బుధవారం, జనవరి 30, 2013

ఒక స్నేహం...

అనుకోకుండా జరిగిన పరిచయం, తక్కువ కాలంలోనే స్నేహంగా మారింది. ఇప్పుడింక ఓ మరపురాని జ్ఞాపకంగా మిగిలిపోయింది. స్వతంత్ర సమరయోధుడు, కమ్యూనిస్టు కార్యకర్త, పాత్రికేయుడు, రచయితా అయిన పరకాల పట్టాభిరామారావు తన తొంభై మూడో ఏట విజయవాడ లోని తన స్వగృహంలో గతవారం కన్నుమూశారు. ఈ వార్త తెలిసినప్పటి నుంచీ, ఏపని చేస్తున్నా ఏదో ఒక సమయంలో పట్టాభిరామారావు గుర్తొస్తూనే ఉన్నారు. ఇకపై గుర్తొస్తారు కూడా. ఎందుకంటే, ఆయన్ని మర్చిపోవడం అంత సులువు కాదు.

ఓ వేసవి సాయంకాలం విజయవాడ బందరు లాకులు దగ్గర ఉన్న స్వాతంత్ర సమరయోధుల భవనంలో మొదటిసారి కలిశాం ఇద్దరం. మిత్రులెవరో ఆయన్ని పరిచయం చేశారు. సన్నగా, తెల్లగా, చురుగ్గా ఉండే పట్టాభిరామారావు గారితో పరిచయం, స్నేహం వరకూ వెడుతుంది అని అస్సలు అనుకోలేదు నేను. కానీ, ఆయన స్నేహశీలి. ఏవిషయం మీదైనా తన అభిప్రాయాలని సూటిగా చెప్పేవారు. అలాగని ఎవరినీ నొప్పించే వారు కాదు. 'ఇలా ఎలా సాధ్యం?' అన్న ఆలోచన కలిగేది, ఒక శ్రోతగా ఆయన మాటలు వింటున్నప్పుడు.

"సిద్ధార్ధ కాలేజీ ఎదురు సందులో కొంచం ముందుకి వస్తే, ఎడమ వైపు ఉంటుంది మా ఇల్లు. వాకిట్లో అరటి చెట్లు ఉంటాయి. అదీ గుర్తు. వీలు చూసుకుని ఒకసారి రండి.." ఈ ఆహ్వానం వచ్చిన కొన్నాళ్ళకి వెళ్ళగలిగాను. అరటి చెట్లే కాదు, ఇంకా చాలా మొక్కలు కూడా కనిపించాయి. చాలా సింపుల్ గా ఉన్న ముందు గదిలో నాలుగు నిలువెత్తు చెక్క బీరువాలు. వాటి నిండా కిక్కిరిసిన పుస్తకాలు. చూపు తిప్పుకోవడం నా వల్ల కాలేదు. "మీరూ చదువుతారు కదూ?" ఆ పుస్తకాలు చూస్తూ వెనుక నుంచి వచ్చిన ప్రశ్న వినగానే సిగ్గనిపించింది ఒక్క క్షణం.


ఊహించినట్టుగానే, ఎక్కువగా కమ్యూనిస్టు సాహిత్యం. గురజాడ రచనలతో పాటు, వాటిమీద వచ్చిన సాహిత్యం దాదాపు మొత్తమంతా కనిపించింది. అయితే, గురజాడని గురించి ఆయనతో మాట్లాడడానికి మరికొన్నాళ్ళు ఆగాల్సి వచ్చింది. నేనింకా పుస్తకాలు చూడడం పూర్తవ్వక ముందే, "మా పక్కింటి ఆయన్ని పరిచయం చేస్తాను, మై గుడ్ నైబర్," అంటూ నవ్వారు. ఇద్దరం పక్క గేటు తీసుకుని లోపలి వెళ్ళేవరకూ, నా ముఖం మీద ప్రశ్నార్ధకం వేళ్ళాడుతూనే ఉంది. రంగు రంగుల పెయింట్ ముగ్గుల లోగిలి. చాలా అభిరుచితో డిజైన్ చేసినట్టు తెలిసి పోతోంది. గృహస్తు వచ్చారు. "వేగుంట మోహన్ ప్రసాద్ గారు.. 'మో' పేరు వినే ఉంటారు.." అంటూ పరిచయం చేసేశారు పట్టాభిరామారావు గారు.

శ్రీశ్రీ కవిత్వం.. వాళ్ళిద్దరికీ కూడా చాలా ఇష్టమైన విషయం. నేను కేవలం శ్రోతని.. మధ్య మధ్యలో పృచ్ఛకుడిని కూడా. పట్టాభిరామారావు గారు "మీరు" నుంచి "నువ్వు" లోకి రాడానికి మరికొంత సమయం పట్టింది. అప్పుడు వచ్చింది గురజాడని గురించి సుదీర్ఘమైన చర్చ. మధురవాణి, పూర్ణమ్మ, మెటిల్డా ... వీళ్ళంతా అయ్యాక... "అసలు జాతీయ గీతంగా ఉండాల్సింది వందేమాతరం కాదు..జనగణమన కూడా కాదు..'దేశమంటే మట్టికాదోయ్..' ఈ గేయాన్ని అన్ని భాషల్లోకీ అనువదించాలి. స్కూలు పిల్లల చేత రోజూ పాడించాలి. అప్పుడే వాళ్లకి తెలుస్తుంది దేశం అంటే ఏమిటో. కష్ట పడితే మాత్రమే తిండి దొరుకుతుందని పిల్లలకి చెప్పకపోతే ఎలా?" అనడమే కాదు, ఆవైపు ఆయన కొంత కృషి కూడా చేశారు.

 నేను స్థావరాన్ని కాక, జంగమాన్ని కావడంతో ఊరు మారిపోయాను. అయితే ఏం, గ్రాహంబెల్ పుణ్యమా అని ఫోన్ ఉంది కదా. "నేనూ.. పట్టాభిరామారావుని మాట్లాడుతున్నాను. పరవాలేదా? మాట్లాడొచ్చా?" అని ప్రశ్నతో మొదలైన సంభాషణలు గింగురుమంటున్నాయి. 'మహిళాభ్యుదయం' ఆయనకి చాలా ఇష్టమైన విషయం. చాలా రీసెర్చ్ చేశారు కూడా. ఎంతటి విషయాన్నైనా వివాదం వరకూ వెళ్ళకుండా సంభాషణ నడపడం ఆయన ప్రత్యేకత. ఆయనలో ఉత్సాహమే తప్ప, నిరుత్సాహాన్ని చూడలేదు నేను. నాలుగు నెలల క్రితం 'నిర్జన వారధి' చదివినప్పుడు ఆ పుస్తకంలో ఆయన ప్రస్తావన చూడగానే మాట్లాడాలి అనిపించి కాల్ చేశాను. నిద్ర పోతున్నారనీ ఆరోగ్యం బాగుండడం లేదనీ చెప్పారు ఇంట్లో వాళ్ళు. "ఓసారి వెళ్లి చూసి రావాలి," అనుకున్నాను. వీలవ్వలేదు. ఇలాంటివి వెంటనే చేసేస్తే, జీవితాంతం వెంటాడే కొన్ని గిల్ట్ లకి దూరం అయిపోతాం కదూ...

7 కామెంట్‌లు:

  1. మా నాన్నగారు చెప్పేవారు పట్టాభిరామారావు గారి గురించి. మీ పోస్టు చదువుతుంటే అవన్నీ గుర్తొచ్చాయి
    RIP

    రిప్లయితొలగించండి
  2. "ఓసారి వెళ్లి చూసి రావాలి," అనుకున్నాను. వీలవ్వలేదు. ఇలాంటివి వెంటనే చేసేస్తే, జీవితాంతం వెంటాడే కొన్ని గిల్ట్ లకి దూరం అయిపోతాం కదూ"హ్మ్ !నిజమే .

    రిప్లయితొలగించండి
  3. మీ మాటలు చదువుతూ, స్నేహాన్ని ఊహిస్తూ ఈ వార్త వింటే నాకే చాలా బాధ కలిగిందండీ..!

    మా ఇల్లూ అక్కడికి రెండు వీధుల పక్కనే! 'మో'ని కూడా కలిశారా మీరు? అదృష్టవంతులు!

    రిప్లయితొలగించండి
  4. గొప్ప మనిషిని పరిచయం చేసారు.
    దేశమంటే మట్టి కాదోయ్ గురించి నా అభిప్ర్రాయం కూడా అదే. ఎంత గొప్ప గేయమో. అందరు పిల్లలకు రావాల్సిన పాట. నా పిల్లలకు నేర్పించానని చెప్పటం నాకు సంతోషం గా ఉంది.

    గుంటూరు ఉమెన్స్ కాలేజీ లో మా అక్కయ్య వాళ్ళ లెక్చెరర్ నీరసం గా ఉండే అమ్మాయిల ను చూసి "ఊసురో మని జనులు ఉంటే దేశమేగతి బాగు పడునోయ్" అని పాడేవాళ్ళుట. ఎంత నిజం.

    "జల్దికొని కళలెల్ల నేర్చుకు దేశ సంపద పెంచవలెనోయ్" , అలాగే విదేశాలకు మన సరుకులు అమ్మగలగాలి అంటారు మరో లైన్లో.

    ఆ పాటలో ప్రతి మాట ఒక రత్నం.

    రిప్లయితొలగించండి
  5. పఠాబి సీతారామారావు గారి గురించి మీరు రాసిన పోస్ట్ నిజంగా కంటతడి పెట్టించింది.
    చాలా ఆర్ద్రమైన పోస్ట్. గుడ్. కీప్ ఇట్ అప్. మీ బ్లాగ్ అభిమాని, భాస్కర్.కె.

    రిప్లయితొలగించండి
  6. @ హరిచందన : ధన్యవాదాలండీ...

    @చిన్ని. వి: నిజమేనండీ.. ధన్యవాదాలు

    @ మానస చామర్తి: అవునండీ ... చాలా బాగా మాట్లాడారు ఆయన కూడా.. ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  7. @మైత్రేయి: అవునండీ... మంచి గేయం.. ... ధన్యవాదాలు

    @ భాస్కర్: ధన్యవాదాలండీ...

    రిప్లయితొలగించండి