గురువారం, జనవరి 13, 2022

ముక్కుపుల్ల

అడ్డబాస చూడడం నాకు భలే ఇష్టం. ఐతే అది అందరికీ సూటవ్వదు. ఎమ్మెస్ సుబ్బలక్ష్మి, వయసైపోయిన భానుమతి.. వీళ్ళని అడ్డబాస లేకుండా ఊహించలేం. చిన్నప్పుడు కజిన్స్ ఎవరైనా ముక్కు కుట్టించుకుంటుంటే అడ్డబాసకి కూడా ఓ కుట్టు వేయించుకోమని ఉచిత సలహా ఇస్తూ ఉండేవాడిని. "రేపు మీ ఆవిడకి/పిల్లలకి కుట్టిద్దువుగానిలే" అంటూ విరుచుకుపడే వాళ్ళు తప్ప ఒక్కరూ నా సలహా పాటించలేదు. 'ఓ కుట్టు ఎలాగో కుట్టించుకుంటున్నప్పుడు ఇంకో కుట్టుకి ఏమవుతుందో' అని అయోమయ పడేవాడిని. అటు శాస్త్రానికి, ఇటు ఫ్యాషన్ కీ కూడా కుట్లేవీ వేయించుకోకుండానే రోజులు గడిచిపోయాయి. ఇంకొకరిని ఇన్స్పైర్ చేసి, కుట్లు వేయించుకునేలా చేసే శక్తి లేదని కూడా తెలిసొచ్చేసింది. 

ఇదిలా ఉండగా, అసలు ఆ 'ముక్కు కుట్టుట' అనే ప్రక్రియ ఎలా ఉంటుందో కూడా అనుభవంలోకొచ్చింది, కరోనా పుణ్యమా అని. అది కూడా ఒకసారి కాదు, ముచ్చంగా మూడుసార్లు. అది యెట్లన్నన్.. అనగనగా కరోనా ఫస్ట్ వేవ్ కాలంలో అనుకోకుండా పరీక్ష చేయించుకోవాల్సి వచ్చింది. 'కరోనా టెస్ట్' అంటే బ్లడ్ టెస్ట్ కాబోలనుకున్న అమాయకపు రోజులవి. కుర్చీలో కూర్చుని, ఎడమచేయి పిడికిలి బిగించి, సర్వససన్నద్దుడినై, టెక్నీషియన్ వైపు 'స్టార్ట్.. కెమెరా.. యాక్షన్ ' అన్న లుక్ ఇచ్చాక బదులుగా సిరంజి కాకుండా ఓ చిరునవ్వు వచ్చింది అతన్నుంచి. నే చేసిన నేరమదేమో తెలియక ప్రశ్నార్థకంగా చూసిన పిమ్మట, "కోవిడ్ టెస్టుకు రావడం మొదటిసారా?" అని ప్రశ్నించి, నా అమాయకత్వాన్ని మన్నించి, తల పైకెత్తమన్నాడు. ఓ పొడుగాటి పుల్లని వైనంగా నా ముక్కులో చొప్పించినప్పుడు ముందు కళ్ళ నీళ్లు తిరిగాయి. వెంటనే తుమ్ము రాబోయి, మర్యాదకి ఆగిపోయింది. 

నా అదృష్టానికి, ఆ పుల్ల టెస్టు మొదటిసారి ఫెయిలయింది. మరో పుల్ల, అదే ముక్కు. నేనేమో సర్వశక్తుల్నీ ముక్కు మీద కేంద్రీకరించి టెక్నీషియన్ కి సహకరించా, 'ఇంకోసారి' అంటాడేమో అని భయపడి. మరో పుల్లని గొంతు వరకూ జొనిపి, బయటికి తీసి, శాంపిల్ తీసుకోవడం పూర్తయింది లెమ్మన్నాడు. అప్పుడు పేరూ, ఫోన్ నెంబరూ ఇస్తే చాలన్నారు కానీ, రెండో వేవ్ లో రెండో సారి టెస్టుకి వెళ్ళినప్పుడు ఆధార్ తో సహా సవాలక్ష ఆధారాలు అడిగారు రిజిస్ట్రేషన్ కోసం. ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటే, క్రితం రోజు ఆఫీసులో కలిసి లంచి చేసిన ఓ సహోద్యోగికి పాజిటివ్ వచ్చిందని, తెల్లారుతూనే ఫోనొచ్చింది. అలా టెస్టుకు వెళ్లి, నేను నేనేననే రుజువులన్నీ చూపించాక,  'బ్యాంకు స్టేట్మెంట్ సబ్మిట్ చేయమంటారా?' అని బాధ్యతగా అడిగాను. 

"ఇప్పుడు అవసరం లేదు, ఒకవేళ పాజిటివ్ వస్తే అప్పుడు చూస్తాం" అంది కౌంటర్ అమ్మాయి. బ్యాలన్సు కొద్దీ వైద్యం కాబోలనుకున్నాను. సరే, లేబ్ లోకి వెళ్తే పుల్లలధారియై టెక్నీషియను. భూగర్భ జలాలు పైకి తెచ్చేందుకు బోర్ వేసే కార్మికుడిలా అతి శ్రద్ధగా ఆ పుల్లతో నా నాసికను చిలికాడు. గతానుభవాన్ని గుర్తు తెచ్చుకుని నేను పూర్తి స్థాయిలో సహకరించా. 'వన్స్ మోర్' అనకుండా రక్షించాడు నన్ను. వాక్సిన్ రావడమూ, పొడిపించుకోవడమూ, ఇక కరోనా కథ కంచికే అని ఆనందించడమూ జరుగుతూ ఉండగా ఉన్నట్టుండి మూడో వేవ్ మొదలైంది. ఈసారి ఇంటి చుట్టుపక్కల కేసులు పెరిగాయి. దాంతో సామూహికంగా కోవిడ్ టెస్టులు జరిపే ఏర్పాటు మా ప్రమేయం లేకుండానే జరిగిపోయింది. పైగా, టెస్టు చేయించుకోడం తప్పనిసరి. 

ఈసారేం డాక్యుమెంట్లు అడగబోతారో అనుకుని, ఎందుకైనా మంచిదని ఓ డాక్యుమెంట్ల బొత్తి చంకన పెట్టుకుని బయల్దేరానా, వాళ్లేమో ఫోన్ నెంబరు ఒక్కటీ చాలనేశారు. ఏవిటో, క్షణక్షణముల్ టెస్టుల వాళ్ళ చిత్తముల్ అనుకుంటూ, దూరం పాటిస్తూ క్యూలో నిలబడ్డా. ఈసారి లేబ్ కాకుండా ఓపెన్ ప్లేస్ అవడం వల్ల, అందరి టెస్టులు అందరికీ కనిపిస్తున్నాయి. ఎవరి ముక్కులోకి పుల్ల వెళ్తున్నా, నా ముక్కు దురదేస్తూ ఉండడం. నేనేమో, ప్రిన్సులాగా మాస్కు మీంచి నా ముక్కు తుడుచుకుంటూ ఉండడం. ఓ అరగంట పాటు ఈ హింస కొనసాగింది. ఆ తర్వాత అసలు హింస. ఇదేదో రెండు టెస్టుల కాంబో అట. ముక్కు పుల్లలు రెండు, ఒక వేళ శాంపిల్ రాకపోతే మరొహటో రెండో పుల్లలు అదనం. వినగానే గుండె ఝల్లుమంది. సర్వశక్తులూ ఒడ్డి శాంపిల్ ఇచ్చేశా, అది మొదలు రోజంతా తుమ్ములే తుమ్ములు. 

ముక్కు కుట్టించుకొనుట అనే ప్రక్రియలో ఇమిడి ఉన్న కష్టమేంటో దెబ్బకి అనుభవానికి వచ్చింది. పాపం వాళ్ళేదో ముక్కు పుడక సరదా కోసం తెగించి ఓ కుట్టుకి సిద్ధ పడితే, నేను 'అడ్డబాస' అని సలహా చెప్పడం విని వాళ్లకెంత ఇరిటేషన్ వచ్చి ఉంటుందో బాఘా అర్ధమయ్యింది. ఆఫ్ కోర్స్, ఇప్పుడు ముక్కుకి, చెవులకి కూడా కుట్లు అవసరం లేని జ్యుయలరీ అందుబాటులోకి వచ్చేసింది. అయినప్పటికీ, వాటికి పెద్దగా ఆదరణ ఉన్నట్టు లేదు. చెవులవరకూ ఓకే కానీ (అబ్బాయిలూ ఎక్కువగానే కుట్టించుకుంటున్నారు) ఇప్పుడు ముక్కు కుట్టించుకుంటున్న వాళ్ళు పెద్దగా కనిపించడం లేదు. ఇంతకీ మూడు టెస్టుల రిజల్టు సంగతి చెప్పలేదు కదా.. మూడూ నెగిటివ్ రిజల్టు ఇచ్చి నన్నానంద పరిచాయి. మీ అందరికీ కూడా నెగిటివే రావాలని కోరుకుంటున్నా.. పదండి, ఈ మూడో వేవుని దాటేద్దాం.. 

8 కామెంట్‌లు:

  1. "అడ్డ బాస" అంటే ఏమిటండి ? రెండు వైపులా కుట్టించుకునే ముక్కు పుడక ని ఇలా పిలుస్తారా ?

    రిప్లయితొలగించండి
  2. ముక్కుదూలానికి తగిలించుకునే ఆ ఆభరణాన్ని "బులాకి" అంటారనుకుంటాను, మురళి గారు.

    రిప్లయితొలగించండి
  3. అడ్డబాస, బులాకి ఒకటే అంటోంది ఆంధ్రభారతి.

    మా మామ్మగారికి అడ్డబాస ఉండేది. ఆ కళే వేరు.

    అడ్డబాసనీ, కరోనా పుల్లనీ పోల్చారు చూశారూ మురళిగారూ... మీకు నమోన్నమ:

    రిప్లయితొలగించండి
  4. @విన్నకోట నరసింహారావు, ఫణీన్ద్ర: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి