ఎండిన బీళ్లు, వర్షం కోసం ఆశగా ఎదురు చూసే రైతులూ ఉన్న సీమ 'స్వర్ణసీమ' ఎలా అయ్యింది? ఆ సీమకి స్వాగతం పలుకుతున్నది ఎవరు? ఆ సీమ పేరు 'పెద్దపర్తిగుంట.' ఉన్నది ఆంధ్ర ప్రదేశ్ లోనే, పైగా సరిహద్దునే కర్ణాటక, తమిళనాడు ఉన్నాయి. ఆ ఊరికి కుప్పం నుంచి బస్సు ఉంది. కుప్పం అంటే ఇవాళ్టి 'హైటెక్' కుప్పం కాదు. నలభయ్యేళ్ళ నాటి చిన్నపాటి టౌను. పెద్దపర్తిగుంటకి వెళ్లాల్సిన అనేకులు, వస్తుందో రాదో తెలియని ఆ బస్సు కోసం ఓ వేసవి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ కుప్పం బస్టాండులో ఎదురు చూడడమూ, తీరా బస్సు వచ్చాక అందులోకి ఎక్కేందుకు, సీటు సంపాదించేందుకు అనంతమైన యుద్ధాలు చేయడమూ, లెక్కలేనన్ని విఘ్నాలు దాటుకుని ఆ బస్సు ఊరి బాట పట్టడమూ జరిగి, ఇంతకీ ఆ బస్సు సదరు సీమకి చేరిందా? అక్కడ దొరికే స్వర్ణం సంగతేమిటి? అన్న ప్రశ్నలకి జవాబిస్తూ ముగిసే నవల 'స్వర్ణసీమకి స్వాగతం'.
తెలుగు కథ మీద తనదైన సంతకం చేసిన దామల్ చెరువు అయ్యోరు మధురాంతకం రాజారామ్ గారి చిన్నబ్బాయి మహేంద్ర. 1959 లో పుట్టి, చిన్ననాటి నుంచే రాయడం మొదలు పెట్టి, చాలా హడావిడి పనులున్నట్టుగా తన 39వ ఏటే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన మహేంద్ర రాసిన ఏకైక నవల 'స్వర్ణసీమకి స్వాగతం'. నిడివిలో పట్టుమని వంద పేజీలుండదు కానీ, వందల జీవితాలని కళ్ళకి కట్టినట్టు చూపిస్తుంది. మొత్తం కథంతా బస్సుప్రయాణమే. ఎదురు చూడ్డంతో మొదలు పెడితే, ప్రయాణం పూర్తయ్యే వరకూ పట్టే కాలం ఐదారు గంటలు. ఈ వ్యవధి లోనే రచయిత పరిచయం చేయని జీవితం లేదు, విప్పి చెప్పని తాత్వికతా లేదు. అలాగని ఇదేమీ సీరియస్ నవల కాదు. చాలామంది 'హాస్యం' అని భ్రమ పడే వ్యంగ్యంతో నడుస్తుంది ఆసాంతమూ. ప్రారంభించిన ప్రతిసారీ చివరివరకూ ఊపిరి బిగపట్టి చదివిస్తుంది కూడా.
తిమ్మరాయప్ప అనే వృద్ధ రైతు మధ్యాహ్నం వేళ కుప్పం బస్టాండుకి వచ్చి పెద్దపర్తిగుంట వెళ్లే బస్సు ఎప్పుడొస్తుందని ఎంక్వయిరీ చెయ్యడంతో కథ మొదలవుతుంది. బస్టాండు వర్ణన, అక్కడి వాతావరణ చిత్రణ పాఠకుల్ని ఒక్కసారిగా కథలోకి లాక్కుపోతాయి. పెద్దపర్తిగుంట వెళ్ళాల్సిన ఒక్కో పాత్రా బస్టాండుకి చేరడం, వారి కథలు, వాళ్ళ మధ్య సంభాషణల ద్వారా ఆ చుట్టుపక్కల పల్లెల్లో ఉండే రకరకాల మనుషులు, వాళ్ళ సమస్యలు ఒక్కొక్కటీ ప్రస్తావనకు వస్తూ ఉంటాయి. తిమ్మరాయప్ప లాంటి వాళ్ళు ప్రతి పైసా లెక్క చూసుకుని, కనీసం టీ కూడా తాగకుండా కడుపులో కాళ్ళు పెట్టుకుని కూర్చుని సమయం గడిపేస్తే, 'లీడరు' లాంటి వాళ్ళు చుట్టూ చేరిన జనాల ఖర్చులతో బీడీలు, సిగరెట్లు నిరంతరాయంగా సేవిస్తూ ఉంటారు. చంటిబిడ్డని ఆస్పత్రిలో చూపించి, తిరుగు ప్రయాణంలో ఉన్న సుభద్రకి అప్పటికప్పుడు మగతోడుగా అవతరిస్తాడు వేంకటపతి. భాగ్యం కోసం భార్యని వదిలేసిన అప్పోజి, ఆమె కంటపడకపోవడంతో ఆ చుట్టుపక్కలే వెతుకుతూ ఉంటాడు.
కంగుంది జమీందార్లకి దూరపు బంధువు వసంతనాయనీం వారిది ఇంకో కథ. జమీ మొత్తం పోయి, చిరిగిన పూసల కోటు, 'మంత్రి' రంగయ్య మాత్రమే మిగిలిన వసంతుల వారు, మంత్రి చేతికికూడా ఇవ్వకుండా తానే మోసుకు తిరిగిన సంచీలో ఉన్నదేవిటో చివరివరకూ తెలియదు. తెలిశాక, మహేంద్రని ఓ. హెన్రీ ఆవహించి ఉంటాడని అనిపించక మానదు. ఈ బస్సులో మరో ముఖ్య ప్రయాణికుడు రమణమూర్తి. ఆ ప్రాంతం వాడు కాదు. బహుదూరం నుంచి అక్కడికి మొదటిసారి వచ్చిన వాడు. అతనో పత్రికలో పని చేస్తూ ఉంటాడు. అతను రాయాల్సిన వార్తొకటి పెద్దపర్తిగుంటలో ఉంది. ఆ వార్త కోసమే సుదీర్ఘ ప్రయాణం చేసి, చివరి మజిలీ కోసం ఆ బస్సు ఎక్కాడు. బస్సెక్కినా కూడా, చుట్టూ ఉన్న అందరినీ ప్రశ్నిస్తూనే ఉన్నాడు. తాను వెతుకుతున్న కథనం నిజంగానే ఆ ఊళ్ళో దొరుకుతుందా అనే సందేహం పీడిస్తోంది అతన్ని. మరీ ముఖ్యంగా, ఆ ప్రాంతం తన రాష్ట్రంలో భాగమేనా అన్న సందేహం కూడా వచ్చేసింది.
గతుకుల రోడ్డులో, కిక్కిరిసిన జనంతో ఉన్న డొక్కు బస్సులో ప్రయాణం ఏమాత్రం సుఖంగా ఉండదు. కానీ, ఆ బస్సు కదలిక మాత్రం అందరికీ హాయిగా ఉంటుంది. ప్రయాణం సాగుతోంది కాబట్టి గమ్యం చేరుకుంటామన్న భరోసా ప్రయాణికులందరినీ అష్టకష్టాలనీ భరించేలా చేస్తుంది. కేవలం ప్రయాణికులకు మాత్రమే కాదు, డ్రైవరుకి, కండక్టరుకీ కూడా ఆ ప్రయాణం ఏమాత్రం హాయైనది కాదు. పురాతనమైన బస్సు, చెప్పినట్టు వినని స్టీరింగు, బ్రేకూ, ట్రాఫిక్ రూల్స్ పాటించని ఇతర వాహనదారులూ డ్రైవర్ సమస్యలైతే, పద్మవ్యూహం లాంటి జనవ్యూహం లోకి చొచ్చుకుని వెళ్లి, అందరికీ టిక్కెట్లు ఇవ్వడం కండక్టరుకి అగ్ని పరీక్ష. ప్రయాణికులకు చిల్లర ఇవ్వని విషయంలో కండక్టర్ మీద మనకి కోపం వస్తుంది కానీ, మిగిలిన అన్ని సందార్భాల్లోనూ ప్రయాణికులతో పాటు డ్రైవరు, కండక్టర్ల మీద కూడా అయ్యో పాపం అనే అనిపిస్తుంది.
మహేంద్ర 1985లో ఈ నవల రాసిన నాటి కన్నా ఇవాళ బస్సు ప్రయాణాల్లో కించిత్తు మార్పులు వచ్చాయి. సర్వీస్ ఆటోల్లాంటివి పల్లెటూరి ప్రజల ప్రయాణ అవసరాలు తీరుస్తున్నాయి. అయినప్పటికీ 'స్వర్ణసీమకి స్వాగతం' నవల ఇవాళ్టికీ సమకాలీనం. ఎందుకంటే ఈ కథ కేవలం బస్సు ప్రయాణాన్ని గురించి మాత్రమే కాదు. పాత్రలు కేవలం ఆ కాలానికి, ప్రాంతానికి సంబంధించినవి మాత్రమే అస్సలు కాదు. చదువుతున్నంత సేపూ నవ్వించే వర్ణనలు, ఉపమానాలు వెనువెంటనే ఆలోచనల్లోకి నెట్టేస్తాయి. వెరసి నవలని మరోమారు చదివేలా చేస్తాయి. మొన్నటివరకూ ఈ పుస్తకం ప్రింట్ అందుబాటులో ఉండేది కాదు. ఈ మధ్యనే 'అమరావతి పబ్లికేషన్స్' వాళ్ళు కొత్త ప్రింట్ వేసి, విశాలాంధ్ర, నవచేతన ద్వారా అందుబాటులోకి తెచ్చారు. నవోదయా ద్వారా ఆన్లైన్ లోనూ కొనుక్కోవచ్చు. తొంభయ్యారు పేజీల ఈ పుస్తకం వెల రూ. 100. ఓ మంచి నవలని చదివిన అనుభూతిని ఇచ్చే రచన ఇది. నవల చదివాక మహేంద్రని మర్చిపోవడం అసాధ్యం.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి