అప్పు అవసరం రాకుండానే ఉండాలి. వచ్చిందంటే మాత్రం, అప్పిచ్చు వాడు పెట్టే అన్ని నిబంధనలకీ తల ఊపి తీరాలి, ఇష్టం ఉన్నా లేక పోయినా. ఊరంతటికీ ఒక్కడే వడ్డీ వ్యాపారి ఉన్నట్టయితే మన అవసరం ఎంత గొప్పది అయినా, కచ్చితంగా బాకీ తీర్చేసిన ఘన చరిత్ర మనకి ఎంత ఉన్నా, చివరికి అప్పు పుట్టడం అనేది అతగాడి ఇష్టాయిష్టాల మీద ఆధార పడి ఉంటుంది. అదే, ఒకటికి రెండు చోట్ల అప్పు పుట్టే వీలుంటే? ఇక్కడ కాకపొతే మరో చోట అన్న ధీమా ఉంటుంది మనకి. ఎందుకంటే డబ్బుతో ఎప్పుడు ఎలాంటి అవసరం పడుతుందో తెలియదు కాబట్టి. మన ఇల్లు లాగే మన దేశం కూడా. అవసరం పడినప్పుడల్లా డబ్బు సర్దుబాటయ్యే మార్గాలు వెతికి పెట్టుకుంటూ ఉండాలి నిత్యమూ. ఎందుకంటే, అవసరాలు పెరిగేవే తప్ప తగ్గేవి కాదు కదా.
'బ్రిక్స్ బ్యాంకు' ..గడిచిన వారం ప్రముఖంగా వచ్చిన వార్త ఇది. అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతున్న ఐదు దేశాలు కలిసి ఏర్పాటు చేయబోయే ఈ బ్యాంకు, ఇప్పటికే ప్రపంచ దేశాల్లో వేళ్ళూనుకుని ఉన్న ప్రపంచ బ్యాకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐయెమ్మెఫ్) ల మీద ఎంతవరకూ ప్రభావం చూపిస్తుందీ అన్నది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. ప్రపంచ బ్యాంకు ఇప్పటికే ఎంతో హుందాగా బ్రిక్స్ బ్యాంక్ ప్రతిపాదనని స్వాగతించింది. ఐయెమ్మెఫ్ మాత్రం కొత్త సంస్థ ఏర్పాటును ఆసక్తితో పరిశీలిస్తున్నట్టు చెప్పి ఊరుకుంది. ఈ రెండు సంస్థలు మాత్రమే కాదు, యావత్తు ప్రపంచమూ బ్రిక్స్ బ్యాంక్ విషయంతో చాలా ఆసక్తి చూపుతోంది అన్నది నిజం. ఇంతకీ ఏమిటీ బ్రిక్స్?
బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా... ఈ ఐదూ అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థలు. రానున్న రోజుల్లో అభివృద్ధి చెందిన దేశాలుగా మారే అవకాశాలు, వనరులు పుష్కలంగా ఉన్న దేశాలు కూడా. అవకాశాలు, వనరులతో పాటు వీటి ముందు ఉన్న సవాళ్లు కూడా తక్కువవేమీ కాదు. వీటన్నింటి గురించి చర్చించుకోడానికి, పరస్పర సంబంధాలు మెరుగు పెరుచుకోడం కోసం నాలుగేళ్ల క్రితం ఈ ఐదు దేశాలు కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. తమ దేశాల పేర్లలో మొదటి అక్షరాలతో 'బ్రిక్స్' అని నామకరణం చేశాయి ఆ కూటమికి. అనేక కారణాల వల్ల, ఈ బ్రిక్స్ కూటమి దాదాపు నిశ్శబ్దంగానే ఉంది. దక్షిణాఫ్రికా లోని డర్బన్ లో గతవారం సదస్సు జరిపే వరకూ ఈ 'బ్రిక్స్' ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వేటి సమస్యలు వాటివే అయినా, ప్రతి ఒక్కదేశానికీ తప్పక ఉండే సమస్య మాత్రం ఆర్ధిక వనరులు. పెట్టుబడులు పెట్టి, లాభాలు సంపాదిస్తే కదా అభివృద్ధి సాధించడం. మరి ఆ పెట్టుబడి ఎక్కడి నుంచి తేవాలి? ఇంతకాలం ప్రపంచ దేశాలకి పెద్ద దిక్కుగా ఉన్నవి ప్రపంచ బ్యాంకు, ఐయెమ్మెఫ్. ఈ రెండు సంస్థల సభ్య దేశాలూ, చిన్నా పెద్దా అని లేకుండా ఏ అవసరం వచ్చినా ముందు తట్టేది వీటి తలుపులే. అయితే, రాను రానూ ఈ రెండు సంస్థల మీదా ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి, రుణాల మంజూరు మొదలు, వడ్డీ రేటు వరకూ ఎన్నో విషయాల్లో ఎన్నెన్నో ఫిర్యాదులు. అంతేకాదు, ఈ రెండు సంస్థలూ అమెరికా, యూరోప్ ల కనుసన్నల్లో పనిచేస్తున్నాయన్నది బహిరంగ రహస్యం.
గతవారపు బ్రిక్స్ సదస్సులో ప్రధానంగా చర్చకి వచ్చిన విషయం ఇదే. ఐదు దేశాలూ కూడా ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసుకోవలసిన అవసరాన్ని గుర్తించాయి. యాభై బిలియన్ డాలర్ల సీడ్ మనీ తో బ్యాంకుని ప్రారంభించి, దానిని వంద బిలియన్ డాలర్ల కి విస్తరించాలి అన్నది ప్రాధమికంగా తీసుకున్న నిర్ణయం. బ్యాంకు కేంద్ర స్థానం మొదలు, నియమ నిబంధనల వరకూ కేలకమైన అనేక విషయాలపై ఇంకా తుది నిర్ణయం రావాల్సి ఉంది. కొత్త బ్యాంకు ఏర్పాటుతో ఈ ఐదు సభ్య దేశాలు ప్రపంచ బ్యాంకు, ఐయెమ్మెఫ్ ల మీద ఆధారపడం తగ్గుతుంది అన్నది నిర్వివాదం. ఫలితంగా డాలర్ మారకపు రేటుకి కనీసం కొంతమేరకు స్థిరత్వం వచ్చే అవకాశం కనిపిస్తోంది. బ్రిక్స్ బ్యాంక్ ప్రభావం యూరో మీదా ఉంటుందన్నది ఆర్ధిక విశ్లేషకుల అభిప్రాయం.
బ్రిక్స్ బ్యాంక్ ఏర్పాటులో కష్టనష్టాలు చాలానే ఉన్నాయి. సభ్య దేశాల మధ్య సంబంధాలు ఓ ముఖ్యమైన అంశం. భారత్-చైనా సంబంధాలు 'క్షణక్షణముల్..' చందంగా ఉన్నాయి. దక్షిణాఫ్రికా తన వంతు పెట్టుబడి పెట్టే పరిస్థితి లేదు ప్రస్తుతం. అయితే, కేవలం ఈ కారణాలకి బ్యాంక్ ఏర్పాటు ఆగిపోతుంది అనుకోలేం. ఎందుకంటే ఐదు దేశాలకీ కూడా బలమైన సంకల్పమూ, ప్రత్యామ్నాయం కావాల్సిన అవసరమూ ఉన్నాయి కాబట్టి. బ్రిక్స్ బ్యాంక్ ఏర్పాటు వల్ల, రానున్న రోజుల్లో డాలర్, యూరోలకి దీటైన మరో ప్రత్యామ్నాయం వచ్చే అవకాశమూ ఉంది. అవసరానికి అప్పు పుట్టే మరో కొత్త మార్గం దొరకడం అన్నది సంతోషించాల్సిన విషయమే, ముఖ్యంగా అప్పు తప్పనిసరి అయినప్పుడు.
>> వనరులు పుష్కలంగా ఉన్న దేశాలు కూడా
రిప్లయితొలగించండినిజమాండీ? భారద్దేశంలో - అంతదాకా ఎందుగ్గానీ, మన హైద్రాబాదులో, మరి తాగడానిక్కూడా మంచినీళ్ళు దొరకవే? మాంఛి నేచురల్ గేస్ వెల్స్ ఉన్నా వంట గేస్ సిలిండర్ దొరకదే? నా మనవడు చచ్చిపోయేలోపుల ఇవి జరుగుతాయంటారా? బ్రిక్స్ సంగతి తర్వాత ఆలోచిద్దాం గానీ
ఈ బ్యాంక్ ప్రపంచబ్యాంక్‌కి ప్రత్యామ్నాయమో, పోటీయో కాగలగాలంటే దానిలా అన్ని దేశాలకీ అప్పులివ్వాలి. మరి దీని ధ్యేయం చూడబోతే (కనీసం ప్రస్తుతానికి) బ్రిక్స్‌లో సభ్యులైన ఐదు దేశాలకి మాత్రమే పరిమితమయ్యేలా ఉంది. ఈ ఐదు దేశాలే అందులో పెట్టుబడి పెట్టి మళ్లీ ఇవే దేశాలు దాన్ని వాడుకోటమంటే .... ఇదో చీటీ పాట సంఘంలా అనిపిస్తుంది. ఇది డాలర్‌కీ, యూరోకీ దీటైన ప్రత్యామ్నాయాన్నెలా తెస్తుంది? బ్రిక్స్ దేశాలకి ఉమ్మడి కరెన్సీ ఏర్పాటు చేస్తారా? ఈ ఐదు దేశాలూ తలా ఓ చోటున్నాయి. వీటికి ఉమ్మడి కరెన్సీ కుదిరే పనేనా?
రిప్లయితొలగించండి@DG: నిజమేనండీ... వనరులు ఉన్నాయి... కానీ మనం వాడుకోలేక పోతున్నాం అంతే... ధన్యవాదాలు
రిప్లయితొలగించండి@అబ్రకదబ్ర: ఇప్పుడు ప్రముఖంగా వెలిగిపోతున్న చాలా బ్యాంకులు ఒకప్పుడు చీటీ పాట సంఘాలుగా మొదలైనవే కదండీ... చూద్దాం, ఏం జరుగుతుందో... ధన్యవాదాలు