బుధవారం, జనవరి 09, 2013

త్రిలోక సుందరి

గోదావరిలో పాపికొండల నడుమ లాంచీ ప్రయాణం.. అదికూడా సాయం సంధ్య వేళ.. అన్నీ సవ్యంగా ఉంటే అంతకన్నా అందమైన, ఆహ్లాదమైన ప్రయాణం మరొకటి ఉండదు. కానీ ఏ చిన్న తేడా వచ్చినా ప్రాణాలతో ప్రపంచాన్ని చూడడం అంత సులువు కాదు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా తొంభై ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. వాళ్ళని తీసుకుని ప్రయాణిస్తున్న 'త్రిలోక సుందరి' లాంచీ ఇంజను ఉన్నట్టుండి ప్రయాణం మధ్యలో చెడి పోవడంతో. 

'కొండమొదలు' అనే ఏజెన్సీ గ్రామంలో జనానికి వైద్యం చేస్తూ, రోగాల నుంచి వాళ్ళ ప్రాణాలని కాపాడుతున్న డాక్టర్ అవధాని కూడా ఉన్నాడు ప్రయాణికుల్లో. ఆ తొంభై మంది ప్రయాణికులని కాపాడడం కోసం అవధాని చేసిన ప్రయత్నం ఏమయ్యింది, ఆ లాంచీ ఉన్నట్టుండి ఆగిపోడానికి కారణం అయిన వాళ్ళని అవధాని ఎలా శిక్షించాడు అన్నదే బీవీఎస్ రామారావు ఇప్పటికి ముప్ఫై ఏళ్ళ క్రితం రాసిన 'త్రిలోక సుందరి' కథ. అప్పటి 'ఆంధ్రజ్యోతి' వారపత్రికలో తొలి ప్రచురణ పొందిన ఈ కథ, 'గోదావరి కథలు' సంకలనంలోనూ ఉంది.

నలభై మంది ప్రయాణికుల కెపాసిటీ ఉన్న లాంచీలో, షావుకారు (లాంచీ ఓనరు) కక్కుర్తి కారణంగా తొంభై మందిని ఎక్కించేశాడు గుమస్తా. ప్రయాణికులతో పాటు, బియ్యం, తౌడు బస్తాలు ఓ యాభై టాపుని ఆక్రమించాయి. సంక్రాంతి రోజులు కావడంతో ఎక్కడ లేని రద్దీ ఉంది లాంచీకి. రోగులకి అవసరమైన మందులు కొనుక్కుని, కూనవరం నుంచి గూడెం వెడుతున్న డాక్టర్ అవధానిని ప్రయాణికులు అందరూ పలకరిస్తున్నారు. కేవలం అవధాని చేతి చలవ మీద నమ్మకంతో, పట్నంలో ఉన్న కూతురిని గూడేనికి పురిటికి తీసుకెడుతున్న భూషయ్య కూడా ఉన్నాడు వాళ్ళలో.

పాతకాలం లాంచీ, పైగా ఓవర్ లోడు, గాలివాలుకి ఎదురుగా, సుడిగుండాలు దాటుకుంటూ చేయాల్సిన ప్రయాణం. ఉన్నట్టుండి ఇంజను పనిచేయడం మానేస్తుంది. ఇంజిన్ గదిలోకి వచ్చిన పడుతున్న నీళ్ళు, మరి కాసేపట్లో మొత్తం లాంచీనీ ముంచేస్తాయి. ప్రయాణికులకి ఆ విషయం చెప్పేసి, తన ప్రాణాలు రక్షించుకోడం కోసం గోదాట్లోకి దూకేస్తాడు డ్రైవరు. ఉన్నట్టుండి తెలిసిన కబురుతో మతిపోయి, ప్రాణ భయంతో హాహాకారాలు చేస్తున్న జనాన్ని చూసిన అవధాని, వెంటనే కార్యాచరణ లోకి దిగిపోతాడు. టాపు మీద ఉన్న బస్తాలలో సగం బస్తాలని గోదాట్లోకి విసిరేయమని పురమాయిస్తాడు అవధాని. గుమస్తా ఒప్పుకోకపోతే, అతన్ని బెదిరించి మరీ పని కానిస్తారు జనం.

తౌడు బస్తాలు ఇంజిన్ రూములో కూరేసి, లాంచీలో ఉన్న ఓ వడ్రం మేస్త్రీతో చెక్క కొట్టించేయడంతో నీళ్ళు వచ్చి పడే ప్రమాదం తప్పుతుంది. అయితే మాత్రం... దారి పొడవునా సుడి గుండాలు, క్షణ క్షణానికీ మారిపోయే గాలివాలు. ఆడవాళ్ళు, పిల్లల రోదనలు. ఇవి చాలనట్టు భూషయ్య కూతురికి పురిటి నొప్పులు మొదలవుతాయి. ఈ గండాలన్నింటినీ జనం సాయంతో అవధాని ఎలా గట్టెక్కించ గలిగాడు, ఆ తర్వాత ఎదురు పడ్డ షావుకారు కి ఏ శిక్ష విధించాడు అన్నది తర్వాతి కథ.

మనుషుల మనస్తత్వాలతో పాటు, గోదావరి తత్వాన్ని కూడా బాగా తెలుసుకున్న వాళ్ళు మాత్రమే రాయగలిగే కథ ఇది. లాంచీ కొండ అంచున ఎలా ప్రయాణిస్తుంది, చుక్కాని నావని సుడిగుండాలలో ఎలా నడపాలి, ప్రవాహానికి అడ్డంగా కొండ తగిలినప్పుడు నదీగమనం ఎలా ఉంటుంది, సుడి గుండాన్ని చేదించడం ఎలాగ తదితర విషయాల మీద రామారావు గారికి ఉన్న కమాండ్ ఎంతటిదో కథ పూర్తి చేశాక సులభంగానే అర్ధమవుతుంది. నీటిపారుదల శాఖలో, అది కూడా గోదావరి ప్రాంతంలో సుదీర్ఘ కాలం పనిచేసిన అనుభవం ఆయనది.

కథ చదువుతున్నంత సేపూ వంశీ కథలూ, సినిమాలూ గుర్తొస్తాయి. అన్నట్టు, 'మా దిగువ గోదారి కథలు' కి ముందుమాట రాసింది రామారావు గారే. 'పుష్కరాల రేవులో పుల్లట్లు,' 'ఎసరూ-అత్తిసరూ' కథలు ఈ 'గోదావరి కథలు' సంకలనంలోవే. నవోదయ ప్రచురణలు వారి ద్వారా ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉందీ సంకలనం.

5 కామెంట్‌లు:

  1. పోస్టు చదివాక, ఈ కథ చదవాలని అనిపిస్తోంది

    btw, మీరు మళ్ళీ రెగ్యులర్గా రాస్తున్నారు!!

    రిప్లయితొలగించండి
  2. @హరిచందన: తప్పక చదవండి... ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  3. ఇప్పుడే 'త్రిలోకసుందరి' చదివొచ్చి మీ సమీక్ష చూస్తున్నాను. చాలా బాగా వ్రాసారు. మిగిలిన గోదావరి కధలను కూడా చదవాలి త్వరలో...

    రిప్లయితొలగించండి
  4. @శ్రీ.దు: తప్పక చదవండి... బాగుంటాయి కథలన్నీ... ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  5. ఈ బి.వి.ఎస్. రామారావుగారు (సీతారావుడు) ముళ్లపూడి వెంకటరమణగారి సహాధ్యాయి, మిత్రుడు; సత్యమూర్తి, రమణారావు, పరశురామ్ ల పెద్దన్న

    రిప్లయితొలగించండి