కవి, రచయిత, నాటక కర్త, విమర్శకుడు ఇంద్రగంటి హనుమఛ్ఛాస్త్రి రచనల్ని పునర్ముద్రిస్తుండడం సాహిత్యాభిమానులకు సంతోషాన్ని కలిగించే విషయం. ఇప్పటికే వారి ఆత్మకథ 'గౌతమీ గాథలు' అచ్చులోకి వచ్చి ఈ తరం వారి అభిమానాన్ని కూడా చూరగొంది. పందొమ్మిదివందల ముప్ఫయ్యో దశకంలో మొదలు పెట్టి తర్వాతి యాభయ్యేళ్ళ కాలంలో హనుమచ్చాస్త్రి రాసిన కథలు అక్షరాలా ఇరవై తొమ్మిది. వీటిలో ఒక్క అలభ్య కథ మినహా, మిగిలిన 28 కథలతో 'అనల్ప' ప్రచురణ సంస్థ తీసుకువచ్చిన సంకలనమే 'మౌన సుందరి.' ఏ కథా ఆరేడు పేజీలకి మించక పోవడమూ, మానవ మనస్తత్వాన్ని ఇతివృత్తంగా చేసుకుని సాగేవే కావడమూ ప్రధాన ఆకర్షణ. కథలన్నీ కాలపరీక్షకి నిలబడేవి కావడం మరో విశేషం.
మూఢాచారాల పట్ల విముఖత, కొత్తని ఆహ్వానించాలనే ఉత్సాహం, కొద్దిపాటి ఆదర్శాలు, స్త్రీ పక్షపాతం ప్రధానంగా కనిపిస్తాయీ కథల్లో. మధ్యతరగతి జీవితాలు, వాటిలో వేదనలు, చిన్నపాటి ఆనందాలూ కూడా కథా వస్తువులే. వస్తు వైవిధ్యంతో పాటు, సరళమైన భాష, చదివించే గుణం పుస్తకాన్ని పక్కన పెట్టనివ్వవు. విలువలని గురించే చెప్పే 'ఆశ్రమవాసి' తో మొదలయ్యే ఈ సంకలనంలో రెండో కథ 'మౌనసుందరి,' శిల్పాన్ని ప్రతీకగా ఉపయోగించారిందులో. మూడో కథ 'అందని ఆశలు' అప్రాప్త మనోహారిని గురించిన కథ. ఆశ్రమంలో స్వేచ్ఛగా ఎదిగిన అమ్మాయి 'వనదేవతలు' లో నాయిక. పిరికి ప్రేమికుడికి రైల్లో అనుకోకుండా తారసపడే మాజీ ప్రేయసి 'శర్వాణి' కాగా స్నేహితుడికి భార్యతో పొరపొచ్చం రాకుండా ఉండేందుకు సాయపడే మిత్రుడి కథ 'విజయదశమి.' ఈ కథే తర్వాతి కాలంలో కొన్ని మలుపులతో 'చక్రభ్రమణం' నవలాగానూ, 'డాక్టర్ చక్రవర్తి' సినిమాగానూ వృద్ధి చెంది ఉండొచ్చనిపించింది.
రొమాంటిక్-హర్రర్ జానర్ లో రాసిన కథ 'రేరాణి' కాగా, కల కాని కలని వర్ణించే కథ 'స్వర్గ ద్వారాలు.' రాజాశ్రయం కోరే శిల్పి కథ 'తలవంచని పువ్వులు' చదువుతుంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి 'గులాబీ అత్తరు' గుర్తుకు రాకుండా ఉండదు. యవ్వనంలో తాను ద్వేషం పెంచుకున్న యువకుడే జీవితపు తర్వాతి దశలో సన్యాసిగా కనిపించినప్పుడు ఆమె ఎలా స్పందించిందో 'నిప్పు నుంచి నీరు' లో చిత్రిస్తే, వర్షపు రాత్రి ఓ బిచ్చగత్తె కడుపాకలికి రూపు కట్టిన కథ 'ఆకలి మంటలు.' అలనాటి వివాహ వేడుకని కళ్లముందుంచే 'వివాహ మంగళం'లో మెరుపు ముగింపు పాఠకులని చకితుల్ని చేస్తుంది. ఈ కథ రచయిత స్వీయానుభవమే అని 'గౌతమీ గాథలు' చెబుతుంది. 'యతి ప్రాస మహాసభ' 'కల నిజమైంది' ఈ కథలు రెండూ సాహిత్య సభల నేపధ్యంగా సాగేవి.
గల్ఫికలా అనిపించే కథానిక '6 నెంబరు గది' లో నాయిక సమయస్ఫూర్తి గుర్తుండిపోతుంది. భావకవుల మీద ఎక్కుపెట్టిన సెటైర్ 'కళాభాయి' కాగా, పైమెరుగులకి భ్రమపడి, మోసపోయి, తిరగబడ్డ స్త్రీకథ 'ప్రేమ దొంగలు.' వేశ్యకి తారసపడే ఆదర్శపురుషుణ్ణి 'చీకటి బ్రతుకులు' కథలో చూడొచ్చు. తర్వాతి కాలంలో ఈ ఇతివృత్తంతో పదులకొద్దీ కథలొచ్చాయి. 'వినోద యాత్ర' కథ కాలేజీ విద్యార్థుల ఎక్స్ కర్షన్ సరదానీ, చరిత్ర పట్ల మన నిర్లక్ష్యాన్నీ చిత్రిస్తూనే, సంప్రదాయాన్ని కేవలం డాంబిక ప్రదర్శనకి ఉపయోగించే వారి వీపున చరుస్తూ ముగుస్తుంది. 'రెండు ముఖాలు' లో ఓ అంతర్ముఖుడి ఆలోచనాస్రవంతిని చిత్రించారు రచయిత. మరో మెరుపు ముగింపు కథ 'బస్సులో.' బాబాలు, స్వామీజీలు ఇతివృత్తంగా రాసిన రెండు కథల్లో ఇది మొదటిది కాగా, రెండోది 'స్వర్ణయోగం' - ఈ కథకీ మెరుపు ముగింపునే ఇచ్చారు హనుమఛ్ఛాస్త్రి.
స్త్రీ సాధికారికతని చిత్రించిన 'దౌర్జన్యం', చలం సాహిత్యాన్ని గుర్తు చేసే కథ. దొంగలు ఎలా తయారవుతారో 'వెలుగు-నీడలు' చెబుతుంది. చదవడం పూర్తి చేసేసరికి దాహంతో నాలుక పిడచకట్టినట్టు అనిపించే కథ 'ఎండమావులు.' ఈ కథకీ మెరుపు ముగింపే ఇచ్చారు. ఆదర్శాలు పాటిస్తూ జీవించాలనుకునే యువకుడికి ఎదురయ్యే అవరోధాలని చిత్రించిన కథ 'వ్రణకిణాంకాలు.' పేరు కాస్త కంగారు పెట్టినా, కథ ఆసాంతమూ సాఫీగా సాగిపోయింది. ప్రేమలేఖ రాసిన యువకుడికి మర్చిపోలేని పాఠం చెప్పిన యువతి కథ 'దొంగలున్నారు, జాగ్రత్త!' నాయిక శకుంతల గుర్తుండిపోతుంది.మతసామరస్యాన్ని చెప్పే చిన్న కథ 'మా విద్విషావహై' కి చరిత్రని నేపధ్యంగా తీసుకున్నారు. 'గౌతమీ గాథలు' చదివిన వాళ్ళకి చాలా కథల నేపధ్యాలు సులభంగానే అర్ధమవుతాయి. కొన్ని కథలైతే "తిలక్, బుచ్చిబాబు కలిసి రాశారా?!!" అన్న ఊహ కలిగింది చదువుతున్నంతసేపూ.
"శాస్త్రి గారు సంప్రదాయ బద్ధంగా సంస్కృతాంధ్రాలు అధ్యయనం చేసిన 'ఉభయభాషా ప్రవీణు' లైనా - అయన దృక్పధం మాత్రం ఆధునికం. నవ్యత ఎక్కడ కనిపించినా దానిపట్ల ఆకర్షితులు కావడం ఆయన స్వభావంలో వుంది. తరచుగా యువ రచయితలతో, పాఠకులతో సన్నిహితంగా మసలుతూ, మారుతూ వస్తున్న అభిరుచులపట్ల, తన దృక్పథాన్ని స్ఫష్టంగా ప్రకటించడం ఆయన అలవాటుగా ఉండేది. గొప్ప సౌందర్యాలను కలగనడం, ఆవేశంతో చలించిపోవడం, అందని అంశాల పట్ల అసంతృప్తి, అందువల్ల తిరుగుబాటు ధోరణి, శ్రీ హనుమఛ్ఛాస్త్రిలో జితించిపోయాయి" అన్నారు ముందుమాట రాసిన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, జానకీబాల (హనుమఛ్ఛాస్త్రి కుమారుడు, కోడలూ). సంపుటంలో ఏ నాలుగు కథలు చదివినాఈ మాటలు అక్షరసత్యాలని బోధ పడుతుంది. 'మౌనసుందరి' పేజీలు 216, వెల రూ. 175, ముద్రణ, నాణ్యత బాగున్నాయి. అమెజాన్ లో లభిస్తోంది.
చదవాల్సిన మరో పుస్తకం. థాంక్సండీ.
రిప్లయితొలగించండిధన్యవాదాలండీ..
తొలగించండి