నాకు మూడేళ్ళ వయసున్నప్పుడు అప్పటివరకూ మేం ఉన్న ఇల్లు పడగొట్టి కొత్త ఇల్లు కట్టించారు తాతయ్య. పాతింట్లో ఉండి, కొత్తింట్లో లేని అనేక సౌకర్యాలలో 'చద్దన్నాల గది' ఒకటి. కొత్త ఇల్లు పూర్తవ్వడం, నేను మేతపట్టడం రెండూ ఇంచుమించు ఒకేసారి జరిగాయి. "పాతింట్లో అయితే చక్కగా చద్దన్నాల గదిలో పిల్లల్ని వరసాగ్గా కూర్చోపెట్టి చద్దన్నాలు పెట్టేసేవాళ్ళం. ఇక్కడ అన్నిగదులూ ఒకటే.. చెప్పినా వింటారా," రోజూ చద్దన్నం పెట్టేటప్పుడు మర్చిపోకుండా తల్చుకుని, ఎదురుగా లేకపోయినా సరే, తాతయ్యని ఆడిపోసుకునేది బామ్మ.
అసలు చద్దన్నం తినడం ఒక కళ. వేడన్నం కన్నా కొంచం బిరుసుగా ఉండే ఈ చద్దన్నాన్ని సాధ్యమైనంత ఎక్కువ సేపు పెరుగులో కలపాలి. ఈ కలపడంలో పెరుగు మీగడ వేళ్ళకి అంటుకుని వెన్నగా మారుతుంది. ముందుగా ఆ వెన్న పని పడితే, ఈలోగా పెరుగులో నానిన అన్నం తినడానికి అనువుగా ఉంటుంది. అందులోకి ఏ మాగాయ టెంకో, ఆవకాయ పెచ్చో నంజుకుని తాపీగా తింటూ ఉంటే, చివరి ముద్దకి వచ్చేసరికి ఆవులింత వచ్చి, కళ్ళు మూతలు పడాలి. అయినా బడికెళ్లడం తప్పదనుకో.
చద్దన్నాన్ని పెరుగుతో తింటే భలే బాగుంటుంది కానీ, ఒక్కోసారి ఇంట్లో పెరుగు తక్కువగా ఉంటుంది. అంటే ఒక్కోసారి కొమ్ముల గేది పాలివ్వకుండా కొమ్ము విసురుతుంది చూడూ, అలాంటప్పుడన్న మాట. అప్పుడేమో బామ్మ, పెరుగులేదని చెప్పకుండా, "రాచ్చిప్పలో ముక్కల పులుసు మరుగుతోంది. నీకిష్టమని గుమ్మడి ముక్కలు ఎక్కువేశాను కూడానూ.. ఈపూటకి వేడివేడిగా పులుసోసుకుని తినేసెళ్ళు బాబూ" అని ప్రేమగా చెబుతుందన్నమాట. అప్పటికలా బామ్మ మాట వినేస్తే, మధ్యాహ్నం అన్నంలోకి పెరుగేసి పెడుతుంది.
కాదని "ఇప్పుడే పెరుక్కావాలీ" అని గొడవ చేస్తే మాత్రం, వీపు విమానం మోత మోగిపోతుంది. అందుకని గప్ చుప్ గా పులుసూ అన్నం తినేయడమే. రాత్తిళ్ళు చెప్పాపెట్టకుండా ఎవరన్నా చుట్టాలొచ్చారనుకో. ఆ మర్నాడు అసలు చద్దన్నవే ఉండదు. మరి, రాత్రప్పుడు అప్పటికప్పుడు వంట చేయడం కుదరదు కదా. అందుకని చద్దన్నం కోసం ఉంచిన అన్నాన్ని వాళ్లకి పెట్టేస్తారన్న మాట. పెరుగు లేకపొతే పులుసూ అన్నమైనా తినొచ్చు కానీ, అసలు చద్దన్నవే లేకపొతే బళ్ళో మేష్టారు ఏం చెప్పినా ఒక్క ముక్కా అర్ధమవ్వదు.
