ఓ శనివారం మధ్యాహ్నం.. చుట్టూ ఎవ్వరూ లేరు. చేయడానికి ఇతరత్రా పనులేమీ లేకపోవడంతో ఎదురుగా ఉన్న కంప్యూటర్లో గూగుల్ తోనూ, బ్లాగర్ తోనూ కుస్తీ మొదలు పెట్టాను. ఓ రెండు గంటలు గడిచేసరికి కాస్త సంతృప్తికరమైన రూపమొకటి కళ్ళముందు కనిపించింది. ఈలోగా చేయాల్సిన పని తరమడం మొదలు పెట్టడంతో, 'పబ్లిష్' బటన్ నొక్కి, ఆ విండో క్లోజ్ చేసి, రోజువారీ పనిలో పడ్డాను. 'రెస్టీజ్ హిస్టరీ' అనేంత లేదు కానీ, ఇది జరిగింది మాత్రం ఇవాళ్టికి సరిగ్గా పుష్కర కాలం క్రితం. 'నెమలికన్ను' పన్నెండో పుట్టినరోజివాళ.
'బ్లాగు రాయడం ఎందుకు?' అనే విషయంలో మొదటి నుంచీ నాకో స్పష్టత ఉంది. ఇన్నాళ్ల లోనూ నా అభిప్రాయాలలో మార్పు రాలేదు. రాయడాన్ని ఆస్వాదిస్తున్నా, అప్పుడూ, ఇప్పుడూ కూడా. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు నాకు అర్ధమయ్యింది ఏమిటంటే, గత పుష్కర కాలంలోనూ నా వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో వచ్చిపడిన మార్పుల తాలూకు ప్రభావం నా బ్లాగు మీద స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, అంతకు ముందు కాలానికీ, గడిచిన ఏడాదికీ చాలా స్పష్టమైన తేడా ఉంది. అది నా ఒక్కడికే కాదు, మొత్తం ప్రపంచానికి. మరికొన్ని వారాల్లో 'కరోనా' నామ సంవత్సరం పూర్తవ్వబోతోంది.
ఈ సంవత్సరం ప్రభావమో లేక ఇతరత్రా కారణాల వల్లనో తెలీదు కానీ, గతంలో ఎన్నడూ లేని విధంగా "ఇంకా ఎన్నాళ్ళు రాస్తాం, బ్లాగు ఆపేద్దాం" అన్న ఆలోచన గతేడాదితో చాలాసార్లు వచ్చింది. బ్లాగు మొదలు పెట్టని క్రితం నాకు బ్లాగర్లు ఎవరితోనూ పరిచయం లేదు. మొదలు పెట్టిన కొన్నాళ్లకే చాలా మందితో స్నేహం కుదిరింది. వ్యాఖ్యలు, చాట్లతో పాటు, ఉత్తర ప్రత్యుత్తరాలూ ఉండేవి. కాలం గడిచే కొద్దీ వారిలో కొందరు మార్గశ్రాంతులయ్యారు. ఇంకొందరు మరో అడుగు ముందుకేసి 'బ్లాగులు మరణించాయి' అని ప్రకటించేశారు. మిగిలిన కొద్దిమందీ అడపాదడపా రాస్తున్నారు. కొత్తవాళ్లు రాకడ అప్పుడప్పుడూ కనిపిస్తోంది.
Google Image |
పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ కూడా పలకరించే బ్లాగుమిత్రులు ఉండడం విశేషంగానే అనిపిస్తోంది. ఈ మాధ్యమంలో ఉన్న సౌకర్యానికి అలవాటు పడ్డం వల్లనో, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకో ప్రారంభం ఎందుకన్న ఆలోచనో, లేదూ రెండింటి కలగలుపో తెలీదు కానీ మరో మాధ్యమంలో రెండో కాలు పెట్టాలని అనిపించడం లేదు. పైగా, ఇప్పటికే వేరే చోట అకౌంట్లు నిర్వహిస్తున్న మిత్రులు ఇస్తున్న ఫీడ్ బ్యాక్ కూడా ఏమంత ఆశాజనకంగా లేదు. ఒకరిద్దరు మాత్రం "అందరం ఇటు వచ్చేశాం, మీరొక్కరూ అక్కడెందుకూ?" అంటూ మెయిల్స్ రాస్తున్నారు అప్పుడప్పుడూ. వాళ్ళని మిస్సవుతున్నప్పటికీ, నావరకూ ఈ పడవ ప్రయాణం బాగుంది మరి.
