ఊహించినట్టుగానే 'పాడుతా తీయగా' చిన్న పిల్లల సిరీస్ లో టైటిల్ గెల్చుకున్న లక్ష్మీమేఘన కి అభినందనలు. అంజనీ నిఖిల, గణేష్ రేవంత్, రాఘవేంద్ర ల నుంచి గట్టి పోటీని తట్టుకుని ప్రధమ స్థానంలో నిలిచిన మేఘనకి నాలుగేళ్ల వయసునుంచే శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం, ఏ పాటనైనా భావయుక్తంగా పాడడం ప్లస్ పాయింట్లుగా నిలబడి, టైటిల్ గెలుచుకోడానికి సహకరించాయన్నది నా అంచనా. ఎందుకో తెలీదు కానీ, ఈ సిరీస్ ప్రారంభం నుంచీ ఈ అమ్మాయే టైటిల్ విజేత అవుతుంది అనిపించింది నాకు. ఇదే విషయాన్ని చాలా మంది మిత్రులతో అన్నాను కూడా.
క్వార్టర్ ఫైనల్స్ నుంచి పోటీ సరళి మారి, మిగిలిన గాయనీ గాయకులు పాడే విధానంలో మార్పు కనిపించింది. ఈ దశలో "ఈ అమ్మాయి గెలుపు అంత సులువు కాదేమో" అన్న సందేహం చిన్నగా మొదలయ్యింది. అయితే ఇంచు మించి ప్రతి రౌండ్ లోనూ తను టాప్ స్కోర్స్ సాధిస్తూ వచ్చింది. ఒక దశ వరకూ రాఘవేంద్ర ఈమెకి గట్టి పోటీ ఇచ్చాడు. శ్రీకాకుళం కి చెందిన ఇతనికి కూడా శాస్త్రీయ సంగీతం మీద పట్టు ఉంది. (ఆ మాటకి వస్తే ఫైనల్స్ కి వచ్చిన నలుగురూ శాస్త్రీయ సంగీత నేపధ్యం ఉన్నవాళ్ళే) ఎలాంటి పాటనైనా గంభీరంగా పాడే రాఘవేంద్ర గానంలో చాలా సందర్భాలలో మిస్సయింది ఎక్స్ ప్రెషన్. బాలూతో పాటుగా కార్యక్రమానికి వచ్చిన అతిధులు సైతం ఈ విషయాన్ని రాఘవేంద్ర దృష్టికి చాలాసార్లే తీసుకొచ్చారు.
పాటలకన్నా మిమిక్రీ మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నట్టుగా అనిపించే బుడతడు గణేష్ రేవంత్. ప్రతి ఎపిసోడ్ లోనూ ఓ ప్రత్యేక గెటప్ లో వచ్చో, పాడడం లో సరదా గిమ్మిక్కులు చేసో అందరి దృష్టినీ ఆకర్షించే గణేష్, వ్యాఖ్యాత ఎస్పీ బాలూకి ఇష్టుడు. ఎంతగా అంటే, విజేతలని ప్రకటించాక, బాలూ గణేష్ కి తన తరపున పాతికవేల రూపాయలు బహుమతి ప్రకటించారు. గణేష్-బాలూ లు చాలాసార్లు టాం అండ్ జెర్రీ తరహా హాస్యంతో ప్రేక్షకులని నవ్వుల్లో ముంచారు. ముఖ్యంతా గణేష్ 'కొంచం ఇష్టం కొంచం కష్టం' సినిమా నుంచి "ఎవడే సుబ్రహ్మణ్యం" పాడినప్పటినుంచీ ఇది మరికొంచం ఎక్కువయ్యింది. ఫైనల్స్ లో బాలూ గణేష్ చేత చేయించిన మిమిక్రీ రక్తి కట్టింది.
ఫైనల్స్ దశలో మేఘనకి గట్టి పోటీ ఇచ్చిన గాయని అంజనీ నిఖిల. ప్రారంభంలో ఈ అమ్మాయికి ఊపిరి తీసుకోవడం సమస్యగా ఉండేది. అలాగే పాడేటప్పుడు చాలా ఒత్తిడికి గురవుతున్నట్టుగా అనిపించేది. అయితే, రాను రాను ఈ సమస్యలని అధిగమించింది. ఫైనల్స్ చివరి రౌండ్ లో "నీలీల పాడెద దేవా.." పాట పాడడానికి సాహసించడమే కాదు, చాలా బాగా పాడి 'టైటిల్ పట్టుకుపోతుందేమో' అనిపించింది. ముఖ్య అతిధి వాణీ జయరాం ఈ పాటకి స్టాండింగ్ వోవేషన్ ఇచ్చారంటే నిఖిల ఏ స్థాయిలో ఈ పాటని పాడిందో ఊహించవచ్చు. ఈ అమ్మాయి పాడిన పాటల్లో నాకు బాగా నచ్చినవి "వేదంలా ఘోషించే గోదావరి.." "టుటుటూ టుటుటూ..." గణేష్, అంజనీ ఇద్దరూ విశాఖపట్నం నుంచి పోటీకి వచ్చారు.
