మన రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకి 'ఋణ అర్హత కార్డులు' పంపిణీ చేస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకూ ఐదున్నర లక్షలమంది కౌలు రైతులని గుర్తించి వాళ్లకి కార్డులు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమయ్యింది. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అసలీ కౌలు రైతులు ఎవరు? వీళ్ళకిప్పుడు కార్డులు పంచడం ఎందుకూ అంటే, ఇది ఇవాల్టి సమస్య కాదు. చాలా రోజులుగా ఉన్నదే, చాలా ప్రభుత్వాలు తేనెటీగల తుట్టెని కదపడం ఎందుకని పక్కన పెట్టేసిందే.
వ్యవసాయ భూమి ఉన్న భూయజమానుల్లో చాలామంది వ్యవసాయం చేయరు. ఆసక్తి లేకో, ఇతరత్రా లాభదాయకమైన వ్యాపారాలు నిర్వహిస్తూ ఉండడం వల్లనో, లేదా నగరాలకి వలస వెళ్ళిపోవడం వల్లనో వ్యవసాయం వాళ్లకి సాధ్యం కాదు. అప్పుడు ఏం చేస్తారంటే, వాళ్లకి ఉన్న వ్యవసాయ భూమిలి కౌలుకి ఇస్తారు. ఈ కౌలు తీసుకునే వాళ్ళు సాధారణంగా చిన్న రైతులో, రైతుకూలీలో అవుతారు. యజమాని దగ్గరనుంచి తీసుకున్న భూమిలో పెట్టుబడులన్నీ పెట్టి పంట పండించి, చివర్లో భూమిని ఇచ్చిన యజమానికి పండిన పంటలో భాగం ఇస్తారు. దీనినే కౌలు అంటారు.
మామూలు భాషలో చెప్పాలంటే, భూమి యజమాని తన భూమిని మరో రైతుకి అద్దెకి ఇస్తాడు. ప్రతి పంట సీజన్లోనూ ఆ అద్దెని వసూలు చేసుకుంటాడు. ఈ కౌలు రెండు రకాలుగా వసూలు చేస్తారు. పండిన పంటలో ఇంత భాగం అని కానీ, పంటతో నిమిత్తంలేకుండా కచ్చితంగా ఇంత కౌలు చెల్లించాలని కానీ ముందుగానే అనుకుంటారు. సాధారణంగా ఇందుకు సంబంధించి రాతకోతలేవీ ఉండవు. ఊళ్ళో పెద్దమనుషుల సమక్షంలో ఈ కౌలు ఒప్పందాలు జరిగిపోతూ ఉంటాయి.
ఈ కౌలు రైతులకి భూమి మీద ఎలాంటి హక్కూ ఉండదు. పన్నులు వీళ్ళే కట్టాలి కానీ, రశీదులు భూయజమాని పేరు మీద ఇస్తారు. భూమిని తనఖా పెట్టి అప్పు తీసుకునే హక్కూ, ఒకవేళ ఏదన్నా ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు ప్రభుత్వం నష్ట పరిహారం ప్రకటిస్తే అది తీసుకునే హక్కూ కూడా భూ యజమానివే. ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం, భూ యజమాని తన భూమిని అమ్మదల్చుకుంటే ముందుగా కౌలురైతుకి అవకాశం ఇవ్వాలి. ఒక్క మాటలో చెప్పాలంటే కౌలు రైతులకి బాధ్యతలే తప్ప ఎలాంటి హక్కులూ లేవు. వీళ్ళ మనుగడ యజమాని మంచితనం మీద ఆధారపడి ఉంటుంది.
ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న కార్డులు కూడా, వీళ్ళని కేవలం కౌలురైతులుగా గుర్తిస్తూ ఇస్త్తున్న గుర్తింపు కార్డులు మాత్రమే. గ్రామ స్థాయిలో అనేక సర్వేలూ, ఎంక్వయిరీలూ చేసి జాబితాలు సిద్ధం చేసి అర్హులని ప్రకటించారు. వీటి సాయంతో వ్యవసాయ పెట్టుబడులకోసం కౌలు రైతులు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవచ్చు. అయినప్పటికీ ఈ పరిణామం పట్ల చాలామంది భూయజమానులు అసంతృప్తితో ఉన్నారు. ఇది ఎవరో చెప్పిన మాట కాదు. మొన్నటి వరకూ వ్యవసాయ శాఖని నిర్వహించి ఈమధ్యనే రెవిన్యూ శాఖ మంత్రయిన రఘువీరా రెడ్డి టీవీలో చెప్పారు. కౌలు రైతులు అనేది చాలా సున్నితమైన విషయమనీ, ప్రభుత్వం చాలా జాగ్రత్తగా డీల్ చేస్తోందనీ కూడా చెప్పారు.
గడిచిన అరవైనాలుగేళ్ళలోనూ వ్యవసాయాన్ని గురించి మాత్రమే కాదు, వ్యవసాయ భూముల గురించీ ప్రభుత్వం పట్టించుకున్నది చాలా కొంచం. కొన్ని పొరపాటు నిర్ణయాల ఫలితంగా, ఇవాల్టి రోజున భూముల గురించి సమగ్ర సమాచారం లేదు ప్రభుత్వం దగ్గర. రికార్డుల్లో బీడుభూమి, పరిశీలనలో పంటభూమిగా కనిపించడం లాంటివి కోకొల్లలు. మరోసమస్య ఏమిటంటే, రెవిన్యూ-రిజిస్ట్రేషన్ శాఖల మధ్యన సమన్వయం లేకపోవడం. దీనివల్ల భూయజమానులని గుర్తు పట్టే విషయంలో ఎన్నో సమస్యలు. అయితే, భూపరిమితి చట్టం లాంటి వాటి ఫలితంగా ఒకప్పుడు కేవలం ముప్ఫై లక్షలుగా ఉన్న భూయజమానుల సంఖ్య ప్రస్తుతం కోటీ ఇరవై లక్షలకి పెరిగింది.
మొన్ననే ఒక రైతుని కలిశాను. ఆయనేమీ సన్నకారు రైతు కాదు. పెద్దకారు రైతు. స్కార్పియో కార్లో తిరుగుతూ ఉంటాడు. అప్పట్లో అగ్రికల్చర్ బీఎస్సీ చదివి, వ్యవసాయ ఉత్పత్తులు తయారు చేసే ఓ కార్పొరేట్ కంపెనీలో పనిచేసి, సీనియర్ హోదాలో రిటైరై, పెద్దఎత్తున వ్యవసాయ భూమి కొని వ్యవసాయం చేస్తున్నాడు. ఆయన చెప్పిన ఆసక్తికరమైన సంగతేమిటంటే, వరిపంటకి సంబధించి వ్యవసాయ అధికారుల నుంచి ఎలాంటి ప్రోత్సాహమూ లేదు కానీ, సెరి కల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం పట్టు పురుగులు పెంచమంటూ రోజూ ఈయన పొలం చుట్టూ తిరుగుతున్నారుట.
"హైలీ ఎక్స్పెన్సివే అయినా, సెరి కల్చర్ ప్రస్తుతం హైలీ సబ్సిడైజ్ద్. నేను అప్లికేషన్ మీద సంతకం పెట్టానంతే, మిగిలిన పనంతా వాళ్ళే చేసేశారు. మామూల్ కూడా తీసుకోలేదు," అన్నాడాయన ఉత్సాహంగా. నాకు పదేళ్ళ క్రితం, పట్టు రైతులు మద్దతు ధరకోసం చేసిన ధర్నాలు కళ్ళ ముందు మెదిలాయి. పంటని నిలవ చేసి అమ్మితే లాభాలు చాలా బాగున్నాయనీ, తనిప్పుడు గోడౌన్ల మీద దృష్టి పెడుతున్నాననీ చెప్పాడాయన. ఆయన మిత్రులు కొందరు ఈయన భూముల పక్కనే భూములు కొని కార్పొరేట్ ఫార్మింగ్ చేయబోతున్నారుట. ఈ భూములు అమ్ముకొనేది కొందరు చిన్న రైతులే అని వేరే చెప్పక్కర్లేదు కదా.
ప్రభుత్వం కదిలి వ్యవసాయం కోసం ఏదో ఒకటి చేయకపోతే, వ్యవసాయం కేవలం కొందరు వ్యక్తులు/సంస్థల చేతుల్లోకి వెళ్ళిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయేమో అనిపించింది ఆయనతో మాట్లాడాక. కేవలం ఋణ కార్డుల లాంటి సహాయాలు సరిపోవు. చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకోవాలి. లేనిపక్షంలో అనివార్యంగా రాబోయే మార్పుకి సిద్ధ పడాలి. ఆ మార్పు మంచికా, చెడ్డకా అన్నది ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే అది కాలం మాత్రమే జవాబు చెప్పగలిగే ప్రశ్న.
ప్రతి కౌలును రిజిస్టర్ చెయ్యాలి మురళీ గారు,కానీ ప్రస్తుతం భూ యజమానులు అందుకు ఒప్పుకోవడం లేదు. ప్రభుత్వ నష్ట పరిహారం అంతా భూ యజ మానికి, కౌలు రైతుకి అప్పులు బాధలు,దండగలు మిగులుతాయి.
రిప్లయితొలగించండికొంత మంది భూ యజమానులు బ్యాంకుల దగ్గర తక్కువ వడ్డీకి రైతుల పేరుతొ అప్పు తీసుకొని అదే డబ్బుని అధిక వడ్డీతో కౌలు రైతుకి ఇస్తారు. రుణ మాఫీ జరిగినప్పుడు అసలు వ్యవసాయం చేయని భూ యజమానికి మిగులుతుంది కానీ కౌలు రైతు దగ్గర ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తాడు.
చూడండి ఇది ఎంతటి విషాదకరమో!!!! అందరూ మంచి వారిగా మాటలు చెప్తారు,తమ దగ్గరికి వచ్చే సరికి నీతులు ఏమీ కనిపించవు. ఏందో ఈ లోకం. ప్రభుత్వమే కౌలు రిజిస్టర్ అనేది ఒక ఉద్యమం లాగా చెయ్యాలి. చెయ్యని వాళ్ళని కటినంగా శిక్షించాలి.
పట్టు పురుగుల పెంపకం అనేదితో చాలా రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. మల్బరీ ఆకు అనేదీ రెండు సంవత్సరాల తరువాత కోతకి వస్తుంది. పట్టు పురుగులు ఎ మాత్రం వాతావరణం లో తేడాలు వచ్చినా సచ్చిపోతాయి. లావాలు వచ్చిన తరువాత ,పురుగుని చంపి ముడి పట్టు ని తియ్యడం చాలా రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఒక సన్న కారు రైతుకి ఆ మాత్రం రిస్క్ తీసుకోలేడు. మీరు చెప్పిన బడా రైతుకే అది కొంత లాభదాయకం. ఇంకా చాలా రిస్క్ లు ఉన్నవి ఈ కమర్షియల్ పంటలతో,అందుకే సగటు రైతు రిస్క్ తక్కువ అయిన సాంప్రదాయ పంటల వైపు మొగ్గుతాడు.
@ఇంద్రసేన గంగసాని: ఇదో పెద్ద వలయం అండీ. ఎక్కడ మొదలై, ఎక్కడ ముగుస్తుందో అర్ధం కావడం లేదు.. ఇప్పటికి సవాలక్ష కార్డులు పంపిణీ చేస్తున్నారు.. రేషన్ కార్డుల మొదలు, ఆధార కార్డుల వరకూ.. ప్రతి చోటా ఎన్నో సమస్యలు.. అలాగే ఈ కొత్త కార్డులకి కూడా.. రైతుల సహకారం లేకుండా కౌలు రిజిస్ట్రేషన్ అసంభవం అండీ.. ఎందుకంటే కౌలు రైతులని అధికారికంగా 'గుర్తించ' గలిగేది భూ యజమానులు మాత్రమే!! ఇకపోతే, పట్టు పురుగుల ఉత్పత్తి బాగున్నప్పుడు ధర లేదు.. రైతులు ధర్నాలు చేశారు.. ఇప్పుడేమో పండించమని వెంటబడి, అడక్కుండానే రాయితీలు ఇస్తున్నారు.. పాలసీలు ఇలా ఉన్నాయ్.. మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండిహ్మ్.. కేవలం రైతు ఇచ్చే కౌలే ఇంటిల్లిపాది జీవనాధారంగా ఉన్న రోజుల్లో కౌలు రైతు ఇవ్వల్సిన కౌలులో నయాపైసా కూడా ఇవ్వకుండా ఎగ్గొడితే ఒక వారం రోజులు మా ఇంటిల్లిపాదీ పెద్దలు, పిల్లలతో సహా అందరం పస్తులున్న రోజులు గుర్తొచ్చాయి. వరుసగా మూడేళ్ళు కౌలు రైతుల వల్ల పడిన దారుణమైన ఇక్కట్లు గుర్తొచ్చాయి.
రిప్లయితొలగించండిభూ యజమానుల్లోనూ, కౌలు రైతుల్లోనూ కూడా మంచితనం, పరస్పర సహకారం ఉంటే ఇద్దరూ బాగుంటారు.
నాకు తెలిసి మా వైపు జరుగుతున్న కొన్ని విషయాలు - పన్నులు ఒక విడత యజమాని కడితే రెండో విడత కౌలు రైతు కడుతున్నారు. పరిహారం భూ యజమాని పేరు మీదే వచ్చినా తొంభై శాతం యజమానులు ఆ పరిహారం రైతులకే ఇచ్చేస్తున్నారు.
ప్రభుత్వంలో కదలిక ఏమీ రాదు మురళీ గారు. మీకు తెలిసే ఉంటుంది. పంటలు పండిచి ఇక్కట్లు పడలేక ఈ దఫా కోనసీమలోని కొన్ని మండలాల్లో భూ సొంతదారు, కౌలు రైతు అన్న తేడా లేకుండా రైతులందరూ పంట విరామం ప్రకటించేశారు. 'పంట విరామం మీద నాకు అవగాహన లేదు' అని ఒక మంత్రి అంటే, 'మీకు బాధలుంటే నా దగ్గరకి వచ్చి చెప్పుకోవలసింది, ఇలా పంట విరామం ప్రకటిస్తే ఎలా, పండిచండి' అని మరో మంత్రి అన్నారు.
చాలా రాసేస్తున్నట్టున్నాను. ఇంకా చాలా చెప్పాలనుంది కానీ అదంతా రాస్తే పెద్ద టపా అయిపోతుంది. :)
ఇక్కడ శిశిర గారి అభిప్రాయమే నాది . వ్యవసాయం చేయలేక , ఆ కౌలు డబ్బులు మాత్రమె జీవనాధారం గా ఉన్న వాళ్ళ పరిస్తితి దారుణం గా ఉంది . రెక్కలు వచ్చిన పిల్లలు వాళ్ళ బ్రతుకు తెరువు కోసం వాళ్ళు ఊర్లు పట్టుకు తిరుగుంటే , ఉన్న కొద్దిపాటి భూమి మీద వచ్చే కౌలు మీద బ్రతుకు వెళ్లదీసే కుంటుంబాలు ఎన్నో :((
రిప్లయితొలగించండి@శిశిర: అవునండీ.. ఇలాంటి సంఘటనలూ ఉన్నాయి, నాణేనికి మరోవైపు... ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@శ్రావ్య వట్టికూటి: ధన్యవాదాలండీ..