శుక్రవారం, నవంబర్ 27, 2015

సైజ్ జీరో

మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న సౌకర్యాలు, అందుబాటులోకి వస్తున్న కొత్త కొత్త ఆహార పదార్ధాలు.. వీటన్నింటి తాలూకు ఉమ్మడి ఫలితం అధికబరువు.. ఇంగ్లిష్ లో ఒబేసిటీ. బరువు తగ్గించే  సులువైన పరిష్కారాలెన్నో మార్కెట్ ని ముంచెత్తుతున్నాయి. వీటిని ఎంతవరకూ నమ్మడం? చాపకింద నీరులా త్వరత్వరగా విస్తరిస్తున్న ఈ సమస్యని ఇతివృత్తంగా తీసుకుని, చౌకబారు హాస్యాన్ని కాక సున్నితమైన భావోద్వేగాలని ఆలంబనగా చేసుకుని రూపుదిద్దిన సినిమా 'సైజ్ జీరో,' ..'సన్నజాజి నడుము' అన్నది ఉపశీర్షిక. ప్రధాన పాత్ర సౌందర్య అలియాస్ స్వీటీ ని అగ్రశ్రేణి కథానాయిక అనుష్క పోషించడం, కేవలం ఈ పాత్ర కోసమే బాగా బరువు పెరగడం వల్ల షూటింగ్ నాటినుంచీ ఆసక్తి పెంచిన సినిమా ఇవాళే విడుదలయ్యింది.

రాజరాజేశ్వరి (ఊర్వశి) గారాబుపట్టి స్వీటీ (అనుష్క). అందమైన స్వీటీ ఏ విషయాన్నీ పెద్దగా సీరియస్ గా తీసుకోదు. తల్లితోపాటు తమ్ముడు యాహూ (భారత్), తాతయ్య (గొల్లపూడి) ఆమె కుటుంబం. తండ్రి లేని లోటు లేకుండా పిల్లల్ని పెంచుతున్న రాజరాజేశ్వరికి స్వీటీ పెళ్లి ఓ సమస్యగా మారింది. ఓ ఎన్నారై ని తన అల్లుడిగా చేసుకోవాలని కలలుగనే రాజరాజేశ్వరి కల తీరడానికి ఉన్న ఏకైక అడ్డంకి స్వీటీ బరువు. పెళ్ళికొడుకులు తనని తిరస్కరిస్తున్నా బరువు తగ్గడాన్ని సీరియస్ గా తీసుకోదు స్వీటీ. అంతేకాదు, ఒకానొక ఎన్నారై పెళ్ళికొడుకు అభి (ఆర్య) ని తనే తిరస్కరించి, అటుపై అతనితో స్నేహం చేస్తుంది.

కొన్ని పరిస్థితుల కారణంగా బరువు తగ్గి తీరాలని బలంగా నిర్ణయించుకున్న స్వీటీ అందుకోసం ఎలాంటి ప్రయత్నాలు చేసింది, వాటి తాలూకు పరిణామాలు ఏమిటన్నదే కనిక కోవెలమూడి రాసిన 'సైజ్ జీరో' కథ. ఆమె భర్త ప్రకాష్ కోవెలమూడి ఈ సినిమాకి దర్శకుడు. మామూలుగా మొదలై, ఒక్కో సీన్ కీ ఆసక్తిని పెంచుకుంటూ వెళ్లి, 'అప్పుడే ఇంటర్వల్ వచ్చేసిందా?' అనిపించిన దర్శకుడు, రెండోసగానికి వచ్చేసరికి కొంత తడబడ్డాడేమో అనిపించింది. చెప్పదలచుకున్న పాయింట్ మొత్తాన్ని రెండో సగం కోసం దాచేసుకోడం, చెప్పాలనుకున్న విషయాన్ని కన్విన్సింగ్ గా చెప్పడంలో తడబాటు వల్ల ప్రధమార్ధం ముందు, ద్వితీయార్ధం తేలిపోయినట్టుగా అనిపించింది. మరికొంచం జాగ్రత్త తీసుకుని ఉండాల్సింది.


ఇది పూర్తిగా అనుష్క సినిమా. ఒక నటిగా తనకి దొరికిన పాత్రని ఆమె ఎంత అంకితభావంతో చేస్తుందో చెప్పే మరో ఉదాహరణ 'సైజ్ జీరో.' బరువు పెరగడం మాత్రమే కాదు, స్వీటీ పాత్రలోకి అక్షరాలా పరకాయ ప్రవేశం చేసేసింది అనుష్క. నిస్సందేహంగా ఇది హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా. నాయికని లక్ష్యం దిశగా నడిపించే పాత్ర హీరోది. అయితే, ఈ హీరో పాత్రకి తనకంటూ ఓ లక్ష్యం లేనివిధంగా చిత్రించారు. మొదటి సగంలో స్వచ్చ భారత్ డాక్యుమెంటరీలు తీసే ఎన్నారై, రెండో సగానికి వచ్చేసరికి పూర్తిగా నాయికకి సహాయకుడిగా మారిపోయాడు. హీరో పాత్రని కూడా శక్తివంతంగా రాసుకుని ఉంటే, సినిమా మొత్తం ఒకే టెంపో తో నడిచి ఉండేదేమో.

అనుష్కతో పాటు ఊర్వశికీ, గొల్లపూడికీ మంచి పాత్రలు దొరికాయి. ఒక్క పాట మినహా కీరవాణి సంగీతంలో గుర్తుపెట్టుకోడానికి ఏమీలేదు. రి-రికార్డింగ్ కి మంచి అవకాశం ఉన్న సన్నివేశాలు చాలానే ఉన్నా, కీరవాణి ఎందుకో స్పందించలేదు మరి. రెండు సన్నివేశాల్లో కనిపించిన బ్రహ్మానందం పాత్రని కథలో అంతర్భాగం చేయలేదు. పోసాని కృష్ణ మురళి, తనికెళ్ళ భరణి చెరో సీన్లోనూ కనిపించారు. ప్రతినాయకుడిగా ప్రకాష్ రాజ్ సినిమా ద్వితీయార్ధాన్ని ఆక్రమించేశాడు, తన మార్కు 'అతి' తో సహా. నాగార్జున, రానా, తమన్నా, రకుల్ ప్రీత్ లు అతిథి పాత్రల్లో తెరమీద మెరిశారు. నాగార్జున మినహా మిగిలిన వాళ్ళకి డైలాగులు లేవు. సోనాల్ చౌహాన్, అడవి శేష్ పాత్రల్లో స్పష్టత లోపించింది. కెమెరా పనితనం (నిరవ్ షా) కంటికింపుగా ఉంది. ఎడిటర్ (ప్రవీణ్ పూడి) ద్వితీయార్ధంలో తన కత్తెరకి పెద్దగా పని చెప్పలేదు. కిరణ్ సంభాషణల్లో అక్కడక్కడా మెరుపులున్నాయి.

వైవిధ్యం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్న సినిమా నటీనటుల పుణ్యమా అని సిక్స్ ప్యాకులు, సైజ్ జీరోలు వాడుక భాషలో భాగమైపోయాయి కాబట్టి ఇంగ్లీష్ లో ఉన్న సినిమా టైటిల్ ఎంతమందికి అర్ధమవుతుంది అన్న ప్రశ్న రాదు. సెన్సార్ 'యు/ఏ' ఇవ్వాల్సినంత ఏముందో అర్ధం కాలేదు. మొత్తం మీద చూసినప్పుడు, ప్రధమార్ధం ఒక సినిమా, ద్వితీయార్ధం మరో సినిమాలాగా అనిపించింది. దీనికి తోడు, అనుష్క కూడా ఇంటర్వల్ తర్వాత ఉన్నట్టుండి కళ్ళజోడు తీసేసింది. 'సినిమాలో ఏమీ లేదా?' అంటే లేదని కాదు, ఓ గొప్ప సినిమా అవడానికి అవకాశం ఉండీ, మంచి ప్రయత్నం గానే మిగిలిపోయిందన్న అసంతృప్తి, అంతే. మేథావుల మాట ఎలా ఉన్నా, వైవిధ్య భరితమైన సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులు చూడాల్సిన సినిమా ఇది.

బుధవారం, నవంబర్ 25, 2015

కోనసీమ రైలు

మా కోనసీమ నేల మీద సైకిళ్ళు, మోటారు సైకిళ్ళ మొదలు, లారీలు, కార్లు, బస్సుల వరకూ అనేక రకాల వాహనాలు తిరుగాడతాయి. మా గాలిలో హెలికాప్టర్లు, అప్పుడప్పుడూ దారితప్పిన విమానాలూ విహరిస్తూ ఉంటాయి. అక్కడ కలికానిక్కూడా కనిపించందల్లా రైలుబండి ఒక్కటే. కూ అని కూత పెట్టుకుంటూ వచ్చే రైలు కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు మా కోనసీమ ప్రజ. ఏళ్ళ తరబడి మమ్మల్ని ఊరిస్తూ దూరం నుంచే వెళ్లిపోతోందే తప్ప, కోనసీమ ముఖద్వారం దాటి లోపలి రావడం లేదు రైలుబండి.

చిన్నప్పుడు ఎక్కడికైనా ప్రయాణం అంటే సరదాగానే ఉన్నా, కిక్కిరిసిన బస్సులు, మెటాడోర్లు చూసి చిరాకొచ్చేసేది. బహు చిన్నప్పుడే రైల్లో భాగ్యనగర యాత్ర చేసొచ్చేనేమో, 'మన దగ్గరా రైలుంటే బాగుండు కదా' అనిపించేసేది. ఏదన్నా అనిపిస్తే వెంటనే చెప్పేది తాతయ్యతోనే కదా. ఆ అలవాటు చొప్పున ఈ మాటా ఆయన చెవిన వేశాను. "మనది బురద నేలరా. రైలు చాలా బరువుగా ఉంటుంది కదా.. పట్టాలున్నా, ఆ బరువుకి నేలలో కూరుకుపోతుంది," అనేయడంతో రైలాశని నిరాశ చేసేసుకున్నాను. తాతయ్య చెప్పింది నిజం కాదని తెలిసేనాటికి, రైలు రావడం అంత సులభం కాదన్న తత్త్వం బోధపడింది.

నాతో సహా, మా కోనసీమ ప్రజలందరిలోనూ రైలు కోరికని చమురు పోసి ఒత్తి వేసి వెలిగించిన వాడు గంటి మోహన చంద్ర బాలయోగి. చిన్న పదవులతో రాజకీయ జీవితం మొదలు పెట్టి, ఏకంగా లోక్ సభ స్పీకర్ స్థానానికి ఎదిగిన బాలయోగి, పుట్టిన ప్రాంతాన్ని మర్చిపోకుండా కోనసీమ రైలు ప్రాజెక్టు కలని నిజం చేసే ప్రయత్నాలు ఆరంభించాడు. ముందుగా కాకినాడ-కోటిపల్లి మధ్య రైలు మార్గం వేయించి, అటుపై కోటిపల్లి-నరసాపురం రైల్వే లైనుకి నాటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ చేత శంకుస్థాపన చేయించేశాడు.

రాబోయే రైలుబండికి స్వగతం పలకడానికి మేమందరం సిద్ధపడుతూ ఉండగా ఆశనిపాతం లాంటి కబురు. బోల్డంత భవిష్యత్తు ఉన్న బాలయోగిని అకాల మరణం పలకరించింది, అది కూడా అత్యంత అనూహ్యంగా. (ఈ సంఘటన గురించి ఇప్పటికీ రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి, కోనసీమలో). కేంద్రంలో పట్టించుకునే నాథుడు లేకపోవడంతో రైల్వే లైను కథ మళ్ళీ మొదటికొచ్చింది. నాటినుంచీ అడపా దడపా రైల్వే లైను డిమాండు తెరమీదకి వచ్చి వెడుతూనే ఉంది. అంతేకాదు, 'కోనసీమకి రైలు మార్గాన్ని సాధిస్తా' అని ప్రజలకి వాగ్దానం చేయని నాయకుడు లేడు. ప్రాజెక్టు కోసం నడుం కట్టిన పుణ్యాత్ముడూ లేడు.


శిలాఫలకం వెలిసిన పదమూడేళ్ళకి ఇదిగో ఇప్పుడు మళ్ళీ రైల్వే లైను ఉద్యమం ఊపందుకుంటోంది. ఇన్నాళ్ళుగా పోరాడుతున్న వాళ్లకి తోడుగా యువతరం కదిలొచ్చింది. కోనసీమ యువ రైల్వే సాధన సమితి పేరుతో దేశ విదేశాల్లో ఉన్న కోనసీమ వాళ్ళందరినీ ఫేస్బుక్, వాట్సాప్ ల ద్వారా ఏకతాటి మీదకి తెస్తోంది. పిల్లలూ, పెద్దలూ కలిసి ఏర్పాటు చేసుకున్న జాయింట్ యాక్షన్ కమిటీ నవంబర్ 27 నుంచి నాలుగు రోజుల పాటు రైల్వే లైను కోసం ఎంపిక చేసిన యాభై ఐదు కిలోమీటర్ల మార్గంలో పాదయాత్ర చేయబోతున్నారు. ఇది కేవలం ప్రారంభం అంటున్నారు మరి.

మాన్య మంత్రిణి మమతా బెనర్జీ శంకుస్థాపన చేసిన రోజున అంచనా వ్యయం ఆరువందల కోట్లు. అదీనాటికి పెరిగి పెద్దదై పద్దెనిమిది వందల కోట్ల పైచిలుకుకి లెక్క తేలింది. 'ఈ ప్రాజెక్టు మీద ఇంత సొమ్ము పెడితే తిరిగి వస్తుందా?' అని రైల్వే వారి సందేహమట. పోరాట కమిటీ వాళ్ళు ఆ లెక్కలూ తీశారు. ప్రయాణికుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పక్కన పెడితే, ప్రస్తుతం లారీల ద్వారా రవాణా చేస్తున్న కొబ్బరి, అరటి, చేపలు, రొయ్యలు తదితరాలని రైలు రవాణాకి మళ్ళించడం అటు ఎగుమతి దారులకి ఇటు రైల్వే కి ఉభయ తారకంగా ఉంటుందిట.

కోనసీమ రైల్వే టూరిజం అని ఒకటి ప్రారంభిస్తే, దేశ విదేశాల్లో ఉన్న టూరిస్టులని ఆకర్షించవచ్చునట. దానా, దీనా ఐదేళ్ళలో ప్రాజక్టు వ్యయం వెనక్కి వచ్చేస్తుంది అంటున్నారు. కాలపరిమితి కొంచం అటూ ఇటూ అవ్వచ్చేమో కానీ, పెట్టిన సొమ్ము బూడిదలో పోసిన పన్నీరయ్యే ప్రశ్నే లేదు. రైల్వే బడ్జెట్ తయారీకి మూడు నెలలు ముందుగా మొదలవుతున్న ఈ ఉద్యమాన్ని దఫదఫాలుగా పెంచుకుంటూ వెళ్లి, ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి సొమ్ము విడుదల చేయించే లక్ష్యంతో పనిచేస్తున్నారు కార్యకర్తలు.

అన్ని రాజకీయ పార్టీల మద్దతూ కూడగట్టి చేస్తున్న ఈ ఉద్యమం, ప్రభుత్వాన్ని ఏ మేరకి కదిలించగలదు అన్నది ప్రశ్న. నిధుల విషయంలో తొలినుంచీ ఆంధ్ర ప్రదేశ్ ని చిన్న చూపు చూస్తున్న కేంద్రం, బీహార్ ఫలితం చూశాకన్నా మనసు మార్చుకోక పోతుందా అని ఓ చిన్న ఆశయితే ఉంది. మాన్య ముఖ్యమంత్రి వర్యులకి ఎటూ టూరిజం ఆరోప్రాణం కాబట్టి అందుకోసమైనా వారీ ప్రాజెక్టు విషయంలో కలగజేసుకోవచ్చు. మా రైలుబండి కల తీరనూ వచ్చు. పోరాటం శాంతియుతంగానూ, శక్తివంతంగానూ సాగాలనీ, విజయం సాధించాలనీ మనస్పూర్తిగా కోరుకుంటూ...

గురువారం, నవంబర్ 19, 2015

వసంతగీతం

లింగయ్య పద్దెనిమిదేళ్ళ కుర్రాడు. చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్నాడు. తల్లి గట్టుమల్లు కి కళ్ళు కనిపించవు. అన్న రాయమల్లు కొత్తగా పెళ్లి చేసుకున్నాడు. వదిన గంగమ్మ తన ఈడుదే. అన్న లాగా, ఊళ్ళో మిగిలిన తన ఈడు కుర్రాళ్ళ లాగా పాలేరు పని చేయడం ఇష్టం లేదు లింగయ్యకి. అలాగని వేరే ఏం చెయ్యాలో తెలీదు. వయసొచ్చిన కొడుకు ఏపనీ చేయకుండా ఇంట్లో కూర్చోడం తల్లికి ఏమాత్రం నచ్చక, లింగయ్య ఎదురు పడినప్పుడల్లా తిట్లందుకోడం మొదలుపెట్టింది. వదిన ఎదురుగా తల్లి తనని తిట్టడం భరించలేని లింగయ్య ఇంట్లోనుంచి పారిపోయి అన్నల్లో చేరిపోయాడు. ఆ తర్వాత అతని కథా,  ఆ కుటుంబం కథా ఎన్ని మలుపులు తిరిగిందన్నదే పాతికేళ్ళ క్రితం ప్రచురితమైన 'వసంతగీతం' నవల.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్రంలో జరిగిన నక్సల్బరీ పోరాటాల్లో 'ఇంద్రవెల్లి' ఘటన ప్రత్యేకమైనది. పోడు భూములపై సాగు హక్కుని సాధించుకోడం కోసం వందలమంది గిరిజనులు 1981 ఏప్రిల్ 20 న సమావేశం కావడం, అనుమతి లేదన్న కారణాన్ని,  పరిస్థితులు అదుపు తప్పే ప్రమాదం ఉందన్న నెపాన్నీ చూపి పోలీసులు కాల్పులు జరపడం, అటుపై ఆదిలాబాద్ జిల్లాలో నక్సల్బరీ ఉద్యమం మరింతగా ఊపందుకోడమూ చరిత్ర. 'ఇంద్రవెల్లి ఘటన' జరిగిన మూడేళ్ళకి మొదలవుతుంది 'వసంతగీతం' నవలలో కథ. లింగయ్య దళంలో చేరే నాటికి దళం ఆదిలాబాద్ అడవుల్లో అడుగు పెట్టి ఐదేళ్ళు గడుస్తుంది. తొలినాళ్ళ ఇబ్బందుల్ని అధిగమించి గిరిజనంలోకి మరింతగా చొచ్చుకుపోయే ప్రయత్నాల్లో ఉంటుంది.

మరోపక్క, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, రాష్ట్రంలో కాంగ్రెస్ పై విజయవిహారం చేసి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఏకాభిప్రాయానికి వచ్చిన ఏకైక అంశం 'నక్సల్ అణచివేత.' అడివంచు పల్లెల్లో పోలీస్ స్టేషన్ల ఏర్పాటు, సిబ్బంది పెంపు, ఇన్ఫార్మర్ వ్యవస్థ ఏర్పాటు, నక్సలైట్ల తలలకి వెలలు నిర్ణయించడం మొదలు, ఏజెన్సీ గిరిజనులకోసం లెక్కలేనన్ని సంక్షేమ పధకాలు ప్రకటించడం వరకూ ప్రభుత్వం బహుముఖ వ్యూహాన్ని అనుసరిస్తున్న తరుణంలోనే, గిరిజనులతో మమేకమై వాళ్ళని హక్కులకోసం పోరాటానికి సన్నద్ధం చేసే కార్యక్రమంలో నిమగ్నమై పనిచేయడం మొదలు పెడతాయి నక్సల్ దళాలు.

వివిధ కాలాల్లో అడివి రూపురేఖలు, దళం సభ్యుల వ్యక్తిగత జీవితాలు, సమిష్టి జీవితం, లక్ష్యం కోసం పనిచేసే క్రమంలో ఎదురయ్యే అవాంతరాలు, ఎన్కౌంటర్లలో పోరాట సహచరులని కోల్పోవడం లాంటి ఎదురు దెబ్బలు, అంతలోనే వాటినుంచి తేరుకుని పోరాటానికి పదును పెట్టడం.. వీటన్నింటీ దగ్గరనుంచీ చూస్తాడు 'కామ్రేడ్ గట్టయ్య' గా మారిన లింగయ్య. సోదరభావంతో కలిసి పనిచేసే దళం నుంచీ, మగవాళ్ళతో సమంగా కష్టపడే కామ్రేడ్ రాధక్క నుంచీ ఎంతో స్ఫూర్తి పొందుతాడు. అయితే,  ఊహించని విధంగా అతని కుటుంబానికి ఎదురైన ఆటుపోట్లు గట్టయ్యని తిరిగి లింగయ్య గా మారేలా చేస్తాయి. దళాన్ని విడిచి ఊరికి తిరిగి వెళ్ళిన లింగయ్య దళంలో అలవడిన కొత్త దృష్టితో తన పల్లెని పరిశీలించడం మొదలుపెడతాడు.


అడివిలో ఉంటూ గట్టయ్యగా తను చేసిన ఉద్యమం ఫలితం తన పల్లెమీద ఏమేరకి ఉన్నదన్నది అతను స్వయంగా తెలుసుకోగలుగుతాడు. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో వచ్చిన మార్పు పల్లె రాజకీయాల్లోనూ ప్రతిబింబిస్తుంది. ఆ ఊరి జమీందారు, కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి మారడానికి సిద్ధ పడతాడు. గిరిజనులతో స్నేహం నటిస్తూనే,  పోలీసులని ఉపయోగించుకుని తనకి కావలసిన పనులు జరిపించుకునే కొత్త తరహా రాజకీయ చాణక్యానికి తెరతీస్తాడు. ఊళ్ళో జరిగిన ఓ కేసులో పోలీసుల చేతికి చిక్కిన లింగయ్యకి పోలీసుల పనితీరుని దగ్గరనుంచి చూసే అవకాశం వస్తుంది. తనకి తెలియకుండానే పోలీసుల పనితీరునీ, దళం పనితీరునీ బేరీజు వేసుకుంటాడు. దళం సభ్యుల మధ్య ఉన్న సోదరభావం పోలీసుల్లో లేకపోవడం అతని దృష్టిని దాటిపోదు. లింగయ్య తన జీవితాన్ని ఎక్కడ వెతుక్కున్నాడన్నది నవల ముగింపు.

'వసంతగీతం' నవల తొలి ముద్రణ 1990 ఆగస్టులో జరిగింది. రచయితపేరు పులి ఆనంద్ మోహన్. డిసెంబర్ 2013 లో జరిగిన మలిముద్రణ నాటికి రచయిత అల్లం రాజయ్య తన అసలు పేరుని ప్రకటించుకోగలిగారు, "ఆ నాటి పరిస్థితుల కారణంగా ఈ నవల మొదటి ముద్రణ పులి ఆనంద్ మోహన్ పేరుతో అచ్చయింది" అన్న వివరణతో సహా. ఎనభైల కన్నా తొంభైల్లో, అప్పటికన్నా ఇప్పుడు మరింతగానూ పరిస్థితులు మారాయి. అన్నిరంగాలలోనూ పెనుమార్పులు తోసుకు వచ్చాయి. అయితే, 'భూమి' సమస్య మాత్రం అలాగే ఉంది. నాటి సమస్య వ్యవసాయ భూముల  పంపిణీ అయితే, నేటి సమస్య పరిశ్రమల బారినుంచి భూముల రక్షణ. మరోపక్క, మావోయిష్టులు గా పేరుమార్చుకున్న నక్సలైట్ల గ్రూపుల్లో ఎన్నో చీలికలు వచ్చాయి.

మావోయిష్టుల షెల్టర్ జోన్ అయిన అడవుల విస్తీర్ణం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తగ్గుతోంది. పోలీసు బలగం పెరిగింది. నాటితో పోలిస్తే, గిరిజనుల మద్దతు ఏమేరకు ఉన్నదన్నది ప్రశ్నార్ధకం. ఈ నేపధ్యంలో  'వసంతగీతం' చదవడం ఎన్నో ప్రశ్నలని మిగిల్చింది. వరవరరావు రాసిన నలభై పేజీల ముందుమాటలో కొన్ని ప్రశ్నలకి జవాబులు దొరికినట్టే అనిపించింది. 'లింగయ్య మరెవరో కాదు రచయిత రాజయ్యే నేమో' అనిపించేంత సహజంగా ఉంది పాత్రచిత్రణ, అనేకానేక సన్నివేశాల కూర్పూ. "హెమండార్ఫ్ సంస్కరణలు బూటకమని నిరూపించాగలిగాం" అని ఓ సందర్భంలో ఓ దళ  సభ్యుడి చేత చెప్పించిన రచయిత, ఆ విషయాన్ని గురించి మరింత వివరంగా చెబుతారని నవల చివరికంటా ఎదురు చూసినా ఫలితం లేదు. (హెమండార్ఫ్ సంస్కరణల గురించి ఫణికుమార్ రాసిన 'గోదావరి గాథలు' పుస్తకంలో చదవొచ్చు).

ఒకే ఒక్క సన్నివేశంలో ఒక కేంద్రమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి భేటీ (పీవీ నరసింహారావు-ఎన్టీఆర్) మినహా మిగిలిన కథంతా అడవులు, తండాలు, పోలీసు స్టేషన్లలోనే జరుగుతుంది. కొన్ని కొన్ని  సన్నివేశాలు కేవలం చదువుతున్నట్టు కాక, స్వయంగా చూస్తున్నట్టు అనిపించడం రచయిత ప్రతిభే. "ఆదిలాబాద్  జిల్లా పార్టీ నాయకత్వంలో ఒక దళం దైనందిన జీవితం, పోరాట ఆచరణ, త్యాగాలు చిత్రించిన రాజకీయార్ధిక చారిత్రక నవల ఇది. రష్యా, చైనా విప్లవాల కాలంలో వెలువడిన యుద్ధ కాలపు నవలల వంటి ఒక ప్రామాణిక (క్లాసికల్) నవల ఇది" అంటారు వరవరరావు. ఎన్ కౌంటర్లలో పాల్గొన్న రెండో పక్షమైన పోలీసుల నుంచి, అదికూడా కింది స్థాయి ఉద్యోగులైన కానిస్టేబుళ్ల నుంచి వారి అనుభవాలు రచనలుగా వస్తే బాగుండుననిపించింది. నాణేనికి రెండో వైపుని కూడా సంబంధీకులనుంచి వినడం అవసరం కదా. ('వసంతగీతం,' పర్ స్పెక్టివ్స్ ప్రచురణ, పేజీలు 420, వెల రూ. 250, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ద్వారా లభ్యం).

సోమవారం, నవంబర్ 16, 2015

అర్జున మంత్రం -2

(మొదటి భాగం తర్వాత)

ఏం చెయ్యాలో తోచక చుట్టూ చూస్తున్నా. కుర్చీ పక్కనే ఉన్న పెద్ద కిటికీ లోంచి ఇంటి ఆవరణ చాలావరకూ కనిపిస్తోంది. వీధి వైపు ప్రహరీ లోపల వరసగా అరటి, కొబ్బరి చెట్లు. సందు పొడవునా కాయగూర మళ్ళు, పూల మొక్కలు. పూర్వకాలపు మండువా లోగిలి పెంకుటిల్లే అయినా చాలా దిట్టంగా ఉంది కట్టడం. లోపల ఎన్ని గదులున్నాయో తెలియదు కానీ, ఎక్కడా శబ్దం అన్నది వినిపించడం లేదు.

