. అంటే, దొండకాయని చక్రాలుగా కోసి చేసే వేపుడన్న మాట. మామూలుగానే ఇంట్లో వేపుళ్ళు తక్కువ. వేపుడు వేయిస్తే చిన్న సైజు పండగ మాకు. ఎప్పుడన్నా బంగాళా దుంపలన్నా వేయించేది కానీ, దొండకాయ మాత్రం కూరే. "వెధవ దొండకాయలు గంటసేపు వేగుతాయి" అనేది. 

అచ్ఛం ఇదే మాట డాక్టర్ సోమరాజు సుశీల గారి అమ్మగారు సరోజిని గారి నోటి వెంట విన్నాను 'ఇల్లేరమ్మ కతలు' లో. ఇల్లేరమ్మ (సుశీల ముద్దుపేరు) వాళ్ళ నాన్నగారు వెంకటేశ్వర రావు, గృహసంబంధ విషయాలేవో మాట్లాడడానికి సరోజిని గారిని పిలవడం, ఆవిడేమో దొండకాయలు, కత్తిపీట, రెండు పళ్లాలతో రావడాన్ని వర్ణించారు 'పిల్లేటి సొగసులు' కథలో. రెండు పళ్ళాలు ఎందుకంటే, "అమ్మ ముచికలు కూడా నేలమీద తరగదు, వాటికో ప్లేటు పెడుతుంది." ఎంతటి పనిమంతురాలావిడ!! "నే ఎప్పుడు పిలిచినా కత్తిపీటతో సహా వస్తావేవిటే హడలిపోయేలాగా" అని నాన్నంటే, "ఏమో! ఎవరి జాగ్రత్త వాళ్ళది. ఈ వెధవ దొండకాయలు గంటసేపు తరగాలి. రెండు గంటల సేపు వేయించాలి. అయినా మీతో చేతులు కబుర్లు చెప్పవుగా!" అంటారు అమ్మ. 

దండిగా కాసే దొండకాయలు మాకు మాత్రమే కాదు, 'కన్యాశుల్కం' కరటక శాస్త్రులు గారికి కూడా సమస్య అయి కూర్చున్నాయి పాపం. "వర్ణ ప్రకర్షే సతికర్ణి కారం! ధునోతినిర్గంధ తయాస్మి చేతః !!" పాఠం చదువుకుంటుంటున్న మహేశం, "ఆ పువ్వేదో కవికిష్టం లేదట. యిష్టం లేకపోతే ములిగిపోయింది కాబోలు? మా గురువుగారికి దొండకాయ కూర యిష్టం లేదు. గురువుగారి పెళ్ళాం పెరట్లో దొండపాదుందని రోజూ ఆ కూరే వొండుతుంది. బతికున్న వాళ్ళ యిష్టవే యిలా యేడుస్తూంటే చచ్చిన వాడి యిష్టాయిష్టాలతో ఏంపని?" అనుకుంటాడు నాటకం ద్వితీయాంకంలో. తన భార్య చేసే 'మర్యాద' గురించి కరటకుడు కూడా మధురవాణి తో మొర పెట్టుకుంటాడు కానీ, దొండకాయ కూర విషయం ప్రస్తావించడు పాపం. మరి ఆయొక్క దొండపాదు ఒక్క భారద్దేశంలోనే కాదు, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనూ  అనూపంగా అల్లుకుంది. దీని వెనుక ఉన్నది అక్షరాలా ఓ తెలుగు వాడే. 

హాస్య రచయితగానూ, తెలుగు సాహిత్య కార్యక్రమాల నిర్వాహకుడిగానూ పేరు గాంచిన వంగూరి చిట్టెన్ రాజు, స్వస్థలం కాకినాడ నుంచి దొండవేరుని అత్యంత సాహసోపేతంగా అమెరికా తరలించిన వైనాన్ని రికార్డు చేశారు. అప్పటికింకా స్కానర్లు కన్ను విప్పక పోవడం వల్ల, దొండ వేరుని కోటు వెనుక దాచి కస్టమ్స్ వాళ్ళని మాయ చేయగలిగారు కానీ, ఇప్పుడైతే అలా తరలించే వీలే లేదు. అనేక శ్రమదమాదులకి ఓర్చి హ్యూస్టన్ చేర్చిన దొండవేరుని తన పెరటికే పరిమితం చేసేసుకోకుండా, అమెరికాలో అడిగిన తెలుగు వాళ్ళందరి పెరళ్ళలోనూ వ్యాపింపజేశారు వంగూరి. ఇంకా ఇలాంటి సాహసాలు చాలానే చేసి వుంటారు కదా. వాటి వివరం కోసం ఆ మధ్య ధారావాహికంగా మొదలైన  ఆయన ఆత్మకథని శ్రద్ధగా చదవడం మొదలు పెట్టాను. కారణాలు తెలియవు కానీ, అమెరికాలో ఉద్యోగం దొరకడంతో ఆ ధార ఆగిపోయింది. మళ్ళీ ఎప్పుడో మొదలు పెట్టి మరికొన్ని అధ్యాయాలు రాయకపోరని ఎదురు చూస్తున్నా. 

మళ్ళీ నేను చదివిన కాలమ్ దగ్గరికి వచ్చేస్తే 'అప శుభం' అనే పదప్రయోగం కూడా చేశారు కాలమిస్టు. ఆవిడేమీ చిన్నా చితకా కాదు, పేరున్న రచయిత్రి. హాస్యం మాటున అలవోకగా జీవిత సత్యాలనీ, సాఫ్ట్ స్కిల్స్ చిట్కాలనీ చెబుతూ వుంటారు తన కాలమ్ లో. అలాంటిది, "అపశుభం మాట్లాడకమ్మా" అని రాయడం చూసి అవాక్కయ్యా. అప్పటికింకా దొండ విత్తనాల నుంచి తేరుకోలేదు. ఇవి చాలవన్నట్టు "నాలో ఊహలకి.. నాలో ఊసులకి నటనలు నేర్పావూ.." అని కూడా రాసేశారు. ఇష్టానుసారం అక్షరాలని విరుస్తూ ఆశాభోంస్లే పాడిన ఆ పాట సాహిత్యంలో వున్నవి 'నడకలు' తప్ప 'నటనలు' కావు మరి. 'నవతరం రచయితలతో పోటీ పడడం కోసమని ఈ తరహా పదప్రయోగాలు చేస్తున్నారా ఈవిడ?' అని ఆలోచనలో పడ్డాను. ఏమో, రేపన్ననాడు 'దొండ చెట్టుక్కాస్తాయ్ దొండకాయలూ.. దొండకాయలూ' లాంటి సినిమా పాటలు కూడా వినాల్సి వస్తుందో ఏవిటో.. ఇప్పటికివీ దొండకాయ కబుర్లు.