పొత్తూరి విజయలక్ష్మి పేరు వినగానే, తెలుగు సాహిత్యం తో పరిచయం ఉన్న వారికి
ఎవరికైనా మొదటగా పెదవుల మీద ఓ నవ్వు మొలుస్తుంది. అవును మరి, 'శ్రీవారికి
ప్రేమలేఖ' లాంటి హాస్య భరితమైన సినిమాకి కథ అందించడం మాత్రమే కాదు, తన
చిన్ననాటి జ్ఞాపకాలని 'హాస్య కథలు' గా మలచి తెలుగు పాఠకులని నవ్వుల్లో
ముంచెత్తారు. తన మార్కు హాస్య కథలతో విజయలక్ష్మి తీసుకొచ్చిన మరో సంకలనం
'మా ఇంటి రామాయణం.' మొదటి ముద్రణ జరిగాక మూడేళ్ళలో మూడుసార్లు
పునర్ముద్రణలు పొందిందంటే, ఈ పుస్తకానికి దొరికిన ఆదరణని అంచనా వేయొచ్చు.
మొత్తం
పద్నాలుగు కథలున్న ఈ సంకలనం లో మెజారిటీ కథలు నవ్వులు పూయించేవే. దైనందిన
జీవితం మొదలు, చుట్టూ వస్తున్న మార్పుల వరకూ ప్రతి విషయాన్నీ నిశితంగా
పరిశీలించి, హాస్యాన్ని రంగరించి కథలుగా మలిచారు విజయలక్ష్మి. ఏ టీవీ చానల్
తిప్పినా కనిపించే సీరియళ్ళలో అత్తాకోడళ్ళు ఒకరిమీద ఒకరు కుట్రలు
పన్నుకుంటూనో, కాఫీలో విషం కలుపుతూనో కనిపిస్తారు కదా. కానీ, ఈ పుస్తకంలో
మొదటి కథ, సంకలానికి శీర్షికగా ఉంచిన కథ 'మా ఇంటి రామాయణం' ఇతివృత్తం
ఇందుకు భిన్నం. కోడలు, అత్తగారితో జతకట్టేసి మావగారి బద్దకాన్ని వదిలించడం
ఇతివృత్తం. కొంత అతిశయోక్తి కనిపించినప్పటికీ, వంటింటికే పరిమితమైన మహిళలు,
మిగిలిన కుటుంబ సభ్యుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తారు అన్నది
చిత్రించారు ఈ కథలో.
మొత్తం ప్రపంచాన్ని మార్కెట్ శాసిస్తున్న కాలం ఇది.
ప్రోడక్ట్ ఎలాంటిదైనా దానికి తగిన ప్యాకింగ్, మార్కెటింగ్ లేనిదే ఆ వస్తువు
ముఖం చూసేవాళ్ళు ఉండరు. ఈ టెక్నిక్ ని అందిపుచ్చుకుని, వృద్ధాప్యంలో
వ్యాపారం మొదలు పెట్టి విజయాన్ని రుచి చూసిన ఇద్దరు మహిళల కథ 'ది కటాస్.'
మధ్యలో కొంతభాగం వ్యాసాన్ని గుర్తు చేసినా, చదివించే గుణం పుష్కలంగా ఉండడం
వల్ల విసుగు కలగదు. బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతీ రామకృష్ణ కి నివాళిగా రాసిన
కథ 'అత్తగారూ-స్వర్గంలో సీరియస్సూ..' భానుమతి, తన అత్తగారితో కలిసి
స్వర్గంలో టీవీ సీరియల్ తీస్తే ఎలా ఉంటుంది అన్నది ఇతివృత్తం.
ఈ సంపుటంలో నాకు బాగా నచ్చిన కథల్లో ఒకటి 'అవును వాళ్ళిద్దరూ కథ
రాశారు.' ముందుమాటలో సి. మృణాళిని చెప్పినట్టుగా ఒక విషయాన్ని గురించి
స్త్రీలు ఎలా ఆలోచిస్తారు, పురుషులు ఎలా ఆలోచిస్తారు అన్నది బాగా
చిత్రించారు ఇందులో. భార్యా భర్తా కలిసి కథల పోటీ కోసం ఓ కథ రాసి, బహుమతి
గెలుచుకోవాలి అనుకోవడం ఇతివృత్తం. ఒకరు రాసింది మరొకరికి నచ్చదు. అయినా
రాయడం ఆపరు. ఇద్దరూ చెరో ఐదు వాక్యాల చొప్పున రాసి కథ పూర్తి చేయాలన్న
ఒప్పందం కుదురుతుంది. వాళ్ళు రాసిన కథ ఏ కంచికి చేరిందన్నది ముగింపు.
