శుక్రవారం, ఆగస్టు 26, 2011

గవర్నర్ రోశయ్య

మన దేశంలో ప్రభుత్వ సర్వీసులో చేరేందుకు -- అయ్యేయెస్ మొదలు అటెండర్ వరకూ అన్నింటికీ -- కొన్ని కనీసార్హతలు ఉన్నాయి. ఉద్యోగంలో చేరాక పదవీ కాలానికీ, పదవీ విరమణకీ పరిమితులున్నాయి. ఉద్యోగ కాలంలో ఏదన్నా తప్పు చేస్తే దండనగా క్రమశిక్షణ చర్యలున్నాయి. సందర్భాన్ని బట్టి ఇవి ఉద్యోగిని శాశ్వితంగా ఉద్యోగం నుంచి తొలగించేవిగా కూడా ఉంటాయి. కా.....నీ, ఈ ఉద్యోగులందరిమీదా కర్రపెత్తనం చేసే నేతలకి మాత్రం ఎలాంటి నియమ నిబంధనలూ లేవు.

ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరి, తంటాలు పడి కొంచం గుర్తింపు తెచ్చుకుంటే చాలు. తర్వాత పార్టీలు మారినా, కేసుల్లో ఉన్నా, జైలుకెళ్ళినా, ఇంకా ఏమేం చేసినా కూడా పార్టీలో పైవారి కరుణ సంపాదించుకోగలిగితే ఇక జీవితాంతమూ పదవులని అనుభవించవచ్చు. మన రాజకీయ నాయకులకి ఏమాత్రమూ కిట్టని ఒకే ఒక్క పదం రిటైర్మెంట్. ప్రభుత్వ సర్వీసులో చేరిన ఉద్యోగికి నిర్దేశించిన పదవీ విరమణ వయసు దాటిన ఇరవై సంవత్సరాలకి తమిళనాడు గవర్నరుగా పదవిని అలంకరించబోతున్న మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఇందుకు తాజా ఉదాహరణ.

అసలు గవర్నర్ అంటేనే 'రబ్బర్ స్టాంప్' అని ముద్దు పేరు. విశాలమైన రాజభవన్లో విశ్రాంతిగా కాలం గడిపే ఉద్యోగం. రాష్ట్రాల్లో రాజ్యాంగ సంక్షోభం తలెత్తినప్పుడు తప్ప మిగిలిన సమయాల్లో పెద్దగా బరువు బాధ్యతలేవీ ఉండవు. అయితే, గవర్నర్లని నియమించేది కేంద్రం కాబట్టి, సదరు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం రాజకీయంగా కేంద్రానికి అనుకూలం కానప్పుడు, కేంద్రం తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని కనిపించని విధంగా ఇబ్బందులు పెట్టాల్సిన రహస్య బాధ్యత గవర్నర్ల మీద ఉంటుంది.

మర్రి చెన్నారెడ్డి, పీఎస్ రామ్మోహనరావుల తర్వాత తమిళనాడుకి మూడవ తెలుగు గవర్నర్ కాబోతున్న రోశయ్యకి ఇప్పటికైతే ఎలాంటి సమస్యలూ కనిపించడం లేదు. గతంలో చెన్నారెడ్డి గవర్నరుగా ఉన్న కాలంలో అప్పటి కేంద్ర ప్రభుత్వంతో సఖ్యంగా లేని కారణానికి ఇబ్బందులు పడ్డ జయలలిత ఇప్పుడక్కడ ముఖ్యమంత్రి. అయితే ఇప్పుడావిడ కేంద్రంతో పొత్తుకి తహతహలాడుతోంది. ఇటు కేంద్రమూ, కరుణానిధి వారి డీఎంకే ఎంపీలు ఒక్కొక్కరుగా కుంభకోణాల్లో ఇరుక్కుని జైలుకి వెళ్ళడంతో, ఏ క్షణంలో అయినా కరుణకి వీడ్కోలిచ్చి, జయకి స్నేహహస్తం సాచడానికి సిద్ధంగా ఉంది.

రోగీ-వైద్యుడూ కూడా (ఇక్కడ రెండు పక్షాలూ రోగులే, వైద్యులే.. పొత్తుకి ఎవరి కారణాలు వాళ్లకి ఉన్నాయి మరి) పాలే కోరుతున్నారు కాబట్టి, రోశయ్య గారికి మరింత నిశ్చింత. ఆయన వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, ఎవరిచేతా వ్యతిరేకి అనిపించుకోడానికి ఏమాత్రం ఇష్టపడని ఈ లౌక్య రాజకీయుడికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కనుచూపు మేరలో ఎలాంటి ఇబ్బందులూ కనిపించడం లేదు. కాబట్టి, నొప్పించక తానొవ్వక, తప్పించుకోనవసరం ఏమాత్రమూ లేకుండానే పదవీ కాలాన్ని హాయిగా ఆస్వాదించవచ్చు మన రోశయ్య గారు.

ఇప్పుడు గవర్నరుగా రోశయ్య ఏం చెయ్యాలి? ఓ తమిళుడు తెలుగు రాష్ట్ర గవర్నరుగా ఏం చేస్తున్నాడో, ఈ తెలుగాయన కూడా తమిళ దేశపు గవర్నరుగా అదే పని చేయవచ్చు. ఓ స్నేహితురాలి మాటల్లో చెప్పాలంటే: "ఇంతకీ అదృష్టం అంటే శివాలక్ష్మి గారిది. గవర్నరు గారి భార్య హోదాలో అరవ దేశంలో వీధి కొకటిగా ఉన్న గుళ్లనీ గోపురాల్నీ పూటకొకటి చొప్పున భర్తతో కలిసి తిరిగి రావొచ్చు. పుణ్యం, పురుషార్ధం కూడా.." రోశయ్య తరానికి చెందిన చాలామంది తెలుగు సినిమావారు ఎటూ చెన్నైలోనే ఉన్నారు. కాబట్టి ఏవిధంగా చూసినా హాయైన జీవితమే. అడిగిన వెంటనే ముఖ్యమంత్రి కుర్చీని కిమ్మనకుండా వదిలేసినందుకు 'అమ్మ' పెట్టిన తాయిలం ఎంత బాగుందో కదా!

4 కామెంట్‌లు:

  1. మీ ఫ్రెండ్ ఎవరోకానీ కరెక్ట్ గా చెప్పారు.. ఈ వయసులో ఆయన అంతకన్నా చేయగలిగింది మాత్రం ఏముంది చెప్పండి :-)

    రిప్లయితొలగించండి
  2. very nice. akkada Telugu thananni poshisthe maatram arava sodrulutho..kastam minahaa anthaa..manche.

    రిప్లయితొలగించండి
  3. కనిపించని..వినిపించని వాళ్ళే గవర్నర్లు..అదే ప్రభుత్వానికి కావల్సింది.

    ఇంతకీ అదృష్టం అంటే శివాలక్ష్మి గారిది. గవర్నరు గారి భార్య హోదాలో అరవ దేశంలో వీధి కొకటిగా ఉన్న గుళ్లనీ గోపురాల్నీ పూటకొకటి చొప్పున భర్తతో కలిసి తిరిగి రావొచ్చు....నిజమేనండి..పనిలో పని తమిళనాడులోని ప్రసిద్ద బట్టల షాపులు కూడా..రోశయ్య గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆవిడ పని రోజూ బట్టల షాపులకి వెళ్ళటమే..వెంట వందిమాగధులతో!

    ఓ తమిళుడు తెలుగు రాష్ట్ర గవర్నరుగా ఏం చేస్తున్నాడో, ఈ తెలుగాయన కూడా తమిళ దేశపు గవర్నరుగా అదే పని చేయవచ్చు..రోశయ్య గారికి అంత వెన్నెముక లేదులేండి.

    రిప్లయితొలగించండి
  4. @వేణూ శ్రీకాంత్: :-) :-) ...ధన్యవాదాలండీ..
    @వనజ వనమాలి: అలాంటి ప్రయత్నం ఏదీ చేయరు లెండి :-) ..ధన్యవాదాలు.
    @సిరిసిరిమువ్వ: అయితే ఆవిడ ఇక 'కంచి'ని విడిచిపెట్టరేమోనండీ :-) :-) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి