సోమవారం, ఏప్రిల్ 29, 2013

హృదయనేత్రి

భారత స్వతంత్ర సంగ్రామానికి పూర్వమూ, స్వాతంత్రానంతరమూ దేశంలో ఉన్న సామాజిక, రాజకీయ పరిస్థితులని ఇతివృత్తంగా తీసుకుని మాలతీ చందూర్ రాసిన నవల 'హృదయనేత్రి.' విస్తారమైన కేన్వాస్ ఉన్న ఈ నవల చదువుతూ ఉంటే టైం మిషీన్ లో ఒక్కసారిగా ఓ వందేళ్ళు వెనక్కి వెళ్లి పోయి, అక్కడి నుంచి తాపీగా ఓ అరవై-డెబ్భై ఏళ్ళు ప్రయాణం చేస్తున్న అనుభూతి కలుగుతుంది. 1992 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న నవల ఇది. మహాత్ముడిని మెప్పించిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య 'చీరాల-పేరాల' ఉద్యమానికి పూర్వరంగంతో మొదలు పెట్టి, స్వతంత్ర పోరాటం, కాంగ్రెస్, జనతా ప్రభుత్వాల పనితీరు మీదుగా ఇందిగా గాంధీ పాలన, ఎమర్జెన్సీ, అనంతర పరిస్థితులని పరామర్శిస్తూ, ఇందిరా హత్యతో ముగుస్తుంది నవల. ఇది కేవలం దేశ భక్తుల కథ మాత్రమే కాదు, స్వార్ధ పరులు, వేర్పాటు వాదులు కూడా భాగమే ఇందులో.

నవలలో ప్రధాన పాత్ర గోపాలంగా పిలవబడే గోపాలరావు పదేళ్ళ బాలుడిగా ఉండగా కథ మొదలవుతుంది. స్థితిమంతుల కుటుంబం. ఏ పనీ చేయకుండా చీట్ల పేకతో కాలక్షేపం చేసే తండ్రి, పూజలు పునస్కారాలు చేసుకునే తల్లి, ఓ తమ్ముడు బుచ్చి.. గోపాలానికి నిరాసక్తంగా అనిపించే ఇంటి వాతావరణం. ఆసమయంలో అతని కంటికి ఓ చైతన్యంలా కనిపిస్తుంది రావుడత్తయ్య. గోపాలం తండ్రికి సొంత అక్క రామలక్ష్మమ్మ. సంప్రదాయాన్ని కాదని ఖద్దరు కట్టి, వీధుల్లోకి వచ్చిన రామలక్ష్మమ్మ తన భర్త వాసుదేవరావు ప్రోత్సాహంతో స్వతంత్ర పోరాటంలో పాల్గొంటోంది. ఇంటి వాతావరణంతో విసుగు చెందిన గోపాలం, అత్తయ్యతో ఆమె ఊరు చీరాల చేరుకుంటాడు. సంతానం లేని ఆ దంపతులు గోపాలాన్ని సొంత బిడ్డలా చూసుకుంటూ ఉంటారు.

గోపాలం చీరాల చేరిన కొన్ని రోజులకే చీరాల-పేరాల ఉద్యమం మొదలవుతుంది. ఆ రెండు పంచాయితీలనీ ప్రజల ఇష్టానికి విరుద్ధంగా మునిసిపాలిటీలుగా ప్రకటించిన ప్రభుత్వం ఇంటి పన్ను మూడింతలు చేయడంతో ప్రజల్లో తిరుగు బాటు వస్తుంది. అందరూ ఇళ్ళు ఖాళీ చేసి ఊరి చివర గుడిసెలు వేసుకుని నివాసం ఉంటారు. బ్రిటిష్ పాలకులు ప్రజల నుంచి ఎదుర్కొన్న తొలి పెద్ద తిరుగుబాటు ఇది. ఊరంతా కులమతాలకి అతీతంగా ఓ చోట గుడిసెలు వేసుకుని ఉండడం, కలిసి వండుకోవడం, పనులు చేసుకోవడం ఆశ్చర్య పరుస్తుంది గోపాలాన్ని. అక్కడే గాంధీజీని దగ్గర నుంచి చూస్తాడు అతను. చీరాల-పేరాల ఉద్యమం ముగిసాక, ఖద్దరు ఉద్యమం మొదలవుంది. రామలక్ష్మమ్మ కీలకపాత్ర పోషిస్తుంది అందులో కూడా.



ఇంతలో గోపాలం తల్లిదండ్రులు బందరుకి మకాం మార్చడంతో, తనకి ఇష్టం లేకపోయినా వాళ్ళ దగ్గరకి వెళ్లి జాతీయ కళాశాలలో చేరుతాడు గోపాలం. తమ్ముడు బుచ్చి ఇంగ్లీష్ చదువులో ప్రవేశిస్తాడు. అతని జాతీయ భావాలు తల్లిదండ్రులకి నచ్చవు. రామలక్ష్మమ్మ తన కొడుక్కి మందో మాకో పెట్టేసిందని మనసా వాచా నమ్ముతుంది గోపాలం తల్లి.కొడుకు తన చెయ్యి దాటిపోకుండా ఉండడం కోసం, గోపాలానికి జమీందారు గారమ్మాయి పార్వతితో వివాహం జరిపించేస్తుంది ఆమె.ఎదురు చెప్పలేని తన అశక్తతకి సిగ్గు పడతాడు గోపాలం. వాసుదేవరావు గారి మరణం రామలక్ష్మమ్మని ఒంటరిని చేస్తుంది. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చేరిన గోపాలం, పార్వతి గర్భవతిగా ఉండగా శాసనోల్లంఘనలో పాల్గొని జైలు పాలు అవుతాడు.

మొదటి నుంచీ భర్త పద్ధతులు అర్ధం కావు పార్వతికి. అతను 'ప్రయోజకుడు' కాకుండా జైలు పాలు కావడం పెద్ద దెబ్బే ఆమెకి. ఓ కొడుక్కి జన్మనిచ్చి, శ్రీనివాసు అని పేరు పెట్టుకుని, పుట్టింట్లోనే అతన్ని పెంచుతూ ఉంటుంది. జైలు నుంచి విడుదలయిన గోపాలానికి ఇంట్లో మార్పులు ఆశ్చర్య పరుస్తాయి. బుచ్చి రెవిన్యూ బోర్డులో ఉద్యోగం సంపాదించుకుంటాడు. తన వాళ్ళ దగ్గరా, అత్తవారిలోనూ ఇమడలేని గోపాలం, సీతానగరం ఆశ్రమం లో జీవితం గడుపుతున్న రామలక్ష్మమ్మ సలహా మేరకి చీరాల చేరుకొని ఒంటరి జీవితం మొదలు పెడతాడు.

దేశానికి స్వతంత్రం వచ్చిందన్న సంతోషం కన్నా, దేశం రెండు ముక్కలు అయ్యిందన్న బాధే ఎక్కువ కలుగుతుంది గోపాలానికి. చీరాల నుంచి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినా, రాజకీయాలు తనకి సరిపడవని గ్రహించి వాటికి దూరంగా జరుగుతాడు. వినోభా ఆశ్రమంలో కొంతకాలం గడిపిన గోపాలానికి, తన కొడుకు శ్రీనివాస్ కమ్యూనిస్టు పోరాటంలో ఆయుధం పట్టిన విషయం తెలుస్తుంది. కొడుకుని కంటితో చూడలేకపోయినా, భార్యతో కలిసి కొడుకు కూతురు 'స్వరాజ్య లక్ష్మి' ని పెంచి పెద్ద చేస్తాడు. బతుకుతెరువు కోసం ఓ పత్రికలో ఉద్యోగం మొదలు పెట్టిన గోపాలం, పొట్టి శ్రీరాములు ఆత్మార్పణనీ, తర్వాతి కాలంలో ఇందిరా గాంధీ విధించిన ఎమర్జన్సీ నీ ఏమాత్రం అంగీకరించ లేకపోతాడు.

ఇది కేవలం గోపాలం, అతన్ని ప్రభావితం చేసిన రామలక్ష్మమ్మ, స్వరాజ్య లక్ష్మిల కథ మాత్రమే కాదు. దేశ, రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన అనేక సంఘటనలని మరో మారు గుర్తు చేసే నవల. నమ్మిన విషయాల పట్ల గోపాలం నిబద్ధత ఆశ్చర్య పరుస్తుంది పాఠకులని. చదువుతున్నంత సేపూ పాలగుమ్మి పద్మరాజు 'రామరాజ్యానికి రహదారి,' అడివి బాపిరాజు 'నారాయణరావు,' కొడవటిగంటి కుటుంబరావు 'చదువు' నవలలు గుర్తొస్తూనే ఉన్నాయి. స్వతంత్ర పోరాటం, రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళని ఆపకుండా చదివించే నవల. సంభాషణల్లో అక్కడక్కడా కనిపించే నాటకీయత ని మినహాయించుకుంటే, ఏకబిగిన చదివి పక్కన పెట్టగల పుస్తకం. ('క్వాలిటీ' ప్రచురణ, పేజీలు 240, వెల రూ. 70, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

2 కామెంట్‌లు:

  1. ఈ పుస్తకాన్ని చదివాను కానీ నాలాంటి మతిమరుపు మనిషికి లీలగా మాత్రమే గుర్తుంది. "నారాయణరావు" నాకెంతో అభిమానం. చాలాసార్లు చదివాను మర్చిపోకుండా వుండడానికి. అది నా ఫ్రెండు బహుమతి. మంచి పుస్తకాన్ని పరిచయం చేసారు. చదువుతాను.

    రిప్లయితొలగించండి
  2. @అనూ: తప్పకుండా చదవండి... ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి