తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సుతో తెలుగునాట పుట్టిపెరిగిన బహుభాషా నటి (టేకుమళ్ళ/శంకరమంచి) 'షావుకారు' జానకి కి 'పద్మశ్రీ' పురస్కారం లభించిందన్న వార్త చూడగానే నాకు మొదటగా గుర్తొచ్చిన పుస్తకం 'మనసే అందాల బృందావనం'. అప్పుడెప్పుడో చదవడం మొదలుపెట్టి, కొన్ని అధ్యాయాల తర్వాత పక్కన పెట్టిన ఆ పుస్తకం 'షావుకారు' జానకి విలక్షణంగా పోషించిన పాత్రల తాలూకు విశ్లేషణ. రాసిందేమో 'జ్ఞాపకాలు' లాంటి పుస్తకాలతో పేరు తెచ్చుకున్న సినిమా పరిశోధకుడు డాక్టర్ కంపల్లె రవిచంద్రన్. అటు పేజీల పరంగానూ ఇటు కంటెంట్ పరంగానూ పెద్దగా బరువనిపించని ఈ పుస్తకాన్ని చదవడం పూర్తి చేయడానికి ఇదే మంచి తరుణం అనిపించింది.
'షావుకారు' జానకి సీనియర్ నటీమణి. తొంభయ్యేళ్లు దాటిన వయసులో కూడా అవకాశం దొరికిందే తడవుగా నటించి, ఆయా సినిమాల మీద తనదైన ముద్ర వేస్తున్నారు. గడిచిన డెబ్భయ్యేళ్లకు పైగా రంగస్థలం, రేడియో, సినిమా మాధ్యమాల్లో నటిస్తున్న ఈ నటి ప్రాయంలో ఉండగా కూడా కేవలం నాయిక పాత్రలు మాత్రమే నటిస్తానని గిరిగీసుకోలేదు. వచ్చింది ఎంత చిన్న పాత్రయినా తనదైన శైలిలో నటించి, తనదైన మార్కుని నిలుపుకున్నారు. 'కన్యాశుల్కం' సినిమాలో తళుకు బెళుకుల మధురవాణిగా సావిత్రి మెప్పిస్తే, వెలిసిన తెల్లచీరలో బుచ్చమ్మగా కనిపించడానికి అభ్యంతర పెట్టలేదు. మధురవాణికి వచ్చినంత పేరునీ బుచ్చమ్మకీ సంపాదించారు. నటించిన నాలుగొందల పైచిలుకు సినిమాల్లో ఆమె అంగీకరించిన ఇలాంటి ఛాలెంజీలు తక్కువేమీ కాదు.
ప్రవృత్తి రీత్యా సినిమా పరిశోధకుడైన రవిచంద్రన్ మొదటగా 'షావుకారు' జానకి కి వీరాభిమానై ఉండొచ్చనిపించింది, పుస్తకం చదవడం పూర్తి చేశాక. ఐదు తమిళ సినిమాలతో సహా మొత్తం ముప్పై సినిమాల్లో జానకి చేపట్టిన పాత్రలని ఎంచుకున్నారు ఈ పుస్తకం కోసం. పాత్రల ఎంపికకు 'క్రైటీరియా' ఏమిటన్నది ముందుమాటలో కూడా చెప్పలేదు కాబట్టి, ఒక అభిమానిగా తనకి నచ్చిన పాత్రల్ని ఎంచుకున్నారన్న అభిప్రాయం కలిగింది. ఎందుకంటే, కేవలం పూర్తి స్థాయి కథానాయిక పాత్రలకి మాత్రమే కాలేదు, ప్రత్యేక అతిధి పాత్రలకీ, హాస్య పాత్రలకీ కూడా చోటిచ్చారు ఈ ఎంపికలో. 'షావుకారు' లో సుబ్బులు మొదలు 'సంసారం ఒక చదరంగం' లో చిలకమ్మ వరకూ ఎంచుకున్న పాతిక తెలుగు పాత్రలూ వేటికవే ప్రత్యేకమైనవి. వీటిలో జానకికి పెద్దగా నటించేందుకు అవకాశం లేని 'జయం మనదే' మొదలు, ఒకటి రెండు సీన్లకే పరిమితమైన పాండురంగ మహాత్మ్యం' లాంటి సినిమాలకీ చోటిచ్చారు.