మామూలు భోజనం కంచంలో తింటామా? అదే చద్దన్నానికైతే మాత్రం గిన్ని ఉంటుంది. ఆ గిన్నిలో కలుపుకుని తినేయడమే. ఒక్కోసారి అమ్మే కలిపిచ్చేస్తుందనుకో. శీతాకాలంలో గడ్డ పెరుగు భలేగా ఉంటుంది కానీ, వేసంకాలం వచ్చేసరికి కొంచం పులుపు తగులుతుంది. ఉప్పేసుకున్నా బాగోదు. అందుకని అమ్మో ఉపాయం చేసింది. వేసంకాలంలో ముందురోజు రాత్రే మిగిలిన అన్నంలో పాలుపోసి, తోడు పెట్టేయడం. అస్సలు పులుపు లేకుండా కమ్మగా ఉంటుంది. అందులో కూడా మామూలుగానే మాగాయో, మరోటో నంజుకోవచ్చు. అభ్యంతరం ఉండదు.
ఓసారి వేసంకాలానికి బామ్మ ఊరెళ్ళింది. అప్పుడు మా ఇంటికొచ్చిన ఓ చుట్టాలావిడ వాళ్ళింట్లో పిల్లలకి చద్దన్నం కన్నా తరవాణీ ఎక్కువిష్టమని చెప్పింది. నాకు తరవాణీ అంటే ఏంటో అర్ధం కాలేదు. ఆవిణ్ణి అడగబోతోంటే అమ్మ "నే చెబుతాలే" అనేసింది. ఆవిడ వెళ్ళిపోయాక, చద్దన్నాన్నే కుండలో వేసి, గంజీ ఉప్పూ వేసి ఊరబెట్టి తరవాణీ చేస్తారని చెప్పగానే, "మనవూ చేసుకుందావమ్మా" అని టక్కున అడిగేశాను, అమ్మకి నేను ముద్దొచ్చి ఉంటాననుకుని. అబ్బే ఒప్పుకోలా. ఏవిటేవిటో చెప్పి చివరికి తరవాణీ కన్నా చద్దన్నవే మంచిదని తేల్చేసింది.
వేసంకాలం చద్దన్నాల స్పెషలు మావిడిపళ్ళు. పళ్ళు ఎక్కడ ముగ్గేస్తారో తెలుసు కదా.. మనవే కావలసినవి ఏరుకుని తెచ్చుకోడం, చద్దన్నంతో పాటు తినేయడం. ఇంక, అమ్మ నోరు నొప్పెట్టేలా పిల్చే వరకూ మధ్యాహ్నం భోజనానికి వెళ్ళలేం. ఆకలనిపించదు కదా. మిగిలిన రోజుల్లో చక్రకేళి అరిటిపళ్ళూ అవీ ఉంటాయి కానీ, మావిడిపండు రుచి దేనికీ రాదు మరి. అందులోనూ చద్దన్నంతో అయితే ఒకటి తిందామనుకుని రెండు తినేస్తాం. పైగా ఇంట్లో వాళ్ళు కూడా, "ఇప్పుడు కాకపొతే, ఇంకో నెలపోయాకా తిందావన్నా దొరకవూ" అంజెప్పేసి, తినగలిగినన్ని తినెయ్యమంటారు.
చద్దన్నాలు తినే పిల్లలందరిలోనూ శ్రీకృష్ణుడు ఉంటాడని బామ్మ చెప్పింది. కృష్ణుడికి కూడా చద్దన్నం అంటే బోల్డంత ఇష్టంట. "మీగడ పెరుగుతో మేళవించిన చలిది" అని పద్యం కూడా నేర్పేసింది అమ్మ. ఇప్పుడు చద్దన్నం తినడం మర్చిపోయినట్టే, ఆ పద్యమూ మర్చిపోయాను. కృష్ణుడి విషయంలో మాత్రం, "పోతన ఎంత గొప్ప రచయితో కదా.. ఉత్తరాది కృష్ణుడిని దక్షిణాదికి తేవడంలో మీగడ పెరుగులు తినిపించి మరీ తెలుగు నేటివిటీకి తీసుకొచ్చేశాడు" అంటూ చాన్నాళ్ళ క్రితం ఓ మిత్రుడు చెప్పిన మాటలు చద్దన్నాన్ని తలచుకున్నప్పుడల్లా గుర్తొస్తూనే ఉంటాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.
మీ చద్దన్నం చల్లగుండా భలే లాక్కొచ్చారు విషయానికి.
రిప్లయితొలగించండిమీలో బుల్లి కృష్ణుడికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు
చిన్నతనం రోజులన్నీ అలా గుర్తుచేసి ఎటో తీసుకెళ్ళి ఇలా ఇక్కడ మీ టపాలో పడేసారు. బాగుంది నిజమే చద్దన్నం అది కూడా ఒంటరిగా తినడం కన్నా ఇంట్లో ఉన్న పిల్లలన్దరినీ కూర్చోపెట్టి అలా కలిపి పెడుతుంటే మీరు చెప్పినట్టు చిన్నప్పుడు తెలుగు పాఠ్య పుస్తకంలో చదువుకున్న చల్దులారగించుట అనే పాఠ్య భాగం గుర్తొస్తుంది. మీరు చెప్పిన తీరు బాగుంది. మీకు కూడా నవనీతచోరుని జన్మాష్టమి శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిచద్దన్నం కబుర్లు భలే చెప్పారండీ...చిన్నప్పటి రోజుల్లోకెళ్ళిపోయి రావడం ఇష్టం లేక కాసేపు అక్కడే ఉన్నా..పాలు పెరుగు ఎక్కువ దొరకని సమయం లో తరవాణీ అన్నం పెట్టేది అమ్మ. నాకెందుకొ దాని వాసన అంతగా నచ్చేది కాదు..కానీ బలం అదీ ఇదీ అని అమ్మ ఒప్పించేదిలెండి...దాని బలమేనేమో ఇప్పుడు ఇంట్లో అందరికంటే, నేనే ఎక్కువ పనులు ఓపిగ్గా చెయ్యగలుగుతున్నా అని అమ్మకి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటా మనసులో.
రిప్లయితొలగించండిభలే ఉన్నాయండీ చద్దన్నం కబుర్లు. చద్దన్నం లో ఆవకాయ రుచి గుర్తొచ్చి నేరూరుతుంది.
రిప్లయితొలగించండిఇపుడు మిగిలిపోయిన అన్నం కూడా మైక్రోవేవులో పెట్టుకుని వేడి చేసి తినడమే!
మీకూ శుభాకాంక్షలు. ఈ చద్దిపెట్టెలు వచ్చాక అదే (refregirator), చద్దన్నం మాటే లేదు. ఎప్పుడొ ముప్పై యెళ్ళ వెనక్కి లాక్కెళ్ళారు. ఆనుభూతులు కూడా చద్దెన్నం లానె రుచిగా ఉంటాయి:)
రిప్లయితొలగించండిమంచి పోస్టు ...
Govind
మీకూ శుభాకాంక్షలు. ఈ చద్దిపెట్టెలు వచ్చాక అదే (refregirator), చద్దన్నం మాటే లేదు. ఎప్పుడొ ముప్పై యెళ్ళ వెనక్కి లాక్కెళ్ళారు. ఆనుభూతులు కూడా చద్దెన్నం లానె రుచిగా ఉంటాయి:)
రిప్లయితొలగించండిమంచి పోస్టు ...
చాలా బాగా వ్రాసారండి. చద్దెన్నం, పెరుగు, మాగాయ సూపరు కాంబినేషను, నాకు కూడా చాలా ఇష్టం.
రిప్లయితొలగించండి"కొబ్బరి నీళ్ళ జలకాలాడి" పాట లొ కూడా ఈ ప్రస్తావన ఉంది కదా ;)
మురళిగారు మీకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. చద్దన్నంకు కూడా ఒక గది ఉంటుందని ఇప్పుడే తెలిసింది. మా నాన్నగారి చిన్నపుడు ఊరగాయల గది అని ఒకటి ఉండేదిట వాళ్ళింటిలో. దానిలోకి మడికట్టుకొన్న వాళ్ళకే ప్రవేశంట.
రిప్లయితొలగించండి>>చద్దన్నాలు తినే పిల్లలందరిలోనూ శ్రీకృష్ణుడు ఉంటాడని బామ్మ చెప్పింది. కృష్ణుడికి కూడా చద్దన్నం అంటే బోల్డంత ఇష్టంట
పెద్దల మాట చద్దన్నం మూట కదండీ :)
అమ్మమ్మ గారింట్లో ఎవరో ఒకరికి ఈ డ్యూటీ ఉండేది. పేద్ద స్టీల్ బేసిన్ తెచ్చి దాంట్లో చద్దన్నం ఆవకాయ/మాగాయ, మట్టు గిన్నెడు నూనె వేసి కలిపి.. చుట్టూ చిన్నారి చేతులు.. గజ నిమ్మకాయ సైజ్ లో బంతులు చేయటం.. ఒక్కోదాంట్లో round-robin మెథడ్ లో పెడుతూ పోవటం..
రిప్లయితొలగించండిఇప్పటి పిల్లలకి ఇడ్లీ,దోసలు కూడా కొంత మంది ఓల్డ్ ఫాషన్ అనేసుకుంటున్నారు :)
ఈ కలపడంలో పెరుగు మీగడ "వీళ్ళకి" అంటుకుని వెన్నగా మారుతుంది
రిప్లయితొలగించండిహ్హహ్హహ్హ ఎవళ్ళకి అంటుకుంటుంది మురళీ గారూ???
అప్పుడించక్కా ఆ వేళ్ళు అలా కొసంటా నాక్కుంటే భలే రుచిగా ఉంటుంది కదూ.
మాకు చద్దన్నం తినడానికి సీవెండి(సీమవెండి)కంచాలుండేవి.ప్రత్యేక ప్రదర్శన విత్ గోచీస్(గోచీ పెట్టుకుని మాత్రమే తినాలి).
హేవిటో ఇప్పుడు చద్దన్నం కోసం ఎక్కడికి పరిగెత్తాలబ్బా????
"శంకరాభరణం" సినిమాలో మా కావుడికి ఏ అలవాట్లూ లేవు బాబుగారు,చక్కగా చద్దన్నం తింటాడు ఇప్పటికీ వెర్రినాగన్న అంటే అల్లూ అంటాడు ఒప్పేసుకోరా ఈ రోజుల్లో కూడా చద్దన్నం తినే అల్లుడెక్కడ దొరుకుతాడ్రా...(అప్పట్నించీ కాముడు అన్న పేరున్న వాళ్ళని చద్దన్నం కాముడు అని ఏడిపిచేవాళ్ళం)
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.
eppaTilaagae manchi Tapaa!
రిప్లయితొలగించండిమీ చిన్నతనంలోకి తీసుకుపోయారు. నా చిన్నతనం ఎలాగూ గుర్తొచ్చింది.
రిప్లయితొలగించండిరోజూ చద్దెన్నం, ఈ రోజు మాత్రం బోలెడు కృష్ణాష్టమి పిండివంటలు ఆరగిస్తూ, మాకు మంచి మంచి టపాల విందు భోజనం పెడుతూ ఉండండి.
కృష్ణాష్టమి శుభాకాంక్షలు.
అవును చెప్పడం మరిచాను అసలు "తరవాణి" ఓ పెద్ద గ్లాసుడు తాగేసి మండుటెండలో కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా ఠీవిగా నడిచివెళ్తుంటే అంత సూరీడూ తలదించేసుకోడూ సిగ్గుతో
రిప్లయితొలగించండిమేమెప్పుడూ వేడి అన్నం + పెరుగు + దబ్బకాయ ఆవ్కాయా ఊదుకుంటూ ఉండగా... రిక్షా వచ్చేసేది. ప్రపంచం తల్లకిందులైపోయినా, అన్నం వదలడానికి వీల్లేదనేది అమ్మ ! సో - ఎప్పుడూ తిండి లేట్, స్కూల్ కి లేట్ & మా రిక్షామేట్స్ అందరూ మోకాళ్ళెయ్యడం, గోడకుర్చీలెయ్యడం - మా వల్ల పాపం! (పొద్దున్న అన్నం పెడుతుందని ఆ రోజుల్లో అమ్మ మీద కోపం కూడా వుందేది.) :D
రిప్లయితొలగించండిHappy Janmastami.
"పోతన ఎంత గొప్ప రచయితో కదా.. ఉత్తరాది కృష్ణుడిని దక్షిణాదికి తేవడంలో మీగడ పెరుగులు తినిపించి మరీ తెలుగు నేటివిటీకి తీసుకొచ్చేశాడు"
రిప్లయితొలగించండిమీ స్నేహితుడు అద్భుతంగా చెప్పారు.
నేను చద్దన్నం/తరవాణి తినేవాడిని ఊరెళ్ళి నపుడు ఆవకాయ వేసుకుని. పిల్లలందరం కూర్చుని ఒకే కంచం లో తినేవాళ్ళం. ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకెళ్ళి పోయారు.
మజ్జిక నీల్లల్ల్లో రాత్రి నానేసి మర్నాడు తినేది అనుకున్నా. మరి దానిని ఏమంటారు
ముందురోజు రాత్రే మిగిలిన అన్నంలో పాలుపోసి, తోడు పెట్టేయడం.
రిప్లయితొలగించండిచిన్నప్పుడూ, ఇప్పటికీ అప్పుడప్పుడూ ప్రొద్దున్నే ఇదే టిఫిన్ మాకు. బాగుందండీ టపా. మీకూ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.
Ha ha nice one Murali gaaru !
రిప్లయితొలగించండిఐతే నాలోనూ కృష్ణుడున్నాడన్నమాట! పొద్దున్నే చద్దన్నంలో ఇంత చింతకాయ/గోంగూర/మాగాయ/ఆవకాయ పచ్చడి వేసికొని ఒకసారి, తర్వాత గడ్డపెరుగు కలుపుకొని అదే పచ్చడి నంచుకుంటే (గోంగూర పచ్చడైతే ఉల్లిపాయలు నంచుకోడానికి తప్పనిసరి) - ఆహా! ఇంజినీరింగులోనూ నా ఉదయం ఫలహారం అదే. ఇడ్లీ-దోశ వంటివి ఆదివారం మరియు సెలవురోజుల్లోనే - పాపం అమ్మని కష్టపెట్టకూడదు కదండీ.
రిప్లయితొలగించండిమీరు ఎప్పటిలాగే మంచి జ్ఞాపకాలని పంచుకొని మావీ తట్టిలేపారు.
భాగవతము దశమస్కంధము-పూర్వభాగము (496-498)
రిప్లయితొలగించండిసీ.
మాటిమాటికి వ్రేలు మడిచి యూరించుచు నూరుఁగాయలు దిను చుండు నొక్కఁ
డొకనికంచములోని దొడిసి చయ్యన మ్రింగి చూడు లే దని నోరు సూపు నొక్కఁ
డేగు రార్గురచల్దు లెలమిఁ బన్నిద మాడి కూర్కొని కూర్కొని కుడుచు నొక్కఁ
డిన్ని యుండఁగఁ బంచి యిడుట నెచ్చెలితన మనుచు బంతెనగుండు లాడు నొకఁడు
ఆ.
కృష్ణుఁ జూడు మనుచుఁ గికురించి పరు మ్రోల, మేలిభక్ష్యరాశి మెసఁగు నొకఁడు
నవ్వు నొకఁడు సఖుల నవ్వించు నొక్కఁడు, ముచ్చటాడు నొకఁడు మురియు నొకఁడు.
వ.
అయ్యవసరంబున.
సీ.
కడుపున దిండుగాఁ గట్టినవలువలో లాలితవంశనాళంబుఁ జొనిపి
విమలశృంగంబును వేత్రదండంబును జాఱి రానీక డాచంక నిఱికి
మీఁగడపెరుఁగుతో మేళవించినచల్దిముద్ద డాపలిచేత మొనయ నునిచి
చెల రేఁగి కొసరి తెచ్చినయూరుఁగాయలు వ్రేళ్లసందులయందు వెలయ నిఱికి
ఆ.
సంగడీలనడుమఁ జక్కఁగఁ గూర్చుండి, నర్మభాషణముల నగవు నెఱపి
యాగభోక్త కృష్ణుఁ డమరులు వెఱఁగంద, శైశవంబు మెఱసి చల్ది గుడిచె.
@పక్కింటబ్బాయి: 'చల్లగుండా..' ఎన్నాళ్ళయిందండీ ఈ మాటవిని!! ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@ రసజ్ఞ : ధన్యవాదాలండీ..
@ఎన్నెల: అయితే తరవాణీ బలం మిస్సయ్యనన్నమాట నేను!! ధన్యవాదాలండీ..
@శ్రీ: అవునండీ, మైక్రోవేవ్ వచ్చి చద్దన్నం లేకుండా చేసింది :( ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@రాజన్: చద్ది పెట్టె :))) ..ధన్యవాదాలండీ..
@చాతకం: 'మాగాయా మహాపచ్చడీ..' అంటూ, పెరుగన్నం మాగాయ కాంబినేషన్ గురించండీ ... ధన్యవాదాలు.
@శ్రీ: అవునండీ, చద్దన్నం మూటే!! ధన్యవాదాలు
రిప్లయితొలగించండి@కృష్ణ ప్రియ: రౌండ్ రాబిన్ మెథడ్!!! ..ధన్యవాదాలండీ..
@శ్రీనివాస్ పప్పు: టపా పోస్ట్ చేశాక, కాసేపు బ్లాగు కనిపించనందండీ.. దాంతో అప్పుతచ్చులు చూసుకోలేదు.. మీ వ్యాఖ్య చూడగానే నాలిక్కరుచుకుని టక్కున సరిచేసేశా.. అన్నట్టు మాక్కూడా ఓ చద్దన్నం కాముడు ఉన్నాడండోయ్.. రాస్తూ తలచుకున్నా.. తరవాణి తాగని దురదృష్టవంతుడిని ఇలా ఊరించడం మీకు భావ్యమా చెప్పండి? ధన్యవాదాలు.
@సునీత: ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి@కొత్తావకాయ: :))) ధన్యవాదాలండీ..
@సుజాత: దబ్బావకాయ?!! నాకు దబ్బకాయ ఉడకపెట్టి చేసే పచ్చడి తెలుసు కానీ, ఈ దబ్బావకాయ పూర్తిగా కొత్తదండీ.. ధన్యవాదాలు.
@వాసు: అవునండీ.. వినగానే 'నిజమే కదా' అనిపించింది.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@శిశిర: ఆరోగ్యకరమైన డైట్ అండీ.. ధన్యవాదాలు.
@శ్రావ్య వట్టికూటి: ధన్యవాదాలండీ..
@జేబీ: అవునండీ, అమ్మని కష్ట పెట్టకూడదు! ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@శేష: అబ్బ!! ఎన్నాళ్ళయిందో చదివి.. ధన్యవాదాలండీ..
Round Robin Method :) ఏదో ఆఫీసు పని ఆలోచిస్తూ అలా రాసా. అంటే నా ఉద్దేశ్యం వరసగా గుండ్రం గా కూర్చున్న పిల్లలకి వృత్తం గా పెడుతూ పోవటం
రిప్లయితొలగించండిBagundadi
రిప్లయితొలగించండి@కృష్ణప్రియ: చద్దన్నం నుంచి రౌండ్ రాబిన్ మెథడ్ లోకి వెళ్ళారు కదండీ.. అందుకని ఆశ్చర్యం కలిగింది, అంతే..
రిప్లయితొలగించండి@రాధిక (నాని): ధన్యవాదాలండీ..
హ్మ్ ! ఆశ్చర్యం మీకు దబ్బావకాయ తెలియదా ? అచ్చు నిమ్మకాయ పచ్చడి లాగే చేస్తారు అది కూడా :)))
రిప్లయితొలగించండిదబ్బకాయ ముక్కలు ఉప్పు, పసుపు వేసి ఊరబెట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడూ కారం కలుపుకుంటారు కొంతమంది. ఏకంగా కారం, ఇంగువనూనె కలిపేస్తారు ఇంకొంతమంది. దీన్నే దబ్బావకాయ అందురు. సదరు ఊరబెట్టిన ముక్కలు ఉడికించి మెంతిపొడి, బెల్లం కావాలంటే బెల్లం వేసి చేసేదే దబ్బకాయ (ఉడకబెట్టిన) పచ్చడి. మురళిగారి దబ్బకాయ పచ్చడి, శ్రావ్య గారి దబ్బావకాయ కి అదీ తేడా, సంబంధం. కరక్టేనా?
రిప్లయితొలగించండి@శ్రావ్య వట్టికూటి: నిజమండీ, తెలీదు :( ఉడికించి చేసే పచ్చడి తెలుసంతే.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@కొత్తావకాయ: అబ్బబ్బే.. ఊరబెట్టాల్సిన పని అస్సలు లేదండీ.. దబ్బకాయ డైరెక్టుగా చెట్టు మీద నుంచి పొయ్యిమీదున్న గిన్నెలోకి పడడమే, ముక్కలుగా.. (కర్వేపాకు చెట్టుమీద నుంచి చారులో పడాలన్న అప్పదాసుగారు గుర్తొచ్చారు లెండి!!) మెంతిపోడీ, బెల్లం.. ఇవన్నీ మామూలే అనుకోండి .. ఈ కారం, ఇంగువ నూనె ఆవకాయ ఎప్పుడూ తినలేదు :( తెలియని విషయాలు ఎన్నున్నాయో చుట్టూరా :(( ...ధన్యవాదాలండీ..