బుధవారం, ఏప్రిల్ 14, 2010

ముందుమాట

"కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ.. ప్రపంచపు బాధంతా శ్రీశ్రీ బాధ.." మహాకవి శ్రీశ్రీ 'మహాప్రస్థానం' పుస్తకానికి 'యోగ్యతాపత్రం' పేరిట చలం రాసిన ముందుమాటలో వాక్యమిది. నిజానికి 'యోగ్యతాపత్రాని' కి 'మహాప్రస్థానం' కి వచ్చినంత పేరూ వచ్చింది. 'యోగ్యతాపత్రం' చదివి 'మహాప్రస్థానం' చదవక పోయినా పర్వాలేదన్న అభిమానులూ ఉన్నారు. "ఓ పుస్తకానికి 'ముందుమాట' ఎలా ఉండాలి?" అన్నదానికి 'యోగ్యతాపత్రం' ఓ గొప్ప ఉదాహరణ, ఈనాటికీ.

అసలు ఏ పుస్తకానికైనా ముందుమాట ఎందుకు? ఒక్కమాటలో చెప్పాలంటే ఆ పుస్తక సారాన్ని పఠితలకి క్లుప్తంగా చెప్పడానికి. రచయిత ఆ పుస్తకం రాయడానికి పూర్వరంగం ఏమిటి? పుస్తకంలో స్పృశించిన అంశాలు ఏవి? ఆ రచన నుంచి రచయిత ఆశిస్తున్నది ఏమిటి? తదితర వివరాలని ముందుమాటలో తెలుసుకోవచ్చు. పుస్తకాన్ని ఒక కొండ అనుకుంటే, దానిని అద్దంలో చూపించేదే ముందుమాట. దీనివల్ల తానేం చదవబోతున్నాడో పాఠకుడికి కొంత అవగాహన కలుగుతుంది.

ముందుమాటని కేవలం ఫలానీ వ్యక్తులు మాత్రమే రాయాలన్న నియమం ఏదీ ఉన్నట్టు కనిపించదు. కొన్నిసార్లు రచయిత రాస్తే, ఇంకొన్ని సందర్భాలలో ఆ రచయితకి ప్రియమైన మరో రచయితో, శ్రేయోభిలాషో లేక పుస్తక ప్రకాశకుడో రాస్తూండడం చాలా పుస్తకాలలో కనిపిస్తుంది. కొన్ని పుస్తకాలకి ఒకటికి మించి ముందు మాటలు ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో ఇతరులతో పాటు, రచయిత రాసే ముందుమాటా ఉంటుంది. ఈ ముందు మాటలు దాటాకే అసలు పుస్తకం మొదలవుతుంది.

"బాల్యాన్ని గురించి రాయడం అంటే దొమ్మీకేసులో సాక్ష్యం చెప్పడం లాంటిది" అన్నారు శ్రీరమణ, డాక్టర్ సోమరాజు సుశీల రాసిన 'ఇల్లేరమ్మ కతలు' పుస్తకానికి రాసిన ముందుమాటలో. పుస్తకంలో కథలు యెంత చమత్కారంగా ఉన్నాయో, ముందుమాట కూడా అంటే చమత్కారంగా సాగింది. మొత్తం కథల్లో తనకి బాగా నచ్చినవేవో చెప్పి, అవి ఎందుకు నచ్చాయో చెప్పారు శ్రీరమణ. ఈయన ముందుమాట రాసిన మరో కథా సంకలనం జి.ఆర్. మహర్షి 'మా ఊరి మహా వైద్యగాడు.'

"ప్రతి రచనలోనూ రచయిత ఏదో ఒక పాత్రలో కనబడతాడు. వాల్మీకి రామాయణంలోని సీత పాత్రలో వాల్మీకిని చూడొచ్చు. అలాగే విశ్వనాథ వారు రాసిన శ్రీమద్ రామాయణ కల్పవృక్షము లో రాముడి లో విశ్వనాథ ని చూడొచ్చు.." అంటూ సాగింది ఆ ముందుమాట. తన నవల 'చివరకు మిగిలేది' కి తనే ముందుమాట రాసుకున్నారు బుచ్చిబాబు. తాను నవలకి అనుకున్న పేరు 'అనంతం' అనీ, మిత్రులు 'చివరకు మిగిలేది' అన్న పేరుని సూచించారనీ రాశారాయన.

నీటి పారుదల ప్రాజెక్టులపై తాను ఆరేళ్ళ పాటు చేసిన పరిశోధన ఫలితమే 'దృశ్యాదృశ్యం' అని చెప్పారు 'గుక్కెడు' పేరుతో రాసిన ముందుమాట లో రచయిత్రి చంద్రలత. 'నో బిగ్ డ్యాం' మొదలు 'నో డ్యాం' వరకూ జరిగిన ఉద్యమాలను అధ్యయనం చేసి, రచయిత్రి ఎంత కమిట్మెంట్ తో నవలని రాశారో పాఠకులకి తెలియజేస్తుంది ఈ ముందుమాట. ఓ నవల ప్రచురణలో ప్రచురణకర్త పాత్ర ఏమిటన్నది వివరంగా రాశారు సి.సుజాత తొలి నవల 'సుప్త భుజంగాలు' కి ముందుమాట రాసిన ఆ నవల ప్రకాశకులు 'నవోదయ' రామ్మోహన రావు.

'బీనాదేవి' కలం పేరుతో జంటగా రచనలు చేసిన దంపతులు బి.నరసింగ రావు, బాలాత్రిపురసుందరీ దేవి. 'పుణ్యభూమీ కళ్ళుతెరు' వంటి నవలలతో పాటు, ఎన్నో కథలనూ రాశారు. నరసింగరావు గారి హఠాన్మరణం తర్వాత, సాహితీ లోకమంతా 'బీనాదేవి అస్తమయం' అని సంతాపం తెలిపేసింది. బీనాదేవిలో సగమైన తానింకా జీవించే ఉన్నాననీ, రచనలు చేస్తున్నాననీ రాశారు బాలాత్రిపురసుందరి దేవి తన సంకలనం 'కథలు-కబుర్లు' ముందుమాటలో. 'బీనాదేవి' పేరుతోనే ఈ పుస్తకాన్ని వెలువరించారావిడ.

ముందుగానే చెప్పినట్టుగా, ముందుమాటలో రచన వివరాలు క్లుప్తంగా ఉంటాయి. పాత్రల పరిచయము, ముందు మాట రాసిన వారికి నచ్చిన, కొండొకచో నచ్చని అంశాలు ఉంటాయి. నాకైతే పుస్తకం పూర్తిగా చదివాక ముందుమాట చదవడం బాగుంటుంది. ఎందుకంటే అప్పుడు పుస్తకంలో ఏముందో పూర్తిగా తెలుస్తుంది కాబట్టి, ముందుమాట రాసిన వారి భావాన్ని సరిగ్గా అర్ధం చేసుకోగలం అని నా భావన. ఈ కారణానికే ముందుమాటని పుస్తకం పూర్తి చేశాక మాత్రమే చదువుతాను నేను.

11 కామెంట్‌లు:

  1. సేమ్ థింగ్ విత్ మీ ఆల్సో... మురళీ గారూ!

    రిప్లయితొలగించండి
  2. మురళి గారు మీ ముందుమాట నాకు చాలా నచ్చింది. ఎందుకో చెప్పమంటారా? ' ముందుమాటని కేవలం ఫలానీ వ్యక్తులు మాత్రమే రాయాలన్న నియమం ఏదీ ఉన్నట్టు కనిపించదు' అన్నారే, అక్కడ. ఎందుకంటే నేను కూడా ఒక పుస్తకానికి ముందు మాట రాయాల్సి వొచ్చింది:)

    రిప్లయితొలగించండి
  3. బాగుంది మురళి గారు, నాకు ముందు ఒక సారి పుస్తకం చదివిన తర్వాత ఒక సారి రెండు సార్లు చదువే అలవాటు ముందుమాట :-)

    రిప్లయితొలగించండి
  4. "పుస్తకాన్ని ఒక కొండ అనుకుంటే,దానిని అద్దంలో చూపించేదే ముందుమాట".
    పోలిక బావుంది."జీవన్‌టోన్ టానిక్ ఎడ్వర్‌టైజ్‌మెంట్ లాగ" పుస్తకం చదవక ముందు చదివిన తర్వాత కూడా ముందు మాట చదివితే బావుంటుంది కదా.

    రిప్లయితొలగించండి
  5. @ప్రణీత స్వాతి: అంటే మీరుకూడా చివర్లోనే చదువుతారా?!! ..ధన్యవాదాలండీ..
    @జయ: ముందుమాట రాశారా.. గ్రేట్ అండీ.. అప్పుడు మీకెలా అనిపించిందీ తదితర వివరాలన్నీ ఓ టపా రాయకూడదూ?? ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  6. @వేణూ శ్రీకాంత్: నేను మొదటిసారి పుస్తకం చదివాక ముందుమాట చదువుతానండీ.. రెండోసారి చదివేటప్పుడు మొదట ముందుమాట చదివి ఆ తర్వాత పుస్తకం చదువుతాను :-) ..ధన్యవాదాలు.
    @శ్రీనివాస్ పప్పు: ఆహా.. ఏనాటి జీవన్టోన్.. కండల వాళ్ళ ఫోటోలు కళ్ళముందు మెదులుతున్నాయి :-) ..ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  7. ముందు మాట
    అని ఇంగ్లీష్ నోవేల్ల్స్ లో ఉండదు కదా
    preface అని చూడాలి అది కూడా ఉండదు కదా
    బావుంది మీ పోస్ట్

    రిప్లయితొలగించండి
  8. ప్రిఫేస్ కొన్ని పుస్తకాలకి ఉంటుందండీ.. అంతా రచయిత ఇష్టం కదా.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  9. ఆలోచిస్తున్నా.. 'ముందు మాట' గురించి మీరు చెప్పింది :-)

    రిప్లయితొలగించండి
  10. ముందుమాట గురించి చెబుతూనే ఇంతమందిరచయితల ముందుమాటలు పరిచయం చేశారు బావుందండీ ....

    రిప్లయితొలగించండి