లక్ష్యాన్ని నిర్ణయించుకోవడం కోవడం సులువే.. కానీ చేరుకోవడం చాలా కష్టం. కృషి, పట్టుదల, ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోగలగడం, కొత్త ఉత్సాహంతో మళ్ళీ మళ్ళీ ప్రయత్నించడం..ఇవన్నీ అవసరం. పెళ్లై, ఒక బిడ్డకి తల్లైన మహిళ ఒక ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరుచుకుని, పట్టుదలతో కృషి చేసి, ఆ లక్ష్యాన్ని చేరుకోడం చెప్పినంత సులభం కాదు. విజేతలు లక్ష్య సాధన కోసం జరిపిన కృషి, చేసిన త్యాగాలూ, ఇవన్నీ బయటి ప్రపంచానికి తెలియవు. కానీ.. అలాంటి ఒక విజేత కృషిని తెలుసుకోగలిగే అవకాశాన్ని కల్పించిందొక బ్లాగు.. ఆ బ్లాగు పేరు హిమబిందువులు.
ప్రభుత్వ సర్వీసుని తన లక్ష్యంగా నిర్ణయించుకోవడం మొదలు, దానిని సాధించడం వరకు తను చేసిన కృషి, కుటుంబ సభ్యులు, మిత్రుల నుంచి అందిన సహకారాన్ని వివరంగా రాశారు బ్లాగర్ చిన్ని 'నా స్నేహితులు' అనే సిరీస్ లో. లక్ష్య సాధన కోసం కృషి చేసే ప్రతి ఒక్కరూ చదవాల్సిన టపాలివి. ఫిబ్రవరి 6, 2009 న 'కొత్తగా బ్లాగులోకంలోకి' అనే టపా తో బ్లాగుని ప్రారభించి, గడిచిన ఏడాది కాలంలో తన బాల్య జ్ఞాపకాలు, ఆలోచనలు, కవితలు, తన దృష్టికి వచ్చిన కొన్ని సంఘటనలు.., ఇంకా తనకి నచ్చిన పాటలు.. ఇలా ఎన్నో కబుర్లని బ్లాగు పాఠకులతో పంచుకున్నారు చిన్ని.
తామరాకులో ఆమ్లెట్ తిన్నా, వజ్రాల వేట సాగించినా, అభిమాన హీరోల గురించి చెప్పినా, నాన్న గురించి రాసినా.. ప్రతి జ్ఞాపకం లోనూ ఏదో ఒక ప్రత్యేకత. ఈవిడకి నాయకత్వ లక్షణాలు చిన్నప్పటి నుంచే ఉన్నాయని ఇట్టే తెలిసిపోతుంది, వాళ్ళ తమ్ముళ్ళు, చెల్లెళ్ళని, మిగిలిన స్నేహితులని గైడ్ చేసిన విధానం చదవగానే. ఒక ఉమ్మడి కుటుంబ దృశ్యాన్ని కళ్ళముందు ఉంచడమే కాదు, అప్పుడప్పుడూ అయినా మన వాళ్ళందరినీ కలుసుకుంటూ ఉండాలి సుమా అన్న ఆలోచన మనకి తెలియకుండానే కలిగిస్తాయీ టపాలు.
చిన్ని గారికి సీరియళ్ళంటే బాగా ఇష్టమేమో అన్న సందేహం రాక మానదు, ఆవిడ రాసిన టపాల సీరియళ్ళు చదివినప్పుడు. 'నా స్నేహితులు' తో పాటు, 'మా వంటింటి కథ, 'కార్ డ్రైవర్ కథ,' ఇంకా 'నేను' సీరియల్ టపాలు ఉన్నాయి ఈ బ్లాగులో. 'నేను ఎవరిని,' 'ఏం రాయమంటావే చిన్నారి,' 'సంధ్యా సమయంలో..' 'బంధం' ఇవి చిన్ని గారు రాసిన కొన్ని కవితలు. చాలా వరకు మనల్ని ఆలోచనలో పడేసేవే. కవితలు రాయడం మాత్రమే కాదు, తనకి నచ్చిన సినిమా పాటల సాహిత్యాన్ని, వీడియోలనీ అప్పుడప్పుడూ బ్లాగులో ఉంచుతూ ఉంటారు.
ఆమధ్య ఎప్పుడో ఒక బ్లాగులో వ్యాఖ్య రాస్తూ బ్లాగర్ కొత్తపాళీ గారు మహిళలకి పూలన్నా, మొక్కలన్నా ప్రత్యేకమైనా అభిమానం అన్నారు. చిన్ని గారు కూడా మినహాయింపేమీ కాదు. 'ఇప్పపూలు' 'తంగేడుపూలు' టపాలే ఇందుకు సాక్ష్యం. అన్నట్టు కొత్తపాళీ గారి పుస్తకావిష్కరణ సభకి వెళ్లి, ఆ వెంటనే ఆ విశేషాలని బ్లాగ్మిత్రులందరితో పంచుకున్నారు. ఆయన కథల గురించి కూడా టపాలు రాస్తారేమో చూడాలి. కథలు అనగానే మరో విషయం గుర్తొచ్చింది. వంశీ కథలు వన్నె తగ్గుతున్నాయని నిర్మొహమాటంగా చెప్పేశారు, దిగువ గోదారి కథలు చదువుతూ. అలాగే చలం అట్లపిండి కథను యెంతో సరదాగా పరిచయమూ చేశారు.
చిన్ననాటి మిత్రులని కలుసుకునే అవకాశం మనకి అరుదుగా మాత్రమే దొరుకుతుంది కదా.. కానీ చిన్ని గారికి మాత్రం ఆ అవకాశం తరచూ దొరుకుతున్నట్టు ఉంది. 'ఆనాటి హృదయాల ఆనంద గీతం' పాడిన నాలుగు నెలలు తిరక్కుండానే 'ఒక లైలా కోసం' పాటకి మిత్రులు చేసిన డేన్స్ చూసి వచ్చారు మరి. మిత్రులంతా దేశ, విదేశాల్లో స్థిర పడినా తరచూ కలుసుకుంటూనే ఉంటామని 'నా స్నేహితులు' లోనే చెప్పారు. పూలచెట్లు, పాటలు, పుస్తకాలతో స్నేహం ఉండనే ఉంది.
నా సంగతి కొంచం చెప్పాలి. 'నెమలికన్ను' మొదలుపెట్టిన ఐదు నెలలకి 'ఈనాడు' నాకో ప్లెజెంట్ సర్ప్రైజ్ ఇస్తే, అలాంటి సర్ప్రైజ్ నే అదే రోజు ఇచ్చారు చిన్ని గారు. 'ఈనాడు లో నెమలికన్ను' గురించి టపా రాసి, కూడలికి వచ్చేసరికి 'మురళికి నెమలిపించం' అంటూ చిన్ని గారు తన బ్లాగులో రాసిన టపా నాకు స్వాగతం పలికింది. ధన్యవాదాలు చిన్ని గారూ. 'హిమబిందువులు' బ్లాగు నుంచి నేను నేర్చుకున్న మరో విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించాలి. ఈ బ్లాగులో కనిపించే అప్పుతచ్చుల గురించి నేను వ్యాఖ్యలు రాసే వాడిని. మొదట్లో 'సరి దిద్దుకుంటా' అని ఓపిగ్గా చెప్పారు.
నేను నా పధ్ధతి మార్చుకోక పోవడంతో ఆవిడకి సహనం నశించినట్టుంది, "నాకు ఇలాగే వచ్చు" అని వ్యాఖ్యలో చెప్పేశారొక సారి. ఆలోచిస్తే అనిపించింది.. ఎవరి బ్లాగు ఎలా ఉండాలో చెప్పడం మనపని కాదు అనీ, అలాగే బ్లాగు ఇలాగే ఉండాలి, ఇలాగే రాయాలి అనడం కూడా సరికాదు అని. అప్పటినుంచీ ఏ బ్లాగులో అయినా అప్పుతచ్చులు కనిపించినా వ్యాఖ్య రాసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నా. చిన్ని గారు తన విజయగాధని మరికొంచం వివరంగా రాస్తే చదవాలని ఉంది. కబుర్లు, కవితలతో మరికొంచం తరచుగా టపాలు రాస్తే బాగుంటుంది.
బ్లాగ్మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు.
బావుంది.
రిప్లయితొలగించండిఔను ఈనాడు లో నెమలికన్ను ఈ పేపర్ లింక్ ఏదన్న ఉందా. ఎక్కడ వెతికినా దొరకలేదు. ఉంటె ఇవ్వగలరు
చక్కని పరిచయం!! చిన్ని గారి 'నా స్నేహితులు ' టపాలు చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి.. అభినందనలు చిన్ని గారు..
రిప్లయితొలగించండిమురళి గారు, ఈ టపాతో మళ్ళీ కాసేపు హిమబిందువుల్ని స్పృశించి, ఇంతకుముందు చదవని 'వకుళపూలు ' టపా చదివాను.. అవేంటో కనుక్కునేవరకూ ఇప్పుడు మనసు ఊరుకోదు :-)
హిమబిమ్డువులు చిన్ని గారికి జన్మదిన శుభాకాంక్షలు..
రిప్లయితొలగించండిఎప్పటిలాగే మీ పరిచయం అద్భుతం.
మురళీగారు ...అసలు ఊహించని కథ ఇది .నా పిల్ల రాతలు (వయసు కాదు :)) మీ చేతిలో" అక్షర శిల్పం".ధన్యవాదాలు మిత్రమా .
రిప్లయితొలగించండితప్పక మరికొంత వివరంగా నా ప్రస్థానం పంచుకుంటాను .మరొక్కసారి ధన్యవాదాలు
చిన్నిగారికి పుట్టినరోజు కానుకా ఇది మురళీగారు:)
రిప్లయితొలగించండినేను వీలు చిక్కినప్పుడల్లా చూసి, స్పందన తెలిపే బ్లాగుల్లో చిన్నిగారిది ఒకటి...ఇప్పుడే వారి స్నేహితుల ఏడు సిరీస్ ల టపాలన్నీ చదివేసి వచ్చాను...వారు రాసిన టపాల్లో వాళ్ళ పాప ఇంటికి సెలవులకి వచ్చి మళ్ళీ దూరం అయినపుడు ఆవిడ రాసే టపాలు చాలా ఆర్ధ్రంగా ఉంటాయి...అప్పడు ఆమె మనస్థితిని కళ్ళకు కట్టినట్టు రాస్తారు...తర్వాత అప్పుడెప్పుడో వాళ్ళ ఇంట్లో మంచం కి వాడిన కలప గురించి ఓ టపా రాసారు...ఆ బ్లాగులో ఉన్న మంచి టపాల్లో అది ఒకటి...ఒకసారి నేను ఆవిడ బ్లాగులో అల్లరి కూడా చేసాను(ఆవిడ ముద్దు పేరు కనుక్కోవటంలో)..:)..
రిప్లయితొలగించండిమంచి పరిచయం మురళి గారు...
మంచి పరిచయం మురళి గారు. ఎందుకో నేను ఈ బ్లాగ్ ఎక్కువగా చూడలేదు. అర్జంట్ గా వీలు చూసుకుని టపాలన్ని తిరగేయాలి.
రిప్లయితొలగించండిమంచి పరిచయం మురళి గారు. చిన్ని అభినందనలు.. మురళి గారి పరిచయం తో నేను మొదట్లో చదవక మిస్ ఐన పోస్ట్ లు కూడా చదవగలిగేను. ధన్యవాదాలు మురళి గారు.
రిప్లయితొలగించండిచిన్ని గారి మంచి మంచి టపాలను ఎంచి మరీ పరిచయం చేసారు మురళి గారు. ఎంతో బాగుంది. చిన్ని గారికి నేను కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు అందజేస్తున్నాను.
రిప్లయితొలగించండిఈ చిన్ని బ్లాగులో ఇన్ని విశేషాలున్నాయా ! అక్కడక్కడా వీరి సరదా వ్యాఖ్యలు చూసి చిన్ని అంటే చిన్న పిల్లేమో అనుకున్నాను . నేను ఈ బ్లాగుకేసి వెళ్ళింది తక్కువే . ఇప్పుడు మీ పరిచయం చదివాకా వెంటనే హిమబిందువులన్నీ దోసిలికెత్తుకోవాలనిపిస్తుంది.
రిప్లయితొలగించండిచిన్ని గారూ అభినందనలు
మురళీ గారు ఉగాది శుభాకాంక్షలు
వికృతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
రిప్లయితొలగించండిహిమబిందువులు బ్లాగ్ పరిచయం చాలా బాగుంది మురళీ గారూ..!
రిప్లయితొలగించండినేనూ ఈ బ్లాగు తరచూ చూస్తూనే ఉంటాను. ఆమ్లెట్ కథ, వజ్రాల వేట, కారు డ్రైవర్ కథ.. ఇంకా మరెన్నో టపాలు ఎప్పటికీ గుర్తుండేవే!
చిన్ని గారూ, మీకు మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలు :-)
హిమబిందువుల పరిచయం బాగుందండి . చిన్నిగారు మీకు జన్మదిన శుభాకాంక్షలండి ,
రిప్లయితొలగించండిమురళిగారు ,
మీకు ఉగాది శుభాకాంక్షలండి .
మీకు వికృతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు...
రిప్లయితొలగించండిమురళీ, మీ బ్లాగు పరిచయాలు చాలా సమగ్రంగా,చక్కగా ఉంటాయి.నేను రెగ్యులర్ గా చదివే మరొక బ్లాగుని పరిచయం చేసారు.బావుంది.తన బ్లాగులో నాకు ఇప్పటివరకూ బాగా నచ్చిన పోస్టు 'ఏం రాయమంటావే చిన్నారి'.
రిప్లయితొలగించండిచిన్ని గారూ, అభినందనలు..
చిన్నిగారికి పుట్టినరోజు కానుక ! బావుందండీ ...మంచి పరిచయం !తెలిసిన బ్లాగ్ ఐనా మీ పరిచయం చదవటం మాకందరికీ అదో ఆనందం !
రిప్లయితొలగించండి@వాసు: ఈనాడు లంకె పని చేయడం లేదండీ.. క్లిప్పింగ్ ని స్కాన్ చేసి పెట్టాలి.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@నిషిగంధ: ఇంతకీ కనుక్కున్నారా 'వకుళ పూల'ని? :-) ..ధన్యవాదాలు.
@కేక్యూబ్ వర్మ: ధన్యవాదాలండీ..
@చిన్ని: మీరు రాయబోయే టపాల కోసం ఎదురు చూస్తూ ఉంటామండి.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@సృజన: :-) :-) అలా జరిగిందండీ.. ధన్యవాదాలు.
@శేఖర్ పెద్దగోపు: మీ అల్లరికి మేమందరమూ సాక్షులమే లెండి :-) ఇంతకీ బహుమతి అందుకునారా? :-) :-) ..ధన్యవాదాలు.
@వేణూ శ్రీకాంత్: చదవండి వేణు గారూ.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@భావన: ధన్యవాదాలండీ..
@జయ: ధన్యవాదాలండీ..
@లలిత: ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి@స్రవంతి; ధన్యవాదాలండీ..
@మధురవాణి: ధన్యవాదాలండీ..
@మాలా కుమార్: ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి@విష్వక్సేనుడు: ధన్యవాదాలండీ..
@ఉమాశంకర్: నాక్కూడా బాగా నచ్చిన టపాల్లో అదొకటండీ.. ధన్యవాదాలు.
@పరిమళం: ధన్యవాదాలండీ..