గురువారం, జనవరి 10, 2013

ఇలా మిగిలేం

'కమ్యూనిస్టు' ఈ మాట వినిపించగానే ఒక్కసారి తిరిగి చూస్తారు ఎవరైనా. వామపక్ష రాజకీయ సిద్ధాంతంతో అభిప్రాయ భేదాలు ఉన్నవాళ్ళు సైతం ఆ పార్టీ క్రమశిక్షణని మెచ్చుకున్న సందర్భాలు అనేకం. అయితే, ఆ క్రమశిక్షణ లోపించిన కారణం గానే కమ్యూనిస్టు పార్టీ చీలికలు పీలికలు అయ్యిందనీ, ప్రజలకి దూరం అవుతూ వస్తోందనీ విశ్లేషించారు చలసాని ప్రసాదరావు. తనకి ఊహ తెలిసిన నాటినుంచీ కమ్యూనిస్టు వాతావరణంలోనే పెరిగిన ప్రసాదరావు తన అనుభవాలనీ, పరిశీలననీ 'ఇలా మిగిలేం' పేరిట అక్షరబద్ధం చేశారు.

కథారచయిత, పాత్రికేయుడు, చిత్రకారుడూ అయిన చలసాని ప్రసాదరావు, 'ఈనాడు' లో రాసిన 'కబుర్లు' వీక్లీ కాలమ్ ద్వారా ఆ పత్రిక పాఠకులకి సుపరిచితులు. ఇరవయ్యేళ్ళ క్రితం తొలిసారి ముద్రితమై సంచలనం రేపిన 'ఇలా మిగిలేం' పుస్తకాన్ని, చలసాని పదో వర్ధంతి సందర్భంగా గత సంవత్సరం పునర్ముద్రించింది 'పర్ స్పెక్టివ్స్.' ఫలితంగా, చాలా ఏళ్ళ విరామం తర్వాత ఈ పుస్తకాన్ని మళ్ళీ చదవగలిగాను నేను. పుస్తకం రాసిన నాటికన్నా ఇప్పుడు సామాజిక పరిస్థితుల్లో మార్పు మరింత వేగవంతం కావడం, మొన్నటివరకూ తొమ్మిది పార్టీలుగా ఉన్న వామపక్షాలలో తాజాగా పదో చీలిక రావడం ప్రస్తుత నేపధ్యం.

కథలైనా, కబుర్లైనా సూటిగా రాయడం చలసాని శైలి. అదే శైలిని ఆసాంతమూ కొనసాగించిన 'ఇలా మిగిలేం' ని మొత్తం పద్దెనిమిది అధ్యాయాలుగా విభజించారు. సోషలిస్టు సమాజ సాధనని ఆశయంగా ప్రకటించిన నెహ్రూని కమ్యూనిస్టు అగ్రనాయకులు రెండో ఆలోచన లేకుండా నమ్మడం తోనే పార్టీకి శరాఘాతాలు తగలడం మొదలయ్యింది అని చెప్పారు 'కామ్రేడ్ నెహ్రూజీ' అధ్యాయంలో. గజ్జెల మల్లారెడ్డి, కుందుర్తి ఆంజనేయులు వంటి కవులవల్ల పార్టీకి జరిగిన నష్టాన్ని విశదంగా చెప్పారు.


అంతే కాదు, 1955 ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య జరిగిన తీవ్రమైన పోటీ ప్రభావం తెలుగు సాహిత్యం మీద ఎలా పడిందో చెబుతూ, దేవరకొండ బాల గంగాధర తిలక్, ఆరుద్రలు పోషించిన పాత్రని తీవ్రంగా విమర్శించారు. శ్రీశ్రీ కవితకి తిలక్ మారుపేరుతో పేరడీ రాశారనీ, ఆరుద్ర పరోక్షంగా కాంగ్రెస్ కి సహకరించారనీ చెబుతూ, తర్వాతి కాలంలో ఆ ఇద్దరు కవుల పుస్తకాలని విశాలాంధ్ర ప్రచురణాలయం ప్రచురించడాన్ని తప్పు పట్టారు. అంతే కాదు, చివరికి విశ్వనాథ సాహిత్యాన్నీ, క్షుద్ర సాహిత్యాన్నీ అమ్మవలసిన అగత్యం ఏమొచ్చిందని ప్రశ్నించారు.

అదే ఎన్నికల్లో పత్రికా సంపాదకుడు నార్ల వెంకటేశ్వర రావు పోషించిన పాత్రా, తర్వాతి కాలంలో పురాణం సుబ్రహ్మణ్య శర్మ ద్వారా గురజాడ రచనల పరిష్కారంలో లోపాల పేరిట కమ్యూనిస్టులపై అక్షరాల దాడి జరిపించిన వైనాన్నీ విప్పి చెప్పి, అదే నార్లకి గురజాడ రచనల వ్రాతప్రతులని ఎందుకు అప్పగించారని పార్టీ నాయకులని అడుగుతారు చలసాని. ఒకప్పటి నిబద్ద కమ్యూనిస్టులు తర్వాతి కాలంలో కాంగ్రెస్ వాదులు గానో, దైవ భక్తులు గానో మారిపోడాన్ని సాదోహరణంగా చెప్పి, లోపం ఎక్కడ ఉందని అడిగిన రచయిత, కేపిటలిస్టులు గా ఎదిగిన ఒకప్పటి కమ్యూనిస్టుల గురించి ప్రస్తావించలేదు.

వ్యాసాలతో పాటు, వరవరరావు రాసిన ముందుమాట, హరి (సూరపనేని హరి పురుషోత్తమ రావు) రాసిన 'నేపధ్యం' ఈ పుస్తకాన్ని లోతుగా అర్ధం చేసుకోడానికి ఉపకరిస్తాయి. తొలి ప్రచురణ తర్వాత, పుస్తకం పైనా, రచయిత పైనా వచ్చిన విమర్శలని ప్రస్తావిస్తూ వాసిరెడ్డి నవీన్, చలసాని ప్రసాదరావుని చేసిన ఇంటర్యూ ని జత పరిచారు. భారతదేశంలో, మరీముఖ్యంగా ఆంధ్ర దేశంలో కమ్యూనిస్టు పార్టీ ఉత్థానాన్నిగురించీ, చీలికలకి దారి తీసిన పరిణామాల గురించీ తెలుసుకోడానికి ఉపయోగపడే పుస్తకం ఇది. చదువుతున్నంత సేపూ ఈమధ్య చదివిన 'నిర్జన వారధి' 'లోపలి మనిషి' పుస్తకాలు గుర్తొస్తూనే ఉన్నాయి.('పర్ స్పెక్టివ్స్'ప్రచురణ, పేజీలు 205, వెల రూ. 150, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

6 కామెంట్‌లు:


  1. మీ బ్లాగ్ మళ్ళీ పోస్ట్స్‌తో కళకళలాడుతున్నందుకు సంతోషంగా ఉందండీ! :)

    ఇహ పుస్తకం విషయానికొస్తే, ఎప్పటిలానే పెద్ద నిట్టూర్పు! :))))

    రిప్లయితొలగించండి
  2. ఈ పుస్తకం గురించి ఎవరన్నా రాస్తే చదువుదామని అనుకుంటూ ఉన్నాను. థాంక్సండీ.

    మీరు తరుచుగా రాయడం మొదలుపెట్టినందుకు సంతోషంగా ఉంది!

    రిప్లయితొలగించండి
  3. -- మీ బ్లాగ్ మళ్ళీ పోస్ట్స్‌తో కళకళలాడుతున్నందుకు సంతోషంగా ఉందండీ! :)--



    ^^^ సేం టు సేం నేను అదే అనుకుంటున్నాను

    థాంక్స్ మురళి గారు, ఈ ఏడాదంతా ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాను

    రిప్లయితొలగించండి

  4. @నిషిగంధ: ధన్యవాదాలండీ...
    @S: ధన్యవాదాలండీ...
    @వాసు: ధన్యవాదాలండీ...

    రిప్లయితొలగించండి
  5. review is good. mee blog posts to koodi nindu choolaalini talapistundi. good. keep it up, murali gaaroo...!

    రిప్లయితొలగించండి