మంగళవారం, సెప్టెంబర్ 05, 2017

అసిరి

'కన్యాశుల్కం' నాటకాన్ని మొట్టమొదటి సారి చదివినప్పుడు నేను పెద్దగా పట్టించుకోని పాత్రల్లో లుబ్ధావధాన్లు ఇంటి నౌకరు 'అసిరి' పాత్ర ఒకటి. ఓ అర్ధరాత్రి వేళ మూకుట్లో మీనాక్షి పెట్టిన వడపప్పు, కొబ్బరి ముక్కలు తింటున్న రామప్పంతుల్ని"దెయ్యానికెత్తింది తింతున్నావయ్యా?" అని అడిగి హడలగొట్టడం మాత్రం బాగా గుర్తుండిపోయింది. తర్వాత కూడా కొన్నాళ్ల పాటు ప్రధాన పాత్రల తాలూకు మెరుపుల ముందు, వెనకెక్కడో నీడలో ఉన్న అసిరి కనిపించలేదు. ఆ తర్వాతి కాలంలో 'కన్యాశుల్కం నాటకంలో అసిరి పాత్ర' అనే విషయం మీద విశ్వవిద్యాలయ స్థాయిలో పరిశోధన జరిగిందని విన్నప్పుడు పెద్దగా ఆశ్చర్యం కలగలేదు.

ఏడంకాల 'కన్యాశుల్కం' నాటకంలో పంచమాంకంలో ప్రవేశిస్తాడు అసిరి. అసలా అంకం ప్రారంభమే  భయంతో ఉలిక్కిపడి నిద్రలేచిన రామచంద్రపురం అగ్రహారీకుడు లుబ్ధావధాన్లు "అసిరిగా! అసిరిగా!" అని పిలవడంతో అవుతుంది. "యేటి బాబూ? యేటి బాబూ?" అంటూ తలుపు తడతాడు అసిరి. ఇంతలో అవధాన్లు కూతురు మీనాక్షి వస్తుంది. తలుపు తెరిచిన అవధాన్లు "వెధవా నువ్వు లోపలికి రాకు" అని కటువుగా అంటే, "నాను పిలుస్తొస్సినాను" అని చెప్పి తప్పుకుంటాడు. యజమాని తిడితే పడి ఊరుకోవడమే కాదు, అతగాడి బలహీనతలతో ఆడుకోడమూ తెలుసు అసిరికి. లుబ్ధావధాన్లు పెళ్లాడిన మాయగుంట ఇంట్లో నుంచి మాయమవ్వగానే 'ఆమె మనిషి కాదు కామినీ పిశాచం' అని చెప్పి, పూజారి గవరయ్య సీసాలో బంధించిన సంఘటన ఇందుకు ఉదాహరణ.

మాయగుంటనీ ఆమె (మొదటి) మొగుణ్ణీ సీసాలో బంధించిన గవరయ్య, ఆ సీసా ఇద్దరు మనుషుల బరువుందో లేదో చూసుకోమంటాడు అవధాన్లుని. లుబ్ధావధాన్లుకి, రామప్పంతులుకీ కూడా ఆ సీసా ముట్టుకోవడం అంటే వల్లమాలిన భయం. ఇక మిగిలిన మగాడు అసిరి ఒక్కడే. "అసిరిగా నువ్వు పట్టుకో" అని గవరయ్య అనగానే, "నాకు బయవేటి? పైడితల్లి సల్లగుండాలి" అంటూ గ్రామదేవత మీద గట్టి నమ్మకంతో సీసా అందుకుంటాడు. దేవభాషలో దేవతారాధన చేసే బుగతలకి లేని ధైర్యం, మూఢ భక్తితో పైడితల్లిని కొలిచే అసిరిలో మెండుగా ఉంది. అంతేనా, సీసా పట్టుకోగానే "ఓలమ్మ! యింత బలువుందోస్సి!" అని ఆశ్చర్యం ప్రకటిస్తాడు. సీసా బరువు కొలిచే ధైర్యం తన యజమానికి లేదనీ, ఆవిషయంలో తన మాటే ఖరారనీ బాగా తెలుసతనికి.

యజమాని రహస్యాలు కాపాడవలసిన బాధ్యత నౌఖరు మీద ఉందని అసిరికి తెలుసు. అంతే కాదు, బయటి వాళ్లకి తాను చేసే సాయాలకి గాను ప్రతిఫలం పుచ్చుకోడమూ వెన్నతో పెట్టిన విద్య. అర్ధరాత్రి వేళ మీనాక్షిని వెతుక్కుంటూ వచ్చిన రామప్పంతులు, వాకిట్లో అసిరిని చూసి "నిమ్మళంగా ఉన్నావురా?" అని పలకరిస్తే, "యేట్నిమ్మళం బాబూ, సానమ్మొచ్చింది. ఈయమ్మ కాసి సూడ్డం మానేసినారు. డబ్బిచ్చే దాతేడి బాబూ?" అని నిష్టూరమాడి, మీనాక్షిని రహస్యంగా పిలుచుకురాడానికి గాను రామప్పంతులు దగ్గరనుంచి రెండు రూపాయలు పుచ్చుకుంటాడు. మధురవాణి మంచి చెడ్డలు విచారించబోయిన పంతులుతో "యవడెల్నా ఈపు పెట్ల గొడతాది బాబూ. మొన్న హెడ్డు గారెల్తే ఏపి కూన్ని ఉసుగొలిపింది కాదా?" అని అతికినట్టు అబద్ధం ఆడేస్తాడు.

