శుక్రవారం, మార్చి 24, 2017

దాహం -2

(మొదటిభాగం తర్వాత...)

అడుగుల వేగం నెమ్మదించడం తెలుస్తోంది నాకు. ఒళ్ళంతా చిన్నగా చెమటలు పడుతున్నాయి. కారెక్కడో దూరంగా కనిపిస్తోంది. అక్కడివరకూ నడిచి వెళ్లి, ఇంటి వరకూ డ్రైవ్ చేసుకుని వెళ్లి.. నీళ్లు తాగకుండా అంతసేపు ఉండగలనా? ఈ ఆలోచన రావడంతోనే ఉన్న ఓపిక కూడా పోయి, రోడ్డు పక్కన ప్లాట్ఫామ్ మీద కూర్చుండి పోయాను.

కోడలేదో అందని మూడ్ పాడు చేసుకోవడం, పనులన్నీ పక్కన పెట్టి ఇలా ఒక్కడినీ బయటికి రావడం.. ఇదంతా బొత్తిగా తెలివితక్కువగా అనిపిస్తోందిప్పుడు. కానీ, ఏం లాభం. ఇప్పుడు కావాల్సింది తర్కం కాదు, గుక్కెడు నీళ్లు.

నాలుకని పిండి నోరు తడి చేసుకోడానికి చేస్తున్న ప్రయత్నాల వల్ల ఫలితం కనిపించడం లేదు. బట్టతల మీంచి ముఖం మీదకి చెమట ధార పెరిగింది. నా సామ్రాజ్యం లోనే నేను దిక్కులేని చావు చచ్చిపోతానా?  వేల కుటుంబాలకి బతుకుతెరువు చూపించినందుకు నాకు మిగులుతున్నది ఇదా? దేవుడి మీద నాకెప్పుడూ నమ్మకం లేదు కనుక, ఒకవేళ ఇవే నా చివరి క్షణాలైతే నేను తల్చుకోవాల్సింది అమ్మనే.

వేసవి సెలవుల తర్వాత బడి తెరిచినరోజున, ఇడ్లీలమ్మి ఇంటికి రాగానే బడికి వెళ్ళమంది అమ్మ. చెల్లెళ్ళనిద్దరినీ పంపించమని, నా ఆలోచన అమ్మకి చెప్పాను.

"బావున్నాదిగానీ అబ్బయ్యా, నీ సదువు ముక్యం" అందికానీ, నే చదువుకి వెళ్తే సంపాదన తగ్గుతుందని తెలుసు తనకి.

ఆ మర్నాటి నుంచీ నేను ఇడ్లీలు పట్టుకెళ్ళలేదు. మా ఇంట్లోనే ముందు గదిలో హోటల్ మొదలు పెట్టాం. అప్పటికే మా ఇడ్లీలు, ఉల్లిగారెల రుచికి అలవాటు పడి ఉన్నారేమో, ఊళ్ళో వాళ్ళు వచ్చి తిని వెళ్ళేవాళ్ళు. రావడానికి ఇష్టపడని వాళ్ళు, పొట్లాలు తెప్పించుకునే వాళ్ళు. వంట, ప్లేట్లు కడగడం అమ్మ చూసేది, నేను సప్లై చేసి, డబ్బు పుచ్చుకునేవాణ్ణి.

ఏడాది గడిచేసరికి డబ్బుల వ్యవహారం మొత్తం నాకు అర్ధమయిపోయింది. మరో ఏడాది గడిచాక, "బోజనం కూడా పెడితే ఇంకా డబ్బులమ్మా" అన్నాను.

"ఈ ఊల్లో అన్నం ఎవరు కొంటారు అబ్బయ్యా?" అంది అమ్మ. ఆమాటతో డబ్బు జాగ్రత్త బాగా పెరిగింది నాకు.

మరి రెండేళ్లు గడిచేసరికి టౌన్లో హోటల్ పెట్టగలమని నమ్మకం వచ్చింది అమ్మకీ నాకూను. అప్పటికే రాకపోకలు మొదలెట్టాలని చూస్తున్న బంధువులు, ఏదోరకంగా మా పక్కన చేరేందుకు ప్రయత్నాలు గట్టి చేశారు. అమ్మ సరేనంటే నేనేం చేసేవాడినో తెలీదు కానీ, నాన్న పోయినప్పుడు వాళ్ళేం చేశారో నేనే కాదు, అమ్మ కూడా మర్చిపోలేదు.

ఊళ్ళో కన్నా టౌన్లో ఎక్కువ డబ్బులొస్తాయని అనుకున్నాం కానీ, మేం అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ డబ్బులే రావడం మొదలయ్యింది. డబ్బుతో పాటే ఖర్చులు కూడా. ఊళ్ళో ఎప్పుడూ రౌడీ మామూళ్లు, పోలీసు మామూళ్లు ఇవ్వలేదు. కానీ, టౌన్లో అవి ఇవ్వకుండా పని జరగదు.

ఇవేకాక, పనివాళ్ళ రాజకీయాలు... గ్రూపులు కట్టి సరిగ్గా పని చేయకపోవడం, మానేస్తామని బెదిరించడం.. ఇవన్నీ కూడా నాకు వయసుకు మించి పెద్దరికం తెచ్చేశాయి. అమ్మ సంగతి సరేసరి. చెల్లెళ్ళిద్దరికీ హైస్కూలు చదువు అవుతూనే సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేసేశాక, హోటల్ని పెద్దది చేయడం మీద దృష్టి పెట్టాను.

"పెద్దయ్యాక సదువుతానన్నావు అబ్బయ్యా" అమ్మ గుర్తు చేసింది. పేరు చివర ఓ డిగ్రీ ఉండడం ఎంత అవసరమో నాకూ అప్పుడప్పుడే తెలుస్తూ ఉండడంతో ఇక ఆలస్యం చేయలేదు. దిగిన తర్వాతే తెలిసింది తెలిసింది, చదువు కూడా ఓ దాహమేనని.

'దాహం' అన్న మాట తలచుకోగానే నీళ్ల చప్పుడు వినిపించినట్టుగా భ్రమ కలిగింది. ఇప్పుడు, ఇక్కడకి నీళ్ళెందుకు వస్తాయి? నాకు భ్రమలు కూడా మొదలవుతున్నాయా.. ఇందులోనుంచి బయటపడడం ఎలా? ప్లాట్ఫామ్ ని రెండు చేతుల్తో నొక్కి పట్టుకుని అరికాళ్లని రోడ్డుకి ఆనించి ఒంట్లోకి శక్తి తెచ్చుకునే ప్రయత్నం చేస్తుండగా నీళ్ల చప్పుడు మరింత దగ్గరగా వినిపించింది.

పరికించి చూస్తే కొంచం దూరంగా ఓ ఆడమనిషి, పైపుతో మొక్కలకి నీళ్లు పెడుతోంది. ఆమె నావైపు చూసింది. నీళ్లు కావాలన్నట్టుగా సైగ చేసి, వాలిపోకుండా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఆమె పైపుతో సహా పరుగున వచ్చింది "అయ్యో.. ఇయ్యి తాగే నీలు కాదు.." అంటూ. పర్లేదన్నట్టుగా సైగ చేసి, దోసిలి పట్టాను.

ఒక్కో గుక్కా నీళ్లు లోపలికి వెళ్తూ ఉంటే పోయిన శక్తంతా తిరిగి సమకూరుతున్నట్టుగా ఉంది. చివరి దోసిలి నీళ్లు ముఖాన జల్లుకుని, చొక్కా చేత్తో తుడుచుకునేసరికి ఇప్పుడు నేనెవరో ఏమిటో పూర్తిగా గుర్తొచ్చింది. అప్పుడు చూశానామెని. నడివయసు మనిషి. మెళ్ళో తాడుకి మా కంపెనీ ఐడెంటిటీ కార్డు వేలాడుతోంది. గార్డెన్ వర్కర్. పైపు మొక్కల్లో పెట్టి ఆమె కూడా నా వైపే చూస్తోంది.

