"ఆడపిల్లగా పుట్టినా బాగుండును.. ఛీ..వెధవ బ్రతుకు.. అస్సలు జుట్టు పెరక్కుండా ఎవరైనా మందు కనిపెడితే ఎంత బాగుంటుంది? నా జుట్టు మొత్తం ఊడిపోతే ఇంకా బాగుంటుంది కదా.. ఈ బాధలేవీ లేకుండా..." ఊహ తెలిసినప్పటినుంచీ ప్రతినెలా నా అంతర్మధనం ఇది. ఇందుకు కారకుడు సత్యం.. మా ఊరికి ఏకైక క్షురకుడు. కుల వృత్తి నే ఇంటిపేరుగా చేసి పిలిచే మా పల్లెటూళ్ళో అతన్ని 'మంగలి సత్యం' అని పిలేచేవాళ్ళు. సత్యం గురించి మా ఊళ్ళో పెద్దవాళ్ళు కూడా అనుకునే మాట ఒకటి.. 'వీడు దూర్వాసుడికి తమ్ముడు' అని. అసలు ఇతని కోపం భరించలేకే సత్యం భార్య తన పిల్లలని తీసుకుని వేరే వెళ్ళిపోయిందని మా ఊళ్ళో రూమరు. అలాంటి సత్యానికి నెలకోసారి తల అప్పగించడం అంటే మాటలా..?
మా బళ్ళో మాష్టారు మమ్మల్ని బుద్ధిగా ఉండమని చెప్పి బయటకి వెళ్ళినప్పుడు మేమందరం చేసే పని ఒకటి ఉండేది. ఆయన టేబిల్ మీద ఉన్న గ్లోబు ని గుండ్రంగా తిప్పుతూ ఆడుకోవడం.. సరిగ్గా సత్యం కూడా నా తలని ఇలాగే తిప్పేవాడు, తలపని చేసేటప్పుడు. అతనికి మెడ ఎత్తినా, దించినా కోపమే. 'కుదురుగా కూర్చోలేరా?' అని కసురుకునే వాడు. అసలు సత్యాన్ని చూడడం తోనే భయం లాంటిది మొదలయ్యేది. మనల్ని ఎదురుగా కూర్చోపెట్టుకుని తన సంచీలోనుంచి సరంజామా అంతా తీసేవాడు.. అంటే రెండు కత్తెర్లు, రెండు కత్తులు, ఓ ఆకురాయి. ఆకుపచ్చని ఆ రాయిమీద కత్తులు నూరుతున్నంతసేపూ కూడా మెడ కదపకుండా కూర్చోవాలి.
సత్యం ప్రత్యేకత ఏమిటంటే నాకు అతను తలపని చేసిన పుష్కర కాలం పాటూ అవే కత్తులు, కత్తెర్లూ వాడాడు, కొత్తవి కొనకుండా.. అంటే నా ఒక్కడికే కాదు, ఊరి మొత్తానికి. ఎవరైనా ధైర్యం చేసి 'ఇవి పదును పోయాయి, కొత్తవి కొనచ్చు కదా' అన్నారో.. వాళ్ళ పని ఐపోయిందే.. మొత్తం పని పూర్తయ్యేసరికి ఓ గంటకు పైగా పట్టేది. ఈలోగానే అతన్ని వెతుక్కుంటూ చాలామంది వచ్చేవాళ్ళు. పని ఆపి వాళ్లకి సమాధానం చెప్పి పంపేవాడు. ఊరికంతటికీ ఒక్కడే కదా.. బోల్డంత డిమాండ్. తనకి ఏ వాయిద్యం వాయించడం రాదు కానీ, పెళ్ళిళ్ళకి డోలు, సన్నాయి ఏర్పాటు చేసేవాడు. ఆ నిమిత్తం కూడా చాలా మంది అతన్ని వెతుక్కుంటూ వచ్చేవాళ్ళు. అతను ఎప్పుడు మాట్లాడతాడో, లేక మాట్లాడుతూనే మెడ మీద కత్తి పెడతాడో తెలీదు. చచ్చినట్టు కిక్కురుమనకుండా కదలకుండా కూర్చోవాల్సిందే.
'పిల్లాడి తల మాసిపోయినది.. సత్యానికి కబురు పెట్టండీ..' అని అమ్మ నాన్నని అడగడం చెవిన పడగానే గుండెల్లో రాయి పడేది. ఓ నాలుగైదు రోజుల్లో సత్యం వచ్చేస్తాడు అని తెలుసు. తనకి వీలు కాకపొతే ఆ విషయం సూటిగా చెప్పకుండా 'ఏకాదశి రోజు ఎలా చెయ్య మంటారు?' అనో 'అమావాస్య ముందు చెయ్యను' అనో చెప్పేవాడు. తన పొది లో ఓ పంచాంగం కూడా ఉండేది. కూలీలకి వాళ్ళ ఇళ్ళలో జరిగే చిన్న చిన్న శుభ కార్యాలకి సత్యమే ముహూర్తం పెట్టేవాడు. అతను వేరే పని ఉండి అలా చెబుతున్నాడని తెలిసినా ఎవరూ ఏమీ అనలేక పోయేవాళ్ళు, అతని నోటికి దడిసి. ఒక్క మా ఇంటికే నెలకి రెండు సార్లు వచ్చే వాడు. తండ్రీ, కొడుకు ఒకే రోజు తలపని చేయించుకో కూడదని సెంటిమెంటు. తాతయ్య ఊళ్ళో ఉంటె మాత్రం, నాకూ, తాతయ్యకీ ఒకే రోజు కానిచ్చేవాడు సత్యం. అమ్మ మాత్రం సత్యం రాగానే అతనికోసం టీ పట్టుకొచ్చేసేది.. నేను బలిపశువులా తల వంచుకు కూర్చున్నా సరే. 'పనయ్యాక టీ ఇవ్వొచ్చు కదా..' అని అమ్మతో చాలాసార్లు పోట్లాడాను. 'అయ్యాక సత్యం ఉంటాడా.. ఎవరో వచ్చి తీసుకెళ్ళి పోతారు' అనేది సింపుల్ గా.
నా ఆరో ఏటో, ఏడో ఏటో జరిగిన ఈ సంఘటన మాత్రం నేనే కాదు, మా బంధువర్గం లో ఎవరూ మర్చిపోరు. ఆ రోజు నేను చాలా తిక్కగా ఉన్నాను.. సత్యం చాలా బలవంతంగా తలపని చేసేశాడు. నేను వద్దని ఏడుస్తూనే ఉన్నాను. నాన్న ఇంట్లో లేరు. అమ్మ నన్ను ఊరుకోపెట్టే ప్రయత్నాలు చేస్తుంటే 'ఏమిటమ్మా బతిమాలతారు' అని సత్యం అనేసరికి నా కోపం తార స్థాయికి చేరింది. ఏం చేయాలో అర్ధం కాలా. పని పూర్తి చేసిన సత్యం కత్తిరించిన జుట్టు కుంకుడు చెట్టుకింద పారేయడానికి వెళ్ళాడు. నేను పరిగెత్తుకుంటూ వెళ్లి సత్యానికి అడ్డం పడి 'ఆ జుట్టు మళ్ళీ నా తలమీద అతికించమని' పేచీ మొదలుపెట్టాను. అతన్ని కదలనివ్వలేదు. దాదాపు అరగంట సేపు హై డ్రామా నడించింది. అమ్మకీ, సత్యానికీ ఏం చేయాలో అర్ధం కావడంలేదు. వాళ్ళిద్దర్నీ రక్షిస్తూ నాన్న వచ్చారు. ముందు మాటలతో చెప్పి చూశారు.. నేను ఊరుకోలేదు.. నిద్రగన్నేరు కొమ్మ విరిచి అది నా వీపు మీద విరిగేలా కొడుతుండే మా వీధి వీధంతా సినిమా షూటింగ్ లా చూసింది.
నేనొక్కడినేనా? మా ఊళ్ళో మగ పిల్లలంతా సత్యం బాధితులే.. పెద్దాళ్ళు కూడా బాధితులే కాని, పైకి చెప్పుకునే వాళ్ళు కాదు. ఓ రోజు స్కూల్లో మాస్టారు బయటికి వెళ్తూ నన్ను క్లాసు చూడమన్నారు. అంటే నేను లీడర్ని. లీడర్ అంటే మాస్టారి తర్వాత మాస్టారంత వాడు కదా.. పుస్తకం తీసి ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాను. సత్యమా, అసత్యమా అని ప్రశ్నలు. 'భూమి సూర్యుని చుట్టూ తిరుగును.. సత్యమా, అసత్యమా?' అడిగాను. 'మంగలి సత్యం' అన్నాడు మా గణేష్ టక్కున. క్లాసంతా గొల్లుమంది. లీడర్ నవ్వకూడదు కదా, కర్రతో టేబిల్ మీద గట్టిగా కొట్టా.. మా ఊరి బళ్ళో చదివినంత కాలం పర్వాలేదు కానీ, పక్కూరి బడిలో చేరినప్పుడు కష్టాలు మొదలయ్యాయి. సత్యం చేసిన హెయిర్ స్టైల్ చూసి మిగిలిన పిల్లలు తెగ నవ్వేవారు.
వయసు అయిపోవడంతో సత్యానికి ఆరోగ్యం పాడైపోవడం మొదలు పెట్టింది. చిన్న చిన్న ఉద్యోగాల్లో కుదురుకున్న కొడుకులు వచ్చి అతన్ని తమతో తీసుకెళ్ళిపోయారు. తను తిరగ గలిగినన్నాళ్ళూ సత్యం మరో క్షురకుడిని మా ఊళ్ళో అడుగు పెట్టనివ్వలేదు. అతను బయట తిరగడం మానుకోగానే సత్యం స్థానం లో మా ఊరికి పక్కూరి చిన్న సత్యం వచ్చేవాడు. ఊరి మీద ప్రేమతో సత్యం అప్పుడప్పుడు ఓపిక చేసుకుని వచ్చేవాడు. ఒకసారి నేను ఊరికి వెళ్ళినప్పుడు మా ఇంటికి వచ్చాడు సత్యం. 'మిమ్మల్ని చూద్దారని వచ్చేను అబ్బాయిగారూ..' అన్నప్పుడు మాత్రం తల వంచుకుని అతని ముందు కూర్చుని కత్తిరింపు వెయ్యమని అడగాలని అనిపించింది.
ఇప్పుడు నేను రెగ్యులర్ గా వెళ్ళే సెలూన్ లో బార్బర్ కి సెన్సాఫ్ హ్యుమర్ ఎక్కువ. మొన్నో రోజు హెయిర్ కట్ చేస్తూ 'ఇలా ఐతే కొన్నాళ్ళకి మీకు మా దగ్గరికి వచ్చే పని ఉండదు సార్. జుట్టు బాగా ఊడిపోతోంది..' అన్నప్పుడు నాకు మా సత్యం మరోసారి గుర్తొచ్చాడు.
ha.ha...ha...ha....aakatai murali kalla lo kanabadtunnadu .naakaite mimmalni urgentga choodalanpistondi. juttu athikinchala?ha..ha.
రిప్లయితొలగించండి'ఆ జుట్టు మళ్ళీ నా తలమీద అతికించమని' పేచీ మొదలుపెట్టాను. "
రిప్లయితొలగించండిహహ్హ్హహహహహ.....మీరు దేవాంతకులండీ బాబూ..... కత్తిరించినంతసేపు ఉండి, కత్తిరించేసాక అతికించమంటారా!!!!!
:)
రిప్లయితొలగించండిభలే. మా ఆంధ్రా సెలూన్ అప్పారావుని గుర్తు చేశారు.
రిప్లయితొలగించండిచిన్నప్పటి సంగతులు గుర్తు చేసారు.. సెలూన్ కెళ్ళొచ్చాక ఒక మూడు రోజులవరకూ స్నానం చేసేటప్పుడు , వేణ్ణీళ్ళు పడగానే, మెడ వెనకాల ఒకటే మంట .. మా అస్థాన క్షురకునికి మా నాన్న బాగా తెలుసు. ఆయన ఒకప్పుడు మా పొలం లో పనిచేసాడన్నమాట.. అందువల్ల మిగతా అందరికీ అరగంటలో క్రాపు చేస్తే, నాకు స్పెషల్ ట్రీట్మెంట్.. గంట సేపు సుతారంగా చేసెవాడు...తల అలా ఇలా పెట్టి మెడ నొప్పి పుట్టేది.. అయిపోయింది అనేంతలో ఇంకో కత్తెర తీసేవాడు.. ఇంకో పావుగంట.. ఆ తరువాత అయిపోయిందిలే అనుకొనే సరికి మళ్ళా ఎక్కడొ ఒక వెంట్రుక ఆయన్ని వెక్కిరిస్తూ కనపడుతుందేమో.. మళ్ళా ఇంకో కత్తెర.. ఇంకో పావుగంట..
రిప్లయితొలగించండిహి..హి..హీ...
రిప్లయితొలగించండి:))
మా ఊళ్ళో కూడా మీ సత్యం లాంటి వాడే ఉండేవాడు. వాడు మా నాన్న చెప్పే సూచనలన్నీ శ్రద్దగా విని, నా బుర్ర వాడి చేతిలో పెట్టేసరికి మాత్రం డిప్ప కటింగ్ చేసేవాడు. అంటే ఎలాంటిదంటే 'అహనా పెళ్ళంట' సిన్మా లో బ్రహ్మానందం కటింగ్ ఉంటుంది చూసారూ..సేం టు సేం అదే. ఇక చూస్కోండి...స్కూల్లో ప్రతి వెదవ నా డిప్ప మీద కొట్టేవాడు.
క్షవర పురాణంలో ఇది నాలుగో అధ్యాయం. మిగతా మూడూ ఇక్కడున్నాయి:
రిప్లయితొలగించండినా క్షుర ఖర్మ, తోటరాముడి క్షుర 'ఖర్మ' మరియు ఊకదంపుడు ఆదివారం అగచాట్లు.
ఇంకోటెవరన్నా రాసేస్తే అన్నీ కలిపేసి ఎంచక్కా పంచతంత్రం లెవెల్లో అచ్చేయించి బైండు చేసమ్మెయ్యొచ్చు :-)
బావుందండీ ! మీ సత్యం కధ (?). ఇది నాకూ అనుభవమే ....అపార్ధం చేసుకోకండి ....అమ్మవాళ్ళ ఊరికి సెలవుల కెళ్ళిన ప్రతిసారీ మా సుపుత్రునితో ఇదే తంటా .చివర మాత్రం మనసు కదిలించారు మన ఊరితో , అక్కడి వాళ్ళతో అనుబంధాలు అంతగా పెనవేసుకు పోతాయిమరి .ఎంతగా అంటే టపాగా మాతో పంచుకోనేంత !
రిప్లయితొలగించండి@చిన్ని, పిచ్చోడు, సిరిసిరిమువ్వ, కొత్తపాళీ: ధన్యవాదాలు
రిప్లయితొలగించండి@ఉమాశంకర్: స్నానం ఒక్కటీ ఓ టపా అవుతుందండి.. రాస్తాను, ఎప్పుడైనా. ధన్యవాదాలు.
@శేఖర్ పెద్దగోపు: హై స్కూల్లో మా పరిస్థితి కూడా ఇంచుమించు అదేనండి .. ధన్యవాదాలు.
@అబ్రకదబ్ర: చాలా బాగున్నాయండి టపాలు. నా లాంటి బాధితులు ఇంకా చాలా మంది ఉన్నారని అర్ధమైంది. చాలా ధన్యవాదాలు. మీరు చెప్పిన ప్రాజెక్ట్ కి మన ఉమాశంకర్ గారు, శేఖర్ పెద్దగోపు గారు తలో చెయ్యి వేస్తారేమో చూద్దాం.. వారి అనుభవాలూ బాగున్నాయి కదా..
@పరిమళం: సత్యం కథ కాదండి, ప్రతి అక్షరమూ నిజమే..నా స్వానుభవమే.. ధన్యవాదాలు.
"'మిమ్మల్ని చూద్దారని వచ్చేను అబ్బాయిగారూ..' అన్నప్పుడు మాత్రం తల వంచుకుని అతని ముందు కూర్చుని కత్తిరింపు వెయ్యమని అడగాలని అనిపించింది."
రిప్లయితొలగించండిఇక్కడికివచ్చే సరికి మాత్రం కళ్ళు చెమర్చాయి. కాసేపు ఏవేవో జ్ఞాపకల్లో తడిసివచ్చాను. అంతవరకు, "అబ్బా నేనూ మగాడినయ్యుంటే, నాన్న గారిలానో, లేదా ఇంట్లోని మిగతా మగవారిలానో అలా ఆరుబయట లేత ఎండలో చక్కగా శేషయ్యతోనో, గంగయ్యతోనో ఒళ్ళు పట్టించుకుని, తలంటుపోయించుకునేదాన్ని" అనుకున్న రోజులు గుర్తుకొచ్చాయి. నాన్నగారి ఉద్యోగరీత్యా మేము పల్లెటూర్లు వెళ్ళటం తక్కువేనయినా వెళ్ళేవి పండుగా రోజులు కనుకా, వూరికి పెద్ద కుటుంబం కనుకా, మాఇంట్లో "చంటి" సినిమాలో మాదిరిగా ఆ సీన్ బాగానే రీపీట్ అయ్యేది.
ఇక ఇప్పుడు అన్నీ అందరికీ అందుబాటులో వున్నాయి ఏ బేధంలేకుండా. మీరు చివరిలో వ్రాసినట్లుగా వెల. విలువ ని బట్టి ఆయా సేవలు కొనుక్కోవటమే కాని తాలింపులో కర్వేపాకు తగ్గినట్లు ఎదో వెలితి, కొరత.
హ హ చాలా బాగారాసారు :)
రిప్లయితొలగించండిమాకూ ఆస్థాన విద్వాంసుడొకడుండేవాడు మంగలి వీరన్న అని.వాడు నా తల వాడి రెండు కాళ్ళ మధ్యనా ఇరికించి డిప్ప కటింగ్ కొట్టేవాడూ ఎదురుగా మా పెద్దాయనా ఇంక మాట్లాడ్డనికేముంది మౌనరాగాలే అన్నీ అరగుండు బ్రహ్మం గాడిలాగ,మీరు చెప్పినట్టే ఎప్పుడు ఊరెళ్ళినా బస్సు దిగగానే వాడి కొట్టే ఎదురుగా అందువల్ల వాడే మొదటి పలకరింపు అబ్బాయిగారూ బాగున్నారా,నాన్నగారూ అమ్మగారూ ఆళ్ళూ బాగున్నారాండి ఆయ్ అంటూ,ఇప్పుడు అతని కొడుకు కూడా అదే పలకరింపు...
రిప్లయితొలగించండి@ఉష: ఆ వెలితినీ, కొరతనీ నేను కూడా ఫీల్ అవుతున్నానండి.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@నేస్తం: ధన్యవాదాలు
@శ్రీనివాస్ పప్పు: వీలు చూసుకుని ఒక టపా రాసెయ్యండి.. అబ్రకదబ్ర గారు పంచతంత్రం వేద్దాం అంటున్నారు. ధన్యవాదాలు
అబ్రకదబ్ర, మురళి,
రిప్లయితొలగించండిపప్పు గారు కూడా తన క్షుర కర్మ విన్యాసాలు రాసేస్తే, మీ పంచ తంత్రానికి మొదటి కాపీ ఆర్డరు ఇదిగో నా దగ్గరనుంచే!
మీ పుస్తకానికి ముందు మాట వంగూరి చిట్టెన్ రాజు గారి చేత(ఆయనకు తల ఏకంగా చైనీసు చిన్నదాని చేతిలో పెట్టేసిన అనుభవం కూడా ఉంది) రాయిస్తే బాగుంటుంది. చూ:అమెరికామెడీ కథలు.
@సుజాత: ధన్యవాదాలు. శ్రీనివాస్ గారు త్వరపడాలి.. :)
రిప్లయితొలగించండిఐదవది?
రిప్లయితొలగించండిhttp://ongoluseenu.blogspot.com/2009/03/blog-post_14.html
మాల్గుడి కథలులో ఇలాంటి ఎపిసోడ్ ఒకటి ఉంది. నేను మంగలి మస్తాన్ కి బాధితుడిని. కాకపోతే మా నాన్న 7తరగతి నుంచి వేరే సలూన్కి వెళ్లేందుకు వీసా ఇచ్చాడు.
రిప్లయితొలగించండి@Subrahmanya Chaithanya Mamidipudi: ఆ రకంగా అదృష్టవంతులే మీరు! ...ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిGood one! Thoroughly enjoyed this. I was sent to your blog by my friend Nasy - who read my recent blog which had a similar theme. Here's the link to that one:
రిప్లయితొలగించండిhttp://recoveringnostalgic.wordpress.com/2014/09/20/hairy-situations/
ypunati: “Can you see if you can glue that back there to cover up the bald spot?” ..this is the ultimate one!! thanks for visiting my blog and a big thanks to your friend for recommending this one :))
రిప్లయితొలగించండి