అసిరి వయసు ఎంతయి ఉంటుంది? అన్న ప్రశ్న చాలాసార్లే వచ్చింది. మొదట్లో చిన్న కుర్రాడు అయి ఉంటాడు అనిపించినా, రానురాను అది తప్పని, బాగా పెద్దవాడేననీ అర్ధమయ్యింది. ఎవరితో ఎలా మసులుకోవాలో తెలియడం, తనకి రావాల్సింది, రాగలిగే చోటునుంచి రాబట్టుకోవడం ఇవన్నీ అనుభవజ్ఞుడికే చేతనవుతాయి అనిపించడమే ఇందుకు కారణం. పైగా, చివరి అంకంలో మాయగుంట విషయంలో సాక్ష్యం చెప్పమని హెడ్ కానిస్టేబులు రొక్ఖాయిస్తున్నప్పుడు, "మా ముసల్దోనికి సావొచ్చిందట - కబురెట్టింది బాబూ" అంటాడు. ఇక్కడ 'ముసల్ది' అంటే భార్య అయ్యే అవకాశమే ఎక్కువ కనిపిస్తోంది కదా.

"వెధవా, సాక్ష్యం ఇవ్వందీ వెళ్ళిపోతావా యేమిటి?" అని హెడ్ ప్రశ్నిస్తే, ఏమాత్రం తొణక్కుండా "సాచ్చీకం అయిందాకా బతికుంతాదా బాబు?" అని జవాబిస్తాడు. కోర్టు వ్యవహారాలు కూడా అసిరికి బాగా తెలుసని తెలుస్తుంది మనకి. "మీ నౌకరీకి దణ్ణం. పోతాను బాబూ! ఆయమ్మ గోడ గెంతడం నేను సూపులేదు, బాబూ! గవరయ్య గోరు దెయ్యాన్ని సీసాలో ఎడితే, గోడ గెంతడం యేటి బాబూ వొట్టి అబద్ధం! నాను సూపులేదు బాబు" అని కరాఖండీగా చెప్పేస్తాడు అసిరి. హెడ్ కన్నా ఇన్స్పెక్టర్ కి పవర్ ఎక్కువనీ, తను ఇన్స్పెక్టర్ పక్షాన మాట్లాడాలి తప్ప, హెడ్ వైపు కాదనీ బాగా తెలుసు అసిరికి. ఇందుకు సందేహం కనిపించడం లేదు.

విద్యాగంధం ఉన్న పాత్రల చేత శుద్ధ వ్యవహారికం మాట్లాడించిన గురజాడ, నిరక్షరాస్యుల చేత మాత్రం ఉత్తరాంధ్ర మాండలీకం పలికించారు. 'కన్యాశుల్కం' నాటకంలో ఉన్న అలాంటి కొన్ని పాత్రల్లో అసిరి పాత్ర ప్రముఖమైనది. యాజమానుల రహస్యాలు తన గుప్పిట్లో ఉన్నా ఎవరికీ కీడు చేయని వాడు, తన నెత్తిన పడబోతున్న సమస్య నుంచి సులువుగా బయట పడే చాకచక్యం ఉన్న వాడు, ఇంకా ఇప్పటి సినిమా భాషలో చెప్పాలంటే ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో బాగా తెలిసిన వాడు అసిరి. కేఎన్వై పతంజలి సృష్టించిన 'అరసవిల్లి' పాత్ర లోనూ, సి. రామచంద్ర రావు సృష్టించిన మాంకూ, బెల్లా లాంటి పాత్రల్లోనూ అసిరి ఛాయలు బాగా కనిపిస్తాయి.

(అన్నట్టు 'కన్యాశుల్కం' లో రెండో అసిరి ఉన్నాడు, గమనించారా? అయితే, ఈ అసిరి ఒకే ఒక సంభాషణలో వినిపిస్తాడు తప్ప ఎక్కడా కనిపించడు. ఇతను కూడా నౌకరే. నాటకం ద్వితీయాంకంలో కృష్ణరాయపురం అగ్రహారంలో బుచ్చమ్మ తన తమ్ముడు వెంకటేశాన్ని "గిరీశం గారికి ఉద్యోగం కాలేదేమి?" అని అడిగినప్పుడు, అతగాడు ఉద్యోగం అంటే గొప్ప కాదనీ, సర్వెంట్ అనీ, నౌఖర్ అనీ చెబుతూ "మన గేదెని కాసే అసిరిగాడు ఒక సర్వెంట్. మన ఇల్లు తుడిచే అంకి ఒక సర్వెంట్" అని అక్కగారికి జ్ఞానబోధ చేస్తాడు).

6 కామెంట్‌లు:

  1. @Voteli: అయ్యబాబోయ్.. ఔపోసన చాలా పెద్ద మాటండీ.. విద్యార్థిని అంతే.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  2. @పద్మార్పిత: 'కన్యాశుల్కం' నాటకం బహు గొప్పదండీ.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి