సరిగమలతో చదరంగమాడగలిగే గాయకుడు అనంతరామ శర్మ. గజారోహణలూ, గండ పెండేర సత్కారాలూ ఆయనకి నిత్య కృత్యాలు. ఆయన తీసిందే రాగం, పాడిందే సంగీతం. ప్రభుత్వం ఇచ్చే అవార్డుని తిరస్కరించే - అహంభావంలాగా అనిపించే - ఆత్మగౌరవం ఆయనకి అలంకారం. అటువంటి సంగీత స్రష్టకి సవాలు విసురుతాడు గంగాధరం. ఓ పల్లెటూళ్ళో పుట్టి పెరుగుతూ, సరదాగా సంగీతం నేర్చుకునే పన్నెండేళ్ళ బాల గాయకుడు. అనంతరామ శర్మలో పేరుకుపోయిన అసూయని ప్రపంచానికి తెలిసేలా చేసి, ఆ విద్వాంసుడు తనని తాను తెలుసుకునేలా చేసిన వాడు. ఇందుకోసం గంగాధరం పణంగా పెట్టింది ఏమిటన్నదే, ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం కళాతపస్వి కె. విశ్వనాథ్ రూపొందించిన 'స్వాతికిరణం' సినిమా.
అనంతరామ శర్మ పాత్రకి మళయాళ నటుడు మమ్ముట్టి ప్రాణ ప్రతిష్ఠ చేయగా, ఆయన భార్య శారదగా రాధిక పోటీ పడి నటించింది. గంగాధరం పాత్రని, అప్పటికే చిన్న తెరమీద 'మాల్గుడి డేస్' హీరోగా అందరికీ పరిచయమైన మాస్టర్ మంజునాథ్ అలవోకగా పోషించాడు. కాఫీ హోటల్ నడుపుకునే 'బాబాయ్' దంపతులకి (ధర్మవరపు సుబ్రహ్మణ్యం, డబ్బింగ్ జానకి) లేక లేక పుట్టిన కొడుకు గంగాధరం. కుర్రాడికి సంగీతం మీద ఉన్న ఆసక్తి చూసి, ఊళ్ళో సంగీతం పాఠాలు చెప్పే పక్షితీర్ధం మామ్మగారి (జయంతి) దగ్గర సరిగమలు నేర్పిస్తూ ఉంటారు. బహుశా, జన్మ సంస్కారం వల్ల కావొచ్చు, సంగీతం అలవోకగా అలవడుతుంది గంగాధరానికి. బాల్య చాపల్యాలు ఇంకా పోనప్పటికీ, 'కొండా కోనల్లో.. లోయల్లో...' అతను గొంతు విప్పాడంటే శ్రోతలు పరిసరాలనే కాదు, ఇహాన్నీ మర్చిపోతారు.
ఆ ఊరి కోవెల్లో జరిగే ఉత్సవాలకి అనంతరామ శర్మగారిని ఆహ్వానిస్తారు ఆలయం వారు. భార్యా సమేతుడై వచ్చిన ఆయన, పక్షితీర్ధం మామ్మగారి ఇంట్లో బస చేస్తారు. శర్మ గారి సమక్షంలో పాడడం కోసం, పక్షితీర్ధం ఆవిడ ప్రత్యేకంగా నేర్పించిన 'తెలిమంచు కరిగింది...' పాటని గంగాధరం పాడుకుంటూ ఉండగా, ఆ పాట వింటూ స్నానం, అర్చనాదికాలు పూర్తిచేసుకున్న శారదకి మొదటి పరిచయంలోనే గంగాధరం మీద పుత్రవాత్సల్యం కలుగుతుంది. కీర్తి ప్రతిష్టలు ఉన్న భర్తా, తరాల పాటు తిన్నా తరగని సంపదా ఉన్నప్పటికీ, పిల్లలు కలగలేదన్న లోటు మిగిలిపోయింది ఆవిడకి.
ఆలయంలో అనంతరామ శర్మ మంత్రపుష్పాన్ని రాగవరస మార్చి పాడడం తట్టుకోలేని గంగాధరం, తనూ అదే పని చేస్తాడు ఆయన ఎదట. గంగాధరాన్ని మాత్రమే కాదు, శిష్యుడిని అలా తయారు చేసినందుకు పక్షితీర్ధం ఆవిడనీ చెరిగి వదిలిపెడతారు శర్మగారు. ఎప్పుడూ పల్లెత్తు మాట అనని తండ్రి కూడా తనని తప్పు పట్టేసరికి, క్షమాపణ అడగడానికి శర్మగారి ఊరికి బయలుదేరతాడు గంగాధరం. శారద సలాహా మేరకు సంగీత అకాడమీ స్కాలర్షిప్ కోసం జరిగే పరిక్షకి వెడతాడు కానీ, అక్కడ విద్యార్ధులని ఎంపిక చేసేది అనంతరామ శర్మే కావడంతో స్కాలర్షిప్ దక్కదు గంగాధరానికి. అయితే, శారద ఆర్ధిక సహకారంతో సంగీతం నేర్చుకుని, కచేరీలు మొదలు పెడతాడు. గంగాధరానికి పేరు రావడం మొదలవ్వడంతో, అసహనం మొదలవుతుంది అనంతరామ శర్మలో.
'గురు పౌర్ణమి' సందర్భంగా, శర్మగారి శిష్యులు ఆయనకి ఏర్పాటు చేసిన సన్మాన సభకి హాజరైన గంగాధరం, శర్మగారి 'ఏకలవ్య' శిష్యుడిగా తనని తాను పరిచయం చేసుకుని 'ఆనతినీయరా...' పాటని చిరుకానుకగా సమర్పిస్తాడు. గంగాధరం ఉపయనయం తన ఇంట్లో ఘనంగా జరిపించిన అనంతరామ శర్మ, అతన్ని తన ఇంట్లోనే ఉండిపొమ్మని చెప్పడంతో, ఎంతగానో సంతోషిస్తుంది శారద. అయితే, గంగాధరానికి పెరుగుతున్న పేరు ప్రతిష్టలు అనంతరామ శర్మకి ఏమాత్రం సంతోషం కలిగించక పోగా, అసూయనీ, ద్వేషాన్నీ పెంచుతాయి. వాటిని ఎక్కువ రోజులు దాచుకోలేక పోతాడు కూడా. ఉన్నట్టుండి ఒక రోజున గంగాధరం మీద విరుచుకు పడి, ఆపై స్పృహ తప్పి పడిపోతాడు. అటు భర్త, ఇటు పుత్ర సమానుడు.. ఇద్దరి మధ్యా నలిగిపోతుంది శారద. ఆమె పసుపు కుంకుమలకి లోటు రానివ్వని మాట ఇచ్చిన గంగాధరం, అందుకోసం ఏం చేశాడు అన్నది కదిలించే ముగింపు.
కేవలం ఈ ముగింపు కారణంగానే ఈ సినిమా ప్రేక్షకులకి చేరువ కాలేక పోయింది అంటారు. (రిలీజైన మూడో రోజు, నాతో కలిపి ఎనిమిది మంది ఉన్నారు మొత్తం థియేటర్లో). ఈ ముగింపుని ఓ పట్టాన అంగీకరించలేము. ముగింపు మార్చిఉంటే, సినిమా బాగుండేదా అన్న ప్రశ్నకి సరైన సమాధానం దొరకదు. విశ్వనాథ్ కథకి, తన మార్కు సంభాషణలు అందించారు జంధ్యాల. ఎప్పటిలాగే, సినిమా ముగింపు సన్నివేశానికి తను మాత్రమే రాయలగలిగే మాటలతో నిండుతనం తెచ్చారు. ఇది సంగీత ప్రధాన చిత్రం. కథే శాస్త్రీయ సంగీత కళాకారుడి అంతర్మధనం కావడంతో మంచి సంగీతానికీ, సాహిత్యానికీ చక్కని అవకాశం దొరికింది. సహాయకుడు పుహళేంది తో కలిసి వినసొంపైన సగీతం అందించారు కెవి మహదేవన్. (ఇది 'మామ' సంగీతం అందించిన చివరి సినిమా) గాయని వాణీ జయరాం ప్రతిభని పూర్తిస్థాయిలో ఉపయోగించుకున్న సినిమా ఇది. ఒకరకంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కి 'శంకరాభరణం' ఎలాగో, వాణీ జయరాం కి 'స్వాతి కిరణం' అలాగ. ఎప్పటికీ నిలిచిపోయేవే పాటలన్నీ. 'ఆనతినీయరా...' పాటకి జాతీయ అవార్డు అందుకున్నారు వాణీ జయరాం.
నటీనటుల దగ్గరికి వస్తే మొదటగా చెప్పుకోవాల్సింది రాధికని గురించి. భర్తచాటున ఉంటూనే తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకునే ఇల్లాలిగా శారద పాత్రలో అనితర సాధ్యమైన నటనని ప్రదర్శించింది రాధిక. 'స్వాతిముత్యం' తర్వాత ఆ స్థాయి నటనని ప్రదర్శించే అవకాశం ఉన్న పాత్ర దొరికింది ఆమెకి. భర్త పాండిత్యాన్నీ, పేరు ప్రతిష్టల్నీ చూసి గర్వ పడే ఇల్లాలిగా, గంగాధరంపై పుత్ర వాత్సల్యం చూపుతూ, అతని ప్రతిభా పాండిత్యాలని నిష్కపటంగా అభినందించే తల్లిగానూ, భర్త ఆవేశం బయట పడ్డ క్షణం నుంచీ వాళ్ళిద్దరి మధ్యా నలిగిపోయే సన్నివేశాల్లోనూ చక్కని నటన ప్రదర్శించింది రాధిక. పరభాషా నటుడైనా పదహారణాల అనంతరామ శర్మ పాత్రలో అచ్చంగా ఒదిగిపోయాడు మమ్ముట్టి. ఆ పాత్ర తాలూకు భావోద్వేగాల్ని కేవలం కనుబొమల కదలికల ద్వారా చూపిన తీరుని మర్చిపోలేం. గంగాధరం పాత్రలో మంజునాథ్ ని కాక మరొకరిని ఊహించలేం.
విశ్వనాథ్ ఈ సినిమాకి దర్శకుడు మాత్రమే కాదు, నిర్మాత కూడా (పేరు వేసుకోలేదు). షూటింగ్ కొంత భాగం రాజమండ్రి దగ్గరా, ఎక్కువ భాగం శ్రీ కాళహస్తి పరిసర ప్రాంతాల్లోనూ జరిగింది. ఇటు గోదారి అందాలనీ, అటు సీమ సౌందర్యాన్నీ ఒకే ఫ్రేములో చూడగలం. తనకి ఇష్టమైన ఫ్లాష్ బ్యాక్ పద్ధతిలోనే కథ చెప్పారు విశ్వనాథ్. మలయాళ కుర్రహీరోని నడివయసు అనంతరామ శర్మగా మార్చి ఒప్పించేశారు. కొన్ని కాఫీ హోటల్ సన్నివేశాలు కేవలం హాస్యం కోసమే పెట్టినవి. ఎప్పటిలాగానే తెలుగు సినిమాల మీద సెటైర్లు వేయించారు వాటిలో. శాస్త్రీయ సంగీతపు ఔన్నత్యాన్ని చిత్రిస్తూ 'శంకరాభరణం' తీసిన దర్శకుడు, అదే రంగంలో ఉండే ఈర్ష్యాసూయలు కథా వస్తువుగా తీసుకుని సినిమా తీయడంతో సహజంగానే కొంత విమర్శ వచ్చింది. బాహాటంగా ఒప్పుకోకపోయినా, అన్నిరంగాలలోనూ ఉన్నట్టే సంగీత రంగంలోనూ అసూయాద్వేషాలు ఉన్నాయన్నది చాలామంది చెప్పిన మాట. మంచి సినిమాలు ఇష్టపడే వాళ్ళు చూడాల్సిన సినిమా ఇది.
రివ్యూ చాలా బాగుంది మురళి గారు. విశ్వనాథ్ గారు నిర్మాత కూడా అనే విషయం నాకు ఇప్పటివరకు తెలియదు. ఒక చిన్న సందేహం అండీ.
రిప్లయితొలగించండి"ఆలయంలో అనంతరామ శర్మ మంత్రపుష్పాన్ని రాగవరస మార్చి పాడడం తట్టుకోలేని గంగాధరం, తనూ అదే పని చేస్తాడు ఆయన ఎదట."
ఈ లైన్లో తట్టుకోలేని కరెక్టే అంటారా... మీరు అనంతరామశర్మ గారి గురించి ఆలోచిస్తూ ఆ పదం రాశారేమో అనిపించింది. గంగాధరానికి ఆయన అలా స్వరం మార్చి పాడడం నచ్చే ప్రభావితమై ఆయనంతాయన పాడాడు కనుక తప్పులేదనుకుని తనూ మార్చిపాడతాడు కదా.
అవునండీ ..కేవలం ముగింపు గురించి వినే ఈ సినిమా థిఏటర్ లో చూళ్ళేదు . టి.వి లో చూసినప్పుడూ కన్నీళ్ళు పెట్టినట్టు గుర్తు.
రిప్లయితొలగించండిఆహా...ఎంత మంచి పాటలండీ .
వేణుగారూ.,
రిప్లయితొలగించండిలేదండీ, గంగాకు కోపం వచ్చే ఆ పని చేస్తాడు. గుళ్ళో రోజూ ఉండే స్వరం మార్చటానికి ఈయనెవరు అని ఆ అబ్బాయి మామ్మగారితో అంటాడు.
మా అమ్మాయి, అబ్బాయిలకు ఈ సినిమా ఒక సారి చూపిస్తే ఎంతో నచ్చి సిడీ అరిగే దాకా చూసారు. " వాట్ ద హెక్" అనే ఈ తరం వాళ్ళకూ అంత నచ్చటానికి కారణం ఏమిటో నాకు భలే ఆశ్చర్యం.
నా మటుకు నాకు ఈ సిన్మా ఎండిగ్ మారితే బాగుండని ఎంత కోరికో. బుజ్జి గణపతిని శివుడు మళ్ళీ బతికించి నట్లు, గంగ చనిపోకుండా ఎక్కడో కోనల్లో పడిపోతే చివరి అంకంలో శర్మగారికి కన్పించి తీసుకు వస్తే ఎంత బాగుండేదో. విశ్వనాధ్ గారు కన్పిస్తే సాగరసంగమంలో బాలుని, ఈ సిన్మాలో గంగను ఎందుకు చంపారని అడగాలి.
శాస్త్రీయంగా సుస్వరబద్ధమైన మంత్రపుష్పాన్ని అనంతరామశర్మ వరస మార్చి పాడడం తప్పు అన్నది గంగాధరం నిశ్చితాభిప్రాయం. దాన్ని ఆయనకు స్పష్టం చేయడానికి, వ్యంగ్య ధోరణిలో తానూ అదే పని చేసి యద్దేవా చేస్తాడు. (ఆ విషయం అర్ధమైనందునే అనంతరామ శర్మకి మండుకొస్తుంది). అలాగే... గంగాధరం మరణానికి మించి ఈ కథకు ''కచ్చితమైన'' ముగింపు ఉండడం అసాధ్యం. ఆ శాస్త్రీయమైన క్లైమాక్స్‌ని విశ్వనాథ్ మాత్రం ఎందుకు మారుస్తాడు.... అది సగటు సినీ ప్రేక్షకుడికి నచ్చినా నచ్చకపోయినా....? అలా మారిస్తే ఆయనకీ... ఇతర మూస దర్శకులకీ తేడా ఏముంటుంది? (విశ్వనాథ్‌కి ఆయన శైలి మూస ఉందని కొందరు విమర్శించవచ్చుగాక)
రిప్లయితొలగించండిమైత్రేయి గారు, పురాణపండ ఫణి గారు ధన్యవాదాలండీ. ఈ సినిమా చూసి చాలారోజులవుతుందండీ అప్పట్లో మరి నాకెందుకు అలా అర్ధమైందో... ఇన్నాళ్ళూ నేనిదే అభిప్రాయంతో ఉన్నాను. ఏదేమైనా నా డివిడిల పాక్ దుమ్ము దులపాల్సిన సమయం ఆసన్నమైంది. మరోసారి మీ ఇరువురికి, మురళిగారికి థాంక్స్ :-)
రిప్లయితొలగించండినా కిష్టమైన సినిమాని మళ్లీ గుర్తుచేసినందుకు ధన్యవాదాలండి,..
రిప్లయితొలగించండిపురాణపండ ఫణి గారు, మరణమే 'ఖచ్చితమైన' ముగింపేమో కానీ ఇలా చిన్నపిల్లవాడు చనిపోవడం అస్సలు నచ్చలేదండీ! నేనెప్పుడూ అనుకుంటాను, గంగాధరాన్ని ఏ అస్సామో, టిబెటో పంపేసి.. అతను మళ్ళీ యుక్తవయసులో వెనక్కి తిరిగొస్తూంటే సినిమా మొదలైతే ఎంత బావుండూ! అని..
రిప్లయితొలగించండిమరీ మామూలుగా ఆలోచిస్తున్నానంటారా? :)))
మొన్ననే మళ్ళీ ఫ్రెష్‌గా చూశానండీ, మురళీ... ఇప్పటికీ, 'గంగాధరాన్ని చంపింది ఈ దేవుడా.. ఆ దేవుడా!' అన్న చోట మాత్రం లేని పని కల్పించుకుని వెళ్ళిపోతుంటాను! Over whelming!!
పాటలు వింటానండీ. సినిమా చూడలేను.
రిప్లయితొలగించండి@వేణూ శ్రీకాంత్: నేను చెప్పాలనుకున్న విషయమే మిత్రులు చెప్పారండీ... వీలయితే సినిమా ఒకసారి చూడండి.. ధన్యవాదాలు
రిప్లయితొలగించండి@లలిత: అవునండీ.. ఆడియోలో చాలా బాగుండే 'వైష్ణవి భార్గవి వాగ్దేవి..' పాటని సినిమాలో ముక్కలు చేస్తే భరించ లేక పోయాను నేను.. ధన్యవాదాలు
@మైత్రేయి : నా సర్కిల్లో చాలా మందికి ఇష్టమైన సినిమా అండీ ఇది.. ముగింపు గురించి ఫిర్యాదులూ ఎక్కువే.. ధన్యవాదాలు
@పురాణపండ ఫణి : నిజమేనండీ విశ్వనాధ్ మార్కు ముగింపు... కానీ చాలా మంది ఆయన అభిమానులే జీర్ణించుకోలేక పోయారు.. ... ధన్యవాదాలు
రిప్లయితొలగించండి@the tree : ధన్యవాదాలండీ...
@నిషిగంధ: మీరు చెప్పిన సీన్లో రాధికని తప్ప మరొకరిని ఊహించలేమండీ.. 'స్వాతిముత్యం' లో నిర్మలమ్మ మరణించే సన్నివేశం తర్వాత, ఆ స్థాయి నటన రాధిక నుంచి... .... ధన్యవాదాలు
రిప్లయితొలగించండి@కొత్తావకాయ : వాస్తవానికి దగ్గరగా ఉన్న సినిమా అండీ... పాటల గురించి మాత్రం ఒక్క ముక్కలో చెప్పడం కష్టం.. ధన్యవాదాలు
ఓ చిన్న సందేహం... ఈ సినిమా ఎవరో సంగీతవేత్త (సినీ సంగీత దర్శకుడు?) జీవితంలో నిజంగా జరిగిన ఘట్టానికి సినీ రూపకల్పన అని ఎప్పుడో ఎక్కడో విన్నాను... నిజమేనా? అయితే వారెవరో తెలుసా?
రిప్లయితొలగించండిస్వాతికిరణం నిర్మాతల్లో కొంతమంది ఎన్నారై మిత్రులు ఉన్నారు. ఒక మిత్రుడు మధుసూదనరావు - పేరు నిర్మాతగా టైటిల్స్ లో ఉంటుందని గుర్తు - సైకోఅనలిస్ట్.
రిప్లయితొలగించండిAmadeus అని Mozart జీవితంపై Milos Forman ఒక గొప్పచిత్రం 1984ప్రాంతాల్లో తీశాఢు. రాజాస్థానంలో మంచి స్థానంలో ఉన్న సంగీతకారుఢు Soliere యువకుడు మొజార్ట్ ప్రతిభను భరించలేక, స్నేహంగా ఉంటూనే అతని పతనానికి కుట్ర పన్నటం వృత్తాంతం. చాలా ఆస్కార్ అవార్డులు వచ్చాయి.
స్వాతికిరణం మూలాలు - చిన్నతనంలో ప్రజ్ఞాపాటవాలు, సంగీతకారుల మధ్య అసూయ, దాని పరిణామాలు - ఇక్కడ కనిపిస్తాయి.
@ పురాణపండ ఫణి: తన సినిమాల కథలన్నీ నిజ జీవితం నుంచే తీసుకున్నానని విశ్వనాథ్ ఆ మధ్యన ఏదో ఇంటర్యూలో చెప్పారండీ.. ఎవరి కథ అన్నది తెలియదు నాకు...
రిప్లయితొలగించండి@చౌదరి: ధన్యవాదాలండీ ...