వెలుతురు జ్ఞానానికి ప్రతీక అయితే, చీకటి అజ్ఞానానికి ప్రతీక. వెతికి చూడగలిగితే అజ్ఞానంగా అనుకునే దానిలోనూ ఏదో జ్ఞానం కనిపించక మానదు. చదువూ సంధ్యా లేని సంచార జీవి డిబిరిగాడిలో అలాంటి జ్ఞానమే కనిపించింది కెప్టెన్ వర్మకి. ఆర్మీలో పనిచేసి రిటైరైన వర్మకీ, తిరిగిన ఊరు తిరగకుండా తిరిగే 'నక్కలోడు' డిబిరిగాడికీ ఉన్న ఒకే ఒక్క పోలిక 'వేట.' అవును, వర్మకి వేట సరదా అయితే, డిబిరిగాడికి మాత్రం అదే బతుకు తెరువు. వర్మ వాడేది డబుల్ బారెల్ గన్నయితే, డిబిరిగాడిది ఎంతో చరిత్ర ఉన్న నాటు తుపాకీ.
వాళ్ళిద్దరి పరిచయమూ అతి స్వల్పమే అయినా, ఒకసారి చదివాక మర్చిపోలేం. డిబిరిగాడికీ-కెప్టెన్ వర్మకీ జరిగిన సంభాషణ ద్వారా డిబిరి జీవితంలో 'చీకటి' ని పాఠకుల కళ్ళకి కట్టారు ప్రముఖ కథా రచయిత అల్లం శేషగిరి రావు. 'చీకటి' కథ ప్రారంభమే కెప్టెన్ వర్మ, తన రిట్రీవర్ డాగ్ సీజర్ సాయంతో ఓ శీతాకాలపు తెల్లవారుజామున, వలస వచ్చే బాతుల వేటకి ప్రయాణం కావడం. చలికి తట్టుకోలేక వర్మ కాల్చిన సిగరెట్టూ, ఓ పక్షి గుంపు కనిపించగానే యధాలాపంగా పేల్చినా తుపాకీ డిబిరిగాడి వేటకి అడ్డంకిగా మారి, ఆరోజుకి మరి వాడికి వేటకేమీ లేకుండా చేస్తాయి.
అరవయ్యేళ్ళ డిబిరికి ఒంటిమీద గోచీ తప్ప మరేమీ లేదు. ముడి వేసిన జుట్టూ, చెవులకి మెరిసే చెవి పోగులూ. పోలీసు దెబ్బలకి కదుములు కట్టిన బక్క పల్చని శరీరం. వాడికి సాయం ఓ పెంపుడు కొంగ, అది కూడా గుడ్డిది. చలిమంట వేసుకుని, సారా తాగుతూ, వేట నుంచి తిరిగి వెళ్ళిపోతున్న వర్మని చలి కాగడానికి రమ్మని ఆహ్వానిస్తాడు డిబిరిగాడు. వర్మ వేషం చూసి అతనేమీ భయపడ్డు. సాటి వేటగాడిగా ఆహ్వానిస్తాడు, అంతే. వర్మ ఇచ్చిన సిగరెట్ కాల్చుకుంటూ తన కథ చెప్పుకొస్తాడు డిబిరి.
తనని ఉంచుకున్న ఆడమనిషి మరణంతో మొదలు పెట్టి, తన బాల్యం, పోలీసుల చేతిలో తండ్రి పడ్డ చిత్రహింసలు, నిష్కారణంగా తనని హింసించిన పోలీసుల మీద ప్రతీకారం తీర్చుకుంటూ, నాటు తుపాకీతో తండ్రి ఓ పోలీసుని హతమార్చడం, తండ్రికి ఉరిశిక్ష పడడం..ఇలా జీవితంలో ఒక్కో సంఘటననీ నిర్వికారంగా చెప్పుకుంటూ పోతాడు డిబిరి గాడు. తన కథ చెబుతూనే, మధ్య మధ్యలో పక్షుల వేటలో కిటుకులని ఒక్కొక్కటిగా విప్పి చెబుతాడు వర్మకి. తుపాకి నింపడం మొదలు, ఎర వేయడం వరకూ ప్రతి విషయంలోనూ డిబిరి కి ఉన్న నిశిత పరిశీలనా దృష్టి అబ్బుర పరుస్తుంది కెప్టెన్ వర్మని.
"డిబిరిగాడిది, వాడి జీవితంలాగే భాష కూడా వేరు. సంచార జాతి. అన్ని యాసలూ కలగాపులగం. అరవం, ఉరుదూ ముక్కలు, అక్కడక్కడా ఇంగ్లిష్ చమక్కులు వాడి జీవిత దర్పణంలా ప్రతిబింబిస్తున్నాయి. ఆ నిశ్శబ్దంలో డిబిరిగాడి మాటల్ని తనకి అర్ధమయ్యే భాషలో అనువదించుకుని మనస్సుతో అర్ధం చేసుకుంటున్నాడు వర్మ. భాషా సంకెళ్ళని తెంచుకుని రెండు మనస్సులు మాట్లాడుకొంటున్నాయి. కెప్టెన్ వర్మకి కళ్ళు చెమరుస్తున్నాయి." అంటారు రచయిత ఒక చోట. ఇక, సంచార జీవితాన్ని గురించీ, మరీ ముఖ్యంగా వాళ్ళ వేట పద్ధతులని గురించీ డిబిరి చేత చెప్పించింది చదివినప్పుడు రచయిత పరిశీలనా దృష్టిని అభినందించకుండా ఉండలేం.
"ఏ జాతి పిట్టల్ని పట్టుకోవాలనుకుంటే ఆ జాతి పిట్టనే మచ్చిక చేసుకోవాలి. ముందుగా దానికి చూపు లేకుండా చేసేయాలి. వలేసి దాని మీద పెట్టాల. దాన్ని చూసి ఆ జాతి పిట్టలన్నీ భయం లేకుండా దాని దగ్గర దిగిపోయి వలలో తగులుకొని చిక్కడిపోతాయి. మచ్చిక చేసిన పెంపుడు పిట్ట వెలుతురు చూడకూడదు. చూస్తే ఎగిరిపోయి దాని జాతి మందలో కలిసిపోద్ది. చూపులేని పిట్టతో చూపున్న పిట్టల్ని వలేసి పట్టుకోవడం. అదే ఈ వేటలో తమాషా.." అని డిబిరి చేత చెప్పిస్తూనే, తాను చెప్పదల్చుకున్నది కూడా చెప్పేశారు రచయిత.
డిబిరి తండ్రి ఉరిశిక్ష సన్నివేశంతో పాటుగా, కథలో ముగింపు సన్నివేశం కూడా చాలా రోజుల పాటు విడవకుండా వెంటాడుతుంది. మరీ ముఖ్యంగా కథని కళ్ళకి కట్టినట్టుగా రాయడంలో రచయిత చూపిన ప్రతిభ కారణంగా చదివిన కథంతా మళ్ళీ మళ్ళీ కళ్ళ ముందు తిరుగుతుంది. కథా స్థలం, వాతావరణం, పాత్రల రూపు రేఖలు అన్నీ అప్రయత్నంగానే పాఠకుల ఊహలోకి వచ్చేస్తాయి. "ఒక్క మాటలో చెపితే సోమర్ సెట్ మాం కథల్లో లాంటి నిశిత పరిశీలన ఈ కథలో నన్ను ఆకట్టుకున్న ప్రధానాంశం" అన్నారు వంశీ, తన సంకలనం 'వంశీకి నచ్చిన కథలు' లో 'చీకటి' కథని చేర్చడానికి కారణాన్ని వివరిస్తూ.
కధ చదివినవాళ్లకి చీకటి గుబులు, చిత్తడి నేల చిరాకు, చిరు వర్షం గిలి, అలవాటు లేక పోయినా సిగరెట్ పొగ వెచ్చదనం, సంచార జాతుల విచిత్ర జీవన దైన్యం, వేట లోని మెళకువలూ, అన్నీ ప్రత్యక్షం గా అనుభవింపజేస్తుంది . ముఖ్యంగా మూడో పాత్ర దిబిరిగాడి నత్తగొట్టు కధ చదివిన చాలా రోజులు నన్ను వెంటాడింది. మంచి కధ. చదివినప్పుడల్లా ..."లఫాకిలపధన్.. లఫాకిలపధన్..డ్రు.. డ్రు..చడిక్.. చడిక్ ...!!" అనిపిస్తుంది. థాంక్ యు.
రిప్లయితొలగించండిఈ కథ నాకు చాలా ఇష్టం. సమీక్షలో కథ గురించి చెప్పాల్సినంతా చెప్పగలిగినంతా చెప్పారు.
రిప్లయితొలగించండిరెండు నెలల క్రితం విజయవాడ వెళ్ళినప్పుడు ఈ పుస్తకం కొన్నాను.
రిప్లయితొలగించండిచాలా కథలు చదివాను కాని ఈ కథ చదవలెదు. మీరు వ్రాసాకా నిన్న చదివాను.
ఈనాటి పాఠకులకి చాలా విచిత్రమైన కథ. ఈ కథని వ్రాయడం ఎంత కష్టమో పరిచయం చేయడం కూడా అంతే కష్టం. అభినందనలు.
నాకు ఈ కథ తరువాత ప్రచురించిన "చీకటి పువ్వు" కథ కూడా ప్రత్యేకంగా అనిపించింది. అలాంటి కథ నేనెప్పుడూ చదవలేదు.
మీరు కాళీపట్నం రామారావు గారి కథలు చదివే ఉంటారు.
అందులో నాకిష్టమైన "కుట్ర" కథని ఈ నాటి పాఠకులకి మీరు పరిచయం చేయాలని నా కోరిక.
@ఆత్రేయ: అవునండీ.. నాకైతే కెప్టెన్ వర్మతో పాటుగా నేను కూడా చలి కాగుతూ డిబిరి కథ విన్న అనుభూతి.. అప్పుడప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@పక్కింటబ్బాయి: నిజంగా!! ధన్యవాదాలండీ..
@బోనగిరి: 'చీకటిపువ్వు' లాంటివి మరికొన్ని కథలు ఉన్నాయండీ.. ఉదాహరణకి 'ప్రియే! చారులతే..' కారా మాస్టారి 'యజ్ఞం' గురించి టపా రాశానొకసారి.. 'కుట్ర' గురించి కూడా తప్పక రాస్తాను.. ధన్యవాదాలు.