ఆకట్టుకునే మరో కథ 'ప్రసాదరావూ-వంట సరస్వతీ..' మహిళల వంటింటి కష్టాన్ని ఇతివృత్తంగా తీసుకుని
రాసిన కథే ఇది కూడా. ఇక, 'అప్పిచ్చువాడు-వైద్యుడు' కథ అయితే వెంటబడి
అప్పులిచ్చే బ్యాంకుల మీదా, డిస్కౌంట్లు ఆఫర్ చేసే కార్పోరేట్ ఆస్పత్రుల
మీదా రచయిత్రి సంధించిన వ్యంగ్యాస్త్రం. వీళ్ళనే కాదు, మాడరన్ మాతాజీలనీ
వదలలేదు విజయలక్ష్మి. అక్షరాలా ఉతికి ఆరేశారు 'వైరాగ్య స్థితి' కథలో. మెడ
తిరగనన్ని నగలు వేసుకున్న మాతాజీ మీద రచయిత్రి వేసే సెటైర్లు చదవాల్సిందే.
'ఇదో వింత' 'తిక్క కుదిరింది' లాంటి కథలు ఈ సంకలనంలో లేకపోయినా పర్లేదు
అనిపించింది.
బీనాదేవి తన 'కథలూ-కబుర్లూ' లో రాసిన ఓ గల్ఫిక గుర్తొచ్చింది, 'అమ్మో! ఆదివారం!!'
చదివాక. హాస్యం పాళ్ళు కొంచం తగ్గినట్టు అనిపించిన కథలు 'ఇల్లు కట్టి చూడు'
'భాస్కరం-రూపాయీ.' మొత్తం మీద, సరదాగా చదువుకునే సంకలనం ఇది. "పొత్తూరి
విజయలక్ష్మి కథలు చదివితే మనమూ రాసెయ్యొచ్చు పెద్ద కష్టమేం కాదనిపిస్తుంది.
అలా అనిపించడంలోనే రచనా శిల్పం ఉంది. 'మా ఇంటి రామాయణం' లో ఏ కథ చదివినా
కొత్త పెళ్లి కూతురు పూలు కడుతున్నట్లు, పోకిరి పిల్ల గవ్వలు
చిలకరించినట్టు, తొలకరి జల్లులో తడిసిన పాలపిట్ట రెక్కలు విదిల్చినట్టు
అనిపిస్తుంది," అంటూ శ్రీరమణ చెప్పిన మాటల్లో నిజం ఉందనిపిస్తుంది. (శ్రీ
రిషిక పబ్లికేషన్స్ ప్రచురణ, పేజీలు 117, వెల రూ. 80, అన్ని ప్రముఖ
పుస్తకాల షాపులు).
Yes! I love to read this book. Thanks for remembering.
రిప్లయితొలగించండిచాలా మంచి పుస్తకాన్నిగురించి తెలిపినందుకు థాంక్స్..నెమలి కన్ను గారు..
రిప్లయితొలగించండి"అత్తగారూ - స్వర్గంలో సీరియస్సూ.." కథలో అత్తగారు బానే పట్టుబడ్డారు కానీ.. భానుమతి అతిశయం పాళ్ళు కొంచెం తగ్గినట్టు కనిపించిందండీ నా కళ్ళకి. "ఔను - వాళ్ళిద్దరూ కథ రాశారు" నచ్చింది నాక్కూడా. నిజంగా భార్యాభర్తా కలిసి కథ రాస్తే అలాగే ఉంటుందేమో అనిపించేసింది. :)
రిప్లయితొలగించండి@అనూ: ధన్యవాదాలండీ
రిప్లయితొలగించండి@ ఎగిసే అలలు: ధన్యవాదాలండీ..
@కొత్తావకాయ: నేను అత్తగారి దగ్గరే ఆగిపోయానండీ... 'భలే పేరడీ చేశారుగా ' అనుకుంటూ.. మీరన్నది నిజం.. ..ధన్యవాదాలు