గోదారి.. అందునా నేను పుట్టి పెరిగిన దిగువ గోదారి ప్రాంతపు కథలు. రాసిందేమో తన ఒంట్లో రక్తానికి బదులుగా గోదారి ప్రవహిస్తోందేమోనని అందరూ సందేహించే వంశీ.. మరి, మార్కెట్లోకి వచ్చిన వెంటనే పుస్తకాన్ని సొంతం చేసుకుని చదవకపోతే ఎలా? మొత్తం యాభై ఒక్క కథలున్న'మా దిగువ గోదారి కథలు' సంకలనం, దిగువ గోదారి గ్రామాలతో పాటు, అక్కడి భాషా సంస్కృతులని, ప్రజల మనస్తత్వాలనీ సాదృశంగా కళ్ళముందు ఉంచుతుంది. కళాప్రపూర్ణ బాపూ తన మనసుని వేళ్ళ కొసల్లోకి తీసుకొచ్చి చిత్రించిన బొమ్మలు పాఠకులని కథాస్థలానికి, కథకాలానికీ అదాటున తీసుకుపోతాయి.
"ఏవుంటాయ్ మీ వంశీ కథల్లో.. తిండిగోలా, సెక్సు గొడవలూ తప్పితే?" ...'మా పసలపూడి కథలు' పుస్తకం విడుదలైన కొత్తలో వంశీని ఏమాత్రమూ ఇష్టపడని ఓ గోదారేతర మిత్రుడి వ్యాఖ్య ఇది. "అవి రెండూ కూడా ప్రాధమిక అవసరాలే. వాటిలో ఏ ఒక్కటి లేకపోయినా, మనిషి మనుగడకి అర్ధం ఉండదు" అన్నాన్నేను. గోదావరి ప్రాంత ప్రజల, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల ప్రజల ఆహారపు అలవాట్లు మిగిలిన వాళ్ళ కన్నా ఏవిధంగా ప్రత్యేకమో వివరించి చెప్పాను. అలాగే "క్రైమ్ రికార్డుల ప్రకారం, దేశంలోని చాలా రాష్ట్రాల్లో జరుగుతున్నహత్యల్లో అధిక శాతం హత్యలకి కారణం వివాహేతర సంబంధాలే," అని పోలీసు శాఖలో పనిచేసే ఒక మిత్రుడు చెప్పిన సంగతినీ ఉదహరించాను.
వంశీ తనదైన శైలిలో చెప్పిన ఈ దిగువ గోదారి కథల్లో అధిక శాతం జీవిత చిత్రణలే. 'మా పసలపూడి కథలు' ని కేవలం ఒక కథకుడిగా మాత్రమే చెప్పిన వంశీ, ఈ కథలని మాత్రం రచయితతో పాటుగా దర్శకుడిగానూ చెప్పినట్టుగా అనిపించింది. కొన్ని కథ, కథనాల్లో శృతి మించిన నాటకీయత, సినిమాటిక్ ముగింపులు ఇందుకు కారణం. తన పుట్టిన రోజుతో సహా ఇప్పటివరకూ ఎవరికీ చెప్పకుండా ఉంచిన అనేక వ్యక్తిగత విషయాలని ఈ పుస్తకంలో పంచుకున్నారు వంశీ. తన భార్యా పిల్లల గురించి, దర్శకుడిగా ఉచ్ఛ స్థితిలో ఉండగా ఓ నాయికతో జరిగిన ప్రేమ వ్యవహారాన్ని గురించీ, కొన్ని సినిమాల్లో పాత్రలకి ఉపయోగించిన ఊతపదాలు, ఆహార్యాల పుట్టుక గురించీ కథల మధ్యలో సందర్భానుసారంగా చెప్పారు. ఈ కథకుడు సినిమా దర్శకుడు కూడా అనే విషయాన్ని పదే పదే గుర్తుచేశాయివి.
ఇవి అలవోకగా రాసిన కథలు కాదు. ధవళేశ్వరానికి దిగువున ఉన్న గోదావరి పరీవాహక గ్రామాలనీ, లంకలనీ రకరకాల ప్రయాణ సాధనాల్లో తిరిగి అక్కడి ప్రజలు చెప్పుకునే కథల్ని విని వాటికి కొంత కల్పన జోడించి రాసినవి. "నేటివిటీని నరనరాల్లోకి ఎక్కించుకున్న సాదాసీదా మనిషిని నేను. అందుకే నా కథల్నీ, కేరక్టర్లనీ, వాళ్ళ కేరక్టరైజేషన్లనీ అందరికీ పరిచయం చేయాలని నా తాపత్రయం. అందులో భాగంగానే ఇంటిపేర్లు, వర్ణాలు, వృత్తులూ అప్పుడప్పుడూ తడుముతా వుంటాను. కులాలతో విలాసంగా చేతులు కలిపే వ్యక్తులకి నా కథలు కిడ్నీల్లో రాళ్ళలా ఇబ్బంది కలిగిస్తే క్షమించమని అడుగుతున్నాను వార్ని," అన్న వివరణ సాక్షిగా గ్రామసీమల వర్ణ వ్యవస్థనీ, కొండొకచో అందులోని అవ్యవస్థనీ తన కథల్లో చిత్రించారు.
సినిమాలకి మల్లేనే తన కథలకీ పేరు పెట్టడం ద్వారానే సగం ఆసక్తిని రేకెత్తించగల ఆలోచనా శక్తి వంశీ సొంతం. 'ఏటిగట్టుమీద చీకటి పడింది - ఆ అమ్మాయింకా రాలేదు' (ఈ కథకి బాపూ గీసిన బొమ్మని సంకలనానికి ముఖచిత్రంగా కూడా వాడారు), 'ఇప్పుడే వస్తానంది శకుంతల,' 'గోవిందుగాడి మరణం - దానికో ఫ్లాష్ బాక్,' 'దివాణంలోకి కొత్త కోడలొచ్చింది,' 'నాగరాజు రాత్రి మా యింటికొచ్చాడు,' 'తొందరగా వచ్చెయ్యండేం.. ఇక్కడ ఒంటరిగా ఉన్నాను' లాంటి శీర్షికలు ఇవ్వడం వంశీకి మాత్రమే సాధ్యం. వర్ణనల మీద ఎక్కువ మక్కువ చూపించే వంశీ అలవాటు ఈ కథల్లోనూ కొనసాగింది. కాకపొతే ఒక్కోసారి ఈ వర్ణనల మోతాదు అసలు కథను మింగేయడమూ జరిగింది. 'దివాణంలోకి కొత్త కోడలొచ్చింది,' కథ ఇందుకు ఉదాహరణ.
మరు జన్మంటూ ఉంటే గోదారొడ్డునే పుట్టాలన్నది ఎప్పటినుంచో నాకున్న కోరిక. ఈ సంకలనంలో దివాణాలని బ్యాక్డ్రాప్ గా తీసుకుని వంశీ రాసిన కథలు చదివాక ఆ కోరిక 'గోదారొడ్డున ఉన్న దివాణంలో పుట్టాలి' గా మారింది. కానైతే అప్పటికి ఈ దివాణాల రూపు రేఖలు ఎలా ఉంటాయో మరి. నా మిత్రుడి ఫిర్యాదు దగ్గరికి వస్తే, ఈ కథల్లోనూ గోదారి ప్రాంతపు, ముఖ్యంగా దిగువగోదారికే ప్రత్యేకమైన, వంటకాలెన్నింటినో పరిచయం చేశారు. పనసాకులతో చేసే పొట్టిక్కలు, పప్పుచారు, లంకల్లో మాత్రమే దొరికే వేరు పనసపళ్ళు, ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం కాజాలు, కోడిగుడ్డు పెసరట్టు, రొయ్యల గారెలు, గుడ్డిపీతల పులుసు, పచ్చిరెయ్యలూ-చింతచిగురు, ఉప్పు చేపల వేపుడు, వేటమాంసం పులుసు, కోడిమాంసం ఇగురు... ఒకటా రెండా.. ఇప్పటికే కొన్ని రుచులు అంతరించిపోతున్నాయ్.
