ఆదివారం, ఏప్రిల్ 28, 2013

సినిమా...సినిమా...

భారతీయ సినిమాకి నూరేళ్ళు అని పేపర్లు బాగా హడావిడి చేస్తున్నాయి... మరీ ముఖ్యంగా తెలుగు పేపర్లలో ఈ హడావిడి కొంచం ఎక్కువే కనిపిస్తోంది. భారతదేశంలో సినిమా నిర్మాణం మొదలై వంద సంవత్సరాలు అయిందన్న మాట. తొలి అడుగులని గుర్తు చేసుకోవడం మొదలు, ఈ వందేళ్ళ లోనూ సాధించిన ప్రగతి, వచ్చి చేరిన అనేకానేక మార్పులు... వీటన్నింటి మీదా వ్యాసాల పరంపర కనిపిస్తోంది. తమిళ పరిశ్రమ సంబరాలకి సిద్ధం అవుతోంది... తెలుగు పరిశ్రమలో కూడా బహుశా ఏర్పాట్లు జరుగుతూ ఉండి ఉండొచ్చు. పేపర్లతో పాటు చానళ్ళ లోనూ తగుమాత్రం హడావిడి కనిపిస్తోంది.

తెలుగు ప్రేక్షకుల దగ్గరికి వస్తే, మిగిలిన భారతీయ భాషా ప్రేక్షకుల్లాగే తెలుగు వారికి సైతం సినిమా మాత్రమే తొలి వినోద సాధనం కాదు. సినిమా పుట్టడానికి పూర్వం కూడా తెలుగు నాట వినోద సాధనాలు ఉన్నాయి. యక్షగానాలు, తోలుబొమ్మలాటలు, హరికథలు, బుర్రకథలు, పౌరాణికాలు అటుపై సాంఘిక నాటకాలు, వీటి తర్వాత రికార్డింగ్ డ్యాన్సులు... అటుపై వచ్చింది సినిమా. నగరాలు, పట్టణాల్లో సినిమా ప్రభంజనం మొదలైన చాలా రోజులవరకూ, పల్లె జనులకి వినోదం పంచినవి మిగిలిన కళా రూపాలే. అయితే, సినిమా ఉద్ధృతికి తట్టుకోలేక మిగిలినవన్నీ నెమ్మదిగా తెరవెనక్కి వెళ్ళిపోయాయి.

వినోద సాధనాల అంతిమ లక్ష్యం ప్రజలకి వినోదం అందిచడమే అయినప్పుడు, నేటి సినిమా ఏ మేరకి వినోదాన్ని అందిస్తోంది అన్న ప్రశ్న వచ్చి తీరుతుంది. సినిమాతో పోల్చినప్పుడు మిగిలిన కళా రూపాలకి ఉన్న సౌలభ్యం ఏమిటంటే, ప్రదర్శనని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో అప్పటికప్పుడే తెలుసుకుని, అవసరమైన మార్పులు చేసుకోవడం. నాటకంలో తరచూ 'వన్స్ మోర్' పడే పద్యాలు, సంభాషణలని మరింత శ్రద్ధగా పలకడం లాంటివి అన్నమాట. సినిమా కి ఈ సౌకర్యం లేదు. ఒక్కసారి రీలు తయారై థియేటర్ కి వచ్చేసిందీ అంటే మార్పులకి మరి తావు లేదు. కాబట్టి, నిర్మాణ సమయంలోనే మరింత జాగ్రత్తగా ఉండాలి.


ప్రసార సాధనాల పరిణామం సైతం రేడియో నుంచి టెలివిజన్ కి విస్తరించి, అక్కడినుంచి ఇంటర్నెట్ మీడియం వైపు పరుగులు పెడుతోంది. ఒకప్పుడు సినిమాకి పోటీ అవుతోంది అనుకున్న టీవీ, ఇప్పుడు సినిమాలకి, సినిమా వాళ్లకి పునరావాస కేంద్రంగా మారిపోయింది. బాక్సాఫీసు దగ్గర పల్టీ కొట్టిన సినిమాని ఆదరించి, మూడో వారంలో మూడొందల ప్రకటనల సౌజన్యంతో ప్రసారం చేయడం మొదలు, వెండితెర మీద వేషాలు వెలిసిపోయిన నటీనటుల్ని ఆదరించి అక్కున చేర్చుకోవడం వరకూ అన్నింటికీ నేనున్నాను అంటూ ముందుకి వచ్చేస్తోంది బుల్లిపెట్టె. ఒకప్పుడు నాటకం నుంచి సినిమాకి జరిగిన వలసలు, ఇప్పుడు సినిమా నుంచి టీవీ కి పెరుగుతున్నాయి.

రాన్రానూ కొత్త సినిమా టీవీలో వచ్చేస్తోందన్న 'గ్లామర్' కూడా కనుమరుగు అయిపోతోంది. కనీసం నిన్న కాక మొన్నే విడుదలైన సినిమా, భారీ బడ్జెట్ ది, పెద్ద హీరోది... లాంటి కుతూహలం ఏమాత్రం లేకుండా... సినిమా ఏమాత్రం విసిగించినా పక్క చానల్లో వచ్చే క్రికెట్ మ్యాచ్ రిపీట్ షో లేదా శాసన సభ కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారం లాంటి వినోదాల వైపు మళ్ళిపోతున్నారు ప్రేక్షకులు. కొన్నాళ్ళు ఇదే పరిస్థితి కొనసాగితే, టీవీ చానళ్ళు సైతం సినిమా హక్కులు కొనుక్కోడానికి వెనకముందాడే పరిస్థితులు వచ్చేస్తాయేమో అనిపించేస్తోంది. టీవీ వాళ్ళు కూడా వద్దు పొమ్మంటే సినిమాలు ఏమైపోవాలి పాపం?!!

వందేళ్ళ కాలంలో బాలారిష్టాలని దాటుకుని, సమస్యలని అధిగమిస్తూ, నష్టాలని చవిచూస్తూ, అప్పుడప్పుడూ భారీ విజయాల్ని సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది భారతీయ సినిమా పరిశ్రమ. సినిమా నిర్మాణంలో దేశంలోనే రెండో స్థానంలో ఉన్న తెలుగు పరిశ్రమా ఇంచుమించు అదే దారిలో ప్రయాణం చేస్తోంది. ఊహించనంత వేగంగా వచ్చిపడిన సాంస్కృతిక మార్పుల కారణంగా, ఇప్పటి ప్రజలకి టీవీ, సినిమా మినహా మరో వినోద సాధనం లేనే లేదు. నాసిరకం సినిమాలతో ప్రేక్షకులని ఊదరగొట్టి, సినిమా అంటే విరక్తి కలిగే విధంగా వాళ్ళని తయారు చేయకుండా ఉంటే అదే పదివేలు అన్నట్టుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. ఇలా జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలో సంబంధీకులు అందరికీ తెలుసు... ఎందుకు చేయడం లేదు? అన్న ప్రశ్నతో ప్రేక్షకులకి సంబంధం లేదు..

6 కామెంట్‌లు:

  1. వందేళ్ళ కాలంలో బాలారిష్టాలని దాటుకుని....

    వందేళ్ళ లో బాలారిష్టం ఏమిటండీ బాబూ... 'బాల్చీ' తన్నే అరిష్టం అనాలి గాని !!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. 'శాసన సభ కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారం లాంటి వినోదాల వైపు' ... :)

    రిప్లయితొలగించండి
  3. Indian commercial cinema is trash!Paralell cinema died its own death!)ur most of the directors are brainless & depthless mediocre fellows!Very rarely good directors with vision are coming!We ought to give our applause to them!

    రిప్లయితొలగించండి
  4. ఎన్నేళ్ళు వచ్చి ఏమి లాభం అని కొంతకాలం క్రితం వ్రాసిన వ్యాసానికి లింకు:

    http://saahitya-abhimaani.blogspot.in/2011/10/blog-post.html

    సినికల్ గా అనిపించవచ్చు కాని నా భావనలు/ఆవేదన ఈ వ్యాసంలో వ్రాశాను.

    రిప్లయితొలగించండి
  5. @జిలేబి: ఆ వాక్యం మిమ్మల్ని కొంచం కన్ఫ్యూజ్ చేసినట్టు అనిపిస్తోందండీ... ధన్యవాదాలు
    @పురాణపండ ఫణి: పరిస్థితి అలా ఉందండీ మరి... ...ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  6. @సూర్య ప్రకాష్: నిష్టూరంగా వినిపించే నిజం చెప్పారు!! ...ధన్యవాదాలు
    @శివరాం ప్రసాద్: బాగుందండీ... నిజమే కదా... ...ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి