"సత్యాన్ని దాచిపెట్టే మాయాజాలాన్ని ఆవరణ అనీ అసత్యాన్ని
ప్రతిబింబించే ప్రయత్నాన్ని విక్షేపమనీ అంటారు. వ్యక్తిస్థాయిలో సాగే ఈ
కార్యకలాపాన్ని అవిద్య అనీ, సామూహిక, ప్రపంచ స్థాయిలో జరిగే కార్యాన్ని మాయ
అనీ అంటారు. వేదాంతులు చెప్పే ఈ పరికల్పనను బౌద్ధ దార్శనికులు కూడా
అంగీకరించారు.." అంటారు సుప్రసిద్ధ కన్నడ రచయిత సంతేశివర లింగణ్ణయ్య (ఎస్.
ఎల్) భైరప్ప తన నవల 'ఆవరణ' కి రాసిన ప్రవేశికలో. 2007 లో తొలిసారి
ప్రచురితమైన ఈ కన్నడ నవల 2015 నాటికి నలభై రెండు పునర్ముద్రణలు పొందింది.
ఎమెస్కో సంస్థ ఈ ఏడాది ఏప్రిల్ లో తెలుగు అనువాదాన్ని మార్కెట్లోకి తెచ్చింది.
చరిత్ర
రచనని ఇతివృత్తంగా తీసుకుని రాసిన రాసిన ఈ నవలలో రచయిత రెండు కథలని పడుగు పేకలుగా అల్లారు. మొదటిది రజియాగా మారిన కథానాయిక లక్ష్మి కథ కాగా, రెండవది
చరిత్రని ఎంతో ఆసక్తితో పరిశోధించిన ఆమె తండ్రి నరసింహయ్య ఒక పుస్తకాన్ని
రచించడం కోసం తయారుచేసి పెట్టుకున్న నోట్సు. రెండు కథలూ సమాంతరంగా నడిచి
ఒకే సారి ముగింపుకి చేరుకునే విధంగా రూపుదిద్దడం వల్ల నవల ఆసాంతమూ ఆపకుండా
చదివిస్తుంది. చదువుతున్నంతసేపూ తలెత్తే అనేకానేక ప్రశ్నల్లో చాలావాటికి
నవల చివర్లో రచయిత ఇచ్చిన పుస్తకాల జాబితా జవాబుని అందిస్తుంది.
కర్ణాటకలోని
కునిగళ్ ప్రాంతానికి చెందిన నరసింహయ్య కూతురు లక్ష్మి. మొదటినుంచీ తండ్రి
నుంచి ప్రోత్సాహం ఉండడంతో, డిగ్రీ తర్వాత ఆమె ఫిలిం మేకింగ్ కోర్సులో
చేరుతుంది. అక్కడే ఆమెకి అమీర్ పరిచయం అవుతాడు. కొన్నాళ్ళకి పరిచయం ప్రేమగా
మారి, ఇద్దరూ పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. ఊహించని విధంగా నరసింహయ్య ఆ
వివాహానికి అభ్యంతరం చెబుతాడు. "రేపు నీకు పుట్టే పిల్లలు దేవాలయాలని
ధ్వంసం చేసేవాళ్ళు అవుతారు" అంటాడు. తండ్రితో బంధం తెంచుకుని అమీర్ ని
పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది లక్ష్మి.
అమీర్
తనకి మతం మీద పెద్దగా నమ్మకం లేదనీ, కానీ తన తల్లిదండ్రుల కోసం ఆమె ఇస్లాం
తీసుకోక తప్పదనీ స్పష్టంగా చెబుతాడు. కేవలం పెద్దలకోసం చేసుకోవాల్సిన
సర్దుబాటు కాబట్టి ఆమె అంగీకరిస్తుంది. ఆమె ఊరివాడే అయిన అభ్యుదయవాద మేధావి
వర్గానికి చెందిన ప్రొఫెసర్ శాస్త్రి లక్ష్మి నిర్ణయాన్ని అభినందిస్తాడు.
రజియాగా మారి అమీర్ ని వివాహం చేసుకుంటుంది. వివాహం తర్వాత ఆమె మీద ఆంక్షలు
మొదలవుతాయి. వస్త్రధారణ మొదలు, నిత్యం క్రమం తప్పకుండా నమాజు చెయ్యడం వరకూ
అమీర్ ఇంటి ఆచారాలు అన్నీ పాటించాల్సి వస్తుంది. ఒకే ఒక్క ఊరట ఏమిటంటే,
ఆమె సినిమాల్లో పని చేయడానికి అభ్యంతర పెట్టరు ఇంట్లోవాళ్ళు.
సృజనాత్మక
రంగంలో స్త్రీలు తక్కువగా ఉన్న రోజులు కావడంతో పాటు, వాళ్ళ ఆదర్శ వివాహం
కూడా ఒక ఆకర్షణగా మారి అమీర్-రజియాలకి ఎక్కువ అవకాశాలు తెచ్చిపెడుతూ
ఉంటుంది. వాళ్ళకి పుట్టిన బిడ్డ నజీర్ తాతయ్య-నాయనమ్మల పర్యవేక్షణలో పెరిగి
పెద్దవాడవుతాడు. బాబ్రీ మసీదు అల్లర్ల నేపథ్యంలో, ప్రభుత్వం ప్రజల మధ్య
ఆవేశాలు పెరగకుండా ఉండడం కోసం కొన్ని ప్రచార చిత్రాలు నిర్మించాలని
సంకల్పించి, ఆ ప్రాజెక్టుని అమీర్-రజియాలకి అప్పగిస్తుంది. మొదటి
డాక్యుమెంటరీ హంపీ శిధిలాలను గురించి. హంపి శిధిలమవ్వడానికి కారణం ముస్లిం
నాయకులు కాదు, శైవ-వైష్ణవ శాఖల మధ్య వైరమే అని చెప్పే విధంగా ఉండాలని
ఆదేశాలు వస్తాయి. రజియా స్క్రిప్ట్ రాస్తే అమీర్ నిర్మాణం, దర్శకత్వం
చూడాలి. కానీ, ఆమె స్క్రిప్ట్ రాయలేకపోతుంది.
అదే
సమయంలో తన తండ్రి నరసింహయ్య మరణ వార్త తెలియడంతో సొంతూరికి ప్రయాణమవుతుంది
రజియా. కూతురి వివాహం తర్వాత, నరసింహయ్య తన జీవితమంతా పరిశోధనల్లోనే
గడిపాడనీ, ముఖ్యంగా హిందూ దేవాలయాల మీద జరిగిన దాడుల్ని విశేషంగా
పరిశోధించి ఒక పుస్తకం రాసేందుకు నోట్సు తయారు చేసుకున్నాడనీ తెలుస్తుంది
ఆమెకి. అంతే కాదు, ఇల్లు, ఆస్తి కూతురి పేరే పెట్టి మరణిస్తాడు నరసింహయ్య.
తండ్రికి తాను ఏకైక సంతానం కనుక ఆస్థి నిమజ్జనం చేయాల్సిన బాధ్యత తన మీద
ఉందని భావిస్తుంది రజియా. అందుకోసం, ప్రాయశ్చిత్తం చేసుకుని మళ్ళీ
లక్ష్మిగా మారుతుంది. ఆస్థి నిమజ్జనం అనంతరం తండ్రి రాసిన నోట్సు చదవడం
మొదలు పెడుతుంది.
ముస్లింలు బందీలుగా
పట్టుకెళ్లిన ఒక రాజపుత్రుడి కథ అది. అతన్ని నపుంసకుడిగా మార్చి, అనేక
లైంగిక దాడులు చేసి, అనంతరం రాణివాసపు జనానాలో పనివాడిగా చేరుస్తారు.
ఔరంగజేబు పాలనని దగ్గర నుంచి చూసిన ఆ రాజపుత్రుడి అనుభవాలు ఒక పక్క, భర్త
నుంచి, కొడుకు నుంచి, ప్రొఫెసర్ శాస్త్రి నుంచి అనేకరూపాల్లో లక్ష్మి
ఎదుర్కొన్న ఒత్తిడులు మరోపక్క సాగుతూ కథనాన్ని వేగంగా నడిపిస్తాయి. నజీర్
ఛాందసం, శాస్త్రి ఆలోచనలు-ఆచరణల మధ్య బోలుతనం, మతానికి, భార్యకి మధ్య అమీర్
సంఘర్షణ, తండ్రి యెడల లక్ష్మికి కలిగే పశ్చాత్తాపం ఇవన్నీ పుస్తకాన్ని
ఆపకుండా చదివిస్తాయి. అరిపిరాల సువర్ణ తెలుగు అనువాదం ఏమాత్రం సాఫీగా లేదు.
తాను శ్రమ పడి, పాఠకుల్ని శ్రమ పెట్టారు అనువాదకురాలు.
చరిత్రని
సమగ్రంగా అర్ధం చేసుకోవాలి అంటే నాణేనికి రెండువైపులా చూడాలి అని
నమ్ముతాన్నేను. నవల ప్రాతిపదికలోనే ఇది వామపక్ష దృష్టికోణపు చరిత్ర మీద
ఎక్కుపెట్టిన విమర్శ అని తేటతెల్లం అవుతుంది. తాను చెప్పాలనుకున్న
విషయాన్ని ఎలాంటి తడబాటు లేకుండా స్పష్టంగా చెప్పారు భైరప్ప. బలమైన
వ్యక్తిత్వం ఉన్న పాత్రలు కావడంతో కథనం ఆసాంతమూ బిగువుగా సాగింది.
మతం-రాజకీయాలు-కళలు పరిధిలోనే మొత్తం నవలంతా సాగింది. ప్రధానకథ, ఉపకథా
పోటాపోటీగా సాగాయి. చరిత్రని గురించి భిన్న కోణాన్ని తెలుసుకోవాలి అనుకునే
వారు తప్పక చదవాల్సిన నవల ఇది. (పేజీలు 328, వెల రూ. 200, అన్ని ప్రముఖ
పుస్తకాల షాపులు).
చాలా అద్భుతంగా ఉంది మీ విశ్లేషణ. వెంటనే పుస్తకం చదవాలనిపిస్తోంది సార్!!
రిప్లయితొలగించండిసార్... దయచేసి ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుందో చెప్పండీ..ఎంత మంది పుస్తకాల షాపు వాళ్లని అడిగినా లేదంటున్నారు. (అఫ్ కోర్స్ నేను కంచిలో ఉంటా కనుక ఫోన్లోనే అనుకోండి).
రిప్లయితొలగించండి@నీలకంఠ: ఎమెస్కో వాళ్ళు వేశారండీ.. మీకు దగ్గర్లో అంటే తిరుపతి 'విశాలాంధ్ర' లో దొరికే అవకాశం ఉంది, ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిధన్యవాదాలు సార్... నేను మొత్తానికి ఆ పుస్తకం తెప్పించుకుంటున్నాను..!! (ఎమెస్కో విజయవాడ వారి నుంచి)!!
రిప్లయితొలగించండిధన్యవాదాలు మరలా...నాకు తెలిసి చరిత్ర మీద వచ్చే కాల్పనిక సాహిత్యమే తక్కువ. అందులోనూ కొత్త దృక్కోణంతో రాసినవయితే ఇంకా తక్కువ.
తిరిగి మీకు ధన్యవాదాలు సార్.. ఇంత మంచి పుస్తకం పరిచయం చేసి చదివేలా చేసినందుకు...మీరు చెప్పింది సరిగ్గానే ఉంది. అనువాదం ఏ మాత్రం సాఫీగా లేదు. (జీవంతంగా, రాష్ట్రం, ఏకత ఇలాంటి పదాలు చదివితే ఇది హిందీ నుంచి చేసిన అనువాదం ఏమో అని కూడా అనిపించింది!)
రిప్లయితొలగించండి'నాకు తెలిసి చరిత్ర మీద వచ్చే కాల్పనిక సాహిత్యమే తక్కువ' - కొంతలో కొంత మీకు రాబోయే బాలకృష్ణ 'ఎన్టీఆర్' చిత్రం ఆ లోటును తీర్చే అవకాశం ఉంది లెండి. మీరు దీన్ని దయచేసి మరో కోణంలో చూడకండి ఎందుకంటె రేపు ఖచ్చితంగా జరగబోయేది అదే గనుక.
రిప్లయితొలగించండి@నీలకంఠ: సాధారణంగా ఎమెస్కో అనువాదాలు బాగుంటాయండి. వాళ్ళ దగ్గర మంచి అనువాదకులు ఉన్నారు అనుకుంటూ ఉంటాన్నేను.. కానీ, ఈ పుస్తకం విషయంలో ఎందుకు శ్రద్ధ తీసుకోలేదు మరి.. మీరు చదవడం, మీకు నచ్చడం చాలా సంతోషంగా ఉంది.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@అజ్ఞాత: అర్ధమయ్యిందండీ.. ఇంకో నెలలో తెలుస్తుంది కదా.. ధన్యవాదాలు..
@Ajnaatha---హ హ హ
రిప్లయితొలగించండి(క్షమించాలి! నాకు ఎంచేతనో 'నాలెడ్జి' కి సంబంధించిన 'జ్న'టయిపింగులో రావడం లేదు!! మీరు ప్రస్తావించిన సినిమాకి, ఈ తప్పుకు ఏ సంబంధమూ లేదు! మీకేదయినా అనిపిస్తే కేవలం కాకతాళీయం మాత్రమే సుమా!!)
ధన్యవాదాలు మురళి గారూ!
రిప్లయితొలగించండి