వెనక్కి తిరిగి లెక్కలు చూసుకుంటే ఒకటి తక్కువ అరనూరు పోస్టులు కనిపించాయి గడిచిన ఏడాదిలో. ఎప్పటిలాగే పుస్తకాలూ సినిమాల కబుర్లే అధికం. పీవీ శతజయంతి సందర్భంగా పోస్టు రాస్తే, కారణాలు వెతికారు కొందరు. అక్కడితో ఆగకుండా, జగన్ పార్టీ అభిమానిని అని ముద్రవేసే ప్రయత్నం చేశారు. నవ్వుకున్నాను. ఎవరైనా క్రమం తప్పకుండా నా బ్లాగు చదువుతూ ఉన్నట్టయితే వాళ్ళు కూడా నవ్వుకునే ఉంటారు బహుశా. చాలామందికి మల్లేనే నాక్కూడా లాక్ డౌన్ లో మలయాళం సినిమాలు పరిచయం అయ్యాయి, కొత్తగా. ఒకప్పుడు ఇరానీ సినిమాలు (ఎక్కువగా బాలల చిత్రాలే) ఎంత కొత్తగా అనిపించాయో, ఇప్పుడు ఇవీ అలాగే అనిపిస్తున్నాయి.
ఇంతకీ, బ్లాగు కోసం రాయాలనుకున్న కొన్ని సంగతులు అలాగే ఉండిపోయాయి. "ఇక ఆపేద్దాం" అనే ఆలోచన బలపడక ముందే రాయాలనుకున్నవన్నీ రాసేయాలని సంకల్పం. ఎంతవరకూ నెరవేర్చుకోగలనో చూడాలి మరి. సముద్ర పరిమాణంలో సమాచారం చుట్టుముట్టేసిన ప్రస్తుత సందర్భంలో కూడా బ్లాగుల్ని గుర్తు పెట్టుకుని చదువుతున్న వారికీ, అభిప్రాయాలూ పంచుకుంటున్న వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానీ పుట్టినరోజు సందర్భంలో..
మీ బ్లాగుకు జన్మదిన శుభాకాంక్షలు 🌹🌹. మరింత దినదిన ప్రవర్ధమానమవుతూ మరెన్నో యేండ్లు ఇలాగే కొనసాగాలని మా ఆకాంక్ష 👍. "పడవ" దిగెయ్యకండి 🙂.
రిప్లయితొలగించండిధన్యవాదాలండీ..
తొలగించండి12వ పుట్టినరోజు అభినందనలు .. ఫేస్బుక్ ఇన్సాట్టా అలవాటు అవ్వడంతో పాటు వృత్తి పరంగా బిజీతో బ్లాగు అన్నదే మరచిపోయా .. కానీ నెమలికన్ను మాత్రం బుక్ మార్క్ గా ఉంటుంది .. ఏ అర్ధరాత్రో సడన్ గా మెలుకువ వచ్చి గుర్తు వచ్చి ఓపెన్ చేస్తా .. కొత్త వాటికన్న పాత పోస్ట్స్ ఎక్కువగా చదువుతా.. అప్పట్లో ప్రతి పుస్తకం రెండు సార్లు చదివేవాడిని.. పుస్తకం ఒకటే కానీ మీ రివ్యూ చదవకముందు ఒకలా .. మీ రివ్యూ చదివాక ఒకలా ఉంటుంది .. ఇప్పుడు అసలు పుస్తకాలు కొనడమే తప్ప చదవడం చాలా తగ్గిపోయింది .. ఇలాగే మీ ప్రయాణం కొనసాగాలని కోరుకుంటూ ..
రిప్లయితొలగించండిచాలా సంతోషం అండీ.. నిజానికి పుస్తకాలు చదవడం నాక్కూడా తగ్గిపోయింది :(
తొలగించండి...ధన్యవాదాలు
జ్ఞాపకాల తుట్టె ఒక్కసారిగ కదిలినట్టయింది..నొస్టాల్జియా తో మనసంతా నిండిపోయింది..
రిప్లయితొలగించండిపన్నెండేళ్ళు గిర్రున ఒక్కసరిగా కళ్ళ ముందు కదిలాయండీ .. ఎన్నెన్ని జ్ఞాపకాలో.. థేంక్యూ మురళి గారు ... థేంక్యూ ఫర్ ఎవ్రీథింగ్..
నేను చెప్పాల్సిన థాంక్స్ లు చాలానే ఉన్నాయండీ..
తొలగించండిధన్యవాదాలు..
2020 మీ "ఇదీ చరిత్ర"లో 45 పోస్టులే కనిపిస్తున్నాయి. మిగిలిన నాలుగు పోస్టులేమయ్యాయి ?
రిప్లయితొలగించండిబ్లాగు పుష్కరాభినందనలు !
కేలండర్ జనవరి 24 నుంచి మరుసటి జనవరి 23 వరకూ అండీ..
తొలగించండి..ధన్యవాదాలు
భలేవారే ఆపేద్దాం అనే ఆలోచనని ప్రస్తుతానికి వెనక్కి నెట్టేయండి. మీరు రాద్దామనుకున్న విషయాలన్ని ముందుకు తెచ్చేయండి. ఆపే సంగతి మెల్లగా ఇంకో మూడు నాలుగు పుష్కరాల తర్వాత ఆలోచిద్దురు గానీ :-) మీకు అభినందనలు నెమలికన్నుకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. మీ ఈ బ్లాగ్ బర్త్ డే ఇంట్రాస్పెక్షన్ పోస్టులు భలే ఉంటాయండీ. ఏడాది జర్నీని మీరు తలుచుకునే విధానం నాకు బాగా నచ్చుతుంది.
రిప్లయితొలగించండిచూడాలండీ, ఎన్నాళ్ళు సాగుతుందో..
తొలగించండిఇంట్రాస్పెక్షన్ పోస్టులు.. ఆక్షణానికి అనిపించినవి రాయడం, అంతేనండీ..
ధన్యవాదాలు
అభినందనలు...
రిప్లయితొలగించండిధన్యవాదాలండీ..
తొలగించండిపుష్కరకాలం నుండీ మీ పోస్టులు చదువుతున్నాను. ఎంత అభిమానం లేకపోతే అపుడు సుమన్ బాబు ఇపుడు జగన్ బాబుపై పోస్టులు వ్రాస్తారు ? అలాగే చంద్రబాబుపై కూడా వ్రాస్తారని ఎదురుచూస్తున్నాను.
రిప్లయితొలగించండిరాస్తూనే ఉన్నాను కదండీ..
తొలగించండిధన్యవాదాలు..
మీరు బ్లాగ్ ఆపటమన్నది నాకు అసలు ఊహ లోనే లేదు మురళిగారు..అప్పుడే పుష్కర కాలమయిపోయిందా..నాకైతె ఏదొ మొన్ననే లాగా ఉంది...మధ్య మధ్య లో మీరు చెప్పే సంగతుల కోసమే ఇలా వచ్చే నేను చాలా నిరాశ పడతాను.రకరకాల అనుభవాల బ్లాగులను మరచిపోవటమే జరగదు మురళిగారు.. .హృదయపూర్వక శుభాకాంక్షలు...
రిప్లయితొలగించండిధన్యవాదాలండీ..
తొలగించండిటీన్స్లోకి వస్తున్న పిల్ల కదా - కాస్త అప్పుడప్పుడూ అలా అనిపించేలా చేస్తుంది ;)) - మీరోపిక పట్టాలి.
రిప్లయితొలగించండిబ్లాగ్ ఆపకండి. తెలుగు కొత్తపుస్తకాల కబుర్ల కోసం ఇప్పటికీ వెదికి ఓ కన్నేసి ఉంచే బ్లాగ్ మీది. నెమలికన్నుకి మనస్పూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు మనసారా అభినందనలు.
మీమాట వింటుంటే చదవాల్సిన పుస్తకాలు జ్ఞాపకం వస్తున్నాయండీ..
తొలగించండిధన్యవాదాలు..
నెమలి కన్ను బ్లాగుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు . బోలెడు వసంతాలు జరుపుకోవాలి
రిప్లయితొలగించండిఆ చివరి పేరా లో టైపో ఉందనీ అలాంటి టైపో లని ఒప్పుకోమని తెలియజేస్తున్నాం :)
సరి చేశానండీ.. వేళ్ళ వణుకు మొదలైనట్టుంది :)
తొలగించండిధన్యవాదాలు..
"ఇక ఆపేద్దాం" లాంటి మాటలు టైపాటు కావాలని :) .
తొలగించండి.అంతే కానీ నాకేం కనపడ లేదండీ అక్కడ
“టైపో” ఉందని దేన్ని గురించి మొదట్లో పరుచూరి గారు అన్నారో, “సరి” చేశానని దేన్ని గురించి మురళి గారు అన్నారో .... ఏమీ అర్థం కాలేదు. “టైపో” ఉందన్నప్పుడు నేనూ కూడా తెగ వెతికేశాను కానీ ఫక్తు “టైపో” నాకేమీ కనబడలేదు. సరేలే, మురళి గారు “చేతి వణుకు” అనుకున్నట్లు నాకు కంటిచూపు తగ్గుదల మొదలైందేమోలే అనుకుని వదిలేశాను. చివరకు ఇదా అసలు “టైపో” 🙂? అదే గనక అయితే పరుచూరి గారికి నా మద్దతు కూడా 👍.
తొలగించండి"ఇంతకీ బ్లాగు కోసం రాయాలనుకున్న..." ఈ వాక్యంలో 'రాయాలనుకున్న' లో టైపో పడిందండీ, సరిచేశాను..
తొలగించండినెమలికన్నుకు పుట్టిన రోజు శుభాకాంక్షాలండీ. నాకు బ్లాగుల గురించి తెలిసనప్పటినుండీ ఇప్పటివరకూ నిత్యనూతనతంగా ఉన్న బ్లాగు మీదొక్కటే. చాలా సార్లు కామెంట్ పెట్టలేదు కానీ మీ ప్రతి పోస్ట్ చదువుతూ ఉంటాను. మీ కృషికి ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిధన్యవాదాలండీ..
తొలగించండిమొబైల్ వాడకం పెరగడంతోనే బ్లాగర్ కి కూడా ఒక మొబైల్ యాప్, అగ్రిగేటర్ - గూగుల్ వాడే పెట్టి ఉంటే బావుండేదేమో అనుకుంటూ ఉంటాను. (అదేమీ గొప్ప పరిష్కారం కానప్పటికీ.) ఇప్పటికీ కొన్ని పత్రికల్లో కంటెంట్ కోసం బ్లాగ్ పోస్ట్ ని వికీని వాడుకున్నంత స్వేచ్ఛగా వాడుకోవడం చూస్తే ఏమనాలో తెలియని పరిస్థితి.
రిప్లయితొలగించండితరచూ కొత్తపోస్టులకోసం వచ్చి చూసే మాలాంటి అభిమానులం ఉన్నన్నాళ్ళూ నెమలికన్నూ పుట్టినరోజులు జరుపుకుంటూనే ఉంటుంది. ఎన్నో పుస్తకాలని పరిచయం చేస్తూ, సాహిత్యాభిమానులకి రిఫరెన్స్ పుస్తకంలా నిలిచిన నెమలికన్నుకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు అభినందనలు మురళి గారూ.
'రాసి పబ్లిష్ చేయడం వరకే నా పని' అన్నదే ఎప్పుడూ నా ఆలోచనండీ. కాపీల గురించి నో కామెంట్. మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు..
తొలగించండిరాయడం ఆపకండి ప్లీజ్ నేను మీ బ్లాగుకి అభిమానిని
రిప్లయితొలగించండినేను చాలా సంవ్సరాలుగా చదువుతున్నాను
Bookmark చేసే వుంటుంది ఎప్పుడు నేమలికన్ను లాగా 😊