నాలుగైదేళ్ళ క్రితం సంగతి... ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు 'పుస్తకావిష్కరణ' కి భాగ్యనగరం ఆహ్వానించారు. రవీంద్రభారతి దగ్గరలో ఉన్న ఒక హోటల్లో ఆ కార్యక్రమం. పెద్దగా హంగూ ఆర్భాటం లేకుండా జరిగిన ఆ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణ వీఎస్ రమాదేవి. ఓ కవీ, మరో రచయితా వేదికమీద ఉన్నా సభకి నిండుతనం తెచ్చింది మాత్రం కర్నాటక మాజీ గవర్నర్ గారే. అందరిమీదా ఛలోక్తులు విసురుతూ, నిర్వాహకులు చేస్తున్న చిన్న చిన్న పొరబాట్లనీ, వాళ్ళ తడబాట్లనీ సున్నితంగా ఎత్తిచూపి సరి చేయించడం మాత్రమే కాదు, పుస్తకాన్ని గురించి తను చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా చెప్పి క్లుప్తంగా ప్రసంగాన్ని ముగించారు రమాదేవి. అప్పటివరకూ ఆమె గురించి వినడమే కానీ, అదే ఆమెని మొదటిసారి దగ్గరగా చూడడం.
డెబ్భై తొమ్మిదేళ్ళ రమాదేవి హఠాత్తుగా మరణించారన్న వార్త తెలియగానే నాకు మొదట గుర్తొచ్చిన జ్ఞాపకం అదే. ఆ తర్వాత పత్రికల్లో చూసిన ఆమె ప్రశ్నోత్తరాల కాలమ్స్, సభలు-సమావేశాల వార్తలు..ఇవన్నీ... రెండు రాష్ట్రాలకి (హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక) గవర్నర్ గా పనిచేయడం మాత్రమే కాదు, భారత ఎన్నికల కమిషన్ కి స్వల్పకాలం ప్రధాన ఎన్నికల కమిషనర్ గా పనిచేశారు. ఇప్పటివరకూ ఈ పదవి చేపట్టిన మహిళ రమాదేవి ఒక్కరే కావడం విశేషం. వివాద రహిత అధికారిణిగా, న్యాయ కోవిదురాలిగా మాత్రమే కాదు, రచయిత్రిగానూ మంచి పేరు తెచ్చుకున్నారు ఆమె.
చదువు మాత్రమే ఉన్నతికి మార్గమని మనసా వాచా నమ్మిన వ్యక్తి రమాదేవి. ఆమె విషయంలో అది నిజమయ్యింది కూడా. డిగ్రీ పూర్తికాగానే ఉద్యోగంలో చేరి, అటుపై ఉద్యోగం చేస్తూనే ఉన్నత చదువులు చదివి, కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ప్రవేశించి ఎన్నెన్నోపదవులు చేపట్టారు. లా కమిషన్ మెంబర్ సెక్రటరీ, జాతీయ మహిళా కమిషన్ సలహాదారు, రాజ్య సభ సెక్రటరీ-జనరల్ ఇవి ఆమె నిర్వహించిన బాధ్యతల్లో కొన్ని. న్యాయశాస్త్రాన్ని ప్రజలకి దగ్గరగా తీసుకు వెళ్ళడానికి ఎంతో కృషి చేసిన రమాదేవి, తన తీరిక సమయాలని సాహిత్యంతో పాటు, వికలాంగులతో గడపడానికి ఇష్టపడ్డారు. చాలా మంది మహిళలకి పెద్దగా ఆసక్తి లేని జాతీయ, అంతర్జాతీయ రాజకీయ పరిణామాల అధ్యయనం ఆమెకి చాలా ఇష్టమైన విషయం.
"రమాదేవి పేరెత్తగానే నాకు ఎన్నో పాత సంగతులు గుర్తొస్తున్నాయి. ఆవిడ ఎమ్.ఏ., బీ.యెల్., యెమ్.యెల్.. ఇవన్నీ ఆలిండియా రేడియో లో పనిచేస్తున్నప్పుడే చదివారు. ఆవిడ కాన్సంట్రేషన్ కి ఆశ్చర్యం వేస్తుంది. అనౌన్సర్స్ బూత్ లో కూర్చుని సంగీత కార్యక్రమం మొదటి కీర్తన అనౌన్స్ చేసి, పుస్తకం చూసి చదువుకుంటూ కూర్చునేది. ఆ కీర్తన అవుతూనే తొణక్కుండా ఫేడర్ ఆన్ చేసి రెండో కీర్తన చెప్పి మళ్ళీ చదువుకునే వారు. అలాగే నోట్స్ రాసుకునేవారు. ఒకరకంగా అనౌన్సర్స్ జాబ్ టెన్షనబుల్ జాబ్. అలాంటి జాబ్ కూల్ గా చేసుకుంటూ అందులోనే తన చదువు సంగతి కూడా చూసుకునే వారు. మళ్ళీ పరీక్షలు మంచి డిస్టింక్షన్ తో పాసయ్యేవారు," అని తలచుకున్నారు శారదా శ్రీనివాసన్ తన 'రేడియో అనుభవాలు-జ్ఞాపకాలు' లో..(పేజీ 75).
పశ్చిమగోదావరి జిల్లా చేబ్రోలు లో 1934వ సంవత్సరంలో కనుమ పండుగ రోజున జన్మించిన రమాదేవి, స్వయంకృషితో ఎదిగిన మహిళ. సూటిగా మాట్లాడుతూనే వివాదరహితంగా ఉండడం ఆమె ప్రత్యేకత. రెండు రాష్ట్రాలకి గవర్నర్ బాధ్యతలు నిర్వహించాక, మూడోసారి అదే బాధ్యత నిర్వహించాల్సిందిగా రాష్ట్రపతి నుంచి పిలుపు వచ్చినప్పుడు ఆమె సున్నితంగా తిరస్కరించడం అప్పట్లో పెద్ద వార్త అయ్యింది. పదవీ బాధ్యతల నుంచి తప్పుకున్నాక, ఎక్కువ సమయాన్ని లీగల్ లిటరసీ, సాహిత్యం, వికలాంగుల సేవకి కేటాయించిన రమాదేవి, తన రచనలని ఇతర భాషల్లోకి తర్జుమా చేయించే పని పూర్తికాక మునుపే కన్నుమూశారు.
'విద్య వంటి వస్తువు లేదు' అని కన్యాశుల్కం నాటకంలో రామప్పంతులు చేత చెప్పిస్తారు గురజాడ వారు. నిజమే, చదువు జీవితాన్ని మరింత బాగా గడపడానికే సహకరిస్తుంది. కేవలం డిగ్రీలు సంపాదించం మాత్రమే కాకుండా, చదువులలోని సారాన్ని కొంచమైనా వంటపట్టించుకుంటే అది జీవితం మీద ఎంతైనా ప్రభావం చూపించగలదు. 'జ్ఞానాన్ని సంపాదించుకోవడం అనేది ఓ నిరంతర ప్రక్రియ..అది ఎప్పుడూ మంచే చేస్తుంది' అన్న సందేశం కనిపిస్తుంది, రమాదేవి జీవితాన్ని గమనించినప్పుడు. ఆ ప్రజ్ఞాశాలికి నివాళులు..
రమాదేవి గారిని నేను చూసాను,కొన్ని వివరాలు మాత్రమే తెలుసు. కాని ఇంత విపులంగా విషయాలు ఇప్పుడే తెలుసుకో గలిగాను. ఇంత చక్కటి వ్యక్తి వెళ్ళిపోవటం బాధగా ఉంది.
రిప్లయితొలగించండిచాలా చక్కగా వ్రాసారండి ! ఆ ప్రజ్ఞాశాలికి నివాళులు !
రిప్లయితొలగించండిమనసంతా వికలమైపోయిందండి. ఈ వార్త ఇప్పుడే చదువుతున్నాను. రమాదేవి గారు డిల్లీ లో మాకు బాగా సుపరిచితులు. వారి కుట్టుంబం కూడా మాకు సన్నిహితమే! ఎంతో ఆరాధించేదాన్ని ఆవిడని. ఆవిడ వ్యక్తిత్వం, చదువు, ఉద్యోగం అన్ని ఆదర్శమే అందరికి...చాలా అందం గా కూడా ఉండేవారు.ప్చ్...
రిప్లయితొలగించండి@జయ: ఓ పత్రికలో ఆవిడ రాసిన కాలమ్ పేరు 'విపులాచ పృధ్వీ..' ... మీ వ్యాఖ్య చూశాక గుర్తొచ్చిందండీ... ధన్యవాదాలు
రిప్లయితొలగించండి@శ్రావ్య వట్టికూటి: ధన్యవాదాలండీ..
@జలతారు వెన్నెల: ప్రత్యక్ష పరిచయం లేకపోయినా, వార్త వినగానే బాధనిపించినండీ నాక్కూడా... ...ధన్యవాదాలు..