శనివారం, జులై 30, 2022
జానకమ్మ ఇంగ్లండ్ యాత్ర
సోమవారం, జులై 25, 2022
చుక్కల్లో తళుకులా...
సఖీ ప్రియా సాగే లయా.. నా ప్రేమ తొందర...
"నాగార్జునకి, రమ్యకృష్ణకీ ఓ డ్యూయెట్ కావాలి..." వేటూరికి రాఘవేంద్రరావు ఇంతకన్నా ఇన్ పుట్స్ ఇచ్చి ఉంటారని అనుకోను, 'ఘరానా బుల్లోడు' (1995) లో 'మబ్బుల్లో జాబిల్లి...' పాట విన్నప్పుడల్లా. సినిమా కథతో పెద్ద సంబంధం లేకుండా ఎక్కడైనా ఇమిడిపోయే ఇలాంటి పాటలు రాయడంలో సిద్ధహస్తుడు వేటూరి. కీరవాణి స్వరకల్పనలో మనో-చిత్ర పాడిన ఈ డ్యూయెట్ పూర్తిగా కె. రాఘవేంద్ర రావు, బీఏ మార్కు చిత్రీకరణ, పూలు-పళ్ళుతో సహా. "నాకు నేను చాలా అందంగా కనిపించే పాట ఇది" అని రమ్యకృష్ణ చేత కితాబు కూడా అందుకుంది. హమ్మింగు, కోరస్సు ఈ పాటకి ప్రాణం పోశాయనిపిస్తూ ఉంటుంది నాకు, వింటున్నప్పుడల్లా.
నింగి నుంచి తొంగి చూసి నచ్చగానేనిచ్చెనేసి జర్రుమంటు జారింది...
మబ్బుల్లో జాబిల్లి... జాజుల్లో నా మల్లి... మబ్బుల్లో జాబిల్లి...
ఇక్కడ కాస్త ట్రివియా... పాట సాహిత్యంలో రొమాన్సు పాళ్ళు కొంచం ఎక్కువగా ఉండాలని వాళ్ళే అలా అడిగారో, లేక తనకే అలా తోచిందో కానీ వేటూరి మొదట రాసిన పల్లవిలో 'మబ్బుల్లో జాబిల్లి' బదులు 'జాకెట్లో జాబిల్లి' అని ఉంటుంది. రికార్డింగ్ పూర్తయ్యి, కేసెట్లు బయటికి వచ్చేశాయి. తర్వాత సినిమా సెన్సార్ అప్పుడు అభ్యంతరం రావడంతో అప్పటికప్పుడు 'మబ్బుల్లో జాబిల్లి' అని మార్చి పాడించారు. మ్యూజిక్ కంపెనీ వాళ్ళ అఫీషియల్ ఛానల్ లో మొదటి వెర్షన్ ఇప్పటికీ ఉంది.
మిలమిలా సోకులే... మీటనివ్వు నన్ను లేతగా...
కొంగుచాటు ముంతలా... పొంగు పాలపుంతలా...
గిలగిల గిల్లకా రేతిరైతె రెండు చెంపలా...
నిబ్బరాల నిమ్మపండు ఒలిచి పెట్టవా...
కొబ్బరంటి కొత్త ఈడు కొలిచి పెట్టవా...
ఏకాదశి నా ఊర్వశి శ్రీ రమ్య శృంగార రాశి
త్రయోదశి జాబిల్లికి ఈనాడే పున్నమి
సిగ్గమ్మా చీ..చీ..ఛీ..
నాయికని 'మల్లెపూల చెల్లెలా' అనడం, ఏకాదశిని, త్రయోదశినీ రొమాంటిక్ డ్యూయెట్లోకి తీసుకురావడం వేటూరికి మాత్రమే చెల్లింది. నాయిక పేరుని కావాలని ఇరికించినట్టు కాకుండా ఎప్పటిలాగే సందర్భోచితం చేశారు.
తళతళ తారలే తాకిపోయె నన్ను మెత్తగా...
రాజహంస రెక్కల... రాసలీల పక్కల...
గుసగుసా గువ్వలా గూడు కట్టుకోవె మత్తుగా...
పిక్కటిల్లిపోతె ఈడు పైట నిలుచునా...
పిక్కలావు పిల్లదాని నడుము పలచన...
మహాశయా నా మన్మథా.. మందార సందెల్లో రారా...
సఖీ ప్రియా సాగే లయా.. నా ప్రేమ తొందర...
