గురువారం, జనవరి 28, 2021

రామేశ్వరం కాకులు 

ప్రభుత్వ వ్యవస్థల్లో పనిచేసే ఉద్యోగుల అవినీతి మీద లెక్కకు మిక్కిలి కథలొచ్చాయి తెలుగు సాహిత్యంలో. వీటితో పోల్చుకుంటే నిజాయితీగా పనిచేసే ఉద్యోగులు కథా వస్తువులైన సందర్భాలు అరుదు. ఇలాంటి అరుదైన ఇతివృత్తంతో రాసిన రెండు కథలు కనిపించి ఆశ్చర్య పరిచాయి 'రామేశ్వరం కాకులు' కథా సంకలనంలో. సుప్రసిద్ధ కథకుడు, నవలా రచయిత, పర్యావరణ వేత్త తల్లావఝల పతంజలి శాస్త్రి రాసిన పన్నెడు కథల సంకలనం ఈ 'రామేశ్వరం కాకులు.' తన స్నేహితుడు ఇంద్రగంటి శ్రీకాంత శర్మకి అంకితం ఇచ్చిన ఈ సంకలనంలో కథలన్నీ గతంలో వివిధ పత్రికల్లో అచ్చయినవే. మానవ జీవితంలో వివిధ పార్శ్వాలని నిపుణతతో తన కథల్లో చిత్రించే పతంజలి శాస్త్రి అదే పంథాని కొనసాగిస్తూ రాసిన కథలివి. వస్తు విస్తృతి, పాత్ర చిత్రణలో వైవిధ్యం ప్రతి కథనీ దేనికదే ప్రత్యేకంగా నిలబెట్టాయి. 

'కె. ఎల్. గారి కుక్కపిల్ల' కథలో నాయకుడు కె. ఎల్. రావు సెక్రటేరియట్లో సెక్రటరీ స్థాయి అధికారి. చూస్తున్నది గనుల శాఖ బాధ్యతలని. విలువలున్న వాడు, అతర్ముఖుడూ కూడా. తనకి చేతనైనంత మేరకి వ్యవస్థకి మంచి చేయాలన్న ఆలోచన ఇంకా మిగిలి ఉన్నవాడు కూడా. అతని పై అధికారి, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రావుకి బాల్య మిత్రుడే. అయితే, ఆ విషయం ఎవరికీ తెలీదు. రావు ఆలోచనలు, అతని సంఘర్షణా అంతా చీఫ్ సెక్రటరీకి తెలుసు. కథ నేరుగా కాక ప్రతీకాత్మకంగా నడుస్తుంది. చీఫ్ సెక్రటరీ ఇంట్లో ఉండే నల్లని కుక్కపిల్ల అంటే రావుకి చిరాకు. తన దగ్గర పనిచేసే పీయే మీద కూడా ఒకలాంటి అయిష్టత. ఆఫీసులో పీయేని చూడక తప్పదు, చీఫ్ సెక్రటరీ ఇంటికి ప్రయివేటు పార్టీకి వెళ్ళినప్పుడల్లా కుక్కపిల్ల గుర్ గుర్ లని భరించకా తప్పదు. గుర్తుండిపోయే ముగింపుని ఇచ్చారీ కథకి. 

'మంచుగాలి' కథలో నాయకుడు స్వామి, గనుల శాఖలో జిల్లా స్థాయి అధికారి. ఒత్తిళ్ళని తట్టుకుని విధి నిర్వహణ చేసే ఉద్యోగి. విద్యావంతురాలైన భార్య, ఉద్యోగం చేస్తున్న కొడుకు, చదువుకుంటున్న కూతురు.. వీళ్ళందరికీ ఈజీమనీ మీద ప్రేమ, ఒక్క స్వామికి తప్ప. ఇంటికి వచ్చే సూట్ కేసుల్ని స్వామి తిరగ్గొట్టేయడం పట్ల వాళ్లలో అసంతృప్తి. వాటిని తీసుకుంటే బాగుండునని వాళ్ళకి కోరిక. అయితే దానిని నేరుగా కాక, అన్యాపదేశంగా వెలిబుచ్చుతూ ఉంటారు. వాళ్ళ మనసుల్లో ఏముందో స్వామికి తెలుసు. పై నుంచి, స్థానికంగా కాంట్రాక్టర్ల నుంచీ వచ్చే ఒత్తిళ్లు సరేసరి. వీటన్నింటి మధ్యా స్వామి వ్యక్తిగత, వృత్తిగత జీవనం ఎలా సాగిందో చిత్రించిన కథ ఇది. ఈ కథా చాలావరకూ ప్రతీకాత్మకంగానే సాగుతుంది. స్వామి భార్యా, కూతురూ కలిసి చేసే 'పులకాలు' కూడా కథ చెబుతాయి. ఈ రెండు కథలూ గనుల శాఖ నేపధ్యం నుంచి రావడం యాదృచ్చికం కాదేమో. 

రాజకీయాలు ఇతివృత్తంగా తీసుకుని రాసిన రెండు కథలకీ బౌద్ధ జాతక కథల్ని నేపధ్యంగా వాడుకున్నారు. వీటిలో మొదట చెప్పుకోవాల్సిన కథ 'గారా.' ఈమధ్య కాలంలో ఇంత గొప్ప పొలిటికల్ సెటైర్ రాలేదు తెలుగులో. ఆశ్రమంలో మిగిలిన భిక్షువులకి భిన్నంగా ప్రవర్తించే ఇద్దరు భిక్షువుల భవిష్యత్ దర్శనం ఈ కథ. రాజకీయ నాయకులుగా జన్మించి, శాప వశాన గాడిదలుగా మారి, అక్కడ కూడా రాజకీయాన్ని వదలని జీవుల కథ ఇది. కాస్త పొడిగించి నవలికగా రాసి ఉంటే, కేఎన్వై పతంజలి 'అప్పన్న సర్దార్' సర్దార్ సరసన నిలిచేది. పతంజలి శాస్త్రి గతంలో రాసిన 'జర్రున' కథనీ జ్ఞాపకం చేసిందీ కథ. రెండు రాజ్యాల మధ్య సాగునీటి సమస్య ఇతివృత్తంగా రాసిన కథ 'రోహిణి.' బుద్ధ భగవానుడి పాత్ర చూసి ఇది జాతక కథ అనుకుంటే పొరపాటే. కరెంట్ అఫైర్స్ దృష్టితో ఆలోచిస్తే ఈ కథ ఎంత సమకాలీనమో అర్ధమౌతుంది. 

'అతను', 'అతను, ఆమే, ఏనుగూ', 'అతని శీతువు', 'అతని వెంట' ఈ నాలుగు కథల పేర్లూ దగ్గరగా వినిపిస్తున్నాయి కానీ ఏ రెండు కథలకీ పోలిక ఉండదు. వర్చువల్ జీవితానికి, వ్యక్తిగత జీవితానికి మధ్య గీతని చెరిపేసుకున్న ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి కథ 'అతను'. తాను చేసింది తప్పు అనే స్పృహ కూడా లేనంతగా ఉద్యోగ జీవితానికి (మరీ ముఖ్యంగా స్క్రీన్ కి) బానిస అయిపోయిన వాడి కథ ఇది. సాఫ్ట్వేర్ జీవితాల్లో ఓ కొత్త కోణాన్ని పరిచయం చేస్తుంది. ప్రస్తుత కాలపు అర్బన్ జంటల వైవాహిక జీవితం ఇతివృత్తంగా రాసిన కథ 'అతను, ఆమే, ఏనుగూ'. అసంతృప్తులని లోపలే దాచుకునే జంటలో ఇద్దరి కథా చెప్పారు రచయిత. 'కష్టాలు లేనిది ఎవరికీ?' అనే ప్రశ్నకి సరైన సమాధానం 'ఎదుటి వాళ్లకి.' తాను తప్ప తతిమ్మా ప్రపంచం అంతా సుఖంగా ఉందని నమ్మే ఓ ఆచార్యులు కథ 'అతని శీతువు.' ఈ కథలో తాత్వికత వెంటాడుతుంది. రజ్జు భ్రాంతి చుట్టూ అల్లిన కథ 'అతని వెంట.' 

రామాయణంలో ఊర్మిళ కథలో కొత్త కోణాన్ని చెప్పే కథ 'కచ్చప సీత.' ఇది పురాణాన్ని తిరగ రాసిన కథ కాదు. పాత్రల ఔచిత్యాలకి భంగం కలగలేదు. ఒక రచయిత పర్యావరణ వేత్త కూడా అయిన ఫలితం 'ఉర్వి' కథ. ప్రతీకాత్మకమైన కథ ఇది. త్రికాలాలనీ, పంచ భూతాలనీ, ఋతువులనీ గుర్తు పట్టగలిగితే కథ సాఫీగా సాగిపోతుంది. 'వెన్నెల వంటి వెలుతురు గూడు' పేరులాగా పొయెటిక్ గా సాగే చిన్న స్కెచ్. ఇక పుస్తకానికి శీర్షిక, సంపుటంలో మొదటి కథ 'రామేశ్వరం కాకులు'. వ్యభిచార వృత్తిలోకి లాగబడిన ఓ అమ్మాయీ, జీవితం మీద అనురక్తి కోల్పోయిన ఓ వ్యాపారీ, ఖాకీ వెనుక లోపలెక్కడో తడి మిగిలి ఉన్న ఓ పోలీసూ ముఖ్య పాత్రలీ కథలో. చదివాకా చాలాసేపు ఆలోచనల్లోకి నెట్టేసే కథ. ఆ మాటకొస్తే, అన్నీ కథలూ ఆలోచింపజేసేవే, ఆలోచించిన కొద్దీ కొత్త కోణాలని చూపించేవే. ('రామేశ్వరం కాకులు,' ఛాయా ప్రచురణలు, పేజీలు 130, వెల రూ. 150). ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు,  నాణ్యమైన ముద్రణ. 

6 కామెంట్‌లు:

  1. “మంచుగాలి” కథ “ఆ నలుగురు” సినిమా కథను ... కొంత మేర ... పోలి ఉన్నట్లుందే? (ఈ కథల పుస్తకం నేనింకా చదవలేదు లెండి)

    అధిక భాగం ప్రభుత్వ శాఖలు అవినీతిమయమేనని అందరికీ తెలిసిన మాటే గానీ గనుల శాఖలో అవినీతి మరీ ఎక్కువేమో? లేదా రచయిత పతంజలి శాస్త్రి గారు ఆ శాఖలో ఉద్యోగం చేశారేమో?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మెలోడ్రామా ఎక్కువైనట్టు అనిపించినా 'ఆ నలుగురు' నాకు నచ్చుతుందండీ.. కొన్ని విషయాలు చెప్పడానికి ఆ మాత్రం డ్రామా ఉండాలేమో అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో కోట శ్రీనివాస రావు నటన చాలా ఇష్టం.. అప్పుడప్పుడూ చూస్తూ ఉంటాను. 

      ఇక, ఈ కథకి ఆ సినిమాకీ పోలిక లేదండీ.. 'గనుల శాఖలో అవినీతి' మన పేపర్లకి హెడ్లైన్లుగా కొనసాగిన రోజుల్లోనే ఈ రెండు కథలూ వచ్చి ఉంటాయని నా ఊహ. కథల తొలిప్రచురణ వివరాలు (తేదీ, పత్రిక) ఇచ్చి ఉంటే బాగుండేది. ఇవ్వలేదెందుకో.. 

      ధన్యవాదాలు... 

      తొలగించండి
    2. పోలిక అంటే నా ఉద్దేశం ఆ కుటుంబ సభ్యుల గురించి పైన మీరు ఇచ్చిన చిన్నపాటి పరిచయం చూసి ... వీళ్ళవి కూడా “ఆ నలుగురు” మూవీలోని కుటుంబ సభ్యుల పాత్రల వంటి మనస్తత్వాలేనేమో అనిపించింది. కుటుంబ యజమాని నిజాయితీ మరియు విలువలు, అది అంతగా నచ్చని ఇతర సభ్యులు ... నేననుకున్న పోలిక అంతవరకే లెండి. ఆ పుస్తకం నేనింకా చదవలేదుగా.

      అంతే లెండి, గనుల భాగోతాలు ఏపీని కుదిపేస్తున్నప్పటి రోజులు ఈ కథల్లో ప్రతిఫలించుంటాయి మీరన్నట్లు.

      తొలగించండి
    3. మీరనుకున్నంతవరకూ పోలిక రేఖామాత్రంగా ఉందండీ.. పుస్తకం చదవండి, నిరాశ పరచదు మిమ్మల్ని.. 

      తొలగించండి
  2. 'కచ్ఛపసీత ' ఈ సంకలనంలో ఉందా! మంచి విషయం చెప్పారు. భారతరాజకీయ నేపథ్యంపై అవగాహన లేకేమో 'గారా' కథ నాకు అంతగా కొరుకుడుపడలేదు. మరోసారి చదవాలి. ఒకరిద్దరు మీరన్నట్టే చాలా మెచ్చుకున్నారాకథని.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. దేశాలు వేరైనా రాజకీయాలు ఒక్కటే అని మొన్నటి యూఎస్ కేపిటల్ ఉదంతం చూశాక అనిపించిందండీ.. ధన్యవాదాలు 

      తొలగించండి