పుస్తకం రాసేందుకు రచయిత తీసుకున్న శ్రమ ప్రతి అధ్యాయంలోనూ కనిపిస్తుంది. ఎంచుకున్న పాత్రలున్న సినిమాలని ఒకటికి నాలుగు సార్లు చూసి - మరీ ముఖ్యంగా ఆయా చిత్రాల్లో జానకి నటన, ఆహార్యం, వాయిస్ మాడ్యులేషన్, బాడీ లాంగ్వేజ్ లాంటి విషయాలన్నీ జాగ్రత్తగా పరిశీలీలించి - సినిమా కథలో జానకి పాత్ర, నటనలో మిగిలిన పాత్రధారులనుంచి జానకి ఎలా ప్రత్యేకం అనే దృక్కోణంలో వ్యాసాలను రాసుకుంటూ వెళ్లారు. పాత్ర వయసు, పాత్ర పోషించేనాటికి జానకి వయసు లాంటి విషయాలనీ గమనంలో ఉంచుకున్నారు. "శ్రీమంతుల కుటుంబంలో పుట్టి పెరిగిన జానకి డబ్బుతో లభించే సమస్త సుఖ భోగాలనూ అనుభవించింది. కానీ, అదే జానకి కన్నతల్లిగా మారిన కాలంలో పట్టెడన్నం లభించక, పస్తులు పడుకునే దుర్బల పరిస్థితులనూ చూసింది. ఇలా జీవితంలో ఎత్తు పల్లాలను చూసిన జానకి, మానసాదేవి ('నాగుల చవితి' సినిమాలో పాత్ర) జీవితంలో చోటు చేసుకున్న ఉత్తానపతనాలను తన నటనా ప్రతిభ ద్వారా చాలా బాగా చూపించింది" అంటూ సందర్భానుసారంగా జానకి వ్యక్తిగత విశేషాలని కథనాల్లో జోడించారు.
'షావుకారు' జానకి మీద అభిమానం లేకపోతే ఇంతటి పుస్తకం రాయడం కష్టం. అయితే, అదే అభిమానం రచయిత చేత కొన్ని ఆశ్చర్యకరమైన ప్రతిపాదనలు చేయించింది. "నిర్మల స్థాయిని దిగజార్చేలా సినిమాలో బృందగీతాన్ని (నిజం చెప్పవే పిల్లా/డాక్టర్ చక్రవర్తి) పెట్టినా, ఆ లోపాన్ని పూరించే విధంగా జానకి ఆ గీతంలో హుషారుగా డేన్స్ చేసింది". "జానకి చాలా బాగా చేసినా, పంపిణీదారులైన నవయుగ వాళ్ళు భానుమతికి మరీ బాకా ఊది పబ్లిసిటీ ఇవ్వడం వల్ల, తెలుగులో జానకి పాత్ర, భానుమతి క్రీనీడలో ఉండిపోయింది (అన్నై/పెంచిన ప్రేమ)". "నిజజీవితంలో పాశ్చాత్య సంస్కృతికి ఆలవాలమైన కుటుంబంలో, నవనాగరకతకు మారుపేరైన తండ్రి పెంపకంలో, గ్రామీణ వాతావరణానికి బహు దూరంగా పెరిగిన జానకికి, తెలుగింటి ఆడపడుచైన సుబ్బులు పాత్ర నిజంగా ఒక అగ్ని పరీక్షే! అయితే, ఆమె తన నటనా వైదుష్యంతో ఆ పాత్రను అసమానరీతిలో పోషించి, అగ్నిపునీత అయిన సీతలా ప్రజలందరి మన్ననలను పొందింది (షావుకారు)".
కంటెంట్ తో పాటుగా పుస్తకం గెటప్ మీదా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. కవర్ పేజీ మొదలు, చివరి పేజీ వరకూ ప్రతి పేజీని శ్రద్ధగా చూడాలనిపిస్తుంది. అరుదైనవి కాకపోయినా ఛాయా చిత్రాల ముద్రణ ప్రత్యేకంగా ఉంది. బాగా నాణ్యమైన పేపరు వాడడం ఇందుకు కారణం. ఈ ఫలితం ప్రింటు మీద కూడా కనిపించింది, అక్షరాలు హాయిగా చదవగలిగేలా ఉన్నాయి. అచ్చుతప్పులు కనిపించలేదు. రచయితతో మనం అంగీకరించినప్పుడు, విభేదించినప్పుడూ కూడా ఒకే వేగంతో చదువుతాం ఈ పుస్తకాన్ని. "కొందరు నర్తకీమణులు పొదుపైన ఉడుపులు ధరించి అంగాంగ ప్రదర్శనలతో ఆకర్షిస్తారు. అయితే జానకి, యీ ప్రదర్శనంతా హావభావాలతో చేస్తుంది. కళ్ళతో కిలికించితాలు, వీడీవీడని పెదవులతో ఆహ్వానపత్రికలూ, కవ్వింపులు. ఇది అసాధారణమైన ప్రజ్ఞే కాదా?" అంటూ తన ముందుమాటలో ('సముఖములో రాయబారము') ఈ పుస్తకం ఎందుకు చదవాలో చెప్పకనే చెప్పారు వీ.ఎ.కె. రంగారావు. (మోహనవంశీ ప్రచురణలు, పేజీలు 162, వెల రూ. 200).
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి