మంగళవారం, ఏప్రిల్ 06, 2010

బద్ధకం

"నాక్కొంచం బద్ధకం..." ఏదో ఒక సందర్భంలో ఈ మాట అనని వాళ్ళు ఎవరూ ఉండరేమో కదా.. నావరకైతే మరీ తరచూ కాదు కానీ, అప్పుడప్పుడన్నా ఉపయోగిస్తూ ఉంటాను. బద్ధకం గొప్పదనం ఏమిటంటే ఇది మన దిన చర్యతో పాటే మొదలవుతుంది. చక్కగా ఉదయాన్నే లేవాలనుకుంటామా? మెలకువ రాగానే "ఒక్క పది నిమిషాలు పడుకుని అప్పుడు లేద్దాం.. ఈలోగా ప్రపంచం ఏమీ తలక్రిందులు అయిపోదు కదా.." అని అశరీరవాణి చెబుతుంది. ఎప్పుడూ ఎవరి మాటా వినని వాళ్ళు కూడా ఈ మాటలు బుద్ధిగా వింటారు.

అది మొదలు మనం చేయాల్సిన ప్రతి పనినీ కాసేపైనా వాయిదా వేసేస్తూ ఉంటాం, కేవలం బద్ధకం వల్ల. అలా అని ఆ పని చేయడం ఏమన్నా తప్పుతుందా? ఆంటే అదీ లేదు. ఇల్లేరమ్మ వాళ్ళమ్మగారు చెప్పినట్టు "తనకున్న పని తినకున్నా తప్పదు.." అయినప్పటికీ కూడా మనం బద్ధకించేస్తాం.. ఎందుకంటే అది మన జన్మ హక్కు. బద్ధకించినందుకు గాను ఏదో ఒక రూపంలో మూల్యం చెల్లిస్తూనే ఉంటామా.. అయినా కూడా బద్దకించడం మానం. అలా అలవాటైపోతుందన్న మాట.

ఉదాహరణకి, చిన్నప్పుడు బళ్ళో మేష్టారు, ఇంట్లో పెద్దోళ్ళు "ఎప్పటి పాఠాలు అప్పుడు చదివేసుకోండి.." అని మన చెవుల్లో బంగ్లాలు కట్టుకుని మరీ చెప్పినా మనం విన్నామా? లేదు.. పరీక్షలప్పుడు బుద్ధిగా నైటౌట్లు చేసి, మనం టెన్షన్ పడి, వాళ్ళని టెన్షన్ పెట్టి, కాలక్రమేణా  వాళ్ళని ఇలాంటి టెన్షన్లకి అలవాటు చేసి మన చదువు పూర్తి చేశాం. "మేమిలా అస్సలు చెయ్యలేదు" అని ఎవరన్నా అన్నారంటే వాళ్ళు అత్యంత బుద్ధిమంతులైనా అవ్వాలి లేక అతిపెద్ద అబద్ధాలకోరులైనా అవ్వాలి. ఇప్పుడు మళ్ళీ పిల్లలకి హితబోధలు చేయడానికి మనం అస్సలు మొహమాట పడం, అది వేరే విషయం.

ఏదైనా ఒక సమూహంలోకి వెళ్లి "మీలో ఆదివారం రోజుకూడా రోజూ లేచే టైం కే నిద్ర లేచే వాళ్ళు చేతులెత్తండి" అని అడుగుదాం. ఎన్ని చేతులు పైకి లేస్తాయంటారు? మన చెయ్యి కూడా లేవకుండా ఉండడానికి మినహాయింపు కాదని గుర్తు పెట్టుకోవాలి. నావరకు నేను కొన్ని విషయాల్లో అస్సలు బద్ధకించను. కాఫీ, టిఫిన్, బోయినం.. ఇలాటి విషయాల్లో అన్నమాట. నా స్నేహితురాలొకావిడ "మా ఆయనకి ఎంత బద్ధకం అంటే.. నేనో, పిల్లలో కంచంలో అన్నం పెట్టి పిలవగా పిలవగా అప్పుడొచ్చి భోజనం చేస్తాడు" అని చెప్పింది కించిత్ పరవశంగా.


మరో మిత్రుడికి ఎంత ముఖ్యమైన పనినైనా చివరి నిమిషం వరకూ వాయిదా వేయడం, అప్పుడు చుట్టూ ఉన్న అందరినీ కంగారు పెట్టడం అలవాటు. "ఈ బద్ధకం ఒదుల్చుకోలేక పోతున్నా.." అంటాడే తప్ప, ఆ దిశగా ప్రయత్నాలేవీ ఉండవు. మన బద్ధకం కారణంగా మన చుట్టూ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడడం అంత మంచిది కాదు కదా. వంట చేసుకోడానికి బద్దకించి భోజనం మానేసే స్నేహితురాలిని చూసి నాకు ఎంత ఆశ్చర్యమో.. "ఇలా కూడా ఉంటారా?" అని.