వివాహేతర సంబంధాలు, వేశ్యావృత్తి నేపధ్యంలో సాగే కథలూ ఉన్నాయి. "సినిమా ఫీల్డ్ లో ఇదంతా మామూలే" అంటూ అక్కడి తెరచాటు వ్యవహారాలనీ కథావస్తువులు చేశారు వంశీ. చలం 'మైదానం' కి కొనసాగింపుగా అనిపించే 'సూరి కామేశ్వరరావు వ్రాలు' కథలో నాయిక పేరు కూడా రాజేశ్వరే! 'అలాటిదా మడిసి' కథలో మంగ, 'ఇప్పుడే వస్తానంది శకుంతల' కథలో శకుంతల, 'బేబీ.. ఓ మాసిపోని జ్ఞాపకం' కథలో బేబీ పురాతన వృత్తిలో ఉన్నవాళ్ళే కాగా, 'వెన్నెల నీడలో వాసంతి' కథలో వాసంతి, 'చివరి కాన్క' కథలో కృష్ణలీల ఆ వృత్తిలోకి లాగబడ్డ వాళ్ళు. కొన్ని కథలకి ఓ.హెన్రీ తరహా మెరుపు ముగింపు నిచ్చి ఆశ్చర్య పరిచిన వంశీ, మరికొన్ని కథలని ఆసాంతమూ ఆసక్తిగా నడిపించినప్పటికీ ముగింపు తేల్చేసి నిరాశ పరిచాడు. కథనం ఉత్కంఠభరితంగా సాగిపోతున్నప్పుడు మధ్యలో వచ్చి పడే వర్ణనలు విసిగిస్తాయ్ ఒక్కోసారి. అయితే రెండో సారి కథని చదివేటప్పుడు ఈ వర్ణనలని ఆస్వాదించగలం.
ప్రత్యేకంగా చెప్పాల్సింది బాపూ గీసిన బొమ్మల గురించి. ప్రతి కథా చదవడానికి ముందు, చదివిన తర్వాత బొమ్మని పరీక్షగా చూడడం ద్వారా, బాపూ ఎంతగా కథలో లీనమై బొమ్మ గీశారో అర్ధం చేసుకోగలం. ఒక్క మాటలో చెప్పాలంటే రచయిత హృదయాన్ని తన కుంచెతో ఆవిష్కరించారు బాపూ. 'పోతాబత్తుల నీలమ్మ,' 'దొమ్మరిసాని,' 'సత్యభామ ఎవరనుకుంటున్నారు!,' 'బనేలురెడ్డిది బళెస్టోరీ,' 'దొంగశ్రీను,' 'సోమయాజులుగారి సెంటర్,'వై. సావిత్రి ఫర్ సేల్' కథలకి వేసిన బొమ్మలని చూసి తీరాల్సిందే. మొత్తం 519 పేజీలున్న ఈ పుస్తకంలో ప్రతి పేజీనీ ఎంతో కళాత్మకంగా తీర్చి దిద్దారు. కంటికింపుగా ఉన్న ప్రింటింగ్ లో అచ్చుతప్పులు తక్కువే. ముందుమాట రాసిన బి.వి.ఎస్. రామారావు ప్రతి ఒక్క కథనీ తనదైన శైలిలో పరామర్శించారు.
"...నా గతాన్నీ, జ్ఞాపకాల్నీ, బాధల్నీ, గాధల్నీ, ఇష్టాల్నీ, అయిష్టాల్నీ, అనుభూతుల్నీచేర్చే ప్రయత్నం చేసిన నేను, నాకిష్టమైన గోదావరిని ఆవిష్కరించే చిన్న ప్రయత్నం చేసిన నేను, ఇంక చెప్పడానికి నాదగ్గరింకే జ్ఞాపకం లేదని మనవి చేస్తున్నాను. ఇంకా ఏవన్నా, ఎప్పుడన్నా అడుగూ బొడుగూ గుర్తొస్తే కల్పించగలిగే శక్తి ఈశ్వరుడు నాకు ప్రసాదిస్తే రాసే ప్రయత్నం చేస్తానేమో..." అంటూ వంశీ రాసిన చివరిమాట కలుక్కుమనిపించింది. ఇలియాస్ ఇండియా బుక్స్ ప్రచురించిన రంగుల పేజీల 'మా దిగువ గోదారి కథలు' సంకలనం విశాలాంధ్రతో పాటు అన్ని పుస్తకాల షాపుల్లోనూ, ఏవీకెఎఫ్ లోనూ లభిస్తోంది.వెల రూ. 475. పుస్తకం చదవడం పూర్తి చేసి పక్కన పెట్టగానే ఒక్కసారి ఆ ఊళ్ళన్నీ తిరిగి రావాలనిపిస్తుంది.
వంశీ కథలు కొన్ని స్వాతి వారపత్రిక లో చదివాను . అన్ని ఒకేరకం గా అనిపించాయి :)
రిప్లయితొలగించండిఆ పుస్తకం విడుదల కోసం చూసీ చూసీ
రిప్లయితొలగించండిపాత స్వాతులన్నిటి లోంచీ ఆ కధలు కత్తిరించి బైండు చేయించా.
మీరన్నట్లు వంశీ ఇంతకన్నా రాయరేమో అన్న ఆలోచన మనస్సును చిన్నపుచ్చుతుంది.
పుస్తకం చదివాక మీ రివ్యూ చదువుతానని చెబుదామని కామెంట్ పై నొక్కబోతుంటే చివరిమాట కనిపించి కలుక్కుమంది.. మరిన్ని కథలు రాస్తారనే ఆశిద్దాం..
రిప్లయితొలగించండి"...నా గతాన్నీ, జ్ఞాపకాల్నీ, బాధల్నీ, గాధల్నీ, ఇష్టాల్నీ, అయిష్టాల్నీ, అనుభూతుల్నీచేర్చే ప్రయత్నం చేసిన నేను, నాకిష్టమైన గోదావరిని ఆవిష్కరించే చిన్న ప్రయత్నం చేసిన నేను, ఇంక చెప్పడానికి నాదగ్గరింకే జ్ఞాపకం లేదని మనవి చేస్తున్నాను. ఇంకా ఏవన్నా, ఎప్పుడన్నా అడుగూ బొడుగూ గుర్తొస్తే కల్పించగలిగే శక్తి ఈశ్వరుడు నాకు ప్రసాదిస్తే రాసే ప్రయత్నం చేస్తానేమో..." అంటూ వంశీ రాసిన చివరిమాట వంశీ ప్రత్యేకత మరోసారి నాకు సాక్షాత్కరింపజేసింది. ఒక రచయిత తాను మాత్రమే చేయగల సాహిత్యసృష్టి చేయాలి అని నా ప్రగాఢ విశ్వాసం. తాను రాస్తే తప్ప సాహిత్యప్రపంచానికి తెలియని విషయం కాదు అనుకున్నప్పుడు మానేయాలి. అంత పరిణతి ఉన్న రచయితని చూస్తున్నందుకు గర్వంగా ఉంది.
రిప్లయితొలగించండిమా గోదారోళ్ళు అని గర్వంగా చెప్పుకోగలిగే 'సేనామంది గొప్పోళ్ళ ' లో వంశీ ఒకడు . వంశీ కధలు చదువుతున్నప్పుడు మనం తిరిగిన చుట్టాలూళ్ళు , మనకి బాగా పరిచయం అయిన ఇంటిపేర్లు ఒంటిపేర్లు , మన కంచాల్లో కనిపించే కూరలు వాటిరుచులు , మనం ఎరిగిన వృత్తులు వాటితాలూకూ మనుషులు అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో గుర్తొచ్చీసి మనసుకదోలాగ అయిపోతాదికదండీ !
రిప్లయితొలగించండిమిత్రులకు ఓ శుభ వార్త... వంశీ ఒక నవల రాయబోతున్నారు. తీర్థాలలో రంగుల రాట్నం వేసే కుటుంబాల జీవన నేపథ్యంలో వుంటుంది.
రిప్లయితొలగించండివంశీ గారి మా పసలపూడి కథలది ఒక విధమైన విభిన్న ప్రక్రియ అయితే..ఈ దిగువ గోదావరి కథలు మరొక విధంగా చదువరులను ఆకట్టుకొన్నాయి...
రిప్లయితొలగించండిఎంతైనా వంశీ గారి శైలి అమోఘం.
Konni kathalu swathilo chadivanu, chalaa bagunnayi.. Book koni migata kathalu chadavali. Thanks for the review..
రిప్లయితొలగించండిఈ కథలు ఒకటి రెండు చదివానండీ....మొన్న ఇండియా వచ్చినప్పుడు ఆకుపచ్చని గ్నాపకం తీసుకున్నా! అన్ని కథలు ఒకేసారి చదవకుండా ఒక్కొటి తీరిగా చదువుతు ఆస్వాదిస్తూ ఉన్నా! నాకెందుకో వంశీ కథలు అలా తీరిగ్గ చదవాలనిపిస్తుంది! ఒకేసారి కూర్చుని బుక్ మొత్తం చదివేయబుధ్ధి కాదు! మిఠాయి దాచిపెట్టుకుని కొంచెం కొంచెం తింటునట్టు ఈ కథలు అప్పుడప్పుడు చదువుతుంటే....అనంత ప్రవాహంలా వంశీ కథలు..గోదారి అలా సాగిపోతూనే ఉంటాయి :)
రిప్లయితొలగించండిLooking forward to this book
రిప్లయితొలగించండి@మాలాకుమార్: ఎంతమాట!! ఒకే ప్రాంతంలోజరిగే కథలే తప్ప, ఏ రెండు కథలూ ఒకలా ఉండవండీ.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@ahmisaran: ఇప్పుడింక హేపీగా సంకలనం చదివేసుకోవచ్చండీ.. ధన్యవాదాలు.
@వేణూ శ్రీకాంత్:నేనూ అదే అనుకుంటున్నానండీ.. వంశీ కి కథలు దొరక్క పోతాయా అని.. ధన్యవాదాలు.
@పక్కింటబ్బాయి: నిజం!! ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి@లలిత: ఆయ్.. బళ్ళే సోప్పేరండీ బాబో.. ధన్యవాదాలు.
@చక్రవర్తి: నిజంగా శుభవార్తేనండీ.. 'మన్యంరాణి' కూడా వస్తోంది.. ధన్యవాదాలు.
@విశ్వనేత్రుడు: అవునండీ.. ఎగ్రీడ్.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@Tollywood Spice: తప్పక చదవండి.. ధన్యవాదాలు.
@ఇందు: అంటే.. ముందోసారి వరసగా చదివేసి, తర్వాత మళ్ళీ ఒక్కొక్కటీ ఒక్కొక్కటీ చదువుకుంటూ వెళతానన్న మాటండీ నేను .. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@కొత్తపాళీ: ధన్యోస్మి..
ఈ రోజు విజయవాడ వెళ్ళినపుడు అక్కడ అనుకోకుండా దొరికిన ఖాళీ సమయాన్ని విశాలాంధ్ర కు కేటాయించానండీ ఈ పుస్తకం కొనేశాను త్వరలో చదవాలి.. కానీ ధర చూసి కొంచెం కలుక్కుమంది. పేపర్ బ్యాక్ ఎడిషన్ కూడా ఉంటే బాగుండేది. ఆయిల్ పేపర్ బాపుగారి పెయింటింగ్స్ బాగున్నాయి అనిపిస్తుంది కానీ ఎక్కడో కొంచెం అసంతృప్తి.
రిప్లయితొలగించండి@వేణూ శ్రీకాంత్: పుస్తకం గెటప్, ప్రింటింగ్ క్వాలిటీ, బాపూ బొమ్మలూ, మెజారిటీ కథలూ.. ఇవన్నీ కలిసి నన్ను వెల గురించి ఆలోచించనివ్వలేదండీ.. తెలుగు పుస్తకాల మార్కెట్ పరంగా చూసినప్పుడు రేటెక్కువే అనిపిస్తుంది.. పుస్తకం చదివాక మీ అసంతృప్తి మాయమవుతుందని ఆశిస్తూ.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి