మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన
రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడో కొత్త పల్లవి అందుకున్నాయి. వాటి ఓటమికి కారణం
ఓటర్లు కాదు, ఈవీఎంలు గా పిలవబడే ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషిన్లు అని. ఐదు
రాష్ట్రాల్లోనూ ఎన్నికలు బ్యాలట్ ద్వారా కాక ఈవీఎంల ద్వారానే జరిగాయి.
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రెండు రాష్ట్రాల్లో స్పష్టమైన
మెజీరిటీ సాధించి, మరో రెండు రాష్ట్రాల్లో అక్కడి రాజకీయ పరిణామాలని తనకి
అనుకూలంగా మలుచుకునీ, ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తోంది. ఓటమి పొందిన పార్టీలు,
ఆయా నాయకుల అనుయాయులు ఇప్పుడు బీజీపీ గెలుపుని ఈవీఎంలకి ఆపాదిస్తున్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఈవీఎంలని ట్యాపరింగ్ చేయడం ద్వారా వోట్లని
తనకి అనుకూలంగా మార్చేసుకుని ఎన్నికల్లో గెలిచేసిందన్నది ప్రధాన అభియోగం.
భారతీయ
ఎన్నికల వ్యవస్థలోకి ఈవీయంలు అడుగుపెట్టి సరిగ్గా ముప్ఫయి ఐదు సంవత్సరాలు.
పూర్తిగా దేశీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈవీఎంలని తయారు చేస్తున్న
భారతదేశం, ప్రస్తుతం ఈ మిషిన్లని పొరుగునే ఉన్న చిన్న దేశాలకి ఎగుమతి
చేస్తోంది కూడా. కేరళలో 1982 లో జరిగిన ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా మొదటి
సారి ఎంపిక చేసిన వోటింగ్ కేంద్రాల్లో ఈవీఎంల వినియోగం అమలయ్యింది.
అదిమొదలు విడతలు విడతలుగా ఈవీఎంలని పెంచుకుంటూ వచ్చి 2014 పార్లమెంట్
ఎన్నికల నాటికి దేశం మొత్తంలో ఎన్నికల ప్రక్రియని ఈవీఎంల ద్వారా జరిపారు.
మునుపు ఉన్న బ్యాలట్ పేపర్ పద్ధతితో పోల్చినప్పుడు ఈవీఎంల ద్వారా ఎన్నికల
నిర్వహణ సులభం, సమయం, నిర్వహణ వ్యయంతో పాటు టన్నుల కొద్దీ కాగితాన్నీ
పొదుపు చేస్తుంది.
వోటింగ్
పూర్తైన వెంటనే ఈవీఎంలకు సీలు వేసిన బూత్ స్థాయి అధికారులు వాటిని జిల్లా
స్థాయి అధికారులకి అప్పగిస్తారు. పోటీలో ఉన్న అభ్యర్ధులందరి సమక్షంలో సీల్
పర్యవేక్షణ ముగిసిన అనంతరం, ఈవీఎంలని గోడౌన్ లో భద్రపరుస్తారు. ఈ గోడౌన్
దగ్గర గట్టి భద్రత ఉంటుంది. పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి ప్రతినిధులు ఏ
క్షణంలో అయినా గోడౌన్లని తనిఖీ చేయవచ్చు. ఇక, కౌంటింగ్ సమయంలో కూడా అందరు
అభ్యర్థులు, వారి ప్రతినిధుల సమక్షంలో అధికారులు ఈవీఎంల సీలు విప్పి ఫలితం
ప్రకటిస్తారు. సీలు విషయంలో అభ్యర్ధికి ఏ సందేహం ఉన్నా వెంటనే ఎన్నికల
సంఘానికి ఫిర్యాదు చేయొచ్చు.
ఇంతటి భద్రతా వలయంలో ఉండే ఈవీఎంలలో
ఉన్న ఓట్లని రాత్రికి రాత్రి తారుమారు చేయడం అన్నది సాధ్యమయ్యే పనేనా?
ఒక్కో బూత్ కి ఒక్కో ఈవీఎం చొప్పున చూసుకున్నా, మొత్తం ఎన్ని ఈవీఎంలలో
ఓట్లు మారిస్తే ఫలితం మారుతుంది? ఈ మొత్తం మార్పుకి ఎంత సమయం పడుతుంది?
అంతసేపు పోటీలో ఉన్న అభ్యర్థులు, వాళ్ళ ప్రతినిధులు, గోడౌన్ల మీద నిఘా
పెట్టకుండా ఊరుకుంటారా? ఈ మొత్తం ట్యాపరింగ్ కి ఎలాంటి టెక్నాలజీ కావాలి?
ఎందరు టెక్నీషియన్లు కావాలి? ఇలాంటిదేదో జరుగుతూ ఉంటే బ్రేకింగ్ న్యూస్
కోసం ఆవురావురనే మీడియా చూస్తూ ఊరుకుంటుందా? ఈ ప్రశ్నల్లో ఏ కొన్నింటికి
జవాబులు దొరికినా, ఓడిన వారు ఈవీఎంల మీద చేస్తున్న విమర్శలని గురించి
ఆలోచించవచ్చు. లేనిపక్షంలో ఓటమి తాలూకు బాధలో ఏదో మాట్లాడుతున్నారు లెమ్మని
వదిలేయవచ్చు.
Well said.
రిప్లయితొలగించండిAround 7 to 8 years back the so called opposition parties at that time and the current ruling parties raised a similar issue.
Our (people) stand depends on whom we are supporting ;)