"ఈ పూట కాస్త బద్ధకంగా ఉంది కూరొండలేదు" అని ఏ ఇంట్లోనైనా ఇల్లాలు చెబితే, ఆ తర్వాతి దృశ్యం ఊహించుకోడం ఏమంత కష్టం కాదు కదా.. మన బద్ధకం కేవలం ఇంటికి మాత్రమే పరిమితం అయితే ఇంక మన గొప్పదనం ఏముంది? కాబట్టి, ఆఫీసు పనిలో కూడా మనం బద్ధకిస్తూనే ఉంటాం. అది మన హక్కు. అయినా చెప్పిన పని వెంటనే చేసేస్తే, ఆ వెనుకే మరో పని వెతుక్కుంటూ వచ్చేయదూ?? అయితే ఇలా బద్దకించి పని వాయిదా వేయగలిగే అదృష్టం అందరికీ ఉండదు.

బద్ధకం కేవలం మనుషులకి మాత్రమే కాదు. జంతువులకీ, వస్తువులకీ కూడా సహజమే. ముఖ్యంగా పెంపుడు జంతువులకి ఉండే బద్ధకం వాటిని పెంచే వాళ్ళకే తెలుస్తుంది. వస్తువుల విషయానికి వస్తే, కొంచం వయసైపోయిన టీవీ ఆన్ చేయగానే దృశ్యం చూపించకుండా కాస్త నెమ్మదిగా ఆ పని చేస్తుంది. పాత కారు, ఫ్రిజ్జు.. ఏదైనా సరే.. ఇదే పరిస్థితి దాదాపుగా. ఈ టపా రాద్దామని నేను మూడు రోజులుగా బద్దకించి వాయిదా వేస్తున్నాను.

20 కామెంట్‌లు:

  1. మా బాగా చెప్పారు.కిందటి పోస్టుకి(కధకి)రాద్దామనుకున్నా కామెంటు ఈ పోస్టుకయ్యింది.అయ్యా అదీ విషయం.గారెలు రుచిగా ఉంటాయని చెప్పాలా ప్రత్యేకంగా?మీ పోస్టు కూడా అంతే.

    రిప్లయితొలగించండి
  2. బద్ధకం గురించి బాగా చెప్పారండీ! నేను కూడా బద్దకించి 'కామెంటు రేపు రాద్దాం లే మళ్ళీ వచ్చి' అనుకున్నా గానీ, మీరింతగా బద్ధకం గురించి చెప్పాక కూడా నేను మళ్ళీ బద్దకంగా కామెంటు రాయడం వాయిదా వేయడం బాగుండదని.. కాసేపు నా బద్దకాన్ని పక్కకు నెట్టి.. కామెంటేస్తున్నా! ;-) ;-)

    రిప్లయితొలగించండి
  3. పేద్ద కామెంట్ రాయాలని ఉంది కానీ (ఆవలిస్తూ) కాస్త బద్దకంగా ఉంది తర్వాత తీరిగ్గా కామెంటుతాను మురళి గారు :-p

    రిప్లయితొలగించండి
  4. బాగుంది. ఇంకా ఏమన్నా రాయాలంటే బద్ధకంగా ఉంది.

    రిప్లయితొలగించండి
  5. వంట చేసుకోడానికి బద్దకించి భోజనం మానేసే స్నేహితురాలిని చూసి నాకు ఎంత ఆశ్చర్యమో.. ">>నాకేమి ఆశ్చర్యము గా లేదు ఎందుకంటే నేను అంతే :) ఇంకా రాయాలని ఉంది గాని కొంచం బద్ధకంగా ఉంది మురళి గారు :)

    రిప్లయితొలగించండి
  6. వంటచేయడానికి బద్దకించి తినకుండా ఉండే వాళ్ళలో నేను కూడా ఉన్నానండి.నాకు తోడు చాలా మంది ఉన్నట్లు అనిపిస్తుందే?

    రిప్లయితొలగించండి
  7. నాలాగెందరో??? బద్దకిస్టులు బోలెడంతమంది ఉన్నారన్నమాట...
    లిస్ట్ తయారుచేద్దామా!!! ఆ ఏం చేస్తాంలెండి, తరువాత చూసుకోవచ్చు:)

    రిప్లయితొలగించండి
  8. నాకు ఈ మద్య విపరీతమైన బద్ధకం పెరిగిపోతుంది ..బహుశ అది వయస్సు ప్రభావమేమో అనుకుంటే మా అమ్మ లాంటివారు మా అమ్మాయికన్న ఉత్సాహంగా అన్నిటిని సులువుగా చేసేస్తారు ఈ బద్ధకం మనస్సు బట్టి ఉంటుందేమో -:) నేనైతే ఒక్కదానికి వండుకునే బిజినెస్స్ పెట్టుకోను ..కాయో కసరో తిని బ్రతికేస్తాను .వండాలి అంటే బద్ధకం .

    రిప్లయితొలగించండి
  9. "వంట చేసుకోడానికి బద్దకించి భోజనం మానేసే స్నేహితురాలిని చూసి నాకు ఎంత ఆశ్చర్యమో.. "ఇలా కూడా ఉంటారా?" అని.."
    ఇలాంటి బద్ధక బ్రహ్మలు మా ఫామిలీ లో బోల్డు మంది ఉన్నారండోయ్. అందుకే ఇప్పుడు నేనస్సలు ఆశ్చర్య పడట్లేదు.

    "గారెలు రుచిగా ఉంటాయని చెప్పాలా ప్రత్యేకంగా?మీ పోస్టు కూడా అంతే.." శ్రీనివాస్ పప్పు గారితో నేనూ ఏకీభవిస్తున్నా...!!

    రిప్లయితొలగించండి
  10. బద్దకం గురించి బాగా చెప్పారండి . నేనైతే , రోజూ కూడలి లో చూసి పోస్ట్ లన్ని చదువుతాను , కాని కామెంట్ రాయాలంటే ఎంత బద్దకమో . నా కొచ్చే కామెంట్స్ కి జవాబు రాయలన్నా బద్ధకమే . ఈ పోస్ట్ చూసాక , అర్జెంట్ గా వెళ్ళి జవాబులు రాయాలను కుంటున్నాను .

    రిప్లయితొలగించండి
  11. మురళి గారు. యు ఆర్ గ్రేట్. మొత్తానికి ఎంతో మంది బద్దకం ఒదిలించిన క్రెడిట్ మాత్రం మీదే... "బద్దకించి పని వాయిదా వేసే అదృష్టం అందరికీ ఉండదు". ఇది జీవిత సత్యం.

    రిప్లయితొలగించండి
  12. పోస్టు సూపరు. పప్పు శీను బద్ధకం కామెంటు అంతకన్నా సూపరు.
    బైదవే మురళిగారూ, తెల్లారుజామును ఇంకాస్సేపు పడుకోమని బోధించేది అశరీరవాణి కాదు, మన శరీర వాణే :)

    రిప్లయితొలగించండి
  13. @శ్రీనివాస్ పప్పు: ఇలా వేళ కాని వేళ గారెలు గుర్తు చేయడం మీకు భావ్యమా చెప్పండి?? :-) :-) ..ధన్యవాదాలు.
    @మధురవాణి: మీరూ బద్ధకస్తులే అన్నమాట!! ..ధన్యవాదాలు.
    @వేణూ శ్రీకాంత్: మీరు కూడానా?? ('యూ టూ, బ్రూటస్' టోన్ లో చదువుకోండి) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. @మైత్రేయి: ఆహా.. ఓహో.. నాలాగా ఇంకెందరో కదా!! ధన్యవాదాలండీ..
    @శ్రావ్య వట్టికూటి: అవునా.. మా ఇంట్లో అలాంటి దృశ్యం కనపడక నేను ఆశ్చర్య పోయానండీ ఇన్నాళ్ళూ.. ఇప్పుడింక ఒపీనియన్ చేంజ్ చేసుకోవాల్సిందే :-) ..ధన్యవాదాలు.
    @స్రవంతి: అవునండీ చాలామందే కనిపిస్తున్నారు.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  15. @పద్మార్పిత: లిస్టా.. కొంచం మీరు వేసేద్దురూ :-) :-) ..ధన్యవాదాలు.
    @చిన్ని: 'కాయో కసరో తిని బతికేస్తాను..' మీరుండేది అడవిలోనా ఏమిటండీ? :-) :-) ..ధన్యవాదాలు.
    @ప్రణీత స్వాతి: ఇప్పుడింక నేనుకూడా ఆశ్చర్య పడడం మానేశానండీ.. ఇంతమందిని చూశాక.. ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. @మాలాకుమార్: హమ్మయ్య.. నా టపా ఒక మంచి పని చేసిందన్న మాట!! ధన్యవాదాలండీ..
    @జయ: నిజమేనండీ.. అస్సలు ఊహించలేదు ఇందరు తోడున్నారని.. ధన్యవాదాలు.
    @కొత్తపాళీ: 'అశరీరవాణి కాదు, మన శరీరవాణే :)' ..భలే నవ్వించారండీ.. నిజమే కదా.. 'అశరీర వాణి' అనుకుంటే అదో తృప్తి.. ధన్యవాదాలు.
    @హరే కృష్ణ: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  17. ఇంతకుముందు మీ బ్లాగులో వీలైనన్ని కామెంట్లు వ్రాసేవాడిని.
    ఈ మధ్య మీ టపాలు చదివినా తరువాత వ్రాద్దామని బద్ధకించాను.
    ఈ టపా చదివిన తరువాత కూడా వ్రాయకపోతే.......

    రిప్లయితొలగించండి
  18. ఈ బద్ధకం అనేది ఆవులింతలా అంటువ్యాదేమో అని నా అనుమానం ...ఇంట్లో ఎవరైనా బద్ధకంగా కనిపిస్తే నాక్కూడా అలాగే అనిపిస్తుంది . నాకే ఇలా అవుతుందో ఏవిటో ...అలాగే ఒంటరిగా ఉన్నా బద్ధకం దగ్గరికొచ్చేస్తుంది. ఐతే సాధారణంగా దాని పప్పులు నాదగ్గర ఉడకవులెండి సాధారణంగా మా ఇల్లెప్పుడూ బంధుమిత్రులతో కళకళలాడుతూ ఉండటం వల్ల :)

    రిప్లయితొలగించండి