జీవిత రంగస్థలం మీద సందర్భానికి తగ్గట్టుగా పాత్ర పోషణ చేయడాన్ని గురించి చెప్పాలంటే ఉప్పుని మించిన ఉదాహరణ కనిపించదు. లవణము అని అచ్చతెలుగు లోనూ, సాల్ట్ అని ఇంగ్లిష్ లోనూ, సోడియం క్లోరైడ్ అని సైన్స్ లోనూ, 'జాడీ లోది' 'కాశీ రాచ్చిప్ప లోది' అని పూర్వ కాలపు రాత్రి భోజనాల్లోనూ మారు పేర్లు పొందిన ఒకానొక దినుసే ఇది, మరేమిటో అని అస్సలు కంగారు పడక్కర్లేదు. జీవిత రంగస్థలం లాంటి బరువైన విషయానికి ఉప్పులాంటి తేలిక పాటి ఉదాహరణా? అని కూడా సందేహం వలదు.
ఏదన్నా వంటకం.. కూరా, పులుసూ, పచ్చడీ... తీపి కానిది ఏదన్నా తీసుకోండి.. దానియొక్క రుచి దేనిమీద ఆధారపడి ఉంటుంది? కచ్చితంగా ఉప్పు మీదే కదా. ఉప్పు పడాల్సిన దానికన్నా కూసింత తగ్గినా, లేదా ఒక రవ్వ పెరిగినా వంటకం రుచి మారిపోతుంది. అంటే, ఉప్పు ఎంత పడాలో అంత మాత్రమే పడాలన్న మాట. కొంచమైనా ఎక్కువా కాకూడదు, తక్కువా అవ్వకూడదు. అలాగే మనం కూడా ఎప్పటి కెయ్యది ప్రస్తుతమో సరిగ్గా అలా ఉంటే చాలు. పప్పు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా పరిమాణంలో తేడాలోస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయ్.
మనం చేయాల్సిన పనుల్ని చేయకుండా వదిలేయడం, మనవి కాని పనుల్ని మీదేసుకోవడం... రెండూ కూడా మనకి మంచి చెయ్యకపోగా చెడు చేసేవే. మనకి నిర్దేశింపబడ్డ విధుల్ని తప్పించుకుని తిరిగి ధన్యులం అయిపోదాం అని ఆలోచన చేయడం అంటే కోరి చిక్కుల్ని తెచ్చుకోవడమే. అలాగే, మన పరిధిలో లేనివి, మనవల్ల కానివీ అయిన పనుల్ని మొహమాటానికో, మరెందుకో ఒప్పుకుని ఆపై చేతులెత్తేయడం వల్ల మనం కేవలం శాశ్విత శత్రువులని మాత్రమే సంపాదించుకోగలం. (సిని, రాజకీయ జీవులకి ఈ 'మనం' నుంచి మినహాయింపు ఇవ్వబడింది, వారికి శాశ్వత మిత్రులూ, శత్రువులూ ఉండరన్నది జగమెరిగిన సత్యం).
చిన్నప్పుడు నేను తాతయ్యతో పాటు భోజనానికి కూర్చునేవాడిని. బామ్మ, చక్కగా అన్నీ వడ్డించి మేము తింటూ ఉండగా "వంటలెలా ఉన్నాయ్?" అని అడిగేది జనాంతికంగా. నిజానికి ఆ ప్రశ్న తాతయ్యని ఉద్దేశించి. కానైతే, అప్పటి నా అజ్ఞానం వల్ల ఆ విషయం తెలుసుకోలేక పప్పులోనూ, కూరలోనూ, పులుసులోనూ ఉప్పు ఎక్కువయ్యిందని చెప్పేసేవాడిని. అప్పట్లో నేను రోజువారీ రోటి పచ్చళ్ళకి కొంచం దూరంగా ఉంటూ ఉండడం వల్ల, ఆ విషయంలో నా కామెంటు రిజర్వు చేయబడి ఉండేది. బామ్మ చేతికి ఉప్పు ఎక్కువ పడేసే అలవాటు ఉండడం వల్ల, ఆవిడ ఏం వండినా ఉప్పు తగులుతూనే ఉండేది.
తాతయ్య ఈ సత్యం తెలిసిన జ్ఞాని. అందువల్ల మౌనంగా ఉండేవారు. నేను నా అత్యుత్సాహం, మరియు అప్పటి నా పోర్షన్ కి డైలాగు స్క్రిప్టు తెలియకపోవడం అనే కారణాల వల్ల అనవసరంగా నిజమాడి బామ్మకి శాశ్వత శతృవుగా మిగిలిపోయాను. ఇక, చెప్పాల్సిన డైలాగు చెప్పకపోవడం వల్ల వచ్చే సమస్యలు ఎలా ఉంటాయంటే, నేను ఎనిమిదో తరగతిలోకి వచ్చాక ప్రతి సంవత్సరంలాగే టైం టేబిల్ ఇచ్చారు. ఏ కారణం వల్లో తెలీదు కానీ ఏ మేష్టారూ ఇంగ్లిష్ క్లాసు తీసుకోలేదు. పరిక్షలు ఎవరికోసమూ ఆగవు కదా. అలా యూనిట్ పరిక్షలు వచ్చేశాయి.
కేవలం ఏడో తరగతి జ్ఞానంతో ఎనిమిదో తరగతి ఇంగ్లిష్ పేపరు రాయాల్సి రావడం వల్ల పాతిక్కీ ఏడు మార్కులు వచ్చాయి. తొమ్మిది వస్తే పాస్ మార్కు. అయినప్పటికీ నా ఏడు మార్కులే క్లాస్ ఫస్ట్. ప్రోగ్రస్ కార్డులో పాస్ మార్కుల కన్నా తక్కువ వచ్చిన మార్కులని ఎర్ర సిరాతో రౌండ్ చేసేవాళ్ళు, నాన్నల కళ్ళలో స్పుటంగా పడేలాగా. నా ఇంగ్లిష్ మార్కుల చుట్టూ ఉన్న ఎరుపు నాన్న కళ్ళలోకి వచ్చేసింది, సంతకం కోసం కార్డు ఇవ్వగానే. మేష్టారు లేరనీ, కనీసం ఒక్క పాఠమన్నా వినకుండా, చదవకుండా ఏడు మార్కులతో క్లాస్ ఫస్ట్ వచ్చాననే సత్యాన్ని కేవలం భయం వల్ల నాన్నకి చెప్పలేకపోయాను.
ఫలితంగా అప్పుడు కాసిన్ని దెబ్బలు మరియు తర్వాత చా...లా కాలం పాటు నాకు ఇంగ్లిష్ ఏమాత్రమూ రాదన్ననాన్న ప్రగాఢ నమ్మకం. "మా వాడికి పొట్ట కోస్తే ఇంగ్లిష్ ముక్క రాదు," అని చాలాసార్లు విన్నా, నాన్న నోటినుంచి. తర్వాత అన్ని పరీక్షల్లోనూ మంచి మార్కులే వచ్చినా, అప్పటికే ఒక నమ్మకం బలపడి పోవడం వల్ల, ఆ మార్కులని అనుమానంగా చూసేవాళ్ళు. బామ్మ విషయంలో ఉప్పెక్కువయితే, ఇక్కడ ఉప్పు తక్కువయ్యింది. రెండూ చేటే చేశాయి కదా. సందర్భానికి తగ్గట్టుగా తగుమాత్రంగా ప్రవర్తించడం వల్ల ఇలాంటి సమస్యల బారిన పడకుండా తప్పించుకోవచ్చు అన్నది నీతివాక్యం. ఉప్పు గురించి ఇంకా రాయాలనే ఉంది కానీ, టపాలో ఉప్పెక్కువవుతుందేమో మరి...
ee post lo..uppu.. sariggaa saripoyindhi. vantakam chaalaa baagundhandi..
రిప్లయితొలగించండిరోజూ రాత్రి ఠంచనుగా ఈ టైముకి ఏదోకటి రుచిగా రాసి వడ్డిస్తూంటారు....మీ టపాలో ఉప్పు ఎక్కువ తక్కువలవదులెండి. మీది నలభీమపాకం. అన్నట్టు మా వాళ్ళు రాత్రిళ్లు ఉప్పుని సముద్రమంటారు.
రిప్లయితొలగించండిఉప్పెక్కువవలేదు.. తక్కువా అవలేదు. సరి సమానంగా ఉండి సూటిగా మెదడుకెక్కింది మీరు చెప్పాలనుకున్న "ఏ సమయానికి తగు..." భావం.
రిప్లయితొలగించండిగీతిక
"తాతయ్య ఈ సత్యం తెలిసిన జ్ఞాని."
రిప్లయితొలగించండిమరే వయసుతో వచ్చిన అనుభవం,అనుభవం నేర్పిన గుణపాఠం.
ఉప్పులేని కూడు ఒప్పదు రుచుల అని తూకం తేడా వస్తే తేడాలు జరిగిపోతాయి మరి.
కాదేదీ బ్లాగుటకనర్హం,
ఓం ఉప్పాయనమ: పప్పాయనమ:
హ హ బావుందండి ఉప్పోపదేశం :) అసలు ఎందులో ఎంత ఉప్పు వేయాలో తెలుసుకోవటం మహా కష్టం సుమండీ , అది తెలుసుకోనేలోపు ఉప్పు వేశేయాల్సి వస్తుంది ఆ తరవాత ఫలితం మన చేతుల్లో ఉండదు :)))
రిప్లయితొలగించండిమురళిగారు, ఉప్పప్పగా బావుందండి టపా.
రిప్లయితొలగించండి@ పక్కింటబ్బాయి గారూ <> ఇది నాకు అస్సలు అర్ధం కాలేదు కాస్త వివరించగలరా !
రిప్లయితొలగించండి@ మురళీగారూ ఉప్పుని ఒకానొక దినుసు అని తేలిగ్గా అనేయ్యకూడదేమోనండీ > ఉప్పు మహద్దినుసు కదండీ .(నా కామెంట్లో కాస్త ఉప్పు ఎక్కువైందంటారా !)
అంతా ఉప్పుమయం. ఈ జగమంతా ఉప్పుమయం. ఇందుగలదందులేదని సందేహము వలదు.. ఎందెందు వెదకినా అందందే గలదు. అదియే ఉప్పు.
రిప్లయితొలగించండిఈ పోస్ట్‌లో ఉప్పు సరిగ్గా పడింది మురళిగారు. చాలా బాగుంది.
:) ఉప్పిండిలా, (జీడిపప్పు)ఉప్మాలా, ఉప్పు బిస్కెట్టుల్లా, ఉప్పు కూర్మాలలా (పూరి జగన్నాధంలో దొరుకుతాయి ఇవి. తెలుసా?) ఉంది టపా, తగుమాత్రపు ఉప్పు తో!
రిప్లయితొలగించండిలలిత గారూ
రిప్లయితొలగించండిఉప్పుని రాత్రి పూట ఉప్పు అని, ఉసిరికాయ పచ్చడిని ఉసిరికాయపచ్చడి అని అనకూడదని కొన్ని మా వాళ్ల నిషేధం. అంద్కే రాత్రి వేళల్లో ఉప్పుని సముద్రం, ఉసిరిపచ్చడిని నల్లపచ్చడి అనేవాళ్లం. మరి మురళీ గారింట్లో ఉప్పుని రాత్రి వేళ పూర్వకాలపు భోజనాల్లో 'జాడీ లోది' 'కాశీ రాచ్చిప్ప లోది' అనేవారని రాశారు కదా.
ఇవాళ నెమలికన్ను బ్లాగ్ ఉప్పు గొడౌన్ అయిపోయింది. అందరీ కామెంట్లూ ఉప్పగానే ఉన్నయి. దీంతో సహా.. ; ))
రిప్లయితొలగించండిఅబ్బా!!! మీరు ఉప్పుగురించి రాసినా, ఎంత తియ్యగాఉందో. మేష్టారు లేకపోయినా ఇంగ్లీష్ లో క్లాస్ ఫస్ట్ వస్తే ఎంత తియ్యగా ఉందో. మీకు డైలాగ్ స్క్రిప్ట్ లేకపొవటం కూడా చాలా తియ్యగా ఉంది. మీ మార్కులని అనుమానంగా చూసేవాళ్ళ నోట్లో గుప్పెడు షెక్కర పోసేసారుగా:) ఇంక ఉప్పెక్కడుంది.
రిప్లయితొలగించండిహ హ.. మీ పోస్టూ బాగుంది.... కామెంట్లూ బాగున్నాయి.
రిప్లయితొలగించండినేను మాత్రం తృప్తిగ నవ్వుకున్నానండీ...
@ పక్కింటబ్బాయి : భలేవుందండీ ! ఉప్పు గురించి మా పెద్దలకీ కొన్ని పట్టింపులున్నాయి. ఉప్పు అందుకోకూడదని,మంగళవారం కొనుక్కోటం ఎరువు ఇవ్వటం చెయ్యకూడని అలా ఏవేవో ....కానీ ఉప్పు పేరు తలుచుకోటానికి పట్టింపా . ఉసిరి పచ్చడిని మేo ఎప్పుడూ నల్ల పచ్చడి అనే అంటాం .
రిప్లయితొలగించండి>>> అప్పటి నా పోర్షన్ కి డైలాగు స్క్రిప్టు తెలియకపోవడం అనే కారణాల వల్ల అనవసరంగా నిజమాడి....
రిప్లయితొలగించండిఇప్పుడు స్క్రిప్టు సరిగ్గా వ్రాసుకుంటున్నారు. అందుకని ఉప్పు సరిగ్గా సరిపోతోంది మీ టపా లన్నిటి లోనూ. (నిజాలు ఆడటం లేదా ??)
