హరిద్వారంలో మఠం కట్టించడమే బైరాగి లక్ష్యం.
అందుకోసం ఎక్కడ డబ్బొచ్చినా కాదనకుండా స్వీకరిస్తాడు. కాకపొతే, ఆ మఠం పనులు
ఎప్పుడు మొదలవుతాయో, ఎప్పటికి పూర్తవుతాయో నరమానవుడికి తెలియదు. సిద్ధుడు
కాబట్టి బైరాగికి మాత్రమే తెలుసు. బైరాగికి ఆదీ అంతం లేదు. నాటికి ఆరొందల
ఏళ్ళ క్రితం నాటి వేమన బైరాగికి తాత. రెండొందల యాభై ఏళ్ళ క్రితం కాశీలో
జరిగిన ఓ సంఘటనకి బైరాగి ప్రత్యక్ష సాక్షి. చూడగానే 'సిద్ధుల్ని' పోల్చగల
రామచంద్రపురం సారా దుకాణదారుడు బైరాగిని పోల్చి, ఆతిధ్యం ఇస్తాడు. కాళీ
మందిరం దగ్గరున్న సారాయి దుకాణం దగ్గర బైరాగికి భక్త బృందం తయారవుతుంది. ఆ
బృందానికి నాయకుడు సారాయి దుకాణదారే.
"అమృతమనేది ఏమిటి?
సారాయే! నాడు ఇదే గదా తాగడానికి దేవాసురులు తన్నుకు చచ్చారు" అంటూ భక్తులకి
జ్ఞానబోధ చేసే బైరాగి, తనకి తెలిసిన రస విద్యని ఉపయోగించి బంగారం తయారు
చేసి తన శిష్యులకి కానుగ్గా ఇస్తానని ఊరిస్తూ ఉంటాడు. ఆ బంగారంతోనే మఠం
కట్టొచ్చు కదా అని అడిగిన అజ్ఞానపు శిష్యుడితో "మేం చేసే స్వర్ణం మేమే
వాడుక చేస్తే తల పగిలిపోతుంది" అని సెలవిస్తాడు. తనబోటి సిద్ధులకి చలీ,
వేడీ, సుఖం దుఃఖం లేవని కూడా జ్ఞానం పంచుతాడు. ఇంతా చేసి బైరాగి లౌకిక
విషయాలకి పూర్తిగా దూరంగా ఉంటాడనుకోవడం పొరబాటు. మాయగుంట ఖూనీ కేసులో
సాక్ష్యం చెప్పడానికి సిద్ధమైపోతాడు. ఏవైనా దొరికితే, హరిద్వారంలో మఠానికి
పనికొస్తాయని!
ఎంతటి
వాళ్ళనీ తన మాట చాతుర్యంతో ఆకర్షించడం, ఆ పూటకి పబ్బం గడుపుకోవడం బైరాగికి
వెన్నతో పెట్టిన విద్య. కాశీ కబుర్లు, హరిద్వారం విశేషాలు ఎప్పుడూ నాలిక
చివరనే ఉంటాయి. ఎలాంటి వాళ్ళనీ ఆకర్షించడానికి బంగారం తయారు చేసే రసవిద్య
ఉండనే ఉంది. దుకాణదారు లాంటి వాళ్ళు ఒక్క అనుభవంతోనే బైరాగి మాయ నుంచి
బయటపడితే, హెడ్ కానిస్టీబు లాంటి వాళ్ళు మాత్రం ఎప్పటికీ అతగాడి మహిమలని
నమ్ముతూనే ఉంటారు. అంజనం వేసి మాయగుంట జాడ కనుక్కుంటానని కానిస్టీబుకి
మాటిచ్చిన బైరాగి, అటు తర్వాత కనిపించకుండా మాయమైపోతే, ఆ నాటకాన్ని
కొనసాగించే ప్రయత్నం చేస్తాడు పూజారి గవరయ్య. అవసరాలు గడుపుకోడానికి,
కష్టపడకుండా సౌకర్యవంతమైన జీవనం గడపడానికి మతాన్ని, అమాయక భక్తుల్ని
అడ్డుపెట్టుకునే వాళ్ళు అన్ని కాలాల్లోనూ ఉన్నారని చెబుతుంది 'కన్యాశుల్కం'
నాటకంలో బైరాగి పాత్ర.
చూడగానే నేను సిద్ధుల్ని పోలుస్తాను అని సారాదుకాణదారుడంటే చుక్కేసేవోళ్ళని మాబాగా పోలుస్తావు అంటాడు మునసబు 😀.
రిప్లయితొలగించండిబైరాగి లాంటి కపటయోగులు అన్ని కాలాల్లోనూ ఉన్నారని "కన్యాశుల్కం" నాటకం చెబుతోంది అన్న మీ విశ్లేషణ అక్షరాలా నిజం.
ఏది ఏమైనా బైరాగి సీను మా విశాఖపట్నంలో జరగడం వలన తెలియని మధురానుభూతి కలుగుతుంది..
రిప్లయితొలగించండి@విన్నకోట నరసింహారావు : మాట్లాడింది తక్కువే అయినా, మునసబు మాటలు అక్షర సత్యాలండీ.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@Voleti: అవునండీ, పన్లోపనిగా సింహాచలం, ఉపమాక ప్రస్తావన కూడా వచ్చేసింది :) ..ధన్యవాదాలు..