గురువారం, డిసెంబర్ 08, 2011

నేను తిరిగిన దారులు

కొన్ని వాక్యాలు చదువుతున్నప్పుడు నేను రాసిందే మళ్ళీ చదువుతున్నానేమో అనిపించింది. కొన్ని అనుభవాలని చదువుతున్నప్పుడు అవన్నీ నాక్కలిగినవే అని పదే పదే గుర్తొచ్చింది. 'ఇంకా ఏమేం రాసి ఉండొచ్చు?' అన్న ఆసక్తి, ఆసాంతమూ పుస్తకాన్ని వదలకుండా చదివేలా చేసింది. పుస్తకం పేరు 'నేను తిరిగిన దారులు.' నదీనదాలూ, అడవులు, కొండలు అనేది ఉప శీర్షిక. రచయిత వాడ్రేవు చినవీరభద్రుడు. ఇది ఒక యాత్రా చరిత్ర.

కవి, రచయిత, సాహితీ విమర్శకుడిగా పేరున్న చినవీరభద్రుడు ఓ నిరంతర ప్రయాణికుడు కూడా. ప్రదేశాలని చూడడం కన్నా, ప్రపంచాన్ని చూడడానికి ఇష్టపడే ప్రయాణికుడు. ("కారు అద్దం నుంచి ప్రదేశాలని మాత్రమే చూడగలం, ప్రపంచాన్ని కాదు" అంటుంది జానకి..) ఈ కారణం వల్లనే కావొచ్చు, బాగా తెలిసిన ప్రదేశాలని సైతం అతని కళ్ళతో చూసినప్పుడు ఓ కొత్త ప్రపంచం కనిపించింది.. వెంటాడింది... వెంటాడుతూనే ఉంది...

మొత్తం పుస్తకాన్ని యాత్రా కథనాలు, యాత్రానుభవాలు, యాత్రాలేఖలు అన్న మూడు విభాగాలుగా విభజించారు వీరభద్రుడు. వీటిలో యాత్రా కథనాల్లో కొంత కల్పననీ, నాటకీయతనీ జోడించగా, యాత్రానుభవాలని ఉన్నవి ఉన్నట్టుగా పంచుకున్నారు. యాత్రా లేఖలు విభాగంలో ఢిల్లీ పర్యటనలో ఉండగా ఇంటికి రాసిన ఉత్తరాలలో కొన్ని భాగాలని ప్రచురించారు. ఓ స్థలాన్నో, సంఘటననో చూసినప్పుడు ఆ క్షణంలో తనకి కలిగిన స్పందనని లేఖలుగా అక్షరబద్ధం చేశారు.

'అరకులోయ దారుల్లో..' 'శివ సాన్నిధ్య సుఖం' 'పాపికొండల నడుమ..' ఈ మూడూ యాత్రా కథనాలు. మూడూ కూడా ఇండియా టుడే పత్రికలో అచ్చయినవే. అరకులోయ చూడడానికి వెళ్ళిన మిత్ర బృందం, కేవలం ప్రకృతిని చూసి, ప్రేమలోపడి తిరిగి వచ్చేయకుండా, అక్కడి గిరిజనుల జీవితాలని గురించి తెలుసుకున్నారు. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళారు. కలిసి భోజనం చేశారు. కష్టసుఖాలు మాట్లాడారు. అడవికి వెళ్ళడం "నా ఇంటికి నేనే అతిధిగా పోవడం లాంటిది" అంటారు రచయిత.



కేవలం శ్రీశైల శిఖరాన్ని దర్శించినంత మాత్రానే పునర్జన్మ ఉండదని ఓ నమ్మిక. మరి అంత గొప్ప శ్రీశైలంలో చూసి తీరవలసింది మల్లికార్జునుడి ఆలయం ఒక్కటేనా? దీనికి జవాబు 'కాదు' అని చెబుతుంది 'శివ సాన్నిధ్య సుఖం.' ఇక మూడో కథనం 'పాపికొండల నడుమ' గురించి ఎంత చెప్పినా తక్కువే. "పాపి కొండల్ని చూడడం ఒక అనుభవం. అవి వాల్మీకి వర్ణించినట్టుగా ఏనుగుల్లా ఉన్నాయనో, భూమిని చీల్చుకు వచ్చిన పర్వతాల్లా ఉన్నాయనో అనుకోవడంలో తృప్తి లేదు. వాటి ఉనికిలో భూమి ఆవిర్భావంలోని ఉద్వేగభరిత క్షణమేదో ఉంది. వాటి ఆకృతుల్లో అదృశ్య దైవ హృదయంలోని కాల్పనిక కౌశలమేదో ఉంది," లాంటి ఏ కొన్ని వాక్యాలనో మాత్రమే ప్రస్తావించి ఊరుకోవడం ఎంత కష్టం!!

యాత్రానుభవాల్లో ఇంగ్లండ్ యాత్రని గురించి సవివరంగా రాశారు వీరభద్రుడు. ఇది ముందుగా ప్లాన్ చేసుకుని రాసింది కావడం వల్ల ఓ పూర్తి స్థాయి ట్రావెలోగ్ అయ్యింది. గత వైభవాన్ని క్రమక్రమంగా కోల్పోతున్నా, ఆ గాంభీర్యాన్ని నిలుపుకోవడం కోసం బ్రిటన్ చేస్తున్న ప్రయత్నాలనీ, ఆ క్రమంలో ఎదురవుతున్న ఒడిదుడుకులనీ తనదైన దృష్టికోణంలో ఆవిష్కరించారు రచయిత. "నిస్సందేహంగా ఇది నా జీవితంలో గొప్ప యాత్ర. నా జీవితమంతా ప్రయాణాల్లో గడిచిపోయిన మాట నిజమే. కానీ ఈ యాత్రతో నేను ప్రపంచ పధికుణ్ణయ్యాను," అని ప్రకటించారు.

బృందావనంలో ఆరగించిన నవనీత ప్రసాదం రుచిని 'హే గోవింద హే గోపాల' వ్యాసంతో పంచి, గోదావరి జన్మస్థలాన్ని చూడబోతున్న సమయంలో తనకు కలిగిన వివశత్వాన్ని 'త్రయంబకం యజామహే' కథనంలో ఆవిష్కరించారు వీరభద్రుడు. చలం రచనలగురించీ, వాటితో తనకున్న అనుబంధాన్ని గురించి మాత్రమే కాక, రమణ మహర్షిని గురించి భారతీయ తాత్వికతని గురించీ వివరంగా రాశారు 'అరుణగిరి దర్శనం' వ్యాసంలో. శ్రావణ బెళగొళ, హళెబీడు, బేలూరుల్లో 'రాళ్ళలో చెక్కిన కావ్యాల'ని పరిచయం చేస్తూ "హళెబీడు మను చరిత్ర లాంటి కావ్యమైతే, బేలూరు వసుచరిత్ర లాంటిదంటాను," అన్నారు. యాత్రానుభావాల్లో చివరిదైన 'ఆదిమానవుడూ, పూర్ణమానవుడూ' ఒక లోతైన వ్యాసం.

ప్రయాణాలని ఇష్టపడే వారు తప్పక చదవాల్సిన ఈ పుస్తకం ఆద్యంతమూ ఆసక్తికరంగా చదివిస్తుంది. అనేక విషయాలని గురించి మన దృష్టి కోణాన్ని విశాలం చేసుకోడానికి పనికొచ్చే విశ్లేషణలు కథనాల్లో అంతర్భాగమయ్యాయి. "తమ చుట్టూ ఉండే మనుషుల గురించి ఆలోచించే మనుషులు భారత దేశానికి ఎక్కువ అవసరం" అంటారు రచయిత 'ఢిల్లీ నుంచి ఉత్తరాలు' లో. ఈ పుస్తకం చదివాక ప్రదేశాల గురించి మాత్రమే కాక, ప్రపంచాన్ని గురించి చిన్నగా అయినా ఓ ఆలోచన మొదలవుతుంది. దీనిని రచయిత విజయంగానే భావించాలి. ('శ్రీ' ప్రచురణలు, పేజీలు 208, వెల రూ. 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులూ. ...కవర్ డిజైన్ తో పాటు లోపలి స్కెచ్ లూ రచయిత వేసినవే కావడం విశేషం!)

ఆదివారం, డిసెంబర్ 04, 2011

సుందరానికి పాతికేళ్ళు

సుందరం... తెలుగు తెర మీద ఓ నవ్వుల సంతకం... చేతిలో విద్య ఉన్నా దానిని ఉపయోగించని బద్ధకం అతని సొంతం. పావలాకాసంత పుట్టుమచ్చతో ఉండే పద్మినీ జాతి స్త్రీ దొరికితే చాలు, దశ తిరిగిపోతుందంటే నమ్మేసే అమాయకత్వమూ అతనికే సొంతం. చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు నమ్మేసి, సదరు స్త్రీకోసం జరిపే వెతుకులాటలో అష్టకష్టాలు ఎదురైనా, చివరికి ప్రాణాల మీదకి వచ్చినా వెనుదీయని మూర్ఖత్వంలాంటి మొండితనం అచ్చంగా సుందరానికి మాత్రమే సొంతం. అంతేకాదు, కబుర్లతో ఆడపిల్లల్ని బుట్టలో పడేయగలిగే ప్రావీణ్యమూ, ప్రాణభయంతో గజగజలాడే పిరికితనమూ కూడా సుందరానివే. అలాంటి సుందరం పుట్టి ఇవాల్టికి పాతికేళ్ళు!!


'మంచుపల్లకీ' తో మొదలు పెట్టి, 'సితార' 'అన్వేషణ' మీదుగా ప్రయాణించి 'ప్రేమించు-పెళ్ళాడు' తీసేనాటికి కళాత్మక దర్శకుడిగా తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు వంశీ. 'ప్రేమించు-పెళ్ళాడు' పర్లేదనిపించినా, తర్వాత వచ్చిన 'ఆలాపన' ఘోర పరాజయం పాలవ్వడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రూటు మార్చి కేవలం హాస్యాన్ని మాత్రమే నమ్ముకుని, రాజేంద్రప్రసాద్ హీరోగా వంశీ తీసిన లో-బడ్జెట్ సినిమా 'లేడీస్ టైలర్' ...కథానాయకుడు సుందరం. కోనసీమలో గోదారి ఒడ్డున ఓ పల్లెటూళ్ళో పెంకుటింటి ఎత్తరుగుల మీద కుట్టు మిషన్ పెట్టుకున్న సుందరానిది జాకెట్లు కుట్టడంలో అందెవేసిన చెయ్యి.

అయితే ఏం లాభం? కష్టపడడానికి ఏమాత్రం ఇష్ట పడడు సుందరం. అసిస్టెంట్ సీతారాముడూ (శుభలేఖ సుధాకర్), ఊరూరూ తిరిగి జాకెట్ ముక్కలు అమ్ముకునే బట్టల సత్యం (మల్లికార్జున రావు) ఎంత మొత్తుకున్నా తన విద్య ఉపయోగించడు సరికదా, తనకి అదృష్టం వచ్చి పడుతుందనే నమ్మకంతో రోజులు గడిపేస్తూ ఉంటాడు. టైటిల్స్ పడుతుండగానే నేపధ్యంలో వినిపించే 'సూర్యుడు సూదులెట్టి పొడుస్తున్నాడు లేద్దూ.. ' పాట ద్వారా సుందరం స్వభావాన్ని పటం కట్టేస్తాడు దర్శకుడు. సినిమా కథలో పడగానే ఆ ఊరికి వచ్చిన ఓ జ్యోతిష్యుడు (రాళ్ళపల్లి), కుడి తొడమీద పావలా కాసంత పుట్టుమచ్చ ఉన్న పద్మినీజాతి స్త్రీని పెళ్ళి చేసుకుంటే సుందరానికి రాజయోగం పడుతుందని నమ్మబలుకుతాడు.

పద్మినీజాతి స్త్రీ వేట మొదలు పెట్టిన సుందరానికి ఉన్న ఒకే ఒక్క ఇబ్బంది వెంకటరత్నం (ప్రదీప్ శక్తి). ఆడపిల్లలతో ఎవరన్నా అసభ్యంగా ప్రవర్తిస్తే వాళ్ళని చంపడానికి కూడా వెనకాడడు. అలాంటి ఓ కేసులోనే జైల్లో ఉన్న వెంకటరత్నం మూడు నెలల్లో విడుదలవుతాడు. అతగాడు వచ్చేలోగానే సుందరానికి పద్మినీజాతి స్త్రీ దొరకాలి. ఆమెని వెతికి పట్టుకోడానికి సుందరం పడే తిప్పలు, అందులోనుంచి పుట్టే హాస్యమే తర్వాతి రెండుగంటల సినిమా. వంశీ మార్కు హడావిడి ముగింపుతో శుభం కార్డు పడుతుంది. వంశీ మిగిలిన సినిమాల్లా కాకుండా, కుటుంబంతో కలిసి చూడలేని సినిమా ఇది.

సుందరం పాత్రలో రాజేంద్రప్రసాద్ అలవోకగా ఒదిగిపోయాడు. ఇక మల్లికార్జునరావుకైతే 'బట్టల సత్యం' పేరు జీవితాంతమూ కొనసాగింది. అర్చన, సంధ్య, దీపలతో పాటుగా వై.విజయ కూడా రాజేంద్రప్రసాద్ సరసన ఓ నాయిక ఈ సినిమాలో!! వంశీ-భరణి కలిసి స్క్రిప్ట్ రాయగా, సంభాషణలని భరణి సమకూర్చారు. చివరినిమిషంలో వాటికి తన మార్కు మార్పు చేర్పులు చేశారు వంశీ. నాయికల్లో అర్చనకి ఎక్కువ మార్కులు పడ్డాయి. నిజం చెప్పాలంటే ఈ సినిమాకి హీరో సంగీతమే. ఇళయరాజా స్వరాలు ఆంధ్ర దేశాన్ని ఎంతగా ఊపేశాయంటే, ఊరూరా మారుమోగాయి ఈ పాటలు. ఇప్పటికీ ఎక్కడో అక్కడ వినిపిస్తూనే ఉంటాయి. రెప్పపాటులో పదులకొద్దీ ఫ్రేములు మారే చిత్రీకరణ సైతం గుర్తుండిపోతుంది.

శృతి మించని శృంగారాన్ని, హాస్యంతో రంగరించి వంశీ చేసిన ఈ వెండి తెర ప్రయోగం నిర్మాతలకి కాసులు కురిపించింది. హాస్య దర్శకుడిగా వంశీ మీద చెరగని ముద్ర వేసింది. అంతేకాదు, బూతు సినిమా దర్శకుడన్న పేరునీ తెచ్చిపెట్టింది. "నా జీవితంలోనూ, నా రచనలలోనూ ఎక్కడా హాస్యం లేదు.. జీవిక కోసం ఒక వృత్తిని అనుకున్నాక, అందులో కొనసాగడానికి ఇష్టంలేకపోయినా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. అలా చేసిందే 'లేడీస్ టైలర్' సినిమా" అని చాలాసార్లే చెప్పారు వంశీ. ఇది వంశీ ఇష్టపడి తీసింది కాకపోయినా, మనసు పెట్టి తీసిన సినిమా అని తన సినిమాలు అన్నీ చూసిన వాళ్లకి ఇట్టే అర్ధమవుతుంది.

నేటివిటీ పట్ల వంశీకి ఉన్న మక్కువ ఎంతటిదో ఈ సినిమా చూసిన వాళ్ళకి వేరే చెప్పక్కర్లేదు. ఇళ్ళు, వీధులు మాత్రమే కాదు, కథా స్థలంలో వినిపించే నుడికారాలూ, కనిపించే ఆప్యాయతలూ కూడా సునిశితంగా తెరకెక్కించారు. సుందరం ఎక్కడా హీరో అనిపించడు. మన ఊరి టైలర్ లాగానే అనిపిస్తాడు. అలాగే, వెంకటరత్నంతో సహా ఏ పాత్రా అసహజం అనిపించకపోవడం ఈ సినిమా ప్రత్యేకత. అందుకే కావొచ్చు, చూసిన ప్రతిసారీ సినిమాలో లీనమైపోతాం. సుందరం మాటాడే 'జ' భాష, హిందీలా ఏమాత్రమూ వినిపించని హిందీ, అతగాడి వెంటపడే అమ్మాయిలు, సుందరం రాజైతే తను సేనాపతి అయిపోయి, బట్టలమ్మేసుకోవాలని కలలుకనే సత్యం...ఇలా సినిమా అంతా పొరుగింటి కథలాగే అనిపిస్తుంది. బహుశా అదే ఈ సినిమా విజయ రహస్యం.

 
విషాదం, సంఘర్షణ నుంచే హాస్యం పుడుతుందని చార్లీ చాప్లిన్ మొదలు చాలామందే చెప్పారు. 'లేడీస్ టైలర్' రూపకల్పన వెనుక కూడా అలాంటి విషాదం, సంఘర్షణ ఉన్నాయి. ఈ మధ్యనే ప్రచురించిన 'మా దిగువ గోదారి కథలు' సంకలనంలోని 'బేబీ.. ఓ మాసిపోని జ్ఞాపకం' కథలో ఆ సంఘర్షణని రేఖామాత్రంగా ప్రస్తావించారు వంశీ. ఐదేళ్ళ క్రితం రాజ్పల్ యాదవ్ కథానాయకుడిగా హిందీలోకి రీమేక్ అయిన ఈ సినిమాకి సీక్వెల్ తీసే ఆలోచనలో వంశీ ఉన్నట్టుగా భోగట్టా. మొదట రవితేజతోనూ, తర్వాత అల్లరి నరేష్ తోనూ అనుకున్న 'ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్' ప్రాజెక్ట్ లో హీరోగా ప్రస్తుతం సునీల్ పేరు వినిపిస్తోంది. రాబోయే ఆ సినిమా మరో పాతికేళ్ళ తర్వాత కూడా తల్చుకునేటంతటిది కావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ...

మంగళవారం, నవంబర్ 22, 2011

శ్రీ'బాపు'రాజ్యం

'జగదానంద కారకా.. జయ జానకీ ప్రాణ నాయకా.. శుభ స్వాగతం..' పాట చెవుల్లో మారుమోగుతోంది. అణువణువునా భారీతనం ఉట్టిపడే అందమైన వర్ణ చిత్రాలు కన్ను మూసినా, తెరిచినా కట్టెదుట ప్రత్యక్షమవుతూనే ఉన్నాయి. నార చీరెలు ధరించిన నయనతార సీత రూపంలో పదే పదే గుర్తుకొస్తోంది. మూడుగంటల పాటు ఏకాగ్రచిత్తంతో 'శ్రీరామరాజ్యం' సినిమా చూసి థియేటర్ నుంచి బయటికి వచ్చాక నా పరిస్థితి ఇది.

చాలామంది లాగానే నేను కూడా ఈ సినిమాని గురించి ఎలాంటి అంచనాలూ పెట్టుకోలేదు. ఎందుకంటే, రౌద్ర రసాభినయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న బాలకృష్ణ శ్రీరాముడుగా, నయనతారగా మారిన డయానా మరియం కురియన్ సీతా మహాసాధ్విగానూ కనిపించబోతూ, 'రాధాగోపాళం' 'సుందరకాండ' అనే రెండు నిరాశాపూరిత సినిమాల తర్వాత బాపూ-రమణలు తెరకెక్కిస్తున్న ప్రాజెక్టు అవ్వడం వల్ల కావొచ్చు నేనీ సినిమా కోసం ఎదురు చూడలేదు. కానైతే విడుదలైన తొలిరోజున వినిపించిన 'హిట్' టాక్ విని మాత్రం చాలా సంతోష పడ్డాను.

అందరికీ తెలిసిన కథే అయినా చెప్పిన విధానం బాగుంది. మూడు గంటల సినిమాలో 'తరువాతి సన్నివేశం ఏమిటో' అనే కుతూహలం ఎక్కడా కలగకపోయినా, 'ఆ రాబోయే సన్నివేశం ఏవిధంగా తెరమీద కనిపిస్తుందో' అన్న ఆసక్తి ఏమాత్రమూ సడలలేదు. బహుశా, ఇదే ఈ సినిమా విజయ రహస్యం కావొచ్చు. అలనాటి 'లవకుశ' అడుగడుగునా గుర్తొస్తూనే ఉంది. గుర్తు రాకుండా చేయాలనే ప్రయత్నం ఏమాత్రమూ చేయకపోవడం బాగా నచ్చింది.

రావణ సంహారం పూర్తిచేసి సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సహితుడై అయోధ్యకి తిరిగి వచ్చిన శ్రీరాముడు పట్టాభిషిక్తుడు కావడంతో సినిమా మొదలై, కుశలవుల పట్టాభిషేకంతో సమాప్తమయ్యింది. నిర్మాణ వ్యయానికి వెరవకుండా (సుమారు ఇరవై ఏడు కోట్లని వినికిడి) అత్యంత భారీగా నిర్మించిన ఈ సినిమాలో ఆ భారీ తనం ప్రతి ఫ్రేములోనూ కనిపించింది. సెట్టింగుల మొదలు, గ్రాఫిక్స్ వరకూ అన్నీ కథలో దాదాపుగా ఇమిడిపోయాయి.

దర్శక రచయితలు బాపూ-రమణలకి శ్రీరాముడి మీద ఉన్న భక్తి, ప్రేమల గురించి ఇవాళ కొత్తగా చెప్పుకోనక్కరలేదు. ఆ భక్తీ, ప్రేమా సినిమా అంతటా కనిపించాయి. సన్నివేశాల కూర్పు మొదలు, సంభాషణల వరకూ ఎక్కడా - సాధారణంగా బాపూ రమణల సినిమాల్లో ఎక్కడో అక్కడ కనిపించే - నాటకీయత లేదా 'అతి' కనిపించలేదు. కొన్ని సన్నివేశాలు చూస్తున్నప్పుడు మనసుని తాకిన ఆర్ధ్రత కళ్ళని పలకరించింది.

చిత్రీకరణలో బాపూ మార్కు ఆసాంతమూ కనిపించిన ఈ సినిమాలో నటీనటుల ప్రస్తావన వచ్చినప్పుడు మొదట చెప్పాల్సింది నయనతార గురించే. ఈమెని వెండితెర మీద చూడడం ఇదే మొదటిసారి నాకు. 'అంజలీదేవి, జయప్రదా మెప్పించిన సీత పాత్రలో నయనతార?' అన్న భావన సినిమా చూడని క్రితం వరకూ గుచ్చిన మాట నిజమే కానీ, చూసిన తర్వాత మటుమాయమయ్యింది. సీత పాత్రని మలిచిన తీరుని గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆమె ఆత్మాభిమానాన్ని చిత్రించిన తీరు గుర్తుండి పోతుంది.

శ్రీరాముడి పాత్రని పూర్తి స్థాయిలో మెప్పించడానికి బాలకృష్ణకి వయసు సహకరించలేదన్న వ్యాఖ్యలు వినిపించాయి. కానీ, ఈ సినిమాలో రాముడు కళ్యాణ రాముడు కాదు. పట్టాభిషిక్తుడైన చక్రవర్తి. ఊహించినంత ఇబ్బంది ఎదురవ్వలేదు కానీ, శరీరాకృతిని తగుమాత్రంగా మార్చుకుని ఉంటే పాత్రకి నిండుదనం వచ్చేది కదా అనిపించింది. నటనతో పాటు సంభాషణలు పలికిన తీరు కూడా ప్రత్యేకంగా అనిపించింది. 'లవకుశ' ని చాలాసార్లే గుర్తు చేసింది.

మరో ముఖ్యమైన, కథకి మూలస్థంభమైన పాత్ర వాల్మీకి. అక్కినేని పోషించిన ఈ పాత్రలో సాత్వికత కనిపించలేదు ఎందుకో. దాదాపు అన్ని సన్నివేశాల్లోనూ వాల్మీకి ప్రశాంతంగా కాక అసహనంగానే కనిపించాడు. సంభాషణలు పలికిన తీరూ అలాగే ఉంది. కుశలవుల నుంచి కూడా నేను కొంచం ఎక్కువే ఆశించినట్టు ఉన్నాను. అయితే, లక్ష్మణుడిగా శ్రీకాంత్ మెప్పించాడు. కే.ఆర్. విజయ మొదలు రోజా వరకూ ఎందరూ నటులు సహాయ పాత్రల్లో మెరిశారు.


ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని, గ్రాఫిక్స్ ని బాపూ ఉపయోగించుకున్న తీరు అబ్బుర పరిచింది. మహళ్ళూ, రాచ వీధులే కాదు అడవులూ, పశు పక్ష్యాదులని సైతం గ్రాఫిక్స్ లో సృష్టించారు. అయితే ఎక్కడా కూడా ఈ గ్రాఫిక్స్ నటీనటుల్ని తోసిరాజనకపోవడం వెనుక ఉన్నది మాత్రం దర్శకుడి కృషే. చాలా వరకూ కంటికింపు గానే ఉన్నప్పటికీ, అక్కడక్కడా ఈ రంగుల కలగలపు కళ్ళని కూసింత ఇబ్బంది పెట్టింది.

నేను మరికొంచం ఎక్కువ ఆశించిన మరో విభాగం సంగీతం. బాలేదని అనలేను కానీ, మరింత బాగుండ వచ్చు అనిపించిందని చెప్పకుండా ఉండలేను. ఒక్క పద్యమూ లేకపోవడం నిరాశ పరిచింది. మరీ సమాస పూరితాలు కాకపోయినా, సంభాషణల్లాగే సరళమైన పదాల కూర్పుతో కాసిన్ని పద్యాలు ఉంటే నిండుదనం వచ్చేది అనిపించింది.

మొత్తంగా చూసినప్పుడు మాత్రం మెచ్చి తీరాల్సిన ప్రయత్నం. తెలుగు సినిమా దారీ తెన్నూ తెలియకుండా సాగుతున్న తరుణంలో రాముడి కథని ఎంచుకుని, కన్నుల పండువైన సినిమాని అందించిన నిర్మాత యలమంచిలి సాయిబాబుని ప్రత్యేకంగా అభినందించాలి. చెప్పాల్సిన విధంగా చెబితే ఎంత పాత కథతో సినిమా తీసినా జనం ఆదరిస్తారని మరోమారు నిరూపించిన సినిమా 'శ్రీరామరాజ్యం.' థియేటర్లో మరోసారన్నా చూడాలి

సోమవారం, నవంబర్ 14, 2011

పదనిసలు...

"పిప్పిప్పిప్పీ..డం డం..డమడం.. పీ పీ.."
"రాయిండ్రాయిండి... బార్యాగారూ అందరూ బాగున్నారా? ఒలె బుల్లే..సిన్నాన్ననోపాలి రమ్మను...బేగా..."
"ఆయ్.. పెల్లికొచ్చేరా? ఎంతైనా మీవోడింటో పెల్లి కదా.. రాకుండుంటారా?"
"ఆడెక్కడో పన్లో ఉన్నాడు బాబా.. ఒచ్చేత్తాడు.. ఈలోగల మీరు కూతంత పలారం పుచ్చుకోవాల.. ఒలె బుల్లే.. నాలుగు మిటాయుండ్లూ, సున్నుండ్లూ, కూతంత కారబ్బూందీ అట్టుకురాయే.. ఆసేత్తోనే ఆ మూల గెదిలో సెక్కరకేలి అంటిపల్లున్నాయి సూడు.. ఓ నాలుగట్రా.. ఇక్కడున్నట్టు రావాలొలే..."
"యాండిబాబా.. ఇదేనా రాటం.. నల్లపూసైపోయేరు.."
"అయ్ బాబా.. కూతంతేనండే పలారం.. తీసెయ్ కండే.. ...బుల్లే.. మంచినీల్లేయే.. పెత్తేకం సెప్పాలి కావోసు.. బేగట్టుకురా"
".........."
"ఆయ్.. ఈ పెల్లైపోతే బాబా.. మావోడు ఒడ్డెక్కేసినట్టే.. మీయందరి దయానండి.. పైన బగమంతుడున్నాడు..."
"యాండిబాబా.. ఇదేనా రాటం అంటే నవ్వేసూరుకుంటారు. మాం గురుతునేవేటండి? ..... ఉప్పుడూ, ముక్కిమంత్రీ, సెంద్రబాబూ కొల్లూటై పోయేరని సాచ్చోడు సెప్తున్నాడు. నిజవేనంటారా?"
"ఎహే.. ఉప్పుడా గొడవెందుకు? సెంద్రబాబు ఇయ్యాలో రేపో ముచ్చమంత్రై పోతాడని ఈనాడోడు ఏడు సమ్మచ్చారాల్నుంచి సెప్తానే ఉన్నాడు.. అయ్యేడేటి? ...ఈ రాసికీయం కాదు కానండే.. తెలంగాన ఏటవ్వుద్ది? మీకాడేవనుకుంటన్నారు, సెప్పండి ముందు?"
"ఏటైతే మనకేటేహే"
"నువ్వాగరొరే... ఈ గొడవొచ్చినకాన్నించీ ఐద్రాబాదులో తిర పడిపోయినోల్లంతా వొచ్చి మనకాడ బూవులు బేరం సేత్తన్నారా లేదా? మరి మనకేటంటావేటి.. బుద్ది గీని లేదేటి?"
"ఆర్ని పలారం పుచ్చుకోనివ్వండ్రా బాబా... తవరు కూతంత కాపీ కూడా పుచ్చుకోవాల.. ఒలె బుల్లే....."
"ఏటండీ? తీరామోసి మూర్తానికుండ్రా... ఇదేటండిలాగ సేస్సేరు?"
"ఆరుజ్జోగం.. ఆరి గొడవలూ ఆరియ్యిరా.. ఒచ్చేరా నేదా.. నాలుగచ్చింతలేసేరా నేదా..బాబా... ఒచ్చేరు సంతోసం.. తవరింట్లో పప్పన్నానికి పిలాల మమ్మల్ని.. ఇక్కడెట్టుకుంటారో, ఎట్టుకోరో.."
"ఆరీ ఊరొదల్రు లేయే.."
"పిప్పిప్పిప్పీ..డం డం..డమడం.. పీ పీ.."

* * *

"నాలుక్కమ్లాల్ పద్రూపాల్.. నాలుక్కమ్లాల్ పద్రూపాల్.."
"అమ్లాపురం.. అమ్లాపురం.."
"రాజిమండ్రి బస్సెప్పుడొత్తాది బాబా...."
"పెల్లి మూర్తాల్రా బాబు.. ఒక్కబస్సా కాలీ లేదు..."
"పెబువు సల్లగా సూత్తాడయ్యా.. దరమం సెయ్యండి బాబా.."
"ఆటో ఒద్దుగానొరే.. బస్సే ఎక్కుదారి.."
"మొత్తానికి సత్తిగాడికి సమ్మందం బానే కుదిర్సేసేర్రా..."
"ఇయ్యాల్టి మాటేట్రా బాబా.. ఏడాది నించీ పెయిత్నం.. ఎకరం ఊడుపుసేనూ, ఏబయ్యేలు రొక్కానికి కాయం సేసేం.. పిల్లకి తల్లి బంగారంలో ఓటా ఒత్తాదనుకో..."
"ఎకరం ఊడుపు సేనంటే పదిలచ్చలు పైమాటే?"
"యే.. మనోడు నెలకి పదేలు తెచ్చుకోట్లేదేటి? అమ్మాబాబుకీ ఒక్కడే.. ఆత్తంతా ఈడిదే కదేటి.. సవకబేరం కిందే లెక్క..."
"పిల్ల మాంచి రంగే కామాల..ప్లెక్సీ లో పోటో సూసేను.."
"సేమన సాయ.. ప్లెక్సీల్దేవుందిలెహే.. మనంజమ్మ కూతురు ఆదిలచ్మిని కూడా ఐస్వరియా రాయిలాగా సూపింతారు..."
"పోనేహే.. ఆడపిల్లల్లేరని గోలెట్టేత్తన్నారు కదా .. ఏదోపిల్ల దొరికింది సాలు..."
"లేకెక్కడికి పోతారెహే.. కాపోతే ఆల్ల కోరికలకి అంతూ దరీ నేదనుకో..."
"నాలుక్కమ్లాల్ పద్రూపాల్.. నాలుక్కమ్లాల్ పద్రూపాల్.."
"రాజిమండ్రి బస్సెప్పుడొత్తాది బాబా...."

సోమవారం, నవంబర్ 07, 2011

హేమపాత్ర-అశోకవర్దనుడు

తెలుగు సాహిత్యంలో 'విశాలనేత్రాలు' వంటి నిరుపమాన నవలల సృష్టికర్త పిలకా గణపతి శాస్త్రి రాసిన నవలికల జంట 'హేమపాత్ర' 'అశోకవర్ధనుడు.' వీటిలో మొదటి నవలిక కథా స్థలం దక్షిణ భారతదేశమైతే, రెండోది ఉత్తరభారత దేశంలో జరిగిన కథ. రెండూ కూడా అందరికీ తెలిసిన కథలే. అయినప్పటికీ ఆసాంతమూ చదివించేది పిలకా వారి శైలి. కథా స్థలంలో పాటుగా పాత్రల స్వభావాలనీ కళ్ళకి కట్టే వర్ణనా వైచిత్రి కారణంగా, కథ కేవలం చదువుతున్నట్టుగా కాక కళ్ళ ముందు జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది.

'హేమపాత్ర' విప్రనారాయణుడి కథ. శ్రీరంగశాయి మీద భక్తితో సర్వ సుఖాలనీ త్యజించి, చిన్ననాడే ఇల్లు విడిచి శ్రీరంగం చేరిన నారాయణ దేవర కథ. లక్ష్మీదేవి, నారాయణావధాని దంపతులకి లేక లేక కలిగిన ఏకైక సంతానం దేవర. అతడు బాల్యం వీడి యవ్వనంలోకి ప్రవేశించగానే వివాహ ప్రయత్నాలు ఆరంభిస్తారు తల్లిదండ్రులు. అయితే దేవర ధోరణి వేరు. పరంపరాగతంగా వచ్చిన స్వామిపూజలో అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించే దేవర, శ్రీరంగేశుని సేవలో జీవితాన్ని గడపాలని నిశ్చయించుకుంటాడు.

పెళ్ళి చేసుకోమని తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి పెరగడంతో, ఇల్లు విడిచి శ్రీరంగం చేరుకొని అనునిత్యం శాయికి పూలమాలలు సమర్పించడం ఆరంభిస్తాడు. పూవుల నిమిత్తం ఓ పూలతోటని దానితో పాటుగా ఓ కుటీరాన్ని నిర్మించుకుంటాడు. ప్రశాంతంగా సాగిపోతున్న నారాయణ దేవర జీవితంలో తలవని తలంపుగా ప్రవేశిస్తుంది యవ్వనవతి నీలవేణి. గణిక వృత్తి పట్ల విరక్తి చెంది, స్వామి సేవకి జీవితాన్ని అంకితం చేయ నిశ్చయించుకుని ఆశ్రమాన్ని వెతుక్కుంటూ వచ్చానని నమ్మబలుకుతుంది. ఆశ్రయం ఇచ్చిన దేవరని లోబరుచుకుంటుంది.

నీలవేణి (అసలు పేరు దేవదేవి)ని విడిచి ఉండలేని స్థితికి చేరుకున్నాక గాని దేవరకి తెలియదు, తను ఎంతటి ఉచ్చులో చిక్కుకున్నాడో. సాక్షాత్తూ శ్రీరంగ శాయే దేవరకి సాయపడేందుకు రావడంతో కథ ముగింపుకి వస్తుంది. శ్రీరంగం నేపధ్యంగా సాగడం వల్ల, 'విశాల నేత్రాలు' పదే పదే జ్ఞాపకం వచ్చింది. అంతేనా? 'విప్రనారాయణ' కోసం భానుమతి పాడిన 'ఎందుకోయీ.. తోటమాలీ.. అంతులేనీ యాతనా..' పాట చెవుల్లో గింగురుమంటూనే ఉంది. గణికల స్వభావంతో పాటు, ఆనాటి పాలనా వ్యవస్థనీ సునిశితంగా చిత్రించారు రచయిత.

పాటలీపుత్ర పాలకుడు అశోకుడి కథ 'అశోకవర్ధనుడు.' అసలు అశోకుడు అనగానే మొదట గుర్తొచ్చే వాక్యం 'అశోకుడు చెట్లు నాటించెను.' అతగాడు నాటించిన మొక్కలు పెరిగి చెట్లయ్యాయి కానీ మనం మాత్రం చెట్లు నాటించెను అనే అంటాం! కళింగ యుద్ధం అనంతరం, అశోకుడు యుద్ధాల పట్ల విముఖుడై, బౌద్ధం పట్ల ఆకర్షితుడయ్యాడని చెబుతారు చరిత్రకారులు. ఆ యుద్ధానికి దారితీసిన పరిస్థితులు, అప్పటి అశోకుడి మనఃస్థితి
లాంటి విషయాలని విపులంగా విశదీకరించిన నవలిక 'అశోక వర్ధనుడు.'

మహానది ఒడ్డున ఉన్న తోసలీనగరం ఓ చిన్న సామంత రాజ్యం. ఆ రాజ్య పాలకుడు మహేంద్ర కేసరి పెద్ద కుమార్తె నాగావళి. మహేంద్ర కేసరికి కళింగ రాజ్యపు రాజు కళింగ మల్లుడు పక్కలో బల్లెం. ఎప్పుడెప్పుడు తోసలిని ఆక్రమిద్దామా అని ఎదురు చూసే కళింగ మల్లుడికి అశోకుడి దండయాత్ర పెద్ద అవకాశంగా కనిపిస్తుంది. చిన్న చిన్న సామంత రాజ్యాలన్నీ కలిసి అశోకుడిని ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలని వేగులు పంపుతూనే, మహేంద్ర కేసరి కి నాగావళిని తను వివాహం చేసుకుంటానంటూ రాయబారం పంపుతాడు.

వృద్ధుడైన కళింగ మల్లుడికి నాగావళిని ఇచ్చి వివాహం చేయడం ఏమాత్రం ఇష్టం ఉండదు మహేంద్ర కేసరికి. అంతకన్నా, అశోక చక్రవర్తి సహాయం ఆర్ధించి అతడికే నాగావళిని ఇచ్చి వివాహం చేయడం ఉత్తమం అన్న అభిప్రాయంలో ఉంటాడు. తనపై యుద్ధం ప్రకటించిన కళింగ మల్లుడిని ఎదుర్కొనేందుకు అశోకుడి సాయం కోరతాడు. వివాహ ప్రతిపాదననీ చక్రవర్తి ముందు ఉంచుతాడు. అశోకుడిపట్ల ఇష్టం పెంచుకున్న నాగావళి, కేవలం తన కారణంగా రాజ్యంలో ప్రజలందరూ కళింగ మల్లుడి వల్ల బాధలు పడడం భరించలేని ఆ యువతి మల్లుడిని వివాహం చేసుకోడానికి అంగీకారం తెలుపుతుంది.

అయితే కూతురి ప్రతిపాదనని ఏమాత్రం అంగీకరించడు మహేంద్ర కేసరి. అటు కళింగ బలగాలకీ, ఇటు పాటలీ పుత్ర సైన్యాలకీ మధ్య భీభత్సమైన యుద్ధం జరగడంతో కథ ముగింపుకి వస్తుంది. యుద్ధ తంత్రాన్ని అత్యంత శ్రద్ధగా చిత్రించారు రచయిత. అలాగే అశోకుడికి బౌద్ధం పట్ల సానుకూల ధోరణి ఏర్పడడానికీ, యుద్ధాల పట్ల విరక్తి ఏర్పడడానికీ దారితీసిన పరిస్థితులని క్లుప్తంగా చెప్పారు. చరిత్ర మీద మక్కువ ఉన్నవాళ్ళు తప్పక చదవాల్సిన రచన. రెండు నవలికలనీ ఒకే సంకలనంగా తీసుకొచ్చింది ఎమెస్కో. పేజీలు 168, వెల రూ. 60, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులతో పాటు ఏవీకెఎఫ్ లోనూ లభ్యం.

మంగళవారం, నవంబర్ 01, 2011

ఇడ్లి-ఆర్కిడ్-ఆకాశం

చాన్నాళ్ళ తర్వాత యండమూరి వీరేంద్రనాథ్ రాసిన పుస్తకం చదివాను. అది కూడా పుస్తకం మార్కెట్లోకి విడుదలైన మూడేళ్ళ తర్వాత. 'అంతర్ముఖం' తర్వాత యండమూరి పుస్తకాలేవీ చదవలేదు నేను. తను కూడా నవలలకి స్వస్తి చెప్పి విజయానికి మెట్లు కట్టే పనిలో బిజీ అవ్వడం, ఆ మెట్ల మీద నాకు పెద్దగా ఆసక్తి లేకపోవడంతో తనతో బాగా గ్యాప్ వచ్చేసింది. విఠల్ వెంకటేష్ కామత్ ఆత్మకథ 'ఇడ్లి, ఆర్కిడ్ అండ్ విల్ పవర్' కి యండమూరి స్వేచ్ఛానువాదం 'ఇడ్లి-వడ- ఆకాశం' పేరుతో విడుదలయ్యింది. మలి ముద్రణలో అదే పుస్తకం పేరుని 'ఇడ్లి-ఆర్కిడ్-ఆకాశం' గా మార్చారు, కామత్ కట్టిన ప్రముఖ ఐదు నక్షత్రాల హోటల్ 'ఆర్కిడ్' పేరు కలిసొచ్చేలాగా.

మహానగరాల్లో ఉండేవాళ్ళకి మాత్రమే కాదు, చుట్టం చూపుగా ఆ నగరాలని చూసొచ్చిన వాళ్లకి కూడా కామత్ హోటళ్ళని ప్రత్యేకంగా పరిచయం చెయ్యక్కర్లేదు. పొగలు కక్కే ఇడ్డెన్లు, క్రిస్పీగా కనిపించే దోశలు, వీటితో పాటు కేవలం వాసన తోనే నోరూరించే సాంబార్ ఈ దక్షిణాది ఫలహార శాలల ప్రత్యేకత. ఈ హోటళ్ళని నిర్వహించేది కర్ణాటక లోని కార్వార్ ప్రాంతానికి చెందిన కామత్ కుటుంబం వారు. 'ఇడ్లీ-వడ-సాంబార్' అన్నది వీళ్ళ ముద్దుపేరు. రుచికరమైన ఫలహారాలని తాజాగానూ, అందరికీ అందుబాటు ధరల్లోనూ అందించడం కామత్ హోటళ్ళ విజయ రహస్యం. అలాంటి కామత్ కుటుంబంలో, ఆరుగురు పిల్లల తండ్రి వెంకటేష్ కామత్ రెండో కొడుకు విఠల్ వెంకటేష్ కామత్.

తండ్రి చిన్న చిన్న హోటళ్ళని నిర్వహించడాన్ని చూస్తూ పెరిగిన విఠల్ ఏనాడూ కూడా హోటల్ రంగంలో అడుగుపెట్టాలని అనుకోలేదు. అయితే ఇంజనీరింగ్ పూర్తి చేశాక అనుకోకుండా హోటల్ రంగంలోకి వచ్చి దానినే వృత్తిగా స్వీకరించాల్సి వచ్చింది. పెరిగిన వాతావరణం కారణంగా, హోటల్ నిర్వహణ కోసం ప్రత్యేకించి ఎలాంటి శిక్షణా తీసుకోవాల్సిన అవసరం రాలేదు అతనికి. నిజానికి, పెరిగిన వాతావరణం ఒక వ్యక్తి జీవితం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది అనడానికి విఠల్ జీవితం ఓ మంచి ఉదాహరణ. హిట్లర్ లాంటి తండ్రి, ప్రేమించే తల్లి, వీటిని మించి తమలో కలుపుకున్న ఇరుగూ-పొరుగూ, శ్రద్ధగా చదువు చెప్పిన గురువులు వీళ్ళంతా తన వ్యక్తిత్వాన్ని ఎలా ప్రభావితం చేసిందీ ప్రారంభ అధ్యాయాల్లో విపులంగా చెప్పారు విఠల్. వీళ్ళందరి సాహచర్యం అతనిలో కష్టపడే తత్వాన్నీ, నేర్చుకోవాలనే ఆసక్తినీ పెంచింది.

వ్యాపారంలో ప్రవేశించాక, విదేశాలు తిరిగి వృత్తికి సంబంధించిన కొత్త విషయాలు నేర్చుకోవాలని అనుకున్నప్పుడు విఠల్ తన తండ్రిని అడిగింది ఒక్కటే. "లండన్ కి టిక్కట్ కొనివ్వండి చాలు. అక్కడినుంచి నేను చూసుకుంటాను." అది అహంభావం కాదు, ఆత్మవిశ్వాసం. ఆ తండ్రికి కొడుకు మీద ఉన్న నమ్మకం ఎంతటిదంటే కేవలం ప్రయాణపు టిక్కట్ మాత్రమే కొనిచ్చాడాయన. భారతీయ భోజనశాలల్లో పనిచేస్తూ, కొత్త విషయాలు నేర్చుకోవడంతో పాటు డబ్బునీ సంపాదిస్తూ తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం బొంబాయికి తిరిగి వచ్చాడు విఠల్. రాత్రికి రాత్రి ఓ సర్దార్జీకి లడ్డూలు చుట్టి ఇచ్చినా, విదేశీ టూరిస్టులకి పుచ్చకాయ ముక్కలూ, పానీయాలూ అందించినా వాటి వెనుక ఉన్న లక్ష్యాలు రెండే.. నేర్చుకోవడం, సంపాదించడం.

చేసే పనిని విపరీతంగా ప్రేమించే విఠల్ కేవలం పని రాక్షసుడు కాదు. ఓ మామూలు మనిషి. అందుకే హోటల్ పనితో విసుగు చెంది, ఓ మధ్యాహ్నం తండ్రికి అబద్ధం చెప్పి సినిమాకి వెళ్ళాడు. తన రెస్టారెంట్ కి క్రమం తప్పకుండా వచ్చే ఓ అందమైన అమ్మాయిని మనస్పూర్తిగా ప్రేమించాడు. ఆ ప్రేమని పైకి ప్రకటించక పోయినా ఆమెకి మంచే చేశాడు. తనకో జీవిత భాగస్వామిని వెతికే బాధ్యతని మాత్రం తల్లిదండ్రులకే అప్పగించాడు. వివాహానికి ముందే కాబోయే భాగస్వామి విద్యతో వృత్తిపట్ల తన కమిట్మెంట్నీ, తన షార్ట్ టెంపర్నీ ఏమాత్రం దాచకుండా చెప్పేశాడు. తన తల్లిలాగే భార్యదీ
కష్టపడే తత్వమనీ, నలుగురిలోనూ కలిసిపోయే స్వభావమనీ తొందరలోనే గ్రహించాడు.

తండ్రికి చెప్పకుండా బొంబాయి ఏర్పోర్ట్ సమీపంలో త్రీ స్టార్ హోటల్ కొన్నా, అత్యంత వ్యయప్రయాసలకోర్చి 'ఆర్కిడ్' ఫైవ్ స్టార్ హోటల్ కట్టాలని నిర్ణయం తీసుకున్నా అవన్నీ తన మీద తనకున్న నమ్మకంతోనే. త్రీ స్టార్ హోటల్ ఎంతగా విజయవంతం అయ్యిందో, ఫైవ్ స్టార్ హోటల్ అంతగానూ ఇబ్బందులు పెట్టింది. కుటుంబంలో చీలిక రావడం, విఠల్ వాటాకి అప్పుడే పునాదులు తీసిన ఆర్కిడ్ తో పాటు తలకి మించిన అప్పులు మాత్రమే రావడం బాగా కుంగదీసింది అతన్ని. డబ్బు ఉండడానికీ, లేకపోవడానికీ తేడా అతి కొద్ది రోజుల్లోనే అర్ధమైనా తన సహజ లక్షణమైన నిజాయితీని ఏనాడూ విడిచిపెట్టలేదు. ఈ కారణంగా మనుషుల మనస్తత్వాలని మరింత బాగా తెలుసుకోవడం సులువయ్యింది. ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయం తీసుకుని, అమలు పరిచే చివరి నిమిషంలో దానిని విరమించుకోవడం విఠల్ జీవితంలో ఓ పెద్ద మలుపు. నిజానికి పునర్జన్మ అనాలి.

కష్టాలు చుట్టుముట్టినప్పుడు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, భార్య అందించిన సహకారం ఇవన్నీ తన అదృష్టాలుగా చెప్పుకున్నారు విఠల్. తన తండ్రి హోటల్లో బల్లలు తుడిచే పనితో జీవితాన్ని మొదలు పెట్టిన బొంబాయి నగరంలో, ఆయనే చైర్మన్ గా నిర్మించిన ఆర్కిడ్ హోటల్ని ఆయనే చేతుల మీదుగానే ప్రారంభించాలన్న తన కలని, ఎన్నో కష్టనష్టాలకోర్చి విఠల్ నిజం చేసుకున్న క్షణాలని మనమూ మర్చిపోలేం. ఆద్యంతమూ ఆసక్తిగా చదివించిన కథనం. యండమూరి కేవలం మూల రచనని అనువదించి ఊరుకోకుండా తనదైన శైలిలో మార్పులూ, చేర్పులూ చేసినట్టుగా అనిపించింది. చివర్లో చదివిన ముందుమాటలో ఇదే మాట కనిపించింది. స్పూర్తివంతమైన రచన. (నవసాహితి ప్రచురణ, పేజీలు 176, వెల రూ. 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు). ఈ పుస్తకాన్ని చదవమని సూచించిన బ్లాగ్మిత్రులందరికీ కృతజ్ఞతలు.

సోమవారం, అక్టోబర్ 31, 2011

విజేత సాయిరమ్య

ఉత్కంఠ భరితంగా సాగిన 'పాడుతా తీయగా' చిన్నపిల్లల వరుస రెండో సిరీస్ లో విశాఖపట్నానికి చెందిన సాయిరమ్య మొదటి బహుమతి అందుకుంది. హైదరాబాద్ అమ్మాయి దామిని రెండో స్థానంలో నిలబడగా, ఖమ్మానికి చెందిన నూతన, నెల్లూరు జిల్లా తడ నుంచి వచ్చిన శరత్ చంద్ర మూడో స్థానంలో నిలబడ్డారు. విశాఖపట్నం పోర్టు కళావాణి ఆడిటోరియం లో జరిగిన ఫైనల్స్ లో ముఖ్య అతిధిగా పాల్గొన్న సిని దర్శకుడు దాసరి నారాయణ రావు, మొదటి బహుమతి విజేతకి మూడులక్షల రూపాయలు, రెండో బహుమతి విజేతకి లక్ష రూపాయలు, మూడో బహుమతి విజేతలు ఒక్కొక్కరికీ యాభైవేల రూపాయల నగదు బహుమతులు అందించారు.

సాయిరమ్య, దామిని, శరత్ చంద్ర మొదటి ఎపిసోడ్ నుంచీ బాగా పాడుతూ ఉండడంతో వీళ్ళు తప్పకుండా ఫైనల్స్ కి వస్తారు అనుకున్నాను నేను. ఎలాంటి భావాన్నైనా గొంతులో అలవోకగా పలికించగలిగే నూతన పాటల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించడంతో పాటు, చిన్న చిన్న లోపాలని సవరించుకోవడం ద్వారా ఫైనల్స్ కి స్థానం సంపాదించుకుంది. విజయనగరం అమ్మాయి లహరి సైతం ఫైనల్స్ లో తొలిదశ వడపోత వరకూ రాగలిగింది. ఆశ్చర్యకరంగా ఈ సిరీస్ లో మొదటినుంచీ కూడా అబ్బాయిల సంఖ్య బహు తక్కువ. వచ్చిన కొద్దిమందీ ప్రారంభ ఎపిసోడ్లలోనే ఒక్కొక్కరుగా వెను తిరగగా ఒక్క శరత్ చంద్ర మాత్రం చివరివరకూ నిలబడగలిగాడు.

నేను ఊహించిన ముగ్గురూ ఫైనల్స్ కి రావడం సంతోషాన్ని కలిగించినా వీళ్ళలో మొదటి బహుమతి ఎవరిది? అన్న విషయంలో ప్రతి పాటకీ అభిప్రాయం మారిపోతూ వచ్చింది. శరత్ చంద్ర 'అన్నమయ్య' సినిమాలో 'అంతర్యామీ...' పాట పూర్తి చేసిన మరుక్షణం 'ఇతనే విజేత' అనుకున్నాను.. మరో రౌండ్లో దామిని 'మాటే మంత్రము..' పాడిన తీరు చూసి, 'తప్పకుండా మొదటి బహుమతి అందుకుంటుంది..' అన్న అంచనా వచ్చేసింది. సాయిరమ్య, నూతనలూ తక్కువ తినలేదు. అందువల్లనే ఈ సిరీస్ చివరికంటా ఉత్కంఠ కొనసాగింది. కేవలం వాళ్ళ వాళ్ళ పాటల్ని మాత్రమే కాకుండా, వేరొకరికి కోరస్ పాడేటప్పుడూ అదే శ్రద్ధని కొనసాగించారు పిల్లలందరూ.


ప్రారంభ ఎపిసోడ్లతో పోల్చినప్పుడు, సెమి-ఫైనల్స్ దశనుంచీ కార్యక్రమం నాణ్యత బాగా పెరిగిందన్నది నా పరిశీలన. వడపోతల తర్వాత మిగిలిన గాయనీ గాయకులంతా నువ్వా-నేనా అన్నట్టుగా ఉండడమే బహుశా ఇందుకు కారణం. 'పద్యం తెలుగు వారి సొత్తు.. పద్యాలు నేర్చుకుందాం.. మన పిల్లలకి నేర్పిద్దాం' అని వీలున్నప్పుడల్లా చెప్పే కార్యక్రమ వ్యాఖ్యాత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పద్యం రౌండు లేకుండానే ఈ సిరీస్ ముగించడం కించిత్ ఆశ్చర్యాన్ని కలిగించింది. చివరి ఎపిసోడ్లో అన్నా పద్యాల రౌండ్ ఉంటుందని ఎదురు చూసి నిరాశ పడ్డాను నేను. కారణం ఏమో తెలీదు కానీ, పద్యాలకి బదులుగా శాస్త్రీయ సంగీత ప్రధానమైన పాటలు పాడారు పిల్లలు.

సాయిరమ్య గొంతులో వినిపించే జీర కారణంగా, శ్రావ్యత కొంచం తగ్గినట్టు అనిపిస్తుంది నాకు. విజేతగా నిలబడడానికి ఆ అమ్మాయికి ఇది ఇబ్బంది కాగలదేమో అనిపించింది నాకు. అయితే, పాటల ఎంపికలో తెలివిగా వ్యవహరించి, తన గాత్ర ధర్మానికి సరిపోయే పాటల్ని మాత్రమే ఎంచుకుని బాగా సాధన చేసి పాడడం ద్వారా తనకి మైనస్ అవుతుందనిపించే అంశాన్నే ప్లస్ గా మార్చుకుంది ఈ అమ్మాయి. ఆత్మవిశ్వాసం పాళ్ళు రవ్వంత ఎక్కువగా కనిపించే దామిని పాటలో 'ప్రొఫెషనలిజం' బాగా ఉంటుందనేది బాలూ తరచూ చెప్పిన మాట. ఇదే ఆమెకి మైనస్ గా మారింది అనుకోవాలా??

ఓ దశలో, 'రాజేశ్' సిరీస్ లో లాగా అమ్మాయిలతో పోటీపడి శరత్ చంద్ర టైటిల్ విజేతగా నిలబడతాడా? అనిపించింది.. అలా నిలబడే అర్హతలు అతనికి ఉన్నాయన్నది నిస్సందేహం. అయితే కంఠస్వరం మారే వయసు కావడం వల్ల, కొన్ని కొన్ని చోట్ల గొంతు అతనికి సహకరించక, కావాల్సిన భావం పూర్తిగా పలకలేదేమో అనిపించింది. మరీ ముఖ్యంగా, చివర్లో పాడిన 'బ్రోచేవారెవరురా..' పాటలో ఈ ఇబ్బంది వినిపించింది నాకు. నూతన అనగానే నాకు మొదట గుర్తొచ్చే పాట 'ప్రతిఘటన' సినిమాలో 'ఈ దుర్యోధన దుశ్శాసన..' క్వార్టర్ ఫైనల్స్ దశలో ఈ అమ్మాయి ఈ పాట పాడినప్పుడు 'అవసరమైన దానికన్నా కొంచం ఎక్కువ భావాన్ని పలికించింది' అనిపించింది. పాటేదైనా దానిని భావయుక్తంగా పాడడం ఈ అమ్మాయి ప్రత్యేకత. వచ్చేవారం నుంచీ టీనేజ్ గాయనీ గాయకులతో కొత్త సిరీస్ ప్రసారం కాబోతోంది.

ఆదివారం, అక్టోబర్ 30, 2011

సుమనే మీ అల్లుడు

ఓ నాయకుడు, ఇద్దరు నాయికలతో నడిచే కథలు చేసీ చేసీ తనకే విసుగొచ్చినట్టుంది. అందుకే ఈ సారి పంధా మార్చి ఓ నాయిక ఇద్దరు నాయకుల కథతో మన ముందుకు వచ్చాడు సుమన్ బాబు. సుమన్ ప్రొడక్షన్స్ సగర్వ సమర్పణలో, కె. సుభాష్ కుమార్ అనే నవతరం దర్శకుడు తొలిసారిగా దర్శకత్వ బాధ్యతలు చేపట్టగా, ఇంద్రనాగుడి దర్శకత్వ పర్యవేక్షణలో రూపు దిద్దుకున్న 'నేనే మీ అల్లుడు' చిత్రరాజం ప్రత్యేకత ఏమిటంటే ఇది పూర్తిగా హాస్యరస భరితం.

నదులన్నీ చివరికి సముద్రంలో కలిసినట్టుగా మన సుమనుడు ఏ రసాన్ని చేపట్టినా అది హాస్యంగా రూపు మారిపోతుందన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే, అనేకానేక సెంటిమెంటు షోల అనంతరం విడుదలైన ఈ షోలో మాత్రం ప్రేక్షకులు ఇతర రసాలనుంచి హాస్య రసాన్ని పిండుకునే అవసరం లేకుండా నేరుగా హాస్యాన్నే ఆస్వాదించే వీలు కలిగిందన్న మాట.

పచ్చని పల్లెటూళ్ళో అనగనగా ఓ సుబ్బరాజు (మిశ్రో). అతగాడికి పేకాట పిచ్చి. ఆయన భార్య జానకి (శ్రీలక్ష్మి) కి టీవీ సీరియళ్ళ పిచ్చి. వాళ్ళబ్బాయి బాండ్ కి తనో డిటెక్టివ్ అనే పిచ్చి. వాళ్ళ పనిపిల్ల సీతాలుకి 'అష్టా చమ్మా' సినిమాలో కలర్స్ స్వాతిలాగా హీరో మహేష్ బాబంటే పిచ్చి. అదే ఇంట్లో పనివాడు మరియు సీతాలు బావ రంగయ్యకి సీతాలంటే పిచ్చి. వీళ్ళందరి మధ్యనా ఏ పిచ్చీ లేనిది సుబ్బరాజు కూతురు మహాలక్ష్మి (అంజూ అస్రానీ, 'శుభం' ద్వితీయ నాయిక హారిక!)

చూడ్డానికి రెండు పదహార్లు నిండి మూడో పదహారు నడుస్తోందేమో అనిపించే మహాలక్ష్మి అచ్చమైన పల్లెటూరి 'ముద్దబంతి'. పగటివేళ పట్టు పావడాలు, శిల్కు వోణీలు మరియు ఒంటి నిండా ధగద్ధగాయమైన నగలతో వెలిగిపోతూ, రాత్రి వేళల్లో కేవలం నైటీ మాత్రమే ధరించే సంప్రదాయమైన ఆడపిల్ల. ఓ రోజు పొద్దున్నే అలంకరణ పూర్తి చేసుకుని, కడవెత్తుకుని నీలాటిరేవుకెళ్ళి నీళ్ళు ముంచుకుని ఇంటికి వస్తుంటే, అప్పుడే ఎర్రబస్సు దిగిన ఓ అందమైన యువకుడు (ఎవరో ఎంతమాత్రమూ కాదు, మన సుమనుడే) స్ట్రాలర్ సహితుడై ఆమె వెంట పడతాడు.

ఇంట్లో పిచ్చాళ్ళంతా వాళ్ళ వాళ్ళ పిచ్చిల్ని ప్రయోగించగా, వాటిని ఓపిగ్గా భరించి చివర్లో తను అమెరికా నుంచి వచ్చిన సుబ్బరాజు మేనల్లుడు 'చక్రధర్' అని చెబుతాడు. ఇటు మహాలక్ష్మి, అటు సీతాలూ కూడా అతగాడిని ఏకకాలంలో మోహించేస్తారు. ఆ అందాల చందమామే తన ఇంటి అల్లుడు కావాలని ఆశ పడుతుంది జానకి. సుబ్బరాజు ఆనందభాష్పాలు రాలుస్తాడు. ఇప్పుడో, ఇంకాసేపట్లోనో ఈ చక్రధరూ మహాలక్ష్మీ ఓ యుగళగీతం పాడేసుకుంటారని ఊహిస్తూ ఉండగా, సుబ్బరాజు ఇంటిముందు ఓ కారు ఆగుతుంది. నేనే చక్రధర్ అంటూ ఇంకో కుర్రాడు (ఇంద్రనాగు) దిగుతాడు.

వచ్చిన ఇద్దరికీ ఒకరి గురించి ఒకరికి తెలియకుండా చేయాలని సుబ్బరాజు అండ్ కో ప్రయత్నం. ఇందులో భాగంగా రంగయ్య మన సుమన్ బాబుని గేదెల దగ్గరికి తీసుకెళ్ళి పాలు పిండమంటాడు. అప్పుడేమో బాబు 'అమెరికా గేదల' గురించి బోల్డన్ని విషయాలు చెబుతాడు. గుడికి వెళ్లి, మహాలక్ష్మితో సహా భక్తులందరికీ వినపడే విధంగా మహాలక్ష్మితో తనకి పెళ్ళి జరిపించమని షిరిడీ సాయిబాబాని కోరుకుని నూటెనిమిది ప్రదక్షిణాలు చేస్తాడు. మహాలక్ష్మితో బోల్డన్ని చిలిపి రొమాంటిక్ కబుర్లు చెబుతాడు. అంతేనా, మహాలక్ష్మి అతగాడిని తాకగానే గ్రాఫిక్స్ మెరుపులు కనిపిస్తాయి కూడా. విశాల హృదయ అయిన సీతాలు ఇంద్రనాగుని కూడా తగుమాత్రంగా ప్రేమించేస్తుంది.

ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఓ రోజు చక్రధర్లిద్దరూ ఎదురు పడిపోతారు. నలుపు తెలుపుల్లో దృశ్యం మాత్రమే కనిపించే వెనక మెరుపొకటి కనిపించి మాయమవుతుంది. ఇద్దరూ 'నువ్వెంత?' అంటే 'నువ్వెంత?' అనుకోవడం, 'మహాలక్ష్మి నాది' అంటే 'నాది' అనుకోవడం, ఈ ఇంటికి 'నేనే అల్లుడు' అనుకోవడం మాత్రం సొష్టంగా వినిపిస్తాయి. అప్పుడింక సుమనుడు అత్తగారినీ, ఇంద్రనాగు మావగారినీ ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో పడతారు. 'గుండమ్మకథలో ఎన్టీ వోడిలాగా' రుబ్బురోలు దగ్గర అత్తయ్యకి పప్పు రుబ్బిపెట్టీ, టీవీ సీరియల్ కబుర్లు చెప్పీ సుమనుడు అలరిస్తే, పేకాటతో సుబ్బరాజుని పడగొట్టేస్తాడు ఇంద్రనాగు.

ఇది పని కాదని తలచిన సుమనుడు ఏకంగా కోయదొర వేషం వేసుకుని 'కుర్రో కుర్రు' అనుకుంటూ వచ్చి ముందొచ్చిన వాడే అల్లుడు అనే హింటుని సుబ్బరాజు కుటుంబానికి అందించి చటుక్కున మాయమై, గబుక్కున తెల్ల పేంటు, నల్ల చొక్కాలో ప్రత్యక్షం అవుతాడు. సుమన్ బాబు శ్రమ ఫలించి మారువేషంలో అతగాడిని ఎవరూ కూడా గుర్తుపట్టరు. మహాలక్ష్మి కూడా ఇంక తప్పదురా బాబూ అనుకుని, సుమన్ తో కలిసి ఫిలిం సిటీలో "ఏ మాయ చేసేసావో ఓ మైనా.. ఏ మంత్ర మేసేసావో.." అనే డ్యూయట్టు పాడేసుకుంటుంది. డ్యూయట్టు అయిపోయాక వచ్చేది క్లైమాక్సే అని కొత్తగా చెప్పక్కర్లేదు కదా.

షిరిడీ సాయిబాబా సాక్షిగా సుమన్ బాబు చెప్పే నిజం అల్లప్పుడెప్పుడో రవిరాజా పినిశెట్టి తీసిన 'రుక్మిణి' సినిమాని జ్ఞాపకం చేస్తుంది. సుమనుడి మంచితనానికి అంతటి ఇంద్రనాగుడూ కరిగి కన్నీరవుతాడు. మహాలక్ష్మి పరుగున వెళ్లి వాటేసుకుంటుంది. అత్తమామలు ఆనందభాష్పాలు విడుస్తుండగా, నును సిగ్గుతో 'నేనే మీ అల్లుడు' అని ప్రకటిస్తాడు అనాధ సాఫ్టవేర్ ఇంజినీర్ వాసు పాత్రని ధరించిన సుమన్ బాబు. ఆద్యంతమూ హాస్యరసం అవ్వడం వల్లేమో తెలీదు కానీ తన పాత్రని అనాయాసంగా భరించేశాడు సుమనుడు. వాచికాన్ని మినహాయించుకుంటే, నటనలో కూసింత ఇంప్రూవ్మెంట్ కనిపించిందో, నాకు చూడడం అలవాటైపోయిందో అర్ధం కావడం లేదు.

మిత్రులొకరు చెప్పినట్టుగా, సినిమాల్లోనే కాదు టీవీ సీరియళ్లలోనూ అవుట్ డేటెడ్ అయిపోయిన పల్లెటూళ్ళు, మండువా లోగిళ్ళు లంగావోణీలని ఇంకా గుర్తుపెట్టుకున్నందుకైనా సుమన్ బాబుని అభినందించాల్సిందే. టైటిల్స్ లో యానిమేషనూ, అక్కడక్కడా గ్రాఫిక్సులూ ఈ షో ప్రత్యేకత. భోలేషావలీ సంగీతం ఈసారి కూడా బాగుంది. ఇంద్రనాగ్ కూడా సుమన్ తో సరిసమానంగా కాస్ట్యూమ్స్ ధరించడం కొంచం మింగుడు పడలేదు. పాసివ్ పాత్రల పట్ల బాబుకి ఉండే మక్కువ వల్ల కావొచ్చు, కొన్ని కొన్ని సన్నివేశాల్లో ఇంద్రనాగు సుమన్ని దబాయించాడు. దర్శకత్వ పర్యవేక్షణ కొంచం శ్రుతిమించడం వల్ల కాబోలు ఆద్యంతమూ ఇంద్రనాగ్ మార్కు (మరేదో కాదు సుమన్ బాబు మార్కే) కనిపించింది. అయినప్పటికీ, కాసిన్ని సీన్లలో మనస్పూర్తిగా నవ్వించింది. అన్నట్టు తదుపరి షో పేరు 'చూడు చూడు తమాషా' .. ఇవాళే ప్రకటన వచ్చింది, బాబుది రాక్ స్టార్ పాత్ర అనుకుంటా!!

మంగళవారం, అక్టోబర్ 25, 2011

బీప్...బీప్...

ఏకాగ్ర చిత్తంతో పని చేసుకుంటూ ఉండగా చొక్కా జేబులోనుంచి బీప్ బీప్ అన్న చప్పుడు వినిపించింది. 'తర్వాత చూడొచ్చులే' అని నాకు నేను సర్ది చెప్పుకుని పనియందు మనసు లగ్నం చేసినవాడిని అయ్యాను. ఎంతసేపూ.. కేవలం ఒక్క నిమిషం. రెండో నిమిషంలో కుతూహలం. 'ఏదన్నా అర్జెంటు సంగతేమో.. ఫోన్ చేసి డిస్ట్రబ్ చేయడం ఎందుకని మెసేజీ పంపారేమో..' ఇలా మనసు పరిపరి విధాల పక్క దోవలు పట్టేసరికి, తప్పనిసరై జేబులోనుంచి ఫోను తీశాను.

"దంతేరాస్, దీపావళి శుభాకాంక్షలు. బంగారం కొనండి.. అంతే బరువున్న వెండిని ఉచిత బహుమతిగా పొందండి. తరుగు, మజూరీ చార్జీలు లేవు" అంటూ సకుటుంబ వస్త్రనందనం వారి పలకరింపు, మూడు రోజుల్లో ముప్ఫై మూడోసారి. కసిగా డిలీట్ బటను నొక్కి, మళ్ళీ నా పనిలో పడ్డాను. పది నిమిషాలన్నా గడిచాయో లేదో మళ్ళీ అదే దృశ్యం పునరావృతమయ్యింది. ఈసారి శుభాకాంక్షలు అందజేసిన వారు మా కుటుంబ దర్జీ. తన సేవలని వినియోగించుకుంటోన్నందుకు ధన్యవాదాలు కూడా అర్పించారు వారు.

'పండగ ఇంకా ఓ రోజు ఉందనగానే తొందరపడి ఈ కోయిల ఇలా ముందే ఎందుకు కూస్తోంది చెప్మా' అని ఒకప్పుడైతే ఆశ్చర్య పోయేవాడిని కానీ, ఇప్పుడు అలవాటైపోయింది. కొన్ని కొన్ని నెట్వర్కులు పండుగ రోజుల్లో మెసేజీ చార్జీలు పెంచేయడం మొదలు, నెట్వర్కులు జామైపోవడం వరకూ రకరకాల కారణాల వల్ల అసలు పండగకన్నా ముందరే శుభాకాంక్షల పరంపర మొదలైపోతోంది. కేవలం ఫోన్ల నుంచి మాత్రమే కాక, ఇంటర్నెట్ ద్వారా ఉచిత మెసేజీల సౌకర్యం మొదలయ్యాక ఈ శుభకామన సందేశాల పరంపర కొత్త పుంతలు తొక్కడం మొదలయ్యింది.

మొబైల్ ఫోన్ వినియోగంలోకి వచ్చిన కొత్తల్లో కాల్ చార్జీల మాదిరిగానే, మెసేజీల చార్జీలూ భారీగానే ఉండేవి.. చాన్నాళ్ళ పాటు మెసేజీ ఆప్షన్ వైపు వెళ్ళనే లేదు సామాన్య వినియోగదారులు చాలామంది. చూస్తుండగానే కాల్ చార్జీలతో పాటు మెసేజీల పేకేజీల్లోనూ ఊహించనన్ని మార్పులు వచ్చేశాయ్. అలాగే ఓ కొత్త తరహా ప్రకటన విధానమూ మొదలయ్యింది. శ్రీరమణ రాసిన 'గుత్తొంకాయ కూర - మానవ సంబంధాలు' వ్యాసాల పరంపరని ఓసారి గుర్తు చేసుకుంటే, మన సెల్ఫోన్ మెసేజీలు కూడా మానవ సంబంధాల మీద తమదైన ముద్రని వేశాయని అంగీకరించక తప్పదు.

ఇప్పుడిప్పుడు పండగ వస్తోందంటే చాలు.. అది ఏ మతానికి సంబంధించినదైనా, చివరికి దేశానికి సంబంధించినదైనా సరే సెల్ ఫోనులో అక్షరాలా సందేశాల వర్షం కురుస్తోంది. ఈ సందేశాలు పంపేది కేవలం మన సర్కిల్లో వాళ్ళు మాత్రమే కాదు.. మనం ఏమాత్రమూ ఊహించని వైపునుంచి కూడా శుభాకాంక్షలు వచ్చి పడుతున్నాయి. అంటే, శుభాకాంక్షల సందేశాల ద్వారా సర్కిల్ విస్తృతమవుతోందన్న మాట, మెచ్చుకోవాల్సిన విషయమే కదా..

మన కాంటాక్ట్ లిస్టులో ఉన్నవాళ్ళూ, తమ వివరాలతో సందేశాలు పంపేవాళ్ళతో ఎలాంటి ఇబ్బందీ ఉండదు కానీ, వాళ్ళ పేరు కచ్చితంగా మన జాబితాలో ఉంటుందన్న దీటైన నమ్మకంతో శుభాకాంక్షలు అందించేవారితో అప్పుడప్పుడూ ఇబ్బందులు తప్పవు. వాళ్ళెవరో మనకి తెలీదు.. కానీ మనం వాళ్లకి తెలుసు. 'మీరు ఎవరు?' అనకూడదు. ఎవరో తెలుసుకోవాలి. బుర్రకి పదును పెట్టే కార్యక్రమమే కచ్చితంగా. మొదటినుంచీ నాకు నేనుగా పండుగ శుభాకాంక్షల సందేశాలు పంపే అలవాటు లేదు కానీ, అందుకున్న ప్రతి సందేశానికీ కచ్చితంగా జవాబు పంపేవాడిని నిన్న మొన్నటివరకూ. ఇప్పుడిప్పుడు అదికూడా సాధ్యపడడం లేదు, అందుకునే సందేశాల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగింది మరి.

దసరా పండుగ నెల్లాళ్ళు ఉందనగా ఓసారి రెగ్యులర్ విజిట్లలో భాగంగా వాళ్ళ పార్లర్ కి వెళ్ళినప్పుడు ఓ పుస్తకం నా ముందు పెట్టి ముసిముసిగా నవ్వుతూ 'పండగ మామూలు సార్' అన్నాడు నా బ్యూటీషియన్. పూర్వాశ్రమంలో ఇతగాడి వృత్తినామం క్షురకుడు అని ఉండేది. నాకు తోచిన అంకె వేసి తిరిగి ఇవ్వబోతుండగా, "పేరూ, ఫోన్ నెంబరూ కూడా రాయండి సార్" అన్నాడు చనువుగా. నా తల మీద కత్తెర పెట్టిన మరుక్షణం చిరంజీవి గురించీ, ప్రజారాజ్యం గురించీ వేడి వేడి చర్చ మొదలు పెట్టడం అతగాడి అలవాటు. చెసేదేముందీ, రాసిచ్చాను. ఈ టపా రాయడానికి కొద్ది క్షణాల ముందు నా ఫోన్ బీప్ మంది. పండుగ శుభాకాంక్షలు, అతగాడి నుంచి!!

మిత్రులందరికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు...

సోమవారం, అక్టోబర్ 24, 2011

తిరస్కృతులు

వాళ్ళంతా ఎదుటి వ్యక్తిని నిష్కల్మషంగా ప్రేమించగలరు. మనస్పూర్తిగా నమ్మగలరు. కానీ, అవతలి వ్యక్తినుంచి తిరిగి పొందేవి మాత్రం అవమానాలు, అవహేళనలు. వాళ్ళందరూ తిరస్కృతులు. నికోలాయ్, అతడి భార్య అన్నా, వాళ్ళ ఏకైక కుమార్తె నతాష, ముసలి స్మిత్ కూతురు, మనవరాలు నీలీ... వీళ్ళందరూ కూడా ప్రేమనీ, నమ్మకాన్నీ ఇచ్చి తిరస్కరింపబడ్డ వాళ్ళే. వీళ్ళందరి కథే 'తిరస్కృతులు' నవల. ప్రముఖ రష్యన్ రచయిత దస్తయేవస్కీ రాసిన 'The Insulted and Injured' కి తర్వాతికాలంలో 'సహవాసి' గా అనువాద రంగంలో గొప్పపేరు తెచ్చుకున్న జంపాల ఉమామహేశ్వర రావు తెలుగు సేత.

కథలో ప్రధాన పాత్ర వాన్య. అప్పుడే రచయితగా పేరు తెచ్చుకుంటున్న వాడు. చిన్నప్పుడే అనాధగా మారిన వాన్య ని పొరుగింటి పెద్దమనిషి నికోలాయ్ తన కూతురు నతాష తో పాటుగా పెంచి పెద్ద చేశాడు. వాన్యకి నతాష అంటే పిచ్చి ఇష్టం. కానీ నతాష అయోషాని ప్రేమించింది. ప్రిన్స్ వాల్కొవిస్కీ ఏకైక కుమారుడు ఆయోషా. ఎందరినో మోసం చేసి ప్రిన్స్ స్థాయికి ఎదిగిన వాల్కొవిస్కీ తెలివితేటలు ఏమాత్రమూ రాలేదు అయోషాకి. అతను అమాయకుడు, నిష్కల్మష హృదయుడు. తండ్రిమీద విపరీతమైన ప్రేమ ఉన్నవాడు.

తను డబ్బు సంపాదించుకునే క్రమంలో నికోలాయ్ తో స్నేహం చేశాడు ప్రిన్స్. తన ఎస్టేట్ వ్యవహారాలూ నికోలాయ్ కి అప్పగించాడు. ఎంతో నిజాయితీగా పని చేసిన నికోలాయ్ ఎస్టేట్ వృద్ధి చెందడానికి అహరహం శ్రమించాడు. నికోలాయ్ వ్యక్తిత్వం పట్ల ఎంతగానో ఆకర్షితుడైన ప్రిన్స్, అయోషాని కొంత కాలంపాటు అతని ఇంట్లో ఉంచాలని నిర్ణయించుకుంటాడు. ఆ రకంగానైనా ఆయోషాకి లోకజ్ఞానం అబ్బుతుందన్నది ప్రిన్స్ ఆశ. ప్రిన్స్ ప్రతిపాదనని సంతోషంగా ఆహ్వానిస్తాడు నికోలాయ్. ఫలితంగా, యవ్వనంలో అడుగుపెట్టిన ఆయోషా నికోలాయ్ ఇల్లు చేరతాడు.

ఆయోషా నతాష తో ప్రేమలో పడడం ప్రిన్స్ పాలిట పిడుగుపాటే అవుతుంది. అంతస్తుల భేదాన్ని కలలో కూడా మర్చిపోలేని ప్రిన్స్ నికోలాయ్ మీద నిప్పులు చెరుగుతాడు. ఎస్టేట్ మీది ఆశతో అమాయకుడైన తన కొడుకు మీదకి కూతుర్ని ఉసిగొలిపాడని అనరాని మాటలు అంటాడు. మాటల యుద్ధం చేతల్లోకి మారుతుంది. ఎస్టేట్ సొమ్ము కాజేశాడనే అభియోగం మోపి నికోలాయ్ ని కోర్టుకి ఈడుస్తాడు ప్రిన్స్. మరోపక్క ఒకరిని విడిచి మరొకరు ఉండలేని ఆయోష-నతాష ఇల్లు విడిచి వెళ్ళిపోతారు. కూతురు చేసిన పని మరింత కుంగదీస్తుంది నికోలాయ్ ని.

జీవిక కోసం ఇల్లు విడిచిన వాన్య రచయితగా స్థిరపడతాడు. ఇల్లు వెతుక్కునే క్రమంలో అతనికి వృద్ధుడైన స్మిత్, అతని టీనేజ్ మనవరాలు నీలీ తారసపడతారు. స్మిత్ మరణించడంతో ఏకాకిగా మారిన నీలీకి ఆశ్రయం ఇస్తాడు వాన్య. నీలీది ఓ విషాద గాధ. ఆమె తల్లి తన యవ్వనంలో ఓ యువకుడిని నమ్మి తన సంపదనంతా అతని చేతిలో పెడుతుంది. నీలీ భూమిమీద పడ్డాక అతడు మోసగాడని తెలుస్తుంది. అతన్నుంచి విడిపోయి దుర్భర దారిద్ర్యం అనుభవించిన ఆ వనిత, తన తండ్రి తనని క్షమించడం కోసం జీవితమంతా ఎదురు చూస్తుంది. క్షమాపణ పొందకుండానే మరణిస్తుంది. వాన్య ఇంటికి చేరిన నీలీ తీవ్రమైన అనారోగ్యం బారిన పడుతుంది.

కోర్టు కేసుల నిమిత్తం తన బసని పట్నానికి మారుస్తాడు నికోలాయ్. నతాష ఆచూకి తెలిసినా ఆమెతో మాట్లాడడానికి ఇష్టపడడు. మరోవంక ప్రిన్స్ కొడుకుని చేరదీయడంతో పాటుగా, నతాషని తన కోడలిగా చేసుకుంటానని ఆమెకి మాట ఇస్తాడు. మరోవంక డబ్బున్న అమ్మాయి కాత్య తో అయోషకి పెళ్ళి నిశ్చయం చేస్తాడు. తనకంటూ ఓ వ్యక్తిత్వం లేని ఆయోష నతాషతో ప్రేమగా ఉంటూనే, పెళ్ళి చేసుకుంటానని చెబుతూనే కాత్యతో ప్రేమలో పడతాడు. కొడుకు మనస్తత్వం తెలిసిన ప్రిన్స్ ఇందుకు పరోక్షంగా రంగం సిద్ధం చేస్తాడు. ప్రిన్స్ పధకం ఫలించిందా? నికోలాయ్ కేసు ఏమయ్యింది? నతాష ని అతడు క్షమించగలిగాడా? నీలీ జన్మ రహస్యం ఏమిటి? ఇత్యాది ప్రశ్నలకి జవాబిస్తూ నవల ముగుస్తుంది.

నవల ముగించి పక్కన పెట్టినా, ప్రధాన పాత్రలూ, వాటి వ్యక్తిత్వాలూ మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. కథ చెప్పే వాన్య స్పటికంలాగా స్వచ్చంగా అనిపిస్తాడు. స్వీయ ప్రేమకథతో సహా ఎవరి కథ చెప్పేటప్పుడూ కూడా ఎలాంటి ఉద్వేగానికీ లోనవ్వకుండా, ఏ వ్యాఖ్యలూ చేయకుండా ఉన్నది ఉన్నట్టు చెబుతాడతడు. నతాషా, నీలీ ఇద్దరూ కూడా బలమైన వ్యక్తిత్వం ఉన్న అమ్మాయిలే. ఆయోషా ప్రేమకోసం నతాషా చివరికంటా నిలబడితే, తల్లి జీవితం, బాల్యంలోనే ఎదురైన అనుభవాల కారణంగా వయసుకి మించిన పరిణతి చూపిస్తుంది నీలీ. కూతుర్ని విపరీతంగా ప్రేమించే, ఆత్మాభిమానం విషయంలో రాజీ పడలేని నికోలాయ్-అన్నా దంపతులనీ మర్చిపోలేం.

"జంపాల ఉమామహేశ్వర రావు ఇంకా సహవాసిగా మారక ముందు వెలుగు చూసిన గ్రంధం ఇది. ....ఆయన చేపట్టిన తొలి అనువాదం ఇది. అయన మాటల్లో 'విశ్వమంతా విశాల హృదయంతో విశ్వ విఖ్యాతుడైన దస్తయేవస్కీచే చిత్రింపబడి విశ్వమానవ హృదయాలలో ఉన్నత స్థానాన్ని అందుకొంది, ఈ తిరస్కృతులు. మన తెలుగు పాఠకులకి ఇది సుమారు యాభయి ఏళ్ళ క్రితం దర్శనమిచ్చింది. మళ్ళీ ఇంత కాలానికి ఇప్పుడు మీ ముందుంది. స్వీకరించండి," అన్నారు ప్రకాశకులు పీకాక్ క్లాసిక్స్ వారు, మూడేళ్ళ క్రితం విడుదల చేసిన ప్రింట్ చివరిమాటలో. 'ఏడుతరాలు' లాంటి ఎన్నో విదేశీ నవలల్ని తెలుగు వారికి పరిచయం చేసిన జంపాల అనువాద సరళిని గురించి కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. అత్యంత సరళంగా ఉంది. (పేజీలు 204, వెల రూ.75, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

బుధవారం, అక్టోబర్ 12, 2011

అమ్మకి కోపం వస్తే..

ఇంట్లో అందరికీ మనమీద కోపం రావడం ఒక ఎత్తైతే, అమ్మకి కోపం రావడం మరో ఎత్తు. ఇంకెవరి కోపాన్నీ పెద్దగా పట్టించుకోక పోయినా పర్లేదు కానీ, అమ్మతో అలా కుదరదు. బోయినం మాట అటుంచి, మంచి నీళ్ళు కూడా సరిగా ముట్టవు. నాన్నకి కోపం వస్తే నాలుగు దెబ్బలు వేస్తారు. ఆ వెంటనే కోపం మర్చిపోతారు. కానీ అమ్మ అలా కాదు, ఏమీ అనదు కానీ అస్సలు మాటాడదు. మనం వెనక వెనకే తిరిగినా సరే అస్సలు మన వంక చూడనన్నా చూడదు.

అసలు అమ్మకి కోపం ఎందుకు వస్తుంది? మనం ఏదో ఒక పిచ్చి పని చేస్తేనే కదా?? 'వెర్రిదీ అమ్మేరా... పిచ్చిదాని కోపంరా..' అన్నాడు కదా ఓ సినిమా కవి. మనం తెలిసో తెలియకో చేసే పిచ్చి పనులు అమ్మకి మన మీద పిచ్చి కోపం రప్పిస్తాయన్న మాట. నాలుగు కొట్టాలనిపించినా గబుక్కున చేతులు రావు కదా, అందుకని ఏవీ అనకుండా ఊరుకుంటుంది. నాన్న మనల్ని కొట్టినా, మనం తనని చూడడం లేదనుకుని కళ్ళనీళ్ళు కక్కుకుని, అంతలోనే చెంగుతో తుడిచేసుకుంటుంది.

ఓసారేవయ్యిందంటే, అమ్మతో పాటూ శ్రావణమాసం పేరంటానికి వెళ్లాను. ఆ పేరంటానికి రాజ్యంగారమ్మాయి కొత్త చీర కట్టుకుని వచ్చింది. అందరూ ఆ చీరని ఒకటే మెచ్చుకోవడం. ఇంతలో నేను చేసిన ఓ పొరపాటు వల్ల ఆ చీరమీద మరక పడింది. చిన్న మరకే అయిన కొత్త చీర కదా, పైగా ఆ అమ్మాయి మొదటిసారి చీర కట్టుకుంది కూడాను, పేరంటానికి వచ్చిన అందరూ 'అయ్యో పాపం' అనడవే. ఏం చెయ్యాలో తెలీక నేను ఇంటికెళ్ళిపోయాను. తర్వాత కాసేపటికి అమ్మొచ్చింది. ఏవీ మాటాడలేదు.. ఒకటీ రెండూ కాదు ఏకంగా మూడు రోజులు.

అది మొదలు అమ్మకి చాలా సార్లే కోపం వచ్చింది నా మీద. ఎక్కువగా అల్లరి చేసినప్పుడూ, ఆటల్లో దెబ్బలు తిని వచ్చినప్పుడూ, బళ్ళో మేష్టారు నామీద కోప్పడ్డప్పుడూ, బామ్మ గట్టిగా గసిరినప్పుడూ, పరీక్షల్లో మంచి మార్కులు రానప్పుడూ ఇలా.. ఒక్కోసారి అమ్మకి నామీద ఎందుకు కోపం వచ్చిందో కూడా తెలిసేది కాదు. కోపం వచ్చినదని మాత్రం తన ముఖం చూడగానే తెలిసిపోయేది.. కారణం తర్వాతెప్పుడో తెలిసేది. నేను అల్లరేక్కువ చేస్తున్నానో, ఇంకోటనో ఎవరన్నా అమ్మకి చెప్పినా అమ్మకి నామీదే కోపం వచ్చేసేది మరి.

నేను బడి నుంచి ఇంటికి వచ్చేసరికి ఎప్పటిలాగా నవ్వుతూ ఎదుర్రాకుండా ముఖం గంటు పెట్టుకుని తన పన్లు తను చేసుకుంటోందంటే అమ్మకి నామీద కోపం వచ్చేసినట్టే. ఇంక నేనెంత వెంటబడి మాటాడినా విననట్టు నటిస్తుంది. నాకేవీ పనులు చెప్పదు. నేను చెయ్యబోయినా చెయ్యనివ్వదు. మొదట్లో అమ్మకి కోపం వస్తే నాకు భయం, బాధా వచ్చేసేవి కానీ, రాన్రాను అమ్మ కోపం పోగెట్టే ఉపాయం తెలిసిపోయింది. ఏవీలేదు, అమ్మకి కోపం రాగానే అన్నం ఎప్పుడూ తినేంత కాకుండా కొంచమే తినడం.

మొత్తం మానేస్తే నాన్న తంతారు కానీ, ఆకల్లేదు అని కొంచం తిని ఊరుకుంటే ఏవీ అనలేరు కదా. ఈ ఉపాయం మాత్రం బ్రహ్మాండంగా పనిచేసింది. ఓ పూటో రోజో చూసి అమ్మ వెంటనే మాటాడేసేది. తర్వాతేవో మంచి మాటలు చెప్పేది. నేను బుద్ధిగా వినేవాడిని. మళ్ళీ కథ మామూలే. అమ్మ కోపం కబుర్లు ఇలా ఉంటే, మన బ్లాగు లోకపు అమ్మ గూగులమ్మకి నా మీద కోపం వచ్చిందివాళ. ఉదయానే నన్ను మెయిల్లోకి వెళ్ళనివ్వకుండా అడ్డగించి ఏదో ప్రశ్న అడిగింది, నా మూడ్ బాగోక ఓ తిక్క జవాబు చెప్పాను. అంతే.. దారి మూసేసింది.

చేసేది ఏముంది? ఇంతకాలం nemalikannu@gmail.com గా ఉన్న నా చిరునామా nemalikannumurali@gmail.com గా మారింది. ఎంతైనా అమ్మ అమ్మే.. గూగులమ్మ అమ్మ అవుతుందా? మనం అలిగినా పట్టించుకుంటుందా??

సోమవారం, అక్టోబర్ 10, 2011

లైబ్రరీలో ఓ సాయంత్రం...

మొన్నొక రోజు దగ్గరలోనే ఉన్న ఒక లైబ్రరీకి వెళ్లాను. చాలా రోజులుగా బయటినుంచి చూస్తున్నా ఎప్పుడూ లోపలికి వెళ్ళలేదు. మిగిలినవన్నీ ఎలా ఉన్నా లైబ్రరీకి వెళ్ళే అలవాటు తప్పిపోయి చాలా రోజులు అవ్వడం ఇందుకు ఒక ముఖ్యమైన కారణం అయి ఉండొచ్చు. ఒక ఆధ్యాత్మిక సంస్థ, ప్రభుత్వ సాయంతో నిర్వహిస్తున్న ఈ లైబ్రరీలో కేవలం ఆధ్యాత్మిక పుస్తకాలు మాత్రమే కాక అన్నిరకాల పుస్తకాలూ ఉండడం నన్ను ఆశ్చర్య పరిచింది.

పోటీ పరీక్షలకి ప్రిపేరవుతున్న పిల్లలంతా మహ సీరియస్సుగా పుస్తకాలు తిరగేస్తూ నోట్సులు రాసేసుకుంటున్నారు. పేపర్లు చదవడానికి వచ్చిన సీనియర్ సిటిజన్లు అక్కడక్కడా కనిపించారు. విశాలమైన ఆవరణ, దానికి తగ్గట్టు చక్కని నిర్వహణ. ర్యాకులు చూడగానే అసలు ఏమేం పుస్తకాలు ఉన్నాయా అన్న ఆసక్తి మొదలయ్యింది. యండమూరి నవలల మొదలు ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం వరకూ చాలా రకాల పుస్తకాలే కనిపించాయి.

ఇది పని కాదనిపించి, కేటలాగు చదవడం మొదలు పెట్టాను. ఎంత ఆశ్చర్యం కలిగిందంటే, చాలా రోజులుగా ప్రింట్లో లేని ఎన్నో పుస్తకాలు ఆ లైబ్రరీలో ఉన్నాయి. ప్రతి పుస్తకానికీ ఓ కోడ్ నెంబర్ ఇచ్చారు. ఓ రెండు పేజీలు తిరగెయ్యగానే చిన్న ఆలోచన వచ్చి, నేను చదవాలనుకునే పుస్తకాల కోడ్ నెంబర్లు నోట్ చేయడం మొదలు పెట్టాను. ఆ పని చేస్తున్నంత సేపూ మా ఊరి రచ్చబండ దగ్గర సామూహిక పత్రికా పఠనం మొదలు, పక్కూళ్ళో ఉన్న ప్రభుత్వ గ్రంధాలయంలో గంటలకి గంటలు గడపడం వరకూ ఎన్నో సంగతులు గుర్తొచ్చాయి.

మా రచ్చబండ ప్రత్యేకత ఏమిటంటే, అక్కడ ఎవరూ పేపర్ చదవక్కరలేదు. వింటే చాలు, రేడియో వార్తలు విన్నట్టుగా. అప్పట్లో మా ఊళ్ళో తమని తాము ఆకాశవాణి వార్తా చదువర్లుగా భావించుకున్న వారికి లోటు లేని కారణాన, మొదటగా పేపర్ దక్కించుకున్న వాళ్ళు మిగిలిన వాళ్లకి చదివే అవకాశం ఇవ్వకుండా గడగడా చదివేసేవాళ్ళు. మా బడి ఉన్నది ఆ పక్కనే అవ్వడం వల్ల వద్దన్నా సరే, పేపరు వార్తలూ ఆ తర్వాత జరిగే విశ్లేషణలూ చెవిన పడుతూనే ఉండేది.

ప్రభుత్వం గ్రంధాలయాలని నిర్వహిస్తుందనీ, అక్కడ అన్నిరకాల పత్రిలతో పాటు నవలలూ ఉచితంగా చదువుకోవచ్చనీ కాలేజీకి వచ్చేంత వరకూ నాకు తెలీదు. హైస్కూల్లో పరిచయమైన అద్దె నవలల లైబ్రరీ ఓ విషాద జ్ఞాపకం. ఇది రాస్తూ కూడా వీపు తడుముకున్నానంటే ఇంక చెప్పడానికి ఏముంటుంది? అదృష్టవశాత్తూ ప్రభుత్వ గ్రంధాలయం లైబ్రేరియన్ తో నాకు స్నేహం కుదిరింది. వార, మాస పత్రికల్ని మడత నలగకుండా తాజాగా చదవగలిగే వీలు కుదిరింది. కోడూరి కౌసల్యా దేవి 'చక్రభ్రమణం' లాంటి నవలల్ని చదివింది అక్కడే.

తర్వాతి కాలంలో లైబ్రరీలకి వెళ్లిందీ, సమయం గడిపిందీ బహుతక్కువ. కావాల్సిన పుస్తకాలు కొనుక్కోవడం, చదువుకోవడమే తప్ప లైబ్రరీల మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. లెండింగ్ లైబ్రరీలు కను మరుగైపోవడం తెలుసు.. ప్రభుత్వ లైబ్రరీల గురించి అప్పుడప్పుడూ పేపర్లలో 'నిధుల కొరతతో సతమతం' లాంటి వార్తలు చదవడమే తప్ప ఎలా ఉన్నాయో చూద్దాం అనిపించలేదు. ఇదిగో ఇప్పుడు, ఒక లైబ్రరీని కనుగొన్నాను. నేను తదేక దీక్షతో కేటలాగుని చదువుతూ ఉండగానే లైబ్రేరియన్ వచ్చారు.

తగుమాత్రంగా నన్ను నేను పరిచయం చేసుకుని, లైబ్రరీ వివరాలు అడిగాను. ప్రవేశం, పుస్తకాలూ ఉచితమే. కానైతే ఆవరణ దాటి బయటికి ఇవ్వరు. అక్కడే కూర్చుని చదువుకుని, వాళ్ళ పుస్తకాన్ని వాళ్లకి జాగ్రత్తగా అప్పగించేసి రావాలి. అంతా బాగానే ఉంది కానీ, వాళ్ళ టైమింగ్సూ, నా వేళలూ బొత్తిగా రైలు పట్టాల్లా ఉన్నాయి. ఏదో ఒకటి చేసి ఈ పట్టాల మీద బండి నడపాలని మాత్రం గట్టిగా అనేసుకున్నాను. చూడాలి, మనసుంటే మార్గం అదే దొరుకుతుంది అంటారు కదా..

శుక్రవారం, అక్టోబర్ 07, 2011

రోటి పచ్చడి

మధ్యాహ్నం బడిలోనుంచి ఇంటికి వచ్చేసరికి అమ్మ డబ్బాలో అప్పచ్చులు చిన్న పళ్ళెంలో పెట్టి సిద్ధంగా ఉంచుతుంది కదా. కాళ్ళూ, చేతులూ, ముఖం కడిగేసుకుని, తల దువ్వించేసుకుని, ఆ అప్పచ్చుల పని పట్టగానే ఓ గ్లాసుడు పాలిచ్చేస్తుంది. అవి తాగేసి, బళ్ళో చెప్పిన పాఠాలు కాసేపు చదివేసుకుని, పలక మీద రాయాల్సిన పాఠం ఏవన్నా ఉంటే రాసేసి ఆ పలకని జాగ్రత్తగా ఓమూల పెట్టేస్తే చదువైపోయినట్టే. ఇంక ఆటలకి వెళ్లిపోవచ్చు.

రామాలయం దగ్గరో, కాంగ్రెస్ అరుగు దగ్గరో అప్పటికే ఫ్రెండ్సులంతా వచ్చేసి ఉంటారు కదా.. పంటలేసుకునే లోగా వెళ్ళామంటే సరే. లేకపొతే వాళ్ళ ఆట చూస్తూ కూర్చోవాలి. ఎలాగూ మళ్ళీ నాన్న ఇంటికి వచ్చేలోగానే తిరిగి వచ్చెయ్యాలి కాబట్టి ఎక్కువసేపు ఆడుకోడానికి ఉండదు. గూటీబిళ్లో, ఏడు పెంకులాటో అయితే కనీసం ఒక్క ఆటా అవ్వదు. గుడి మీద మైకులో పాట వినిపించిందంటే ఇంక ఇంటికి వెళ్ళాల్సిందే. అప్పటికి అమ్మ పెరట్లో రోటిదగ్గర ఉంటుంది.

