నాకు ఐదో ఏడు రాగానే తన వళ్ళో కూర్చోబెట్టుకుని అక్షరాభ్యాసం చేయించారు తాతయ్య. మా బంధువులందరినీ పిలిచారు. బడిలో మాస్టర్లు, పిల్లలు మా ఇంటికి వచ్చారు. పిల్లలందరికీ చాక్లెట్ల తో పాటు పెన్నులు, పుస్తకాలు పంచారు. నా చేత 'ఓం నమః శివాయః' దిద్దించారు తాతయ్య. "నేనే అక్షరాలూ, అంకెలు నేర్పించి అప్పుడు బడికి పంపుతాను" అని చెప్పారు మాస్టర్లతో. వాళ్ళు సరే అన్నారు. తాతయ్య మాటకీ ఎవరూ ఎదురు చెప్పేవారు కాదు.. ఇంట్లోనే కాదు, ఊళ్ళో కూడా. మాస్టర్లకి ఆవేళ మా ఇంట్లోనే భోజనం. నాకు సంబంధించి, పుట్టిన రోజు కాకుండా జరిగిన మొదటి పండుగ అది.
"మూడు నెలల్లో రాయడం, చదవడం నేర్చుకుంటే నిన్ను హైదరాబాద్ తీసుకెళ్ళి అన్నీ చూపిస్తా.." అన్నారు తాతయ్య నాతో. హైదరాబాద్ లో మా అత్తయ్య వాళ్ళు, ఇంకా చాలా మంది బంధువులు ఉన్నారు. తాతయ్య తరచూ వెళ్లి వస్తూ ఉండేవాళ్ళు. హైదరాబాద్ వెళ్ళాలన్న కుతూహలం కన్నా, "మూడు నెలల్లో నువ్వు నేర్చుకోగలవా?" అన్న తాతయ్య చాలెంజ్ నన్ను ఉత్సాహ పరిచింది. ప్రతిరోజూ తాతయ్య పలక మీద అక్షరాలు రాసివ్వడం, నేను దిద్ది, చూడకుండా రాసి చూపించడం.. సరిగ్గా మూడు నెలలు గడిచేసరికి తాతయ్యకి చిన్న బాలశిక్ష చదివి వినిపించాను. తాతయ్య కూడా తన మాట నిలబెట్టుకున్నారు.. రెండువారాల పాటు హైదరాబాద్ అంతా తిప్పి. అమ్మనీ, నాన్ననీ విడిచిపెట్టి అన్నిరోజులు ఉండడం అదే మొదటిసారి.
తాతయ్య కి తొలి మగ సంతానం నాన్న.. ఆయన ఫస్ట్ బార్న్ ని నేను. మనవలు, మనవరాళ్ళందరిలో నేనంటే ప్రత్యేకమైన అభిమానం తాతయ్యకి. ఆయన దానినెప్పుడూ దాచుకోలేదు. నా నోటివెంట ఏమైనా వస్తే అది జరిగి తీరాలి. నేను అడిగింది ఏమైనా సరే ఇంటికి రావాల్సిందే. ఐతే ఈ వైభవం ఎన్నాళ్ళో సాగలేదు. తాతయ్యకి హార్ట్ ఎటాక్ వచ్చింది. వైద్యం కోసం తరచూ హైదరాబాద్ వెళ్లి, అక్కడే ఎక్కువ కాలం ఉంటూ ఉండేవాళ్ళు. మేమిద్దరం ఉత్తరాలు రాసుకునే వాళ్ళం. నా పేరున ఉన్న ఉత్తరం పోస్ట్ మాన్ బడికి తీసుకు వచ్చి ఇస్తే పిల్లలతో పాటు, మాస్టర్లూ ఆశ్చర్యపోయేవారు. పోస్టాఫీసు గురించి, ఉత్తరాల గురించీ పాఠమ్ చెప్పేటప్పుడు నన్ను ఉదాహరణగా చూపించేవాళ్ళు.
తను మా ఊరు వచ్చేముందు ఉత్తరంలో అడిగేవాళ్ళు.. నాకోసం ఏమేం తేవాలని. నా కోరికల లిస్టులో కణికెలు (బలపాలు), రంగు పెన్సిళ్ళు, నాలుగు రంగుల రీఫిళ్ళున్న పెన్ను ఉండేవి. అడక్కపోయినా బట్టలు, బొమ్మలు, తినుబండారాలూ వచ్చేవి. తాతయ్యకి చక్కెర వ్యాధి ఉండడంతో తనని తీపి తిననిచ్చేవారు కాదు ఇంట్లో. తనకి ఆసక్తి లేకపోయినా ఇంట్లో వాళ్ళు వద్దు అనేసరికి పట్టుదల పెరిగేది. నన్ను షికారుకి తీసుకెళ్ళి చాక్లెట్లు కొనిపెట్టి, నా దగ్గర అడిగి తీసుకుని తినేవాళ్ళు. "ఇంట్లో చెప్పద్దు" అని చెప్పి. ఆయన మాట మాత్రం నేను కచ్చితంగా వినేవాడిని. నేను నాన్నకి కోపం తెప్పించి దెబ్బలు తింటానని బాధ పడేవాళ్ళు. తాతయ్య ఉండగా నా వంటి మీద దెబ్బ పడేది కాదు. కానీ, తాతయ్య ఎక్కువ రోజులు ఉండేవాళ్ళు కాదు.
తాతయ్య నేను పోట్లాడుకున్న సందర్భాలూ లేకపోలేదు. పట్టుదలలో ఇద్దరమూ సమానమే. తగ్గే వాళ్ళం కాదు. తీవ్రంగా పోట్లాడుకుని మాట్లాడుకోని సందర్భాలూ ఉన్నాయి. తను నాకు కొని ఇచ్చినవన్నీ వెనక్కి ఇచ్చెయ్య మనేవాళ్ళు. నేను మౌనంగా తీసుకెళ్ళి ఇచ్చేస్తే ఆయనకి బాగా కోపం పెరిగి పోయేది. నాన్న నన్ను కొడతానని బెదిరించి, తాతయ్యకి క్షమాపణ చెప్పించాలని చూసేవాళ్ళు. నేను దెబ్బలకి సిద్ధపడేవాడిని.
ఇద్దరం కలిసిపోయాక మళ్ళీ మామూలే. పుట్టిన రోజుకి, నాకు క్లాస్ ఫస్ట్ వచ్చినప్పుడు బహుమతి ఇచ్చేవాళ్ళు. తను ఊళ్ళో లేకపొతే స్కూలికి మనియార్డర్ వచ్చేది. అలాంటప్పుడు పోస్టుమాన్ నాచేత సంతకం పెట్టించుకుని డబ్బులు మాత్రం ఇంట్లో ఇచ్చేవాడు. నేను నవలలు చదువుతున్నానని తెలిసి ఎంతో బాధ పడుతూ ఉత్తరం రాశారు తాతయ్య. చదువు నిర్లక్ష్యం చేయొద్దని.
నేను హైస్కూల్లో ఉండగా మార్చి నెలలో ఒక మద్యాహ్నం ఇంటికి త్వరగా వచ్చేశా.. నాన్న బయటకి వెళ్ళారు. అమ్మ నాకు భోజనం పెడదాం అనుకుంటుండగా పోస్టుమాన్ వచ్చాడు 'టెలిగ్రాం' అంటూ.. సంతకం పెట్టమని కాగితం నాకిచ్చి విషయం అమ్మకి చెప్పేశాడు 'తాతయ్య పోయారని.' నేనే సంతకం చేశా, తాతయ్యే అక్షరాలు నేర్పించారని గుర్తు చేసుకుంటూ.. హైదరాబాద్ వెళ్ళేవరకు తాతయ్యతో జరిగిన ప్రతి సంఘటనా గుర్తొస్తూనే ఉంది. ఏడ్వాలని ఉన్నా కన్నీళ్లు రాని సందర్భం. మేము హైదరాబాద్ వెళ్ళేసరికే అంతా ఐపోయింది.. తాతయ్య లేరనే విషయం నమ్మడానికి చాలా సమయం పట్టింది. ఆ లోటు మరొకళ్ళు పూడ్చలేరనీ అర్ధమైంది.
రెండేళ్ళ క్రితం డాక్టర్ నాకు టెస్ట్ లు చేసి ''స్వీట్, ఆయిల్స్ తగ్గించండి' అని చెప్పినప్పుడు నాకెందుకో తాతయ్యే గుర్తొచ్చారు. ఆయన నా దగ్గరనుంచి చాక్లెట్లు తీసుకున్న దృశ్యం.. ఆయనకి చాక్లెట్లు ఇవ్వడం నుంచి, మరొకరి దగ్గర నుంచి నేను తీసుకునే దగ్గరికి వచ్చేశానా? 'కాలం వేళ్ళ సందుల నుంచి ఇసుకలా జారిపోవడం' ఏమిటో అనుభవం లోకి వచ్చినట్టు అనిపించింది. ఇవాళ తాతయ్య చనిపోయిన రోజు. ఉదయం నుంచీ ఏపని చేస్తున్నా ఆయన గుర్తొస్తూనే ఉన్నారు.
మురళి గారూ !మనుషులెపుడూ దూరం కారు ...
రిప్లయితొలగించండిజ్ఞాపకాలు పదిలంగా ఉన్నంతవరకూ .....
ప్రత్యేకమైన వ్యక్తుల్ని మరచిపోలేం ,
మన తుది శ్వాస ఉన్నంత వరకూ
మన గుండె చప్పుడులో .....
జీవించే ఉంటారు .
ఎందుకండి .. అందరు తాతయ్యలు ఇలాగే ఉంటారు.. కన్న వాళ్ళతో కూడా ఇంత ఎటాచ్‍మెంట్ ఉండదు. ఈ తాతయ్యలు అమ్మమ్మలు లేదా బామ్మలూ వీళ్ళకి వేరే పని ఉండదా అనిపిస్తుంటుంది.
రిప్లయితొలగించండిఏది ఏమైనా మా తాతయ్యగారిని గుర్తుకు తెచ్చారు.
ఇంతకీ అసలు విషయం చెప్పలేదు.. ఆఖరి చూపులు దక్కాయా?
అందుకే మీ వాక్యాల్లో అంత సరసత.
రిప్లయితొలగించండిచివర టెలిగ్రాం అందుకున్న దృశ్యం గొంతు చిక్కబట్టించింది.
సారీ అండీ...... చూసారా! మీ తాతగారు పైనుండి మిమ్మల్ని దీవిస్తున్నారు.
రిప్లయితొలగించండితాత చేయి పట్టుకొని నడిచి, ఓంకార నాదం తో లోకం చూసి, మీరు ప్రయోజకులై ఆదుకోవాల్సిన సమయాన ఆయన మీ మధ్య లేకపోవడం తీరని లోటు.వీలైతే ఆయన గుర్తుగా పదిమంది ఆయన నామస్మరణ చేసేటట్టు చూడండి.ఆయన మీ మధ్య లేకపోయినా సంతోషిస్తారు.
రిప్లయితొలగించండిబాధ్యతల బరువు దించుకొని, అలసిపోయి, మలిసంధ్యలో కాస్త సేదదీరుదామనుకొనే తాతయ్యలకు మనవలూ, మనవరాళ్ళే కదా లోకం ..
రిప్లయితొలగించండిమీ తాతయ్య జ్ఞాపకాలు బావున్నాయి..చివర్లో బాధ కూడా వేసింది.. మీరన్నట్టు జ్ఞాపకాలే ఓదార్పు.. జ్ఞాపకాలే మైమరపు..అంతేకదా?
మురళి గారు,
రిప్లయితొలగించండిబాధ పడకండి... తరాల తరంగాలలో పైకి లేచిన ప్రతి తరం కిందకు రావలసిందే కదా మొన్న తాత గారు నిన్న నాన్న గారు ఈ రోజు మనం తప్పని సారిగా తిరగవలసిన చక్ర భ్రమణం.. మనసు ఎంతో బాధ గా ఐపోయింది మీ పోస్ట్ చదివేక.. ఎక్కడ వున్నా మీ తాత గారి ఆత్మ కు శాంతి వుండాలని కోరుకుంటు వుంటారని ఆశిస్తు...
మా తాతాగారితో నాకు ఇంత అనుబంధం లేదు... అమ్మ వాళ్ళ నాన్నగారు నా చిన్నప్పుడే పోయారు... నాన్నగారి వైపు తాతగారు అంతగా నన్నెప్పుడూ దగ్గరకి తీయలేదు! ఇప్పుడు ఆయన కూడా లేరు.
రిప్లయితొలగించండిమీ కబుర్లన్నీ చదువుతుంటే.... నాక్కూడా ఇలాంటి తాతయ్య ఉండొచ్చు కదా అనిపించింది!
మురళి నాకు మా నాయనమ్మని గుర్తు చేసారు.ఇప్పటికి తలుచుకుంటే దుఃఖం తో నా గొంతు పూడిపోతుంది. ఈ ఏప్రెల్ పదహారుకి మూడు ఏళ్ళు నిండుతాయి ఆవిడ మమ్మల్ని వదిలి ..గోరింటాకు ,మల్లెపూలు ఆవిడకు ప్రాణం ,అవే ఇష్టాలు మనకి వచ్చాయి .
రిప్లయితొలగించండిమీ తాతగారి తో అనుభంధం చూస్తె 'ఆనందోబ్రహ్మ" సోమయాజి గుర్తొచ్చాడండి .
@పరిమళం, కొత్తపాళీ, పద్మార్పిత, భావన: ధన్యవాదాలు
రిప్లయితొలగించండి@చక్రవర్తి: అప్పట్లో ఇప్పుడు ఉన్నంత కమ్యునికేషన్ వ్యవస్థ లేదండి. టెలిగ్రాం ఒకరోజు ఆలస్యంగా వచ్చింది. మేము వెళ్ళేసరికే అంతా అయిపోయింది. ఒకరకంగా మంచిదే అయ్యింది. తాతయ్య సజీవంగానే జ్ఞాపకాలలోకి వస్తున్నారు. మీకు ధన్యవాదాలు. అన్నట్టు మీ 'మంత్రాలయం' తర్వాతి భాగం ఎప్పుడు రాస్తారు?
@భాస్కర రామిరెడ్డి: మీరు చెప్పిన విషయం గురించే గత కొద్దిరోజులుగా ఆలోచిస్తున్నానండి. ధన్యవాదాలు.
@ఉమాశంకర్: అంతేనండి.. ధన్యవాదాలు
@చైతన్య: అవునా.. మా తాతయ్య కూడా అందరు మనవల్ని దగ్గరికి తీయలేదండి.. నాతో ఆయనకీ ప్రత్యేకమైన అనుబంధం. మీకు ధన్యవాదాలు.
@చిన్ని: మనల్ని ఇష్టపడే వాళ్ళ ప్రభావం మనమీద తప్పక ఉంటుందండి. ధన్యవాదాలు.
మనసు పొరల్లో గుండె లోతున దాగిన ఎన్నో జ్ఞాపకాలు వెలికితీయటంలో మీరు గట్టివారండి. నాకు ఊహ వచాక మా పితామహులు ఎక్కువకాలం లేరు. ఆయంతో గడిపిన కొన్ని రోజులైనా చాలా లీలగా గుర్తొస్తాయి. నాకు తెలిసీ నేను ఆయన్ని మంచం మీదే ఎక్కువ చూసాను కాని....తన కాళ్ళ మీద ఆయన నడవగా చూడలేదు. ఆయనే నడవలేనప్పుడు నన్ను బైటికెలా తీస్కెళ్తారు? మంచం మిదనుంచే రోజు సంధ్యావందనం...జపం...నిరంతరం విష్ణు సహస్ర నామం పారాయణ చేసేవారు. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది...నాకు భక్తి ఎక్కువ కాబట్టి...ఆయ్న ఉండి ఉంటే...ఎన్ని విషయాలు నేర్చుకుందును కదా అని. ఆయనతో నాకు ఆరేడేళ్ళు ఉన్నప్పుడు దిగిన ఫొటో చూస్తే చాల లీలగా ఆయనతో గడిపిన క్షణాలు గుర్తుకొస్తయ్. ఉదరకోశ కాన్సర్ వ్యాధితో బాధపడుతూ కాలంచేసారు.
రిప్లయితొలగించండిఇంక మాతామహులంటారా...ఆయన 55 సం.కే చనిపోయారు కాబట్టి... ..చివరి రెండు మూడు నెలలు తప్ప ఆయంతో పెద్దగా గడిపింది లేదు. పసి పిల్లవాడిగా ఉన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళింటికొచ్చినప్పుడు....ఆయ్న చాలా చేసారు నాకు. ఆయన నాకు చేసిన వాటిల్లో చెప్పుకోదగ్గది...వస పోయటం. ఇప్పటికీ అమ్మ అంటూ ఉంటుంది...నీకు ఎందుకు వసపోసామా అని అనిపిస్తూ ఉంటుందిరా...అసలు మాట్లాడకుండా కాసేపు కూడా ఉండలేవా? అని. ఎం చేద్దాం...నాకు నీరు..గాలి ..ఆహారం..వీటితో పాటే మాట్లాడటం అని అనిపిస్తూ ఉంటూంది. మాట్లాడకుండా ఉండలేను. ఎక్కువ మాట్లాడితే అమ్మకి కోపం. మా తాతయ్య విషయానికొస్తే ఆయన మహా కోపిష్ఠి. పొరపాటున ఆయన ఆఫీసుకి వేస్కెళ్ళే తెల్లటి చొక్కా పాంటు మిద ఎదైన మరకపడిందంటే... ఉగ్ర నరసింహావతారం ఎత్తేవారు. అందుకే ఆయన బట్టలకి అందరూ దూరంగా ఉండేవారు. చివర్లో అంటే నేను 7వ తరగతిలో ఉన్నప్పుడు ఆయనకి హార్ట్ ఎటాక్ వచ్చింది. అప్పుడు...రోజు నేను కుడా వెళ్ళేవాడిని ఆయన ఆస్పత్రిలో ఉంటే చూడటానికి. మైసూరు బజ్జి కాని...ఇడ్లీ కాని...ఇలా ఎదో ఒకటి ఆయనకి పొద్దున తినటానికి నేను కొనుక్కొచ్చే వాడిని హోటల్ నుంచి. ఆయన అవి తింటున్నంతసేపు నేను ఈ.టీవి న్యుస్ రీడర్ గా ఆయనకు ఈనాడు పేపర్ చదివి వినిపించేవాణ్ణి. ఆయన తినగా మిగిలినవి నాకు పెట్టేవారు.ఇంక డిస్చార్జ్ అయ్యి ఇంటికొచ్చాక ఎక్కువకాలం లేరు.
కాని వీరిద్దరికంటే నాకు ఎక్కువ అనుబంధం ఉన్నది మాత్రం మా ముత్తాత గారితో (అమ్మమ్మ వాళ్ళ నాన్న గారు). చిన్నప్పటీనుంచీ ఆయనంటే చాల ఇష్టం ఉండెది. తాతమ్మకీ ముత్తాతగారికీ నేను మొట్టమొదటి మునిమనవణ్ణి కావటం చేతనేమో వాళ్ళకి నేనంటే మహా ఇష్టం. ఎప్పుడైనా వాళ్ళ వూరు కొత్తగూడెం వెళ్ళినప్పుడు వాళ్ళతోనే ఎక్కువ సమయం గడిపేవాడిని. వేసవి సెవలులొచ్చాయంటే చాలు...అందరు చుట్టాలు కొత్తగూడెం ఎప్పుడు వెళ్దామా అనుకునే వారే. ఎందుకంటే...అందరు కలిసి ఒక డెబ్భై మందిదాక అయ్యేవాళ్ళం. బోల్డంతమంది ముని మనవళ్ళు మనవరాళ్ళు అక్కడ చేరి ఆడుకుంటూ ఉంటే ...ఆ వృద్ధ దంపతులకు ఇంకేం కావాలి చెప్పండి. అందరూ ఆడుకుంటున్నా.. నేను మాత్రం ముత్తాత గారు పడూకునే దాక అయనకి కాళ్ళు పిసికి...అక్కడే ఉండేవాడిని. చిన్నప్పటీ నుంచీ కొత్తగూడెం వెళ్ళినప్పుడు వాళ్ళతో ఎక్కువ సమయం గడపటం అలవాటు. ముత్తాతగారు రెండేళ్ళ క్రితం కాలం చేసారు ఆయనకి 95వ యేట. ఆయన షష్ఠిపూర్తి కి నేను ఇంకా పుట్టలేదు కాని...ఆయన సహస్ర పూర్ణ చంద్ర దర్శన శాంతికి....కనకాభిషేకానికి ఉన్నాను. తాతమ్మ నా చిన్నప్పటి రోజుని గుర్తు చేస్తూ బోలెడన్ని విషలాలు చెబుతుంది. చిన్నప్పుడు వాళ్ళ చేతులమిద మెత్తగా సాగిపోయిన చర్మం ముట్టుకుని చూసి..."నా చెయ్యి బాగానె ఉంది..మరి మీ చెతులకేంటి అలా చర్మం సాగిపొయింది " అని అమయకంగా నేను అడిగానట. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నయ్. కాని...అవి నా చేత చెప్పించినందుకు మీకు ధన్యవాదాలు. మిమ్మల్ని ఇంత సంస్కారంగా పెంచినందుకు మీ తాతగారికి నా జోహార్లు.
@"శం కరోతి" - ఇతి శంకరః : అబ్బ! ఎన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నారండి.. నాకు తాతయ్య (నాన్న నాన్న) దగ్గర చనువెక్కువ. తాతగారు (అమ్మ నాన్న) అంటే కొంచం భయం.. తాతయ్యకి నేనంటే చాలా ప్రేమ. మీ స్పందనకి ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిmuraligaru, naaku kuda ma tatayya (ammaki nannagaru) tho chaala anubandham.. aayanante entha istamo.. me posts chaduvuthunte aayane gurthuvastaru.. na meeda kuda chinna debba padaniche varu kadu.. cheppli ante chaala ne unnayi.. aayana na padahaaro yeta chanipoyaru.. kallatho chusina nammalekapoyanu.. okka kanneeti bottu raalchalekapoyanu.. chaala kaalam pattindi.. aa vartha jeernam avvadaniki.. ippatiki badhaga untundi.. anthaga preminche thathayya ki okka kanneeti bottu kuda ralchalekapoyanu enti ani.. me post chadivaka oorata chendanu.. may be mee la shock lo undadam valla.. nammadam istam lekapovadam valla kanneellu raledemo ani.. meeku ennoo dhanyavaadalu..
రిప్లయితొలగించండి@రోజా: అనుబంధాన్ని కేవలం కన్నీళ్లు మాత్రమే సూచించవండీ.. కనీళ్ళు వచ్చే స్థాయిని మించిన బాధ కలిగినప్పుడు కళ్ళు తడవ్వు.. వ్యాఖ్యకి ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి