మానవ నైజాన్ని ఎత్తి చూపడం లో ఒక్కో రచయితదీ ఒక్కో శైలి. గోదారొడ్డున జరిగే కథల్ని తనే మనకి స్వయంగా చెబుతున్న అనుభూతి కలిగించే విధంగా అక్షరీకరించే వంశీ మానవ నైజాన్ని ఇతివృత్తంగా తీసుకుని కథ రాస్తే..? "అరె.. అచ్చం వీళ్ళు మనకి తారసపడ్డ మనుషుల్లాగే ఉన్నారే!!" అనిపించక మానదు, వంశీ రాసిన కొన్ని కథల్లో పాత్రలని చూసినప్పుడు. ఆ కొన్ని కథల్లో ఒకటి 'అలా అన్నాడు శాస్త్రి.'
గోదారొడ్డున పల్లెటూరు. ఆ పల్లెటూళ్ళో కొందరు యువకుల స్నేహ బృందం. ఆ బృంద సభ్యుడు శాస్త్రి. పుస్తకాలంటే విపరీతమైన పిచ్చి. కనిపించిన ప్రతి పుస్తకాన్నీ విడిచి పెట్టకుండా చదువుతాడు. 'పుస్తకాలని ఎంచుకుని చదవడం' అన్నది శాస్త్రికి నచ్చని పని. ఆంధ్ర మహా భారతం నుంచి అంబడిపూడి వాళ్ళ పుస్తకాల వరకూ కాదేదీ చదవడానికి అనర్హం శాస్త్రికి.
పాఠకుడు ముదిరి కవో, రచయితో లేక రెండూనో అవ్వడం చాలామంది విషయంలో జరిగే అత్యంత సహజమైన పరిణామం. శాస్త్రి విషయంలో కూడా జరిగింది అదే. పుస్తకాలు చదివి చదివి అలవోకగా కవితలు అల్లడం మొదలు పెడతాడు. మిత్రులెవ్వరూ అతని కవితలని సీరియస్ గా తీసుకోరు. పైగా రాసినవి సరి చేసుకోమనీ, ఇంకా చాలా ఇంప్రూవ్ కావాలనీ సలహాలూ, సూచనలూ ఇస్తూ ఉంటారు.
కేవలం తన కవితలని అందరికీ చదివి వినిపించడం మాత్రమే కాకుండా మరో కొత్త పని మొదలు పెడతాడు శాస్త్రి. ఆ ఊళ్ళో ఉండే ఒక పాక హోటల్లో బయట ఉంటే నల్ల బోర్డు మీద ఆవేల్టి 'స్పెషల్స్' రాయగా మిగిలిన చోటులో ప్రతి రోజూ ఒక కవిత రాస్తూ ఉంటాడు. చదివిన వాళ్ళు చదువుతారు, చదవని వాళ్ళు చదవరు. మొత్తం మీద ఎవరూ పెద్దగా పట్టించుకోరు.
పొరుగునే ఉన్న దాక్షారం భీమేశ్వరుడి గుడిలో తను రాసిన 'ఆట కదరా శివా' సంపుటాన్ని చదవడం కోసం వస్తాడు సిని నటుడు, రచయిత తనికెళ్ళ భరణి. అనుకోకుండా కాఫీ హోటల్ బోర్డు మీదున్న కవిత చదివి, రాసింది ఎవరని ఎంక్వైరీలు మొదలు పెడతాడు. భరణి ని కలుస్తాడు శాస్త్రి. సాహిత్యాన్ని గురించి మాట్లాడుకుంటారు వాళ్ళిద్దరూ. భరణి ద్వారా సినిమా పాటలు రాసే అవకాశం వస్తుంది శాస్త్రికి.
శాస్త్రి పాటలు రాసిన మొదటి సినిమా 'శ్రీ చరణం' బాగా ఆడడంతో 'శ్రీ చరణం' శాస్త్రి గా మారతాడు, అంతే కాదు అనతికాలంలోనే బిజీ గీత రచయితగా మారతాడు. తమ ఊరి వాడు సినిమా రంగంలో అంత పెద్ద పేరు తెచ్చుకోడం చూసి అతనికి సన్మానం చేయాలని సంకల్పిస్తారు మిత్రులు. ఊళ్ళో పెద్ద ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. అతనికి ఆతిధ్యం ఇవ్వడానికీ, అతనితో కలిసి కూర్చుని మందు పుచ్చుకోడానికీ పోటీలు పడతారు.
చెప్పిన ప్రకారం ఊరికి వస్తాడు శాస్త్రి. మైక్ లో శాస్త్రి రాసిన సినిమా పాటలే వస్తూ ఉంటాయి. కార్యక్రమం మొదలవుతుంది, యువ కవుల కవితాగానంతో. ఆ చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కొత్తగా కవితలు రాయడం మొదలు పెట్టిన వాళ్ళు యెంతో ఉత్సాహంగా వస్తారు. సిని కవి గారికి తమ కవితలు వినిపించాలని. శాస్త్రి ఆసక్తి గా వింటాడు, కానీ జనం వినరు. కనీసం చప్పట్లు కొట్టరు.
కొందరు యువ కవులు కవితలు చదివాక, శాస్త్రి మైకు ముందుకి వస్తాడు. ఓ కవిత చదువుతాడు. జనం చెవులు రిక్కించి వింటారు. బ్రహ్మాండమైన స్పందన. చప్పట్ల హోరు. సరిగ్గా అప్పుడు ఆ మహా జనం అంతా ఉలిక్కిపడే మాటొకటి చెబుతాడు శాస్త్రి. తను కవితలు రాసిన తొలి రోజులని గుర్తు చేసుకుంటాడు. మిత్రులతో సహా అందరూ సిగ్గు పడేలా ఉంటాయతని మాటలు. ఇంతకీ శాస్త్రి ఏమన్నాడో తెలియాలంటే 'ఆనాటి వాన చినుకులు' సంకలనం లో ఉన్న 'అలా అన్నాడు శాస్త్రి' కథ చదివితేనే బాగుంటుంది. (నాకీ కథని గుర్తు చేసిన లలిత గారికి థాంకులు.)