రెండు దరహాసాలు
హ హ హ సరదాగా బాగుందండీ టపా...
రిప్లయితొలగించండిపదార్ధాలలో ఉన్న టాక్సీన్స్ ను శరీరం ఎక్కువ మొతాదులో గ్రహించడానికి ఉప్పు దోహదం చేస్తుంది అని అంటారు. ప్రకృతి వైద్యవిధానాల్లో ఉప్పులేని భోజనం పెట్టడానికి అదోకారణం. అందుకనే శ్రమించే పగలు తిన్నా విశ్రాంతి తీసుకునే రాత్రిపూట ఉప్పు వాడకాన్ని తగ్గించడానికి పెద్దలు అలా రాత్రిపూట తలచుకోకూడదని నియమం పెట్టారని మా మాష్టారు చెప్పేవారు.
అన్నట్లు తీపి పదార్ధాలలో కూడా ఉప్పుకలుపుతారండోయ్.. ఉదాహరణకి సగ్గుబియ్యంతో చేసే పాయసంలో తగుమోతాదులో కలిపిన ఉప్పు అమోఘమైన రుచినిస్తుంది... :)
@వనజ వనమాలి: :)) :)) ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి@పక్కింటబ్బాయి: అవునండీ 'సముద్రం' కూడా ఎక్కడో విన్నాను.. ఉసిరిక పచ్చడిని రాత్రిళ్ళు, ఆదివారాలు తినకూడదనే వాదన ఒకటి ఉంది.. ధన్యవాదాలండీ.
@గీతిక: హ.హ.. ధన్యవాదాలండీ..
@శ్రీనివాస్ పప్పు: అవునండోయ్.. ఉప్పు లేని పప్పు సైతం రుచిగా ఉండదు :)) :)) ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@శ్రావ్య వట్టికూటి: నాకు కొందరి వంటలు (రుచి) చూస్తె అదే ఆశ్చర్యం అండీ.. ఇంత చక్కగా తూకం వేసినట్టుగా వేసి ఎలా చేయగలరా అని.. ధన్యవాదాలు.
@శ్రీ: అయితే, బామ్మ వంటలా ఉందన్న మాట!! ..ధన్యవాదాలండీ..
@లలిత: పూర్వకాలం కరెంటు లేని రోజుల్లో దీపాల దగ్గర భోజనాలు కదండీ.. 'ఉప్పు' అంటే దీపం ఆరిపోతుంది కదా.. అందుకని ప్రత్యామ్నాయమన్న మాట!! ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@చాణక్య; ఉప్పు గోడౌన్!! :)) ..ధన్యవాదాలండీ..
@కొత్తావకాయ; మొత్తానికి రుచిగా ఉందంటారు :)) ..ధన్యవాదాలండీ..
@జయ: చక్కెరా? నేనెక్కడ పోశానండి!! దెబ్బలు తిన్నాను పైగా :( ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@బులుసు సుబ్రహ్మణ్యం: వామ్మో.. వామ్మో.. మీదైన శైలిలో సంధించారు కదా.. నిజాలు ఆడక పోవడం కాదండీ, నోరు మూసుకుంటున్నాను.. ఇంతకీ ఇది నిజమాడక పోవడంలోకి వస్తుందంటారా?! ..ధన్యవాదాలు.
@వేణూ శ్రీకాంత్: నాకైతే దీపాల నియమం (లలిత గారికి చెప్పింది) మాత్రమే తెలుసండి.. ఇది కొత్త విషయం.. పాయసంలో ఉప్పూ కొత్త విషయమే.. ఈసారి చేయించాలి.. ధన్యవాదాలు.
మీరు బలే రాస్తారండీ...ఎంత చిన్న టాపిక్కు ఇచ్చినా చక్కని టపా రాసేస్తారు. ఉప్పు లేక రుచి పుట్టదుగదయ్యా అని ఊరికే అన్నారా పెద్దలు!
రిప్లయితొలగించండిబలే బావుంది టపా!
@ఆ.సౌమ్య: అసలు భాస్కర శతకం లో ఆ పద్య పాదమే ఈ టపాకి స్ఫూర్తి :)) ..ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి'నా పోర్షన్ కి డైలాగు స్క్రిప్టు తెలియకపోవడం' ఈ కష్టాల్లో నేనూ చాలా సార్లు పడ్డానండోయ్. మా బాగా చెప్పారు.
రిప్లయితొలగించండి@జ్యోతిర్మయి: అయితే మీకు ఇంకా బాగా అర్ధమై ఉంటాయి నా పాట్లు :-) :-) ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి