అప్పటివరకూ వైభవంగా జీవించిన దేవదాసీల జీవితాల్లో ఒకానొక సందిగ్ధత, భవిష్యత్తుని గురించి భయమూ మొదలైన సంధియుగంలో మదురై దేవదాసీ సంప్రదాయాన్ని పాటించే ఓ దేవదాసీ కడుపున పుట్టిందామె. తల్లిని, తోబుట్టువులనీ కన్నా సంగీతాన్ని ఎక్కువగా ప్రేమించింది. అంతకుమించి, దేవదాసీగా కాక ఒక గృహిణిగా జీవించాలని చిన్ననాడే బలంగా నిర్ణయించుకుంది. తాను నేర్చుకున్న సంగీతాన్నే ఆలంబనగా చేసుకుని భవిష్యత్తుకి ఒక దారిని వెతుక్కుంది. తల్లినీ, అన్ననీ ఎదిరించి ఓ బ్రాహ్మణుడి పంచన చేరి అతనికి భార్య, అతని పిల్లలకి తల్లీ కాగలిగింది. ఆమెని, ఆమె సంగీతాన్నీ ప్రేమించిన ఆ వ్యక్తి చూపించిన బాటలో నడిచి దేశం గర్వించే గొప్ప శాస్త్రీయ సంగీత గాయనిగా ఎదిగింది. ఈ ఎదిగే క్రమంలో ఆమె పొందినవేమిటి, పోగొట్టుకున్నవేమిటన్నది సవిస్తరంగా చెప్పే నవల మధురాంతకం నరేంద్ర రచించిన 'మనోధర్మపరాగం'. అమెరికా తెలుగు సంఘం నవలల పోటీల్లో బహుమతి పొందిన ఈ నవలలో కథా నాయిక సి.కె. నాగలక్ష్మి.
కథా, నవలా రచనలో అలవోకగా ప్రయోగాలు చేసే నరేంద్ర, ఈ నవలా రచనలోనూ ఓ ప్రయోగం చేశారు. నవల మొత్తంలో నాయిక నాగలక్ష్మి ఎక్కడా పెదవి విప్పి మాట్లాడదు. ఆమె, తల్లి, సోదరి, బంధువులు, స్నేహితులు సహా మొత్తం ముప్ఫయి మంది స్త్రీలు - కేవలం స్త్రీలు మాత్రమే - ఆమె కథని అధ్యాయాలుగా చెబుతారు. ఒక్కో స్త్రీ చెప్పే కథా ఒక్కో అధ్యాయం. ఈ ముప్ఫయ్ మందిలోనూ సుమారు ఇరవై మంది దేవదాసీ నేపధ్యం నుంచి వచ్చిన వారు కాగా, మిగిలిన వారిది బ్రాహ్మణ నేపధ్యం. వాళ్ళు నాగలక్ష్మి కథని ప్రధానంగానూ, తమతమ కథల్ని ఉపకథలుగానూ చెప్పుకొస్తారు. నవల పూర్తి చేసేసరికి ముప్ఫయి మంది స్త్రీల స్వగతాలు విన్న అనుభూతి కలుగుతుంది పాఠకులకి. అంతే కాదు, నాగలక్ష్మి జీవితంల్లో అనేక దశలు, ఆమె ఆలోచనల్లో పరిణతీ కూడా ఒక క్రమంలో పరిచయమవుతాయి. ఒకప్పటి నాటకాల్లో, మరీ ముఖ్యంగా రేడియో నాటకాలలో, ఈ స్వగతాల పద్ధతిని విరివిగా ఉపయోగించారు. తేడా అల్లా ఈ నవలలో అన్ని పాత్రల స్వగతాలకీ కేంద్రకం నాగలక్ష్మి పాత్ర.
మధుర మీనాక్షి ఆలయం చుట్టూ ఉన్న వందలాది దేవదాసీలది ఒకప్పుడు జమీందారీ ఫాయా. బ్రిటిష్ వాళ్ళు చేసిన కొన్ని చట్టాలు వాళ్ళని రాత్రికి రాత్రే ఆస్తులకి దూరం చేస్తే, స్వాతంత్య్రానంతరం చేసిన దేవదాసి నిషేధ చట్టం వాళ్ళ ఉనికినే ప్రశ్నార్ధకం చేసింది. మొదటినుంచీ సంగీత నాట్యాలని తమవిగా చేసుకున్న దేవదాసీలు, ఈ చట్టాల ఫలితంగా జీవిక కోసం కళతో పాటు శరీరాన్నీ న(అ)మ్ముకోవాల్సి వచ్చింది. ఇందుకు వాళ్ళు ఎంచుకున్న పధ్ధతి పోషకుల్ని వెతుక్కోవడం. ఆ పోషకుడికి బిడ్డలని కన్నా, ఆ పుట్టిన వాళ్ళు కేవలం తల్లికి మాత్రమే వారసులుగా చెలామణి అయ్యే ఒక మాతృస్వామ్యాన్ని అప్పటికే నిర్మించుకున్నారు వాళ్ళు. ఆస్తులని పోగొట్టుకుని, కళకి కాసులు రాలని పరిస్థితుల్లో చిత్తూరులో ఓ పోషకుణ్ణి వెతుక్కుని, మదురై నుంచి చిత్తూరుకి వలస వచ్చిన చిత్తూరు స్కంద కుముదవల్లి కూతురే 'చిత్తూరు కుముదవల్లి (సీకే) నాగలక్ష్మి.'
కుముదవల్లికి వీణ అంటే ప్రాణం. నాగలక్ష్మికి వీణతో పాటు గాత్ర సంగీతమూ ప్రాణమే. ఆమెకి వీణ కన్నా గాత్రం మీదే మక్కువ ఎక్కువ. తొలిగురువు తల్లే. తర్వాత, చిత్తూరులో ఓ భాగవతార్ దగ్గర కొన్ని మెళకువలు నేర్చుకుని. అప్పుడే మొదలైన రేడియోలో పాటలు పాడడం మొదలు, గ్రామఫోన్ రికార్డులు ఇవ్వడం, సినిమాలలో తొలితరం కథా నాయికగా నటించడం వరకూ తన ప్రమేయం పెద్దగా లేకుండానే నాగలక్ష్మి అవకాశాలని అందిపుచ్చుకుంది. తన పదేళ్ల వయసులో పక్క వీధిలో ఉండే తండ్రి చనిపోతే ఆ విషయం తెలియడానికి నెల్లాళ్ళు సమయం పట్టడం నాగలక్ష్మి జీవితంలో మొదటి మలుపు. తాను ఒక గృహిణిగానే జీవించాలన్న స్థిరమైన నిర్ణయం తీసుకున్నది అప్పుడే. బహుశా, నాగలక్ష్మి తనకి తానుగా తీసుకున్న ఏకైక నిర్ణయం ఇది. ఇందుకు గాను ఆమె తన తర్వాత జీవితంలో ఎన్నడూ పశ్చాత్తాప పడలేదు. తన వృద్ధాప్యంలో, విజయనగరానికి చెందిన ఓ వృద్ధ సాని చేసిన అభినయాన్ని చూసి "నా భర్త లాంటి భర్త దొరికుంటే ఆమె ఇక్కడుండేది కాదు" అంటుంది మనస్ఫూర్తిగా.
నవలలో మొదటగా ఆకట్టుకునేది కథనం. ఒక్కో పాత్రా వచ్చి కథ చెప్పి వెళ్తూ ఉండడం, ప్రతి రెండు పాత్రల మధ్యా మిస్సింగ్ లింక్స్ లేకుండా కథకుడు జాగ్రత్త పడడం గమనించినప్పుడు కథని ఎంత పగడ్బందీగా అల్లుకున్నారో కదా అనిపిస్తుంది. పాఠకులందరికీ ఈ కథ కనీసం కొంతైనా తెలిసే అవకాశం ఉన్నప్పటికీ, ఎక్కగా బిగి సడలనివ్వకుండా చదివించే కథనం. అయితే, దాదాపు ఇరవై దేవదాసీ పాత్రలు ఉన్నప్పుడు, వాటి ద్వారా తమిళ దేవదాసీ సంప్రదాయాలని గురించి సమగ్రంగా చెప్పే వీలున్నప్పటికీ, అందుకు బదులుగా కొన్నే విషయాలని అన్ని పాత్రల చేతా చెప్పించారు రచయిత. ఫలితంగా, పాత్ర పేరు మారడం తప్పించి కొత్తగా తెలుసుకునే విషయాలు పెద్దగా లేకుండా పోయాయి. మొత్తం దేవదాసీ పాత్రల్లో యూనిక్ గా అనిపించే వాటిని వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. ఈ స్త్రీలందరూ తమిళనాడులో అనేక పట్టణాలకు చెందిన వాళ్ళే అయినా, ఆ ప్రాంతపు దేవదాసీ సంప్రదాయం తాలూకు ప్రత్యేకతల (సంగీత నాట్యాలలో) ప్రస్తావనలు పెద్దగా లేవు. అలాగే, దేవదాసీ పాత్రలకి ఉపయోగించిన భాష, యాసలనే బ్రాహ్మణ పాత్రలకీ వాడేశారు.
నాగలక్ష్మి భర్త విశ్వనాథం ఇద్దరు కూతుళ్ళ మధ్య వయసులో తేడాని ఒక్కో చోట ఒక్కోలా రాశారు - మొదట్లో నాలుగైదేళ్ళనీ, తర్వాత రెండేళ్ళనీ. కర్ణాటక సంగీతం నేపధ్యంగా సాగే ఈ రచనలో సంగీతానికి సంబంధించిన పొరపాట్లూ దొర్లాయి. ఉదాహరణకి నాగలక్ష్మి కచేరీ చేస్తుంటే శ్రోతలు 'ఖగరాజు నీ ఆనతి' కీర్తన పాడమని కోరతారు. 'ఖగరాజు నీ ఆనతి...' అన్నది 'నగుమోము గనలేని' అనే త్యాగరాజ కీర్తనలో ఒక చరణం. దేవదాసీలకి, బ్రాహ్మణులకి (అయ్యర్లు, అయ్యంగార్లు) మధ్య ఉండే ఆదాన ప్రదానాలని చిత్రించారు - బ్రాహ్మణులు సంగీత, నాట్యాలు నేర్చుకుని, ప్రతిగా దేవదాసీలకి జావళీలు రాసివ్వడం లాంటివి. అయితే, రచయిత దేవదాసీలు తరపున మాట్లాడిన ప్రతిసారీ వేలెత్తి చూపబడిన పాత్రలు ఈ అయ్యర్లు, అయ్యంగార్లే కావడం కేవలం యాదృచ్చికమేనా అన్న సందేహం వచ్చేస్తుంది - మరీముఖ్యంగా కులంతో నిమిత్తం లేకుండా ఉన్నతాదాయ వర్గాల వారందరూ దేవదాసీలని ఆదరించారన్న సత్యాన్ని గుర్తు చేసుకున్నప్పుడు. నాగలక్ష్మి వదిన సంసారం జీవితంలో కలతలకి కారణం అయిన వితంతువు నేపధ్యం (ఆమె ఏకులమైనా కథలో మార్పు ఉండనప్పటికీ) ఇందుకు పరాకాష్ట.
అప్పటివరకూ చక్కగా సాగిన కథలో, చివరి అధ్యాయంలో ప్రవేశించిన నాటకీయత, రెండు పాత్రలతో ఇప్పించిన సుదీర్ఘమైన ఉపన్యాసాలు బాగా ఇబ్బంది పెట్టాయి. కథలో పిండితార్ధాన్ని మరీ అంత వాచ్యంగా చెప్పనవసరం లేదేమో అనిపించింది. మొత్తంమీద చూసినప్పుడు సంగీత నాట్యాల మీద పెద్దగా ఆసక్తి లేని వాళ్ళని కూడా ఆసాంతమూ చదివించి, చరిత్రలో కొంత భాగాన్ని తెలియజెప్పే రచన ఇది. మొత్తం 426 పేజీలున్న 'మనోధర్మపరాగం' వెల రూ. 325. ముద్రణ మొదలు, ముద్రా రాక్షసాల వరకూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేకం. అమెజాన్ ద్వారా లభిస్తోంది. నవలని పూర్తిచేశాక ముందుమాటలని చదవడం బాగుంటుంది.
ఈ ప్రయోగం తెలుగులో కొత్త కావచ్చు. ప్రసిధ్ధ ఆంగ్ల నవల Moon Stone చదివారా? అందులో ఈప్రయోగం గమనించగలరు. కీలకమైన సంఘటనను అనేక పాత్రలు తమతమ దృక్కోణంలో వివరించటం చూడవచ్చును.
రిప్లయితొలగించండిమీరు చెప్పిన నవల చదవడం మొదలు పెట్టానండీ, ఆసక్తికరంగా సాగుతోంది. ఈ నవలలో కేవలం స్త్రీ పాత్రల ద్వారానే మొత్తం కథ చెప్పించారు.. ధన్యవాదాలు..
తొలగించండిమీ పుస్తకపరిచయం చూస్తుంటే రచయిత ఈ నవల ఇతివృత్తం ఎం.ఎస్.సుబ్బులక్ష్మి గారి జీవితం నుండి తీసుకున్నట్లుందే అనిపిస్తోంది. అయ్యుండవచ్చంటారా, మురళి గారు?
రిప్లయితొలగించండినాక్కూడా అనిపించిందండీ.. రచయిత, అవార్డు కమిటీ వారూ ఈ నవలని 'హిస్టారిక్ ఫిక్షన్' అన్నారు కూడా.. ధన్యవాదాలు..
తొలగించండి"చిత్తూరు కుముదవల్లి" అనగా "మదురై షణ్ముగవదివు" అనుకోవచ్చా? అని అడుగుదామనుకున్నా. విన్నకోట వారు అడిగేశారు.😆😆
రిప్లయితొలగించండినేను చెప్పేశాను :) ..ధన్యవాదాలండీ..
తొలగించండిఅధ్యాయాల మధ్యలో కాగితం, కలం మాట్లు ఒకట్రెండు అధ్యాయాల దాకా బాగానే అనిపించినా ఆ తరువాత కృతకమైపోయింది. చివరి అధ్యాయపు డ్రామా సరేసరి. కొన్ని ముఖ్యమైన అంశాలను చర్చకి పెట్టిన ప్రయత్నాన్ని మెచ్చుకోవాల్సిందే కానీ, నాగలక్ష్మి కథే మళ్ళీ చదవాలా అనిపించేసింది. నేనయితే ఈ నవల గురించి ఎంత ఎదురుచూసానో అంత నిరాశపడ్డానని చెప్పకతప్పదు.
రిప్లయితొలగించండిరచయిత పేరు, బహుమతీ రెండూ చూసి నేనూ కొంచం ఎక్కువే ఆశించానండీ.. మీరన్న కాగితం, కలం నన్ను ఇబ్బంది పెట్టలేదు కానీ చివర్లో నాటకీయత మాత్రం 'అబ్బా' అనిపించేసింది. నాగలక్ష్మి కథని కొత్తగా చెప్పే ప్రయత్నం కొంతవరకూ బాగానే సాగింది కానీ, మొత్తం మీద చూసుకుంటే సంతృప్తికరంగా లేదు. పేజీ తిప్పేప్పుడు ఆ ఉల్లిపొర కాగితాలు ఎక్కడ చిరిగిపోతాయో అన్న టెన్షన్ తోనే పూర్తి చేయాల్సి వచ్చింది.. ధన్యవాదాలండీ..
తొలగించండి