"పనోడివా, బయిటోడివా అయ్యా? నీ కార్టేది? కార్టు లేకుండా ఎవలూ రాటానికి లేదని తెల్దా ఏటీ.. పెద్ద రాచ్చసుడు సూత్తే సంపి పాతరేసేత్తాడు..." నా ఆకారం చూసి, నన్ను 'పెద్ద రాక్షసుడు' గా గుర్తుపట్టకపోవడం లో ఆశ్చర్యం లేదు. ఏమీ చెప్పకుండా ప్రశ్నార్థకంగా చూశాను.

"కోట్లు సంపాదిచ్చేడు.. ఏం లాబం.. పిల్లికి బిచ్చం పెట్టడు. ఇన్ని మొక్కలున్నాయిగదా.. ఒక్కటైనా పూలు, పల్లు ఇచ్చేదున్నాదా? పనోలు తాగటాకని ఒక్క మంచి నీల కులాయి ఏయించగలిగేడా?" నాకెందుకో ఆమె మీద కోపం రావడం లేదు. "ఆయమ్మ శాలా మంచిదంట. దేవుడూ, బక్తీ ఉన్నాడంట.. ఆ పూజలే కాస్తన్నాయి రాచ్చసుణ్ణి..." వినడానికి తనలాంటి మనిషి దొరికాడు చాలన్నట్టు ఆమె చెప్పుకుపోతోంది.

అవును, ఆమె చాలా మంచిది. నాకు డిగ్రీ చేతికి రావడంతోనే సంబంధాలు చూడడం మొదలు పెట్టింది అమ్మ. కులంలో పెద్ద వాళ్ళు పిల్లనిస్తామంటూ ముందుకొచ్చారు. అమ్మకి పెద్దింటి సంబంధం కలుపుకోవడం ఇష్టం లేదు. అందగత్తె అయిఉండాలి, మంచీ చెడ్డా తెలిసి ఉండాలి, ఓ మాటన్నా పడేలా ఉండాలి.. ఇలా ఆవిడ లెక్కలు ఆవిడకున్నాయి.

నిజం చెప్పాలంటే చెల్లెళ్ళ పెళ్లిళ్ల కన్నా నాకు సంబంధం చూడ్డానికే ఎక్కువ కష్టపడింది. వచ్చినామె నాకన్నివిధాలా సరిజోడీ అన్నది కళ్లారా చూసి నిర్ధారించుకుని, నడివయసులోనే లోకం విడిచి వెళ్ళిపోయింది అమ్మ. డిగ్రీ ఇచ్చిన తెలివితేటలతో నేను కేవలం హోటల్ వ్యాపారానికే పరిమితం అయిపోవాల్సిన అవసరం లేదని తెలుసుకున్నాను.

ఇద్దరు కొడుకులు పుట్టే వరకూ ఆమె ఇంటిపట్టునే ఉండిపోయింది. ఆ తర్వాత, వ్యాపారంలో నాకు సహాయానికి వచ్చింది. అప్పటినుంచీ నా వ్యాపారం మునుపటికన్నా చాలా వేగంగా విస్తరించడం మొదలుపెట్టింది. నా ఎదుగుదల సహించలేని వాళ్ళు ఆమెని గురించి ఏవేవో మాట్లాడ్డం మొదలుపెట్టారు, అన్నీ నా వెనుకే. వాటిని నేను పట్టించుకోదల్చుకోలేదు.

వ్యాపారంతో పాటు ఇంటినీ చక్కదిద్దిందామె. ఇద్దరు కొడుకులనీ క్రమశిక్షణలో పెట్టడమే కాదు, బయటి నుంచి వచ్చిన కోడళ్ళకి కూడా మా క్రమశిక్షణ అలవాటు చేసింది. మనవలు బయల్దేరాక ఆమె దృష్టి ఉన్నట్టుండి దేవుడివైపు తిరిగింది. గుళ్ళు, గోపురాలు చుట్టడం మొదలు పెట్టింది. ఆమె నన్ను రమ్మనలేదు, నేనామెని వద్దనలేదు.

మా సర్కిల్లో అందరికీ పూజాపునస్కారాల విషయంలో ముఖ్య సలహాదారు ఆమే. అంతే కాదు, ఎవరింట్లో పెళ్లి జరిగినా నూతన వధూవరులని మొదటగా ఆశీర్వదించవలసిన దంపతులం మేమే. ఆమె మంచిదనడంలోనూ, అందరూ ఆమెని మంచిదనుకోడంలోనూ ఎలాంటి అభ్యంతరమూ లేదు. ఎటొచ్చీ, ఆమె మంచితనం మా సర్కిల్ ని దాటుకుని ఈమెవరకూ రావడమే కొంచం ఆశ్చర్యంగా ఉంది.

"ఆయమ్మి దేవతంట.. ఏం లాబం.. రాచ్చసుడి పాలబడ్డాది. ఇంతకీ అయ్యా, పన్లో చేరతాకొచ్చేవా? మీవోల్లని సూత్తాకొచ్చేవా?" నాకు డిసిప్లిన్ గుర్తొచ్చింది. పని మాని ఆమె నాతో కబుర్లు చెప్పడం కోపం తెప్పించింది. అయితే అది ఒక్క క్షణమే. ఆమెతో మాట కలపాలనిపించింది. "ఇంతమందికి పనిచ్చినోడు రాచ్చసుడు ఎందుకయ్యాడో?" అన్నాను, వీలైనంతవరకూ ఆమెనే అనుకరిస్తూ.

"ఓరయ్యా.. సూత్తాకి ఎర్రిబాగులోల్లాగున్నావు. ఎట్టాగ బతుకుతున్నావో ఏటో. ఉజ్జోగం సరే, సుకవెక్కడున్నాది? ఇయ్యాలున్నా పని రేపుంటాదో లేదో తెల్దు. వొచ్చిన జీతంలో సూపరైజర్లకి మామూల్లిచ్చుకోవాలి.. ఇవలేదనుకో ఏదో వొంకెట్టి బయిటికి తోలేత్తారు.. లోపల మనమాటినేవోడెవడు?" ..ఇది నాకు కొత్తవిషయం.

"ఈ సంగతి పక్కనెట్టు.. అంత సంపాదిత్తన్నాడు గదా? ఎవరి కట్టం.. మనందరిదీని. మనకేటన్నా అయితే సూత్తారా సెప్పు? సెరుగ్గడల్లా లోనకొత్తాం.. పుప్పిలాగా బయటికెలతాం.. బయిటేమో పేరుగొప్ప.. ఇక్కడసూత్తే ఇల్లాగ.. ఎల్లలేం.. ఉండలేం.. దీపంపురుగుల బతుకు" చివరిమాటకి ఉలిక్కిపడ్డాను ఓ క్షణం. మూడోకొడుకులందరూ వరసగా గుర్తొచ్చారు.

"ఇదుగో.. ఇంక బయిల్దేరు.. ఎవురన్నా సూసేరంటే ఎదవ గొడవ. పని మానేసి కబుర్లెట్టేనని నా జీతం కోసీగల్రు. జాగర్తగ ఎల్లొచ్చెయ్యి. లోపలున్నంచేపూ కార్టు మెల్లో యేసుకోవాలి.. మర్సిపోకు.." నాకెందుకో ఆమెతో మరికొంచం సేపు మాట్లాడాలనిపించింది.

"పెద్ద రాచ్చసుడు నీకెదురు పడ్డాడనుకో, ఏం చెబుతావు?" సాధ్యమైనంత నవ్వులాటగా అడిగాను. నన్నోసారి ఎగాదిగా చూసి, విసురుగా అందుకుంది..

"ఏం సెబుతానా.. సంపాదిచ్చింది సాలోరయ్యా.. నలుగురికి సాయం సెయ్యిటం నేర్సుకో అంజెబుతాను.. సాలా?" అంటూనే పైపు తీసుకుని చరచరా నడిచింది.

ఆమె నాలుగడుగులు వేసిందో లేదో, రౌండ్స్ కి వచ్చిన సెక్యూరిటీ ఆఫీసర్ నన్నక్కడ చూసి బిగుసుకుపోయాడు. గభాల్న శాల్యూట్ చేసి గౌరవ సూచకంగా ఒక్కడుగు వెనక్కి వేసి నిలబడ్డాడు. సరిగ్గా అప్పుడే, గార్డెన్ వర్కర్ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి, పరుగుపరుగున ముందుకు వెళ్ళిపోయింది.

తాళాలందుకున్న సెక్యూరిటీ ఆఫీసర్ క్షణాల్లో కారు తెచ్చి నా ముందు పెట్టి, వెనుక డోర్ తెరిచి వినయంగా నిలబడ్డాడు. సీటుకి జారబడి విశ్రాంతిగా కూర్చున్నాను. ఉదయం నుంచీ జరిగిన సంఘటనలన్నీ వరుసగా గుర్తు రావడంతో కణతలు నొక్కుకుని, తల విదిలించాను. కారుకన్నా వేగంగా ఆలోచనలు సాగుతున్నాయి. చూస్తుండగానే సాయంకాలమైంది. కారు నా బంగళా ముందు ఆగింది.

రాత్రి ఎప్పటిలాగే డైనింగ్ టేబుల్ దగ్గర డిన్నర్ కి కలుసుకున్నాం కుటుంబ సభ్యులం అందరం. నీళ్లు తాగుతుంటే ఒక్కసారిగా పొలమారింది నాకు. డిన్నర్ అవుతూనే, కాసేపు మాట్లాడతానన్నాను. ఎవరూ జవాబు చెప్పలేదు.

"నేను వ్యాపార బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నాను. మొత్తం మీరే చూసుకోండి. అవసరమైతే మీ అమ్మ సలహాలు తీసుకోండి" కొడుకులిద్దరివేపూ చూస్తూ చెప్పాను. చిన్నాడి మొహం రంగు మారింది ఒక్క క్షణం. వాడు కోడలి వైపు చూడడం, ఆమె చూపు తిప్పుకోవడం నా దృష్టిని దాటిపోలేదు.

"రేపటినుంచీ నేను కంపెనీ వ్యవహారాలకి సమయం తగ్గించేస్తాను. వీలైనంత త్వరలోనే, ఇందులో నుంచి పూర్తిగా బయట పడతాను.." ఎవ్వరూ మాట్లాడలేదు, చిన్నాడు తప్ప.

"ఎందుకు నాన్నగారూ? ఉన్నట్టుండి...?" మాట పూర్తిచేయలేదు వాడు.

"నేను సర్వీస్ యాక్టివిటీస్ మీద దృష్టి పెడతాను," అంటూండగానే, నా భార్యతో సహా అందరూ ఆశ్చర్యంగా చూశారు.

"అవును, ఇన్నాళ్లూ మనం అటువైపు ఎందుకు చూడలేదో అర్ధం కావడం లేదు. ఏదన్నా యాక్టివిటీ చేసి, జాగ్రత్తగా డాక్యుమెంట్ చేస్తే చాలు.. డబ్బిచేందుకు ఫండింగ్ ఏజెన్సీలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి.. మనలాంటి వాళ్ళం ఉండితీరాల్సిన రంగం అది.. పేరుకి పేరు, డబ్బుకి డబ్బు.." చెబుతూ, మంచినీళ్ల గ్లాసు అందుకున్నాను.

(అయిపోయింది)

6 కామెంట్‌లు:

  1. మీ తరాజూ భలేటిదండీ... డ్రామా మోతాదు మించుతోందేమో అనుకుంటున్న తరుణంలో మలుపు తిప్పేశారు.

    రిప్లయితొలగించండి
  2. ఇంతకీ ఆ పెద్దాయన దాహం ఇప్పట్లో తీరేలా లేదు - భలే కథ !

    రిప్లయితొలగించండి
  3. రెండవ భాగంలో మలుపు తిప్పారుగా ఎప్పటిలాగే...భలేగా రాస్తారు మీరు.

    రిప్లయితొలగించండి
  4. ఫణి గారి కామెంటే నాది కూడా.. మీ తరాజు భలేటిదండీ! అబ్బయ్య నచ్చేసాడు. :)

    రిప్లయితొలగించండి
  5. @పురాణపండ ఫణి: చాలా నిశితమైన పరిశీలనండీ.. ధన్యవాదాలు
    @లలిత టీఎస్: అవునండీ.. కొన్ని కొన్ని దాహాలంతే :) ..ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  6. @పద్మార్పిత: కథ మలుపు తిరిగిందండీ మరి :) ..ధన్యవాదాలు
    @కొత్తావకాయ: అతగాడి ముద్దుపేరండీ అది :) ..ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి