"మీకు జ్ఞానదంతం పెరిగింది సర్.. తీసేయాలి," డెంటిస్ట్
మాటలు విని అప్రయత్నంగా నోరు తెరిచాను. పరిచయస్తుడు మరియు సెన్సాఫ్
హ్యూమర్ బాగా ఉన్నవాడు అవడంచేత "కంగారు పడకండి.. జ్ఞానదంతానికి, జ్ఞానానికి
సంబంధం లేదు.. ఆ పేరలా వచ్చేసిందంతే.." అని నవ్వేశాడు. చెప్పొద్దూ, నవ్వే
డాక్టర్లంటే నాకు భలే ఇష్టం.. మరీ ముఖ్యంగా పేషెంట్లతో నవ్వుతూ మాట్లాడే
డాక్టర్లంటే మరీను. "నేనిప్పుడు ఫ్రీనే.. మీకు ఒకే అయితే
మొదలుపెట్టేద్దాం.." ఇదేదో బానే ఉంది.. ఆలస్యం అమృతం విషం కాకుండా
అనుకున్నా.. అంతలోనే బోల్డన్ని సందేహాలు.. ఇప్పుడు జ్ఞానదంతం ఏమిటి?
తీయించుకోకపోతే నష్టం ఏమిటి? మరీ ముఖ్యంగా పోస్ట్-ఆప్ (ఈమాట వినగానే పగలబడి
నవ్వారు డాక్టర్) కేర్ మాటేమిటి? ఇలా...
అన్నింటికీ ఓపిగ్గా
జవాబులు చెప్పేసి, తన యంత్ర సామాగ్రి రెడీ చేసేసుకుంటూ, మాట్లాడాల్సిన
ఫోన్లు ఏమన్నా ఉంటే మాట్లాడేయమని సూచించారు.. నేనేమో, ఎటూ నోరు
తెరుస్తున్నా కాబట్టి, పనిలో పనిగా స్కేలింగ్ గా పిలవబడే యంత్ర దంత ధావనం
కూడా కానిచ్చేయమని చెప్పేశా.. అల్లప్పుడెప్పుడో చదివిన ఇంద్రగంటి
హనుమచ్చాస్త్రి గారి 'గౌతమీ గాధలు' లో మొదటిసారి కనిపించిందీ యంత్ర దంత
ధావనం. చేయించుకున్న వారు సామాన్యులు కాదు, ప్రముఖ హాస్య రచయిత భమిడిపాటి
కామేశ్వర రావు. కారాకిళ్ళీతో గారపట్టి ఉండే పళ్ళకి స్కేలింగ్
చేయించుకున్నాక, హనుమచ్చాస్త్రి గారితో ఆ రహస్యం విప్పుతారాయన. "జ్ఞానదంతాలు మొత్తం నాలుగుంటాయి.. ఇవి ఏవయసులో అయినా పెరగొచ్చు.. పెరిగినప్పుడు తీసేయడం మినహా మరో మార్గం లేదు.. అవి ఉండడం వల్ల పెద్దగా ఉపయోగం కూడా లేదు.. ఒకసారి పెరిగిందంటే అలా బాధిస్తూనే ఉంటుంది" అని చెబుతూ గ్లౌజులు, మాస్కు వగయిరాలు ధరించి నా నోట్లో మళ్ళీ లైటు వేశారు. అలనాడు కృష్ణుడు-యశోద కాబట్టి భూగోళం మరియు ఇంకా బోల్డన్ని గోళాలు కనిపించాయి కానీ, ఈ డాక్టర్ కి నా నోట్లో ఏం కనిపిస్తుంది, కేవిటీస్ తప్ప? అవికూడా కొత్తవేమీ కాదు.. ఏళ్ళతబడి చూస్తున్నవే, పూడుస్తున్నవే..
"ఓ
ఐదు రోజులపాటు గట్టిగా మాట్లాడకూడదు మీరు.." వినగానే నవ్వొచ్చేసింది..
కాగితం తీసుకుని, రాసి చూపించా.. "పెళ్లయినవాణ్ణి" ..ఈసారి పైకి
నవ్వలేదాయన.. "ఇలాంటివి మా ఆవిడ చూస్తే ప్రమాదం" తగ్గుస్వరంతో చెప్పి,
కాగితం నావైపు నెట్టేశారు.. ఆవిడా డెంటిస్టే, పక్క కేబిన్లో.. లోకానికి
పళ్ళ డాక్టరే అయినా, భార్యకు భర్తే కదా అన్నది, జ్ఞానదంతం తొలగింప బడ్డాక,
నాకు కలిగిన తొలిజ్ఞానం...
<"నవ్వే డాక్టర్లంటే నాకు భలే ఇష్టం.. మరీ ముఖ్యంగా పేషేంట్లతో నవ్వుతూ మాట్లాడే డాక్టర్లంటే మరీను."
రిప్లయితొలగించండినిజమే అటువంటి వాళ్ళు కనిపిస్తే నాకూ ఇష్టమే. మీ డెంటిస్టు గారేదో కించిత్తు హాస్యప్రియుడిలా తోస్తున్నారు కానీ నవ్వే డాక్టర్లు కు "అల్లుని మంచితనము, తెల్లని కాకులు" పక్కన చోటు కల్పించాలనుకుంటుంటాను నేను డాక్టర్ల దగ్గరకు వెళ్ళివచ్చినప్పుడల్లా 😕.
" యంత్ర దంతధావనం" .... భలేగా ఉందండీ పేరు 😀. మరోమాట మీరన్నది నిజం - డెంటిస్టులు కాస్త పాజిటివ్ గానే మాట్లాడతారు - ముఖ్యంగా స్కేలింగ్, రూట్ కెనాల్ చేస్తున్నప్పుడు మీరు డెంటల్ కేర్ బాగానే తీసుకుంటున్నారే అని సర్టిఫికేట్ ఇస్తుంటారు. నిజమా, మరి మీ క్లినిక్ కొచ్చి ఈ కుర్చీలో ఎందుకు కూర్చునున్నాను నేను అని అనుకుంటాను మనసులో అది విన్నప్పుడల్లా 🤔 .
బావుందండీ జ్ఞానోదయానికి దోహదపడే జ్ఞానదంత పీకుడు మీద మీ టపా 👍.
@విన్నకోట నరసింహారావు: తుమ్ముల్లో పొద్దుగుంకినట్టు మొహం పెట్టుకునే డాక్టర్లు చాలామందినే చూశానండీ.. అందుకే ఈయన ప్రత్యేకంగా అనిపిస్తారు. నాకు 'గతంలో కన్నా బాగున్నాయి' అని చెప్పారు కానీ, ఆ మాత్రం పాజిటివిటీకే చాలా సంతోషం కలిగేసిందండీ :) ..ధన్యవాదాలు
రిప్లయితొలగించండిరెండోసారి, మరోటొకసారి పీకించుకున్నాక, కోరలు పీకిన పాములా బాగా శాంతం అలవాటయిందండీ. మరొక్కటుంది.. :)
రిప్లయితొలగించండిఇప్పుడు బాగా మాట్లాడగలుగుతున్నారాండి. అయినా పుస్తకాలు చదువుకొనే మీకు నోరుపెట్టుకొనే పని ఏమి ఉందిలెండి:) అన్ని విషయాలు హాయిగా రాసేసుకుంటూ పొండి....అంతేచాలు. మీకు అల్రెడీ చాలా జ్ఞానమే ఉందని, జ్ఞానదంతాల అవసరమే మీకు లేదని నా అబ్బిప్పిరాయం. ఏమంటారు మురళి గారు.
రిప్లయితొలగించండి@కొత్తావకాయ: నేను మొదలే కోరలు పీకిన పాముని అందరూ అంటూ ఉంటారండీ.. ఇప్పుడేమవుతుందో మరి.. ధన్యవాదాలు
రిప్లయితొలగించండి@జయ: అయ్యో, ఇన్నాళ్లా అండీ... ఐస్క్రీమ్ తినగానే మొదలుపెట్టేశాను.. దంతం పీకించుకుంటే లేని జ్ఞానం ఏదన్నా వస్తుందేమో అని ఆశ పడ్డాను కానీ, ఆ రెంటికీ సంబంధం లేదని డాక్టరు చెప్పేశారు కదండీ..ధన్యవాదాలు