"తాంబోళం ఇచ్చేశాను తన్నుకు చావండి" అంటూ
'కన్యాశుల్కం' నాటకంలో అగ్నిహోత్రావధానులు పలికిన మాట తెలుగు భాషలో జాతీయమై
నిలిచిపోయింది. అతగాడి మాటే "ఆడముండలతోనా ఆలోచన?" అన్న ప్రశ్న నూట
పాతికేళ్ల క్రితం మన సమాజంలోని కొన్ని కుటుంబాల్లో ఇల్లాలి స్థానం ఏమిటో
ఒక్కముక్కలో చెప్పేసింది. కన్యాశుల్కాన్ని తలచుకోగానే తటాలున గుర్తొచ్చే
పాత్రల్లో అగ్నిహోత్రావధాన్లు ఉండకపోతేనేమీ, అతగాడి ప్రత్యేకతలు కోకొల్లలు.
సాక్షాత్తూ బావమరిది కరటక శాస్తుర్లే "మూర్ఖప గాడిద కొడుకు" అనేయడంతో,
అగ్నిహోత్రుడి గురించి పెద్దగా ఆలోచించే పని పెట్టుకోము.
చాలామంది
తండ్రుల్లాగే కొడుకు చదువుకి బోల్డంత ఖర్చయిపోతోందని బెంగ. దానితో పాటే,
కొడుకు పెద్ద ఉద్యోగస్తుడై బాగా గడించాలన్న కోరిక. అంతలోనే, తన కొడుక్కి
అంతటి ప్రయోజకత్వం ఉందా అన్న అనుమానం. నిజం చెప్పాలంటే మనిషిని చూడగానే
లోతుపాతులు నిగ్గు తేల్చి చెప్పడం అగ్నిహోత్రావధాన్లు ప్రత్యేకత. గిరీశంతో
పాటు బండి దిగిన వెంకటేశాన్ని చూడగానే, "వెధవాయా, ఈ మారైనా పరీక్ష
పాసయినవా?" అని సూటిగా విషయంలోకి వచ్చేస్తాడు. వెంకటేశం పరీక్ష తన్నేసి
ఉంటుందని ఎంత కచ్చితంగా అంచనా వేశాడో కదా.
పెద్ద
కూతురు బుచ్చమ్మ బాల్య వితంతువై పుట్టింటికి తిరిగొచ్చినా, చిన్న కూతురు
సుబ్బికి ముదుసలి వరుడితో బాల్య వివాహం తలపెట్టడమే కాదు, ఆ పెళ్లి
అల్లరయినా, బుచ్చమ్మ గిరీశంతో లేచిపోయినా తన అభిప్రాయాలని ఏమాత్రం
మార్చుకోడు అగ్నిహోత్రావధాన్లు. బుచ్చమ్మ అబ్ డక్షన్ కేసులో తప్పుడు జాతకం
దాఖలు చేసినందుకు జడ్జీ చీవాట్లేసినా చలించడు. మార్పు తేవడం కోసం
ప్రయత్నం చేసిన సౌజన్య రావు పంతులంతడి వాడిని కూడా "మీ గృహకృత్యాల వూసుకి
నేనొచ్చానా ఏవిటి? నా గృహకృత్యాల ఊసు మీకెందుకూ?" అని కడిగేయగలడు.
మనుషుల
నైజాలని పసిగట్టగలిగీ అవతలి వాళ్ళ బుట్టలో పడిపోవడం, తాను
నిర్ణయించుకున్నదే తప్ప మరో ఆలోచన చేయకపోవడం అగ్నిహోత్రావధాన్లు
వ్యక్తిత్వం. తాను నమ్మిన విషయాలకి అనుకూలంగా ఓ వాదాన్ని నిర్మించుకోవడం,
ఎవరేమన్నా లెక్కచేయక రెండో ఆలోచన జోలికి వెళ్ళకపోవడం అతగాడి లక్షణాలు. చాలా
నవలల్లో క్లైమాక్స్ లో వచ్చే ఒక్క డైలాగుకీ, సినిమాల్లో అయితే ఒక
చెంపదెబ్బకీ మారిపోయే పాత్రల్ని చూసినప్పుడు తప్పక గుర్తొచ్చే వాడు
అగ్నిహోత్రుడు. మారిపోవడం ఏమంత సులభం కాదని ఒక సజీవ పాత్ర ద్వారా
నిరూపించిన గురజాడకు - నూట పాతికేళ్ల తర్వాత - జోహార్లు!!
అగ్నిహోత్రావధానులి పెద్దకూతురు బుచ్చమ్మ కదండి. మీనాక్షి లుబ్దావధానులి కూతురు (మీ టపాలో కిందనుంచి రెండో పేరా).
రిప్లయితొలగించండి>>>మారిపోవడం ఏమంత సులభం కాదని ఒక సజీవ పాత్ర ద్వారా నిరూపించిన గురజాడ
రిప్లయితొలగించండిఅక్షర సత్యం!
జిలేబి
విన్నకోట నరసింహారావు: సరిచేశానండీ.. ఏదో పరాకు.. చాలా చాలా ధన్యవాదాలు..
రిప్లయితొలగించండిజిలేబి: ధన్యవాదాలండీ..
మీ టపా బావుంది..నేను "అగ్నిహోత్రావధానులు" పాత్ర చెయ్యడం ద్వారా చాలా తృప్తి, ప్రేక్షకుల మన్నన పొందగలిగాను..
రిప్లయితొలగించండిమీ కింది పేరాల్లో ఇంకా ఓ రెండుసార్లు మీనాక్షి అని ఉంది..సరిచెయ్యగలరు..
@Voleti: ఒహ్హ్.. అగ్నిహోత్రావధానులు వేశారా! చాలా కష్టమైన పాత్ర అంటారు.. రంగస్థలం మీద ఎక్కువసార్లు చూడలేక పోయానండీ.. 'మీనాక్షి' సరిచేశాను.. ధన్యవాదాలు..
రిప్లయితొలగించండిచమ్మక్ చల్లో అన్న మాట అన్నందుకు కోర్టు ఒక వ్యక్తికి 8 సంవత్సరాల తర్వాత శిక్ష(కొద్దిగానేలెండి) వేసింది. "చమ్మక్ చల్లో" తప్పయితే ఆ పదాన్ని ఆ పాటని తీసేయాలి కదా ? అనిపించింది. ఆడముండలతోనా ఆలోచన ? అన్న వాక్యమూ అలాంటిదే మరి ! అగ్నిహోత్రావధానులాంటివాళ్ళను మార్చడం అంత సులువేమీ కాదు. మేము మారడం ఈజీ !
రిప్లయితొలగించండిమగముండాకొడుకులతోనా పగెట్టుకోడం ?
Voleti వారూ, బహుకాల దర్శనం.
రిప్లయితొలగించండిఎన్టీఆర్, సావిత్రి నటించిన అలనాటి (1950వ దశకం) "కన్యాశుల్కం" సినిమాలో అప్పటి ప్రసిద్ధ నటులలో ఒకరైన మా విన్నకోట రామన్న పంతులు గారు పోషించిన అగ్నిహోత్రావధానుల పాత్ర రంగస్థలం మీద మీరూ వేశారా? సంతోషం. అది ఆ నాటకంలో కీలకమైన పాత్రలలో ఒకటి. నాటకరంగంలో active గా ఉండే ఊళ్ళల్లో మీ విశాఖపట్నం ఒకటి.
విన్నకోట నరసింహారావు గారు..ధన్యవాదములు..సినిమాలో చాలా బాగా జీవించారు అందరూ..కాస్త భాష మీద పట్టు ఉంటే అలవోకగా కన్యాశుల్కం లోని సంభాషణలు పలుకవచ్చు..ఆ గొప్పదనం గురజాడ వారిది...
రిప్లయితొలగించండి@నీహారిక: 'కన్యాశుల్కం' నాటకాన్ని నిషేధించాలని కూడా ఏదన్నా ఉద్యమం మొదలవుతుందేమో నండీ.. ఆ గొడవ వంకన మరికొందరు పుస్తకం చదివితే సంతోషమే.. ఉద్యమం లేవదీసిన వాళ్లకి బోల్డంత పేరు కూడా వస్తుంది.. ..ధన్యవాదాలు..
రిప్లయితొలగించండి@విన్నకోట నరసింహారావు, వోలేటి: మీ ఇద్దరికీ మరోమారు ధన్యవాదాలండీ.. 'కన్యాశుల్కం' గురించి మీరు ఇక్కడ మాట్లాడుకోడం సంతోషం కలిగించింది.
మీ టపా చూసింతర్వాత, మళ్ళా మరోసారి కన్యాశుల్కం పుస్తకం తిరిగెయ్యాలనిపించింది. బాగా ఔపాసన పట్టారు. హాస్య నటుడు ఏ వీ యస్, కన్యాశుల్కం సినిమాలో ఈ పాత్ర వేసిన విన్నకోట రామన్న పంతులు గార్ని అనుకరించినట్లు అనిపిస్తుంది (ముఖ్యంగా మూతి).
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండి@Madhav Kandalai : తప్పకుండా చదవండి.. ఏవీఎస్ ఒక్కరే కాదండీ, చాలామంది అనుకరించారు పంతులు గారిని .. అన్నట్టు 'ఔపోసన' మాట.. విద్యార్థినే.. ధన్యవాదాలు.