అంత నిశ్శబ్దంలో ఒక్కసారిగా నా మొబైల్ రింగ్ అయ్యేసరికి ఉలికిపడ్డాను. మేఘన కాల్. 'హనీకి లేక్టోజెన్ పేకెట్ ఒకటి' తీసుకురమ్మని. "ఓ పేకెట్ ఉంది కానీ, మరొకటి దగ్గరుండడం సేఫ్ సైడ్ కదా.." అంటూ, త్వరగా వచ్చేయమని చెప్పి కాల్ కట్ చేసింది.

హనీకి ఇప్పుడు తొమ్మిది నెలలు. పుట్టినప్పుడు అచ్చం మేఘనలాగే ఉండేది కానీ, ఇప్పుడు నా పోలికలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఏడాది నిండే వరకూ పిల్లలు ఎవరి పోలికో చెప్పలేం అంటూ ఉంటుంది అమ్మ. నిజమే అని నిరూపిస్తోంది హనీ. నా కూతురని చెప్పడం కాదు కానీ భలే బుద్ధిమంతురాలు. ఆ వయసు పిల్లల్లో ఉండే తిక్క, రాత్రుళ్ళు జాగారం చేయించడం లాంటివి అస్సలు లేవు. ఎప్పుడో తప్ప తిక్క పెట్టదు.

'హనీ ఇంత బుద్ధిగా కాకుండా బాగా అల్లరిచేసే పిల్లయినా బాగుండేదేమో' అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. అసలు శ్రీకర్ పెళ్ళికి నేనొక్కడినే వద్దామనుకున్నాను. 'చంటి పిల్లతో అంతదూరం ప్రయాణం కష్టం ' అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాను కానీ, వాడి దగ్గరా నా ఆటలు? మొత్తం నాలుగు రోజుల ప్రయాణానికి అన్ని ఏర్పాట్లూ చేసేశాడు. మేఘన కూడా ప్రయాణానికి సిద్ధ పడడంతో ఇక నేనేమీ మాట్లాడేందుకు  లేకపోయింది.

పెళ్లి కుదిరినప్పటినుంచీ సహజంగానే వాడు చాలా ఎక్సైట్ అవుతున్నాడు. "పల్లెటూరి సంబంధం అంటే అమ్మాయి మరీ మందాకినిలా కాకపోయినా, కనీసం ప్రమద్వరలా అన్నా ఉంటుందనుకున్నానురా.. ఈమె చూడబోతే తరళ పోలికలతో పుట్టినట్టుంది," అన్నాడు ఆ మధ్య ఒకరోజు. నేనేమీ మాట్లాడకుండా ఓ ఫోన్ నంబర్ ఇచ్చాను వాడికి.

"యండమూరి నెంబర్రా.. నీకు సరిపోయేట్టుగా ఓ హీరోయిన్ ని సృష్టించి ఇమ్మని అడుగు.." అన్నాను. వాడిక్కోపం వచ్చి ఓ రోజంతా మాట్లాడడం మానేశాడు. అది చాలా పెద్ద శిక్ష నాకు. ఆ విషయం వాడికీ తెలుసు.

 స్టేట్స్ నుంచి రాగానే నన్ను రిసీవ్ చేసుకుంటూ, "అమెరికాలో జెండా పాతి వచ్చావా?" అని కన్ను కొట్టాడు. తల అడ్డంగా ఊపాను. "అసలు నిన్ను యూఎస్ పంపిన వాణ్ణనాలి," అంటూ నవ్వేశాడు వాడు.

నీళ్ళు తెచ్చిచ్చిన కుర్రాడు కాఫీతో వచ్చి "తాతయ్యగారు వచ్చేస్తున్నానని చెప్పమన్నారండీ," అని చెప్పి వెళ్ళాడు. కాఫీ తాగుతూ మళ్ళీ శ్రీకర్ ని గుర్తు చేసుకున్నాను. నా పెళ్ళిలో హడావిడంతా వాడిదే. ఒక్క క్షణం నన్ను విడిచిపెట్టలేదు.

పెళ్ళైన మర్నాడు మధ్యాహ్నం నిద్రపోయి అప్పుడే లేచాను. వాడు హడావిడిగా నా గదికొచ్చి, లేపీ ఆన్ చేసి, కూడా తెచ్చిన మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేశాడు. తాతగారి పాటలతో ప్రత్యేకంగా చేసిన వీడియో. 'మౌనమేలనోయి' మొదలు 'కాయ్ లవ్ చెడుగుడు' వరకూ సెలెక్టెడ్ సాంగ్స్.

"చూసి బాగా ప్రిపేర్ అవ్వు.." సీరియస్ గా చెప్పాడు. మళ్ళీ వాడే "గురువుగారిదో నవలుంది, 'ప్రేమ' అని.. వేదసంహిత-అభిషేక్ ల మధ్య రొమాన్స్.. గొప్పగా ఉంటుందిలే.. తెచ్చిస్తాను క్విక్ బ్రౌజ్ చేద్దూగాని..."

వాణ్ని చెయ్యి పట్టుకుని ఆపి చెప్పాను "చాలబ్బాయ్.. టీవీ చూసి వ్యవసాయం, పుస్తకాలు చదివి సంసారం.. చేసినట్టే.." వాడు తన చెయ్యి లాక్కుని, రెండు చేతులూ నడుం మీద పెట్టుకుని "ఒక్క రోజులో ఎంత పెద్దవాడివి అయిపోయావ్ రా? ఈ లెక్కన రేపు తెల్లారేసరికి ఇంకెంత పెద్దవాడివి అయిపోతావో..." అంటూండగానే, చూపుడు వేలితో గుమ్మం వైపు చూపించాను కొంచం సీరియస్ గా.

అదొకటుంది వాడిదగ్గర, గీత దాటడు అలాగని పూర్తిగా వదిలెయ్యడు. మేఘన లేబర్ లో ఉన్నప్పుడైతే వాడు ఒక్క క్షణం కూడా నన్ను వదల్లేదు. డాక్టర్ ఇచ్చిన డేట్ కన్నా ముందే మేఘన ని హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది. అమ్మా నాన్నా అప్పటికప్పుడు హడావిడిగా బయల్దేరారు. రాడానికి టైం పడుతుంది.

మేఘన పేరెంట్స్ తనని చూసుకుంటున్నారు. నార్మల్ అవుతుందని ఒక రోజంతా వెయిట్ చేయించారు డాక్టర్. ఇరవై నాలుగు గంటల పాటు భయంకరమైన లేబర్.. ఆ పెయిన్స్ ని అనుభవించిన మేఘన మర్చిపోతుందేమో కానీ, విన్న నేను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను. శ్రీకర్ రోజంతా ఫోన్లోనే ఉన్నాడు నాతో. ఆమె మీద నాకు మొదలైన కన్సర్న్, టైం గడిచే కొద్దీ నామీద నాకు అసహ్యం కలిగే వరకూ వచ్చింది.

"ఆడవాళ్ళందరికీ తప్పదురా ఇది.. సృష్టి ధర్మం.. తను బాధ పడుతోంది కరెక్టే.. కానీ, నువ్వు ఇంత బాధ పడ్డం మాత్రం.. కరెక్ట్ కాదు.." వాడు చెబుతూనే ఉన్నాడు. మర్నాడు అమ్మా, నాన్నా రావడం, మేఘనకి డాక్టర్ సిజేరియన్ చేయడం ఒకేసారి జరిగాయి. ఆమెని కళ్ళెత్తి చూడ్డానికి కొంత సమయం పట్టింది నాకు.

హనీకి మూడో నెల వచ్చాక చెకప్ కోసం మేఘనని గైనిక్ దగ్గరికి తీసుకెళ్ళాను. ఫార్మాలిటీస్ పూర్తి చేసి "మీరు మళ్ళీ మొదలుపెట్టొచ్చు.." ఎటో చూస్తూ అభావంగా చెప్పింది మా ఇద్దరికీ. నాకు అర్ధమయినా, కానట్టుగా ఉండిపోయాను. మేఘనని  తాకాలంటే ఏదో సంకోచం.

దాదాపు నెల్లాళ్ళ తర్వాత ఈ విషయాన్ని పసిగట్టాడు శ్రీకర్. నేరుగా నేనుండే చోటికి వచ్చేశాడు. ఇంటికి మాత్రం రానని చెప్పేశాడు. ఆ రాత్రి రెస్టారెంట్లో డిన్నర్. టేబుల్ దగ్గర కూర్చుంటూనే నేరుగా విషయంలోకి వచ్చేశాడు. వాడిదగ్గర నాకు దాపరికం ఏముంది? బీర్ బదులుగా విస్కీ ఆర్డర్ చేసి కాసేపు ఆలోచనలో ఉండిపోయాడు. నేను ఫోన్లో ఎఫ్బీ అప్డేట్లు చెక్ చేసుకుంటూ ఉండగా చాలా సీరియస్ గా మొదలుపెట్టాడు.

"మేఘన విషయం నువ్వు చాలా కన్వీనియంట్ గా మర్చిపోతున్నావు.. నీకొద్దు సరే, మరి తనకి?" వాడి ప్రశ్నకి జవాబు లేదు నాదగ్గర. "అండ్, ఈ వైరాగ్యం తాత్కాలికం.. ఇందుకోసం మీ ఇద్దరిమధ్యా దూరం పెరగకూడదు.." కళ్ళెత్తి చూశానోసారి.

"పెళ్లి, సంసారం నాకేమాత్రం తెలియని విషయాల్రా.. కానీ ఒకటి మాత్రం తెలుసు. మగాడికి బాధ్యతలు ఉంటాయి.. అవి నెరవేర్చడంలో ఒక్కోసారి ఇష్టంతో పని ఉండకూడదు.." కళ్ళముందు మెరుపులు మెరిశాయి నాకు. విస్కీ సిప్ చేస్తున్నాం ఇద్దరం.

"ఇంకొక్క స్మాల్ పెగ్ కి మాత్రమే పర్మిషన్ నీకు. ఫ్రెష్ అయిపోతావు పూర్తిగా.. ఇంటికెళ్ళు.. మొదలుపెట్టు.. ఒక్కసారి మొదలైతే..." మాటల కోసం వెతుక్కోడానికి ఆగాడు. విస్కీతో పాటు, వాడి మాటలూ పనిచేశాయి. కానీ, ఆవేళ రాత్రి మేఘన నన్ను బలంగా తోసేసి, హనీని పక్కలోవేసుకుంది. నిద్రపోలేదు, నిద్ర నటించింది.

మర్నాడు నేను ఆఫీస్ కి వెళ్లేసరికి రిసెప్షన్లో ఎదురు చూస్తున్నాడు శ్రీకర్. కేంటీన్ కి తీసుకెళ్ళి జరిగింది చెప్పాను. "నాకేమీ అర్ధం కావడం లేదురా.. కానీ, ప్రతీ సమస్యకీ పరిష్కారం ఉంటుంది.. డోంట్ వర్రీ.. ఆలోచిద్దాం.. నాకిప్పుడు ఫ్లైట్ టైం అవుతోంది.." అంటూ వెళ్ళిపోయాడు.

మేఘన ధోరణిలో ఏ మార్పూ లేదు. ఆ ఒక్క విషయం తప్ప, భూమ్మీద సమస్త విషయాలూ మాట్లాడుతోంది. పరిష్కారం వెతుకుతూ ఉంటే, సైకియాట్రిస్ట్ దొరికాడు. ఇద్దరి మధ్యా విషయం కాబట్టి, కౌన్సిలింగ్ లో మేఘన కూడా ఉండాలన్నాడు. ఆ మాట వింటూనే ఇంతెత్తున లేచింది మేఘన. కౌన్సిలింగ్ కి రాకపోగా, నాతో మాటలు తగ్గించేసింది. ఐదార్నెల్లుగా అశాంతి పెరుగుతోందే తప్ప తగ్గడంలేదు.

"ఈ వైరాగ్యం తాత్కాలికం" ఎంత కరెక్ట్ గా చెప్పాడో శ్రీకర్!! 'అన్నీ ఉండీ ఏంటిదీ?' అనిపించని రోజు లేదు. అమ్మా, నాన్నలతో నేను కల్లో కూడా ఈ విషయం మాట్లాడలేను.

వాడి పెళ్లి హడావిడిలో ఉంటూ కూడా నాగురించి ఆలోచిస్తున్నాడు శ్రీకర్. "సోమయాజిగారనీ.. ఆ ఏరియా లో పెద్ద పేరుందిట్రా.. సిటీల్లో వాళ్ళలాగా కమర్షియల్ కాదు.. భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పేస్తారట.. అపాయింట్మెంట్ గొడవా అవీ ఏవీ ఉండవు.. నేరుగా ఇంటికి వెళ్లి కలవడమే..ఓ ప్రయత్నం చేసి చూడు," వాడి పెళ్ళికి నా ప్రయాణం ఫిక్స్ అయినప్పటినుంచీ చెబుతూ వస్తున్నాడు నాకు. ఇవాళ రాత్రి ముహూర్తానికి వాడి పెళ్లి.

గ్లాసు మీంచి జారిన కాఫీ చుక్కొకటి నా ఒళ్ళో ఉన్న కవర్ మీద పడింది. జేబులోంచి కర్చీఫ్ తీసి కవర్ తుడిచేశాను. నా పెళ్లి తర్వాత అమ్మిచ్చిన కవర్ అది. "అమ్మాయివీ, నీవీ జాతకాలు.. నీ దగ్గరుంచు," అంతకు మించి ఏమీ చెప్పలేదు. నేనూ అడగలేదు. అసలు వీటితో పని పడుతుందని కూడా అనుకోలేదు నేను.

విభూది పరిమళాలతో వచ్చారు సోమయాజి గారు. "కాస్త ముఖ్యమైన విషయం అయ్యేసరికి వెళ్ళాల్సొచ్చింది.. ఆలస్యానికి ఏమీ అనుకోకు బాబూ.." ఆయన అంటూండగానే కవర్ అందించబోయాను. అవసరం లేదన్నట్టుగా చేసైగ చేశారు.

"ఆడపిల్లా? మగపిల్లాడా?" ఆయన్నన్ను పరీక్షగా చూడడం ఇబ్బంది పెడుతోంది. "ఆడపిల్లండి.. పదోనెల వస్తుంది.." చెప్పాను. మళ్ళీ లోపలినుంచి పిలుపు రాక ముందే ఈయన విషయంలోకి వస్తే బాగుండును.

నా ఆలోచన చదివినట్టుగా "ఆ అరటి చెట్లు చూశావా బాబూ" అన్నారు. అరటి చెట్లలో చూడ్డానికి ఏముంటుందో అర్ధం కాక ఆయనవైపు చూశాను. 

"గెల పక్వానికి రాగానే చెట్టుని మొదలుకంటా నరికేస్తాం.. ఒక్కటే గెల.. మళ్ళీ కాపుండదు.. కదళీ వంధ్యత్వం అంటారు.." ఆయన చెప్పింది అర్ధమయ్యే కొద్దీ నా ముఖంలో రంగులు మారుతున్నాయి. అది గమనించి అభయం ఇచ్చారు..

"ఉహు, అది అరటి చెట్టుకే.. మనుషులకి కాదు.. కంగారు పడకు.. మనుషులకీ ఉంటే ఇంత సృష్టి జరుగుతుందా?"

నిజమే కదా! 

"సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించుకోలేక, దోషాల వంకలు వెతుక్కుంటూ ఉంటారు ఓపికా, శ్రద్ధా లేని వాళ్ళు.. కొత్త రుచులు కోరుకునే వాళ్లకయితే ఇదో అవకాశం కూడాను..." సోమయజిగారి స్వరం గంభీరంగా మారింది.

"పాప పుట్టాక ఇంట్లో నువ్వు కేవలం తండ్రిగా ఉంటున్నావా? మొగుడిగా కూడానా?" కన్ఫ్యూజింగ్ గా అనిపించింది ఆ ప్రశ్న.

"అమ్మాయిని ఏమాత్రం పట్టించుకుంటున్నావు? పాప పుట్టక మునుపూ, ఇప్పుడూ ఒకేలా చూసుకుంటున్నావా?" సూటిగా అడిగారు. అమ్మాయంటే మేఘన అని అర్ధమయ్యింది. శ్రీకర్ గాడికీ, నాకూ రాని ప్రశ్న ఇది.

మేఘన నేనూ హనీకి తల్లిదండ్రులం. అంతకన్నా ముందు ఇద్దరం భార్యాభర్తలం. ఆ సంగతి ఇద్దరం మర్చిపోతున్నామా? ఆలోచనలు చదివే శక్తి ఏదో ఉన్నట్టుందీయనకి.

"కావాల్సిందల్లా కాస్త సహనం, ఓర్పు.. ఏమీ తెలియని వాడివి కాదు కదా.. ఇంతకన్నా అరటిపండు ఒలవనక్కర్లేదు నేను," నవ్వేశారాయన. నేనూ తేలిక పడ్డాను.

"జాతకం చూడకుండానే ..ఎలా చెప్పగలిగారు?" చాలా సేపటినుంచీ లోపల దాచుకున్న ప్రశ్న అడిగేశాను అప్రయత్నంగా.

"దీనికి జాతకం అక్కర్లేదు బాబూ.. అనుభవం చాలు.. మీ ఇంట్లో నా వయసు వాళ్ళు ఉండుంటే ఇంత దూరం వచ్చే శ్రమ తప్పేది నీకు.." వయసొక్కటే కాదు, సమస్యలతో వచ్చే వాళ్ళెంతోమందిని దగ్గరగా చూసిన అనుభవమూ ఉంది కదా. ఆయనకి మరోసారి నమస్కరించి బయల్దేరాను.

తెలియకుండానే హుషారొచ్చింది. "మనో వేగమున మరో లోకమున మనో రధములిటు పరుగిడగా..." తాతగారి పాట.. ప్లేయర్ కాదు, నేనే పాడుతున్నాను.

అమ్మాయి వాలుజడలా అందంగా కనిపిస్తున్న తార్రోడ్డు మీద కారు పరుగులు తీస్తోంది.

(అయిపోయింది)

(వచన రచనకి మేస్త్రి, 'టుప్ టీక' కథా రచయిత, కీర్తిశేషులు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారికి కృతజ్ఞత)

శనివారం, నవంబర్ 14, 2015

అర్జున మంత్రం -1

"సఖియా.. చెలియా.. కౌగిలి.. కౌగిలి.. కౌగిలి..." తాతగారి పాట మొదలవ్వడంతోనే అప్రయత్నంగా కారు వేగం కాస్త పెంచి, అంతలోనే తగ్గించాను. ఏటిగట్టుని ఆనుకుని కొత్తగా వేసిన తార్రోడ్డు నల్లత్రాచులా ఉంది. గోదారి మీంచి వీస్తున్న గాలికోసం కారు అద్దాన్ని పూర్తిగా కిందకి దించాను.

"కొత్త రోడ్డు మీద పది పన్నెండు కిలోమీటర్లు వెళ్ళాక ఎడం వైపుకి ఎర్ర కంకర రోడ్డు వస్తుంది.. అగ్రహారంరా ఆ ఊరి పేరు. మొదట్లో పెద్ద రావిచెట్టు ఉంటుందట.. అచ్చం 'ఆనందోబ్రహ్మ' నవల్లోలా..." శ్రీకర్ గాడి మాటలు గుర్తొచ్చాయి.

నాకు తాతగారెలాగో, వాడికి యండమూరి అలాగ. ఆయన నవలల పేర్లు,  వాటిలో పాత్రలు ఎప్పుడూ వాడి నాలుక చివరనే ఉంటాయి. ఏం చేస్తున్నాడో పెళ్ళికొడుకు? నా ఈ ప్రయాణాన్ని గురించి  పూర్తిగా తెలిసింది వాడొక్కడికే. బయలుదేరే వరకూ నన్ను తరుముతూనే ఉన్నాడు.

మేఘనకి కూడా "ఓ ఫ్రెండ్ ని కలిసి వచ్చేస్తాను," అని మాత్రమే చెప్పి బయల్దేరాను.  తనూ నాతో వస్తానంటుందేమో అని అనుమానించాడు వాడు. ఒకవేళ అన్నా, తను చక్రం అడ్డేస్తానని ముందే చెప్పాడు. పాట పూర్తవ్వడంతోనే  ఆడియో రిమోట్ లో షఫుల్ ఆప్షన్ మీదకి వెళ్ళింది ఎడమచేతి బొటన వేలు. వినబోయే పాటని ముందే ఊహించేస్తే, ఆ పాటని ఎంజాయ్ చెయ్యలేం.

"జ జ జ జాజ జాబిల్లీ..." మళ్ళీ తాతగారు! "నింగి  నించి తొంగిచూసి.. నచ్చగానే నిచ్చెనేసి.. జర్రుమంటు జారింది..." ఎంత రసికుడివయ్యా మహానుభావా అసలు!! పాట వినడంకోసం కారు మరికొంచం స్లో చేశాను.. ఎలాంటి ట్రాఫిక్కూ లేదు రోడ్డు మీద. సైకిళ్ళ వాళ్ళు కూడా  కారుని దాటుకుని వెళ్ళిపోతున్నారు. ఏం పర్లేదు.. ఇంకా టైం ఉంది.

"ఆయన ఆహితాగ్ని.. అనుష్ఠానం పూర్తయ్యే వరకూ ఇంట్లో నుంచి బయటికి రారు. ఆయన్ని కలిసి, పని పూర్తి చేసుకునే రా.. ఇక్కడ నీ భోజనానికి నేను గేరంటీ.." కారు తాళాలిస్తూ శ్రీకర్ చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి. పక్క సీట్లో రెండు క్యారీ బ్యాగుల్లో పళ్ళు, స్వీట్లు.. ఆయనకోసం.

"రాఘవేంద్ర రావుకిస్తే ఓ పాట తీసేస్తాడు.."  అనుండేవాడు శ్రీకర్ చూస్తే. రెండు బ్యాగులతో పాటు ఓ తెల్ల కవర్, అందులో మడత పెట్టిన అరఠావు కాగితాలు.. ఆయనకి చూపించాల్సిందేనా?

దూరంగా రావిచెట్టు కనిపించడంతో రోడ్డు పక్కన కారాపాను. షఫుల్ సంగతి మర్చిపోయాను కదా.. "పిక్క పైకి చీరకట్టి వస్తవా వస్తవా?" నాగార్జున గొంతుతో అడుగుతున్నారు బాలూ. అడిగిస్తున్నది తాతగారే. హీరో, సింగర్, డైరెక్టర్.. వీళ్ళెవరితోనూ నాకు సంబంధం లేదు. తాతగారి పాట అవునా కాదా అన్నదే ప్రశ్న. ఇది ఇవాల్టిది కాదు.

ఇంటర్లో ఉండగా కొత్త హీరోయిన్ బాగుందని ఎవరో చెప్పడంతో మా ఫ్రెండ్స్ అందరం సినిమాకి బయల్దేరాం. హీరోయినే కాదు, సినిమా కూడా బాగుంది. ఇంటర్వల్ తర్వాత ఓ పాట.. మరీ ముఖ్యంగా అందులో ఓ మాట.. "గసగసాల కౌగిలింత.. గుసగుసల్లె మారుతావు..."  ఎక్కడో గుచ్చుకుంది. ఎక్కడో కాదు, గుచ్చుకోవాల్సినచోటే గుచ్చుకుంది.  పదహారేళ్ళ వయసులో హార్మోన్లు  వాటి పని అవి చెయ్యకుండా ఉంటాయా?

ఆ ఒక్క పాటనీ రోజంతా విన్న రోజులెన్నో. ఆ తర్వాత, ఆ పాట ఎలా పుట్టి ఉంటుందన్న ఆలోచన.. జవాబు వెతుకుతూ ఉండగా దొరికారా రచయిత. గూగుల్ ఇచ్చిన పాటల లిస్టు చూస్తే కళ్ళు తిరిగాయి. పాటలు వింటూ వింటూ ఉండగా ఆయన నాకు తాతగారైపోయారు.

నాకు దగ్గరి బంధువులెవరూ లేరు. అమ్మ, నాన్న, వాళ్ళ స్నేహితులు, చాలా తక్కువ మంది దూరపు బంధువులు అంతే. అమ్మకీ, నాన్నకీ నేనొక్కడినే. శ్రీకర్ నాకు అన్నో,  తమ్ముడో అయితే ఎంత బాగుండేదో అని ఎన్ని సార్లు అనుకున్నానో లెక్కేలేదు. ఇప్పుడు మాత్రం ఏం? అన్నదమ్ముడి కంటే ఎక్కువే వాడు.

వింటున్న పాట పూర్తవ్వడంతోనే, గోదారి గట్టున నడవాలనిపించి ఆడియో ఆపి కారు దిగాను. చల్లగాలి ఒక్కసారిగా ఒళ్ళంతా తడమడంతో నా రెండు చేతులూ ఫేంట్ జేబుల్లోకి వెళ్ళిపోయాయి అప్రయత్నంగా. జుట్టు చెదిరి మొహం మీద పడుతోంది. ఓ పక్క నిశ్చల గోదారి, రెండో పక్క కొబ్బరి చెట్ల అడివి. ఆ అడివి మధ్యలో అక్కడొకటి ఇక్కడొకటిగా చిన్న చిన్న ఊళ్లు.

నాకు తెలియకుండానే అడుగులు గోదారి వైపు పడుతున్నాయి. రోడ్డున వెళ్ళే వాళ్ళు తిరిగి చూడడం తెలుస్తోంది. ఆరడుగులకి ఓ అంగుళం తక్కువ హైటు, తగ్గ బిల్ట్ అవ్వడం వల్ల వయసుకి మించే కనిపిస్తాన్నేను.

"ఎంతైనా హైబ్రిడ్ మొక్కల బలమే వేరబ్బా.." అంటూ ఉంటాడు శ్రీకర్. వాడు కాక నా ఫ్రెండ్స్ ఎవరూ ఆ మాటనే సాహసం చేయరు.

అమ్మా, నాన్నా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కులం మొదలు, నమ్మకాల వరకూ చాలా విషయాల్లో వాళ్ళిద్దరిదీ చెరో దారి. అమ్మకి దైవభక్తి అపారం. నాన్నది పూర్తి నాస్తికత్వం. అయితేనేం, ఇంటికి సంబంధించిన విషయాల్లో వాళ్ళిద్దరిదీ ఒకటే మాట. ఇద్దరూ ఒకే అభిప్రాయానికి వస్తారో, ఒకరి మాటని రెండో వాళ్ళు మనస్పూర్తిగా గౌరవిస్తారో అర్ధంకాదు నాకు.

టీచర్ ట్రైనింగ్ లో మొదటిసారి కలిశారట వాళ్ళిద్దరూ. ఉద్యోగాలొచ్చాక పెళ్లిచేసుకున్నారు. మిగిలిన టీచర్లందరూ వాళ్ళ పిల్లల్ని కాన్వెంట్లలో చదివిస్తుంటే, నన్ను మాత్రం వాళ్ళు పని చేస్తున్న స్కూల్లోనే చేర్చారు. నేను ఇంజినీరింగ్ చేస్తే బాగుండునన్నది వాళ్ళిద్దరి కోరికా.. నిర్ణయం మాత్రం నాకే వదిలేశారు.

అంతే కాదు, నాకు కేంపస్ ప్లేస్మెంట్ రాగానే "నాలుగేళ్ళలో నీకు పెళ్లి. పిల్లని నువ్వు చూసుకున్నా సరే.. మమ్మల్ని చూడమన్నా సరే," అని ఒకే మాటగా చెప్పారు.

పెళ్లి లాంటి ముఖ్యమైన విషయంలో నాకన్నా వాళ్ళే బాగా నిర్ణయం తీసుకోగలరు అనిపించింది. ట్రైనింగ్ పూర్తి చేసి ఆన్సైట్ కి వెళ్తూ ఆమాటే చెప్పి ఫ్లైట్ ఎక్కాను. నేను తిరిగి వస్తూనే చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మేఘనతో దైవ సాక్షిగానూ, రిజిస్ట్రార్ సాక్షిగానూ నా పెళ్లి జరిపించేశారు. అటుపై నేనూ మేఘనా - తాతగారి భాషలో - "కౌగిలిపర్వం కొత్తగ రాయడం" మొదలుపెట్టాం. ఇదంతా మూడేళ్ళ క్రితం మాట.

అమ్మా నాన్నా  అన్ని విషయాల్లోనూ ఒకే మాటగా ఎలా ఉంటారో ఇప్పటికీ ఆశ్చర్యమే. వేసవి సెలవుల్లో ఏటా తిరుపతి వెళ్ళడం చిన్నప్పటి  నుంచీ అలవాటు. అటునుంచటే చెన్నయో, బెంగుళూరో ఓ నాలుగు రోజులు టూర్. చుట్టాలెవరూ లేరన్న లోటు నాకు తెలియకూడదనేమో.

తిరుపతి దర్శనం పూర్తి చేసుకుని బయటికి రాగానే, అమ్మ ప్రసాదం కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుని విమాన గోపురానికి దణ్ణం పెట్టుకుంటే, నాన్నేమో "పుల్లారెడ్డి, స్వగృహ.. ఎవరికీ కూడా ఇంత బాగా కుదరదురా ఈ లడ్డూ.. ఎవరు చేస్తారో కానీ.." అంటారు. ఇద్దరూ కూడా వాళ్ళ భక్తినో, నాస్తికత్వాన్నో నాకు మప్పే ప్రయత్నం చేయలేదు. నాపాటికి నన్ను వదిలేశారు, నమ్మకాల విషయంలో.

నీళ్ళని చీల్చుకుంటూ పడవొకటి గట్టువైపుకి వస్తోంది. అవడానికి శీతాకాలపు మధ్యాహ్నమే అయినా వెన్నెల రాత్రిలా ఉంది వాతావరణం. "అలలా ఎన్నెల గువ్వా ఎగిరెగిరి పడుతుంటే.. గట్టుమీన రెల్లుపువ్వా బిట్టులికి పడుతుంటే..." ఇలాంటి దృశ్యాలెన్నో చూసే రాసి ఉంటారు తాతగారు.  ఆయన కబుర్లు శ్రీకర్ కి తప్ప ఇంకెవరికీ చెప్పను.

నేను మొదలెట్టిన కాసేపటికి వాడు ఏ 'గోధూళి వేళ' వర్ణనో లేకపోతే 'ఫోన్ లో రేవంత్ గొంతు వింటే రమ్యకి గుప్పెడు సన్నజాజులు గుండెల మీదనుంచి జారుతున్న అనుభూతి కలగడం' గురించో అందుకుంటాడు. మిగిలిన ఫ్రెండ్స్ ఎవరన్నా విన్నా, వాళ్లకి మేం ఏ భాషలో మాట్లాడుకుంటున్నామో అర్ధం కాదు. "మీరు మాట్లాడుకుంటున్నది తెలుగేనా?" అని అడిగిన వాళ్ళు లేకపోలేదు.

సైకిలు మీద వెళ్తున్న ఓ మనిషి, ప్రత్యేకం సైకిల్ దిగి, కారునీ నన్నూ మార్చి చూస్తూ "ఆయ్.. ఎందాకెల్లాలండీ?" అని పలకరించాడు. "అగ్రహారం.. సోమయాజి గారింటికి.." రెండో ప్రశ్నకి ఆస్కారం లేకుండా జవాబిచ్చేశాను.

"ఆ సెట్టు పక్కన కంకర్రోడ్డున్నాది సూడండి.. తిన్నగెల్లిపోతే సివాలయవొత్తాది.. పక్కనేనండారిల్లు.. ఆయ్" అంటూ సైకిలెక్కేశాడు. ఇక్కడే ఉంటే ఇంకా ఎవరెవరు వస్తారో అనిపించి కారెక్కేశాను. ఐదు నిమిషాల కన్నా ముందే గమ్యం చేరింది కారు. ఎవరూ చెప్పక్కర్లేకుండానే అది సోమయాజి గారి ఇల్లని తెలిసిపోయింది.

శ్రీకర్ చూస్తే "వ్యాసపీఠంలా ఉందీ ఊరు" అని ముచ్చట పడతాడు. "అంటే ఏంటి?" అని అడగక్కర్లేకుండానే నవల రిఫరెన్స్ ఇచ్చేస్తాడు.

"పూజలో ఉన్నారు.. వచ్చేస్తారు కూర్చోండి," కుర్చీ చూపించి లోపలికి వెళ్ళాడో కుర్రాడు. మరు క్షణం మంచినీళ్ళ చెంబుతో తిరిగొచ్చాడు. ఆవేల్టి పేపర్ నా ముందు పెట్టి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు.

నేను పేపరు చూస్తూ ఆలోచిస్తున్నాను. రావడం అయితే వచ్చేశాను కానీ, ఇప్పుడెలా? శ్రీకర్ కూడా పక్కనుంటే బాగుండునని బాగా అనిపిస్తోంది. దృష్టి పేపర్ మీదకి పోవడం లేదు.

నేను ఆలోచనల్లో ఉండగానే విభూది వాసనలు వెంట తెచ్చుకుని వచ్చారాయన. లేచి నిలబడ్డాను. ఎనభయ్యేళ్ల వయసుంటుంది. బక్క పల్చని మనిషి. ముగ్గుబుట్ట తల, గుబురు గడ్డం. శక్తివంతమైన కళ్ళు. ఈయన్ని ఒక్కసారే చూసిన వాళ్ళకైనా, ఎప్పుడైనా తల్చుకుంటే మొదట గుర్తొచ్చేవి కళ్ళే.

ఎర్రరంగు పట్టు పంచె కట్టుకున్నారు. పైన ఆచ్చాదనల్లా రెండు వరుసల రుద్రాక్షలే. ఒళ్ళంతా విభూది పట్టీలు పెట్టుకున్నారు. నుదుట విభూది మధ్యలో ఎర్రని కుంకుమ బొట్టు, పరమశివుడి మూడో కన్నులా. అన్నిటికన్నా ఆశ్చర్యం, ఆవయసులో కూడా కళ్ళజోడు లేకపోవడం.

పళ్ళూ, స్వీట్లు ఆయన ఎదురుగా ఉన్న టీపాయ్ మీద పెట్టాను. కవర్ మాత్రం నా చేతిలోనే ఉంది. నా ఒంట్లో ప్రవహిస్తున్న అమ్మ-నాన్న రక్తాల మధ్య యుద్ధం జరుగుతున్నట్టుంది. నన్ను కూర్చోమని సైగచేశారాయన.

"ఎలా జరిగింది బాబూ ప్రయాణం?" క్షణం పట్టింది ప్రశ్న అర్ధం కాడానికి. నా పరిచయం అడగలేదు మరి.

"బాగా జరిగిందండీ.. రోడ్డు చాలా బాగుంది.." నవ్వారు చిన్నగా. "బ్రిటిష్ వాడు రైలు మార్గం వేసినట్టు, వీళ్ళు రోడ్లు వేస్తున్నారు.. లాభాపేక్ష ఉండకుండా ఉంటుందా.. చవురు తీసి పట్టుకెడుతున్నారు కదూ.." ఏమీ మాట్లాడలేదు నేను. నా పది వేళ్ళ మధ్యా కవరు నలుగుతోంది.

"ఏవీ అనుకోకు బాబూ.. చిన్న వాళ్ళని ఏకవచనంతో సంభోదించడమే అలవాటు.. ఆ కాలం వాణ్ణి మరి.." పర్లేదన్నట్టుగా తలూపి, నన్ను నేను పరిచయం చేసుకున్నాను. ఎలా మొదలుపెట్టాలో అర్ధం కావడం లేదు. చాలా ప్రైవేటు విషయాన్ని, అత్యంత కొత్త మనిషితో పంచుకోవడం..అనుకున్నంత సులువు కాదు.

ఆయన నావైపే చూస్తున్నారు పరీక్షగా. కాసేపటికి, "తెలుగు అర్ధమవుతుంది కదూ?" అడిగారు.

"అవుతుందండీ.." వెంటనే చెప్పాను.

"ఆహార నిద్రా భయ మైథునాల్లో ఒకటి నీకు దూరమయ్యింది.." ఉలికిపాటుని దాచుకున్నాను, అతి కష్టం మీద.

నిదానంగా నన్ను చూసి "స్పష్టంగా చెప్పాలంటే చివరిదే.. కదూ?" ఈసారి మాత్రం నేనేమీ దాచుకోలేదు.. దాచుకోలేక పోయాను..

"అ..అవునండీ.." అన్నాను కొంచం అస్పష్టంగా.. చర్మం కింద చమటలు పడుతున్న అనుభూతి. నా గుండెల్లో వణుకు స్పష్టంగా తెలుస్తోంది నాకు.

ఆయన మౌనం అత్యంత దుర్భరంగా ఉంది, ఉన్నట్టుండి నేను కూర్చున్న కుర్చీకి ముళ్ళు మొలిచినట్టుగా. ఇంతలో ఆయనకి లోపలినుంచి పిలుపొచ్చింది.

"ఇప్పుడే వస్తాను బాబూ..." అంటూ వెళ్ళారు.

క్షణమొక యుగంగా గడవడం అంటే ఏమిటో ఆ క్షణంలో అనుభవంలోకి వచ్చింది.

(ఇంకా ఉంది)

మంగళవారం, నవంబర్ 03, 2015

అసహనం

చాలా రోజుల తర్వాత నలుగురు మిత్రులం పార్కులో కలిశాం. నడకయ్యాక బెంచీల మీద చోటు సంపాదించుకున్నాం. వాతావరణం చల్లబడడంతో మా దృష్టి మిరపకాయ బజ్జీల మీదకి మళ్ళింది. బండి కుర్రాడు బజ్జీలు తెచ్చిపెట్టి వెళ్ళాడు. బజ్జీలంత వేడిగా, ఘాటుగా సంభాషణ సాగింది. "షారుక్ ఖాన్ అలా అని ఉండాల్సింది కాదు," అన్నాడో మిత్రుడు. హిందీ సినిమాలు, హిందీ రాజకీయాలు తనకి కరతలామలకం. "ఎప్పుడు లేదు అసహనం? అధికార పక్షం మీద ప్రతిపక్షానికి ఎప్పుడూ అసహనమే కదా. ఇప్పడు ప్రతిపక్షం నోరున్నది కాబట్టి, ఇప్పటివరకూ అవార్డులు అందుకున్న వాళ్ళలో మెజారిటీ కాంగ్రెస్, కమ్యూనిస్టు వాదులే కాబట్టీ ఇంత గొడవ జరుగుతోంది" అని తన ఉవాచ.

మత అసహనం పెరగడం దేశానికి మంచిది కాదని తన యాభయ్యో పుట్టిన రోజు సందర్భంగా షారుక్ ఖాన్ జాతికి సందేశం ఇవ్వడం, దాన్ని కాంగ్రెస్సు, కమ్యూనిస్టులు స్వాగతించగా, బీజీపీ మరియు అనుబంధ సంస్థలు వ్యతిరేకించడం వేడి వేడి టాపిక్ మరి. "వెనక్కివ్వడానికి తన దగ్గర అవార్డులేవీ లేవని చెబుతున్నాడంటే, తనకి అవార్డు ఇమ్మని అడుగుతున్నట్టా, లేక రాజకీయాల్లోకి రాబోతున్న సంకేతమా?" ప్రశ్న పూర్తయ్యేసరికి పొగలుగక్కుతున్న బజ్జీలు కాస్త చల్లబడ్డాయి. నిమ్మరసం పిండిన ఉల్లిపాయముక్కల స్టఫింగ్ భలేగా ఉంది. "దేశంలోనే కాదు, రాష్ట్రంలోనూ అసహనం పెరిగిపోతోంది," ప్రకటించాడు రెండో మిత్రుడు. రాష్ట్రం తప్ప మరో విషయం పట్టదితగాడికి.

"అసలు చంద్రబాబు ఎంత కష్టపడుతున్నాడు. అమరావతి పూర్తిచేస్తే చరిత్రలో నిలిచిపోతాడు. అది భరించలేకే అపోజిషన్ వాళ్ళు హోదా అనీ, ఉల్లిపాయలనీ, కందిపప్పు అనీ గొడవలు చేస్తున్నారు. ఏం చేసినా చంద్రబాబుని ఆపలేరు" కొంచం ఆవేశంగా చెప్పాడు. ఏమాటకామాట, మిరపకాయ కొంచం కారంగానే ఉంది. "మోడీ ప్యాకేజీ ఏమీ అనౌన్స్ చేయడని నేను మొదటినుంచీ చెబుతూనే ఉన్నా కదా. ఏపీని మించిన విషయాలు చాలానే ఉన్నాయి.. మరీ ముఖ్యంగా బీహార్ ఎలక్షన్స్. ఏపీలో ఇప్పట్లో బీజీపీ స్ట్రాంగ్ అవ్వదని మోడీకి తెలుసు," హిందీ మిత్రుడు అందుకున్నాడు. మూడో మిత్రుడి ఆసక్తి సాహిత్యం. ఏమీ మాట్లాడకుండా శ్రద్దగా బజ్జీ తింటూ వాళ్ళ సంభాషణ వింటున్నాడు, నాలాగే.

"ఇంకెక్కడ బీజేపీ? అమరావతి పూర్తయితే ఇక రాష్ట్రంలో ఎప్పటికీ తెలుగుదేశమే పవర్లో ఉంటుంది. చంద్రబాబు, తర్వాత లోకేష్ బాబు సీఎంలు. ఇంకెవరూ ఆశలు పెట్టుకోడం అనవసరం" రాష్ట్ర మిత్రుడు కళ్ళు మూసుకుని చెప్పాడు. నిమ్మరసం పులుపు మామూలుగా లేదసలు. నేను ఊరికే ఉండక "గ్రీన్ ట్రిబ్యునల్ ఏదో అభ్యంతరం చెప్పిందని పేపర్లో చూశాను" అన్నాను. అతగాడికి అద్దుమాలిన కోపం వచ్చింది. "ఏ ట్రిబ్యునలూ ఏమీ చెయ్యలేవు. చంద్రబాబుకి ట్రిబ్యునల్ ఓ లెక్కా? చూస్తూ ఉండు, ఇట్టే మేనేజ్ చేసేస్తాడు. పైసా ఖర్చు లేకుండా బిల్డింగులు కట్టివ్వడానికి సింగపూర్ వాళ్ళు, జపాన్ వాళ్ళు రెడీగా ఉన్నారు," కొంచం గట్టిగానే చెప్పాడు.

"చేతిలో పైసా లేకుండా కేపిటల్ కట్టడం అంటే మాటలు కాదు," హిందీ మిత్రుడి ఉవాచ. "ఇంకెవరన్నా సీఎం పొజిషన్ లో ఉంటే సెంట్రల్ ఫండ్స్ కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ఉండే వాళ్ళు. కానీ, ఇక్కడున్నది చంద్రబాబు. అసలు పదమూడు జిల్లాల రాష్ట్రానికి ప్రపంచ స్థాయి రాజధాని కట్టాలన్న ఆలోచనే ఇంకెవరికన్నా వస్తుందా?" ప్రశ్న విని, ఓ బజ్జీ తీసి అతనికిచ్చాను. సాహిత్యం మిత్రుడు చెప్పేది వినడానికి సిద్ధంగా ఉన్నాను. హరిరామ జోగయ్య ఆత్మకథ విశేషాలేమన్నా తెలుస్తాయని ఆశ. చూడబోతే తను మాట్లాడే మూడ్ లో ఉన్నట్టు లేడు. "బజ్జీ తినడానికి తప్ప నోరిప్పడం లేదు నువ్వు?" హిందీ మిత్రుడు, సాహిత్యం మిత్రుణ్ణి కదిలించాడు.

"మొన్న నా ఫేవరెట్ రైటర్ కి ఫోన్ చేశాను.. చెడా మడా తిట్టి ఫోన్ పెట్టేశాడు," తను చెప్పింది విని ముగ్గురం ఆశ్చర్యంతో నోళ్ళు తెరిచాం. "అతనికి నువ్వు ఎప్పటినుంచో ఫోన్లు చేస్తున్నావు కదా. ఎప్పుడూ సరదాగానే మాట్లాడతాడని చెప్పావు?" హిందీ మిత్రుడు అడిగేశాడు. "ఈ మధ్య అతను రాస్తున్న కథలు ఏమంత బాగుండడం లేదు. ఆమాట చెప్పానో లేదో, విరుచుకు పడ్డాడు నా మీద. నచ్చకపోతే చదవడం మానెయ్యండి కానీ ఇలా ఫోన్లు చెయ్యకండి. మీకు చదవడం చేతకాక వంకలు పెడుతున్నారు అని నిర్మొహమాటంగా చెప్పి ఫోన్ పెట్టేశాడు," గొంతు కొంచం జీరబోయింది. ఎవ్వరం ఏమీ మాట్లాడలేదు. అతని చెయ్యి నొక్కి వదిలాను అప్రయత్నంగా. చినుకులు మొదలవ్వడంతో ఇళ్ళ దారి పట్టాం.