మందార చెట్టుకింద ఉండే ఆ రోలు ఎంత పెద్దదంటే, కడగాలంటేనే ఓ బిందెడు నీళ్ళు పడతాయి. ఆ రోట్లో ముందర పిండి రుబ్బేసుకుని, సుబ్బరంగా కడిగేసి, తుడిచేసి అప్పుడు మొదలు పెడుతుంది అమ్మ పచ్చడి రుబ్బడం. ఎక్కువగా కొబ్బరి పచ్చడి.. తప్పితే కంది పచ్చడో, పెసర పచ్చడో.. ఇంకా ఒక్కోసారి వెలక్కాయ పచ్చడి, వంకాయ రోటి పచ్చడి లాంటివి కూడా చేస్తుందనుకో. కానీ ఒక్క కొబ్బరి పచ్చడినే ఒక్కోరోజు ఒక్కోలా చెయ్యగలదు, రోజూ తిన్నా విసుగు రాకుండా.

రోలుకి ఎదురుకుండా పీటేసుకుని కూర్చున్నామంటే అమ్మ పచ్చడి చెయ్యడం చూడొచ్చు. ఎందుకూ చూడడం? అంటే చూడ్డానికి బాగుంటుంది కాబట్టి. తుడిచిన రోట్లో, ఇంట్లోనుంచి తెచ్చుకున్న వేడి వేడి పోపు దింపి రోకలి బండతో కొంచం దంపి అందులో కొబ్బరి కోరు వేస్తుందా, ఇంకో రెండు దంపులు దంపగానే రుబ్బురోలు పొత్రం జాగ్రత్తగా రోట్లోకి దించుతుంది. మనమేమో రోలు మీద చేతులు వెయ్యకుండా చూడాలన్న మాట. వేస్తే ఇంకేమన్నా ఉందీ, పొత్రం కింద వేళ్ళు కానీ పడ్డాయంటే ఇంక పలక మీద ఏమీ రాయలేం.

ఓ చేత్తో పొత్రం తిప్పుతూ, రెండో చేత్తో పచ్చడి రోట్లోకి తోస్తో భలేగా రుబ్బేస్తుంది అమ్మ. పచ్చడి అన్నంలోకి అయితే ఒకలాగా, ఇడ్డెన్ల లోకి ఇంకోలాగా రుబ్బుతుందా..అదే ఏ గారెల్లోకో అయితే పచ్చడి వేరేగా ఉంటుంది. అసలు అమ్మ రుబ్బే పచ్చడి చూసి అది ఎందులోకో చెప్పేయొచ్చు. శనివారం సాయంత్రం అల్లప్పచ్చడి కానీ రుబ్బుతోందంటే ఆవేళ రాత్రికి ఉప్మా పెసరట్టని అర్ధం. పెసర పచ్చడి బోల్డు బోల్డు రుబ్బుతోందంటే పుణుకులేసి, పులుసెడుతుందని తెలిసిపోయేది. వంకాయ పచ్చడి రాచ్చిప్పలోకి తీస్తోందంటే ఉప్పుడుపిండి తినబోతున్నామని ఇంకెవరూ వేరే చెప్పక్కర్లా.

రోట్లో పిండి రుబ్బుతోన్నా, పచ్చడి రుబ్బుతోన్నా పొత్రం భలేగా ఇబ్బంది పెట్టేస్తుంది. ఉన్నట్టుండి కర్ర బురుజు ఊడిపోతుందా.. దాంతో రుబ్బడం ఒక్కసారిగా ఆగిపోతుంది. ఒక్కోసారి ఆ విసురుకి అమ్మ చెయ్యి రోటికి తగిలి ఒహటో రెండో గాజులు చెల్లిపోతాయి కూడాను. బురుజు ఊడిపోయినప్పుడు అమ్మకి మనం బోల్డంత సాయం చెయ్యొచ్చు. పొత్రం పైకి తీసి ఓ చేత్తో పట్టుకుని, రెండో చేత్తో బురుజు అమరుస్తుందా, మనమేమో రోకలి బండ తీసుకుని ఆ బురుజు మీద చిన్న చిన్న దెబ్బలు జాగ్రత్తగా వేశామంటే అదికాస్తా అమిరిపోతుంది. మనం ఏమరుపాటుగా గానీ ఉన్నామంటే మాత్రం ముందు అమ్మ చేతికి దెబ్బ తగులుతుంది, ఆ తర్వాత మన వీప్పగులుతుంది.

పచ్చడి రుబ్బడం అవుతోందనగా, వంటింట్లోకి పరిగెత్తుకెళ్ళి ఉప్పు రాచ్చిప్పలోనుంచి ఓ గుప్పెడు ఉప్పు గానీ పట్టుకొచ్చామంటే అమ్మ ఎంత సంతోషిస్తుందో చెప్పలేను. ఆ ఉప్పుని రోలు మీద వేసి, అమ్మ పచ్చట్లోకి కావాల్సింది తీసుకున్నాక ఎక్కువ మిగిలితే మళ్ళీ రాచ్చిప్పలో వేసేయడం.. కాసిన్ని రాళ్ళే అయితే నోట్లో వేసేసుకోవడం. అదికూడా అమ్మకి పచ్చడి రుచి ఎలా ఉందో చెప్పాకే. రుచి కోసం పచ్చడి అరచేతిలో వేయించుకోకూడదు. గుప్పిడు బిగించి చేయి చాపితే మణికట్టుకీ వేళ్లకీ మధ్యలో కొంచం పచ్చడి వేస్తుంది అమ్మ. దాన్ని నాలుకతో అందుకుని ఒక్కసారి కళ్ళు మూసుకున్నామంటే రుచి చెప్పేయొచ్చు.

పచ్చడి రుబ్బేటప్పుడు ఊరికే పోచికోలు కబుర్లు కాకుండా (అంటే ఏవిటో తెలీదు.. అమ్మ అలాగే అనేది) రోజూ పద్యాలు నేర్పేది అమ్మ. 'కూజింతం రామ రామేతి...' తో మొదలు పెడితే ఎన్నెన్ని పద్యాలో. విడి పద్యాలు అవ్వగానే అష్టకాలు అందుకుంది. 'వసుదేవ సుతందేవం...' తో మొదలు పెట్టి కృష్ణాష్టకం ఓ వారం రోజులు, అదయ్యాక 'గంగాతరంగ రమణీయ జటా కలాపం...' అంటూ విశ్వనాథాష్టకం మరో వారం.. ఇలా సాగేది చదువు. పచ్చడి రుబ్బుతున్నంత సేపూ ముందటి పద్యం అప్పగించడం, కొత్త పద్యం నేర్చుకోవడం.. ఇదంతా కూడా రుబ్బడాన్ని రెప్ప వెయ్యకుండా చూస్తూనే.

చూస్తుండగానే అన్నిచోట్లా వచ్చి పడిపోయిన మార్పు వంటగదిలోకీ చొచ్చుకుని వచ్చేసింది. అమ్మ స్థానంలో ఆలి ప్రవేశించింది. రోటి గలగలల స్థానాన్ని మిక్సీ గురుగుర్రులు ఆక్రమించేశాయి. నాలుగు ఆవాలు పొడి కొట్టాలన్నా, రెండు మిరపకాయలు నలపాలన్నా కూడా మిక్సీనే శరణ్యం ఇప్పుడు. "ఏవి తల్లీ నిరుడు రుబ్బిన రోటి పచ్చళ్ళు.." అని మూగగా పాడుకుంటూ కాలం గడుపుతుండగా, ఊహించని విధంగా మూలపడ్డ రోటికి పూర్వ వైభవం వచ్చేసింది. కరెంటు కోత పుణ్యమాని మిక్సీ మూగబోవడంతో అన్నపూర్ణ లాంటి రుబ్బురోలు రుచికరమైన పచ్చళ్ళని అందిస్తోందిప్పుడు. 'మరక మంచిదే' అని ఊరికే అన్నారా డిటర్జంట్ కంపెనీ వాళ్ళు?

సోమవారం, సెప్టెంబర్ 26, 2011

సమయ పాలన

మనమెంత 'సమయమా...చలించకే...' అని పాడుకున్నా, కాలం దాని పని అది చేసుకుపోతూ ఉంటుంది. మనమంత కచ్చితంగా మన పనులు చేసుకోలేం కాబట్టి టైం సరిపోవడం లేదు అని తప్పించేసుకుంటూ ఉంటాం. గడియారానికున్న కచ్చితత్వం మనకి లేదన్నది ఎంత నిజమో, ఒక యంత్రం పనిచేసినంత కచ్చితంగా మనుషులెవరూ పని చేయలేరన్నది కూడా అంతే నిజం. అలా చేసేస్తే ఇంక మనిషికీ, యంత్రానికీ తేడా ఏం ఉంటుంది కనుక?

మనం ఎక్కాల్సిన బస్సులూ, రైళ్ళూ మొదలు, చూడాల్సిన సినిమాల వరకూ ఏవీ కూడా టైముని పాటించవు. రైళ్ళ విషయంలో 'జీవితకాలం లేటు' లాంటి జాతీయాలే పుట్టేశాయి. మరీ హౌస్ ఫుల్లుగా నడుస్తున్న కొత్త సినిమాలు మినహాయిస్తే, మిగిలిన సినిమాలు కచ్చితంగా షెడ్యూలు సమయానికి మొదలవ్వడం తక్కువ. ఓ ఐదునిమిషాలు ఆగితే మరో పది మందన్నా వస్తారేమో అన్న ఆశ థియేటర్ వాళ్ళని అలా ఆలస్యంగా నడిపిస్తుంది.

చాలా ఆఫీసుల్లో జరగాల్సిన పని, జరగాల్సిన సమయానికి పూర్తిపోవడం అన్నది అత్యంత అరుదైన వ్యవహారం. కారణాలు ఏవిటా అని ఆలోచిస్తే, ఆసమయంలో పూర్తికావడం అసంభవం అనిపించే విధంగా డెడ్ లైను ఉండడం, పనిని పూర్తి చేయాల్సిన బృందంలోని మెజారిటీ సభ్యులకి సమయపాలన లేకపోవడం, 'ఈ పని పూర్తి చేసేస్తే ఇంతకన్నా ఎక్కువ పని వచ్చిపడుతుంది' తరహా ఆలోచనా ధోరణి, చివరిక్షణం వరకూ తాత్సారం చేసి అప్పుడు ఎవరో ఒకరి మీద పడేయెచ్చునన్న ఎస్కేపిస్టు విధానం.. ఇలా అనేకం కనిపిస్తాయి.

కలవాల్సిన వ్యక్తులని చెప్పిన సమయానికి కచ్చితంగా కలవడం అన్నది దాదాపు అసంభవం. బస్సులు, రైళ్ళ ఆలస్యం మొదలు ట్రాఫిక్ జాముల వరకూ ఎన్ని కారణాలన్నా చెప్పుకోవచ్చు. వీటితో పాటు సరిగ్గా సమయానికి వెళ్ళాలన్న సీరియస్ నెస్ లోపించడమూ ఓ ముఖ్య కారణమే. ఎంసెట్ లాంటి పరీక్షలకి 'ఒక్క నిమిషం' నిబంధన విజయవంతంగా అమలు చేస్తున్న తర్వాత కూడా ఆలస్యంగా పరిక్షకి వచ్చి వెనక్కి వెళ్ళే విద్యార్ధులు దీనిని రుజువు చేస్తూ ఉంటారు. పరీక్ష హాల్లో ఉన్న వందల మంది సమయానికే వచ్చినప్పుడు, ఈకొందరు ఎందుకు రాలేకపోయారు? అనిపించక మానదు.


చాన్నాళ్ళ క్రితం ఓ నట వారసుడిని భారీగా లాంచ్ చేశారు. టీవీ చానళ్ళు అతగాడితో ఇంటర్వ్యూలు గుప్పించాయి. "మీ తాతగారు మీకు ఏం చెప్పేవారు?" ఒకానొక టీవీ ఛానల్ వారి ప్రశ్న. తాతగారు పరమపదించే నాటికి మనవడుగారింకా బాలుడు. "తాతియ్యెప్పుడూ టయానికి తినాలి.. టయానికి పడుకోవాలి... అని చెప్పేవారు" నుదురు మీద పడని జుట్టుని వెనక్కి తోసుకుంటూ కుర్రహీరో గారి జవాబు. "ఓహో.. టైం మేనేజ్మెంట్ గురించి చెప్పేవారన్న మాట," అచ్చ తెలుగు అంతగా రాని యాంకరిణి ఇంగ్లిష్ లో సర్దుబాటు చేసేసింది.

ఆమధ్య చదివిన ఓ కథలో కొడుకు ఓ మల్టి నేషనల్ కంపెనీలో పై స్థాయి ఉద్యోగి. ఉద్యోగానికి వేళా పాళా ఉండదు. "రోజూ అంతంత సేపు ఎందుకు పని చేయాలి? నిర్దిష్టమైన పని గంటలు మాత్రమే పని చేస్తానని కచ్చితంగా చెప్పెయ్. అందుకు ఎంత జీతం ఇస్తే, అంతే తీసుకో" అంటుంది అతగాడి తల్లి. కొడుకు నిర్ణయం మాట ఎలా ఉన్నా, సమయ పాలన ఎందుకు జరగడం లేదన్న దానికి ఇదో ఉదాహరణ. ఆఫీసు ప్రారంభించే సమయమే తప్ప, ముగించడానికి నిర్దిష్టమైన వేళ ఉండకపోవడం వల్ల కూడా పనుల్లో జాప్యం పెరుగుతోందనుకోవాలి.

అసలు మనం టైం సరిపోవడం లేదు అని ఎందుకు అనుకుంటాం? నాకైతే ఒకటి అనిపిస్తుంది. ఏదన్నా తప్పు చేసినా ఒప్పుకోక పోవడం, దాన్ని మరొకరి మీదకి తోసేయాలని ప్రయత్నించడం మానవ నైజం. ఎవరూ కూడా అతీతులు కాదు కదా. అలా మనం మనకి చేయాలని ఉన్న పనులని చేయలేక పోతున్నప్పుడు, అందుకు ఎవరో ఒకరిని బాధ్యులని చేసేయాలి కాబట్టి నోరూ వాయీ లేని కాలం మీదకి ఆ తప్పుని తోసేసి తప్పుకుంటున్నామేమో కదూ..

బుధవారం, సెప్టెంబర్ 21, 2011

ఒక్క రూపాయ్...

పావలా పరమపదించింది. అర్ధ రూపాయి పరిస్థితి కూడా ఇవాళో, రేపో అన్నట్టుగా ఉంది. మన జేబుల్లో చెప్పుకోదగ్గ నాణెం అంటే ఒక రూపాయి. రూపాయికి ఏమొస్తుంది? "ఓ కేజీ బియ్యం వస్తాయి" అంటున్నారు ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి. అందరికీ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల మంది తెలుపు రంగు రేషన్ కార్డు కలిగిన వారికి నవంబరు నుంచీ, ప్రస్తుతం కేజీ రెండు రూపాయలకి విక్రయిస్తున్న బియ్యాన్ని కేవలం ఒక్క రూపాయికే ఇవ్వబోతున్నామన్నది ముఖ్యమంత్రి ప్రకటన.

ఒక్కో తెల్ల కార్డు కుటుంబానికి నెల ఒక్కింటికీ గరిష్టంగా ఇరవై కేజీల చొప్పున పంపిణీ చేసే సబ్సిడీ బియ్యం ధరని సగానికి సగం తగ్గించడం వల్ల ఎవరికి ప్రయోజనం? దారిద్ర్య రేఖకి దిగువన ఉన్న ఒక్కో కుటుంబానికీ తగ్గే నెలవారీ ఖర్చు కేవలం ఇరవై రూపాయలు మాత్రమే! అదే సమయంలో అసలే ఆర్ధిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వం మీద పడే అదనపు భారం, బియ్యం లెవీ ధరని అనుసరించి నెలనెలా పెరుగుతూనే ఉంటుంది. పన్నులు కట్టే జనాభా మీద ఏదో రూపంలో ఈ భారం పడుతుందన్నది నిస్సందేహం.

ముప్ఫయ్యేళ్ళ క్రితం కిలో రెండు రూపాయల బియ్యం పధకాన్ని రాష్ట్రంలో ప్రకటించినప్పుడూ, ప్రవేశ పెట్టినప్పుడూ అదో సంచనలం. లక్షలాది కుటుంబాలని నిజంగానే మేలు చేసిన ఈపథకం, అప్పట్లోనే రాష్ట్ర ఖజానాకి ఎంతో కీడుని కూడా చేసి, వారుణి వాహిని ఏరులై పారడానికి ప్రత్యక్ష కారణం అయ్యింది. ఎన్టీఆర్ అనంతరం తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం అమలు చేయడం మానేసిన ఈ పథకాన్ని, ప్రజలకి అనేక మేళ్ళు చేయడంలో భాగంగా వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పునరుద్ధరించింది.

ఓపక్క నిత్యావసర వస్తువుల ధరలన్నీ రోజురోజుకీ పైపైకే వెళ్తుంటే సబ్సిడీ బియ్యం ధర మాత్రం అంతకంతకూ కిందకి దిగడం వెనుక మతలబు ఏమిటి? అభివృద్ధి కార్యక్రమాలు అమలు సక్రమంగా జరిగితే, పేదరికం తగ్గి ఇలాంటి పధకాల అవసరమే ఉండకూడదు కదా. మరి పథకాలు "విజయవంతంగా" అమలవుతూ ఉండగానే, ఇలా బియ్యం ధర తగ్గించడం ఎందుకు? పోనీ ఈ తగ్గింపు వల్ల పేదల జీవితాల్లో గణనీయమైన వెలుగు వచ్చేస్తుందా? కుటుంబానికి నెలకి ఇరవై రూపాయల చొప్పున మాత్రమే కలిగే ప్రయోజనం వెనుక నిజమైన ప్రయోజనం ఎవరికి?

అసలు ఈ రెండు రూపాయల బియ్యం పధకం అమలు మీద ఓ సర్వే చేయిస్తే, ఆసక్తికరమైన విషయాలెన్నో బయటికి వస్తాయి. ఉపాధి హామీ లాంటి పధకాల కారణంగా కూలీ రేట్లు గణనీయంగా పెరగడంతో, చాలామంది తెల్లకార్డులున్న వాళ్ళు సైతం 'మంచి బియ్యం' కొనడానికే మొగ్గు చూపుతున్నారు. మంచిదే! వాళ్ళకోసం కేటాయిస్తున్న సబ్సిడీ బియ్యం చాలావరకూ నల్ల బజారుకీ, అక్కడినుంచి లిక్కర్ తయారు చేసే బెవరేజేస్ లాంటి అనేకానేక చోట్లకి దారి మళ్ళుతున్నాయన్నది పేపర్లు చెబుతున్న మాట.

నిజానికి, ఇలా సబ్సిడీ బియ్యం ధర తగ్గించడం కన్నా బహిరంగ మార్కెట్లో కేజీ ఒక్కింటికి ముప్ఫై రూపాయలు పైచిలుకు పలుకుతున్న బియ్యం ధరకి కళ్ళాలు బిగిస్తే 'దారిద్ర్య రేఖకి దిగువున ఉన్న' వారితో సహా అనేకానేకమంది జనం ప్రభుత్వాన్ని మెచ్చుకునే వాళ్ళు. కానీ ఏం లాభం, అలా చేస్తే వ్యాపారస్తులంతా గుర్రుమని, మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. జనం కన్నా, వాళ్ళ బాగు కొంచం ఎక్కువ ముఖ్యం. ఎందుకంటే వాళ్ళలో చాలామంది ప్రత్యక్షంగా రాజకీయ నాయకులు, మరికొందరు పరోక్షంగా సహాయకారులు.

ఇలా సబ్సిడీ బియ్యం ధర తగ్గించడం వల్ల ఎవరికీ ఏ ఇబ్బందీ ఉండదు. పైగా, ఈ బియ్యాన్ని బ్లాకులో కొనుక్కునే వ్యాపారస్తులకి కొంచం బరువు తగ్గుతుంది కూడా. ప్రభుత్వమేమో పేదలకోసం తనెంత కష్టపడుతోందో పేపర్లలోనూ, టీవీల్లోనూ రంగురంగుల్లో చెప్పుకోవచ్చు. సబ్సిడీ కింద పోయేది ప్రజల సొమ్మే కాబట్టి, ఉన్న పన్నులు పెంచో, కొత్త పన్నులు వేసో జనం ముక్కు పిండి వసూలు చేసుకోవచ్చు. ఏమో, ప్రభుత్వం పని చేయడం లేదన్న అపప్రథని ఏ కొంచమైనా తగ్గించుకోవచ్చేమో కూడా.

మంగళవారం, సెప్టెంబర్ 20, 2011

లేడి చంపిన పులి నెత్తురు

ఎమ్వీయస్ హరనాధ రావు పేరు వినగానే చాలామందికి ఓ సినీ సంభాషణల రచయిత గుర్తొస్తాడు. కానీ అంతకన్నా ముందు ఆయనొక కథకుడు. పదునైన కథలెన్నో రాసినవాడు. బహుశా, ఆ కథల్లో అలవోకగా పలికించిన నాటకీయత తర్వాతి కాలంలో సినిమా రచనని సులువుగా చేసేయడానికి దోహద పడిందేమో అనిపిస్తూ ఉంటుంది. హరనాథ రావు రాసిన 'లేడి చంపిన పులి నెత్తురు' ఆసాంతమూ ఉత్కంఠభరితమైన మలుపులతో సాగుతూ, ఓ మంచి కథని చదివిన అనుభూతితో పాటు కొన్ని ప్రశ్నలనూ పాఠకుల ముందుంచే కథ.

కథా స్థలం ఊరిచివర హరిజనవాడ. నాయిక ఆ వాడలో ఉండే అరుంధతి. కానైతే వాడంతా అరుంధతిని నాయికలా చూడదు. చెడిపోయిన దానిని చూసినట్టుగా చూస్తుంది. ఎందుకంటే అరుంధతి చెడిపోయింది. చెడిపోతూనే ఉంది. రోజూ సాయంత్రం అవ్వడం ఆలస్యం కొడుకు కోటేశు పూలమాల తెచ్చి స్వయంగా అలంకరిస్తాడు అరుంధతిని. దగ్గరుండి మరీ 'పెద్ద దొర' కొష్టానికి తీసుకెళతాడు. తెల్లారాక, తల్లిని తీసుకుని వాడకి తిరిగి వస్తాడు.

ఆ ఊళ్ళో గాలీ, నీరూ, దేవుడూ, సత్యం, ధర్మ, న్యాయం తప్ప మిగిలినవన్నీ పెద్ద దొరవే. అటువంటి పెద్ద దొరకి ఎదురు తిరిగిన వాడు దాసు, అరుంధతి భర్త. దొరకి వ్యతిరేకంగా తన వాళ్ళని కూడగట్టాలన్న దాసు ప్రయత్నం ఫలించలేదు. దొరతో దాసు మాటల యుద్ధం మాత్రం, కొంత కాలానికే కర్రల యుద్ధంగా మారింది. అదిగో, అప్పుడు గూడెం నుంచి మద్దతు దొరికింది దాసుకి. మొదటిసారిగా ఒక అడుగు వెనక్కి వేస్తాడు దొర. అదీ ఆ ఒక్కరోజే.

వారం తర్వాత ఊరి చివర ఓ శవం. నాలుగు రోజుల క్రితం కలెక్టరాఫీసుకి వెళ్ళిన దాసు ఇంకా తిరిగి రాలేదు. కుక్కలు ముఖం పీక్కు తినేసిన ఆ భయంకరమైన శవం ఎవరో అడుక్కునే వాడిదని రిపోర్టు తయారైపోయింది. అంతకు ముందు రోజు రాత్రి దాసు పెద్ద దొర బీరువా తాళాలు బద్దలు కొట్టి పారిపోయాడని మరో రిపోర్టు కూడా. పోలీస్ ఇన్స్పెక్టర్ పెద్ద దొరకి స్వయానా మేనల్లుడు మరి. దొరికిన శవం దాసుది కాదన్న రిపోర్టు మీద వేలిముద్ర వేసిన అరుంధతి ఆ తర్వాత కొద్ది రోజులకే దొరకి లొంగిపోయింది.

అరుంధతి చేసిన పనిని హరిజనవాడ హర్షించలేదు. సూటి పోటి మాటలో చిత్రవధ చేసింది ఆ తల్లీ కొడుకులని. ఆమెని ఆ పల్లెలో తిట్టని వాళ్ళంటూ ఉంటే నోరులేని దేవుడూ, నోరున్నా మాట్లాడలేని పసి పాపలు మాత్రమే. చప్పుడు కాకుండా రోదించిందే తప్ప తన పధ్ధతి మార్చుకోలేదు అరుంధతి. తల్లిని దగ్గరుండి ప్రతి రాత్రీ దొర కొష్టానికి తీసుకెడుతూనే ఉన్నాడు కోటేశు. అరుంధతి ఇంటికి నిప్పు పెట్టాలా, అక్కరలేదా అన్న ఆలోచనలో పడింది పల్లె.

ఉన్నట్టుండి ఓ రోజున పెద్ద దొర చచ్చిపోయాడు. దక్షిణంవైపు పొలం దగ్గర చంపబడి ఉన్నాడు. పక్కన రక్తసిక్తమైన గొడ్డలి. ఇన్స్పెక్టర్, ఇతర పెద్దలూ రాగానే కోటేశు చెప్పడం మొదలు పెట్టాడు: "రాత్తిరి మామూలుగా మాయమ్మను తీసుకుని కొట్టం కాడికి వత్తున్నానండి. దారిలోనే అయ్యగారు కనిపించినారు. ఆల్లిద్దరినీ జతసేసి ఎనక్కు తిరిగాను. పెద్ద దొర ఎర్రి కేక పెట్టినాడు. వెనక్కి తిరిగి సూశాను. మా అయ్య.. ఆ గొడ్డలి తీసుకుని పెద్ద దొర ఎదురుగా నిలబడి 'ఎర్రి నాకొడకా - నీ ఇనప్పెట్టె కాదురా నీ తల బద్దలు కొడతాను. నా పెళ్ళాన్ని సెడగొడతావురా' అని నెత్తిమీద గొడ్డలేసిండు...."

"బిడ్డకు తల్లి పాలు ఎలా ఇస్తుందో శాస్త్ర ప్రకారం చెప్పే డాక్టరు వల్ల బిడ్డకు కడుపు నిండదు. పాలిచ్చే తల్లికావాలి. సమస్యలకు ప్రణాళికలు, ఉపన్యాసాలు కాదు కావాల్సింది. పరిష్కారాలను అమలుపరిచే చిత్తశుద్ధి, నైతిక బలం కావాలి," అంటారు హరనాథ రావు. 1977 లో తొలిసారి ప్రచురితమైన ఈ కత ఆధారంగానే రాజేంద్రప్రసాద్-యమునలతో 'ఎర్రమందారం' సినిమా తీశారు.

"ఈ కథలో సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్య ఉంది. కథనంలో ఆసక్తిని రేకెత్తించే సస్పెన్స్ ఉంది. వాక్య నిర్మాణంలో పడునుంది. రచయిత వ్యాఖ్యానంలో ధ్వని ఉంది. ముగింపులో చైతన్య స్పోరకమైన సూచన ఉంది. ఇంతకంటే ఓ మంచి కథకేం కావాలి?" అని అడుగుతారు దర్శక, రచయిత వంశీ, తన 'వంశీకి నచ్చిన కథలు' సంకలనంలో ఈ కథని చేర్చడానికి కారణాలు చెబుతూ. కా..నీ, వ్యక్తులని చంపడం ద్వారా మాత్రమే వ్యవస్థలో మార్పు సాధ్య పడుతుందా???

ఆదివారం, సెప్టెంబర్ 18, 2011

సుమనుడిచ్చిన 'ట్విస్ట్'

బుల్లితెరపై ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుండే సుమన్ బాబు చేసిన తాజా ప్రయోగం 'ట్విస్ట్.' ఇంద్రనాగ్ దర్శకత్వంలో వచ్చిన ఈ ప్రీమియర్ షో పేరులో ఒక ట్విస్టే ఉన్నా, ప్రేక్షకులని మాత్రం మూడుగంటల పాటు అనుక్షణం ట్విస్టుల్లో ముంచెత్తింది. తన కథల్లో హీరో ఎవరు, విలన్ ఎవరు అన్నది ప్రేక్షకులకి సస్పెన్స్ గా ఉంచడం, ఆ సస్పెన్స్ విప్పినవారికి ఖరీదైన బహుమతులు అందించడం అలవాటుగా ఉన్న సుమన్ బాబు (అన్నట్టు 'నాన్ స్టాప్ కామెడీ' శాంత్రో కారు విజేత ఎవరు?) ఈసారి కూడా అదే పోకడని కొనసాగించారు.

ముందుగా కొంచం పిడకల వేట. మహిళా రచయిత్రుల హవా నడిచిన రోజుల్లో వాళ్ళు అలవోకగా రాసేసిన నవలల కారణంగా కనీసం ఓ తరం మహిళలు ఒకలాంటి అసంతృప్తితో బతికేస్తున్నారేమో అనేది మా మిత్రుల మధ్య చర్చల్లో వచ్చే ఒకానొక విషయం. అతి సామాన్యమైన అమ్మాయిని వెతుక్కుంటూ ఓ ఆరడుగుల అందగాడు కారు తాళాలు గాల్లో ఎగరేసుకుంటూ రావడం ఆయా నవలల్లో సాధారణ విషయం అవ్వడం వల్ల, వాటిని చదివిన అమ్మాయిల్లో కొందరైనా అలాంటి వాడు రాక, వచ్చిన వాడిలో నవలానాయకుడి లక్షణాలు కనబడక నిట్టూర్పులు విడిచి ఉంటారు కదా అనుకుంటూ ఉంటాం.

ఈతరం కాలేజీ పిల్లల్లో ఎవరన్నా ఓ కుర్రాడిని - మరీ కెరీర్ ఓరియంటెడ్ కేసుని కాదు - టీకి పిలిచి కబుర్లలో పెట్టి చూడండి. వాళ్ళ నాన్న చిరంజీవో, నాగార్జునో కనీసం అల్లు అరవిందో అయినా కానందుకు వాడిలో ఏమూలో ఉన్న అసంతృప్తిని గమనించొచ్చు. తన తండ్రి ఫలానా అయితే, తను హీరో అవడానికి పుట్టుకతోనే పాస్పోర్టు దొరికేసేది కదా అన్న విషయాన్ని వాడు మర్చిపోలేడు గాక మర్చిపోలేడు. ఇప్పుడీ అసంతృప్తుల జాబితా మన సుమన్ బాబు కారణంగా మరికొంచం పెద్దదయ్యే ప్రమాదం కనిపిస్తోంది.

ఇన్నాళ్ళూ దొరికిన భార్యతోనూ, పుట్టిన పిల్లలతోనూ, నా అంతటి వాడు లేడనుకుంటూ ఖుషీ ఖుషీగా బతికేస్తున్న కుటుంబరావుల గుండెల్లో చిచ్చు పెట్టేస్తున్నాడు సుమనుడు. "మా నాన్నకో టీవీ చానలూ, సినిమా స్టూడియో ఉండి ఉంటే, నేను కూడా విగ్గు పెట్టుకుని, దొరికిన వీరోవిన్నుతో డ్యూయట్లు పాడుకుని ఉందును కదా.." అని అనేకానేక మంది నిట్టూర్చడానికి కారణం కాబోతున్నాడు. అవును మరి బుల్లితెర మహానటి భావనతో కలిసి 'అందాల తారక.. అరుదైన కానుక..' అనే పాటకి వాళ్ళ నాన్నారి ఫిలింసిటీ వేదికగా వైవిద్యభరితమైన స్టెప్పు లేశాడు మన సుమన్ బాబు.

అడుగడుగునా ట్విస్టులే ఉన్న తాజా ప్రీమియర్ షోను గురించి పూర్తిగా చెప్పాలంటే బ్లాగర్లో గూగులమ్మ ఇచ్చిన చోటు చాలదు. అయినప్పటికీ ఏదో, కొండని అద్దంలో చూపించే ప్రయత్నం. కొండంత మంచి మనసున్న మంచి మనిషి శ్రీరామ్ కి ఏదో శాపం పెట్టినట్టు అన్నీ కష్టాలే. బహుశా ఆ పాత్ర పోషించింది సుమన్ బాబు అని తెలియడం వల్ల శ్రీరామ్ ని లెక్కకి మిక్కిలి కష్టాలు చుట్టుముట్టి ఉండొచ్చు. ఇళయరాజా స్వరాలని గుర్తు చేసేవిధంగా భోలేషా వలీ మీటిన విషాద వాయులీనాల సాక్షిగా శ్రీరామ్ హీనస్వరంతో ఏకరువు పెట్టే కష్టాలని వింటుంటే రాళ్ళైనా కరగాల్సిందే. అలాంటిది రాయిలాంటి పోలీసాఫీసర్ శిరీష (ప్రవళిక) కరగదా?

సరే, కథని మూడు ముక్కల్లోకి కుదించుకుందాం. తన కష్టాలని మర్చిపోవడం కోసం, ఓ పెద్ద నగరంనుంచి బయలుదేరిన శ్రీరామ్ ఆర్టీసీ వారి ఆర్డినరీ బస్సెక్కి, కళ్ళు చెదిరే తన పల్లెటూరి ప్యాలస్ చేరుకుంటాడు. చిన్నప్పుడెప్పుడో చూసిన పని వాళ్ళు చటుక్కున గుర్తు పట్టేసి, ఆనంద భాష్పాలతో ముంచెత్తుతారు. తను పేరు కూడా మర్చిపోయిన చిన్న నాటి స్నేహితుడు వచ్చి, తనని తాను పరిచయం చేసుకుని చెల్లెలి పెళ్లికి ఆహ్వానించడం, ఆ పెళ్ళికూతురు 'వెన్నెల' శ్రీరామ్ కి అంతకు ముందే పరిచయం ఉండడం, 'ముత్యాలముగ్గు' సినిమాలోలాగా తాళి కట్టబోతుండగా పెళ్ళికొడుకుని పోలీసులు అరెస్టు చేయడంతో, నడిచే దేవుడైన శ్రీరామ్ తన స్నేహితుడి కోసం వెన్నెల మెళ్ళో తాళి కట్టేయడం చక చకా జరిగిపోతాయి.

ప్యాలస్ లాంటి సొంతిల్లు వదిలేసి, తన పనివాళ్ళతో సహా బావమరిది మామూలు ఇంటికి మకాం మార్చేస్తాడు శ్రీరామ్ (కాస్ట్ కటింగ్ అనుకుంటా). కాపురం మొదలెట్టబోతుండగా, మొదటి భార్య రాధిక ఆటో దిగడం, అప్పటికే నేను ఎన్నోదో మర్చిపోయిన ట్విస్ట్ ఈ కథలో. వెన్నెలతో సహా అందరూ ఆ వచ్చినావిడ రాధికే అంటారు, ససేమిరా కాదంటాడు శ్రీరామ్. కాదని నిరూపించడానికి శతవిధాల ప్రయత్నించి భంగపడతాడు. ప్రతి ప్రయత్నంలోనూ ఒక ట్విస్ట్. మరావిడ రాధిక కాకపోతే ఎవరన్నది, మామూలుగా అయితే పోలీసులు లాకప్పులో వేసి ఇంటారాగేట్ చేస్తే తెలిసిపోయే విషయం. కానీ ఆ నిజం శ్రీరామ్ చేత చెప్పించడానికి పోలిస్ డిపార్ట్మెంట్, సి.బి.ఐ. లాంటి సంస్థల్లోపెద్ద ఉద్యోగులంతా పన్లు మానుకుని, మారు వేషాలు వేసుకుని ఇతగాడి చుట్టూ చేరడమే చివరికి అసలైన ట్విస్ట్. సుమన్ బాబా? మజాకానా?

నటీనటులు అందరూ కూడా తీసుకున్న ప్రతి ఒక్క రూపాయికీ పది రూపాయల అవుట్పుట్ ఇవ్వడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. మరీ ముఖ్యంగా జూనియర్ ఆర్టిస్టులు, సీనియర్ ఆర్టిస్టులతో పోటీ పడ్డారు. ప్రతిపాత్రా శ్రీరామ్ ని ప్రతి డైలాగులోనూ పొగిడే విధంగా సంభాషణలు రాయబడ్డాయి. సుమన్ బాబు నటన గురించి కొత్తగా చెప్పడానికి ఏముంది.. ఎప్పటిలాగే అన్నిభావాలూ అభావంగా పలికించేశాడు. మేకప్,కాస్ట్యూమ్స్ విషయంలో సుమనుడు ఎప్పట్లాగే రాజీ పడలేదు. కాకపోతే రెండు మొదటి రాత్రుల్లోనూ ఒకే దుస్తులు ధరించడం కొంచం నిరాశ పరిచింది. అలాగే తొలి పెళ్ళిలో ధరించిన ఆకుపచ్చ టీ షర్ట్ మళ్ళీ ఓసారి రిపీటయ్యింది కూడా. దర్శకుడు ఇలాంటివి సరిద్దుకోవాలి. టైటిల్స్ దగ్గరనుంచి ప్రతి విషయంలోనూ 'కళ్ళు చెదిరేలా చేయడం' అన్నది ఆశయంగా పెట్టుకున్నాడు దర్శకుడన్నది సుస్పష్టం. కొన్ని సన్నివేశాలు చూసేటప్పుడు కలిగిన కళ్ళు (బుర్ర) తిరుగుడు ఇంకా తగ్గలేదంటే, 'ట్విస్ట్' ఇవ్వడంలో దర్శకుడు కృతకృత్యుడయినట్టే.

శుక్రవారం, సెప్టెంబర్ 16, 2011

నా రక్తంతో నడుపుతాను రిక్షానూ..

రిక్షా ఎక్కడం అంటే భలే సరదాగా ఉండేది చిన్నప్పుడు. దర్జాగా, చాలా గొప్పగా అనిపించేది. ఏం లాభం, ఎప్పుడు పడితే అప్పుడు రిక్షా ఎక్కడానికి ఉండేది కాదు. 'చక్కగా రెండెడ్ల బండి ఇంట్లో పెట్టుకుని, రిక్షా ఎందుకూ?' అనేవాళ్ళు ఇంట్లో. దాంతో పొరుగూళ్లలో గుళ్ళకీ, ఎప్పుడన్నా సినిమాలకీ ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళడానికి బస్సెక్కడానికీ మా బండిలోనే వెళ్ళాల్సి వచ్చేది. బండికూడా సరదాగానే ఉంటుంది, రిక్షా దర్జా వేరు.

నెమ్మదిగా నాకో విషయం అర్ధమయ్యింది. ఎప్పుడన్నా మేం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు, బస్సు దిగ్గానే మా బండి కనిపించక పోతే రిక్షా బేరం చేసేది అమ్మ. "కిట్టదండమ్మా..ఆ ఊరికి రోడ్రే లేదు.. ఎంతిచ్చినా మేం రాలేం" అని నిష్కర్షగా చెప్పేసేవాళ్ళు రిక్షావాళ్ళు. కొన్నాళ్ళకి మా ఊరికి రోడ్డు లాంటిది రావడం, మా బండి వెళ్లిపోవడంతో అప్పుడప్పుడూ రిక్షా ఎక్కే అదృష్టం దొరికింది. ఇరుక్కుని, ఓ మూల కూర్చోవాల్సి వస్తేనేమి? మయూర సింహాసనం మీద కూర్చున్న షాజహాన్ కూడా అంతటి ఆనందం అనుభవించి ఉండడు.

"మీ ఊళ్ళో రిక్షాలు భలేగా ఉంటాయిరా.. ఎంచక్కా సింహాసనం మీద కూర్చున్నట్టు ఉంటుంది" అని హైదరాబాదులో ఉండే అత్తయ్యల పిల్లలు చెబుతుంటే, మా రిక్షాల ప్రత్యేకత తెలిసేది కాదు. ఓసారి హైదరాబాదు వెళ్ళినప్పుడు చూశాను కదా. అబ్బే, నేల టిక్కట్లో కూర్చుని సినిమా చూసినట్టుగా కింద కూర్చోవాలి. గూనిగా నడుం ఒంచాలేమో, బయట రోడ్డుమీద ఏం చూడడానికీ ఉండదు. అదే మా రిక్షాలైతే, కుర్చీ టిక్కట్లో కూర్చుని సినిమా చూసినట్టే. పైన టాపు కావాలంటే ఉంచుకోవచ్చు, వద్దంటే తీసేయమనొచ్చు.


రిక్షా ఇంకా గొప్పదన్న విషయం మరికొంచం పెద్దై సినిమాలు చూడ్డం అలవాటయ్యాక అర్ధమయ్యింది. డబ్బు అవసరం వస్తే చాలు, హీరోలు రాత్రుళ్ళు రిక్షాలు తొక్కి బోల్డు బోల్డు డబ్బులు సంపాదించడం చూసి, నేను కూడా పెద్దయ్యాక రాత్రిళ్ళు రిక్షా తొక్కాలని నిర్ణయించేసుకున్నాను. ఉద్యోగం కోసం ఊరు విడిచి పెట్టేటప్పుడు అమ్మ జాగ్రత్తలు చెబుతూ "డబ్బులు జాగ్రత్తగా ఖర్చుపెట్టుకో బాబూ," అని చెబితే, "అవసరమైతే రాత్రుళ్ళు రిక్షా తొక్కుతాలే అమ్మా," అని వాతావరణం తేలిక చేశాను. తర్వాతెప్పుడో అమ్మ మర్చిపోకుండా అడిగింది, "రిక్షా తొక్కుతున్నావా?" అని.

చూస్తుండగానే రిక్షాలు నెమ్మది నెమ్మదిగా అదృశ్యం అయిపోతున్నాయి. రిక్షాల స్థానంలో ఆటో రిక్షాలు చిన్న చిన్న పల్లెటూళ్ళలో కూడా కనిపిస్తున్నాయి. పట్టణాలలో అక్కడక్కడా రిక్షాలు కనిపిస్తున్నా వాటిని ఆదరించే వాళ్ళు కనిపించడం లేదు. రిక్షా కన్నా ఆటో వేగంగా వెళ్ళడం ఒక కారణం అయితే, మన బరువు మరో మనిషి మీద మోపడం ఏమిటన్న సెన్సిబిలిటీ మరో కారణం. రిక్షా నాగరీకం కాదన్న వాదన కూడా ఉంది. చివరికి స్కూలు రిక్షాల స్థానంలో కూడా స్కూల్ ఆటోలు వచ్చేశాయి.

రిక్షా మీద నాకున్న ప్రత్యేకమైన అభిమానం వల్ల అనుకుంటాను, ఆర్. నారాయణ మూర్తి 'ఒరేయ్! రిక్షా' సినిమా తీసినప్పుడు దాన్ని నావంతుగా ఆదరించాను - నేనెప్పుడూ ఏ రిక్షానీ 'ఒరేయ్' అని పిలవకపోయినా సరే. ఆ సినిమాలో నాకు బాగా నచ్చిన రెండు పాటల్లో ఒకటి "నా రక్తంతో నడుపుతాను రిక్షానూ.. నా రక్తమే నా రిక్షకు పెట్రోలూ...పెట్రోల్ ధర పెరిగిందీ...డీజిల్ ధర పెరిగిందీ.. నా రక్తం ధర ఏమో రోజు రోజు తగ్గబట్టి ..ఏయ్.. " అప్పటినుంచీ తరచూ పాడుకుంటూ ఉంటాను. మరీ ముఖ్యంగా పెట్రోల్ ధరలు పెరిగినప్పుడల్లా ఈ పాట అప్రయత్నంగా నా నోటెంట వచ్చేస్తుంది. ఇవాళ పొద్దున్నుంచీ ఇదే పాట పాడుకుంటున్నానని వేరే చెప్పక్కర్లేదు కదా.

గురువారం, సెప్టెంబర్ 15, 2011

మల్లాది 'పరంజ్యోతి'

ఆంధ్రుల ఆహ్లాద రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి ని గురించి చెప్పడానికి కొత్తగా ఏముంది? మధ్యతరగతి జీవితాలని మల్లాదంత అందంగా చిత్రించిన కమర్షియల్ రచయిత మరొకరు లేరనడం అతిశయోక్తి అనిపించదు నాకు. మల్లాది నవలల్లో 'అందమైన జీవితం' 'మందాకిని' లాంటి కొన్ని నవలలు ఇప్పటికీ నా ఆల్ టైం ఫేవరెట్స్ జాబితాలో ఉన్నాయి. 'తేనెటీగ' 'కల్నల్ ఏకలింగం ఎడ్వంచర్స్' లాంటి శృంగార రస ప్రధానమైన నవలలు రాసిన మల్లాది ఈమధ్యన తన బాణీని పూర్తిగా మార్చుకుని ఆధ్యాత్మిక రచనలు చేస్తున్నారు!

గత కొంతకాలంగా కమర్షియల్ నవలలు చదవడం తగ్గించిన నాకు చాలా మంది మిత్రులు చదవమని సూచించిన నవల మల్లాది రాసిన 'పరంజ్యోతి.' ఈమధ్యనే చదివాను. ముఖచిత్రం చూడగానే ఆమధ్యనెప్పుడో చదివిన రాబిన్ శర్మ ఆంగ్ల రచన 'ది మాంక్ హూ సోల్డ్ హిజ్ ఫెర్రారీ' జ్ఞాపకం వచ్చింది. కానీ, రెంటికీ ఉన్న పోలిక రేఖామాత్రం. మల్లాది నవలల్లో ఆకట్టుకునేది ఆసాంతమూ విడిచిపెట్టకుండా చదివించే శైలి, ప్రతి చిన్న విషయాన్నీ పాఠకులందరికీ అర్ధమయ్యేలా ఓపికగా వివరించే విధానం. 'పరంజ్యోతి' లోనూ అదే శైలి కొనసాగించారు.

ఒకే శరీరంతో రెండు జన్మల జీవితాన్ని గడిపిన పరంజ్యోతి కథ ఇది. కథాకాలం ఇప్పటికి దాదాపు నూట పాతిక సంవత్సరాల క్రితం. కథాస్థలం గోదారి ఒడ్డున ఉన్న నెమలికొండ సంస్థానం (ఎంత అందమైన పేరు!). సంస్థానాదీశుడు కనుమూరి భూపతిరాజు మూడో కొడుకు రామరాజు కి జీవితం ఉన్నది అన్నీ అనుభవించడానికే అని ఓ బలమైన నమ్మకం. "మరణం అంటే నాకు భయం లేదు. ఎందుకంటే నేను జీవించి ఉన్నంతకాలం మరణం నా సమీపంలోకి రాలేదు. అది వచ్చినప్పుడు నేనుండను. ఇంక చావంటే నాకు భయం దేనికి?" ఆంటాడు.

పుడుతూనే తల్లిని పోగొట్టుకున్న రామరాజుకి ఆ సంస్థానంలో అక్షరాలా ఆడింది ఆట. తండ్రి, ఇద్దరు అన్నలు, అక్క కుముదినీ దేవి, అమ్మమ్మ జానకీబాయి ఎవరూ కూడా అతనికి ఎలాంటి అడ్డూ చెప్పరు. మద్యమూ, మగువా యవ్వనారంభంలోనే పరిచయమై విడదీయలేని వ్యసనాలవుతాయి. అహల్యతో వివాహమైనా, భార్యతో అతడు గడిపింది బహు కొద్ది కాలం. ఆ సాంగత్య ఫలితంగా ఓ కొడుక్కి జన్మనిస్తుంది అహల్య. పరస్త్రీలలో,మరీ ముఖ్యంగా గణికల్లో కనిపించే సౌందర్యం తన ఇల్లాలిలో కనిపించదు రామరాజుకి.

సుఖవ్యాధులతో మంచం పట్టిన రామరాజు మీద అహల్య ఎంతటి అసహ్యాన్ని పెంచుకుంటుందంటే, తన అన్న సాయంతో భర్తకి ఇచ్చే ఔషధాలలో విషం కలిపి తినిపించేస్తుంది. ఆస్థాన వైద్యుడితోపాటు, బ్రిటిష్ ప్రభుత్వపు డాక్టరూ రామరాజు మరణాన్ని ధృవపరిచాక గోదావరి తీరాన అంత్యక్రియలకి ఏర్పాట్లు జరుగుతాయి. చితికి పెట్టిన నిప్పు కాలడం మొదలవ్వగానే, ఉన్నట్టుండి వర్షం వచ్చి, గోదారి పొంగి రామరాజు దేహం నదిలో కొట్టుకుపోతుంది. పాపికొండల సమీపంలోని గుర్రం కొండలో ధ్యానం చేసుకునే సన్యాసి సహజానంద స్వామి, రామరాజుకి కాయకల్ప చికిత్స చేసి కోలుకునేలా చేస్తాడు. గతాన్ని పూర్తిగా మర్చిపోయిన అతనికి 'పరంజ్యోతి' పేరుతో కొత్త జీవితాన్ని ఇస్తాడు.

సహజానందతో పన్నెండేళ్ళ ఆధ్యాత్మిక సాహచర్యం తర్వాత పరంజ్యోతికి అనూహ్యంగా తన గత జీవితం గుర్తొచ్చి నెమలికొండకి ప్రయాణం అవ్వడం, అహల్య అతన్ని రామరాజు కాదనడం, కోర్టు కేసు... ఇలా ఎన్నెన్నో ఉత్కంఠభరితమైన మలుపులతో ముగింపుని చేరుతుంది. రక్తినీ, భక్తినీ, ఆధ్యాత్మిక విషయాలనీ రాచిళ్ళ రాజకీయాలనీ సమపాళ్ళలో రంగరించి రాసిన ఈ నవలలో, 'నర్మదా పరిక్రమ' లాంటి అతి కొద్ది మంది మాత్రమే తెలిసిన ఎన్నో విషయాలని ఎంతో విశదంగా రాశారు మల్లాది. సన్యాసుల జీవితం, వారు చేసే పనులన్నింటి వెనుకా ఉండే పరమార్ధాన్ని కథ పరిధి మించని విధంగా వివరించారు. ఎంతో క్లిష్టంగా అనిపించే వేదాంత విషయాలని సైతం అందరికీ తెలిసిన ఉదాహరణలతో సులభంగా చెప్పడం ఈ నవల ప్రత్యేకత.

అయితే ఆధ్యాత్మిక మార్గంలో ఎంతో దూరం ప్రయాణించిన పరంజ్యోతి, తన గతం గుర్తు రాగానే "నన్ను చంపాలని ప్రయత్నించిన వారికి నేను శిక్ష పడేలా చేయాలి" అని ఐహికంగా మాట్లాడడం ఏమిటో అర్ధం కాలేదు. సహజానంద సహవాసంలో సంపాదించిన జ్ఞానం ద్వారా అతడు అప్పటికే వారిని క్షమించగలిగేంత ఎత్తుకన్నా ఎదిగి ఉండాలి, లేదా తన మీద జరిగిన హత్యా యత్నం అన్నది తన చర్యలకి ప్రతిచర్యగా జరిగిందని అయినా అర్ధం చేసుకుని ఉండాలి. ఓ చిన్నపాటి జెర్క్ తో మొదలయ్యే కథనం అనూహ్యంగా వేగం పుంజుకుని ఆ సాంతమూ విడిచిపెట్టకుండా చదివిస్తుంది. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి ఉన్నవారికి బాగా నచ్చే నవల ఇది. (లిపి పబ్లికేషన్స్ ప్రచురణ, పేజీలు 260, వెల రూ. 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

సోమవారం, సెప్టెంబర్ 12, 2011

ఇదేం బాలేదు వంశీ...

వంశీ నాకు మొదట పరిచయమయ్యింది సిని దర్శకుడిగా. కొన్ని సినిమాలు నచ్చాయి మరి కొన్ని నచ్చలేదు.. తర్వాత తన కథలూ, నవలలూ చదివాను.. వీటిలోనూ కొన్ని నచ్చాయి, మరికొన్ని నచ్చలేదు. ఇప్పుడు పుస్తక ప్రచురణలో అయితే వంశీ అనుసరిస్తున్న పధ్ధతి అస్సలు నచ్చక పోగా కోపం రప్పిస్తోంది. చిన్నగా మొదలైన ఓ అసంతృప్తి, ఇవాళ పుస్తకాల షాపుకి వెళ్ళడంతో బాగా పెద్దదయ్యింది.

పుస్తకాలు చూస్తుండగా, "సార్, 'వంశీకి నచ్చిన కథలు' హార్డ్ బౌండ్ వచ్చింది.. తీసుకుంటారా?' అని షాప్ అబ్బాయి అడిగినప్పుడు చూశాను. తళతళ లాడే హార్డ్ బౌండ్ పుస్తకాన్ని. "ఇంతకు ముందు బైండు లేకుండా వచ్చింది కదా. అది తీసుకున్నారు. ఇది ఎప్పుడు వేశారు?" చాలా మామూలుగానే అడిగాను. "అప్పుడే వేశారు సార్. కానీ ఇప్పుడే అమ్మకానికి పెట్టారు," అతనూ మామూలుగానే చెప్పాడు కానీ, ఆ మార్కెటింగ్ స్ట్రాటజీ అర్ధం చేసుకోడానికి కొంచం టైం పట్టింది నాకు.

ఎనిమిదేళ్ళ క్రితం ఎమెస్కో ప్రచురించిన 'ఆనాటి వానచినుకులు' వంశీ కథల తొలి సంకలనం. 'అలా అన్నాడు శాస్త్రి!' 'ఆకుపచ్చని జ్ఞాపకం' లాంటి ఎన్నో చక్కని కథలు ఉన్నాయి అందులో. ఒక్క మాటలో చెప్పాలంటే, ఒకటి రెండు మినహా మిగిలినవన్నీ వైవిద్యభరితమైన కథ, కథనం ఉన్న కథలే. తర్వాత వరుసగా వంశీ నవలలు 'మహల్లో కోకిల,' 'మంచుపల్లకీ,' 'రవ్వలకొండ,' 'గాలికొండపురం రైల్వే గేటు,' 'వెన్నెల బొమ్మ' నవలని ప్రచురించింది ఎమెస్కో. ఒక్క 'వెండితెర నవలలు' మాత్రం సాహితి వాళ్ళు మార్కెట్లోకి తెచ్చారు.

స్వాతిలో సీరియల్ గా వచ్చిన 'మా పసలపూడి కథలు' సంకలనాన్ని తొలుత ఎమెస్కోనే ప్రచురించింది. స్వాతిలో కథలకి అప్పటికే బాగా పేరు రావడం వల్ల పుస్తకాలు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. అప్పుడు రంగ ప్రవేశం చేసింది కుట్టిమాస్ ప్రెస్ ప్రచురణ సంస్థ. అప్పటి వరకూ నలుపు తెలుపుల్లో ఉన్న 'మా పసలపూడి కథలు' సంకలనంలో బాపూ బొమ్మలకి రంగులద్ది, దాదాపు రెట్టింపు ధరతో మార్కెట్లోకి వదిలింది. రంగుల బొమ్మల కోసం చాలామంది ఈ పుస్తకాన్ని కొన్నారు.

ఈ స్పందన చూసే కావొచ్చు, 'ఆనాటి వానచినుకులు' సంకలనం లో ఉన్న కథలకి బాపూ చేత బొమ్మలు వేయించి, వంశీ రాసిన మరికాసిని కొత్త కథలు కలిపి 'ఆకుపచ్చని జ్ఞాపకం' పేరుతో రంగుల సంకలనం తెచ్చింది. మూడొందల అరవై పేజీల ఈ పుస్తకం వెల అక్షరాలా మూడొందల యాభై రూపాయలు. నాణ్యమైన ప్రచురణ, అందమైన బొమ్మలు.. ఐతేనేం? ముప్పాతిక మూడొంతుల కథలు అప్పటికే చదివేసినవి. అన్నీ కొత్త కథలు అయితే బాగుండును కదా అనిపించింది.

స్వాతిలో 'మా దిగువ గోదారి కథలు' సీరియల్ గా వస్తుండగానే, తనకు నచ్చిన కథకుల యాభై కథలతో వంశీ వెలువరించిన పుస్తకం 'వంశీకి నచ్చిన కథలు' కుట్టిమాస్ ప్రెస్ ప్రచురించిన ఈ నాలుగొందల డెబ్భై పేజీల పుస్తకం వెల రెండువందల రూపాయలు. తర్వాత ఇలియాస్ ఇండియా బుక్స్ సంస్థ 'మా దిగువ గోదారి కథలు' సంకలనాన్ని బాపూ రంగుల బొమ్మలతో విడుదల చేసింది. ఐదొందల పందొమ్మిది పేజీల పుస్తకం వెల నాలుగొందల డెబ్భై ఐదు రూపాయలు. ఈ పుస్తకం స్టాండ్స్ లో ఉండగానే ఇప్పుడు 'వంశీకి నచ్చిన కథలు' హార్డ్ బౌండ్ తో, రెండొందల యాభై రూపాయల వెలతో కొత్తగా మార్కెట్లోకి వచ్చింది.

కుట్టిమాస్ ప్రెస్, ఇలియాస్ ఇండియా ప్రెస్ అనేవి వంశీకి చెందిన ప్రచురణ సంస్థలే అని వినికిడి. ఎంతవరకూ నిజమన్నది తెలియదు. కానీ, పుస్తకాల ప్రచురణలో వంశీ ఈమధ్యకాలంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాడన్నది అత్యంత శ్రద్ధగా తీర్చిదిద్దిన సంకలనాలని చూస్తుంటే అప్రయత్నంగానే అర్ధమవుతోంది. ఇప్పుడు నన్ను వేధించే ప్రశ్నలు: ఒకే పుస్తకాన్నే నలుపు-తెలుపు లో ఒకసారి, రంగుల్లో మరోసారి, సాదా బైండుతో ఒకసారి, హార్డ్ బౌండ్ తో మరోసారి, అవే కథలని పుస్తకం పేరు మార్చి మళ్ళీ మళ్ళీ విడుదల చేయడం అన్నది ఎంతవరకూ సబబు?

ప్రచురణ సంస్థలు తనవి అయినా, కాకపోయినా, పాఠకులు పుస్తకాలు కొనేది రచయిత పేరు చూసే కానీ, ప్రచురణ సంస్థ పేరు చూసి కాదు కదా.. పైగా ఈ పునః ప్రచురణలు జరుగుతున్నది ఏళ్ళ గ్యాప్ తర్వాత కాదు. ఒక ప్రింట్ అమ్మకం మొదలైన కొన్నాళ్ళకి మార్పులు చేర్పులతో మరో ప్రింట్ మార్కెట్లోకి వచ్చేస్తోంది. "అందరూ మమ్మల్ని అడుగుతున్నారు సార్," అన్న పుస్తకాల షాపతని మాటల సాక్షిగా, ఈ మార్పు చేర్పుల వల్ల పాఠకులతో పాటు, షాపుల వాళ్ళూ ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడిప్పుడు ఇంక వంశీ పుస్తకం వచ్చిందంటే, 'మార్పు చేర్పులతో మళ్ళీ వస్తుందేమో.. కొన్నాళ్ళు ఆగుదాం' అనిపిస్తోంది.. వంశీ, ఎందుకిలా??