సోమవారం, మార్చి 30, 2009

సిరిబొమ్మ

ఉగాది రోజు ఉదయాన్నే అమ్మవారి గుడి దగ్గర హడావిడి మొదలైంది. లౌడ్ స్పీకర్లతో మైక్ పెట్టేశారు. ఆరోజు అమ్మవారి తీర్ధం. తీర్ధం రోజు ఉదయమే ఇంటింటికి అమ్మవారి 'చల్ల ఘటం' వస్తుంది. గుడి పూజారి ఓ పెద్ద ఇత్తడి గిన్నె కి చుట్టూ వేపాకులు కట్టి ఓ పెద్ద పసుపు ముద్ద పెట్టి భజంత్రీలతో ఇల్లిల్లూ తిరుగుతాడు. ఇంటి ముందుకు చల్ల ఘటం వచ్చినప్పుడు ఓ బిందెడు నీళ్ళలో మజ్జిగ కలిపి ఉంచి, గుమ్మంలో ఎత్తు పీట వేసి ఉంచాలి.

పూజారి ఆ పీట మీద కూర్చుని గిన్నెని నెత్తిమీద పెట్టుకుంటాడు. బిందెడు నీళ్ళనూ గిన్నెలో పోయాలి. అప్పుడు అతను గిన్నెలో నీళ్ళు కొన్ని ఖాళీ బిందెలో పోసి, మరి కొన్ని ఇంట్లోకి గుమ్మంలో నుంచే చల్లుతాడు. చల్ల ఘటం ఊరేగింపు మద్యాహ్నం వరకు జరుగుతుంది. ప్రతి ఇంటి ముందు పూజారి తడిసి ముద్ద కావాల్సిందే. మా గుడి పూజారి ఈ సంవత్సరం చల్ల ఘటాన్ని లెక్చరర్ గా పని చేస్తున్న వాళ్ళ అబ్బాయికి అప్పగించాడు.

చల్ల ఘటం వచ్చి వెళ్లాకే ఇళ్ళలో భోజనాలు. భోజనం కాగానే తీర్దానికి ప్రయాణం. చిన్నప్పుడైతే ఉదయం నుంచి ప్రతి గంటకీ ఓ సారి తీర్ధం వెళ్లి వచ్చేవాళ్ళం. ఇప్పుడు అంత ఆసక్తి లేకపోయింది. అమ్మవారి గుళ్ళో దర్శనం చేసుకున్నాక, తీర్ధం లో షాపింగ్. నేను మరీ 'కొత్త బిచ్చగాడి' తరహాలో హడావిడి చేస్తుంటే మా ఇంట్లో వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇతకీ తీర్ధం లో కొనడానికి ఏమీ కనిపించ లేదు. చుట్టూ పక్కల ఉండే పిల్లలకి ప్రెజెంట్ చేయడం కోసం కొన్ని బొమ్మలు మాత్రం కొన్నాను.

తీర్ధం లో స్నేహితులతో బాతాఖానీ వేస్తుండగానే సిరిబొమ్మ ఊరేగింపుకి బయలుదేరింది. అమ్మవారి కావలిదారుని సిరిబొమ్మ అంటారు. చేతిలో కత్తితో చిన్న పిల్లలు జడుసుకునేలా ఉంటుంది ఆ బొమ్మ. పండుగ రోజు మాత్రం అందరికీ వినోదించే సాధనం. సిరిబొమ్మ అలా బయలుదేరగానే అందరు అరటిపళ్ళ కొట్ల మీద పడ్డారు. గుడి ఎదురుగా నా ఫ్రెండ్ ఒకడు షాప్ పెట్టాడు.

ఓ గంటలో ఊరేగింపు పూర్తి చేసి సిరిబొమ్మ ని తీసుకొచ్చారు. గుడి ఆవరణలో ఓ చెక్క స్థంభాన్ని పాతి దాని చివర్న మరో కర్రని అడ్డంగా కట్టారు, ఏడు అంకెలా. ఈ రెండో కర్ర చివర సిరిబొమ్మని కట్టి తాడు సాయంతో గుండ్రంగా తిప్పడం మొదలు పెట్టారు. జనం అంతా గాలిలో తిరుగుతున్న సిరిబొమ్మని అరటి పళ్ళతో కొడుతున్నారు. కొన్ని పళ్ళు సిరిబొమ్మకి, మరి కొన్ని చూస్తున్న వాళ్లకి తగులుతున్నాయి. నా ఫోన్ లో ఉన్న కెమేరాతో ఫోటోలు తీసే ప్రయత్నం చేశాను. పరాకుగా ఉన్నానేమో ఓ అరటి పండు ఎక్కడినుంచో వచ్చి నా చాతి మీద తగిలింది.

కాసేపు సిరిబొమ్మని గాలిలో తిప్పి కిందకి దించేశారు. గాలిలో ఉండగా అరటి పళ్ళతో కొట్టలేక పోయిన చిన్న పిల్లలు కిందకి దించిన బొమ్మ మీద పళ్ళు విసరడం మొదలు పెట్టారు. సిరిబొమ్మని శుభ్రంగా తుడిచి గుడిలో పెట్టేశారు. గుడి ఆవరణ అంతా అరటి పళ్ళతో నిండి పోయింది. సిరిబొమ్మ ని కొట్టడం పూర్తైతే తీర్ధం కూడా ముగిసినట్టే. షాపుల వాళ్ళు మాత్రం చీకటి పడే వరకు ఎదురు చూస్తారు, ఎవరైనా రాకపోతారా కొనడానికి అని.

6 కామెంట్‌లు:

  1. బావున్నాయి మీ ఉగాది విశేషాలు.

    చాలా రోజుల్నుంచి కలవాలి అనుకుంటున్నవారిని గానీ, లేదా ఇక కలుస్తానో లేదో అని అనుకున్నవారు అకస్మాత్తుగా ఎదురుపడడం గానీ జరిగిందా?

    రిప్లయితొలగించండి
  2. ఊర్నుంచి బోలెడు కబుర్లు తెస్తారనుకుంటే జాతర గురించి సింపుల్ గా చెప్పి ముగించేశారేమిటా అనుకున్నా సిరిబొమ్మ చదివాక తెలిసింది మరిన్ని కబుర్లు మాముందుకు రాబోతున్నాయని .... :)

    రిప్లయితొలగించండి
  3. ఎన్నెన్నో కొత్త విషయాలు తెలుస్తున్నాయి.
    అమ్మో ఎన్ని విషయాలు తెలుసండి మీకు!!!

    రిప్లయితొలగించండి
  4. మురళి బాగున్నాయండి మీ అందమయిన కోనసీమ పండుగ ముచ్చట్లు . మీరు "పెద్ద మనిషి "అంటున్నారు నాలాగా అరవయ్యి ఏళ్ళ పైన వుంటాయా :-(

    రిప్లయితొలగించండి
  5. @ఉమాశంకర్: అలాంటి సర్ప్రైజ్ లు ఏవీ లేవండి. ధన్యవాదాలు.
    @పరిమళం: మీ ఊహ నిజమే.. ఇంకా ఉన్నాయండి విశేషాలు.. ధన్యవాదాలు.
    @పద్మార్పిత: అయ్యో.. అదంతా నా నాలెడ్జి కాదండి.. మా ఊళ్ళో జరిగినవి రాశాను అంతే.. ధన్యవాదాలు.
    @చిన్ని: బ్లాగు లోకంలో మొన్ననే రెండు నెలలు పూర్తి చేసుకుని మూడో నెలలో అడుగు పెట్టానండి. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  6. మురళి మీరు చాల గడుసువాళ్ళు అయితే మీకంటే నేను చాల చిన్నదాన్ని ఇంకా రెండు నిండలేదు నాకు

    రిప్లయితొలగించండి