చీకట్లో చిందేసి...️️️️
'గుసగుసా గువ్వలా..' మొదట విన్నప్పుడే భలేగా నచ్చేయడమే కాదు, ఇప్పటికీ ఆ ఇష్టం కొనసాగుతోంది. 'పిక్కటిల్లి' 'పిక్కలావు' లాంటి పల్లెటూరి నుడికారాలని అలవోకగా తెచ్చేశారు పాటలోకి. ట్యూనుకి నింపే సాహిత్యం అయితేనేమి, ఇంత సొగసుగా నింపడం మరొకరి వల్ల అవుతుందా?
శనివారం, జులై 16, 2022
తలనేత
ఇస్తాంబుల్ అంటే ఇప్పటివరకూ తెలిసింది తెలుగు సినిమాలో ఖరీదైన విలన్ల స్థావరం మరియు నాయికానాయకులు ఒకటో రెండో యుగళగీతాలు పాడుకునే చోటు అని మాత్రమే. అయితే, ఈ టర్కీ దేశపు నగరం బట్టతలపై జుట్టు నేసే (హెయిర్ ట్రాన్స్ ప్లాంట్) పరిశ్రమ(?)కి ప్రపంచ స్థాయి రాజధాని అన్నది కొత్తగా తెలిసిన విశేషం. ప్రపంచం నలుమూలల నుంచీ ఏటా పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల మంది (ప్రధానంగా పురుషులు) హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ కోసం ఇస్తాంబుల్ వచ్చి వెళ్తున్నారట! ఇందుకు కారణం, ఇక్కడ దొరికే ట్రీట్మెంటు ప్రపంచంలోనే అత్యుత్తమం అనుకుంటే పొరపాటు. చాలా ధనిక దేశాల కన్నా చాలా చౌక. అమెరికాలో ఇరవైవేల డాలర్ల వరకూ ఖర్చయ్యే జుట్టు నేతని ఇస్తాంబుల్లో రెండువేల డాలర్ల ఖర్చుతో పూర్తి చేసుకోవచ్చు. భలే మంచి చౌక బేరము కదా.
తల నెరుపునీ, బట్టతలనీ ప్రకృతి సహజాలుగా అంగీకరించేసిన తరాలు తప్పుకున్నాక మొదటగా వర్ధిల్లింది రంగుల పరిశ్రమ. హెయిర్ డై ప్రకటనలు ఒకప్పుడు ఎంతగా తప్పుదోవ పట్టించేవిగా ఉండేవంటే, ఒక డై ని నేను ఔషధం అని పొరబడి, సలహా అడిగిన ఓ మిత్రుడికి సిఫార్సు చేశా. అతని అనుభవం నుంచి తెలిసింది, అది మందు కాదు రంగని. అప్పటి నుంచీ ఇలాంటి సలహాలిచ్చే పని మానుకున్నా. నాటకాలు, సినిమాల వాళ్ళకి మాత్రమే పరిమితమైన విగ్గులు కూడా జనబాహుళ్యానికి అందుబాటులోకి వచ్చేసి మార్కెట్ని దున్నేశాక ఈ హెయిర్ వీవింగ్, ట్రాన్స్ ప్లాంట్ లు రంగ ప్రవేశం చేశాయి. ఈ ట్రాన్స్ ప్లాంట్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది డాక్టర్ల చేత చేయబడుతుంది. ఒక్క సారి నాట్లు పూర్తయ్యాక, కొన్ని వారాలపాటు మొలకల్ని జాగ్రత్తగా చూసుకుంటే చాలు, ఇక ఆ కొత్త జుట్టు ఊడిపోదు.
వైద్యరంగంలో కొత్త ఆవిష్కరణలతో సమస్య ఏమిటంటే, వచ్చిన కొత్తలో చాలా వైద్య విధానాలు ఖరీదు గానే ఉంటాయి. ఏళ్ళు గడిచిన తర్వాత తప్ప సామాన్యులకి అందుబాటులోకి రావు. బాగా ఖర్చు పెట్టగలిగే వాళ్ళు తొలివరసలో నిలబడి వినియోగించుకుంటారు. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి? ఒకప్పటి సంగతేమో కానీ, ఇప్పుడు ప్రపంచం ఓ కుగ్రామం అయిపోయాక అన్నింటికీ ఏదో రూపంలో ప్రత్యామ్నాయాలు దొరికేస్తున్నాయి. ఇదిగో, ఈ క్రమంలో హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ అనే ఖరీదైన ప్రక్రియని అందుబాటు(?) ధరలో అందించే దేశంగా టర్కీ, నగరంగా ఇస్తాంబుల్ వినుతికెక్కాయి. వేగవంతమైన జీవన శైలి వల్ల అయితేనేమి, మారిన ఆహార అలవాట్ల వల్ల అయితేనేమి బాల నెరుపులు, బట్ట తలలు విరివిగా పెరిగాయి. తలసరి ఆదాయాలు, జీవన ప్రమాణాలు కూడా పెరగడంతో వినియోగదారుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగింది.
Google Image |
ప్రపంచంలో ఎన్నో నగరాలు, మహా నగరాలూ ఉండగా ఈ ఇస్తాంబుల్ మాత్రమే తలనేత రాజధానిగా ఎలా పరిణమించ గలిగింది? మొదటిది - అక్కడ తగినంతమంది డాక్టర్లు, ఇతర సిబ్బంది ఉండడం, రెండోది - అక్కడి ప్రభుత్వం 'హెల్త్ టూరిజం' ని బాగా ప్రమోట్ చేయడం, మూడోదీ బాగా ముఖ్యమైనదీ - టర్కీ ఇంకా 'అభివృద్ధి చెందుతున్న' దేశం కావడం వల్ల తక్కువ ఖర్చులో ట్రీట్మెంట్ అందివ్వ గలగడం. అంతర్జాతీయ హెల్త్ టూరిజం పర్యాటకులకి ప్రధాన సేవ హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ కాగా, అనుబంధంగా దంత వైద్యం, శరీర బరువు తగ్గింపు లాంటి సేవలనీ సరసమైన ధరలకి అందిస్తున్నారు. స్టార్ హోటల్ లో బస, లోకల్ ట్రాన్స్పోర్టు, సదా అందుబాటులో ఉండే అనువాదకులు.. ఇవన్నీ కలిపి పేకేజీ నిర్ణయిస్తారు. పేకేజీ కాకుండా, టిక్కెట్టు ఖర్చులు మాత్రమే అదనం. దీనివల్ల జరగబోయే ఖర్చు గురించి ముందుస్తుగా ఓ అంచనా వచ్చేస్తుంది యాత్రీకులకి.
చౌక వైద్యం అనగానే ముందుగా వచ్చే సందేహం సేవల్లో నాణ్యత గురించి. ఇస్తాంబుల్ వైద్యాన్ని గురించీ బోల్డన్ని ప్రచారాలున్నాయి. డాక్టర్లు కేవలం పర్యవేక్షణ చేస్తూ, నాట్లు, ఊడుపు లాంటి క్రతువులన్నీ సహాయకుల చేత చేయిస్తారనీ, చాలా సందర్భాల్లో ఈ సహాయకుల అనుభవ లేమి వల్ల యాత్రికులు (రోగులు అనకూడదేమో) ఇబ్బంది పడుతున్నారని వినిపిస్తున్నా, యాత్రికుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. నాట్లు పూర్తి చేయించుకుని స్వదేశానికి తిరిగి వచ్చాక కూడా, ఓ సహాయకుడు హమేషా వాట్సాప్ లో అందుబాటులో ఉంటూ, ఫోటోలు, వీడియోల పరిశీలన ద్వారా మొలకల పెరుగుదలని పర్యవేక్షిస్తూ ఉంటాడట. దీనికి అదనపు రుసుమేమీ లేదు, పేకేజీలో భాగమే. ఆ ప్రకారంగా టర్కీ 'హెల్త్ టూరిజం' ని ప్రమోట్ చేస్తోంది.
అసలు 'హెల్త్ టూరిజం' అన్నమాట వినగానే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తొచ్చారు. "ఏ ఇజమూ లేదు, టూరిజం ఒక్కటే ఉంది" అన్న ఆయన పాపులర్ స్లోగన్ తో పాటు, అప్పట్లో హైదరాబాద్ ని 'హెల్త్ టూరిజం హబ్' గా డెవలప్ చేస్తానన్న హామీ కూడా. ఒకవేళ ఆంధ్ర ఓటర్లు ఆయనకి మళ్ళీ ప్రజాసేవ చేసుకునే అవకాశం ఇస్తే అమరావతి హెల్త్ టూరిజానికి కూడా రాజధాని అవుతుందేమో చూడాలి. అసలే విజయవాడ, గుంటూరు చుట్టూ లెక్కలేనన్ని హాస్పిటళ్లు ఉన్నాయి. ఒకవేళ, ప్రస్తుత పాలకులకి ఇస్తాంబుల్ విషయం చెవిన పడితే అన్న ఆలోచన రావడమే కాదు, ఏ 'జుట్టు దీవెన' లాంటి సంక్షేమ పథకమో పురుడు పోసుకుంటుందేమో అన్న సందేహమూ కలిగేసింది. అమంగళం ప్రతిహతమగు గాక!
మంగళవారం, జులై 05, 2022
గుడిపూడి శ్రీహరి ...
"ఆకాశవాణి.. ప్రాంతీయ వార్తలు చదువుతున్నది.. గుడిపూడి శ్రీహరి.." రేడియో ట్యూనింగ్ లో కృత్యాద్యవస్థ మీద హైదరాబాద్ కేంద్రం తగిలిన రోజుల్లో గరగరమంటూ వినిపించేదీ గొంతు. గరగర రేడియోది. మిగిలిన వాళ్ళు బహు గంభీరంగా వార్తలు చదివితే, ఈ గొంతు మాత్రం మధ్యలో చిరు దగ్గులు, సవరింపులు వినిపించేది. పత్రికల్లో సినిమా రివ్యూల కింద గుడిపూడి శ్రీహరి అనే పేరు కనిపించేది. ఇద్దరూ ఒక్కరే అని తర్వాతెప్పుడో తెలిసింది. రేడియో వార్తల మీద, సినిమా రివ్యూల మీదా తనదైన ముద్ర వేసిన గుడిపూడి శ్రీహరి ఇకలేరన్న వార్త ఉదయాన్నే తెలిసింది. అప్పటి నుంచీ ఆయనకి సంబంధించిన జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా గుర్తొస్తున్నాయి. ఇంతకీ, ఆయనతో నాకు ఎలాంటి ప్రత్యక్ష పరిచయమూ లేదు.
సినిమా వెబ్సైట్లు మొదలయ్యాక కొత్త సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనో, విడుదలకు కొన్ని గంటల ముందో రివ్యూలు వచ్చేస్తున్నాయి కానీ, అంతకు ముందు వరకూ ఈ శుక్రవారం సినిమా విడుదలైతే వచ్చే గురువారం మార్కెట్లోకి వచ్చే సినిమా పత్రికలో రివ్యూ వచ్చేది. ఈలోగా ఉత్సాహవంతులు సినిమా చూసేయడమే కాక, మంచిచెడ్డల్ని గురించి చర్చోప చర్చలు కూడా పూర్తి చేసేసే వాళ్ళు. సినిమా టిక్కెట్లు అందరికీ అందుబాటులో ఉన్న రోజులవి. అదుగో, అలాటి చర్చల్లో "గుడిపూడి శ్రీహరి రివ్యూలో ఈ పాయింట్ ఉంటుంది చూడు" అన్న మాట కొంచం తరచుగానే వినిపిస్తూనే ఉండేది. అంత పాపులర్ ఆయన రివ్యూలు.
ఓ ఇరవయ్యేళ్ళ క్రితం దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ ఓ సినిమా పత్రిక్కి ఇచ్చిన ఇంటర్యూని సెలూన్ నిరీక్షణలో చదివినప్పుడు, ఆయన చిన్నప్పుడు వాళ్ళ మిత్రుల మధ్యనా ఇలాంటి చర్చలే జరిగేవనీ, శ్రీహరి రివ్యూల వల్ల 'సినిమా' మీద ఆయనకి పూర్తి అవగాహన కలిగిందని తెలిసి ఆశ్చర్యపోయాను. సినిమా అంటే ఆసక్తి ఉన్నవాళ్లందరికీ శ్రీహరి పేరు బాగా పరిచయమే అని అర్ధమయ్యింది. కేవలం నటీ నటుల నటన గురించి మాత్రమే రాసి ఊరుకోకుండా, సాంకేతిక విభాగాలన్నింటి పనితీరునీ పరామర్శించడం, బాగాలేని చోట చిన్న చిన్న చురకలు వెయ్యడం శ్రీహరి రివ్యూల ప్రత్యేకత. ఆంధ్రభూమి దినపత్రిక 'వెన్నెల' అనే సినిమా సప్లిమెంట్ ని ప్రారంభించి బొత్తిగా నిర్మొహమాటమైన రివ్యూలు ఇవ్వడం మొదలుపెట్టే నాటి వరకూ ఈ చురకలే వాతల్లా అనిపించేవి.
పరిశీలన వల్ల గమనించిన విషయం ఏమిటంటే, ఉషాకిరణ్ మూవీస్, సురేష్ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థల సినిమాలని రివ్యూ చేసే విషయంలో శ్రీహరి ఆచితూచి వ్యవహరించే వాళ్ళు. మొహమాటం బాగానే కనిపించేది. అదే చిన్న సంస్థలు, కొత్త సంస్థల సినిమాలైతే చెలరేగి పోయేవాళ్లు. ఇలా చెలరేగి పోయే క్రమంలో బాగున్న సినిమాలనీ రివ్యూలో చెండాడేసిన సందర్భాలు బోలెడు. నాకు బాగా గుర్తున్న సినిమా లయ-వేణు తొట్టెంపూడిలని నాయికా నాయకులుగా పరిచయం చేస్తూ విజయ భాస్కర్ దర్శకత్వంలో వేణు బంధువులు నిర్మించిన 'స్వయంవరం' సినిమా. రివ్యూ చదివే నాటికే సినిమా చూసేశా (శుక్రవారం విడుదలైన ఈ సినిమాకి, ఆదివారం మధ్యాహ్నం 'టాక్ ఆఫ్ ది టౌన్' ప్రోగ్రాం లో యాంకర్ ఝాన్సీ నుంచి మంచి రివ్యూ వచ్చింది ). శ్రీహరి రివ్యూ నిరాశ పరిచింది.
హైదరాబాద్ రోజుల్లో, బీకే గూడ లో ఉన్న శ్రీహరి ఇంటిముందు నుంచి చాలాసార్లే వెళ్ళాను. హౌసింగ్ బోర్డు వాళ్ళ ఎమ్మైజి (మిడిల్ ఇన్కమ్ గ్రూప్) ఇల్లు. గేటు లోపల ఎడమవైపు కార్ పార్కింగ్, కుడివైపు ఖాళీ స్థలం. మారుతీ కారుని షెడ్లోనుంచి తీస్తూనే, షెడ్లో పెడుతూనో, లేదా ఖాళీ స్థలంలో పడక్కుర్చీ వేసుకుని కూర్చుని పేపరు చదువుతూనో కనిపించే వాళ్ళు. "ఓసారి ఆగి, గేటు తీసుకుని వెళ్లి పలకరిస్తే..." అన్న ఆలోచన చాలాసార్లే వచ్చింది కానీ, ఆచరణలో పెట్టలేదు. అప్పట్లోనే ఆంగ్ల దినపత్రిక 'ది హిందూ' కి ఆయన రాసే సినిమా రివ్యూలు, సాంస్కృతిక కార్యక్రమాలకి సంబంధించిన ఇంటర్యూలు వగయిరా చదవడం తటస్థించింది. చాలా సినిమాలకి తెలుగులో రాసిన రివ్యూలనే ఇంగ్లిష్ లో అనువదించి ఇచ్చేవారు కానీ, కొన్ని సార్లు మాత్రం వేర్వేరుగా రాసేవాళ్ళు. అలాంటప్పుడు తెలుగులో కనిపించని విమర్శ ఇంగ్లిష్ రివ్యూల్లో (వైస్-వెర్సా గా కూడా) కనిపిస్తూ ఉండేది.
శాస్త్రీయ సంగీత, నృత్య రంగ ప్రముఖులందరినో శ్రీహరి చేసిన ఇంటర్యూలు 'ది హిందూ' లో చదవగలిగాను. ఆ రంగాల మీద ఆయనకున్న పట్టు అర్ధమయ్యింది. తెలుగులో రాసిన వీక్లీ కాలమ్ 'హరివిల్లు' కొన్నిసార్లు ఆపకుండా చదివిస్తే, మరికొన్ని సార్లు మొదటిపేరా తర్వాత దృష్టి మరల్చేసేది. సినిమా నిర్మాణం లో లాగానే రివ్యూ రచనలోనూ ఒక్కసారిగా మార్పులు వచ్చి పడిపోవడం, నాణ్యత కన్నా వేగం ప్రధానం అయిపోవడంతో శ్రీహరి రివ్యూలు పత్రికల నుంచి మెల్లగా కనుమరుగయ్యాయి. యూట్యూబు చానళ్లకు ఇంటర్యూలు ఇచ్చారు కానీ వాటిలో నేను చూసినవి తక్కువ. కొత్తతరం రివ్యూయర్లు వెల్లువలా వచ్చారు, వాళ్ళలో శ్రీహరిలా సుదీర్ఘ కాలం అదే పని చేసే వాళ్ళూ, అంత పేరు తెచ్చుకోగలిగే వారూ ఎందరున్నారన్నది కోటి రూపాయల ప్రశ్న. తెలుగు సినిమా రివ్యూ మీద తనదైన ముద్ర వేసిన గుడిపూడి శ్రీహరికి నివాళి.