శనివారం, ఏప్రిల్ 06, 2013

చాసో కథలు

తెలుగు సాహిత్యంలో 'కథకులకి కథకుడు' అని పేరు పొందిన వాడు చాసో గా పిలవబడే చాగంటి సోమయాజులు. తెలుగు కథకి దిశానిర్దేశం చేసిన కొద్ది మంది ప్రముఖులలో ఈయన ఒకరు. 'ఎంపు' 'వాయులీనం' 'కుంకుడాకు' 'కుక్కుటేశ్వరము' ఇవి చాసో పేరు చెప్పగానే మొదటగా గుర్తొచ్చే కథలు. కేవలం ఈ నాలుగు కథలు మాత్రమే కాదు, 1943-79 మధ్య కాలంలో చాసో రాసిన కథల నుంచి ఎంపిక చేసిన నలభై కథలతో విశాలాంధ్ర వెలువరించిన తాజా సంకలనం 'చాసో కథలు.' మళ్ళీ మళ్ళీ చదువుకునే కథలు ఇవి. అంతే కాదు, కొత్తగా కథలు రాయాలనుకునే వారికి ఒక రిఫరెన్స్ కూడా.

'ఎంపు' కథ మీద చాలా చర్చే జరిగింది. కొందరు ప్రముఖులు కథని బాగా మెచ్చుకుంటే, మరికొందరు తీవ్రంగా విమర్శించారు. ఓ బిచ్చగాడి కూతురు మరో బిచ్చగాడితో ప్రేమలో పడింది. ఆమె తండ్రి ఆమెకో పెళ్లి సంబంధం  తెచ్చాడు.. ఆ పెళ్లి కొడుకూ యాచకుడే. ఆ ఇద్దరిలోనూ ఆమె ఎవరిని ఎంచుకుంది? ఈ ప్రశ్నకి జవాబే 'ఎంపు' కథ. పాఠకులని ముగింపు దగ్గర పట్టి ఆపేసే కథ ఇది. అరవయ్యేళ్ళ క్రితపు మధ్యతరగతి జీవన సరళిని పట్టి చూపించే కథ 'వాయులీనం,' ఈ సంపుటిలో మొదటి కథ. భార్యాభర్తల అనుబంధం, అభిరుచులకీ-అవసరాలకీ మధ్య జరిగే పోటీలో గెలుపు వేటిది అన్నదే కథాంశం.

వ్యవస్థ మీద కోపం కలిగించి, ఆ వెంటే ఆలోచనల్లోకి నెట్టే కథ 'కుంకుడాకు.' వంట చెరుకు కోసం ఎండిన కుంకుడాకులు ఏరుకునే ఓ పేదింటి పిల్లకి ఎదురైన అనుభవమే ఈ కథ. "పేదరాసి పెద్దమ్మా... పెద్దమ్మ కొడకా... కొడుకు చేతి గొడ్డలా!" పాడుకుని, ఒక్క క్షణం ఆగి "ముక్త పదగ్రస్తం కదూ అలంకారం?" అనుకునే మనిషిని పిచ్చివాడు అనుకోగలమా? కానీ, ఆ ఊళ్ళో పిచ్చివాడిగా చెలామణి అవుతున్న ఆ విద్యావంతుడి కథే 'పర బ్రహ్మము.' కేవలం ఉత్తరాలతోనే నడిపిన కథ 'బదిలీ.' చాసో 1945 లో రాశారు ఈ కథని.. కానీ ఇవాల్టికీ సమకాలీనమే.. ఈ ఒక్క కథే కాదు, సంపుటంలో ఏ ఒక్క కథనీ 'అవుట్ డేటెడ్' అనలేం మనం.


ఏ ఒక్క కథకీ మరో కథతో రేఖామాత్రపు పోలిక కూడా ఉండకపోవడం చాసో కథల ప్రత్యేకత. ఈ లక్షణమే చాసో ని కథకులకి కథకుడిగా నిలిపిందేమో. కేవలం ఉత్తరాంధ్ర రచయితల మీదే కాదు, చాసో తర్వాతి తరాల తెలుగు కథకులు అందరిమీదా ఎంతో కొంత ఆయన ప్రభావం ఉందనడం సత్యదూరం కాదు. 'చాసోని మెప్పించే కథ రాయడం' అన్నది, పతంజలి లాంటి ఎంతోమంది రచయితలకి తొలినాళ్ళలో ఎదురైన సవాలు. ఎలా ఉంటాయి చాసో కథలు? ఏ ఒక్క కథా కూడా నిడివిలో నాలుగైదు పేజీలు మించదు. ప్రారంభ వాక్యాలు, కథకీ, పాఠకుడికీ మధ్య రచయిత సూత్రధారి పాత్ర పోషించడం లాంటివి ఏవీ ఉండవు. నేరుగా కథలోకి వెళ్ళిపోవడమే..

"బక్క చిక్కిన ముసలమ్మ అస్థి పంజరం కట్టె పురుగులాగ ఊగిసలాడ్డం మొదలు పెట్టింది. పత్తిభోగల్లాటి కళ్ళెత్తి చూసింది. ఆ కళ్ళకి చత్వారం లేదు. మధ్య కాలం లో వచ్చిన చత్వారం మధ్య కాలంలోనే పోయింది. ముసలమ్మ చూసీ చూడడమే పోల్చింది. ఒక నిట్టూర్పు విడిచి ఈశ్వరుణ్ణి తలచుకుని మనస్సు కట్టుదిట్టం చేసుకుంది. 'ఎవరివి నాయనా నువ్వు?' అని, తనే కాస్త బంధుత్వం కలుపుతూ ప్రశ్నించింది. 'మనం మనం పాత వాళ్ళమే. మళ్ళా వచ్చా ముసలమ్మా!' అన్నాడు ఎదురుగుండా ఉన్న ఉద్యోగస్తుడు. ఏమిటి సాధనం? శ్రీమన్నారాయణ మూర్తీ! అని దేవుణ్ణి సంబోధించుకుంది. కుక్కుటేశ్వరుడి ఆజ్ఞ లేనిదే కుక్కయినా మొరగదు అని ధైర్యం చెప్పుకుంది." ..'కుక్కుటేశ్వరము' కథలో ప్రారంభ వాక్యాలు ఇవి.

'వెలం వెంకడు' 'ఎందుకు పారేస్తాను నాన్నా' కథలు చదువు ప్రాముఖ్యత చెబితే, 'లేడీ కరుణాకరం' 'పోనీ తిను' కథలు వేశ్యావృత్తి నేపధ్యంగా సాగేవి. పుస్తకం పక్కన పెట్టాక మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చే కథలే అన్నీ. చెప్పదలచుకున్న విషయం పట్ల రచయిత స్పష్ట దృష్టి, చేసిన పరిశీలన, ముందుచూపు.. ఇవన్నీ ఆశ్చర్య పరుస్తాయి పాఠకులని. ఇవి మాండలీకం కథలు కాదు, కానీ కథ చెప్పడంలో ఉత్తరాంధ్ర నుడికారం తళుక్కున మెరుస్తుంది. ఒకటి రెండు వాక్యాల్లో ప్రకృతిని వర్ణించడంలో చాసో అందెవేసిన చేయి. ముందే చెప్పినట్టు, మళ్ళీ మళ్ళీ చదవాల్సిన కథలే ఇవన్నీ.. ('చాసో కథలు,' పేజీలు 220, వెల రూ. 125, విశాలాంధ్ర ప్రచురణ, అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ దొరుకుతోంది).

3 కామెంట్‌లు:

  1. వాయులీనం, ఎందుకు పారేస్తాను నాన్నా... నాకెంతో ఇష్టమైన కథల్లో ముఖ్యమైనవి. (అలా అని మిగతావి నచ్చలేదని కాదు) ఏలూరెళ్ళాలి కథ వదిలేశారే.. దాని మీద కూడా చాలా చర్చ జరిగినట్టుంది కదా...

    రిప్లయితొలగించండి
  2. Felt very happy to read about the stories u discussed. Thanks.

    రిప్లయితొలగించండి
  3. @పురాణపండ ఫణి: ఆ ఒక్క కథ గురించీ వేరే పోస్టు రాయాలని ఓ ఆలోచన అండీ.. అందుకని ప్రస్తావించలేదు ఇందులో... ధన్యవాదాలు

    @అనూ: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి