మంగళవారం, జూన్ 16, 2009

నాయికలు-అనూరాధ

పెళ్ళయిన తర్వాత ఆడపిల్ల అప్పటి వరకూ తను గడిపిన జీవితాన్ని శూన్యం చేసుకోవాలా? అప్పుడు మాత్రమే కొత్త మనుష్యుల మధ్య, కొత్త వాతావరణం లో తను ఏ ఒడిదుడుకులు లేకుండా సంతోషంగా ఉండగలుగుతుందా? అత్తవారింట్లో అడుగుపెట్టి, అక్కడ ఇమడలేక ఇబ్బంది పడుతున్న అనూరాధ మనస్సులో జరిగిన సంఘర్షణ ఇది. తన తప్పేమీ లేకుండానే అత్తగారికి తను శత్రువుగా ఎందుకు మారింది? ఆమెతో స్నేహం సాధ్యమేనా? ఇవి అనూరాధను తొలిచేసిన ప్రశ్నలు.

ఉమ్మడి కుటుంబ వాతావరణాన్ని, వ్యవసాయ రంగ సంక్షోభాన్ని నేపధ్యంగా తీసుకుని చంద్రలత రాసిన 'రేగడి విత్తులు' నవలలో ఓ ప్రధాన పాత్ర అనూరాధ. నవలలో ప్రధాన పాత్ర రామనాధం చెల్లెలు దమయంతి కూతురు ఈమె. అనూరాధ పసిపిల్ల గా ఉండగానే ఆమె తల్లిదండ్రులూ ఓ పడవ ప్రమాదం లో మరణించడంతో మేనమామ ఇంట పెరుగుతుంది. రామనాధం కొడుకు సుధాకర్ ని అనూరాధకి ఇచ్చి చేయాలని పిల్లల చిన్నప్పుడే పెద్దవాళ్ళు నిర్ణయిస్తారు.

గుంటూరు జిల్లా రేపల్లె ప్రాంతానికి చెందిన రామనాధం, వ్యవసాయం మీద మక్కువతో ఉద్యోగం వదిలి మహబూబ్ నగర్ జిల్లా నడిగడ్డలో నల్లరేగడి నేల కొని వ్యవసాయం మొదలు పెడతాడు. తోటి రైతు బాలయ్య కొడుకు మల్లేష్ ను సుధాకర్ తో పాటే పట్నంలో ఉంచి చదివిస్తాడు. తొలి చూపులోనే ప్రేమలో పడతారు అనూరాధ-మల్లేష్ లు. బావని తన భర్త గా ఊహించుకోలేక పోతున్నానని మేనమామకి చెబుతుంది అనూరాధ. ఆమె మనసెరిగిన రామనాధం మల్లేష్ తో ఆమె వివాహం జరిపిస్తాడు.

రెండు ప్రాంతాల సంస్కృతీ సంప్రదాయాల సంగమం ఆ వివాహం. ఒకరి పద్ధతులు, ఆచారాలు మరొకరికి పూర్తిగా కొత్త. ఇరు వర్గాల పురోహితులూ ఇరువైపుల పద్ధతులూ పాటిస్తూ జరిపిస్తారు వివాహాన్ని. రచయిత్రి నవలలో సుదీర్ఘంగా రాసిన సన్నివేశాలలో ఈ వివాహం ఒకటి. ఈనవలలో నాకు చాలా ఇష్టమైన సన్నివేశం ఇది. ప్రధానం మొదలు అప్పగింతల వరకు ప్రతి తంతునీ వర్ణించారు చంద్రలత. మల్లేష్ తల్లి నారాయణి కి తన మేనకోడలిని కలుపుకోవాలని ఉన్నా, కొడుకు ఇష్టాన్ని మన్నిస్తుంది. కోడలు తనకి నచ్చినా, 'చదువుకున్న పిల్ల' అనే భయమూ ఉంటుంది.

పెళ్లి తర్వాత మల్లేష్ పై చదువు కోసం పట్నం వెళ్ళడంతో అత్తవారింట సమస్యలు మొదలవుతాయి అనూరాధకి. తను వరి అన్నం తిని పెరిగింది. అత్తవారింట తినేది జొన్న రొట్టెలు. పుట్టింట వంటలో వాడేది ఎండు మిరపకాయ కారం, అత్తవారి ఇంట్లో రొట్టెల్లోకి పచ్చిమిరపకాయ నూరిన మసాలా కూరలు తప్పనిసరి. పుట్టింట వంట మట్టిపాత్రల్లో, ఇక్కడ ఇత్తడి, కంచు గిన్నెలతో. అప్పుడప్పుడూ వచ్చి వెళ్ళే భర్తకి తన సమస్యలు చెప్పుకోలేదు, పుట్టింటివారికి చెప్పి వాళ్ళని బాధ పెట్టలేదు. ఇంట్లోనే ఓ గదిలో పశువులని కట్టేసే అలవాటు (దొంగల భయం వల్ల) ఉండడంతో సరైన గాలి కూడా ఉండదు రాత్రిళ్ళు.

వీటన్నింటికన్నా పెద్ద సమస్య అత్తగారికి కోడలి పట్ల మొదలైన అసహనం. కోడలు నెల తప్పకపోవడం అవమానంగా భావిస్తుంది నారాయణి. జీవితంలో సెటిల్ అయ్యాకే పిల్లల్ని కనాలని నిర్ణయించుకుంటారు భార్యాభర్తలు. అత్తగారి ఆశ కోడలికి, కొడుకు-కోడలి నిర్ణయం అత్తగారికి తెలియక పోవడం వల్ల ఏర్పడ్డ కమ్యునికేషన్ గ్యాప్. గుళ్ళు, గోపురాలు తిప్పుతూ, మొక్కులు మొక్కుతూ వాటిని కోడలి చేత తీర్పిస్తూ ఉంటుంది నారాయణి. తనకి ఎన్నడూ తెలియని ఆ ఆచారాలు పాటించలేక, అత్తగారికి ఎదురు చెప్పలేక, అసలు తను అవన్నీ ఎందుకు చెయ్యాలో తెలియక నలిగిపోతూ ఉంటుంది అనూరాధ.

అత్తగారి అసహనానికీ, మొక్కులకీ కారణం తెలిసిన రోజున పగిలిన అగ్ని పర్వతమే అవుతుంది అనూరాధ. ఆమె పరంగా అత్తగారికీ తనకీ మధ్య పూడ్చలేని అగాధమే ఏర్పడుతుంది. మల్లేష్ చదువు పూర్తయ్యాక అనూరాధ నెలతప్పడంతో ఆమెని పువ్వుల్లో పెట్టుకుని చూసుకోడం మొదలు పెడుతుంది నారాయణి. ఒకప్పటి ఆమె అసహనానికీ, ఇప్పటి ప్రేమకీ భేదం కనిపించదు అనూరాధకి.

పురిటికి పుట్టింటికి వెళ్ళినప్పుడు తన సమస్యని మేనమాకి చెప్పుకుంటుంది ఆమె. "నువ్వు నువ్వుగా ఉండు. అలా ఉంటూనే ఎదుటి వాళ్ళలో మార్పు కోసం ప్రయత్నించు. చిత్తశుద్ధితో నువ్వు చేసే ప్రయత్నం ఫలితం ఇస్తుంది. ఏం చేయాలన్నది నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం" అంటాడు రామనాధం. నవల ముగింపుకి వచ్చేసరికి అత్తగారితో సయోధ్య సాధిస్తుంది అనూరాధ.

15 కామెంట్‌లు:

  1. "నువ్వు నువ్వుగా ఉండు. అలా ఉంటూనే ఎదుటి వాళ్ళలో మార్పు కోసం ప్రయత్నించు. చిత్తశుద్ధితో నువ్వు చేసే ప్రయత్నం ఫలితం ఇస్తుంది. ఏం చేయాలన్నది నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం"
    మంచి సందేశం మీ టపా ద్వారా తెలియచెప్పారు.

    రిప్లయితొలగించండి
  2. ఇంత మంచి నవలను పరిచయం చేసిన మీకు అభినందనలు
    మురళి గారు సినిమా కి వెళ్తే రివ్యూ రాయండి మర్చిపోకుండా

    రిప్లయితొలగించండి
  3. ఈ కథ చదువుతుంటే నా కథ లానే ఉంది, సుమారుగా. వెంటనే ఈ పుస్తకం చదవాలి. మంచి పుస్తకం పరిచయం చేసినందుకు థాంక్స్. తెలుగు సాహిత్యం లో ఎన్ని మంచి పుస్తకాలు ఉన్నాయో, ఎన్ని మిస్స్ అయ్యానో అర్థం అవుతోంది "పుస్తకం" చూసాక.

    రిప్లయితొలగించండి
  4. ఇంతకు ముందే ఎవరో చెప్పినట్లు చదవాల్సిన పుస్తకాల జాబితాని పెంచేస్తున్నారు మురళి గారు. కానీ మీ చక్కని పరిచయం ద్వారా మంచి పుస్తకాలని ఎన్నుకుని చదువుకోగలిగే అవకాశాన్ని ఇస్తున్నందుకు శతకోటి వందనాలు.

    రిప్లయితొలగించండి
  5. Too good, in particular "నువ్వు నువ్వుగా ఉండు. అలా ఉంటూనే ఎదుటి వాళ్ళలో మార్పు కోసం ప్రయత్నించు. చిత్తశుద్ధితో నువ్వు చేసే ప్రయత్నం ఫలితం ఇస్తుంది. ఏం చేయాలన్నది నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం" is beautiful

    రిప్లయితొలగించండి
  6. manchi pustakam parichayam chesinanduku dhanyavadalu. maa kosam manchi manchi reviews raastunnandulu dhanyavadalu.

    innallu kevalam eenadu pustakam lo vache sameeksha chadivi nachina pustakalni konukkune danni..ippudu mee parichayam dwara marinni manchi pustakalu yennukuni chaduvukogalige avakasam kaligindi. chala chala chala thanks muraligaru.

    రిప్లయితొలగించండి
  7. చాలా బాగుంది మురళి మీ పుస్తకావిష్కరణ. ఎంతో సున్నితమైన సమస్య, "ఏం చేయాలన్నది నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం" మంచి మాట..

    రిప్లయితొలగించండి
  8. రేగడి విత్తులు ..వంటి మంచి నవలను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  9. మీ దగ్గర ఎంత పెద్ద గ్రంధాలయముందో తెలిస్తే బ్లాగరులందరం దండెత్తి వద్దామనుకొంటున్నాం మురళి గారూ ! ఎవరెవరొస్తారొ చేతులెత్తండోచ్ ...

    రిప్లయితొలగించండి
  10. @పద్మార్పిత: నేను నవలలో వాక్యాన్ని కాపీ చేశానండి అంతే.. ధన్యవాదాలు.
    @హరే కృష్ణ: తప్పకుండానండి.. ధన్యవాదాలు.
    @ప్రతిభ ప్రకాష్: తప్పక చదవండి, మిమ్మల్ని నిరాశ పరచదు.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. @వేణూ శ్రీకాంత్: నేను చదవాల్సిన పుస్తకాల జాబితా కూడా పెద్దదేనండీ.. ధన్యవాదాలు.
    @లక్ష్మి: ధన్యవాదాలు.
    @ప్రణీత: ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. @భావన: ధన్యవాదాలు.
    @కథాసాగర్: ధన్యవాదాలు.
    @పరిమళం: మీరు పెద్ద అపోహలో ఉన్నారండి.. నేను పుస్తకాలు జాగ్రత్త చేయడం మొదలు పెట్టింది ఈ మధ్యనే.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. చదివిన గుర్తే పూర్తిగా నెమరేయలేకపోతున్నాను. ఈ మధ్య ఒక చిన్న write up emails ద్వారా వచ్చింది. అందులో నీలా, నీ చెల్లిలా పెరిగొచ్చిన ఆ పిల్ల, ఒక్కరోజులో ఉదయన్నే మీరింకా పడుకుని వుండగా తను మాత్రం లేచి కిచెన్ లో పని చేయాలా అని ప్రశ్న వుంటుంది. ఇంకా చాలా అడుగుతుంది. వ్యక్తిత్వం కాపాడుకోవాలకున్న ప్రతి ఆడపిల్ల ఇదే సంఘర్షణకి గురి అవుతుంది. సయోధ్య రెండు పక్షాల్లో కావాలని కోరిక వుంటేనే కలుగుతుంది. అయినా కూడా ఏదైనా రాజీ వస్తే అది కోడలి నుంచే వస్తుంది నేను చూసినంతలో. తల్లి అత్త పాత్రల్లో తనకు తెలియకుండానే స్త్రీ ఎంతో వ్యత్యాసం చూపుతుంది. దీనికి కూడా అలా మలచిన కుటుంబ వాతావరణమే కారణం. సయోధ్య అవసరం రాని అనురాధని నేను, కాని అడుగకనే నా మనసుని బట్టి కొన్ని సర్దుబాట్లూ చేసుకుంటాను.

    రిప్లయితొలగించండి
  14. నేను రాద్దాం అనుకున్నది ప్రతిభగారు రాసేసారు.అయితే పుస్తకం చదవాల్సిందే!

    రిప్లయితొలగించండి