లక్ష్మీమేఘన నాకు నచ్చడానికి కారణం ఏమిటి? ..తను పాడే విధానం. ఎలాంటి పాటనైనా, ఏ తరహా సాహిత్యాన్నైనా అనుభవిస్తూ పాడడం ఈ అమ్మాయి ప్రత్యేకత. నిజానికి కొన్ని పాటల సాహిత్యానికి అర్ధం కూడా ఈ పదకొండేళ్ళ అమ్మాయికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ తన పాట వింటూ ఉంటే మనకా భావన కలగదు. చాలా హాయిగా పాడడంతో పాటు, పాడుతున్నంత సేపూ అంతే హాయిగా కనిపిస్తుంది కూడా. ఫైనల్స్ చివరి రౌండ్ లో నా అభిమాన 'సువర్ణ సుందరి' సినిమా నుంచి తను పాడిన 'హాయి హాయిగా..' పాట పల్లవి, తొలి చరణం పాడేటప్పుడు మాత్రం కొద్దిగా ఒత్తిడికి గురయ్యిందేమో అన్న సందేహం కలిగింది నాకు. మిగిలిన చరణాలు మాత్రం ఎప్పటిలాగే చాలా హాయిగా పాడేసింది తను.
నిజానికి ఈ సిరీస్ ప్రారంభమయ్యింది లక్ష్మీమేఘన పాటతోనే. శ్రుతిలయలు సినిమాలో "శ్రీ గణనాధం.." పాటతో మొదలు పెట్టి, తర్వాతి ఎపిసోడ్లలో చాలా చక్కని పాటలని అంతే చక్కగా పాడింది మేఘన. "మౌనమేలనోయి.." అయినా "ఏస్కోర మావా సుక్కా." పాటైనా అలవోకగా పాడేయగలగడం ఈ పాలకొల్లు అమ్మాయి సామర్ధ్యం. నిజం చెప్పాలంటే పాడుతా తీయగా గత సిరీస్ కన్నా ఈ సిరీసే బాగా నచ్చింది నాకు. చివర్లో అజయ్ శాంతి (ఈయన్ని 'మనసులో వాన' రచయితగా గుర్తుంచుకోవడమే ఇష్టం నాకు) ప్రసంగం లాంటివి కొంచం సాగతీతగా అనిపించినా మొత్తం మీద అనవసరపు మెలోడ్రామాకి అతీతంగా కార్యక్రమం సాగడం అభినందించాల్సిన విషయం. వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్న కొత్త సిరీస్ లో కూడా పాడనున్నది చిన్నపిల్లలే.
నేను గత వారాంతం స్నేహితుడి ఇంట్లో అనుకోకుండా ఈ సిరీస్ చూసాను. చూడగానే మొదట ఆకర్షించింది లక్ష్మీ మేఘనా. ఎంతగా నచ్చిందంటే రెండు రోజుల్లో మొత్తం సిరీస్ లో మేఘనా పాడిన పాటలన్నీ వరస పెట్టి చూసేశా. కొన్ని అత్యద్భుతంగా పాడింది. నాకైతే శ్రేయ ఘోషల్ గుర్తొచ్చింది. ఈ అమ్మాయి ఇక్కడ గెలిచినా గెలవకపోయినా ఖచ్చితంగా ప్లే బ్యాక్ సింగర్ అవుతుందనిపించింది. మేఘన శాస్త్రీయ సంగీతం ఇలాగే నేర్చుకుంటూ, వాణి జయరాం గారిలా ఆనతి నీయరా లాటి పాటలు ఈ అమ్మాయే పాడాలి అనేంత వృద్ది లోకి రావాలి అని కోరిక.
రిప్లయితొలగించండిపిడికొట్టుడు బాష లో చెప్పాలంటే ఈ అమ్మాయి ఫ్యాన్ ఐపోయా.నేను టపా రాద్దాం అనుకునే లోపు మీరే రాసేసారు :).
గణేష్ రేవంత్ ఫైనల్ దగ్గరికి వచ్చేసరికి చాలా మెరుగు పడ్డట్టు అనిపించింది.
ఈ కార్యక్రమం ఇలా ఉండటం వల్లే అప్పుడప్పుడు చూస్తూ ఉంటా. నాకు ఇది కాకుండా వేరే ఏ ఇండియన్ ఇడల్ టైపు కార్యక్రమాలంటే చిరాకొచ్చేసింది. ముఖ్యంగా మొన్న మా టీవీ లో సాగర్ చేసే ప్రోగ్రాం ఐతే రోతగా ఉంది (అందులో ఒక పిల్లాడు శంకరాభరణం లో పాట పాడాడు. బాబోయ్)
ఇక వాణి జైరాం గారంటే మరింత అభిమానం పెరిగింది. ఈ కార్యక్రమం లో పాడిన విధి చేయు వింతలన్నీ పాట ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు (ఒరిజినల్ కంటే వంద రెట్లు బావుంది).
ఇంట ఓపిగ్గా ఇన్నాళ్లుగా ఈ కార్యక్రమము చేస్తున్న బాలుకి శాత సహస్ర వందనాలు.
నేను ఆ ఫైనల్ పాడుతా తీయగా ఎపిసోడ్ గురించి వెతుకుతున్నా. ఎక్కడన్నా దొరుకు తుందేమో అని.
చాలా బాగా రాసారు మురళి గారూ. మన అంచనాలకి సమానంగా ఫలితాలు నిలిచినప్పుడు మనమే విజయం సాధించినంత ఆనందంగా అనిపిస్తుంది. నాకు కూడా ఎందుకో లక్ష్మీ మేఘనే గెలుస్తుంది అని అనిపించేది ఒక స్టేజ్ నించీ. ఏ పాటైనా ఆ చిన్నారి గొంతులో ఎంతో చక్కగా పలుకుతుంది. మిగతావారు కూడా చాలా చక్కగా పాడారు. ఈ చిన్నపిల్లల మనోధైర్యం, వారిమీద వారికున్న నమ్మకం, దీక్షా చూస్తుంటే పెద్దవారికే చాలా స్పూర్థి కలుగుతుంది అంటే ఆశ్చర్యం లేదు. చిన్నారులందరికీ అభినందనలు.
రిప్లయితొలగించండిఅసలా పిల్లల్ని చూస్తుంటే ఎంత ముచ్చటేస్తుందో... అంత పిన్న వయసులోనే అనంత సంగీత సాగరంలో ఆ మాత్రం పట్టు సాధించడమంటే మాటలు కాదు. వాళ్ళని చూస్తేనే నాకొక స్పూర్తి కలుగుతుంది. పర్ఫెక్షన్ కోసం శ్రమించాలని.
రిప్లయితొలగించండిచివర్లో వచ్చే వారం ప్రివ్యూ వేశారు చూశారా? వాళ్ళు కూడా చాలా బాగా పాడుతున్నుట్టున్నారు. ఏమైనా ఈటీవీలో పాడే గాయకుల నాణ్యత వేరు. మీరన్నట్టు మాటీవీలో పిల్లలు అంత టాలెంట్ ఉన్నట్టు కనిపించలేదు.
వాసు గారూ.. ఈ సైట్ లో దాదాపు అన్ని తెలుగు టీ.వీ కార్యక్రమాలు చూడవచ్చు. ప్రయత్నించండి.
రిప్లయితొలగించండిwww.manatelugumovies.net
ఈ మ్యూజిక్ ప్రోగ్రాంస్ మాత్రం ఏ చానల్ అయినా చూసేస్తానండి నేను. ఫైనల్ చాలా టఫ్ గానే నడిచింది. వాళ్ళు పాడిన పాటలు చూస్తుంటే, పిల్లలు కాదు పిడుగులనిపించారు. మీరు చాలా బాగా ఎనలైజ్ చేసారు.
రిప్లయితొలగించండిఈ ఫైనల్స్ వీడియో చూసానండి ఇప్పుడే ముందు ఎపిసోడ్స్ సంగతి తెలియదు కాని , ఏ లీల పాడేద దేవా పాడింది ఆ పాప నిజం గా చాల బాగా పాడింది !
రిప్లయితొలగించండి@వాసు: నిజమేనండీ.. అనవసరపు హంగూ ఆర్భాటం లేకుండా సాఫీగా సాగిపోతుంది.. అప్పుడప్పుడూ కూసింత విసిగించినా, మిగిలిన కార్యక్రమాలతో పోల్చినప్పుడు చాలా బెటర్.. ఇంక మేఘన గురించి చెప్పేదేముంది? మీ మాటే నామాట! ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@ప్రసీద: "మన అంచనాలకి సమానంగా ఫలితాలు నిలిచినప్పుడు మనమే విజయం సాధించినంత ఆనందంగా అనిపిస్తుంది." ..నిజమండీ.. ధన్యవాదాలు.
@ఇనగంటి రవిచంద్ర: అవునండీ.. నెక్స్ట్ సిరీస్ కూడా చూడాలని నిర్ణయించుకున్నాను, పైలట్ చూశాక. ధన్యవాదాలు.
@జయ: అవునండీ.. ఫైనల్స్ కి వచ్చేసరికి విజ్రుంభించి పాడేశారు.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@శ్రావ్య వట్టికూటి: నిఖిల మొదటి నుంచీ ఇదే రీతిగా పాడి ఉంటే తప్పకుండా టైటిల్ గెలుచుకునేదండీ.. చివరి రౌండ్స్ లో బాగా ఇంప్రూవ్ చేసింది తను.. ధన్యవాదాలు.